భాస్కరరామాయణము/ఆరణ్యకాండము-ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

భాస్కరరామాయణము

ఆరణ్యకాండము



హిత నయవిలసితవా
ణీహితమృదువచన ధారుణీహితగుణనం
దోహ త్రివిక్రమవిక్రమ
సాహస నగధైర్యసార సాహిణీమారా.

1


ఉ.

పుణ్యచరిత్రుఁ డత్రిమునిపుంగవు వీడ్కొని రాముఁ డంచితా
గణ్యగుణాభిరాముఁ డుపకంఠమునం జని కాంచె దండకా
రణ్యము సిద్ధసంయమివిరాజితచారుతపోనుజాతస
త్పుణ్యము నిర్మలాంబువరపుష్కరపూర్ణసరోవరేణ్యమున్.

2


మ.

కని బాణాసన మెక్కుడించి ధరణీతకాంతుండు శాంతారమం
డనకల్పం బగునాశ్రమాంతతరువాటం బప్డు సొ త్తేరఁగా
మును లేతెంచి నమస్క్రియామహితు లై మోదంబుతో మీర లీ
దిన మిచ్చో వసియింపుఁ డన్నఁ జని రాతిధ్యార్ధ మప్పార్థివుల్.

3


తదనంతరంబ తపోధను లుచితసత్కారంబుల వారలం బూజించి వినయంబున.

4


ఆ.

నృపతి దలఁపఁ బూజనీయుండు మాన్యుండు, దండధరుఁడు గురుఁడు ధర్మసేత
పతియు శరణదుండు బంధుండు గావునఁ, దండ్రి మమ్ముఁ బ్రోవఁదగుదు వీవు.

5


క.

జననుతుఁ డై జనవల్లభ, జననాయకుఁ డింద్రునందుఁ జతురంశములం
గొని ప్రజలం బాలింపను, ననుపమభోగంబు లంద నర్హుం డెందున్.

6


తే.

ఊర నున్న వనంబున నున్నఁ బ్రజల, నియతి రక్షింప శిక్షింప నృపుఁడె కర్త
యేము నీయేలునిలను నింపెసక మెసఁగ, నునికి నీచేత రక్షణీయులము వినుము.

7


వ.

అనుచు నభినందింప రఘువరుం డారాత్రి యచ్చట నిలిచి మఱునాఁడు మునుల
నామంత్రణంబు సేసి వారిచే నెఱింగినపథంబున.

8


క.

[1]కాకోలవ్యాకులమును, ఘూకాకులభీకరంబు ఘోరమృగవ్యా
ళాకరమును ఝిల్లీనిన, దాకర్ణనదుస్సహంబు నగు పేరడవిన్.

9

చ.

అనుజుఁడు సీతయున్ మిగుల హర్షమునం జనుదేరఁ బద్మలో
చనుఁడు రఘూద్వహుండు మృగసంఘములన్ నిజచాపశింజినీ
ధ్వనులఁ దొలంగఁ దోలి సుపథంబుగఁ జేయుచు నేఁగి ముందటం
గనియె మహామునీశ్వరనికాయనివాసతపోవనంబులన్.

10


తే.

కనియుఁ దమ్ముఁడు దానును గార్ముకంబు
లెక్కు లటు డించి వినతు లై యేఁగి మ్రొక్కి
చేరి మును లెల్లఁ బూజింప గారవమున
నచట నారాత్రి నిలిచి యహర్ముఖమున.

11


క.

జనపతి ప్రియ మెసలారఁగ, మునివరులకు నెల్లఁ జెప్పి మ్రొక్కుచుఁ దగ వీ
డ్కొని జనకరాజపుత్రియు, ననుజన్ముఁడు గదిసి తోడ నరుదేరంగన్.

12


చ.

చని చని దట్టమై యిసుము చల్లిన రాలనిఘోరకాననం
బునఁ గని రొక్కచో నెదుర భూధరసన్నిభకాయు నుగ్రలో
చను నతిదీర్ఘదంష్ట్రు గరసంభ్రతశూలుఁ గఠోరనాదగ
ర్జనభయదాట్టహాసు మునిసంఘవిరోధు విరాధు నుద్ధతున్.

13

శ్రీరాముఁడు విరాధునిఁ జంపుట

సీ.

శరభసింహవ్యాఘ్రచయములగుదులు భు, జాభీలశూలమునందుఁ గ్రాల
చౌడల నిరుదెసఁ దనరి వక్రము లైన, బలితంపుఁగోఱలతెలుపు నిగుడఁ
దపనరథాంగవృత్తము లైనకన్నుల, నెండ చండంబుగా నిండి పర్వఁ
[2]గహకహ యనియెడు కటికిచప్పుడు పర్వు, చప్పుడు బ్రహ్మాండ మప్పళింప
సమదభంగిఁ గదిసి $ జూనకిఁ బట్టి శీ, ఘ్రముగఁ జంకఁ దాల్చి రభసగమన
చరణఘాతచలితసర్వంసహాచక్రుఁ, డగుచు రాముఁ గదిసి యార్చి మఱియు.

14


వ.

క్రోధంబున విరాధుం డి ట్లనియె.

15


క.

ధనురస్త్రఖడ్గధారుల, వనితాసహచరుల ధర్మవర్తనుల మిముం
దునుముదు నెత్తురు ద్రావుదు, నను వినరె విరాధు ననుచు నవ్వుచు మఱియున్.

16


క.

మునిమా౦సభోజి నై యి, వ్వనమునఁ జరియింతు నేను వచ్చినమాయా
మునులు మిమ్ము సహింతునె, వనితారత్నంబు మనుజవర యర్హంబే.

17


వ.

అని పలుకునిశాచరునంకోపరిభాగంబునం బవనవేగంబునం గదలుకదళివి
ధంబునం బులిబారిం బడి బెగడుహరిణికరణిఁ గంపంబు నొందునక్కురంగన
యనం గనుంగొని దీనవదనుం డయి కౌసల్యానందనుండు సుమిత్రానందనున
కి ట్లనియె.

18


చ.

ఘనతరకార్ముకంబుఁ బటుకాండచయంబును గేల నుండ నా
తనువునఁ బ్రాణముం గలుగఁ దమ్ముఁడ యిద్దశ పొందెఁ జూచితే

జనకతనూభవం బరమసాధ్వి నిరంతరభాగ్యలీలలం
దనరినమత్ప్రియన్ దశరథక్షితినాథుననుంగుఁగోడలిన్.

19


క.

అని పలికి వినుము లక్ష్మణ, జనకజదైన్యంబు సూడఁజూలుటకంటెన్
ఘన మగుశోకము నా కెం, దును లే దంబ ప్రియ మందఁ దొఱఁగెదఁ దనువున్.

20


తే.

ధరణిరాజ్యము గోల్పాటుఁ దండ్రిచావు, నిష్టబంధువియోగంబు దుష్టయాతు
నిష్ఠురారణ్యవాసంబు నేఁడు నాదు, దేహదాహంబు సేసె వైదేహికతన.

21


మ.

అని బాష్పాకులలోచనుం డగుచు దైన్యం బొందునన్నం గనుం
గొని సౌమిత్రి మహాభుజంగముగతిం గ్రోధోగ్రనిశ్వాసము
ల్దనరం గంపముతోడ ని ట్లనియె నేలం గూల్చెద వీని నే
విను మీతుచ్చుఁడు నీకు నెంత తలఁపన్ వీరోత్తమగ్రామణీ.

22


తే.

నాఁడు భరతుపైఁ బుట్టిన వేఁడికోప, మగముపై వజ్రి వజ్రంబు నిగుడఁజేయు
నట్లు నేఁడు పుచ్చెద నిద్దురాత్ముమీఁదఁ, దఱుచుకీలాలధారలు ధరణిఁ దొరఁగ.

23


చ.

కనలుచు రుక్మపుంఖవిశిఖంబులు నే డిట వానివక్ష మే
సిన నవి యుచ్చి పాఱి తదసృక్పరిషిక్తము లై వెలింగె వాఁ
డును వడి వైచె నార్చుచుఁ గడుం బెనుమంటలు మింట నెక్కొనం
గనదురువిస్ఫులింగములు గ్రక్కు మహాశనిఁ బోలుశూలమున్.

24


తే.

అదియు సౌమిత్రి కభిముఖం బగుచు నిగుడఁ
గనలి రాముఁడు దాని ముత్తునియలుగను
రెండుబాణము లెడ నడరించి యొక్క
కడిఁదివాలమ్ము వానివక్షమున గ్రుచ్చె.

25


వ.

మఱియును.

26


శా.

సక్రోధుం డయి రాముఁ డప్పుడు భుజాసంరంభ మొప్పార వ
జ్రక్రూరాస్త్రము లైదు శీఘ్రము మెయిన్ సంధించి నానామను
ష్యక్రవ్యాదు విరాధు నేయుటయు వక్షం బుద్ధతిం గాఁడి ని
ర్వక్రక్రీడఁ బగిల్చి యుచ్చి చనినన్ వాఁ డంతఁ బో కుద్ధతిన్.

27


వ.

జానకి డించి.

28


మ.

కదియం బాఱి నృపాలసూనులభుజాగర్వంబు గైకోక బ
ల్లిదుఁ డై డగ్గఱి యుగ్రరోషమున దోర్లీలాసముల్లాసి యై
పొదువం బట్టి వహించె మూఁపుల మహాభూమీధ్రశృంగంబులం
దుదయాదిత్యుఁడు నిందుఁడున్ వెలుఁగున ట్లొప్పారి రయ్యిద్దఱున్.

29


ఉ.

అత్తఱి మిన్ను ముట్టినమహాసురుమూఁపులు గ్రుంగ లావుమై
నొత్తిన వాఁడు నొచ్చియు మహోద్ధతితో నతిఘోరమూర్తి యై
యెత్తుకపోవఁగా నృపతి యేఁగఁగ ని మ్మెట కేఁగెనేని వీఁ

డెత్తెరు వేఁగె నత్తెరువ యిష్టము పో మన కంచు నుండఁగన్.

30


క.

కనుఁగొని జానకి దానవు, ఘనబలమునఁ జిక్కి రనుచుఁ గాకుత్స్థునిఁ ద
మ్మునిఁ బనవి యధికశోకం, బున మూర్ఛిల్లుటయుఁ జూచి పొగు లొదవి వెసన్.

31


స్ర.

సంభూతక్రోధఘోరజ్వలనపరిగతస్వాంతు లై విస్ఫురత్సం
రంభం బేపార రామప్రభుఁడు ననుజుఁడున్ రాక్షసాధీశుబాహు
స్తంభంబుల్ ద్రుంచి ఖడ్గోద్గతరుచు లెసఁగన్ దాఁటి రవ్వైరి గూలెన్
శుంభద్దంభోళిధారాచ్యుతవిపులగురుక్షోణిభృత్పాతభాతిన్.

32


వ.

ఇవ్విధంబునం గూలియు ననేకజంతువులతోడం గూడ నచ్చేరువ భూరుహంబు
లును బొదలును జదియం బొరలునయ్యసురం బొలియింపమి కర్జంబు గా దని
కదిసి నిర్ఘాతపాతవజ్రప్రహారంబులంబోనిపిడికిళ్లను జానుకూర్పరఘాతంబులను
నొప్పించినం బ్రాణవ్యయసమయంబున వాఁడు తలయెత్తి రఘునందనుఁ గనుఁ
గొని పేరెలుంగున మీ రెవ్వ రెచ్చోటి కరుగుచున్నవారు నావుడు నన్నరేం
ద్రుం డేము సూర్యకులవరేణ్యుం డగుదశరధునితనయులము రామలక్ష్మణు లను
వార మని చెప్పి నీ వెవ్వండ విట్లు ఘోరాకారంబు గైకొని యీమహారణ్యం
బునం జరియింపఁ గారణం బేమి మా కెఱింగింపు మనిన నారాక్షనుం డి ట్లనియె.

33


క.

జననాథ యేను దుంబురుఁ, డనుగంధర్వుఁడను రంభ కనురక్తుఁడ నై
యెనసి తనుఁ గొలువ మఱచిన, ధనదుఁడు శపియించె నంతఁ దను విది యయ్యెన్.

34


మ.

పటుశాపాహతి యస్మదీశుఁడు భవద్బాణంబు ప్రాణంబు లొ
క్కొటఁ దూలించిననాఁడు గల్గు ననుచుం గోపోపశాంతిం బరి
స్ఫుటనాదంబునఁ బల్కినాఁ డది రఘుక్షోణీశ సిద్దించె నా
గ్రమ్మఱ దీనిమిత్తమున గంధర్వత్వముం బొందెదన్.

35


చ.

ఇచటికి సార్ధయోజనసమీపమునన్ శరభంగుఁ డున్నవాఁ
డచలతపోవిభూతి గలయమ్మునిముఖ్యుఁడు గారవించి మి
మ్ముచితవిధంబులం బ్రియము లొందఁగ జేయుఁ దదాశ్రమంబునం
బ్రచురకుతూహలంబు జనపాలతనూభవ మీకుఁ జేకుఱున్.

36


ఉ.

ఏను మదీయలోకమున కేఁగెద నింక నరేంద్రచంద్ర యీ
మే నధికప్రయత్నమున మేదిని నొక్కెడఁ బాఁతిపెట్టఁగా
నానతి యిమ్ము లక్ష్మణుని కంచుఁ గరంబులు మోడ్చి మ్రొక్కుచున్
ఫేనిలరక్తపూరములు పెల్లుగ ముక్కున నోరఁ గ్రక్కుచున్.

37


శా.

రక్షోదేహము వీడి తుంబురుఁడు పూర్వస్థానముం బొంద రా
మక్షోణీపతిపన్పునన్ వనమహీమధ్యంబునం దొక్కచోఁ
నిక్షేపించె వృకాదిసత్త్వములకు న్భేదింప రాకుండఁ ద
ద్రక్షాగాధకృతావటంబున సుమిత్రాపుత్రుఁ డగ్గాత్రమున్.

38

వ.

తదనంతరంబ రఘువరుండు జనకనందనం దేర్చి లక్ష్మణుం గనుంగొని.

39


చ.

ఇది కడుఘోర మైనవన మిక్కడ నక్కడఁ దాపసోత్తముల్
మెదలరు దుష్టరాక్షససకమీపము గావున నింక నిందు ని
ల్చెద మనరాదు తుంబురుఁడు సెప్పిన యాశరభంగునాశ్రమం
బది మనకున్ నివాస మగు నందుల నేఁడు వసింత మిమ్ములన్.

40


వ.

అని పలికి.

41


మ.

ధరణీపుత్రిఁ బ్రమోదపూరభరితాత్మం జేసి నానావిధా
ధ్వరసంగున్ శరభంగుఁ జూచుటకుఁ జిత్తం బుత్సవం బొంద భా
స్కరవంశాగ్రణి యేగి కాంచె నచటన్ జంభారి రంభాదిని
ర్జరనారీకరచామరోద్భవమరుత్సంచారలోలాలకున్.

42


సీ.

హరితవర్ణము లగునశ్వసహస్రంబు, పూనినవరదివ్యదయాన మొప్ప
నిరువదియేనువత్సరములప్రాయంబుఁ, గాయనిసురకోటి బలసి కొలువ
సాంద్రచంద్రాతపచ్ఛాయలఁ జల్లుచు, ధవళాతపత్రంబు దనరి మెఱయఁ
గనుఱెప్ప పెట్టని తనవేయికన్నులు, నెఱివిరిదమ్ముల నెరసు దెగడ
నమర నయ్యింద్రుఁ జేరంగ నరుగఁదలఁచు, రామునెన్నిక యెఱిఁగి సుత్రాముఁ డరిగె
నధికవనవాసపరిగతాయాసఖిన్ను, నిమ్మహాత్ముని నిటు చూడ నేల యనుచు.

43


తే.

అంత శరభంగుఁ జేరంగ నరిగి రామ, చంద్రుఁ డమ్మునిపుంగవుచరణములకుఁ
బ్రణతుఁడైన న్మునీంద్రుండు ప్రణుతితోడ, నర్చనము లీయఁ గైకొని యతనిఁ గొలిచి.

44

శరభంగమహామునిదర్శనము

వ.

ఉన్నయెడ నమ్మునీశ్వరుం డతనితో నిట్లను సురేశ్వరుండు దన్నుఁ బరమతపో
లబ్ధం బైనయుత్తమలోకంబునకుం దోడ్కొని పోవం జనుదెంచుటయు నేను
భవదీయాగమనం బెఱింగి నీకు నాతిథ్యం బొనరింపం దలంచి నిలిచితి నిఖిలలోక
పూజ్యుండ వగునిన్నుం బూజించుటకంటెఁ గర్తవ్యం బెయ్యది యెయ్యది గోరిన
మత్తపోబలంబునం గల్పించి నీకు సమర్పించెద ననుటయు రామచంద్రుండు.

45


క.

మునివర నీవు కరుణ ననుఁ, గనుఁగొనుటయ చాలు నింతకంటె శుభం బెం
దును గలదె మీయనుగ్రహ, మున సర్వము నాకు సులభముల యేప్రొద్దున్.

46


క.

ఇయ్యడవిలోన నిలువఁగ, నెయ్యెడ తగు మాకు నచ్చొ టెఱిఁగింపుఁడు నే
నయ్యెడన నిలిచి కొలిచెద, నెయ్యంబున నచటిమునుల నిచ్చలు ననినన్.

47


క.

ఘనపుణ్యుండు సుతీక్షణం, డనుముని యెఱిఁగించు మీకు నర్హం బగున
వ్వన మమ్మునియావాసం, బును నిన్నది దాఁటి యరుగఁ బొడగాన నగున్.

48


చ.

