Jump to content

భాస్కరరామాయణము/పీఠిక

వికీసోర్స్ నుండి

గ్రంథపాతం

యని తిక్కన వర్ణించిన యతనితాత యగుమంత్రిభాస్కరుఁ డఁట. 'సారకవితాభిరాముఁ' డని తిక్కనవంటి మహాకవి యిచ్చిన బిరుదవిశేషణముం బట్టి యామంత్రిభాస్కరుఁడు రామాయణమును రచించియుండె ననియుఁ, గావుననే తాను రామాయణమును రచింపక తక్కినయుత్తరరామాయణమునే రచించె ననియు, మంత్రిభాస్కరునిరామాయణ మేకారణముననో యొకయారణ్యకాండముతక్కఁ దక్కినవెల్ల నుత్సన్నములు కాఁగా హళక్కి భాస్కరాదులు వానిని బూరించి రనియుఁ జెప్పఁబడుచున్నది. ఈయభిప్రాయమున కెల్ల మొదటిమూల మారణ్యయుద్ధకాండగద్యములభేద మనఁబడుచున్నది. కాని యాగద్యములభేదమును జక్కఁ బరామర్శింపఁగా నిందులకు సాక్ష్య మియ్యకున్నది. ఆ రెండుగద్యములలో భాస్కరుఁడు రచించినగద్య, మతఁ డేభాస్కరుఁ డయినను, 'సకలసుకవిజనవినుత యశస్కర భాస్కర' యనెడి యారణ్యకాండపుగద్య మొకటియే. యుద్ధకాండమున భాస్కరునిరచన మున్నను దానితుదిగద్య మందలికడమను బూరించినయయ్యలార్యునిది. కవులభేదముచే గద్యములు భేదించుట సహజము. ఈయుద్ధకాండపుగద్యమునుగూడ భాస్కరుఁడే రచించియుండెనేని యారణ్యకాండగద్యమునకును దీనికిని గలభేదముంబట్టి భాస్కరులు భిన్ను లనవచ్చును. ఈరెండుగద్యములను వరుసగా భాస్కరుండును నయ్యలార్యుండును రచించుటచే వీనిభేదమువలన భాస్కరుఁడు వేఱు అయ్యలార్యుఁడు వే ఱని తెలియుచున్నదే కాని యారణ్యకాండ భాస్కరుఁడు వేఱు యుద్ధకాండ భాస్కరుఁడు వే ఱని తేటపడుట గలుగదు. కాన యీగద్యభేదముంబట్టి భాస్కరులు భిన్ను లనుట కుపపత్తి లేదు. ఇది యటుండ నారణ్యకాండముగద్యమున 'సకలసుకవిజనవినుతి యశస్కర భాస్కర' యని యున్నది. ఇందు భాస్కరశబ్దమున కేయుపపరమును లేదు. ఆకాండమునకు ముందటి బాలకాండముగద్యమునను వెనుకటికిష్కింధాసుందరకాండములగధ్యములను 'అష్టభాషాకవిమిత్ర భాస్కరపుత్ర' యని యున్నది. ఇందలిభాస్కరశబ్దమునకు నేయుపపదమును లేదు. యుద్ధకాండముగద్యమున 'భాస్కరసత్కవిమిత్ర' యని యున్న దండ్రు. అట్లేని యిందలిభాస్కరశబ్దమునకు నుపపదము లేదు. అయ్యలార్యుఁడు చెప్పిన 'హళక్కి భాస్కరమహాకవి' యనుపద్యముం బట్టి 'భాస్కర మిత్రుఁ' డగునతనిని హుళక్కి భాస్కరమిత్రునిఁగాను `భాస్కరపుత్రుఁ' డగుమల్లికార్జునుని హుళక్కి భాస్కరపుత్రునిఁగాను గ్రహించియుండుట చూపట్టుచున్నది. ఇ ట్లారణ్యకాండముచుట్టు నున్ననిరుపపదభాస్కరులెల్ల హళక్కి భాస్కరుఁడే యని చెప్పఁబడునేని, నడుమ వానివలె నిరుపపదముగానే యున్న యారణ్యకాండభాస్కరుండును హళక్కి భాస్కరుఁ డగుట సత్యమున కంతగా దూరము గానేరదు. కనుక నీగద్యములం దఱచి చూడఁగా నాయిరువురుభాస్కరులు భిన్ను లనుటకంటె నొక్కరే యనుట మఱింతయుపపన్నముగా నున్నది.

ఇఁకఁ గాండాదిపద్యములకు వత్తము. ఆరణ్యకాండమున,

క.

శ్రీహితనయవిలసనవా, ణీహితమృదువచన ధారుణీహితగుణసం
దోహ యసహాయవిక్రమ, సాహసనవసాహసాంక సాహిణిమారా!

1. ఆ.


క.

శ్రీరామాకుచయుగళీ, హారిద్రోల్లసితవక్ష, హరిచరణసరో
జారాధ్యుఁడు మారయధర, ణీరమణోత్తముఁడు సాహిణీతిలక మిలన్.

2.ఆ.

అనియు యుద్ధకాండమున

క.

శ్రీకరకరుణారుచిరవి, లోకనలీలావికాసలోల విపశ్చి
ల్లోకవివేకకలాశి, క్షాకుశలా మేరుధీర సాహిణిమారా.

యనియు నున్నది. ఈరెండు నేకకృతిపతినే గుఱించుటంబట్టి యీ రెండుకాండములకర్తృత్వము నొకభాస్కరునికే చెల్లుచున్నది. భాస్కరుఁ డొకఁడే యనుటకు నింతకంటె బలీయ మైనప్రమాణ మేమి కావలయును? మఱి యీ యొకభాస్కరుఁడు మంత్రిభాస్కరుడా? హళక్కి భాస్కరుఁడా? యనువిషయమున నయ్యలార్యుని 'అమర హళక్కి భాస్కర' యనుపద్యము హళక్కి భాస్కరుఁడే యని సిద్ధాంతము సేయుచున్నది. అయ్యలార్యుఁడు 'అమర హళక్కి భాస్కరమహాకవి చెప్పఁగ నున్న యుద్ధకాండముతరువాయి' అని యుద్ధకాండమును హళక్కి భాస్కరుఁడు చేసినట్టు చెప్పెను గాని యరణ్యకాండమునుగూడఁ జేసినట్టు చెప్పలేదే యన్నచో నిది సరిగాదు. భాస్కరుఁడు యుద్ధకాండమును రచింపఁగా మిగిలినభాగమును దాను బూరించిన ట్లయ్యలార్యుండు చెప్పినాఁడేకాని భాస్కరుఁడు యుద్ధకాండమును మాత్రమే రచించెనని చెప్పలేదు. తనపూరణమునకుఁ బాలుపడిన దతనియుద్ధకాండమే కానీ పూరించుటకై దానిం జెప్పవలసి చెప్పినాఁ డింతేకాని తక్కినకాండములు చెప్పనవసరము లేదు. కనుకఁ దక్కినవానిని జెప్పనంతమాత్రకు భాస్కరుఁడు వానిని రచింప లేదనుట సిద్ధింపదు. ఇట్లు గ్రంథస్థనిదర్శనము లగు నాద్యంతపద్యగద్యములం బట్టియు నయ్యలార్యునిపద్యము బట్టియు నారణ్యకాండయుద్ధ కాండములు హళక్కి భాస్కరుఁడు రచించె ననుటయే యుక్తముగా నున్నది. ఇఁకఁ

