భోగీరలోయ, ఇతర కథలు/జగ్గన్న గంటం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

జగ్గన్న గంటం

అతడు వేద వేదాంగ పారంగతుడు. సకలశాస్త్ర విద్యావేత్త. నిరుపేద. పేరు జగ్గన్న. ఇంటిపేరు కడలివారు. కృష్ణానదీతీర శాలిభూములలో రెండు నివర్తాల నేల అతని పెద్ద కుటుంబానికి ఏ మాత్రం రాబడి నివ్వగలదు? జగ్గన్న తండ్రి రామన్న మంత్రికి ఆరుగురు ఆడపిల్లలు, ముగ్గురు మొగపిల్లవాండ్లు. ముగ్గురు ఆడపిల్లలకు పెళ్ళిళ్లు చేసినారు. వారు అత్తవారి ఇళ్ళల్లో కాపురం చేస్తున్నారు. ఒక్కొక్క పెళ్ళికి ముప్పది నలువది కృష్ణరాయ వరహాల వరకు ఖర్చు అయినది. ఆ వరహాల రాబడికి ఒక్కొక్క నివర్తమే అమ్ముడు పోయింది.

రామన్న మంత్రి అతి అభిమాని. కూటికి జొన్నలు లేకపోయినా కుండ చల్లగా వుండవలసిందే. కుటుంబం యావత్తూ అలా యెన్నిరోజులు పస్తుందో! కమ్మనాటి ఆరువేల బ్రాహ్మణుడు. కొండపల్లి రెడ్డి ప్రభువుల రాజ్యం పాల సముద్రపు కెరటాలల్లా పరిపాలింపజేసిన జక్కన మంత్రి ముని మనుమడు.

కొండపల్లి రెడ్డి రాజ్యం శ్రీకృష్ణదేవరాయలు వడిసి బట్టి లోబర్చుకొన్నప్పుడు జక్కనమంత్రి రిక్తహస్తాలతో స్వగ్రామమైన కడలీపుర క్షేత్రానికి విచ్చేసి తన మెడలోని హారాల నమ్ముకొని నూరు నివర్తములు భూమి కొని వ్యవసాయ దారుడయ్యాడు. భారతీయుడికి వాడి కత్తి అయినా దొరుకుతుంది. లేకపోతే నాగలి మేడి తోకైనా దొరుకుతుంది.

మూడు తరాల్లో నూరు నివర్తాల భూమి ఆరింటికి దిగింది. రాజభోగం పోయినా రాజసం మిగిలింది.

2

కడలి జక్కన్న చదువుల కడలి. అతని వ్రాత ముత్యాల పోత. స్నానాది అనుష్ఠానాలు నిర్వర్తించుకుని ఉత్తరాన నాగేశ్వరస్వామి భక్తులు మోయించే గంటలతో శ్రుతికల్పి వాడి మొనవాలు గంటము చేత బూని ఏ భారతమో, భాస్కర రామాయణమో, శ్రీనాధ కాశీఖండమో, పెద్దనార్యుని మనుచరిత్రమో చక్కగా సమకూర్చిన తాళపత్రాల మీద లిఖిస్తూ వుంటే అర్ధయామానికి ఆశ్వాసము పూర్తి అయ్యేది. అతని బంధువులలో ఒక కుటుంబానికి పూర్వీకుడు అయిన పేరంరాజు జక్కనకవి సిద్థయామాత్యుని గురించి చెప్పినట్లు మన జక్కన్న గంటము వ్రాతలో సవ్యసాచి. రెండు చేతులా ముత్యాల మాలలు మహావేగంతో వ్రాయగలడు.

చిన్నతనాన్నించి అలవడిన ఈ విచిత్ర కౌశల్యమువల్ల జక్కన్న అప్పుడప్పుడు తండ్రిగారి పాదాలకడ పది పదిహేను నిష్కములు సమర్పిస్తూ వుండేవాడు. ఏ మాండలిక ప్రభువో, ఏ ఉన్నత రాజోద్యోగో, ఏ సంపన్నుడో జక్కన్న వ్రాసి వుంచిన ఉత్తమ గ్రంథాలను తనకు తోచిన పారితోషికం అర్పించి తీసుకుపోతూ వుండేవాడు.