అని యెఱిఁగించి యయ్యనఘుఁ డగ్నిముఖంబున నింద్రువీటికిం
జనియె రఘూద్వహుండు నిటజాహ్నవి దాఁట నెదుర్కొనెం దపో
వనవనజాకరప్రకరవారిరుహోత్పలసౌరభావలీ

వనరుహవల్లరీకుసుమవాసితమందసుగంధవాయువుల్.

49


వ.

తత్సమయంబున.

50


సీ.

అక్కానఁ గలిగిన కయఖిలతపస్వులు, చనుదెంచి శ్రీరామచంద్రుఁ గాంచి
యమ్మహీపాలుండు ననుజుండు సీతయు, మ్రొక్కిన దీవించి ముద మెలర్ప
గొనియాడి యో రామ గుణధామ మమ్ము నీ, వరయంగవలదె యీయడవిలోనఁ
దాపసవర్యులఁ బాపాత్ము లగుదైత్యు, లుడుగక చంపఁగఁ దొడరి రనినఁ
జాల శోకించి యమ్మహీపాలుఁ డనియె, నెచట దైత్యులు మెలఁగెద రచటఁ గదిసి
పీఁచ మడఁగింతు మీ కెట్లుఁ బ్రియము సేయఁ, గనుటఁ బోలునె వే ఱొక్కపనియు మాకు.

51


క.

అని పలికిన మును లందఱు, ననుపమమోదమునఁ బొంది రమ్మాటలు మా
నినపిదప సీత రాముని, వినయంబునఁ జేరి యొరులు వినకుండంగన్.

52


క.

ఘోరముగ ని ట్లకారణ, వైరముఁ బూనంగఁ దగునె వసుధాధిప యీ
యారణ్యు లయినదనుజుల, తో రాయిడిఁ గొనుట మేలె దోర్గర్వమునన్.

53


క.

పగ యెట్టివారిమనములు, వగఁ బుట్టింపంగఁ జాలు వలవనివైరం
బగునే పూనఁగ నెందును, జగతీశ్వర హింస దలఁప సద్ధర్మంబే.

54


సీ.

మునిపతి యొక్కండు శ్రీ ముదమునఁ దప మర్థి, నాచరింపఁగ విఘ్న మాత్మలో
నూహించి సురపతిక యొకరాజరూపుఁడై, యడిదంబుఁ జేకొని యరిగి మ్రొక్కి
యిదె యేను బోయి వచ్చెద ఖడ్గ మందాఁక, నిది పట్టుఁ డని చేతి కిచ్చి చనియె
నతఁ డూరకుండక యయ్యసి జళిపించి, వేడ్కఁ దీఁగలు చెట్లు వ్రేయఁదొడఁగె
నంతకంతకుఁ దద్వ్యసనాతిశయతఁ, గ్రూరమతి జీవహింసావిహారలీలఁ
దిరిగి దుర్జయుఁడై పోయె నరవరేణ్య, వింటి నీకథ నొకవృద్ధవిప్రుచేత.

55


ఉ.

నీవు కృపావిధేయుఁడవు నిష్ఠ మెయిం దప మాచరింపఁగా
నీవనభూమి సొచ్చి యిటు లేటికిఁ గ్రూరత నీకు మున్ను దై
త్యావళి కీడు సేసెనె జనాధిప యన్న నతండు ప్రీతి న
ద్దేవిహితంబు భక్తియు నుతించి సతీ విను మేను జెప్పెదన్.

56


ఉ.

శిష్టహితంబు దుష్టజనశిక్షయుఁ జేయనిరాజు రాజె యు
త్కృష్టతపస్వికోట్లను వధించునిశాటులఁ జంపకుండినం
గష్టత రాదె నాకు గుణగణ్యవు ధర్మపథంబు నీకు న
స్పష్టమె యిట్టు లేల యనఁ బంకరుహాయత చారులోచనా.

57


క.

అని యెడఁబడఁ జెప్పి మహా, మునిసంఘముతో నుతీక్ష్ణమునిపాలికిఁ దా
జనపతి చని మ్రొక్కినఁ ద, ద్వినతికి దీవించి యతఁడు వికసితముఖుఁ డై.

58

ఉ.

ఎంతయుఁ బ్రీతితోఁ గదిసి యెత్తియుఁ గౌఁగిటఁ జేర్చి నిర్మల
[3]స్వాంతుని నమ్మహీవిభుని సంభ్రమ మొప్పఁగఁ బూజ సేయ న
త్యంతముదంబునన్ నిలిచి తద్దిన మమ్మునియింట విందు లై
రంతఁ బ్రభాత మైన మును లందఱుఁ గ్రందుగఁ జేరి రామునిన్.

59


ఉ.

రామ శమాభిరామ రఘురామ యశోధనకామ దోర్బలో
ద్దామ యనేకనామ నృపతారకసోమ సమగ్రశౌర్యసు
త్రామ పటుప్రతాపబలధామ వినిర్జితకామ సద్గుణ
స్తోమ తపోవనస్థలులఁ జూడఁగ ర మ్మిటు మాకు వింద వై.

60


క.

అని యొక్కొకదిన మొక్కొక, ముని తమతమనెలవులకుఁ బ్రమోదంబునఁ దో
డ్కొని చని సంభావింపఁగ, ననఘుఁడు చరియించె సతియు ననుజుఁడుఁ దానున్.

61


పరమతపస్వు లిమ్మెయిఁ దపఃఫలదాయకుఁ డైనయమ్మహీ
శ్వరుఁ గని యిట్లు సంతతము సంభ్రమముం దళుకొత్త నన్నరే
శ్వరుఁ గొని కూడి రవ్విభుఁడు సన్మునికోటుల నెల్లఁ గొల్చుచుం
దిరిగి యనేక దైత్యుల వధించుచుఁ బేర్మిఁ జరించె నెల్లెడన్.

62

మందకర్ణిమహాముని కథ

క.

ఇత్తెఱఁగునఁ దిరుగుచు రాజోత్తముఁ డొకచోటఁ గనియె యోజనదీర్ఘా
యత్తమగుకొలఁకుఁ గనుఁగొని, యత్తోయములందు వినియె నంచితరవముల్.

63


వ.

[4]మఱియును.

64


శా.

వీణానిక్వణనం బవార్యనినదాకవిస్పష్టభూషామణి
శ్రేణీమంజులశింజితంబును సుధారసిక్తోల్లసద్గానమున్
వేణుక్వాణముఁ దా నదృష్టజన మై వీతేరఁగా నారఘు
క్షోణీనాథుఁడు విస్మితుం డగుచుఁ దత్కోలాహలం బారయన్.

65

వ.

తదుపాంతతపోవనంబునకుం జని యందు ధర్మభృతుం డనుమునీంద్రునకు నమ
స్కరించి విహితసత్కారంబులు గైకొనుచు నమ్మునీంద్రుం గనుంగొని.

66


చ.

ఇది కడునద్భుతంబు జను లెవ్వరుఁ దోఁపరు తూర్యనాదముల్
ముదమున నంబుమధ్యమున మ్రోయుచు నుండుట కేమి కారణం
బది యెఱిఁగింపు నా కనుడు నమ్ముని యి ట్లను మందకర్ణి య
న్సదమలపుణ్యుఁ డొక్కమునిసత్తముఁ డిందుఁ దపోబలంబునన్.

67


క.

కుహరీకృతసలిలాంత, గృహమున నచ్చరలతోడఁ గ్రీడాపరతన్
విహరించుచుండు నీవిధి, మహిళాజనజనితవివిధమంజులరవముల్.

68


వ.

ఇ ట్లగుటకుం గారణంబు విను మిమ్మునీంద్రుండు వాయుభోజనుండును శిలాశ
యుండు నగుచుం బదివేలవత్సరంబు లుగ్రతపంబు సేయుచున్న నగ్నిదేవుం
డాదిగా నఖిలదేవతలును నీతపంబు మనయం దొకనిపదంబున కొదువుచున్న
యది వీని కేప్రత్యూహం బొనర్ప నగు ననుచు నేవు రచ్చరలం బనుప నచ్చెలువ
లేతెంచి మదనపరతంత్రునిం జేసినం దదీయాలాపవినోదంబు లనుభవించుచు
నిజనిర్మితం బగునీసరోవరంబున నున్నవాఁ డదిమొద లిదియును బంచాప్సరసం
బనుపేరం బరఁగుననుచు నమ్మందకర్ణివృత్తాంతం బెఱింగించిన సంతోషించుచుఁ
బదంపడి యాశ్రమాంతరంబులకుం జని చని.

69


శా.

మాసార్ధం బొకచో దినం బొకయెడం మాసద్వయం బొక్కచో
మాసం బొక్కెడ వత్సరార్ధ మొకచో మాసత్రయం బొక్కెడన్
మాసత్రిద్వయ మొక్కచో నొకయెడన్ మాసాష్టకం బొక్కచో
నాసల్ మీఱ వసించుచున్ రఘువరుం డయ్యైతపోభూములన్.

70


వ.

మఱియు నెడనెడం బరమతపం బాచరించుచు దయాళువు లగుమహామునుల
చరణారవిందంబులకు వందనం బొనర్చుచు వారలచేతం బురాతనపుణ్యపురుష
ప్రవర్తనకీర్తనకథావితానంబులు వినుచుఁ గ్రించు లగునక్తంచరులఁ ద్రుంచుచు
నుత్తుంగంబు లగుగిరిశృంగంబు లెక్కి విహరించుచుఁ జల్లఁదనంబు వెదచల్లుచుం
దొలంకుకొలంకులకు డిగ్గుచు నాతపభయసంహారంబు లగుగహ్వరంబులం బ్ర
వేశించుచు విశాలంబు లగునదీకూలంబుల విడియుచు మధుశీకరంబు లగుకమ
లాకరంబులం గేలి సలుపుచు ఖగమృగశరణ్యంబు లగునారణ్యంబులం జొచ్చుచు
మావృతాంతరిక్షంబు లగువృక్షంబులం జూచుచు నుత్ఫుల్లపల్లవమంజరీపుంజంబు

లగునికుంజంబుల నిలుచుచు నడవం జనఁ ద్రోవ యీక వీఁకమీఱం బెరిఁగినయీ
ఱంబులు దూఱిపోవుచుఁ బావనంబు లగుతపోవనంబుల నిద్రించుచు నతివ్యాళం
బు లగుశుండాలంబులం దోలుచు నసహ్యంబు లగుసింహంబులం దెరల్చుచు నుగ్ర
ప్రసభంబు లగుశరభంబుల నదల్చుచుఁ బ్రచండంబు లగుభేరుండంబులం బఱ
పుచు నొక్కొక్కయెడఁ గఠినంబు లగుముదురువెదు ళ్లొండొంటిం గ్రిక్కిఱిసి
బె ట్టొరసి పెట్లి పొగ లెగసి పేర్చిన కార్చిచ్చులు రాజద్ద్రోణంబు లగువరుణబా
ణంబులు ప్రయోగించి యార్చి యచ్చేరువఁ దపస్వులభయంబులం దొలంగించి
ప్రియంబు సేయుచుఁ క్రొవ్వు గలమృగమాంసంబుల నిత్యంబు నాహారకృత్యం
బులం దీర్చుచు నతిమనోహరస్థలంబులం బర్ణగృహంబులం గట్టి వసియించుచు
ముగ్ధు లగు చెంచులం బొడగని యనురూపసల్లాపంబులు సేయుచుఁ బెరలు పగిల్చి
వారలకుం దేనియ లాన నిచ్చుచు నతిదూరశాఖాశిఖలం బొల్చు పరిపక్వఫలగు
చ్ఛంబులం బడనేసి మునికుమారులకుం బెట్టుచు నానావిధవిహారంబులు నానా
విధవిశేషంబులు సూచుచు వనవాసనియమవ్రతవత్సరంబులలోనం బదియేండ్లు
వర్తించి వెండియు సుతీక్ష్ణమునిపాలికిం బోయి.

71


చ.

అం దొకకొన్నివాసరము లమ్మునిఁ గొల్చుచు నుండి రుల్లస
చ్చందనపారిజాతఘనకసారకుమారకదంబనింబమా
కందతమాలతాలతిలకక్రముకార్జునభూర్జతిందుక
స్యందనసర్జఘూర్జరకసాలవిశాలవనాళిఁ జూచుచున్.

72


క.

ఉన్నయెడ రామచంద్రుఁడు, విన్నప మొనరించె నుచితవినయవచనసం
పన్నతమెయి నొకనాఁడు ప్ర, సన్నుం డగునమ్మునీంద్రచంద్రునితోడన్.

73


చ.

కమలభవప్రభావుని నగస్త్యమహామునిఁ జూడఁ బూని చి
త్తము గడువేడ్క నూనెడు నంతండు తపం బొనరించు నెందు సం
గోపమివర యెంతదవ్వు గల దానతి యిం డెఱుఁగంగ నన్న భూ
రమణునితోడ నమ్ముని కరంబు ప్రియం బెసలార నిట్లనున్.

74


చ.

సులభవివేక కుంభజునిఁ జూడఁగ ని న్నట పుచ్చువాఁడ నై
తలఁపఁగఁ గోరి తీవు గురుధర్మవినిర్మలు నుల్లసత్తపో
బలరిపుహేతిభగ్నపటుపాతకపర్వతు నమ్మునీశ్వరుం
దలఁచిన విన్నఁ బేర్కొనినఁ దత్క్షణమాత్రన పాయుఁ బాపముల్.

75


సీ.

మేర చెప్పఁగ రాని వారాశిజలములు, వడిఁ గ్రోలి యుదరాగ్ని నడఁగఁజేసెఁ
దపను మార్కొని మిన్ను దాఁకినవింధ్యభూ, ధ్రముఁ గాల నేలమట్టముగఁ ద్రొక్కె
నాకాధిపతి యైన నహుషునిఁదేజంబు, గుదిచి పాముగ భూమిఁ గూలవైచె
మునులమేనులు వచ్చి తినుక్రూరదైత్యు ను, క్కఱ మ్రింగి వాతాపి నఱుగఁద్రేఁచె
నక్కజంబుగ దక్కినదిక్కునందు, దివిజులకు నెల్లఁ దుల యయి తివిరి నిలిచె

నద్భుతావహ మగునమ్మహాత్ముమహిమఁ, బూని వర్ణింప గోచరమే నరేంద్ర.

76


చ.

[5]అని కొనియాడి యివ్వనమునం దనిశంబు నిశాచరుల్ తపో
ధనులకుఁ గీడు సేయుదురు తద్వధ మీ వొనరించి మమ్ముఁ జే
కొను మనుచుం గఠోరతరఘోరశరోజ్జ్వలరత్నతూణముల్
ఘనతరచాపమున్ నిశితఖడ్గయుగంబును నిచ్చు వేడుకన్.

77


తే.

అనుచు వినిపించి కుంభజునాశ్రమంబు, తెరువు సంజ్ఞాభియుక్తి మైఁ దెలియఁ జెప్పి
వీడుకొల్పినఁ గదలి భూవిభుఁడు నాల్గు, యోజనము లేఁగి ముందట నొక్కచోట.

78


వ.

[6]రామచంద్రుండు సౌమిత్రిం గనుంగొని యి ట్లనియె.

79

అగస్త్యమహామునిమాహాత్మ్యాభివర్ణనము

సీ.

ఇవ్వనంబునఁ దొల్లి యిల్వలవాతాపు, లనునుగ్రరాక్షసు లధికపాపు
లుండు భూసురహింస లొనరింతు రెట్లన్నఁ, బితృకార్య మొక్కటి పేరు సెప్పి
యగ్రజుం డిల్వలుం డనుజుని వాతాపిఁ, గపటమేషాకృతిఁ గైకొనంగఁ
బంచి హింసించి తత్పలల మామంత్రిత, ద్విజులకు వడ్డించి తృప్తులైన
పిదప భుక్తశేషమునకుఁ బిల్చుకరణి, నింక వాతాపి రమ్మని యిట్లు పిలువ
వాఁడు నవ్విప్రజఠరముల్ వ్రచ్చికొనుచు, నిలకు నేతెంచుఁ జింబోతునెలుఁగు సెలఁగ.

80


వ.

ఇత్తెఱంగున ధరామరోత్తముల ననేకుల వధియించుచుఁ డత్పిశితభక్షణంబు సే
యుచు నుండ నప్పాపాత్ములదుశ్చరిత్రంబులు విని యగస్త్యుం కొక్కనాఁ డయ్యా
శ్రమంబున కేతెంచి కపటక్షణంబు గైకొని తాదృశం బగు భోజనవిదానంబు
ను జలిపి హస్తావసేచనానంతరంబునఁ దొల్లింటివిధంబునం దమ్మునిం బిల్వ నిల్వ
లుం గనుంగొని నవ్వుచుం గడుపు సఱిమికొనుచు జీర్ణుం డయ్యె వాతాపి య
నుచుం బలికి కృతకవిప్రుం డగునారాక్షసుం గ్రోధనిరీక్షణంబున భస్మీభూతుం
గావించె ని ట్లన్నిశాచరయుగళంబును బొలియించినయమ్మహాపురుషుననుజుం
డిమ్మునీంద్రుండు గావున నిమ్మహాత్మునిదర్శనంబు మనకు నభ్యుదయహేతు వను

చు లక్ష్మణానుచరుండై చనుదెంచి కుంభసంభవానుజునకుం బ్రణమిల్లి తదాచ
రితసత్కృతుం డగుచు నారాత్రి యచ్చట నిల్చి మఱునాడు ప్రయాణోచితసమ
యంబున.

81


తే.

ఆమ్మునీంద్రు వీడ్కొని యగస్త్యాశ్రమంబు
గదియ నేతేర రాముని నెదురుకొనియెఁ
గుసుమపరిమళోపాయన మొసఁగి హోమ
గంధబంధురుఁ డగుచున్నగంధవహుఁడు.

82


మ.