2. చరిత్రాద్యాధారము

గృతిపతి యగుసాహిణిమారుని కాలముంబట్టియు మంత్రిభాస్కరాదులకాలములంబట్టియు నీవిషయము పరామర్శింతము. సాహిణిమారుఁడు ఓరుగంటి రెండవ ప్రతాపరుద్రునియాస్థానమం దున్నట్లు సోమదేవరాజీయము దెల్పుచున్నది. అందుఁ బ్రతాపరుద్రునిసభలో 'హళక్కి భాస్కరుఁడు మొదలుగాఁ గల ప్రబంధకవీశ్వరు లిన్నూఱుగురును...... అశ్వంబుల కధికారి యైన సాహిణీమారనయు నున్నట్లు చెప్పఁబడియున్నది. ఈప్రతాపరుద్రుఁడు క్రీ. శ. 1295 వ సంవత్సరము మొదలుకొని 1321 వఱకు రాజ్యము చేసెను. ఇతని కాలమందు సాహిణిమారనయు హళక్కి భా స్కరుఁడు నుండుటచే వీరిరువురు సమకాలికు లై యున్నారు. మొదట సాహిణీమారుఁడు ప్రతాపరుద్రునికొలువున దండనాథుఁడుగా నుండెను. ఆరాజును మహమ్మదీయులు పట్టుకొని కారాబద్ధునిఁ జేసిన పిదప నాతని క్రింది సేనాపతులు మొదలగువారు స్వతంత్రులై యతనిరాజ్యమును బంచుకొని రాచరికముతో నేలి రని తెలియుచున్నది. అతని సేనాని యగుపోలయ వేమారెడ్డి వినుకొండరాజ్యమును స్థాపించెను. సాహిణిమారుఁడును స్వతంత్రుఁడై కొండసీమకు (కొండవీఁడు కాఁబోలు) రాజయ్యె. ఇతఁడు దండనాథుఁడును రాజును నయ్యె ననుటకు

మారయధర, ణీరమణోత్తముఁడు సాహిణీతిలక మిలన్.

ఆరణ్య

అనుట ప్రమాణము. మఱియు నప్పకవీయమం ముదాహరింపఁబడిన

క.

అప్పు లిడునతఁడు ఘనుఁడా?
యప్పు డొసఁగి మరలఁ జెందునాతఁడు రాజా?
చెప్పఁగవలె సాహిణిమా
రప్పను దానమున ఘనుఁడు రాజు నటంచున్.

ఆరణ్య

అనెడి యీ హళక్కి భాస్కరుని పద్యమువలని సాహిణిమారుఁడు రా జగుటయు హళక్కి భాస్కరుండు నతనికాలమువాఁడే యగుటయు స్థాపితమగుచున్నవి. ఇట్లు పదునాలుగవ శతాబ్దమందు సాహిణీమారనయు హళక్కి భాస్కరుఁడు నుండి రనియు నప్పుడే రామాయణము రచింపఁబడె ననియుఁ దెలియుచున్నది.

ఇంక మంత్రిభాస్కరునికాలమును విచారింతము. దీనిని దిక్కనకాలమునుబట్టియే కాక మఱొకవిధమున నిర్ణయించుట కయితి లేదు. సోమదేవరాజీయమందుఁ దిక్కన కాకతీయ గణపతిదేవుని దర్శింపవచ్చిన ట్లున్నది. గణపతిదేవుఁడు పదుమూఁడవ శతాబ్దము మధ్యమువఱకు రాజ్య మేలిన ట్లున్నది. ఆనాఁటికే తిక్కన సోమయాజి యై భారతాదులను రచించియుండెను గాన యప్పటికిఁ జాల వయస్సు చెల్లినవాఁడై యుండఁగూడును. కాన యతఁడు పండ్రెండవశతాబ్దమునఁ గూడ నుండవచ్చును. మఱియు మెకంజీ దొరగారు సంపాదించి చెన్నపురి రాజకీయపుస్తకనిలయమం దుంచిన వ్రాతప్రతులలో నొకట

క.

అంబరరవిశశిశాకా
బ్దంబులు చనఁ గాళయుక్తి భాద్రపదపుమా
సంబున నంబరమణిబిం
బం బనఁదగు తిక్కయజ్వ బ్రహ్మముఁ జేరెన్.

అని యున్నది. ఇది శాలివాహనశకము 1120 సం॥ లు చనఁగా, అనఁగా 1121వ సం॥న తిక్కన మృతి నొందినట్లు చెప్పుచున్నది. ఈశకవర్షము 1121 కాళయుక్తియే యగుచున్నది. ఇందులకు హూణశకము 1199వ సం॥ మగుచున్నది. దేశచరిత్ర 1199 సం॥ మే 1199 సం॥ మే గణపతిదేవుఁడు రాజ్యమునకు వచ్చె ననుటచే సంవత్సరమే తిక్కన గణపతిదేవునిఁ జూచి పిదపఁ గొన్నిమాసములకు మృతి నొంది యుండవచ్చును. అయినను బ్రహ్మశ్రీ - వీరేశలింగము పంతులవారు తిక్కన కాశ్రయుఁ డైనమనుమసిద్ధి పదుమూఁడవశతాబ్దముమధ్యమువాఁడుగాఁ గొన్నిశాసనముల నుదాహరించియున్నారు. వానింబట్టి తిక్కన పదుమూఁడవశతాబ్దమున నుండె నని తోచుచున్నది. మఱియు మనుమసిద్ధి తిక్కనను 'ఏ నిన్ను మామ యనియెడి, దీనికిఁ దగ నిమ్ము భారతీకన్యక'నన్నట్లు మామా యని పిలుచుటచేఁ దిక్కన రాజుకంటెఁ బెద్దవాఁడనియుఁ గాన మనుమసిద్ధి తిక్కనపిదపఁ గూడ బ్రతికియుఁడవచ్చు ననియు తోఁచెడిని, కనుకఁ దిక్కన మనుమసిద్ధితోఁ బాటిగాను గణపతిదేవునితోఁ బాటిగాను బదుమూఁడవశతాబ్దముమధ్యమువఱకు నుండనక్కఱలేదు. ఆశతాబ్దముతొలుత నుండవచ్చును. మఱి మెకంజీదొరగరు సంతరించిన ప్రతిలోని 'అంబరమణి' యనుపద్యముంబట్టియు నాప్రతులలోనే మఱియొకచోటఁ బ్రతాపరుద్రునిప్రేరణమునఁ దిక్కన భారతమును రచించినట్లు తెలుపఁబడియుండుట బట్టియు, నీవ్రాఁతకుఁ దార్కాణముగా నతఁడు భరతమున 'ఈకృశంబు లగు పుణ్యప్రబంధంబులు దేవసన్నిధిని బ్రశంసించుటయు నొక్కుయారాధనవిశేషం బగుటం చేసి' యన్నవాక్యముచొప్పున నోరుగల్లునం దొకగదిలో నతఁడు గూర్పండి భారతమును వ్రాసిన ట్లీప్రతిలోనే చెప్పంబడి యుండుటంబట్టియు, మొదటిప్రతాపరుద్రునికాలమువాఁడని తేలుటచే పండ్రెండవశతాబ్దమందు నున్నవాఁ డని తెలియుచున్నది. కవులచరిత్రమునుబట్టి పదుమూఁడవశతాబ్దమునందు నున్నవాఁ డని తెలియుచున్నది. ఈరెండుపక్షములకును సామరస్యముగాఁ బండ్రెండవశతాబ్దముతుదను బదుమూఁడవశతాబ్దముతొలుతను నున్నవాఁ డనుట యన్నిపక్షములకుఁ జేరికగా నున్నది. తిక్కన బండ్రెండవశతాబ్దముతుదివాఁ డనుటచే నతనితండ్రి కొమ్మన పండ్రెండవశతాబ్దమునడిమివాఁ డనియుఁ గొమ్మనను నాలుగవకొడుకుగాఁ బడసిన యతనితండ్రి మంత్రిభాస్కరుఁడు పండ్రెండవశతాబ్దముతొలుతను బదునొకండవశతాబ్దముతుదను నుండవచ్చు ననియుఁ దేలుచున్నది.