జక్కన తండ్రివలెనే పలచని పొడుగాటి మనిషి. బంగారు మేని ఛాయ. అమోఘమైన బలం పుంజింప జేసుకున్న ఉక్కులాంటి దేహము. గరుడ నాశికము. చిన్నవైనా అందమైన రేఖలు కలిగి కాంతివంతమైన కళ్లు.

తండ్రిగారి కడనే శుశ్రూష చేసి సంస్కృతంలో అఖండపాండిత్యము సంపాదించుకున్నాడు. తెలుగు భాషలో పూర్ణపండితు డనిపించుకున్నాడు. కన్నడ, ద్రావిడాది ఇతర దక్షిణ భాషలలో, పారసీకం, ఓఢ్రం, హిందీ మొదలగు ఉత్తరాది భాషలలో ఉత్తీర్ణు డయ్యాడు. ఐదారు లిపులు మహా ప్రవాహం వలె రచింపగలడు.

జగ్గన తండ్రిగారితో పాటు వ్యవసాయము చేయుటలో ఆరితేరిన బంటు. తమకున్న రెండు నివర్తాల వ్యవసాయము త్వరలో ముగించి తండ్రి కుమారు లిద్దరు యితర భూములు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ వుండిరి. దాని వల్ల కుటుంబానికి ఓ మోస్తరుగా సరిపోయే రాబడి వస్తూ వుండెను.

3

తండ్రి -- నాయనా ! ఈ ఏటి పంట అంత నాశిగా లేదు బాబు.

జగ్గన -- కందులు, సెనగలు, పెసలు, మిర్చి యింత పుష్కలంగా అవతరించడానికి కృష్ణవేణమ్మ దయే కారణం.

రామన్న మంత్రి -- దేశంలో మళ్ళీ పెద్ద యుద్ధం సంభవించే సూచనలు కనబడుతూ వున్నవి. ఆంధ్ర సార్వభౌములు శ్రీరంగరాయలని, పెనుగొండలో రాక్షసుడైన జగ్గరాయలు హతమార్చి నప్పటి నుంచి మన మహారాజైన రఘునాధభూపాలుడు వుడుకెత్తిపోతున్నా డని వేగు వచ్చినట్లు దేవరకోటలో గగ్గోలుమంది. శ్రీమంతులు, ప్రభువులు నాగమనీడులం వారు ఏ సమయానకు రాణువుతో బయలుదేరి రమ్మని తంజావూరు నుంచి రఘునాధనాయనిం వారి ఆజ్ఞ వస్తుందో అని యెదురు చూస్తున్నారు.

జగ్గన్న -- నాకూ హృదయంలో ఆందోళనంగావుంది. బాబయ్యగారూ ! అధర్మం పరవళ్లు పెడుతూన్నది. ప్రభువు కృష్ణదేవరాయలు దివంగతుడయ్యాడు. దేశంలో భీభత్స దేవత తాండవం చేస్తూన్నది. దుర్గానాగేశ్వరదేవుని కృప యెల్లా వున్నదో.

రామ -- శ్రీ దుర్గాదేవి కరుణ వల్ల నాలుగో అమ్మాయి భ్రమరాంబ వివాహం యీ ఏడు చేయవలసి వుంటుందిరా. కోటలో రాయస మయిన అడివి మాచన్నగారు తన పెద్ద కుమారునికి భ్రమరాంబను యివ్వవలసిందిగా మనకు రాయబారం పంపిద్దామని అనుకుంటున్నారని గొఱ్ఱెవాడి పెద నాగేశ్వరరెడ్డి, రాజపురోహితుడు వేమూరి శ్రీరంగభొట్ట సోమయాజులువారును మొన్న సందేశం తీసుకొని వచ్చారు. అమ్మాయికి పదవ ఏడైనా పంచకావ్యాలు చదువుకుంది. అందాల బరిణె. దాని అదృష్టం యెట్లా వుందో.