ధరణీనాయకుఁ డప్పు డి ట్లను సుమిత్రాపుత్రుతో నిమ్మునీ
శ్వరు సామర్థ్యము సెప్పెదన్ విను విన న్వన్మండలంబుం దనుం
దిరుగంజేయుదు నంచు మేరుగిరితో ద్వేషించి వింధ్యం బవం
ధ్యరయం బారఁగ మింటికిం బెరిఁగి యయ్యాదిత్యుతే రాఁగినన్.

83


క.

అమరహితంబుగ నీసం, యమివరుఁ డద్దెసకు వచ్చు నప్పుడు పాతా
ళమునకు దిగఁబడ నయ్యచ, లముఁ జరణాంగుష్ఠమున నలఘుగతి నదిమెన్.

84


క.

అదిమొదలు వింధ్య మిమ్ముని, పదశిక్షం బెరుఁగ వెఱచుఁ బగ లే కిచ్చో
మదవద్గజములు సింగపుఁ, గొదమలు హరిణములు పులులు గూడి చరించున్.

85


క.

సురయక్షసిద్ధవిద్యా, ధరగంధర్వాదిదివ్యతనువులు మనుజుల్
ధరియించి విమానంబుల, నరుగుదు రిట దపము సలిపి యమరావతికిన్.

86


క.

సురకిన్నరవిద్యాధర, గరుడోరగసిద్ధసాధ్యగంధర్వాదుల్
పరమప్రీతిం జనుదెం, తురు పొరిఁబోరి నిమ్మునీంద్రధూర్జటిఁ గొలువన్.

87


క.

వనవాసశేష మే ని, వ్వనమున నీయనఘుపాల వర్తించెద నిం
పెనయ మనరాక లక్ష్మణ, మునిపతి కెఱిఁగింప నరుగు ముందట ననినన్.

88


వ.

అరిగి తదాశ్రమద్వారప్రదేశంబున నిల్చి లక్ష్మణుం డగస్త్యశిష్యు నొక్కనిం
గాంచి నిజాగమనాభిధానంబులు సెప్పి మునీంద్రునకు విజ్ఞాపనంబు సేయు మనవు
డు నక్కుమారుం డగ్నిశరణంబునకుఁ బోయి ముకుళితకరకమలయుగళుం డగు
చు నమ్మహాత్మున కి ట్లనియె.

89


క.

మునిజనవల్లభ దశరథ, జననాయకసుతుఁడు రామచంద్రుఁడు మిమ్ముం
గనుఁగొనఁ జనుదెంచెఁ దపో, పని కాద్వారమున నున్నవాఁ డయ్యనఘున్.

90


వ.

కొలిచి సీతాలక్ష్మణు లేతెంచినా రని విన్నపంబు సేయుటయుఁ దన కచట నిలు

వ నేటి కరుగుదెంచుఁ గా కనుచుఁ బలుక నమ్మునిశిష్యుండును మగిడి వచ్చి సౌ
మిత్రిం బురస్కరించుకొని చనుదెంచురామచంద్రం గనుంగొని.

91


క.

జననాయక మిమ్ముం దో, కొని ర మ్మని మమ్ముఁ బనిచెఁ గుంభజుఁ డింకం
జనుదెం డనుడుఁ దదాశ్రమ, వనముఁ బ్రవేశించి యద్దివాకరతేజున్.

92


క.

కని యప్పుడు కౌసల్యా, తనయుఁడు సౌమిత్రితోడఁ దత్సామర్థ్యం
బనురక్తిం గొనియాడుచుఁ, జని యాసంయమివరేణ్యుచరణంబులకున్.

93


వ.

నమస్కారంబు సేయుటయు నమ్మహాభాగుండు నాశీర్వదించుచు నక్కుమారుల
నెత్తి కౌఁగిటం జేర్చి మూర్ధఘ్రాణంబు నొనరించి పురోభాగంబునం బ్రణత
యైనసీతాదేవి నభినందించి యమ్మువ్వుర నుచితప్రకారంబులఁ గూర్చుండ నియో
గించి కుశలం బడిగి ముదితహృదయుం డగుచు నిజశిష్యునిం గనుంగొని.

94


క.

సురవరులకంటెఁ బూజ్యుం, డరయఁగ నీపురుషవృషభుఁ డ ట్లగుట గుణో
తరులకు నీహవి వేల్చిన, చరుశేషముఁ దెచ్చి పెట్టు సంభావనతోన్.

95


క.

విను మతిథిగృహంబునకుం జనుదెంచినఁ దనకు దొరకు శక్తిం బూజిం
పనిదుర్మతి నిజమాంసా, శనుఁ డగుఁ బరలోకమున నసత్సాక్షిగతిన్.

96


వ.

అని పలికి నియమింప నమ్మునికుమారుండు నవ్విధం బాచరించెఁ తదనంతరంబ
వానప్రస్థవిధిప్రకారంబున నమ్మునిపుంగవుడు పూజించి.

97


చ.

కలశభవుండు రామునకుఁ గౌతుక మొప్పఁగ దివ్య మైనయు
జ్జ్వలఘనఖడ్గయుగ్మమును వైష్ణవ మైనశరాసనంబుఁ బెం
పలరునమోఘసాయకము లక్షయతూణయుగంబు నిచ్చి నీ
వలసినవానిఁ గోరు మనివారణ నిత్తు నరేంద్ర నావుడున్.

98


క.

అన్నియు మీకృపఁ గడుసం, పన్నంబుల మాకు నునికిపట్టుగ నిట మీ
రెన్నెల వానతియిచ్చెద, రన్నెలవున నిలుతు మేను ననుజుఁడు సతియున్.

99


క.

అనుటయు నిచటికి దక్షిణ, మునఁ బంచవటం బనంగ మోదావహ మై
తనరుచు గౌతమి చేరువ, వన మొ ప్పగు నందు నిలువు వసుధాధీశా.

100

జటాయుదర్శనము

క.

అని పలికినఁ దగ వీడ్కొని, జనపాలుఁడు లక్ష్మణుండు జనకాత్మజయుం
జనఁ జన నొక్కెడ ముందటఁ, గని రద్భుతమూర్తి యైనకఖగపతి నొకనిన్.

101


సీ.

బలితంపుఱెక్కలు గలిగినమైనాక, కుధరంబు మీఱిన గొప్పమేను
గండభేరుండాదిఖగములఁ గబళించి, వ్రక్కలు గావించువలుఁదముక్కు
నుదయార్కబింబంబు నురుదీప్తిఁ గప్పెడు, ఖరదృష్టిఁ బెంపారుకన్నుఁగవయు

వజ్రాయుధంబుక్రొవ్వాఁడిమి మెచ్చని, ఖరనఖంబుల నొప్పుచరణయుగముఁ
దనదుసత్త్వంబు దెలుపంగఁ దనరునట్టి, యమ్మహాఖగము నృపాలు నంతఁ జూచి
యేను మీతండ్రిసఖుఁడ రాజేంద్రచంద్ర, యరుణపుత్రుండ నన్ను జటాయు వండ్రు.

102


క.

అనుడు నెదుర్కొని రాఘవుఁ డనుజన్ముఁడుఁ దాను నుచిత మగుమాటలఁ బెం
పునఁ బక్షినాథు నెయ్యము, వినయముఁ గొనియాడె నతఁడు వెండియు భక్తిన్.

103


చ.

వితతగిరీంద్రశృంగముల వేడుకఁ జూడఁగఁ గోరినప్పు డ
ద్భుతముగ మిమ్ము మోచికొని పోయెద జానకికాపు పెట్టినన్
సతతముఁ గాచియుం డెద వెసం జని చేసెద నెంతదవ్వునం
దతిశయ మైనయట్టిపని యైనను బొచ్చెము గాదు రాఘవా.

104


క.

అఱువదివేలేం డ్లిద్ధర, మెఱయంగా నేలినట్టి మీతండ్రికి నే
నఱ లేనిసఖుఁడ నెమ్మెయి, మఱతునె యరాజుసుతుల మాన్యుల మిమ్మున్.

105


తే.

అరిది యగుమేలు వినఁగఁ దా ననుభవింప, నేను వెలి గాఁగ నొల్లనివానిఁ గీర్తి
ధన్యు నాసఖు దశరథుఁ దలఁపఁగంటిఁ, బరమపుణ్యుల మిముఁ జూడఁ బడయఁగంటి.

106


వ.

[7]అనవుడు.

107


క.

క్షితిపతి విహంగపతి నం, చితమతిఁ బూజించి తమకుఁ జేసినయాస
త్కృతిఁ గైకొని తజ్జననం, బతికౌతుకబుద్ధి నడుగ నతఁ డి ట్లనియెన్.

108


క.

విదితంబుగ విను మెఱిఁగిం, చెద మజ్జననక్రమంబు సృష్టికి మొకలం
బదునెనమండ్రు ప్రజాపతు, లుదయించిరి వరుస నలఘు లుజ్జ్వలతేజుల్.

109


వ.

వా రెవ్వ రంటేనిఁ గర్దముండు విశ్రీతుండును శేషుండును సంశ్రయుండును
బహుపుత్రుండును స్థాణుండును మరీచియు నత్రియుఁ గ్రతువును మహాబలుం
డును బులస్త్యుండును బులహుండును బ్రచేతసుండును దక్షుండు నాంగీరసం
డును వివస్వంతుండు నరిష్టనేమియుఁ గశ్యపుండు ననువార లందు దక్షప్రజాపతి
కఱువండ్రు దుహితలు జన్మించి రక్కన్నియలందుఁ బదుమువ్వురను గశ్యపుండు
పరిగ్రహించె నున్నవారల ధర్ముండును సోముండు ననుమహాపురుషులు వరి
యించి రక్కశ్యపపత్ను లగువార లదితియు దితియు దనువును గాళియు నరిష్ట
యుఁ గషయు సురసయు సురభియు వినతయుఁ గద్రువయు వ్యాఘ్రయుఁ గ్రోధ
వశయుఁ దామ్రయు ననువారలందు నదితికి నాదిత్యులును రుద్రులును దితికి
దైత్యులును దనువునకు నశ్వగ్రీవుండును గాళికి నరకకాలకులును గంధర్వులు
నప్సరసలు నరిష్టుకు సిద్ధులును గషకు రక్షుండును ననం బుత్రు లుదయించిరి
సురభికి రోహిణియు గంధర్వియుఁ గ్రోధవశకు మృగియు మృగమందయు హరి
యు భద్రయు మనువును భూతయుఁ గపియు దంష్ట్రయు శ్వేతయు సురసకు
నిరయు వనస్పతియు వనస్పతికి వృక్షలతావీరున్మాతలు మువ్వురును దామ్రకు శ్యే

నియు భాసయుం గ్రౌంచియు ధృతరాష్ట్రయు శుకియు ననుకూఁతులుం బుట్టిరి
కద్రువకు నాగసహస్రంబులును సురసకు నేకశిరంబు లగుసర్పంబులు నూఱు
నుద్భవించె వినతకు వరుణుండును గరుడుండు ననువిహంగమప్రముఖు లుద
యించి రందు.

110


క.

ఏనును సంపాతియునుం, గా నరుణున కుదితుల మగుఖగముల మనుజుం
డైనజటాయు వనెడువాఁ, డేనును బుత్రులము శ్యేని కే మిరువురమున్.

111


ఉ.

బాంధవ మొప్ప నిట్లు తగఁ బల్కినపక్షిపతిం బ్రియోక్తిసం
బంధ మెలర్ప వీడుకొని బాహుబలోద్భటశక్తిశౌర్యగ
ర్వాంధవిరోధిభూధ్రభిదురాయుధుఁ డావిభుఁ డేఁగె సల్ల తా
గ్రంథలకుంజపుంజములు గల్గిన పంచవటంబుచెంతకున్.

112


క.

చని యచ్చట ననుజన్మునిఁ, గనుఁగొని యొకపర్ణశాల గావింపు మనా
మన మిచ్చట నిటమీఁదటి, వనవాసదినంబు లుండవలయుం బ్రీతిన్.

113


మ.

అనిన వాస్తువిధిజ్ఞతం బరశుదాత్రాదిద్రుమచ్ఛేదసా
ధనముల్ గైకొని భూరిపర్ణతృణసంతానంబు ఛేదించి చ
య్యన సంధించి యమర్చి కట్టినతదీయాగార మున్నంతఁ జూ
చి నరేంద్రుండు నిజానుజుం బొగడి చేకూర్చెం గౌఁగిటం జిక్కఁగన్.

114


క.

ఆమందిరంబుచెంతను, రామానుజుఁ డొక్కయిల్లు రచియించి నయ
శ్రీమహితుం డై రేపగ, లేమఱక మహీశుఁ గొల్చి యెంతయు భక్తిన్.

115


చ.

బహుమృగమాంసఖండములు పక్వఫలంబులు తేనియల్ రఘూ
ద్వహుసతి గోరుభూరుహలతాకుసుమాదులుఁ దెచ్చి యిచ్చుచున్
మిహిరసమానతేజుఁడు సుమిత్రతనూజుఁడు గొల్వఁగా ముదా
వహముల యయ్యెఁ వత్సమయవాసరముల్ గురువంశభర్తకున్.

116


వ.

[8]అంత నొక్కనాఁడు.

117

లక్ష్మణుఁడు జంబుకుమారునిం జంపుట

సీ.

రామభూనాథుండు రామానుజునిఁ గని, యెంతయుఁ బ్రేమతో నిట్టు లనియె
నివ్వనంబున కేఁగి యింతికి ఫలములు, వేగ దెమ్మన్న నవ్విభునిపాద
పద్మంబులకు మ్రొక్కి భక్తిమై లక్ష్మణుం, డవ్వని కేఁగి విహారలీలఁ
గొమరొప్ప ఫలములు గోయుచునుండ నా, పొంత విద్యుజ్జిహ్వపుత్రుఁ డైన
ఘోరదైత్యుండు జంబుకుమారుఁ డుగ్ర, తపము సలుపంగ నెఱిఁగి సుత్రాముఁ డాది
సురలు పుత్తెంచి రపుడు భాసురకఠోర, చంద్రహాసంబు నది వాఁడు సరకుగొనక.

118

క.

ఉన్నయెడ లక్ష్మణుం డది, క్రన్ననఁ బరికించి కేలఁ గైకొని యట య
త్యున్నతతరువులు వేయఁ బ్ర, సన్నానను లగుచు మౌనిసత్తము లెలమిన్.

119


తే.

ఓ మహారాజపుత్ర నీ కుచిత మగునె, పూచి కాచి తనర్చిన భూరుహముల
వ్రేయఁ బూనెదు వలవ దవ్వెదురుపొదను, నొక్కవేటున నఱకు మత్యుగ్రగతిని.

120


వ.

అని మునీంద్రులు సెప్పిన సుమిత్రానందనుండు తనకరంబున నున్న నూతనచం
గ్రహాసంబు జళిపించి ప్రచండబాహుదండం బెత్తి యవ్వెదురుపొద నొక్కవ్రేటు
నం బడ నఱకిన నచ్చటిమునీంద్రులు సంతసంబునం గొనియాడి రందుఁ దెగిన
రక్షోవీరుని వీక్షించి లక్ష్మణుండు మహాతాపసోత్తముం జంపి పాపంబుఁ గట్టికొం
టి నింక భూపాలున కెఱింగింపవలయు ననుచు భయంబున ఫలంబులు గొంచు
నత్యంతచింతాక్రాంతస్వాంతుం డై యమ్మహీకాంతుపాలికిం బోయి తచ్చరణార
విందంబులకు వందనం బాచరించిన నక్కుమారు నెత్తి కౌఁగిటం జేర్చి నీ వతి
ఖిన్నుండ వై విన్నంబోయి యున్నవిధం బే మన్న నయ్యన్నకు నున్నతెఱం గె
ఱుంగం జెప్పిన రామచంద్రుండు కటకటంబడి యిమ్మహాఘోరపాతకం బేరూ
పంబునం బాయునో యని విచారించుచున్న సమయంబున.

121


తే.

మునులు రఘురాముఁ గానవచ్చిన విభుండు
నమ్మహాత్ముల కెదు రేఁగి యధికభక్తిఁ
బుడమిఁ జాఁగిలి మ్రొక్కి సంపుటకరాబ్జుఁ
డగుచు వినయంబు దోఁప ని ట్లనియెఁ బ్రీతి.

122


వ.

మహాత్ములారా మాసౌమిత్రి యెఱుంగమి నొక్కమునివరుం జంపె మీయనుగ్ర
హంబున నిమ్మహాపాపం బితనిం బొందకుండునట్లు చేసి రక్షించి యతనిప్రాణం
బు లొసంగుం డని ప్రార్థించిన వారలు మందస్మితవదనారవిందు లై రఘునంద
నున కి ట్లనిరి.

123


తే.

మిహిరకులనాథ యివుడు సౌమిత్రిచేతఁ
ద్రుంగినాతఁడు తాపసేంద్రుండు గాఁడు
దనుజవరవీరుఁ డతనివృత్తాంత మెల్ల
నెఱుఁగఁ జెప్పెద మని రాఘ వేంద్రుఁ జూచి.

124


వ.

విద్యుజ్జిహ్వనందనుం డగుజంబుకుమారుండు తండ్రిపగ తీర్చుటకు నై యాఖండ
లుం గూర్చి యఖండితతపంబు సలుపుచున్న నత్తపంబునకు మెచ్చి యింద్రాదు
లు సాంద్రద్యుతిభాసురం బగుచంద్రహాసం బంపిన నవ్వీరుండు మదీయతపోబ
లంబున కిది యేటికిం బనిచి రని యొల్లకున్న నల్లన గగనంబున మెలంగుచున్న
దాని నీరాజనందనుఁ డందికొని జళిపించి ఫలవృక్షంబుల వ్రేయ సమకట్టిన నేము
వల దని యవ్వెదురుగుమి సూపినం బడవేసె నావ్రేటున నారాక్షనుండు దెగిన
లక్ష్మణకుమారుండు చూచి యాకులితమానసుం డై మీకడ కేఁగుదెంచినవాఁ

డతనియందు దోషంబు లేదు మహాపుణ్యంబు సంభవించె మీ రింక వగవకుండుం
డని యారాఘవుల నాశీర్వదించి యమ్మునులు నిజాశ్రమస్థానంబులు కేఁగి సుఖం
బున్నంత.