సాహిణిమారునికడకు వత్తము. ఇతఁడు పదునాలుగవశతాబ్దమువాఁడు. ఇతనికిఁ బదునొకండవ పండ్రెండవశతాబ్దములం దుండిన మంత్రిభాస్కరుడు కృతి నె ట్లియ్యఁగలఁడు? పదునాలుగవ శతాబ్దమువాఁడగు హళక్కి భాస్కరుఁడే యియ్యఁగూడును గాక. ఇట్లు కృతిపతి కృతికర్తల చరిత్రాదులఁబట్టి పరిశీలించినను సాహిణిమారన కంకితము సేయఁబడినయారణ్యకాండమును రచించిన భాస్కరుఁడు హళక్కి భాస్కరుఁడే కాని మంత్రిభాస్కరుడు కాఁ డని తేలుచున్నది.

చాటువులు - ప్రతీతులు - పుక్కిటిగాథలు

తిక్కన తనతాతను, 'సారకవితాభిరాముఁ' డన్నపద్యమున నతనిని గవి యని చెప్పెనే కాని రామాయణమును రచించె నని చెప్పలేదు. కాఁబట్టి తాత రామాయణము రచించుటచే మనుమఁ డుత్తరరామాయణము రచించియుండునని, తిక్కన యుత్తరరామాయణరచనము బట్టి యతనితాతను రామాయణరచనమునకుఁ బట్టము గట్టరాదు. తిక్కన తనతాత రామాయణమును రచించియుండుటంబట్టి తాను మిగిలినయుత్తరరామాయణము వ్రాసినవాఁ డయ్యెనేని, యిపుడు నన్నయభట్టు వ్రాయఁగా మిగిలినభారతమును తాను రచించినట్లు చెప్పుకొన్నరీతినే తాత రామాయణము రచించియుండుటచేఁ దా నుత్తరరామాయణమును రచించినట్లు తెలిపియుండును. భారతమునందుబోలె రామాయణమునందు నట్టికారణము తెలుపవలయు ననుట యావశ్యకము గాకున్నను, నిజమునకుఁ గారణ మదియే యైనయెడల దానిం జెప్పకపోయిన మానెఁగాని మఱియొకకారణమును జెప్పఁడు. అట్లు గాక తనయుత్తరరామాయణరచనకుఁ గారణము

క.

ఎత్తఱి నైనను ధీరో
దాత్తనృపోత్తముఁడు రామధరణీపతి స
ద్వృత్తము సంభావ్య మగుట
నుత్తరరామాయణోక్తి యుక్తుఁడ నైతిన్.

అని మఱియొకటిని చెప్పియున్నాడు. ఇందుఁ దా నుత్తరరామాయణమును వ్రాయుటకు ధీరోదాత్తుఁ డగు రామధరణీపతి సద్వృత్తము సంభావ్య మగుట హేతు వని చెప్పియున్నాఁడు. కాని భాస్కరుఁడు రామాయణము రచింపగా మిగిలినది యగుటయే హేతు వని చెప్పలేరు. సూచింపనులేదు. ఇదియే కారణ మగునేని దీనిం జెప్పు బ్రసక్తి కలిగినపుడు చల్లకు వచ్చి ముంత దాఁచినట్లు చెప్పక విడుచునా? చెప్పక విడిచినను మఱొకటిం జెప్పునా? తిక్కన, మంత్రిభాస్కరుండు కవితాపరిపాటియు గుంటూరివిభుత్వమును గలవాఁ డగుటం జూచి తనతాత యగుటచే గొప్పగా వర్ణించుకొన్నాఁడు. ఇంతేకాని నిజముగా గవిబ్రహ్మయు లాక్షణికశిరోమణియు నగునతనికవితకు వన్నె దెచ్చునట్టి పేరుగన్న మహాకవి యీమంత్రిభాస్కరుఁ డయినయెడల నితని నిటీవలికవులు తమకృతులంను దిక్కననుంబోలె నేల స్తుతింపరయిరి? మంత్రిభాస్కరుండును మహాకవితాఖ్యాతిగలవాఁ డనుటకు రావిపాటి తిప్పరాజు చెప్పిన

మ.

సరి బేసై రిపు డేల భాస్కరులు భాషానాథ, పుత్రా వసుం
ధరయం దొక్కఁడు మంత్రి యయ్యె, వినుకొండన్ రామయామాత్యభా
స్కరుడో, యౌ, నయినన్ సహస్రకరశాఖల్ లే, వవే యున్నవే,
తిరమై దానము సేయుచో రిపుల హేతిన్ వ్రేయుచో వ్రాయుచోన్.

అనుపద్యము నుదాహరింపఁబడియున్నది. ఇందు, రాయన భాస్కరుని ఖ్యాతి తెలియుచున్నది గాని యది దాతృత్వముచేతను శౌర్యముచేతను వచ్చినఖ్యాతి యేకాని తిక్కన మెచ్చుకొనునంతటి కవిత్వాతిశయమునుబట్టి వచ్చినది కాదు. కాన దీనివలన నీభాస్కరుఁడు మహాకవిగాఁ దోఁపలేదు. ఇతఁ డెట్టివాఁడయినను గానీ, ఈ రాయనభాస్కరుఁడు మంత్రిభాస్కరుఁడు గాఁడు. ఎ ట్లన, సునందాపరిణయమును రచించిన చింతకుంట కోదండరామకవి

సీ.

ఘనతరౌదార్యదీక్షాకల్పితానల్ప, కరనిబద్ధసువర్ణకంకణుండు
ఆసేతుశీతనగాంతరరాట్సభా, మధ్యవిశ్రుతకీర్తిమండలుండు
కొండపల్లీవినుకొండదుర్గద్వయీ, దేశప్రజావనధీయుతుండు
సకలావనీపకసంతానయాచిత, వస్తుప్రదానప్రవర్తనుండు
అన్నవేమమహీశదత్తాగ్రహార
మదకలాందోళికాశ్వసన్మణివిశేష
భూషణాద్యష్టభూతివిభూషితుండు
భానుతేజుండు రాయనభాస్కరుండు.

అని రాయనభాస్కరుని వర్ణించియున్నాఁడు. నందవరీకుఁ డగుకోదండరామకవి యితనిని దనవంశమువాఁడుగాఁ జెప్పుకొనుటచే నితఁడును నందవరీకనియోగిబ్రాహ్మణుఁడు. మంత్రిభాస్కరుఁ డాంధ్రనియోగికబ్రాహ్మణుఁడు. రాయనభాస్కరునింటిపేరు రాయనవారు. మంత్రిభాస్కరు నింటిపేరు కొత్తరువువారు లేక గుంటూరివారు. రాయనిభాస్కరు నివాసస్థలము వినుకొండ. మంత్రిభాస్కరునిది గుంటూరు. రాయనభాస్కరుని కుమారుఁడును మనుమనుఁడును,

సీ.