జగ్గన్న -- దేశపరిస్థితులు మేఘా లావరించినట్లున్నాయి బాబయ్యగారు. అవి రక్తమేఘాలు. రాజుల్లో రాజ్యకాంక్ష యెక్కువయింది. బలములు తక్కువయ్యాయి. బుడతగీచులు, వాళ్ళు యెక్కడ్నుంచి వస్తున్నారో, సముద్రాల అవతల నుంచో, సముద్రం క్రింద పాతాళం నుంచో, వర్తక మనీ, వల్లంకు లనీ, వచ్చి రాజులకూ రాజులకూ కొప్పులు ముడి పెడుతున్నారు. ధర్మం లేదు. ప్రజల క్షేమం లేదు - ప్రభువుల హృదయాలల్లో.

రామన్న -- ఒక్క మన నాగమనీడు ప్రభువు యార్లగడ్డ వంశానికే కాకుండా, కమ్మనాటి రెడ్ల వంశాలన్నిటికీ గూడా కీర్తి తెస్తున్నాడు. తన ప్రభువు రఘునాధ భూపాలునితో పాటు కావ్యకర్త అవుదా మని ఆలోచిస్తున్నాడు. పండితాదరణ, కళారాధన కలిగియుండడమే కాకుండా ప్రజలను తన బిడ్డల్లా రక్షించుకొంటున్నాడు. ఒక్క బందిపోటు యెరగం. రెండేళ్ల క్రింద వచ్చిన చిన్న క్షామాన్ని భూమిలో మూడు నిలువులా పాతి, ప్రతియింటా దీపాలు వెలిగింపించి పండగలు చేయించిన ప్రభు వతడు.

4

తండ్రికుమారు లిద్దరూ అనుకున్న మాటే నిజ మయింది. శ్రీమంతులు యార్లగడ్డ నాగమనీడు ప్రభువుకు తంజావూరు నుండి రఘునాధ మహారాజు మంత్రియయిన అప్పయ్య దీక్షితుల వారు అన్ని పరికరాలతోను, ఆయుధాల తోను, సంపూర్ణ సైన్యయుక్తంగా రావలసిందని మహారాజు ఆజ్ఞ పంపించారు. నాగమనీడు ప్రభువు తన స్నేహితుడైన కొండపల్లి అన్నారెడ్డి ప్రభువుకు, కొండవీటి చిన్నారెడ్డి ప్రభువునకును, తంజావూరికి సైన్యాలతో తరలివెళ్లడం విషయంలో రాయబారులు పంపించారు.

దేవరకోటలో అలజడి యెక్కువగా వుంది. నాగమనీడు ప్రభువు ఆజ్ఞ డిండిమాలతో, డప్పులతో రాణువుపోగుదల నాయకులు దేవరకోటరాజ్యం అంతా చాటింపించారు. ఊళ్లను పాలించే పంచాయితీలకు రాజముద్రాంకితమైన వార్తలు వచ్చాయి. రఘునాధభూపాల మహారాజు ఆజ్ఞ వెలనాడు, వేలనాడు, రేనాటి విషయం, కొండవీడు, కొండపల్లి, కందనోలు, పాకనాడు మొదలయిన యావత్తు ఆంధ్ర భూమికి సంచలనం కలుగ జేసింది. కృష్ణదేవరాయని చల్లని రాజ్యం తలుచుకోనివారు లేరు. జగ్గారాయలు, మధుర ప్రభువైన ముద్దు చెన్నప్పనాయుడు, ఆంధ్ర సామ్రాజ్యానికి తల పెట్టిన విపత్తును తలిచి కోపించి పళ్లు పటపట కొరకనివాడు లేడు. నాగమనీడు ప్రభువు సైన్యాలలో వీరులైన దివిసీమ కాపువారు, యమునినైనా నిలబెట్టగల కమ్మనాటి రెడ్లు విరివిగా వచ్చి చేరుతున్నారు. దేవరకోట మహాపురంలో కమ్మర కొలుముల్లో ఉక్కు కత్తులు, కరవాలాలు, భిండివాలాలు, బల్లాలు, శూలాలు, తోమరాలు రాత్రింబవళ్లు ఎడతెరిపి లేకుండా తయారవుతున్నాయి. మచిలీపట్టణంలో వర్తకం చేసుకొనే ఒలాందులు నాగమనీడు ప్రభువు పంపించిన బంగారపు టంకాలు తీసుకొని తుపాకులు, ఫిరంగులు, తుపాకిమందు, ఉక్కుసామగ్రి సరఫరా చేసినారు. ఏబది ఒలాందు సైనికులును ఒక చిన్న ఒలాందు నాయకుని శిక్షణ క్రింద వచ్చి నాగమనీని సైన్యంలో చేరారు.