125

శ్రీరామలక్ష్మణులకడకు శూర్పణఖ వచ్చుట

క.

బోనంబు దెచ్చి యట నిజ, సూనుఁడు దెగి యున్నఁ జూచి శూర్పణఖ వివ
ర్ణానన యై నేలం బడి, హా నందన యనుచు దుఃఖఖితాత్మక యగుచున్.

126


క.

మౌనవ్రతుఁ డై పరమ, ధ్యానంబునఁ దపము సలిపి తండ్రివిరోధిం
బూని జయింపఁదలంచిన, నానందనుఁ డి ట్లగుట మనం బెటు లోర్చున్.

127


వ.

అని చింతించి.

128


చ.

కనదురువిస్ఫులింగములు కన్నుల రాలఁగఁ జుప్పనాతి య
మ్మునిజను లున్నచోటికి సమున్నతి నేఁగియు నమ్మహాత్ములం
గనుఁగొని యున్నరూపు నెఱుఁగన్ వినిపింపుఁడు లేకయున్న మి
మ్మును బరిమార్తు నన్న మునిముఖ్యులు తల్లడ మంది రందఱున్.

129


తే.

అప్పు డొక్కమహాత్ముఁ డి ట్లనియె దానితోడ నో కాంత యిచటి కస్తోకభుజబ
లాఢ్యుఁ డొకరాజు వచ్చి నీయాత్మభవునిఁ, దునిమె నెఱుఁగ మతండు వోయినపథంబు.


క.

ఇక్కరణిఁ జెప్పిన విని, వెక్కసపడి వనమునందు విహరింపఁగ నం
దొక్కదినంబున నక్కడ, నక్కరుణాకరుఁడు సీత యనుజన్ముండున్.

131


వ.

విలాసంబునఁ బర్ణశాలయందు వసియించుచు నమ్మహీకళత్రుండు జనకరాజపు
త్రితో సరససల్లాపంబు లాడుచున్నంత.

132


ఉ.

అత్తఱిఁ బంక్తికంఠుచెలియల్ కఠినాత్మక చుప్పనాక దా
నెత్తినవేడ్క నెచ్చటికి నేనియు [9]నాఁ డటు వోయి పోయి రా
జోత్తము రాముఁ జూచె నసితోత్సలవర్లు వినీలకుంతలుం
జితజసన్నిభున్ నృపతిసింహు మనోహరదీర్ఘలోచనున్.

133


క.

కనుఁగొని యెంతయు మెచ్చుచుఁ, దనివి సనక మఱియుఁ జూచి తద్దయు రాగం
బునఁ దలయూఁచుచు నెద న, య్యనఘునియొప్పునకు [10]విస్మితాత్మిక యగుచున్.

134


సీ.

రేకు లన్నియు విచ్చి రేయెండ జిగి నిండి, కర మొప్పు తెల్లదామరలకంటె
నఱ లేని నెఱదీప్తి మెఱుఁ గెక్కి సరిమింటఁ, జరియించుసంపూర్ణచంద్రుకంటె
నునుఁదీఁగజిగి దోఁగి నునుపారి నిగ్గారి, తనరుదిక్కరులహస్తములకంటె
నిగిడి చేరువ లెల్ల నీలోత్పలద్యుతుల్, పచరించుహరినీలరుచులకంటె
నితనికన్ను లొప్పు నీరాజుమో మొప్పు, నితనికరము లొప్పు నితనిమేని
కాంతి యొప్పు ననుచుఁ గడువేడ్క నన్నిశా, చరిణి చూచె రామచంద్రుఁ దవిలి.

135


ఆ.

చూచి చేర నరిగి సురుచిరాకార నీ, పేరుఁ గులముఁ జెప్పు ప్రియము పుట్టె

నాకు వినఁగ ననినఁ గాకుత్స్థుఁ డున్నరూ, పెఱుఁగఁజెప్పె నెల్లతెఱఁగుఁ దెలియ.

136


క.

విని నీవు నిన్నుఁ జెప్పితి, నను విను మెఱిఁగింతు ననుచు నరవరుతో న
ద్దనుజాంగన యి ట్లనుఁ దన, కనుఁగొనలం గలికిచూపుగమి పొలుపారన్.

137


చ.

బలిమి జగత్త్రయంబుఁ బలుబాములఁ బెట్టుచు దేవతావళుల్
పెలుకుఱఁ బంక్తికంఠుఁ డనుపేరఁ దనర్చిన దైత్యభర్తకుం
జెలియలఁ బేరు శూర్పణఖ చెప్పెడి దేమి మహీశ నీకు నేఁ
గలసితి నిన్నుఁ దక్క నొరుఁ గైకొన నీవును బాయు మీసతిన్.

138


తే.

తనరు నిచ్చేరువన జనస్థాన[11]మున ఖ, రాసురుఁడు మత్సిహోదరుఁ డధికసేన
తోడ నున్నాఁడు నను నీవు గూడియున్న, నతఁడు నినుఁ గాచు వేడ్క వియ్యంబ వనుచు.

139


క.

కొఱమాలినదుర్లక్షణ, కొఱ గా దిది నీకు నాలె గుత్తంబుగ ని
జ్జఱభి వధించెద నీతో, నఱ లేనిమనోజకేళి నలరెద నెలమిన్.

140


చ.

ఇది ననుఁ బోలునే వెడఁగ యే నినుఁ బొందినఁ బెక్కురూపులన్
మదనకళాకలాపము లమందగతిన్ వెలయింతు దీని మ్రిం
గెద నిటు సూడుమీ పిడపఁ గేళికిఁ జొచ్చినయప్డు మత్సుగ
ద్గదమధురోక్తులున్ హితరతంబును బంధవినోదగీతులున్.

141


క.

మన మిచ్చట నెచ్చో నై, నను గేళిం దేలవలయు నరవర తమ్ముం
డని చూడకు వీనిం బొరి, గొనియెద నేకాంత మొ ప్పగుం జతురతకున్.

142


చ.

అన విని యల్ల నవ్వి వసుధాధిపుఁ డద్దురితాత్మఁ జూచి యి
వ్వనితకు నేను గూర్తుఁ జెలువా సవతా లన నోర్తు గల్గునీ
మను విది యేల లక్ష్మణకుమారు వినిర్జితమారుఁ బొందు వే
చను సుఖ మందు నీకుఁ దగుజాణఁ డతం డని చూపి [12]వెండియున్.

143


క.

వరవర్ణిని యగునీకుం, బురుషుఁడు బలుదిట్ట యతనిఁ బొందుము లీలన్
సురధరణీధరము దివా,కరదీధితి పొందునట్టికరణిం దరుణీ.

144


వ.

అని యిట్లు చెప్పిన.

145


క.

నగ వవు టెఱుఁగక యిది యురి, తగులున సౌమిత్రిఁ జేరి దానవి దనకున్
మగఁడ వగు మనిన నాతఁడు, నగ వొదవిన నగక శూర్పకణఖ కి ట్లనియెన్.

146


చ.

త్రిజగములందు నేర్పులకు దిట్ట యనం దగురాముఁ డుండ వా
రిజముఖ బేల వై చెలువు రిత్తగ నవ్విభుదాసు నన్ను శు
ద్ధజడునిఁ బొంది నీవు నొకదాసివి గాఁ దలపోసె చేల స
ద్గజగతి నేఁగు మీసరసుఁ గన్గొని కైకొను నిన్ను నెమ్మెయిన్.

147


క.

ఈము క్కీచెవు లీమొగ, మీమెలుపుం బొలుపుఁ గలదె యేచెలువకు నీ
కోమలిక మెఱుఁగుటకునై, రాముఁడు మెలఁగించి చూచె రమణీ నిన్నున్.

148

క.

నినుఁ గని నప్పటఁగోలెను, దనమది సుడివడఁగ రామధరణీశుఁడు నిన్
గనుఁగొనఁ గోరెడుఁ దడయం, జన దియ్యెడ వదినె వైతి చను మయ్యెడకున్.

149


చ.

అనవుడుఁ బొంగి దానవి రయంబున నయ్యెడ [13]కేఁగుదెంచినం
గనుఁగొని సీత నవ్వుటయుఁ గన్నులఁ గోపము పేర్చి నన్నుఁ గై
కొన కిది నవ్వె నాసవతికకోఱడ మెట్లు సహింతు దీనితో
మను విది యేల యీచెడుగుమానిసి మ్రింగెద నంచు నుగ్రతన్.

150


చ.

[14]కొఱవులభంగి మండు మిడిగ్రుడ్డుల నిప్పులు రాల దీప్తి గ్రి
క్కిఱియ మహోల్క- రోహిణిపయిం బఱతెంచినమాడ్కిఁ జూడ్కికిన్
వెఱపు జనింప సీతపయి వే పఱతేర నృపాలుఁ డొక్కచే
బిఱుసునఁ బట్టె నయ్యబలఁ బెల్కుఱ రాక్షసిఁ బట్టె నొక్కటన్.

151


వ.

ఇ ట్లన్నిశాచరిం బట్టి లక్ష్మణుం గనుంగొని.

152

లక్ష్మణుఁడు కూర్పణఖముక్కుసెవులు గోయుట

క.

క్రూరులు దుష్టాత్ములు నగు, వారలతో నగవు లెపుడు వలవదు కంటే
నేరమి మనదెసఁ గల్గుట, నీరక్కసి జనకతనయ కిమ్మెయిఁ దొడరెన్.

153


వ.

కావున దీని నింక విరూపిం జేయు మనుటయు నాసుమిత్రాపుత్రుండు.

154


క.

ఘోరక్రోధంబున న, వ్వీరోత్తమునాజ్ఞ నొక్కవెస నన్నక్తం
చారిణి నప్పుడ పట్టి కు, ఠారంబున ముక్కుసెవులు డగ్గఱఁ గోయన్.

155


ఉ.

భంగము నొంది యద్దనుజభామిని దిక్కులు మ్రోయ రోఁజుచున్
నింగికి మ్రొగ్గుచున్ నెగసి నీలవలాహికభంగిఁ బాఱి యు
త్తుంగసభాస్థలిన్ ఘనకుతూహలతన్ దనుజాళి గొల్వఁగా
ముంగలఁ బేర్చి యున్న ఖరుముందటఁ గూలి భుజంగిచాడ్పునన్.

156


క.

పొరలుచు నేడ్చినఁ గని య, చ్చెరువును గ్రోధంబుఁ గదుర శీఘ్రగతిన్ వి
స్ఫురదుగ్రభ్రూకుటిభీ, కర మగుబలుమొగముతోడ ఖరుఁ డిట్లనియెన్.

157


ఉ.

ఎవ్వఁడొకో లయాంతకుని నే నని మార్కొని కోఱ మీటె వాఁ
డెవ్వఁడొకో పురాంతకుని యెక్కుడుక న్నఱకాలఁ దన్నెఁ దా
నెవ్వఁడొకో సమిత్రముగ నిప్పుడు చావఁ దలంచె నింతవాఁ

డెవ్వఁడొ వానిపే [15]రెఱిఁగి యిప్పుడు చెప్పుము నూఱి మ్రింగెదన్.

158


క.

అని పలికిన ఖరుతో న, మ్మనుజేంద్రులపొలుపుఁ బలుపు మహిఁ బంచవటం
బున నున్నతెఱుఁగు సెప్పిన, విని కన్నుల నిప్పు లురుల విస్ఫురితగతిన్.

159


వ.

[16]మండుచు ఖరుం డంతకాకారులఁ బదునలువుర రాక్షసులం గనుంగొని.

160


చ.

ఇరువురు మర్త్యు లొక్కహరిణేక్షణతోఁ జనుదెంచి దండకాం
తరమున నున్నవా రఁట రకణంబున వారి వధించి యిన్నిశా
చరికిఁ బ్రియం బొనర్పుఁడు వెసం జనుఁడీ యని పంప నట్ల వా
రరిగిరి చుప్పనాతి ముద మందుచు ముందఱఁ ద్రోవ పెట్టఁగన్.

161


క.

చనుటయు దనుజుల దవ్వులఁ, గని రాఘవుఁ డనుజుతోడఁ గంటే మనపైఁ
గొనివచ్చె వికృతదానవి, తనవా రగువారిఁ గ్రూరదైత్యుల ననుచున్.

162


చ.

కరమునఁ జూపి శాతవిశిఖంబులుఁ జాపముఁ బుచ్చికొంచు భీ
కరముగఁ గొంతడ వ్వెదురుగాఁ జని యి ట్లను మీకుఁ బ్రాణముల్
గరముఁ బ్రియంబు లేనిఁ దొలఁఁగం జనుఁ డుద్ధతి మాని పూని సం
గరమున నిల్చినన్ బ్రదుకఁ గావశమే యని తెల్పి పల్కినన్.

163


వ.

(అద్దానవు లి ట్లనిరి.)


శా.

రక్షోనాయకుఁ డల్గెనేని వశమే రా రామ ప్రాణంబు
జిక్షోణిన్ మెయి నిల్ప నీ కనుచు నాక్షేపించుచున్ శూలముల్
రూక్షప్రేక్షణు లన్నిశాటభటవీరుల్ వైచి రీరేడు వి
శ్వక్షోభంబుగ నార్చుచున్ సురవిపక్షగ్రామణుల్ పెల్లుగన్.

164


త.

వైచుటయు నొక్కతెగఁ గత్తివాతియమ్ము
లతఁడు పదునాల్గు నిగిడించి యద్భుతముగఁ
దునిమెఁ బదునాల్గుశూలమ్ములను మహోగ్రు
లగుచు వా రంతఁ బోక పై నడరుటయును.

165


ఉ.

వెండియుఁ జండకాండములు వే పదునాల్గు సమగ్రశక్తి ను
ద్దండరయంబునం దొడగి దైత్యుల నేసినఁ దూలి కూలి రా
ఖండలుఁ డేచి ఱెక్కలు దెగన్ వడి వేసిన నోలిఁ గూలుపె
క్కొండలభంగిఁ బాదహతిఁ గుంభిని గంపము నొండ దందడిన్.

166

వ.

[17]ఆసమయంబున.

167


శా.

రక్తాలక్తము లుర్విపై నెరయఁగా రాజన్యబాహాధను
ర్ముక్తక్రూరశిలీముఖంబు లడరం దోడ్తోడఁ దద్గాత్రముల్
రిక్తప్రాణము లైనఁ గన్గొని భయార్తిం గ్రమ్మఱం బాఱె నా
నక్తంచారిణి దిక్కులం జెలఁగ నానారోదనధ్వానముల్.

168


వ.

ఇత్తెఱంగునం బాఱి ఖరునిముందట నిలిచి పేరెలుంగున నేడ్చిన నతండు నచ్చె
రువందుచు నన్నిశాచరిం గనుంగొని.

169


మ.

పడతీ క్రమ్మఱ నేల యేడ్చెదవు నీబన్నంబు నీఁగం గడుం
గడిమిం బేర్చినవీరులం బనుపనే కార్యం బెఱింగింపు మూ
ఱడు శోకింపకు వారు వారి నని మీఱం బూని తా రేగి రే
ర్పడ దేచందము నీమనోరథము దీర్పం జాలలో వ్రేల్మిడిన్.

170


క.

అనవుడు నది యి ట్లను నీ, పనిచినయారజనిచరులఁ బదునలువురు న
మ్మనుజాగ్రణి యొక్కట వే, తునుమాడె నిశాతశరచతుర్దశకమునన్.

171


సీ.

ఇంక రక్కసు లెంద ఱేఁగిన మిడుతలు, కార్చిచ్చుపైఁ జన్నకరణి నతని
మార్గణార్చులఁ బడి మ్రంది పోఁగలవారు, గావున బాహువిక్రమము నెరయ
రాత్రించరేశ్వర రయమునఁ జని వారిఁ, బరిమార్చి నాపరిభవము నీఁగఁ
జాలవేనియు జనస్థానంబు విడిచి నీ, వెందేనిఁ బాఱి పొ మ్మిచట నునికి
పొసఁగ దే నిపుఁ డంతయుఁ బోల వింటి, రజనిచరవధార్థము దాశకరథులు వచ్చి
నారు మనచూచుసామాన్యనరులు గారు, వారు రామలక్ష్మణు లనుక వారు వినుము.


చ.

మగఁటిమి నేఁగి రాక్షసులు మగ్గిరి నీపెనుఁబ్రావు నమ్మి నా
పగకొఱ కైన నీవు నిజబాహుబలోద్ధతి మీఱి మార్కొనం

దగదె య పైన నీ విట వృథాకథ లెన్నుచు బంటు నంచుఁ బ
న్నుగ నిదె యిప్పు డిద్దఱుమనుష్యుల కోడెద వెంత యాడినన్.

173


ఉ.

తక్కుదురే నిశాచరవధం బొనరింపక వారు వారిపై
నెక్కునె పేదతాపసుల నేఁచుమదోద్దతు లెల్లఁ జెల్లునే
యెక్కుడు గంటి నింకఁ గథ లిన్నియు నేటికిఁ జావు దక్క నే
దిక్కున నొండు లే దనుచు దిక్కుల మాఱు సెలంగ నేడ్చుచున్.

174


క.

ధరణిఁ బడి భుజగివిధమునఁ, బొరలుచు న ట్లున్నఁ జూచి భుగ్నభ్రుకుటీ
స్ఫురదురుఫాలతలంబునఁ, గర మలుకం జెమట వొడమఁ గా ఖరుఁ డనియెన్.

175


మ.