కవు లిచ్చి భూపతి గాచిపట్టఁగ నిల్పెఁ, బ్రజలకై రాయనభాస్కరుండు
వరదాతయై మణీవలయముల్ కవి కిచ్చె, దండిభాస్కరుసూతి కొండమంత్రి
భాస్కరువలెఁ గీర్తిఁ బడసెఁ దత్పౌత్రుఁడౌ, ఘనరామలింగ భాస్కరుఁ డొకండు

అను ముప్పదియిద్దఱు మంత్రులపద్యముంబట్టి వరుసగాఁ గొండనయు రామలింగన్నయు నగుదురు. మంత్రిభాస్కరునికొడుకును మనుమఁడును వరుసగాఁ గొమ్మనయుఁ దిక్కనయు నగుదురు. రాయనభాస్కరుఁడు మొదట నుదాహరింపఁబడిన పద్యముంబట్టి యనవేమరాజుకాలమువాఁ డని తెలియుచున్నది. అనవేమారెడ్డి హూణశకము 1340 మొదలుకొని 1366 వఱకు రాజ్యము చేసినట్టు చెప్పఁబడియున్నది. కనుక రాయనభాస్కరుఁడు పదునాలుగవశతాబ్దమువాఁడు. మంత్రిభాస్కరుఁడు పండ్రెండవశతాబ్దాదివాఁ డని ముందె నిరూపింపఁబడి యున్నది. కాన రాయనభాస్కరహుఁడు మంత్రిభాస్కరుండు కానేరఁడు. కనుక మంత్రిభాస్కరుఁడు కవిత్వమున ఖ్యాతి గాంచఁడయ్యె నని తెలియుచున్నది. మఱియుఁ దిక్కకవిశిష్యుఁ డగు మారన, రామాయణకర్త మంత్రి భాస్కరుఁడేని, తనగురు వంతగొప్పగాఁ జెప్పికొన్నయతనితాతగారిని దానును గవిస్తుతిలోఁ బేర్కొనకుండునా? అతఁడు

ఉ.

 సారకథాసుధారస మజస్రము నాగళపూరితంబుగా
నారఁగఁ గ్రోలుచున్ జనులు హర్షరసాంబుధిఁ దేలునట్లుగా
భారతసంహితన్ మును త్రిపర్వము లెవ్వఁ డొనర్చె నట్టివి
ద్యారమణీయు నంధ్రకవితాగురు నన్నయభట్టుఁ గొల్చెదన్.


చ.

 ఉభయకవిత్వతత్త్వవిభవోజ్జ్వలు సద్విహితాధ్వరక్రియా
ప్రభు బుధబంధు భూరిగుణబంధురు భారతసంహితాక్రియా
విభుఁ బరతత్త్వకోవిదు నవీనపరాశరసూను సంతత
త్రిభువనకీర్తనీయయశుఁ దిక్కకవీశ్వరుఁ గొల్తు భక్తితోన్.

అని నన్నయ్యతిక్కనలను మాత్రమే స్తుతించియున్నాఁడు. మారనకు సమీపకాలపువాఁ డయినమడికి సింగనయు

సారమతిన్ భజింతు ననిశంబును నన్నయతిక్కనార్యులన్

అని యాయిరువురనే పేర్కొనియున్నాఁడు. ఈతనికిఁ దరువాతివాఁ డగు నెఱ్ఱనయు నాయిద్దఱుకవులనే స్తుతించియున్నాఁడు. తిక్కన 'సారకవితాభిరాముఁ' డనుటం బట్టియుఁ, గేతన దశకుమారచరితమునందు

శా.

శాపానుగ్రహశక్తియుక్తుఁ డమలాచారుండు సాహిత్యవి
ద్యాపారీణుఁడు ధర్మమార్గపథికుం డర్థార్థిలోకావన
వ్యాపారవ్రతుఁ డంచుఁ జెప్పు సుజనవ్రాతంబు గౌరీపతి
శ్రీపాదప్రవణాంతరంగు విబుధశ్రేయస్కరున్ భాస్కరున్.

అని 'శాపానుగ్రహశక్తియుక్తుఁడు' గను 'సాహిత్యవిద్యాపారీణుఁడు' గను జెప్పి యుండుటంబట్టియు, మంత్రిభాస్కరుఁడు మంచికవి గావచ్చును గాని కవిస్తుతుల కెక్కు నంతటి మహాకవి గాఁడని తెలియుచున్నది. మఱియుఁ గేతన యతని నట్లు వర్ణించియు రామాయణమును రచించినట్లు చెప్పమిచే దాని నతఁడు రచింపలేదనియుఁ దేటపడుచున్నది. [1]ఇది యిట్లుండఁ దిక్కనశిష్యుఁ డయిన మారననుబట్టి తిక్కనకాలము మఱింత నిర్ణీతముగాఁ దెలియుచున్నది. మారన 1295 వ సం॥ మొదలుకొని 1323 సం॥ వఱకుఁ బరిపాలనము చేసిన రెండవప్రతాపరుద్రుని సేనాపతులలో నొక్కండగు నాగయగన్నమంత్రికిఁ దన విష్ణుపురాణము నంకితము చేసియున్నాఁడు. కనుక మారనగురుం డయినతిక్కన 1290 వ సం॥వఱకు జీవించి యుండవచ్చును. దీనింబట్టి చూడఁగా 'అంబరవిశశి' యను పద్యము మొదలయినవి యవిశ్వసనీయములుగాఁ జూపట్టుచున్నవి. తిక్కన యీకాలముంబట్టి మంత్రిభాస్కరుఁడు పండ్రెండవశతాబ్దముతుదివాఁ డని తెలియుచున్నది. దీనింబట్టి చూచినను మంత్రి భాస్కరుఁడు సాహిణిమారున కంకితముగా రామాయణము రచించె ననుట యసంబద్ధముగా నున్నది.

పదునాలుగవశతాబ్దముమధ్యమువఱకుఁ గవిస్తుతులందు భాస్కరుఁ డనుమాటయే కలుగదు. ఆశతాబ్ధముతుదినుండి భాస్కరుఁడు శ్రీనాథుఁడు భీమన రంగనాథుఁడును గవిస్తుతులం గనుపట్టుచున్నారు. ఈభాస్కరుఁడు, పదునాలుగవశతాబ్దపు హళక్కి భాస్కరుఁడే కావలయును; పండ్రెండవశతాబ్దపు మంత్రిభాస్కరుఁ డైనయెడల నతఁడు నడుమ నున్నశతాబ్దములం దెల్లఁ బేర్కొనంబడక పదునాల్గవశతాబ్దమునంతమునఁ బేర్కొనంబడె ననుట యనుపపన్నముగా నున్నది. మఱియు మధ్యకవులలోనివాఁ డగు అంగర నృసింహకవి తనరాజరాజాభిషేకమందు

ఉ.

'ఇద్ధగుణుం బ్రబంధపరమేశ్వరు నెఱ్ఱనప్రగ్గడన్ మనః
పద్ధతి నిల్పి సూక్తిరుచి భాస్కరుఁ డైనహళక్కిభాస్కరున్
బుద్ది ఘటించి సంతతము పూని భజింతు వచఃప్రసాదసం
సిద్ధునిఁ జిమ్మపూడికులశేఖరు నయ్యమరేశసత్కవిన్.'

అని స్పష్టముగా హళక్కిభాస్కరుఁడని తెల్పినాఁడు. కనుక ననంతామాత్యుని భోజరాజీయమందు,

'నన్నయభట్టుఁ దిక్కకవినాయకు భాస్కరు రంగనాథు'

ననియు, వెన్నెలకంటి సూరన విష్ణుపురాణమున

'ఎన్నికగాఁ బ్రబంధపరమేశ్వరుఁ దిక్కన సోమయాజినిన్
నన్నయభట్టు భాస్కరుని నాచనసోముని రంగనాథునిన్'

అనియు, ప్రౌఢకవి మల్లన రుక్మాంగదచరిత్రయందు

'నన్నయభట్టుఁ దిక్కకవి నాచనసోముని భీమనార్యుఁ బే
రెన్నికఁ జిమ్మపూడియమరేశ్వరు భాస్కరు శంభుదాసునిన్'

అనియు నిట్లే యిటీవలికృతులయందునుం గలభాస్కరుఁడు హళక్కిభాస్కరుఁడే కాని మంత్రిభాస్కరుఁడు గానేరఁడు.