నాగమనీడు ప్రభువుకు తన క్రింద దళవాయిగా వుండటాని కెవరి నేర్పాటు చేద్దామా అన్న ప్రశ్న ఉదయించింది. ప్రశ్నతో పాటే కడలి రామన్న మంత్రి మూర్తిన్నీ ఆయన కళ్ళ యెదుట ప్రత్యక్ష మయింది. రామన్న మంత్రి ముసలి వాడైనా భీష్ముని వలె ఉద్ధత సత్వుడు. ద్రోణుని మరిపించే యుద్ధవ్యాపార నిపుణుడు. వెనుక బుడతకీచు దొంగలు (పోర్చుగీసు) కొందరు అరబ్బీ ఓడ దొంగలతో కూడి కృష్ణానదీ ముఖద్వారంలో దిగి దేవరకోట సంస్థానంలోకి చొచ్చుకొని వచ్చి కడలి పురాన్ని ముట్టడించబోయే ముందర, రామన్న మంత్రి ఊళ్లోవున్న కమ్మనాటి రెడ్లవీరుల్నీ, కాపువీరుల్నీ, అశ్వత్థామలా వీరత్వం వహించిన బ్రాహ్మణ వీరుల్నీ, చిన్నదళంగా నేర్పరచుకొని తమ కడ్డమొస్తుందని ఏమాత్రం అనుకోకుండా, కొలదోపిడిలో రత్నాలరాసులు కలలుగంటూ ఏమరుపాటున నున్న ఆ బందిపోటు దండుపై హిమపాతంలా, రామబాణంలా, ఏనుగుల దండులా విరుచుకు పడ్డారు. బుడతగీచుల తుపాకులు ముక్కలయ్యాయి. అరబ్బుల సురియలు తునకలయ్యాయి. యేబదిమంది తోడి దొంగలు తమ ప్రాణాలు ఆంధ్రభూమి కర్పింపగా, తక్కినవారు పలాయన మంత్రము పఠించగా, రామన్నమంత్రి వెంటాడి, ఒక్క పురుగైనా లేకుండా బందిపోటు లందర్నీ మట్టిపాలు గావించాడు.

ఈ విషయం తలంపుకు రాగా నాగమనీడు ప్రభువు రామన్న మంత్రికి ఆహ్వానమూ, అందలమూ పంపించాడు. దేవరకోట కోటలోకివెళ్ళిన రామన్నమంత్రిని, రాయసం అడివి మాచన్నగారు సగౌరవంగా, సింహాసనాసీనుడై కొలువు తీర్చియున్న శ్రీమంతు నాగమనీడు ప్రభువులంవారి సభలో సమక్షాన ప్రవేశింప జేసెను. నాగమనీడు ప్రభువు లేచినాడు. సభికు లందరూ లేచినారు. నాగమనీడు రామన్న మంత్రికి నమస్కరించి ఆసనము చూపించి రామన్నమంత్రి ఆసీనుడు కాగానే, తాను సింహాసన మధివసించి "ఏమండీ! అయ్యవారూ ! తమ యింటిలో అందరూ క్షేమంగా వున్నారని తలుస్తాను" అని ప్రశ్నించినారు.