ఇటు శోకింపఁగ నేల రాముఁ డనఁగా నెవ్వాఁడు మీయన్నముం
దట దిక్పాలుఁడొ పన్నగాధిపుఁడొ గంధర్వేంద్రుఁడో నేల నె
త్తుట జొత్తిల్లఁగ నింక నన్నరులఁ ద్రుంతున్ నాదుబాహాజయ
స్ఫుటనాదంబుల నింతు దిక్తటనభోభూభాగమధ్యంబులన్.

176


క.

నీపరిభవమునఁ బుట్టిన, కోపము గంగాప్రవాహఘూర్ణత్వరతో
నేపారెడు లె మ్మనవుడు, నాపలుకుల కలరి నిల్చి యది యి ట్లనియెన్.

177

ఖరదూషణాదిరాక్షసులు రామునిమీఁద యుద్ధమునకు వచ్చుట

రజనిచరాధినాథుఁ డగు రావణునట్టిమహాబలుండు న
క్కజ మగునీదుభూరిబలగర్వము సర్వముఁ జూపఁ గాదె ది
గ్విజయము చేసి లోకములఁ గీర్తికి నెక్కుట వీరవర్య నీ
భుజమ కదా సహాయ మగుఁ బోర సురారుల కెల్ల నెల్లెడన్.

178

వ.

అనుచు నగ్గింప నప్పు డతండు దనచేరువం గొలిచియున్నతమ్ముని దూషణుం
డను సేనానాయకుం గనుంగొని నీ వింక వేగ మరిగి మహాభీకరాకారులు నేకమన
స్కులుఁ బవనబలసంపన్నులుఁ గాలమేఘగర్జాడంబరులు నఖిలప్రాణిహింసా
పరాయణులు మాయాపారీణులు నగు మేటిరక్కసులం బదునాల్గువేవురను శర
శరాసనాదిసాధనభరితంబుగా నొక్కరథంబును నాయితంబు సేసికొని రమ్మని
పనిచినం జని వాఁడు నట్ల కావించి యుద్ధసన్నద్ధసేనాసమేతుం డై మగుడ నే
తెంచి యన్నిశాచరేశ్వరున కి ట్లనియె.

179


క.

అరద మిదె వచ్చె వచ్చిరి, దురమునకుం గడఁకఁ గదలి దోర్బలగర్వ
త్వరితు లగుచు నిదె నక్తం, చరవీరులు గలని కరుగ సమయం బనినన్.

180


వ.

అప్పుడు ఖరుండును సమరసన్నాహంబు మెఱయం జనుదెంచి బహురత్నకీలి
తంబును గనత్కనకమయంబును బతాకాభిశోభితంబును వైదూర్యఖచితకూబ
రంబును నానావిధచిత్రరచనావిరాజితంబును గాంచనాచలశృంగోన్నతంబును
శబలవర్ణాశ్వకలితంబును శరశరాసనాదిసాధనభరితంబును నగునారథోత్త
మం బెక్కి తోడన దూషణుండును ద్రిశిరుండును దమతమయరదంబు లెక్కి
వెలుంగునుత్సాహంబును సేనాసంభ్రమంబునుం గనుంగొని యలరుచుఁ
గ్రూరభటపరివేష్టితుం డై శూర్పణఖ ముంగలగా జనస్థానంబు వెడలె నాసమ
యంబున.

181


సీ.

కుంభిని గంపించె ఘూకారవంబులు, వీతెంచెఁ గీలాలకవృష్టి గురిసెఁ
బిడుగులు వడిఁ గూలె భీకరోల్కలు రాలె, నతిఘోరపరివేష మర్కుఁ బర్వెఁ
బొరిఁజుక్క లినుచుట్టుఁ బొడసూపెఁ బడగపైఁ, జెడుగ్రద్ద గూర్చుండె సిడము విఱిగె
దేరివాజులు మ్రొగ్గె దెనలఁ గావిరి గప్పె, బహుచిత్రమేఘము ల్బయల నిండె
వాయు వెదురు వీచె వాపోయె వఱడులు, ధూమకేతువితతి దోఁచెఁ దిమిర
మడరె నన్నిశాచరాధీశు డామూఁపుఁ, గన్ను నదరె నశ్రుకణము లొలికె.


వ.

మఱియు మహోత్పాతంబు లి ట్లనేకంబులు వొడమినం గనుంగొని నవ్వుచు
నవ్వీరుండు రాక్షసులతో ని ట్లనియె.

183


క.

ఇవి చూచి మగిడి పోదునె, బవరంబున దాశరథులపై నాశరముల్
కవిసిన నుడుతతి పడు మృ, త్యువునకు మృతి గలుగుఁ బల్కు లొం డేమిటికిన్.

184

ఆ.

అమరగణము గొల్వ నైరావతము నెక్కి
వజ్ర మలుకఁ బూని వాసవుండు
వచ్చె నేనిఁ బోరఁ జచ్చు నాచే నన్న
వెడఁగు వరులు పోరఁ దొడరువారె.

185


వ.

అని వీరాలాపంబులు సెలంగ నప్పౌలస్త్యుండు సమరకేళీకుతూహలి యై శ్యేన
గామియుఁ బృథగ్రీవుండును యజ్ఞశత్రుండును విహంగముండును దుర్జయుం
డును గరవీరాక్షుండును బరుషుండును గాలకార్ముకుండును మేఘమాలియు
మహామాలియును సర్పాస్యుండును రుధిరాశనుండు ననుమేటిరక్కసులు పన్నిరు
పురు దనకెలంకులను ముంగటం ద్రిశుండును దదగ్రభాగంబున దూషణపుర
స్సరంబుగా స్థూలాక్షుండును మహాకపాలుండును బ్రమాధియు ననువారు ము
వ్వురుం జనుదేర సేనామధ్యంబున నిజస్యందనంబు మెఱయ నిట్లు నడచి పంచ
వటి సొత్తేర మునీంద్రదేవగంధర్వసిద్ధచారణులు రణంబు చూచువేడ్క సంబరం
బున నుండి గోబ్రాహ్మణులకు లోకంబులకు శుభంబులు నిమ్మహోత్పాతం
బులం గలుగుదోషంబులు రోషాచరులకు గోచరించుంగాక యనుచుండి రప్పు
డారజనీచరులకలకలం బెఱింగి రఘుపుంగవుడు సౌమిత్రిం గనుంగొని.

186


సీ.

ఇది చూడు మిడుఁగుఱు లీనుచున్నది విల్లు, కీలితబహురత్నకీల లెసఁగఁ
దూపులు దమయంతఁదూణముల్ వెలువడి, రాజుచున్నవి భీకరంబు లగుచుఁ
బొరిఁబొరి నపసవ్యభుజమును గుడికన్ను, నదరుచున్నవి గాన కదన మిపుడ
సిద్ధించు జయమును జేకుఱు నాకు నీ, దైవసూచకము దద్దయును మేలు
మనసు దిర మయియున్నది మత్తు లగుచు, వరుస నిటు గూడి మనమీఁద వచ్చుచున్న
యిన్నిశాటుల నందఱ నేన పూని, విశిఖములపాలు సేసెద వివిధగతుల.

187


చ.

జనకజ మున్న భీరువు ప్రచండనిశాచరఘోరరూపముల్
గనుఁగొని యెంత బెగ్గిలునో కావున నీవును బాణిపాణి వై
ధనువు ధరించి మీవదినెఁ దమ్ముఁడ యీగిరిగహ్వరాంతరం
బున నొకగొంది దాఁపు మునుముట్టఁ దొలంగుట మేలు లక్ష్మణా.

188


ఆ.

అరుగు మధికబలుఁడ వగుట యే నెఱుఁగుదు
నెంత కైనఁ జాలు దెన్న సమర
కాంక్ష యొండు సెప్పఁ గడఁగిన నీకు నా
యాన యనిన నాతఁ డపుడు కదలి.

189

క.

ధరణీధరగహ్వరమున, గురుభామిని నుండఁ బనిచి ఘోరాసిధను
ర్ధరుఁ డై యచ్చేరువ భీ, కరగతి సౌమిత్రి నిలిచెఁ గడుభక్తిమెయిన్.

190


వ.

[18]అప్పుడు గ్రహమధ్యంబున వెలుంగునంగారకుతెఱంగునఁ గ్రూరరక్షోభటపరి
వేష్టితుం డై ఖరుండు ఘోరసైన్యంబుతోడ నాశ్రమంబు దఱియం జొచ్చి వచ్చి
ముందటం దోఁచిన రఘుపుంగవుండు.

191


చ.

కవచలలామముం దొడిగి, కాంచనసూత్రనియంత్రితంబుగాఁ
గవదొన లూని జైత్ర మగు కార్ముక మెక్కిడి ఘోరశింజినీ
రవము దిగంతరంబున నిరంతరపూర్ణముగా నొనర్పఁ బైఁ
గవిసిరి విస్ఫులింగములు గైదువులం జెదరంగ రాక్షసుల్.

192


చ.

పొరిఁబొరి నార్చుచుం గవిసి భూరితరంబుగ గర్జదభ్రముల్
ఖరకరుఁ గప్పినట్లు రణకర్కశు నారఘువీరుఁ గప్ప న
య్యురవడి సూచి యప్పుడు నృపోత్తముఁ డొక్కఁడు వీండ్రు పల్వు రి
ద్దుర మెటు లౌనొ యంచు మరి దూలగ నుండిరి నింగి నిర్జరుల్.

193


వ.

అయ్యవసరంబున.

194

శ్రీరాముండు రాక్షససైన్యంబుల నుఱుమాడుట

సీ.

అమరేంద్రుమీఁద దం డై పేర్చి యేతెంచు, కొండలఁ బోలు వేదండతతులు
ప్రకటప్రభంజనుపై నెత్తివచ్చుకా, దంబినిఁ బోలురథవ్రజంబు
కుంభజుమీఁద మార్చొనవచ్చు నంభోధి, తరఁగలగమిఁ బోలు తురగచయము
పంచాననముమీఁద బలువిడి నడచు వే, దండయూథముఁ బోలుఁదైత్యభటులు

కులిశసమమార్గణుండును నలఘుబలుఁడు
నుగ్రతేజుండు రాజసింహుండు నైన
రాముఁ గని యార్చి నడచె నుద్దామగమన
గాఢవిశ్రాంతి మెఱయంగ ఖరునిబలము.

195


సీ.

అంత రక్కను లనేకాస్త్రంబు లొక్కటఁ, గురియుచు నందంద పరశుఖడ్గ
పట్టిసతోమరపరిఘగదాచక్ర, దండముద్గరశక్తిభిండివాల
శూలాదులను భూమిపాలు నిరీక్షించి వైచిరి వైచిన వాని కోర్చి
కుసుమితాశోకంబుకొమరున నమరుచు. గ్రేఁగంటిచూపునఁ గెంపు దోఁప
నన్నిశాటకోటి నతఁ డతినిశితశ, రముల నుక్కడంచి రయము మెఱయ
మఱియు వాఁడితూపు లఱిముఱిఁ బెనుమంట, లెగయఁ బెక్కు లొక్కతెగ నిగిడ్చి.

196


చ.

మఱువులు సించుచుం బెలుచ మర్మము లూడ్చుచు నోలిఁ గైదువు
ల్విఱుచుచుఁ గేలుగోయి విదళించుచుఁ గండలు చెక్కుచుం దల
ల్నఱుకుచు రక్తపూరము లిలం దొరఁగించుచుఁ బ్రాణవాయువుల్
పెఱుకుచు నన్నిశాచరులఁ బెక్కుతెఱంగులఁ జంప నేపునన్.

197


ఉ.

పైకొని వెండియున్ వివిధబాణపరంపర లేయ వాని బ
ల్వీకునఁ దున్మి కట్టలుకఁ బేర్చినఁ జెచ్చెర నఫ్డు రాక్షసా
నీకము పెల్లు గాఁగ ధరణీస్థలిఁ గూలె గరుత్మదుత్పత
ద్భీకరపక్షమారుతహతిం దరుషండము గూలుచాడ్పునన్.

198


ఉ.

అట్టియెడన్ శరావళి ఖరాసురుఁ డేసె మహీశు నెంతయుర్
బెట్టుగ నార్చి దానవులు పెల్లు నిగిడ్చి రనేకబాణముల్
దట్టము గాఁగ వైచిరి గదాముసలాదులు నింగి చూడ్కికిం
బ ట్టెడ లేక కై దువులు పందిరికైవడి నిండి క్రమ్మఁగన్.

199


క.

ఇమ్మెయిఁ బఱపినఁ దనపైఁ, గ్రమ్మెడుశస్త్రాస్త్రతతులు గాకుత్స్థుఁడు చా
పమ్మునఁ బొడమినఘోరపు, టమ్ముల పెనువెల్లిఁ బఱపి యడఁగం జేసెన్.

200


ఘనరభసమ్మునన్ నిగుడుకైదువులన్ నుఱుమాడి మీఱి తాఁ
కిన శరపంక్తిచేతఁ దొరఁగెన్ రుధిరంబు నిశాటసేన న

ద్దనుజుశరాదు లప్రతిహతం బయి బల్విడి మీఱి వచ్చి తాఁ
కిన నిట రాముమేనఁ దొరఁగెన్ రుధిరంబు మహాద్భుతంబుగన్.

201


చ.

వెసఁ బదునాల్గువేలబలువిండ్లను దానవు లేయుబాణముల్
ప్రసభరయంబునం దునిమి పార్థివుఁ డొక్కఁడు నేయుబాణముల్
మసలక యెక్కు డై నిగిడి మండుచుఁ బాఱి యనేకఘోరరా
క్షసులయురంబు లుచ్చి చని కాడు రణాంచలమేదినీస్థలుల్.

202


క.

మును గైదువులం బొరిగొని, చని జోళ్లను నుఱుము సేసి సర్వాంగములం
గొని వ్రచ్చు రాముశరములు, దనుజానీకములఁ బొదివి తరతరమ వడిన్.

203


సీ.

మదగజేం ద్రంబులనుదురులు గాఁడి తోఁ, కల నుచ్చిపోవును గ్రందుఁ గాఁగ
రథసముద్ధతు లగురథికసారథు లొక్క, గుది యయి ధారుణి గూలఁ దాఁకు
నద్భుతాటోప మై యాశ్వికవ్రాతంబుఁ, దునుముఁ దురంగాలితోన తునియఁ
బటుసముద్ధతి వీరభటుఁ దాఁకి యవ్వలి, భటుఁ దాఁకి పేరుగాఁ బాఱి గ్రుచ్చు
బిరుదుపడగల గొడుగులపిండు నుగ్గు
నూచముగఁ దాఁకు రామధనుర్విముక్త
నిష్ఠురోత్పాతనిర్ఘాతనిభనిశాత
చండసంపాతకాండప్రకాండసమితి.

204


వ.

ఇవ్విధంబునం బ్రళయకాలోద్దండదండధరునందుఁ బెలుచం గలుగునుద్దండరేఖ
యుఁ గల్పావసానసమయసముదీర్ణప్రతాపదీపితుం డగుతపనువలనం గలుగువేఁ
డిమియును సంవర్తవేళాప్రవర్తితదారుణసంహారవిహారుం డగురుద్రునందలి రౌ
ద్రంబును దనయందుఁ దోఁప నతిఘోరాకారుం డై యశనిసదృక్షంబు లగుతీ
క్ష్ణశరంబులు నిగిడించు.నారాఘవేంద్రుం గనుంగొని యల్గి ఖరుండు ఖరస్వరం
బున నార్చుచుం జేయి వీచి కదియుండు పొడువుండు పోకుండ మ్రింగుం డొక్కమ
నుష్యున కనేకమనుష్యాశనులు దెరలనేల యని పురికొల్పినం బై పైఁ బడురక్కసు
లం బెక్కండ్ర రూపుమాపుచు మాయల నందంద కదియురథయూథగజవ్రజహ
యచయసైనికనికరసూతవ్రాతభటపటలస్ఫుటచటులనిశాటసేనాకాననంబు న
ఱకం దొడంగిన బాణంబులుఁ గృపాణంబులుఁ గరిదంతంబులుఁ గుంతంబులు
శూలంబులు ఫాలంబులుఁ గపోలంబులు శిరంబులు నసిచయంబులు రథావయవం
బులు భగ్నంబులుగ బహువిధనాదంబు లెసంగఁ జరణజంఘోరుమధ్యజాను
స్కంధకంధరాధరాదిప్రదేశంబులు ద్రెస్సి పరశుపట్టిసప్రాసశరాసనతోమరము
ద్గరకుఠారక్షురికాదిసాధనంబులతోడ నేపఱి రూపఱి పడుపదాతులును గళం
బులుం బాదంబులు ఖలీనంబులుఁ బుచ్ఛంబులుఁ బక్కెరలుఁ బల్యాణంబులు
నాశ్వికులతోడన పొడిపొడి యై నేలం గలయునశ్వంబులును వరూథంబులుఁ
గూబరంబులు యుగ్యంబులు రథికులు సారథులుఁ గేతువులుం జక్రంబులుం జక్క

డిచినట్లు పెక్కుతునియలై యోలిం గూలురథంబులును నంకుశంబులు రాలియు
మావంతులు గూలియుఁ దుండంబులు దునిసియు నంగంబులు వ్రస్సియుఁ గుం
భంబులు పగిలియు బొందులు నొగిలియు నవగ్రహంబులు వాహిత్థంబులు నీషి
కలు నిర్యాణంబులుం జూలికలు నా పుంఖస్యూతంబు లయ్యును బుచ్ఛంబులు
దునిసియుఁ గులిశనిహతగిరినికరంబులుం బోలెఁ బొలియుకరినికరంబులును నానా
విధంబుల బలువిడిగాఁ జతురంగబలంబులు బారిసమరినం దెగిపడియును బండ్లు
గొఱుకుచు నార్చువికటడంష్ట్రలతోడి తలలును దలలు దెగినం బడక తిరుగు కబం
ధంబులు ద్రెళ్లి పైఁబడినం జదియురథంబులును రథంబులు విఱిగి కూలు నెడఁ
దొడిఁబడి తునియుపదాతులును బదాతులచేతులు హేతులతోన తెగి మిట్టిమిట్టి
పడుచోటులును రాముశరంబులు కన్నులం గాఁడినఁ దిరిగి తమవారిన చదువు
నేనుంగులును గోలలు గుప్పలుగూర నాటిన నిలువున విగతాసు లై య
మ్ములదిమ్ములుంబో లె వ్రాలుదానవులును గాలు గేలు తొడ మెడ ప్రక్క
డొక్క కోఱ దౌడ యనునివి రూపఱం ద్రెవ్వినం బర్వతఖండంబులభంగిం
బడియున్నదితిజవ్రాతంబు నై యాసైన్యంబు కించిదవశిష్టంబుగాఁ గూలి తెర
లుటయును.