పదేనవశతాబ్దమునుండి భాస్కరుఁడు భీముఁడు రంగనాథుఁడు శ్రీనాథుఁడు మొదలగు కవులు కవిస్తుతులం గానిపించుటంబట్టి వీర లొండొరులకాలములందో యొండొరుల యంత్యకాలములందో, యొండొరులకుఁ బిదపదాపటికాలములందో యున్నవారు గావచ్చును. కాన భాస్కరునితోఁ బాటిగాఁ దఱచుగాఁ గవిస్తుతులందుఁ గానిపించుభీమన యతనికాలపువాఁడో యతనికి సమీపకాలమువాఁడో కావలయును. ఇందులకు నిదర్శనముగా భీమకవి సాహిణిమారనను గూర్చి

'చక్కఁదనంబుదీవి యగుసాహిణిమారుఁడు మారుకైవడిం
బొక్కిపడం గలండు చలమున్ బలముం గలయాచళుక్యపుం

జొక్కనృపాలుఁ డుగ్రుఁ డయి చూడ్కుల మంటలు రాలఁ జూచినన్
మిక్కిలి రాజశేఖరునిమీఁదికి వచ్చిన రిత్తవోవునే.

యని చెప్పినట్లు వదంతి కలదు. దీనింబట్టి యతఁడు సాహిణిమారునికాలమునం దుండవలయు నని తెలియుచున్నది. దీనిచేత నితనితోఁ బాటిగా స్తుతులం గానిపించుభాస్కరుడు, సాహిణిమారుని కాలమువాఁ డగుహళక్కిభాస్కరుఁడె కావలయును. మఱియు భీమకవి రాయకళింగగంగును గూర్చి,

'వేములవాడ భీమకవి వేగమ చూచి కళింగగంగు తా
సామము మాని కోపమున సందడి దీఱిన రమ్ముపొ మ్మనెన్
మోమును జూడ దోష మిఁక ముప్పదిరెండుదినంబులోపలన్
జామున కర్ధమం దతనిసంపద శత్రులఁ జేరుఁ గావుతన్.'

అని శాప మిచ్చినట్లును నా చొప్పుననే కళింగగంగు పరులచే రాజ్యము పోఁగొట్టుకొని దీనుఁడై యుండఁగా మరల భీమకవి యతనిని జూచి

'వేయిగజంబు లుండఁ బదివేలతురంగము లుండ నాజిలో
రాయల గెల్చి సజ్జనగరంబునఁ బట్టము కట్టుకో వడిన్
రాయకళింగగంగుఁ గవిరాజు భయంకరమూర్తి చూడఁ దా
బోయిన మీనమాసమునఁ బున్నము పోయిన షష్ఠి నాఁటికిన్'

అని యాశీర్వదించినట్లు చాటువులు కనుపట్టుచున్నవి. ఇందు 'రాయల గెల్చి' యనుటచే నా రాయలే కళింగగంగును జయించియుండె నని తెలియుచున్నది. ఈరాయలు, శ్రీనాథుఁడు 'చంద్రశేఖరక్రియాశక్తి రాయలయొద్దఁ బాదుకొల్పితి సార్వభౌమబిరుద' మని చెప్పిన రాయలే కావలయును. శ్రీనాథునకుఁ గవిసార్వభౌమబిరుద మిచ్చినయాంధ్రరాయలే యితఁ డగును. ఎట్లన భీమకవి,

'ఘనుఁడన్ వేములవాడవంశజుఁడ దాక్షారామభీమేశనం
దనుఁడన్ దివ్యవిషామృతప్రకటనానాకావ్యధుర్యుండ భీ
మన నాపేరు వినంగఁ జెప్పితిఁ దెలుంగాధీశ కస్తూరికా
ఘనసారాదిసుంగధవస్తువులు వేగం దెచ్చి లాలింపురా.'

అని తెలుంగాధీశుని – అనఁగా ఆంధ్రరాయలను గస్తూరికాదులం దెమ్మని యన్నాఁడు, శ్రీనాథుఁడు నీ తెలుంగురాయలనే

'అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశ కస్తూరికా
భిదానము సేయరా సుకవిరాడ్బృందారకశ్రేణికిన్
దాక్షారామపురీవిహార వరగంధర్వాప్సరోభామినీ
వక్షోజద్వయకుంభికుంభములపై వాసించుఁ దద్వాసనల్.'

అని కస్తూరికాదానము సేయు మన్నాఁడు. మఱియు నీకవియే 'రంభఁ గూడెఁ దెనుంగురాయరాహుత్తుండు కస్తూరి కేరాజుఁ బ్రస్తుతింతు' నని కస్తురి విషయమై తెనుంగురాయ లని యున్నాఁడు. ఈ తెనుంగురాయలనే భీమన 'రాయల గెల్చి' యనియు శ్రీనాథుఁడు 'రాయలయొద్దఁ బాదుకొల్పితి’ననియుఁ గేవల రాయశబ్దముచేఁ బేర్కొనియున్నారు. దీనింబట్టి తెలుంగురాయలకాలమున భీమకవియును శ్రీనాథుఁడు నున్నవారని తెలియుటచేత వీ రిద్ద ఱించుమించుగా నేకకాలమువా రని తేలుచున్నది. శ్రీనాథుఁడు తిక్కనాదులను బూర్వకవులుగా స్తుతించియుండుటచే నతఁడు వారలకాలమువాఁడు గాఁడనుట నిర్వివాదముగదా. కాన శ్రీనాథునికాలమువాఁడగు భీమకవియుఁ దిక్కన కిటీవలివాఁ డగును. కనుక నతఁడు చాటువు చెప్పిన సాహిణిమారనయుఁ దిక్కన కిటీవలివాఁడే యగును. తిక్కన కిటీవలిసాహిణిమారునకుఁ దిక్కనకు మును పుండినమంత్రిభాస్కరుఁ డంకితముగా రామాయణము చెప్పె ననుట యసంగతముగా నున్నది.