రామన్నమంత్రి -- శ్రీ నాగేశ్వరస్వామి కరుణవల్ల ప్రభువులవారి కటాక్షంవల్ల అందరూ క్షేమంగా ఉన్నామండి. ప్రభువు :- రఘునాధరాయలు మహారాజులుంగారి ఆజ్ఞప్రకారం మేము సైన్యం తీసుకొని తంజావూరు వెళ్ళుతున్నాము. మా సైన్యం నడుపుతూ మాకు కుడిచేయిగా ఉండడానికి మీరు మాతో తంజావూరు రావాలని ఆశిస్తున్నాము.

రామ :- ఏలినవారి నమ్మకానికి కృతజ్ఞుణ్ణి. పంట పండించుకొనే యీ నిరుపేద పారుడు సైన్యాలు నడపడంలో తమకు ఏమాత్రం సహాయంగా ఉండలేడని నమ్ముతున్నాను.

అడవి మాచన్న మంత్రి :౼ రామన్నమంత్రిగారూ ! కర్షకత్వంలో దక్షత చూపగలవాడే కదనరంగంలో గండర గండడై ముందుకు నడవగలడు. తమరు ఏలినవారు కాన్క నిచ్చే తాంబూలం పరిగ్రహించాలని మనవి చేస్తూన్నాను.

రామ :- నేను పెద్దవాడ్నయ్యాను. మాచన్న మంత్రి గారూ ! నే నింటి దగ్గర కృష్ణా - రామా అంటూ నాగేశ్వరస్వామివారిని భజిస్తూ ఉండవలెను. మా పెద్ద అబ్బాయి యుద్ధంఅంటే చాలా కుతూహల పడుతున్నాడు. సహాయదళవాయిగా కాకపోయినా చిన్న చమూపతిగానన్నా తీసుకొని వెళ్ళవచ్చును. దళనాయకుడుగా ఉండడానికి నిజమయిన ప్రజ్ఞానిధి యతడే నని మనవి చేస్తున్నాను.

జగ్గన దళవాయిగా శుభముహూర్తంలో నాగమనీడులం వారి చేత అభిషేకింపబడ్డాడు. నాల్గువేల కాల్బలంతో నూఱు ఆశ్వికదళంతో 10 ఏనుగులతో దేవరకోట సంస్థానాధిపతిన్నీ శ్రీమంతుడును అయిన నాగమనీడు ప్రభువు, మల్లేపద్ది సింగమరెడ్డి, చలసాని అచ్యుతరామనీడు, కంఠంనేని వాసుకేశ్వరనీడు, వేములపల్లి దుర్గారాయలు, అరజా పిన్నమనాయకుడు, తలుపుల గండ్రయ్యనాయకుడు, గండు శోభనాద్రిరెడ్డి, నెరుసు బ్రహ్మన్ననాయకుడు, తోట భైరవన్న, మన్నీలుగ, చమూపతులుగ, అశ్వదళవాయిలుగ, గజయూధ నాయకులుగ కూడరా కడలిపురం వేంచేసినారు.

మంచి ముహూర్తం చూసి శ్రీమంతు నాగమనీడు ప్రభువు మహాక్షేత్రమయిన కడలిపురంలో వేంచేసియున్న కులదేవుడైన శ్రీ దుర్గానాగేశ్వరస్వామివారి కడకుపోయి బ్రహ్మవాసుకి, తక్షక, కర్కోటకాది పవిత్ర కృష్ణోదకాల కృతావ గాహులై స్వామివారికి మహాన్యాసపూర్వకమైన యేకాదశ రుద్రాభిషేకములు చేయించినారు. సహస్ర నారికేళాభిషేకములు, బంగారుకలశాల కొలదీ పంచామృతాభిషేకాలు జరిగినవి. జ్యేష్ఠ శుద్ధ పంచమి గురువారంనాడు నాగమనీడు ప్రభువులు నాగేశ్వరస్వామివారి యెదుట విజయ చిన్హముగ అఖండమును వెలిగించి శుక్రవారం నాడు దుర్గామ్మవారికి సహస్రనామ కుంకుమార్చన చేసి శు|| యేకాదశి బుధవారంనాడు సర్యసైన్యాలతో కదలి శివగంగలో వేంచేసియున్న కులదేవతయయిన మహిషాసురమర్దనిని సర్వ దేవతలతోగూడ కొలిచి చక్రవర్తి వరాహలాంఛన పతాకము ఎత్తించి విజయ ఐరావతనామ మత్తగజముల నెక్కి తంజావూరు చేర వెడలినారు.