205


చ.

తెరలినసేన నిల్పి సముదీర్ణరయంబున రాము నేయుచుం
బురికొనఁ జేసె దూషణుడు పొంగుచు సేనలు దండినాథుతో
నురవడిఁ బేర్చి యార్చుచును నొక్కమొగం బయి చైత్యు లమ్మహీ
వగు నలయించి పట్టుకొనువా రయి చేరిరి దారుణోద్ధతిన్.

206


క.

చేరి మహావృక్షంబుల, భూరిశిలల నస్త్రశస్త్రపుంజంబుల న
వ్వీరుని నొంపఁ గడంగిన, నారాజన్యుండు గ్రోధ మగ్గల మగుడున్.

207


ఉ.

స్థూలకపాలముల్ వగులఁ దోరపుమేనులు వ్రయ్య నాయుధా
భీరభుజావళుల్ దునియ భీమముఖంబులు నాట నుగ్రదం
ష్ట్రాలి మహీస్థలిం బడ భయంకరనేత్రము లుచ్చిపోవ ను
త్తాలవిశాలవక్షములు దండడిఁ గూల నిగిడ్చె బాణముల్.

208


మ.

వడిఁ దూణమ్మున నమ్ము గైకొనుట తీవ్రస్ఫూర్తి సంధించు టే
ర్పడ లీలం దెగవాపు టేయుట మదిన్ భావింపఁగా రాక వి
ల్గుడు సై యుండుటయుం బ్రచండగతి రక్షోవక్షముల్ వ్రయ్యుచ
ప్పుడు వా రొక్కటఁ గూలుమ్రోఁతయు నభోభూభాగముల్ గప్పఁగన్.

209


క.

ఇంచుకతడవున కాన, క్తంచరసంఘములఁ బలుచ గాఁ జేసినఁ గో
పించి పతిమీఁదఁ బఱ పెం, జంచద్గతి దూషణుండు సాయకపంక్తుల్.

210


క.

దొర యమ్మెయిఁ దఱిమిన నొ, క్కురవడిఁ జేయంగఁ గలుగు యోధతతి రిపుం
బరిమార్పుఁడు పొడువుం డను, పరుషోక్తులతోడఁ గదిసెఁ బటురౌద్రమునన్.

వ.

[19]ఇట్లు కవిసిన.

212


శా.

జ్యానాదంబు చెలంగఁ జిత్రతర వేగాలక్షితాధానసం
ధానాకర్షణమోక్షితుం డగుచు గంధర్వాస్త్రపూర్వంబుగా
నానాబాణము లేసె నవ్వసుమతీనాథుండు దద్బాణసం
తానం బుద్ధతిఁ బర్వె నెల్లెడ మహాధ్వానంబుతో నత్తఱిన్.

213


క.

శరములు బలువిడి నిగుడుచుఁ, బరువడి నయ్యాతుధానభటముక్తశిలా
తరుశస్త్రపరంపర లెడఁ, దొరఁగించుచు వారిఁ దోన తునుమాడునెడన్.

214


చ.

వికటవిభూషణావలులు విస్ఫురితాంగదబాహుఖండముల్
శకలితసాధనంబులు విశంకటకంకటకాంశుకంబులు
న్ముకుటవికీర్ణరత్నములు నూతనకుండలచారుమస్తక
ప్రకరములున్ విచిత్రతరభంగి వెలింగె రణాంగణంబునన్.

215

దూషణాదులు రామునితోఁ బోరి చచ్చుట

వ.

అప్పుడు రఘువరువివిధవిశిఖంబుల బడలువడం బడిననిశాచరకళేబరంబులం
గనుంగొని ఖరుండు రెట్టించినకోపంబునం గదలి రామున కభిముఖంబుగా నర
దంబు పోని మ్మనుచు సారథి నియోగించి శింజిని మ్రోయించుచు సేనాపురస్స
రంబుగాఁ దఱిమి కేతుమధ్యంబున వెలుంగు సైంహికేయుండునుంబోలె ఘోర
రాక్షసపరివృతుం డై వెలుంగుచుఁ బోరికిఁ గడంగునెడ నెడసొచ్చి తలకడచి
సమస్తపౌలస్త్యులు గర్జిల్లుచుం బెల్లు గురియునీలమేఘంబుల విడంబించుచు సాయ
కాసారంబు ఘోరంబుగాఁ గురిసి యవ్వీరుపై ఖడ్గముద్గరశూలపరశుచక్రాదిసా
ధనంబులు వైవ వాని కతం డొక్కింతయుం దలంకక తదీయాస్త్రవేగంబులు
సముద్రంబుం జొచ్చిననదీప్రవాహంబులకరణిం దనశరపరంపరల నడంగ మండ

లీకృతకోదండుం డగుచు విజృంభించి మఱియుఁ గాలపాశసంకాశంబు లగుననే
కశిలీముఖంబులు నిగిడింప నాకాశంబున ధూమాగ్నిపగిది మండుచు నడరి
వారి నానావిధంబుల వధియింప నయ్యాతుధానులు మెండుకొని వెండియుం బోవక.

216


క.

ఇషువులు గురియఁగ నారఘు, వృషభుం డని సైఁచి నిలిచె వెస నఫ్డు మహా
విషధరములు వర్షింపఁగ, వృషభంబు దలంక కున్నవిధ మొప్పారెన్.

217


ఆ.

ఇట్లు మెఱసి మెఱుఁగు లీనువాలమ్ములఁ బఱపి వివిధగతుల బారి సమర
సమర ముడిగి విగతశస్త్రు లై ధరణి గం, పింపఁ బాఱి రా నిలింపరిపులు.

218


ఉ.

అప్పుడు దూషణుండు వసుధాధిపునమ్ములచేతఁ బైపయిం
గుప్పలు గాఁగ రక్కసులు గూలినచందము చూచి కన్నులన్
నిప్పులు రాలఁ బెల్లడరి సింగిఁ జెలంగెడునార్పుతో వడిం
గప్పె నఖండచండతరకాండపరంపర నారఘూత్తమున్.

219


మ.

పెలుచం గప్పిన నన్నిశాచరున్ స్ఫీతాగ్నిపాతం బెదం
దలఁపింపం డగునస్త్రపంక్తిఁ గినుకం దా నేసె న ట్లేయ న
బ్బలుబాణంబుల కోర్చి వాఁడు మఱియుం బంటింప కాశీవిషో
జ్జ్వలశస్త్రంబు లనేకముల్ వఱపె నాక్ష్మాపాలుపై నేపునన్.

220


సీ.

పఱప నవ్వీరుండు పండ్రెండుకోలల, బ్రహ్మదండంబులపగిది వాని
నొక్కటఁ దొడిగి యం దొక్కటఁ బడగయు, నొకశరంబున విల్లు నొకట సూతు
మస్తకంబునుఁ జతుర్మార్గణి నరదంబు, మావుల రెంట మైమఱువు నొకట
నాతపత్రము రెండుశాతశరంబుల, ఘనరయంబునఁ ద్రుంచి మొనసి మఱియు
విస్ఫులింగతతులు వివిధముఖంబుల, వెడలునట్లు గాఁగ నడరుమెఱుఁగు
టంపగముల మిగులునన్నియు నఱికిన, నప్డు విరథుఁ డగుచు నవని కుఱికి.

221

క.

గద దిగిచి వైచె వైచిన, నది నడుమన తునిసి తొరఁగ నందంద పటు
ప్రదరంబులు పఱపియు నెని, మిదినారాచములు వానిమేనం గ్రుచ్చెన్.

222


వ.

అంత నప్పౌలస్త్యుండును గనలి కనకపట్టవేష్టితంబును నాయసశంకుకీలితంబును
నశనిసమస్పర్శంబును నాదిత్యఛత్రనిభంబును గుపితోరగఘోరంబును గాలదం
డప్రచండంబును ననేకప్రాణిశోణితమలినంబు నగునొకమహాపరిఘంబు గరంబున
నమర్చి మెఱుంగులు సుడివడం ద్రిప్పుచుఁ బతంగంబు కార్చిచ్చుమొగంబునకు వ
చ్చువిధంబునం గడంగె నప్పు డెడసొచ్చి మహాకపాలప్రమాథిస్థూలాక్షు లార్పు
లు నిగుడ శూలపరశుపట్టిసంబు లంకించి వైచిన రఘుపుంగవుండు వానిం దెగ
నేసి యమ్మహాకపాలు నొక్కభల్లంబునం దల డొల్ల నేసి విశిఖదశకంబునం
బ్రమాథిం బంచత్వంబు నొందించి యస్థూలాక్షు మేనం బెక్కంబకంబులు
నించి వధించిన నత్తెఱంగుం గనుంగొని దూషణుండు రెట్టించినకోపంబున
నతనిం బేర్కొని.

223


ఉ.

ఇమ్మహనీయసాధనము నింక సహించెదు గాక నీవు ని
క్కమ్ముగ నంచుఁ బూని పరిఘం బిగుచేతుల నెత్త నవ్విభుం
డమ్ముల రెంటఁ జెక్కలుగ నాభుజయుగ్మము ద్రుంప వాఁడునుం
గొమ్ములు ద్రుంపఁబడ్డనవకుంభివిధంబునఁ గూలెఁ గుంభినిన్.

224


క.

దూషణుఁడు వడిన మఱియును, రోషాచరశేష మెల్లఁ ద్రుంచుటకు మహా
రోషంబునఁ జాపజ్యా, ఘోషం బొనరించి మునుము గొని తునుమునెడన్.

225

వ.

శ్యేనగామి శక్తియుఁ బృథుగ్రీవుండు భిండివాలమ్మును యజ్ఞశత్రుండు శూలం
బును మహారథుండు పరశ్వథంబును దుర్జయుండు దోమరంబును గరవీరాక్షుం
డు గరవాలంబును బరుషుండు పరిఘంబును గాలముఖుండు ముసలంబును మేఘ
మాలి ముద్గరంబును మహాబాహుండు గదయును సర్పాస్యుండు పట్టిసంబును
రోహితాంబరుండు గుంతంబును గొని చదల నదరులు చెదర నంకించుచుం
గవిసినఁ దత్కరంబులతోన శిరంబులు దునియం బండ్రెండు పటుభల్లంబులు
నిగిడించి మఱియు వివిధవిశిఖంబుల నిరవశేషంబుగా రక్కసులను నుక్కడంచి
దక్షాధ్వరధ్వంసంబు సేసినధూర్జటికిం బాటి యగుచు సంగరాంగణంబున వెలుం
గుచున్న రఘుపుంగవుం గనుంగొని ఖరుండు గోపంబు దీపింపం గడంగునెడఁ
ద్రిశిరుం డతని కి ట్లనియె.

226

త్రిశిరుండును ఖరుండును రామునిచేఁ జచ్చుట

చ.

నను విను రాక్షసేశ్వర రణంబున నీతనిఁ ద్రుంచివైచి నీ
మన మలరింతుఁ జొచ్చి పటుమార్గణసంపదసొంపు సూపెదం
దునిసెద నొండె నవ్విభునికతూపుల నిశ్చలభంగి నింక వే
యును బని లేదు నీ వొకముకహూర్తము తప్పక చూడు మేర్పడన్.

227


ఆ.

అనుచు నతని నుడిపి ధనువు మ్రోయించుచు, నంపగములు వఱప నవ్విభుండు
వానినెల్ల వింట వడిఁ బాఱఁ జదుపుచు, లెక్క సేయకుండె నుక్కు మెఱసి.

228


క.

ఉన్నఁ గనుంగొని మఱియుం, గ్రొన్నారాచములు మూఁడు గొని నుదు రేయం
జెన్నగుకుసుమాభరణం, బున్నతెఱం గైన దాని కొయ్యన నగుచున్.

229


తే.

శరచతుష్టయమున రథాశ్వములు మ్రొగ్గ
నంబకాష్టకమున సూతుఁ డవని నొఱఁగ

నొక్కకోలఁ గేతువు దెగ నొకట వాని
యురము దూఱి పాఱఁగ నేసి విరథుఁ జేసి.

230


క.

ధర కుఱుక మూఁడుశరముల, శిరములు దునుముటయు భగ్నశృంగం బగుభూ
ధరముగతి నన్నిశాచరుఁ, దురుతరకీలాలధార లొలుకం గూలెన్.

231


వ.

ఇత్తెఱంగునం ద్రిశిరుండు గూలినం గనుంగొని ఖరుండు కోపాటోపంబున శింజిని
మ్రోయించుచు శరపరంపరలు పరఁగించుచు నరదంబు చిత్రగతుల మెఱయ
రఘువరుం దలపడియె నప్పు డవ్వీరుండును వివిధవిశిఖాసారంబు ఘోరంబుగా
నెదుర్కొనియె న ట్లయ్యిరువురమార్గణంబుల నంతరిక్షం బలక్షితం బగుచుండె
నాసమయంబున.

232


క.

బరిగోలచేత మదసిం, ధురముం గనలించినట్లు దూపుల నాభూ
వరుఁ గనలించుచుఁ గవచము, మురియలుగా నేసి విల్లు ముష్టికిఁ ద్రుంచెన్.

233


ఉ.

త్రుంచిన నన్నరేంద్రుఁడు విధూమహుతాశనుభంగి మండుచుం
గాంచనరమ్య మైనవిలు గ్రమ్మఱ నొండు ధరించి విక్రమో
దంచితలీలఁ దుత్తునియ లై పడ భల్లములం బతాక ఖం
డించి కడిందితూపులు వడిం బదుమూఁ డరిఁబోసి వెండియున్.

234


క.

ఒగి విల్లు సూతుతలయుం, దిగిపడ నొకటొకట హరులు ద్రెళ్ల నిరుగవన్
మొగి రెంట మూఁట నిరుసులు, నొగలు విఱుగ నొకొట వానినో నేయుటయున్.

235


వ.

అతండు గదాపాణి యగుచు నిలాతలంబున కుఱికి నిలిచినం గనుంగొని.

236

ఉ.

ఓరి నిశాచరాధమ మదోద్ధతిఁ దాపసవిప్రకారముల్
వారక చేసి తా ఫల మవశ్యముఁ బొందక పోవునే యమా
గారగతుండ వై కుడువఁ గాలము నీ కిదె చేరె నింక నా
ఘోరశరంబులన్ జమునికోర్కులు దీఱఁగ నిన్నుఁ ద్రుంచెదన్.

237


కవిరాజవిరాజితము.

అన విని నవ్వుచు నావసుధేశున కాతఁడు గ్రమ్మఱ ని ట్లను నీ
వనిమొన నిప్పుడు గొందఱ దుర్బలు లైనయలంతినిశాచరులం
దునిమితి నంచు మదింపక విక్రమదుర్యుఁడ వేని మదీయగదా
ఘనహతిఁ గూలక చక్కనిబంటవు గమ్ము వృథాకథ లేమిటికిన్.

238


చ.

అనుచుఁ బ్రదీప్తహేతివలయం బగునగ్గద ద్రిప్పి వైవఁ జోఁ
కినవనభూరుహఁంబులను గీలల నీఱుగఁ జేయుచున్ మహా
శనిగతి విస్ఫులింగములు చల్లుచుఁ బె ల్లడరంగ దాని ము
త్తునియలు గాఁగఁ గ్రొమ్మెఱుఁగుతూపుల నవ్విభుఁ డేసె నేసినన్.

239


ఆ.

మరల నొక్కసాల మిరుగేలఁ బెఱికియు, దీనఁ దెగితి వంచుఁ దిగిచి వైవ
నలిగి నేడుభల్లకములఁ ద్రుంచి వేవేగ, మంగకముల వేయు నంట నేసె.

240


వ.

 అ ట్లేసినం దొరఁగునెత్తుటం జొత్తిల్లి యున్మత్తునివిధంబున.

241


చ.

బలువిడి ముష్టియుద్ధమునఁ బట్టి వధించెద నంచు భూరిదో
ర్బలమదరేఖ బి ట్టెసఁగఁ బైఁ బఱతేర నగస్త్యదత్త మై
పొలిచినవైష్ణవాస్త్ర మరిఁ బోసి లసన్మణిపుంఖదీధితుల్
వెలుఁగుచునుండ నిండుతెగ వేకొని కూలఁగ నేసె నాఖరున్.

242


వ.

ఇట్లు రాక్షసవీరు వధించి వృత్రాసురవధం బొనరించిననాఁటిసురేంద్రుండునుం
బోలె నన్నరేంద్రుండు దేజరిల్లె నాసమయంబున.

243


మ.

కురిసెం బెల్లుగఁ బుష్పవర్షములు గాకుత్స్థాన్వయాధీశుపై
మొరసెం గ్రందుగ దేవదుందుభులు సమ్మోదాతిరేకంబునం
బొరసెన్ దేవమునీంద్రసంఘములు సంపూర్ణంబుగా దిక్కుల
న్బెరసెన్ మెండుగ రామచంద్రసుగుణోన్మేష ప్రభాజాలముల్.

244

వ.