ఇంతవఱకును మంత్రి భాస్కరునిఁ దిక్కనకు మునుపటివానినిగా నెంచి యతనికిం గూర్చిన రామాయణకర్తృత్వమును గూర్చి విచారము చేయుచుంటిమి. ఇప్పు డామంత్రిభాస్కరుఁడు, తిక్కన కిటీవల, మునుమూరు సంస్థానపు బుద్ధరాజుకడ మంత్రి యై రంగనాథునకుఁ బ్రతిపక్షిగా నునికిని జెప్పియుండుట విచారింతము, ఈకథయందుఁ గృతిపతి యగు సాహిణిమారయ కొండసీమరాజు గాఁడు; గుఱ్ఱపువాఁ డయ్యెను. ఎట్లన ద్విపద రామాయణమును జేసినరంగనాథుఁడు గోన బుద్ధరాజునకు బంధుఁడు. భాస్కరుఁ డతనియాస్థానపండితుఁడు. రంగనాథుఁడు రాజాజ్ఞను బొంది ద్విపద రామాయణమును రచింపఁబూని రచించుచుండెను. అతఁడు చాలవఱకు రామాయణమును రచించియుండఁగా, భాస్కరుఁ డసూయవలనఁ దా నతనికంటె ముందుగా గద్యపద్యాత్మకముగా రామాయణము రచించి రాజు మెచ్చు వడయవలయు నని మల్లికార్జునాదు లగుమువ్వురసాహాయ్యముచేఁ ద్వరితముగా ముగించి యాస్థానమునకుఁ గొనిపోయెను. అప్పటికి రంగనాథుఁడు దనరామాయణమును ముగించి యాస్థానమునకుఁ దెచ్చియుండెను. రా జాయిరువురవృత్తాంతము నెఱింగి రంగనాథునితట్టు కుడిచేతిని భాస్కరునిత ట్టెడమచేతిని జాఁచెను. భాస్కరుఁ 'డది యేమి’ యని యడుగఁగా, రాజు 'నేను రంగనాథునకు మునుపే కుడిచేతి నమ్మితి' ననెనఁట. అంతట భాస్కరుఁడు కోపించుకొని 'నీవంటిపక్షపాతి కిచ్చుటకంటె నీ గుఱ్ఱపువాని కిచ్చుట మే' లని పలికి కొలువు విడిచి వచ్చుచుండఁగా నారాజు గుఱ్ఱపుదళవా యది విని సభాద్వారమున భాస్కరునితో 'కవిసార్వభౌమా! ఆడినమాట తప్పవల' దని యడ్డపడి మ్రొక్కఁగా భాస్కరుఁడు గ్రంథాది నున్న రాజవంశవర్ణనాదుల నెల్ల నెత్తి వైచి 'సాహిణీమారా'యని ముగియున ట్లొకపద్యము మొదటఁ చేర్చి దీనిని వాని కంకితముఁ జేసెనఁట. కొంద ఱీబుద్ధరాజునకు మంత్రిభాస్కరుడు మంత్రిగా నుండె ననియు నతఁడు రంగనాథునిచే ద్విపద రామాయణమును వ్రాయించుటను జూచి యీసుచేతఁ దాను రాజుతోఁ బద్యకావ్యమును వ్రాయించి తెచ్చి యిచ్చునట్లు చెప్పి హళక్కిభాస్కరాదులచేత దానిని జేయించినట్లును, రాజు రంగనాథునే సత్కరించినట్లును దానిపయిని దక్కినవిషయములు జరిగినట్టును జెప్పుచున్నారు. మఱికొంద ఱీకథయందు మంత్రిభాస్కరుని ప్రసక్తియే తేక యంతయు హళక్కిభాస్కరపరముగాఁ జెప్పుచున్నారు. మఱికొందఱు మంత్రిభాస్కరుఁడు బుగ్గరాజు కుమారుఁ డయిన సాహిణిమారుని కాలమందు మంత్రిగాను నాస్థానకవిగాను నుండె ననియు నితఁడే మొదట రామాయణము నంతయు నారాజున కంకితముగా రచించె ననియు, నీగ్రంథ మేకారణముననో యత్యల్పకాలమున శిథిలము కాఁగా నపుడు కృతిపతి యగుసాహిణీమారునికుమారుఁడు కుమారరుద్రదేవుఁడు తనతండ్రికాలమునుండి యాశ్రితుఁ డై యున్న హళక్కిభాస్కరుని గ్రంథము నుద్ధరింపు మనఁగా నతఁ డాసంపుటమును శోధించి యం దారణ్యకాండము తప్పఁ దక్కిన దంతయు శిథిల మగుటం జూచి యక్కాండమునం దందంద చెడినభాగములను సరిపఱచి వార్ధకమును బట్టి తక్కినకాండములను దానే రచింపఁ బూనఁజాలక మల్లికార్జునాదులసాహాయ్యమున దానిని బూరించె ననియు, నం దెవ్వరు నయోధ్యాకాండమును బూరించుటకుఁ బూనకుండుటను జూచి రా జయిన కుమారరుద్రదేవుఁడు తానే దానిని సంగ్రహముగా రచించె ననియుఁ జెప్పెదరు. పూర్వము రూపింపఁబడిన సాహిణిమారాదులయు మంత్రిభాస్కరాదులయు కాలములను బట్టి చూడఁగా నివి యన్నియుఁ గొన్ని కల్పితములును గొన్ని నిరాధారములు నగుట తెలియుచున్నది.

ఆరణ్యకాండము తక్కినకాండములవలెఁ గాక యాశ్వాసములుగా విభక్త మగుటంబట్టి యిది తక్కినకాండములకవులచేతం గాక వేఱుకవిచే రచిత మగు నందురు. మఱియు నారణ్యకాండాంత్యపద్యములును తిక్కనయుత్తరరామాయణమునందలి యాశ్వాసాంతపద్యములును నొక్కరూపై యుండుటచే నారణ్యకాండకర్తకును దిక్కనకును గొంతసంబంధము సూచిత మగుచున్న దందురు.ఇట్లాశ్వాసవిభజనమును బట్టి యుద్ధకాండభాస్కరుఁడు గాక మఱియొకభాస్కరుఁ డనియు నాశ్వాసాంతపద్యములనుబట్టి యా భాస్కరుఁడు తిక్కనతాత యగు మంత్రిభాస్కరుఁడే యగు ననియుఁ జెప్పఁబడుచున్నది. హళక్కిభాస్కరుఁడు యుద్ధకాండము కడవఱకును రచింపక నడుమనే విడుచుటచే దాని నాశ్వాసములుగా విభజించుట కయితిలేదు, అయిన నతఁడు రచించినంతవఱకు 1133 పద్యము లుండుటచే నాశ్వాసవిభాగము చేయఁగూడు ననవచ్చును. మఱి యాశ్వాసాంతపద్యములగమనికం బట్టి యారణ్యకాండ భాస్కరుని తిక్కనకుఁ దాతఁగాఁ జేయుటయు యుక్తమైనం గావచ్చును. కాని యీ విషయములను, మంత్రిభాస్కరుడు రామాయణము రచించె ననుటకుఁ గవిప్రస్తావాద్యుపపత్తి లేమింజేసియు, నతఁడు సాహిణీమారుని కాలమువాఁడు గామింజేసియు, నంగీకరింప వలను గాకున్నది. వీనినెల్లఁ జూడఁగా నాశ్వా సాంతపద్యములను మంత్రిభాస్కరుని ననుకరించి తిక్కన వ్రాసె ననుటకంటెఁ దిక్కన ననుసరించి హళక్కిభాస్కరుఁడు రచించె ననుట మఱింతయుపపన్నముగా నున్నది.


ఇంతవఱకును నీరామాయణమందు మంత్రి భాస్కరుని రచనము లే దని నిరూపిత మయ్యె. ఇక హళక్కిభాస్కరుఁడే దీనిని రచించినవాఁడేని యన్నికాండములను దానే రచింపక యొక రెండుకాండములే రచించుటకును దక్కినవి మల్లికార్జునాదులు రచించుటకును నిట్లు నలుగురుకవులచే రచితమై యుండఁగా నిది భాస్కరునిపేరనే వెలయుటకును గారణములు విమర్శింపవలసియున్నది. అందు భాస్కరుఁడు వృద్ధుఁ డగుటచేఁ దానే యన్ని కాండములను రచింపఁజాలక తక్కిన పుత్రమిత్రాదులం గొని రచించె ననియుఁ బ్రధానుం డతఁడే యగుటం జేసి యతనిపేర నీ గ్రంథము వెలసె ననియుఁ గొందఱును, నతఁడు సపుత్రమిత్రచ్ఛాత్రముగాఁ దాను రచింపఁగోరి యట్లు రచించినాఁ డనియు, రంగనాథరామాయణమునకును దీనికిని నెఱ్ఱన రామాయణమునకును దీనికిని భేదము దెలుపుటకై దీనికవులలో ముఖ్యుండగు భాస్కరుని పేర నిది పిలువంబడె ననియుఁ గొందఱును, జెప్పెదరు. మల్లికార్జునుఁడు 'భాస్కరసత్కవిపుత్ర' యన్నట్లు భాస్కరునిపుత్రుం డై యతనియాదేశముచొప్పున బాలకాండాదుల రచించినవాఁడేని, తండ్రివలెనే కృతిపతి యగుమారనను బాలకాండముతొలుత నేల నంబోధింపఁడయ్యె? మఱి బాలకాండముతుదను శివునే సంబోధించి యున్నాఁడు గాని మారనను గాదు. బాలకాండమునఁ దొలుతఁ గాని తుదను గాని బొత్తిగా సాహిణిమారుని ప్రస్తావమే లేదు. మఱి యతఁడు రచించిన కిష్కింధాకాండమందో తొలుత

క.