5

తన సైన్యానికి తానే ముఖ్య సైన్యాధికారై నడుపుకుంటూ వెళ్ళిన నాగమనీడు ప్రభువుకి ముఖ్య దళవాయిగా జగ్గన్నమంత్రి ధనుస్సులు, యీటెలు, అమ్ములు, శూలాలు మొదలయిన ఆయుధాలతో ఒక మత్తగజాన్ని ఎక్కి నాగమనీడు ప్రభుని కుడివైపున నడుస్తూ సైన్యాన్ని సర్వవిధాలా కనిపెట్టుచూ తాను యిదే ప్రధమపర్యాయం చూసే దేశాన్ని గమనిస్తూ సైన్యాల్ని సింహపురం దగ్గర పెన్న దాటించి భగవంతు నర్చించి తిరుపతి చేరుకొన్నారు. తిరుపతిలో నాగమనీడు ప్రభువు వెంకటేశ్వరస్వామివారి దర్శనం చేసి పూజలుచేయించి ముడుపులుచెల్లించి స్వామికడ శలవు దీసుకొని కతిపయ దినాల్లో తంజావూరు చేరుకొన్నారు.

జగ్గన్న హృదయం పరిపరివిధాల పోతున్నది. మనుష్యుల రక్తాలు ప్రవాహాలు కట్టడం, దేశాలు నాశనం అవడం, మనుష్యులు నిర్మించుకొనే ఊహాపధాలు నాశనం గావడం - మనుష్యులలో దైవత్వమూ రాక్షసత్వమూఉంది కాబోలు. రాజ్యాలు వస్తున్నవి రాజ్యాలు పోతున్నవి. మహారాజులు సింహాసనాలు ఎక్కారు. దేదీప్యమానంగా వెలిగారు. తెరవెనక మాయమయ్యారు. మతకర్తలు సకల శాస్త్రవేత్తలు, వేదాంతులు, మహాకవులు, సంగీత కళానిధులు అందరూ వచ్చి తమ తమ విధులను నిర్వర్తిస్తూ అలా అలా నడిచి కాలంలో కలిసిపోయారు. వీరి రాక గాని పోక గాని యీ అనంత విశ్వానికి అవసరమున్నదా అని జగ్గన్న అనుకొన్నాడు. కీర్తి ప్రతిష్ఠలు కొంతకాలం నిల్వవచ్చునుగాక యీ విశ్వవిశ్వాలలో కోట్ల కోట్ల అంశాంశమైన కీర్తినిగాని ప్రతిష్ఠగాని తాను చేస్తున్నానని విర్రవీగే కర్మగాని యేమౌతవి? రాజులచరిత్రలు దండకవులలో, అభ్యుదయి రచనలలో కవులచే గానం చేయబడుగాక. కవులయొక్క రసవత్తర ఘట్టాలు, తీయని లోతైన భాషలలో రూపం పొందుగాక. ఈ విశ్వంలో వీని పరిణామము ఎటువంటిది? గంటము నడపడంలో తమకు సవ్య సాచిత్వం ఉండుగాక! తన గంటం వాడి మొననుంచి కావ్యరస ప్రవాహాలు సుడులు కట్టుకొని పోయినవి కాక! అవి తాటాకులలో ఉన్నవి. ప్రతిఅక్షరము క్షరము కానిదా? క్షరముకాని ఆ అక్షరాలను తన హృదయంలో మోసే తాళపత్రం దివ్యశక్తి స్వరూపమా?