తదనంతరంబ యచ్చేరువతపోవనంబుల మునిగణంబులు చనుదెంచి రామచం
ద్రు ననేకాశీర్వాదంబుల నాదరంబు లెసంగం గొనియాడి రంత లక్ష్మణుండు
జానకిం దోడ్కొని వచ్చి యారాజపరమేశ్వరుపాదంబులకుం బ్రణామంబు చేసి
సంతోషసాగరంబునం దేలె నమ్మునీంద్రు లారాజేంద్రు నభినందించుచు వీడ్కొని
నిజనివాసంబులకుం జని రవ్విభుండును బరమహర్షభరితాత్ముం డగుచు సీతాల
క్ష్మణసమేతుం డై విశాలం బగుపర్ణశాలకుం జని యం దిష్టవినోదంబుల నుండె
నంత నిఖిలరాక్షసక్షయంబునకు భయం బంది జనస్థానంబునం గలహతశేషదో
షాచరనికరంబు వికలంబై పలుదెసలకుం జనియెఁ గయ్యంబునం జావక తక్కిన
వాఁ డొక్కరుం డకంపనుం డనువాఁడు రావణుం డున్నయెడకు నతిత్వరితగతి
నరిగి యేకాంతంబున నన్నిశాచరపతిం గదిసి శంకించుచుం జెప్ప నోడినం
దలంకక కలరూ పెఱింగింపు మనిన నభయంబు వేఁడి వాఁ డిట్లనియె.

245

అకంపనుఁడు రావణునకు రామువృత్తాంతంబు చెప్పుట

చ.

దశరథరాజనందనుఁడు తమ్ముఁడు భార్యయుఁ దోడరాఁ దపో
వశగతి దండకాటవికి వచ్చి ఖరాదినిశాచరావళిన్
మశకములన్ హరించు పెనుమంటయుఁబోలె నడంచి మాఱు లే
క శరశరాసనోగ్రుఁ డయి క్రాలెడుఁ బంచవటీస్థలంబునన్.

246


మ.

అనినం గన్నుల నిప్పు లుప్పతిల రోషావేశముం బొందున
ద్దనుజేంద్రుం బ్రణుతించి చెప్పెద సమాధానంబుమైఁ గార్యముం
గనుఁగొ మ్మాహవభూమి రాముఁ జెనయంగా రాదు గల్పాంతవ
ర్తనరౌద్రోద్ధతరుద్రకోటి కయినం దథ్యంబు లంకేశ్వరా.

247


సీ.

ధరణీతలంబు పాతాళంబునకుఁ గ్రుంగ, నడువ నింగికి నెత్త నతఁడె చాలు
గ్రహతారకౌఘంబు మహిఁ గ్రందుపడ రాల్ప, నవి పొందుపడ నిల్ప నతఁడె చాలు
జలధు లన్నియుఁ బాఱఁజల్లి యింకింపంగ, నవి నిండఁ బూరింప నతఁడె చాలుఁ
ద్రిజగంబు మార్పడఁ ద్రిప్పి ముందటియట్ల, యలవడఁజేయంగ నతఁడె చాలుఁ
జండశతకోటిశతకోటిసారఘోర, నిశితనిష్ఠురశరసముల్లసితచాప
దీపితాటోపనిర్జితత్రిభువనుండు, ఘనుఁడు కాకుత్స్థతిలకుండు దనుజనాథ.

248


చ.

అతనియనుంగుఁదమ్ముఁ డసహాయపరాక్రమశాలి నిర్భరా
ద్భుతభుజసారుఁ డుగ్రవనభూముల నన్నకు భక్తి సేయుచున్
సతతముఁ దాఁ జరించు సువిచారుఁడు లక్ష్మణనామధేయుఁ డ
య్యతులబలుండు నానృపుని యట్టిఁడ సంగరరంగభూములన్.

249


ఉ.

కావున వారలం దొడరఁగాఁ దలపోయుట దుర్నయంబు నీ
కేవిధి నైన వారి సమయింపఁగ నిష్టమ యేనిఁ బూని రా
మావనినాథుభార్యఁ గుటికలాలక సీత హరింప దాన శో

కావిలుఁ డై వెసం బొలియు నాతఁడు దమ్ముఁడుఁ జచ్చు నన్నతోన్.

250


క.

అని పలికిన నక్కపటము, దనుజవిభుఁడు పొగడి నీవు తగుహితుఁడవు నా
కని వాని నాదరించుచుఁ, దనమది పొంగంగఁ గదలి తద్దయుఁ గడఁకన్.

251


తే.

నీచు తనపూర్వమంత్రి మారీచుకడకు
నేకతమ యేఁగ నతఁ డెదు రేఁగుదెంచి
ప్రియము సేసినఁ గైకొని నయముతోడ
నతని కిట్లని పలికె నెయ్యంబు దనర.

252


క.

ఖరుఁ డాదిగ మనవారలఁ, బొరిగొని రఘురాముఁ డనఁగఁ బోటరి యై దు
ర్నరుఁ డొకఁడు దండకాటవిఁ, దిరిగెడు ననుజుండుఁ దానుఁ దీనస్ఫురణన్.

253


ఉ.

వాని వధించి యొండె బలవంతపుమాయల ముంచి యొండె నా
కానరనాథుదేవి కుటిలాలక సీత యనంగ నొప్పున
బ్జాననఁ దెచ్చికోవలయు నన్నఁ గడుభయ మంది యాతఁ డ
ద్దానవనాథుతోడ నుచితం బగునీతి దలిర్ప ని ట్లనున్.

254


చ.

హరిహరపద్మజాదులకు నారఘురాముఁ డసాధ్యుఁ డమ్మహా
పురుషునిభార్య నేమిటికిఁ బుణ్యవిహీనతఁ గోరె దెందునుం
బరసతిఁ గోరువాఁ డధికపాతకుఁ డీచెడుబుద్ది నీకు నె
వ్వరు మది కింపుగాఁ బగుతువా రయి చెప్పిరి రాక్షసేశ్వరా.

255


చ.

అరదెగ గొన్నయేటునఁ గులాచల మైన హిమాద్రి యైన మం
దరగిరి యైన హేమవసుధాధర మైన నజాండ మైన ని
ష్ఠురతఁ బగుల్చు నక్కడిఁదిజోదు పురాంతకువిల్లు లీలమైఁ
బొరిగొని కొన్నభార్య యది పోలవు రావణ నీవిచారముల్.

256


తే.

అని యనేకవిధంబుల నతనియాగ్రహంబు డిగువడఁ జెప్పి రామావనీశు
నతులదివ్యాస్త్రమహిమయు నల్లఁ దెల్పి, వైర ముడిపిన రాక్షసవరుఁడు మగిడి.

257


క.

పురమునకు నరిగి విభవ, స్ఫురణంబు దలిర్పఁ బెంపు పొల్పొంద నిశా
చరకోటులు గొల్వఁగ మి, న్నొరసినయాపసిఁడిమేడ నున్నట్టియెడన్.

258


వ.

[20]అక్కడ శూర్పణఖయు సంగరాంగణంబున నత్తెఱంగున రఘుపుంగవునుగ్రశి
లీముఖంబులం దెగి బడలువడం బడినఖరదూషణాదిసమస్తపౌలస్త్యులకళేబరం
బులను గనుంగొని పొడమునాశ్చర్యభయశోకంబులు మనంబునం బెనంగొన న
వ్విధం బంతయు లోకవిద్రావణుం డగురావణున కెఱింగింతు ననుచు మహానా
దంబున రోదనంబు సేయుచుం బాఱి లంకానగరంబు సొచ్చి పుష్పకమధ్యంబున

నఖిలమంత్రిజనసేవితుం డై మరుద్గణవరివృతుం డగువానవుని ధిక్కరింపందగి
సమంచితకాంచనవేదికాతలంబున వెలుంగుననలునోజఁ దేజరిల్లుచు దేదీప్య
మానం బగుమణిమయభద్రపీఠంబున.

259


సీ.

వజ్రాదిసాధనవ్రణకిణాంకిత మగు, మేనఁ జందనచర్చ మెఱయుచుండ
భువనభయంకరభ్రూకుటి యగుముఖ, శ్రేణి దంష్ట్రారుచుల్ చెలువు మిగులఁ
బర్వతోత్పాటనప్రౌఢంబు లగునిరు, వదిచేతుల విభూషలు దనరారఁ
గుంఠితాఖండలకుంభిదంతం బగు, నురము విస్తార మై యోలిఁ గ్రాల
రుచిరకోటీరదశకంబు రోహిణాద్రి, శిఖరముల నవ్వ నుద్వృత్తిఁ జెఱలుగొన్న
సురవిలాసిను లొరసి వీచోపు లిడఁగ, నెలమిఁ గొలువున్న యారాక్షసేంద్రుఁ గనియె.

260

శూర్పణఖ రావణునకు నిజపరిభవంబుతెఱం గెఱింగించుట

క.

కని తనవికృతాకారము, గనుఁగొని పౌలస్త్యు లెల్లఁ గడునాశ్చర్యం
బునఁ బొంద సభామధ్యం, బున నేడ్చుచుఁ బరుషవాక్యముల ని ట్లనియెన్.

261


క.

నీవును నీ ప్రియమంత్రులు, నీవిధమున నున్నఁ జాలు నింతియ నీవా
రేవిధిఁ బోయిన నే మగు, నా విని రావణుఁడు శూర్పణఖఁ గనుఁగొనినన్.

262


సీ.

కైలాస మెత్తిన నీలావుకరములుఁ, గరములఁ గలపెంపు గాసి గాఁగ
ముల్లోకములయందుఁ జెల్లెడునీయాజ్ఞ, నీయాజ్ఞతేజంబు నెరసు దఱుఁగ
దెసలెల్ల గెలుచుట నెసఁగు నీవిజయంబు, జయలబ్ధ మగుప్రకాశతయు నడఁగ
నిఖిలంబు నిండిన నీయశంబును నీయ, శంబునఁ గలవికాసంబుఁ గంద
నీసహోదరి నని చెప్ప నీసుతోడ, నుఱక న న్నొకఁ డిమ్మెయిఁ బఱిచి నామ
మణఁగకున్నాఁడు నేఁడు నే మందు నిన్ను, బ్రధననూతనశితికంఠ పంక్తికంఠ.

263


వ.

[21]అనిన విని.

264


మహా.

స్ఫుటకోపాటోపభుగ్నభ్రుకుటిదశకమున్ భూరిదృఙ్నిర్గతోల్కా
చ్ఛటలున్ ఘర్మోదబిందుక్షరణకృతతనుక్షాళనంబుం బ్రవాళో
ద్భటబాహాచ ద్రహాసప్రభలుఁ గ్రకచవిస్ఫారదంష్ట్రాసముద్య

త్తటిదావిర్భూతిభూతత్రసనముగ సభాస్థాన మెల్లం గలంగన్.

265


క.

కటములుఁ బెదవులు నాసా, పుటములు నదరంగ మేను పొరిఁ గంపింపం
జిటిలిపడి మండి యెవ్వం, డిటు నిన్నుం జేసె ననిన ని ట్లను నదియున్.

266


సీ.

రాముఁ డనఁగ నొక్కరాసుతుఁ డతివతో, ననుజసహాయుఁడై యరుగుదెంచి
దండకాటవి సొచ్చి తా నుండు నచ్చటి, కే నుండఁ బోయిన నిట్లు సేసెఁ
గడఁగి నాకై వచ్చి ఖరదూషణాదులు, పదునాల్గువేవురు ప్రధానభూమి
నతనిమహాస్త్రనలార్చుల మ్రందిరి, పలుమఱు వేయును బలుకు లేల
యక్షగంధర్వసిద్ధవిద్యాధరాది, సకలదివిజులతోఁ బగ సాలఁ గొనియు
నీవు రాజ్యమదంబున నిన్ను మఱచి, వేగు లరయింపకున్న నీకె వెతలు వచ్చె.

267


క.

దూరస్థు లయ్యుఁ గార్యము, చారులచేఁ గనుటఁ జారచక్షులు రాజుల్
వా రని చెప్పఁగ వినవె వి, చారము దోఁచునె కుమంత్రిసహితున కెందున్.

268


వ.

అని వెండియు.

269


శా.

ఏకాంగుష్ఠము నేల మోపి తప మట్లే నూఱువేలబ్దముల్
గోకర్ణాశ్రమవాసి వై సలిపి రక్షోనాథ యవ్వేధచే
నీకై కొన్నవరంబు లెన్నఁటికొకో నేఁ డిట్లు గా నాఁడు గ్రీ
వాకండూతికి వేల్చితో శిరములన్ వైశ్వానరజ్వాలలన్.

270


క.

బంధుజనక్షేమములు మ, దాంధుఁడ వై యరయ కునికి నపకీర్తి మరు
ద్గంధర్వాదులు నగ దశ, కంధర నినుఁ జెందె నేటి గర్వం బింకన్.

271


ఉ.

నా విని రాముఁ డెవ్వఁడు వనంబున కేటికి వచ్చినాఁడు యు
ద్ధావని నెట్టు లొక్కరుఁడ యట్టిఖరాదులఁ జంపె నెట్టివాఁ

డావసుధేశుతమ్ముఁ డగునాతఁడు నెట్టిఁడు నామ మేమి రూ
పేవిధ మానితంబినికి నెయ్యది నా కెఱిఁగింపు మాఖ్యయున్.

272

శూర్పణఖ రావణునకు సీతారామలక్ష్మణులవృత్తాంతముఁ జెప్పుట

వ.

అనిన నది యి ట్లను నతండు దశరథుం డనునరేంద్రునందనుండు దమతండ్రి
పనుపునం దపోవేషంబు గైకొని శస్త్రాస్త్రంబులు ధరియించి దండకారణ్యం
బున కేతెంచి తదాశ్రమవాసు లైనమహామునులసన్నిధి వారికిం బ్రియంబు
గా రాక్షసవధం బొనర్చుటకుఁ బ్రతిన పూని పంచవటియందు వర్తించుచుఁ
గృతప్రతిజ్ఞుం డగుట జనస్థానంబునం గలుగుసమస్తపౌలస్త్యులం బరిమార్చె
నప్పు డసహాయుం డై విక్రమంబున విజృంభించిన యవ్వీరవరుకోదండపాండిత్య
విశేషం బెట్టి దనిన.

273


క.

వడి దొనఁ దిగుచుట దొడుగుట, వెడలం దెగగొనుట శరము విడుచుట గానం
బడక విలు గుడుసుపడుటయు, నుడుగక రక్కసులు పడుటయును గానఁబడున్.

274


ము.

పొరి నుద్వేలకరాళకీల లడరం బుంఖానుపుంఖంబు లై
శరజాలంబులు భూనభోంతరము నాచ్ఛాదించుచుఁ బెల్లుపైఁ
గురియం గూలె నిశాచరావలి రఘుక్షోణీంద్రుచే నింద్రుచేఁ
గరకావృష్టిపరంపరం బడుపతంగశ్రేణిచందంబునన్.

275


ఆ.

ఆఁడుదాని జంప నర్హంబు గా దని, నను వధింప కునికి నల్లఁ జేరి
నీకు నిత్తెఱంగు నిక్క మే నెఱిఁగింప, దిక్కు గల్గె నింకఁ బెక్కు లేల.

276


తరల.

అతనితమ్ముఁడు లక్ష్మణుం డనునాతఁడుం బరికింపఁగా
నతనియట్టిఁడ సాహసంబున నంచితాకృతి నగ్గుణా
న్వితుఁడు దక్షిణబాహుసన్నిభుఁ డెందు నన్నకు సీత య
య్యతివపే రిల నేతలోదరులందుఁ గల్గరు తాదృశల్.

277

సీ.

విదియచందురుఁ డైన వెలఁదినెమ్మోమునఁ, గలిసిన సంపూర్ణకాంతి వడయు
వడగాలి యైన నప్పడఁతియూర్పుల చెంతఁ, బరఁగిన మలయాద్రిపవనుఁ బోలు
నమవసయిరు లైన [22]నయ్యింతిచిఱునవ్వు, సొలపున వెన్నెల చెలువుఁ బూను
నలరి యేఋతువుల నయిన నాసతిమేని, ప్రభ గన్నవనములు పల్లవించు
బట్టబయ లైన నాసితపద్మనేత్ర, కన్నుఁగవయొప్పు జిగిసొంపు గడలుకొనిన
విమలకమలషండంబులవిధము నొందు, నెందు సరి వోల్పఁ గలరె యయ్యిందుముఖికి.

278


[23]మఱియును.

279


సీ.

మణిమయమంజీరమంజురుతమ్ములఁ, గలహంసికలఁ బిల్చి గతులు నేర్పుఁ
గమ్మయూర్పులఁ దేఁటిగముల నాకర్షించి, లలి గానలీలల నలవరించు
హస్తపల్లవకాంతి హరిణులు నెలయించి, దృష్టివిభ్రమముల తెఱఁగుఁ జూపు
రుచిరబింబాధరారుణదీప్తిఁ జిలుకల, రావించి మధురోక్తిరచనఁ గఱపు
నన వితర్కింపఁదగుచు నయ్యలరుఁబోఁడి, యనుపమానవిలాసంబు లలర నమరు
నమరగంధర్వయక్షవిద్యాధరాది, జాతులం దెందుఁ జూడ నీచంద మెఱుఁగ.

280


క.

అంగవిలాసమ్మును ద, న్వంగికిఁ జెలువారుతెఱఁగు లవి యే మని చె
ప్పంగల దయ్యొప్పిదము గ, నుంగొన మగువలకు నగు మనోభవవికృతుల్.

281


క.

ప్రమదాజను లొరు లేటికి, నమరాంతక లంక యేటి కారామార
త్నము సిద్ధించినవారికి, నమరేంద్రపదంబు గోరునది యేమిటికిన్.

282


ఉ.