'శ్రీరమణీ ప్రియరమణీ, శ్రీరమ్యోరుకుచకుంభసేవాలోల
స్ఫారదృగాశ్రయనేత్రాం, భోరుహపూజాప్రహృష్ట పురుషవిశిష్టా.’

యని యున్నది. ఇది విష్ణువునకుఁగాని వలయునేని విష్ణుభక్తుఁ డగునొకపురుషవరునికిఁగాని సంబోధనము గావచ్చును. కాన యిందుఁ గంఠోక్తముగా సాహిణిమారునికి సంబోధనము లేదు. ఈకాండముతుదినో శివసంబోధన మున్నది. తొలుతటిసంబోధనము విష్ణుపరముగాను తుదిసంబోధనము శివపరముగాను నుండుట మిక్కిలియుఁ జింత్యము. మఱియు నిందుఁ దుదిని

'లాటీచందనచర్చ చోళమహిళాలావణ్యసామగ్రి ...
పాటింపందగు నీదుకీర్తి రథినీపాలాగ్రణీ సాహిణీ.'

అని సాహిణిమారునిసంబోధనముగూడఁ వ్రాతప్రతులందుఁ బెక్కిట లేదు; అచ్చుప్రతులందు శివసంబోధనముతోడ నీమారనసంబోధన సైత మున్నది. ఈ రెండునంబోధనములను దుది నుంచుట క్రమ మెట్లు? ఇతఁడు రచించిన సుందరకాండముతొలుతనో, బాలకాండకిష్కింధాకాండముల తొలుతను లేని సాహిణిమారునిసంబోధన మున్నది. ఇందులకుఁ దుదనో కేవలశివసంబోధనమే కానిపించుచున్నది. వీని నెల్లంబట్టి చూడఁగా నితఁడు రచించిన మూడుకాండములతుదలందును దప్పక శివసంబోధనము లుండుటచే నివి యితఁడు రచించినవియే యగు ననియు, వానితొలుత నొక్కట బొత్తిగా లేకయు నొక్కట సందిగ్ధముగాను మరొక్కట మాత్రము గలిగియు నున్న మారనసంబోధనము నిటీవల నెవరో తక్కినకాండములం జూచి కల్పించి చేర్చి రనియుఁ దోఁచుచున్నది. కావుననే కిష్కింధాకాండము తుదమాత్ర మున్న 'లాటీచందన' యనుమారన సంబోధనమును గల్పితమే కావలయును, అట్లు కానిచో నట్టిది తక్కినకాండములతుదలందును శివసంబోధనముతోఁగూడ నేల చెప్పఁబడకున్నది? ఆ పద్యమును వ్రాతప్రతులం బెక్కింట చూపట్టకుండుటయు నది కవిరచితము గాదనుట కొకనిదర్శనముగా నున్నది. మఱియు సుందరకాండముతొలుత నున్న మారనసంబోధనము శివభక్తుఁ డగుమల్లికార్జునుఁడే రచించినదేని యతఁడు సాహిణిమారుని శివభక్తునిఁగా సంబోధించియుండునుగాని విష్ణుభక్తునిఁగా సంబోధింపఁడు. అందు విష్ణుభక్తుఁడుగానే యతఁడు సంబోధింపఁబడుటయు 'హరిచరణసరోజారాధ్యుఁ' డని యారణ్యకాండమం దుండుటను జూచి య ట్లితరులచేఁ గావింపఁబడె నని యూహింప నగుచున్నది. మల్లికార్జునుఁడే యారణ్యకాండమందలి యాసంబోధనమును జూచి యట్లే సుందరకాండమందును సంబోధనమును నిబంధించి యుండవచ్చు నన్నచోఁ దనతక్కినకాండములతొలుత సాహిణిమారనసంబోధనమును మానుటకే తెగించిన యతఁడు సుందరకాండమున విష్ణుభక్తునిని శివభక్తునిఁగా మార్చుట మాత్రమునకుఁ జాలఁడా? ఇట్లు భాస్కరుని దయినయీరామాయణమునందుఁ జాలభాగము రచించియుండుటఁబట్టియు, గద్యమున భాస్కరునిపుత్రుఁ డని చెప్పికొనియుండుటఁ బట్టియు, మల్లికార్జునుఁడు భాస్కరునిపుత్రుఁ డయినం గావచ్చును గానీ సాహిణిమారునిసంబోధనము లేనందున నతఁడు దీనిని సాహిణికాలమున రచించె ననుట సందిగ్ధముగా నున్నది. అయోధ్యాకాండమును రచించిన కుమారరుద్రదేవుఁడు కాండముతొలుతను దుదను సాహిణిమారునే సంబోధించి యున్నాఁడు. మఱి యితఁడు 'బుద్ధయకుమార సాహిణిమారా' 'కాచమాంబాకుమారా' యనుటచే సాహిణిమారుఁడు బుద్ధయకును గాచమాంబకును బుత్రుఁ డని తెలియుచున్నది. గద్యమున 'మారయకుమార కుమారరుద్రదేవ' అనుటచే నితని నా సాహిణిమారునికుమారుఁ డందురు. దీనింబట్టి బుద్ధరాజుకుమారుఁడు సాహిణిమారుఁ డతనికుమారుఁడు కుమారరుద్రదేవుఁ డని చెప్పఁబడుచున్నది. ఈ కుమారరుద్రదేవుఁ డయోధ్యాకాండమును రచించుటకు భాస్కరునిశిష్యుఁ డగుట కారణ మని కొందఱును, దాని నెవ్వరును రచింపకుండఁగాఁ దానే రచించె నని కొందఱును, జెప్పెదరు. ఇం దేది నిజమో తెలియరాదు. సాహిణిమా రునితండ్రి యగుబుద్ధయ రంగనాథరామాయణకర్తగా నున్న గోనబుద్ధరా జందురు. అప్పు డుత్తరరామాయణమును ద్విపదగా రచించిన యితనికొడుకులు విఠలరాజును గాచవిభుఁడును సాహిణికిఁ దోఁబుట్టువులు కావలయును. సాహిణి తనతండ్రియుఁ దోఁబుట్టువులును రామాయణమును రచించియుండఁగాఁ దా నేల యారామాయణమును రచింపింపవలసెనో తెలియరాకున్నది. దీనినిబట్టి చూడఁగా 'మారయకుమార' యనుచోఁగల కుమారరుద్రుతండ్రి మారయ, సాహిణిమారుఁ డగుట సందిగ్ధముగా నున్నది. యుద్ధకాండముకడమను బూరించినయయ్యలార్యుఁడు తుదను శివునే సంబోధించియున్నాఁడు. ఇతఁడును దాను బూరించిన యుద్ధకాండముతొలుత సాహిణిమారునిసంబోధన ముండియుఁ, దాను దుదను శివునే సంబోధించుటంబట్టియు 1134 పద్యముకడ ' ఈఘట్టమువఱకు హళక్కిభాస్కరకవివిరచితము. ఇది మొదలు వేదగిరి నాయనింగారిప్రేరణమున నయ్యలార్యుఁడు రచించినది' అని వ్రాతప్రతులం దెల్ల నుండుటంబట్టియు, నతఁడు సాహిణిమారనకాలమువాఁడు గాఁ డని తెలియుచున్నది. మఱియు నితనిగద్యమున 'శ్రీ శాకల్య మల్లకవి రవిరాహు నృసింహావరజాప్పలార్య వరసుత' యని యున్నది; కాని భాస్కరమిత్రుఁడని కానిపింపదు, మఱి వేదగిరినాయనిప్రేరణముననే యితఁ డీగ్రంథమును రచించెనుగాని భాస్కరకవితోడి మైత్రింబట్టి కాదు; కాన యితఁడు భాస్కరమిత్రుం డనుటకు నుపపత్తిలేదు. ఇవియన్నియు భావిపరిశోధనమునంగాని యిప్పుడు తెల్లము గాకున్నది. కాన యిదమిత్థ మ్మని నిర్ణయింప నింతకు నయితి లేదు.