ఈ లాంటి ఆలోచనలతో జగ్గన్న తంజావూరిలో తమ కేర్పరిచిన విడుదులలో బసచేసినారు. బృహదీశ్వరుని, బృహన్నాయకిని అర్చించినారు. భోజకృష్ణదేవరాయల అపరావతారమైన శ్రీ రఘునాధ రాయలమహారాజు కొలువులో ఆంధ్రసామ్రాజ్య మహాద్భుతము కన్నులార కనుగొన్నాడు.

గొప్ప వ్రాయసగాడైన జగ్గన్నమంత్రి, మహారాజు తనకోటలో నిర్మించిన సరస్వతీ మందిరానికి యాత్ర చేసినాడు. దారు దంత పేటికలలో సంస్కృతాంధ్ర ద్రావిడ కర్ణాటక గ్రంథాలు వేలకొలదియున్నవి. పూర్వగ్రంథాలు, ఆథునిక గ్రంథాలు అనేక రకాలయిన వ్రాతలలో తాటాకుల మీద విన్యాసమై ఉన్నవి. సరస్వతీమందిరము గ్రంథరత్న భాండాగారమే గాదు, అనేక దివ్యత్వాలు సదా ప్రత్యక్షమై సభ తీర్చియున్న పావనభూమి యది. కర్కశులై రాక్షసత్వము వహించగల్గిన మనుష్యులు తమ దివ్యత్వం లోంచే గ్రంధాలు వ్రాయగల్గినారుగాబోలు! మనుష్యునిలో దివ్యత్వం ఏ ఆజ్ఞాచక్రంలోనో దాగి ఉంటుందా ?

జగ్గన్నమంత్రి ఇంటి దగ్గర, పూజా పీఠంమీద వున్న తన గంటాన్ని తలుచుకొన్నాడు. తనకు గ్రంథాల్ని చూపిస్తూన్న గ్రంథాలయాథిపతిని "స్వామీ ! శ్రీరఘునాధ భూపాలుడు రచించిన గ్రంథాలు ఒక్కసారి నాకు చూపించగలరా?" అని ప్రశ్నించినాడు. "ఆ పెద్దపెట్టెలో వున్న దంతపు పేటికలో మహారాజు రచించిన రామాయణ గ్రంథమున్నది. ఆ రజతపేటికలో నున్న పుస్తుకము రఘునాధ మహారాజు కృతమైన వాల్మీకి చరిత్రము. ప్రభువులు ఇప్పుడు మహాభారత తాత్పర్యసంగ్రహము రచిస్తున్నారు. ఈ పెద్ద పెట్టెలోనున్న దంతపేటికలలోని గ్రంథాలన్నీ రఘునాథ ప్రభువుల వారికి అంకితము లిచ్చినవి. అది విజయవిలాసము. అది అలంకార రత్నాకరము. ఇది సాహిత్య రత్నాకరము. యజ్ఞనారాయణదీక్షిత మహాకవి రచించినది."

జగ్గన్న -- "రామభద్రాంబికాదేవి అద్భుతమైన కావ్యాన్ని సృష్టిస్తున్నారని వినికిడి." "రఘునాధాభ్యుదయ మను మహాకావ్యాన్ని ఆమె రచియిస్తున్నది. శ్లోకస్వరూపాన అమృతమే రూపెత్తిన రసవత్తర మయిన కావ్యం సుమాండి అది."

"ఔను, ఆమె యశము, కృష్ణాగోదావరీ తీరాలవరకు వ్యాపించింది."

6

శ్రీ రఘునాథమహారాజు సైన్యాలు జైత్రయాత్ర సాగించి ఆషాఢ శుద్ధ పంచమినాడు తోపూరునందు ఆంధ్ర సామ్రాజ్యం విచ్ఛిన్నం చేయదల్చుకొన్న గొబ్బూరి జగ్గరాయలతో తలపడి, షష్ఠినాడాతనిని యుద్ధంలో సబంధుకంగా సమయించినవి. మహాసైన్యం వ్యూహరచనయందు, యుద్ధము నందు అతిరథుడయిన రఘునాథరాయలు, ధర్మరాజు తన సహోదరుల సహాయం పొందినట్లు, నాగమనీడు, యాచమనాయుడు మొదలయిన మహావీరుల సహాయముతో శత్రు సేనలను నుగ్గాడి విజయలక్ష్మికంఠమునందు పరిగ్రహణ పుష్పమాల వైచినాడు.

ఆ యుద్ధంలో శ్రీమంతు నాగమనీడు ప్రభువున్ను, ఆతని దళవాయి జగ్గన్నమంత్రియున్ను చూపించిన పరాక్రమము ప్రభువయిన రఘునాధరాయలు నిండు సభలో మెచ్చుకొన్నాడు. రఘునాధరాయని సచివులలో ఒకరయిన చెంగల్వల ప్రకాశకవిమంత్రి (విజయరాఘవ నాయక వంశావళి కావ్యము రచించిన చెంగల్వల కాళకవి దగ్గర జ్ఞాతి) జగ్గన్న మంత్రి ప్రతిభకు, పాండిత్యానికి, సేనల్ని నడిపే బంటుతనంలో ఆతని ప్రజ్ఞకు యెంతో మెచ్చుకొని, నీలాంబుజలోచనీదేవి లా వెలుగు తన పుత్రికను పత్నిగా స్వీకరించ వలసినదని నాగమనీని ప్రభువుద్వారా సందేశము పంపెను.

నాగమనీడు ప్రభువు రఘునాథ భూపాలుడు తనపై చూపిన ఆదరాభిమానాలకెంతో సంతోషించి 'సమరవ్యూహ నిర్వచన', 'పరగండ భైరవ' అను బిరుదాలను భక్తితో స్వీకరించి జగ్గన మంత్రికి తన ఆస్థానంలో మంత్రిత్వ పదవిని మహారాజు సమక్షంలోనే అర్పించినాడు. కడలి పురాన్నుండి రామన్నమంత్రి సకుటుంబముగ తంజావూరు వేంచేసినాడు.

జగ్గన్నమంత్రి వివాహం అతి వైభవంగా జరిగింది. ప్రభువుతో, బంధువులతో, భార్యతో, భార్య బంధువులతో జగ్గన్నమంత్రి దేవరకోట వచ్చి చేరినాడు. దేవరకోటలోను కడలిపురంలోను అనేక మహోత్సవాలు జరిగినవి.

వ్యవసాయం చేసుకుంటూ, కృష్ణవేణీ తీర ప్రదేశాల ఆనందంతో విహరిస్తూ, రాజకార్యాలు నిర్వర్తిస్తూ జగ్గనమంత్రి తన గంటాన్ని మళ్ళీ చేతపట్టినాడు. 'సత్యభామా విజయ'మను సంస్కృత కావ్యాన్ని, 'నాగమనీడు ప్రభు విజయ'మను తెలుగు కావ్యాన్ని ప్రారంభించి జగ్గన రెండు నెలలలో పూర్తిచేసి ప్రభువున కంకిత మిచ్చినాడు. అంకిత మహోత్సవము కోటలో అఖండంగా జరిగింది. రఘునాథ సరస్వతీమందిరము దర్శించిన నాగమనీడు ప్రభువు పెన్నిధియైన జగ్గనమంత్రి తనకు బాసటగ నుండగా ఏమి కొదువ యని దేవరకోటలోను సరస్వతీ మందిర మొకటి నిర్మించ దలచుకొన్నారు. జగ్గన్నమంత్రి గంటం లోంచి ప్రవహించి వచ్చిన పూర్వకవుల గ్రంథాలు రామన్నమంత్రి, జగ్గన్నమంత్రి శిష్యులైన యనేకులు వ్రాసియిచ్చిన తాళపత్రగ్రంథాలు ఆ మందిరంలో వెలిగిపోయినవి. కృష్ణానది నవ్వుకొనుచు ఉత్తరవాహినియై ప్రవహించి సముద్రుని చేరుకొన్నది.Bhagira Loya.djvu