ఆరణ్యకాండమున 'శ్రీరామాకుచయుగళీహారిద్రోల్లసితవక్షహరిచరణ' యని యున్నది. ఇందు, వక్షశ్శబ్ద మకారాదివలె సమాసమున నుంపఁబడియున్నది. మఱియు 'హరిహరవేధాదులకు' (2. ఆ. 33. ప.) ననియు వేదశ్శబ్దము నకారాదివలెనే సమాసమున జూపట్టుచున్నది. ఏతద్దోషసామ్యమునుబట్టి కృతిపతిసంబోధనకర్తయే కాండమునకుఁ గూడ కర్త యగు నని నిర్ణయింపఁ దగియున్నది. ఇవియన్నియు నట్లుండ, నారణ్యకాండమున వ్రాతప్రతులఁ జూపట్టుపాఠము మిక్కిలియు సంగ్రహముగా నుండ నచ్చుప్రతులందలి పాఠ మ దేమి కారణమో యంతకంటెఁ జాల నధికముగాను బెక్కుచోట్ల మిక్కిలియు భిన్నముగాను జూపట్టుచున్నది. కొన్నిచోట్ల వ్రాతప్రతులయొక్క పద్యమునకు నచ్చుప్రతులం బెక్కుపద్యములు చూపట్టుచున్నవి. అచ్చుప్రతులం గానిపించు నధికపద్యములుగాని భిన్నపద్యములుగాని మాకు దొరకినన్ని వ్రాతప్రతులందును బ్రాచ్యలిఖితభండారమందలి ప్రతులందును గానిపింపవు. ఈగ్రంథమును దొలుత ముద్రణము గావించినకరాలపాటి రంగయ్యగారు మంచికవి యగుటచే సంగృహీతములుగాను గ్రంథపాతములుగాను నున్నయెడల సొంతకవనముచేఁ బెంచియుఁ బూరించియు నుందురేమో యని సందేహము గలుగుచున్నది. మంత్రిభాస్కరునిదా హళక్కిభాస్కరునిదా యని వివాదగ్రస్తమై యున్న యీయారణ్యకాండపుఁగవనము మొదలే చాలభాగము మఱియొకకవిదిగా దోఁచుచున్నది.

ఒక యారణ్యకాండముననే కాదు; అయోధ్యాకాండముతుదను గూడ 273వ పద్యము మొదలుకొని 324వ పద్యమువఱకు వచ్చు ప్రతులం గల పాఠము వ్రాఁతప్రతులం గానరాదు. ఆపాఠమున కెల్ల మాఱుగా వ్రాఁతప్రతులందు,

సీ.

అంత నక్కడ రాముఁ డచటికి భరతుండు, క్రమ్మఱ వచ్చి సామ్రాజ్యమునకుఁ
దన్ను రమ్మనుచుఁ బ్రార్థన సేయునో యని, చింతించి యాత్మలోఁ జిత్రకూట
మున నల మునిజనంబుల వీడుకొని మార్గ, తరువీక్షణంబునఁ గరము వేడ్క
దనర సీతాసుమిత్రాపుత్రసహితుఁ డై, దండకావనమహీస్థలికి నరిగె
ననఁగ నీయయోధ్యాకాండ మభిమతముగ, వినిని వ్రాసినఁ జదివిన విస్తరించి
చెప్పినను వారలకు సుఖసిద్ధి యెసఁగు, సంపదాయురారోగ్యముల్ సంభవించు.

నని యొక్కసీసపద్యమే యున్నది. ఇందుఁ గలకవులకవనమంతయు రసవంతమును మధురమునుగానే యున్నది. అందు భాస్కరునికవనము ప్రౌఢము. మల్లికార్జునుని కవనము వీరభయానకరసములం దందఱకవితకంటె నొకవన్నె యెక్కుడనవచ్చు. కవిత్రయముచే నవ్యయములుగాఁ బ్రయుక్తము లగు 'అట ఇట ఎట' యనునవి యిందు విశేష్యములుగాఁ జూపట్టు చున్నవి. [2]అయ్యలార్యునికవనమున ఋకారమున కుత్వముతోను దన్మిత్రములతోను యతిమైత్రి గానిపించెడిని.

ఈ భాస్కరుని హళక్కిభాస్కరుఁ డందురు. ఇటీవల హుళిక్కిభాస్కరుం డని గ్రంథములం దితని వాడుచున్నను బ్రాఁతవ్రాఁతప్రతులందు హళక్కి యనియే యున్నది. ఈ యుపపదము వచ్చినవిధ మె ట్లన, భాస్కరునింటిపేరు మొదట 'మంగళపల్లి' యఁట . ఇది యిట్లుండ నొకనాఁ డితని కాశ్రయభూతుఁ డయినరాజు రత్నఖచిత మగుబంగారుపళ్లెరమున నమూల్యాభరణాదికలితం బగు కర్పూరతాంబూలము నిడి యొక్కుడురసవంతముగాఁ గవిత్వము చెప్పుకవికి నమూల్యమయిన యావిడియము నిచ్చెద నని చెప్పినట్లును, భాస్కరుఁ డందఱికన్న నతిశయముగాఁ గవిత్వమును జెప్పి యాయగ్రతాంబూలము నందినట్లును, దానం చేసి భాస్కరునికిని దర్వాతఁ దత్సంతతివారికిని హళక్కి యనునుపపదము గలిగె ననియు, నిప్పటికిని దద్వంశీయులచేఁ జెప్పఁబడుచున్నదఁట. ఇది నిజముగా నుండవచ్చును. హళక్కి యనఁగాఁ గన్నడమునఁ దాంబూల మని యర్థము సామాన్యముగాఁ దెనుఁగున బిరుదులందుఁ గన్నడపదములను గౌరవార్థ ముంచుకొనుట చూపట్టుచున్నది. ఇందలితప్పులొప్పులను దెలుప నెల్లరును బ్రార్థితులు.

తం. తే.

  1. కవులచరిత్రము భాస్కరోదంతము మొదలగువానినుండి యిందలివిషయములు కొన్ని గయికొనంబడినవి, విజ్ఞానచంద్రికవారి 'ఆంధ్రుల చరిత్రము' నుండియుఁ గొన్నివిషయములు గ్రహింపబడినవి.
  2. చూడు 575 పుట