కావున రామలక్ష్మణులఁ గయ్యమునం బరిమార్చి లోకవి
ద్రావణ మైననీదుభుజదర్ప మెలర్పఁగ సీతఁ దెచ్చి సం
భావన నిష్టభోగఫలభాగినిఁ జేయుదుగాక యన్న నా
రావణుఁ డప్డు మన్మథశరంబులఁ జిత్తము దూల లోలతన్.

283

సీతను దెచ్చుటకు రావణుఁడు ప్రయాణమై పోవుట

వ.

శూర్పణఖపలుకులకు సంతోషించి మంత్రులం జూచి ఖరదూషణాదుల వధిం
చినయారఘువరువి క్రమవిశేషంబులు వితర్కించి వంచనోపాయంబున సీతం
గొనివచ్చుట కార్యంబుగా నిశ్చయించి కొలువు విడిచి రథంబు సారథిం దెమ్మ
నుచుఁ బ్రచ్ఛన్నమార్గంబునం బురంబు వెలువడి రత్నకాంచనమయంబును బిశా
చముఖాశ్వకలితంబును గామగమనంబును వివిధాయుధభరితంబు నగునిజస్యంద
నంబు పిఱుంద వచ్చుటయు నెక్కి రయంబున నయ్యరదంబు గగనగమనంబున
మెఱయ నానావృక్షలతాదులం బొల్చు వేలావనంబు నెడనెడ ననేకద్వీపంబులుం
గనుంగొనుచు నబ్ధిమధ్యంబునం జని చని బహువిహగకులసంకులంబును విటపి
విటపాక్రాంతరోదోంతరాళంబు నగునొక్కపురాణవటోత్తమంబు సూతునికిం
జూపి తొల్లి వైనతేయుం డమృతంబునకుం బోవుచుండి గజకచ్ఛపంబుల భక్షింప
శతయోజనవిశాలం బగు దీనిశాఖ నిడిన నది విఱుగ నం దున్న వాలఖిల్యాదిమ
హామును లాక్రోశించిన విని యక్కొమ్మ నగ్గజకచ్ఛపంబులు రెంటినిం జరణమండం
బులం బట్టికొని జవంబునం బఱచి తండ్రి కెఱింగించిన నక్కశ్యపుండును వారిం
బ్రార్థించి తదవతరణంబు సేయించినం బదంపడి జనకనిర్దిష్టం బగునిషాదమండ
లంబున నాశాఖ వైచి హిమాచలతటంబున నక్కరటికమఠంబుల నాహారంబు
గొనియె నిమ్మహీరుహంబు పేరు సుభద్రం బనుచు సముద్రంబు గడచి మారీ
చునాశ్రమంబు సొచ్చి రథంబు డిగ్గి జటావల్కలధరుం డైనయన్నిశాచరుపాలి
కిం బోయి కనుఁగొనుటయు.

284


క.

మారీచుఁడు గనుకని నపు, డారక్షోవిభునిఁ బ్రీతి నర్చించి నయం
బారఁగఁ గ్రమ్మఱ వచ్చిన, కారణ మే మనినఁ బంక్తికంఠుం డెలమిన్.

285


వ.

శూర్పణఖ తనకుం జెప్పినవృత్తాంతం బతనికి సవిస్తరంబుగాఁ జెప్పం దలంచిన
వాఁ డై వెండియు నద్దశకంధరుం డి ట్లనియె.

286


సీ.

నక్తంచరోత్తమ నారాక విను రాముఁ, డనువాఁడు దమతండ్రి యలిగి పురము
వెడలఁద్రోచిన దపోవేషి యై పత్నియు, ననుజుండుఁ దోడ రా నరుగుదెంచి
దండకాటవి నుండి దర్పించి మ శూర్ప, ణఖఁ బట్టి ముక్కుఁగర్ణములుఁ గోసి
దాన నిల్వక జనస్థానంబునం దున్న, ఖరదూషణాదిరాక్షసులఁ గడఁగి
నిరవశేషంబుగాఁ జంపె నిఖిలలోక, జయుఁడ నగునాకు నె గ్గిట్లు సలిపెఁగాన
యేను నాక్షత్రియాధమునింతి సీతఁ, దెత్తు నీసహాయతఁ బగ దీర్తు నేఁడు.

287

శా.

[24]మాయావిద్యల నెవ్వఁడుం దలఁపఁగా మారీచ నీయంతవాఁ
డీయబ్జాననసృష్టి లేకునికి నిన్నేఁ బంచెదన్ రాఘవా
పాయం బేగతి మేదినీతనయకుం బాటిల్లు నవ్వంచనో
పాయం బొక్కఁ డొనర్తుగాక యన మే నాకంపముం బొందఁగన్.

288


క.

హృదయ మదరంగ సంధులు, ప్రిదులఁగఁ జిత్తము గలంగఁ బెంజెమ టొదవం
బెదవులు దడుపుచు నాదశ, వదనునితోఁ గొంతవడికి వాఁ డిట్లనియెన్.

289


శా.

పుణ్యుం డూర్ణితశౌర్యధైర్యమహిమస్ఫూర్తిస్ఫురద్వైభవా
గణ్యుం డార్యజనానురంజితమహాకారుణ్యుఁడున్ శ్లాఘ్యసౌ
గుణ్యుం డన్వయవార్ధిచంద్రుఁడు రిపుక్షోణీశ్వరస్థాపితా
రణ్యుం డార్తశరణ్యుఁ డుజ్జ్వలయశోరమ్యుండు సౌమ్యుం డిలన్.

290


క.

మతివిజితసురాచార్యుఁడు, చతురత్వచతుర్ముఖుండు సదమలవృత్తా
[25]యతపంకజలోచనుఁడును, శ్రితవినుతగుణప్రథాధురీణుఁడుఁ బేర్మిన్.

291


మాలిని.

వితరణఖని యుద్యద్వీర్యశౌర్యప్రభావో
న్నతుఁడు భుజబలాత్యున్మాదవిద్విడ్ధరిత్రీ
పతిహరణసమిద్భూభాగగమ్యుండు సంభా
వితపరిణతచిత్తోర్వీసురుం డుర్వి నెందున్.

292


గద్యము.

ఇది సకలసుకవిజనప్రణుతయశస్కర భాస్కరప్రణీతం బయినశ్రీరామా
యణంబునందు నారణ్యకాండంబునం బ్రథమాశ్వాసము.

293
  1. క. నృపచూడామణి రాఘవుఁ, డపరిమితక్రోడమహీషహరిభల్లూక
          ద్విపశరభచండగండక, విపులమహావిపినములఁ బ్రవేశించి తగన్. అని పా.
  2. కహకహ యనియెడు కంఠనిర్గత మైన, చప్పుడు బ్రహ్మాండ మప్పళింప
  3. స్వాంతమతిన్ మహీపతికి సంభ్ర
  4. 64...70-వ పద్యములకు మాఱుగా వ్రాఁతప్రతుల పాఠము—
    మ. విని యన్నీటికి నెట్లు గల్గెనొకొ యీ వీణానినాదంబు గా
          యనినాదంబును నన్న నానృపునితో నచ్చోట వర్తించుస
          న్మును లిచ్చో మును మందకర్ణుఁ డను పుణ్యుం డోపి చేసెం దపం
          బు నిరాహారుఁడుఁ బంచతప్తుఁడును నంభోమగ్నదేహుండు నై.
    చ. అనిమిషకన్య లేగు రమరాధిపుపంపున వచ్చి కొల్చి ర
         మ్మునివరు నాతఁడుం గడుఁ బ్రమోదమునన్ విహరింపఁ గోరి యీ
         ఘనసలిలాశయం బిచటఁ గల్గఁగఁ జేసె జలాంతరంబునం
         దనుపమరమ్య మై తనరు హర్మ్య మొనర్చెఁ దపోబలంబునన్.
    క. ఈనీటినడుమ బయల న, మానుషతేజంబుతో నమర్త్యస్త్రీలుం
         దాను విహరించె నతఁ డీ, గానం బాదివ్యసతులగానం బధిపా.
    క. అంచితముగ నిక్కొలనును, బంచాప్సర మందు రనినఁ బతి ముని నభినం
         దించుచు వీడ్కొని యిచ్చా, సంచరితుం డయ్యె నిట్లు సమ్మదలీలన్.
    తే. ఎలమి నొకటియుఁ బది పదియేనుతిథులు, నాఱు నాలుగు మూఁడు రెండయిన నెలలు
         నొండు రెండును నేండ్లుగా నోలి మునిత, పోవనంబుల నుండె సీతావరుండు.
  5. 77...78-వ పద్యములకు మాఱుగా
    అనుచుఁ గొనియాడి కుంభజునాశ్రమంబు, తెరువు సంజ్ఞాభియుక్తి మైఁ దెలియఁజెప్పె
    .......................................................................... (వ్రా. ప్ర.)
  6. 79....98-వ పద్యములకు మాఱుగా
    చ. అనఘుఁ డగస్త్యుతమ్ముని మహామునిఁ గాంచి తదీయ మైనయ
        వ్వనమున నాఁడు నిల్చి జనవల్లభుఁ డమ్మునిముఖ్యు భక్తి వీ
        డ్కొని యట కాంచెఁ గుంభజుఁ బ్రఘూర్ణితపూర్ణమహార్ణవాంతరాం
        బునివహసర్వపూరపరిపూరితవిస్తరహస్తపంకజున్.
    చ. కని కడుభక్తి మ్రొక్కుటయు గౌరవ మొప్పఁగఁ గౌఁగిలించి తా
        మును దనుఁ గొల్చియున్న మునిముఖ్యుల కెల్లను రామచంద్రును
         ద్వినుతగుణావలుల్ ప్రకటవిస్తరభంగిగఁ జెప్పుచుం బ్రియం
         బునఁ గొనియాడుచున్ వివిధపూజలఁ దృప్తులఁ జేసె నెమ్మితోన్.
    క. జనవరునకు లక్ష్మణునకు, జనకసుతకుఁ గందమూలశాకాదిక మై
        మునిమాననీయ మగుభో, జనమునఁ బరితుష్టి సేసి సముచితభంగిన్.
    చ. కలశభవుండు రామునకుఁ .................................................. (వ్రా.ప్ర.)
  7. 107 మొదలుగా 111 వఱకుఁ గలపాఠము వ్రాఁతప్రతులందుఁ గానిపింపదు.
  8. 117 మొదలుకొని 132 వఱకుఁ గలపాఠము వ్రాఁతప్రతుల లేదు.
  9. నేడ్తెఱఁ బోయి పోయి
  10. 'వలచి యతివిస్మిత యై' అ. ప్ర.
  11. మనఁగ, నదె ఖరాసురవరుఁడు దా నధిక
  12. ' చెప్పినన్.
    క. నగ వగు టెఱుఁగక' వ్రా. ప్ర.
  13. “కేఁగినం గనుం
    గొని మహిజాత నవ్వుటయుఁ గోపము రేఁగ నిదేల నన్నుఁ దాఁ
    గనుఁగొని నవ్వె నాసవతి కావల మెట్లు'. అ. ప్ర.
  14. 151 మొదలుకొని 155 వఱకుఁ గల పాఠమునకు మాఱుగా
    “చ. అవని చలింప నైజవికృతాకృతిఁ గయికొని పేర్చి సీతపైఁ
         గవిసినఁ జేయి మా టిడుచు గ్రమ్మన లక్ష్మణ దీనిఁ బట్టి యం
         గవికలఁ జేయు మన్న నురు గాఢరయంబునఁ గోసె ముక్కునుం
         జెవులును గ్రూర ధార విలశీ పిల్లుకు రారమునం గఠోరతన్." వ్రా. ప్ర.
  15. రు నెఱిఁగింపుము మున్మిడి నూఱి; రెఱిఁగి యేర్పడఁ జెప్పుము నూఱి
  16. 160 మొదలుగా 161 వఱకుఁ గలపాఠమునకు మాఱుగాఁ
    క. మదనాగాయుతసత్త్వులఁ, బదునలువుర దనుజభటులఁ బనిచె ఖరుం డ
        మ్ముదిత వెసఁ దెరువు పెట్టఁగ, నదయులు చని రసురు లుగ్ర మగురభసమునన్.
  17. 167 మొదలుకొని 189 వఱకుఁ గలపాఠమునకు మాఱుగా
    క. ఒక్కడ పదునలుగుర ని, ట్లక్కజముగఁ గూలి నిహతు లైనఁ దలఁకుతో
        ముక్కిఁడి రక్కపి పఱచెను, గ్రక్కున ఖరుఁ డున్నయెడకుఁ గడుశోకమునన్.
    చ. చని ఖరుముందటన్ ననుజసంఘము చూడఁగఁ గూలి రోరి నీ
         పనిచినవారు రాముపటుబాణములం బడి రోపితేని నీ
         పనికి నెదిర్చి రమ్ము ప్రథనాంతకు నారఘువీరుఁ బోరిలో
         బెనయఁగ నీవశంబె వెసఁ జేరుము లంకకు నొండె నావుడున్.
    ఉ. భీషణభంగిఁ బొంగి తను బిట్టుగఁ బల్కిన రోఁజుచున్ మహా
         రోషకఠోరవాక్యముఖరుండు ఖరుండు మహోగ్రఘోషణున్
         దూషణుఁ బిల్చి సైన్యములు దుర్దమలీల నమర్పు కింకిణీ
         భూషణశస్త్రవర్మరథభూరిమదద్విరదాదికంబుగన్.
    క. వాలినఘన సేనలఁ బదు, నాలుగువే లమరఁ బేర్చి నడపింపుము నా
          విలసితకుంతఘనకర, వాలాభీలముగ నొక్కవడి నని కడిమిన్.
    ఉ. ఏపున దండనాయికున కిమ్మెయిఁ జెప్పి యతండు మున్నుగా
         నాపదునాల్గువేలు దనుజాగ్రణులుం దనదోడ రా సమా
         టోప మెలర్చ నల్లన పటుత్వమునం దనతేరు గ్రాల ను
         ద్దీపితకోపుఁ డై ధను వుదీర్ణరుచి మెఱయంగ నుగ్రతన్.
    సీ. ఘనవిక్రములు సేనగామియఁ బురుషుఁడు, యజ్ఞశత్రుండు విహంగముండు
         కరవీరనేత్రుఁడు కాలకర్మకుఁడు మ, హాకపాలుఁడు రుధిరాశనుండు
         రక్తమాలియు ద్విశిరప్రభూతుండును, సర్వాననుండును జలదమాలి
         వజ్రఘోషుండును, వజ్రదంష్ట్రుండును, నగ్నినేత్రుండు బ్రహ్మాశనుండు
          హయముఖస్థూలనేత్రదుర్జయులు మఱియు, జంబుకాసురుఁడును బృథుశ్రావదూష
          ణాదిదైత్యులు గదిసి రా నమితగర్వ, పరుషభాషణపరుఁ డైనశిఖరుఁడు నడిచె.
    ఉ. అత్తఱి రాలెఁ జుక్క లరుణాభ్రము లెల్లెడఁ బెల్లు వన్ని క్రొ
          న్నెత్తురు నెమ్ములుం గురిసె నేల వడంకె సృగాలఘూకముల్
           మొత్తము గట్టి మ్రోసెఁ గడు మ్రొగ్గె హయాదులు వానిఁ జూచియుం
           జిత్తములం గలంగ కవి సేయఁ దొడంగిరి సంకటంబునన్.
    ఉ. పంచవటంబుకై నడువఁ బంచె నుదంచితలీల సేన న
         క్తంచరకోటి దోఁచుటకుఁ దాఁ గర మొప్ప నిమిత్తభంగు లూ
         హించి సుమిత్రపట్టికి నరేంద్రుఁడు ఘోరరణంబు గల్గు నేఁ
         డం చట పల్క దక్షిణమునం దట పర్వె ధరాపరాగముల్.
    మ. కని కాకుత్స్థవరుండు లక్ష్మణునితోఁ గంటే మహోత్సాహవ
          ర్ధనదుర్వారగజేంద్రవాహభటబృందవ్యూహసేనాప్రవా
          హనిశాటేశచమూప మాహవసమీహాలోలమై వచ్చె నీ
          దనుజవ్రాతము నేన త్రుంచెద మహీధ్రం బెక్కి నీ వక్కడన్.
    క. సీతారక్షణతత్పర, చేతోగతి నుండు చనుము శీఘ్రము మదిలో
          భీతహరిణాక్షి దైత్య, వ్రాతము గని వెఱచు ననిన వడిఁ జని యతఁడున్.
  18. 191 మొదలుకొని 198 వఱకుఁ గలపాఠమునకు మాఱుగా
    క. అంత మహాగగనాంతర, మంతయుఁ గరవాలశరశరాసనపరిఘా
        కుంతక్షురికాపరశు, క్రాంతముగా వచ్చుసేన గని రఘుపతియున్.
    ఉ. కాంచనరత్నదీప్త మగుకంకటమున్ ధరియించి శాతబా
        ణాంచిత మైనతూణయుగ మందముగా బిగియించి మించి దీ
        పించుమహోగ్రకార్ముకము భీమరయం బెసలార నారి యె
        క్కించి గుణస్వనంబుఁ బరఁగించుచునుండిఁ బ్రచండమూర్తియై.
    ఉ. ఆసమయంబున సురవియచ్చరసిద్ధసముత్కరంబులున్
        వాసవలోకవాసినృపవర్గము దివ్యవిమానదీధితుల్
        భాసురభంగి నింగిఁ గనుపట్టఁగఁ జూడఁగ వచ్చె నోలి భీ
        మాసురకోటితోడ నసహాయత మార్కొనురామభద్రునిన్.
    సీ. అమరేంద్రుమీఁద చం డై పేర్చి యేతెంచు, కొండలఁ బోలు వేదండతతులు
        ప్రకటప్రభంజనుపై నెత్తి వచ్చుకా, దంబినిఁ బోలురథవ్రజంబు
        కుంభజుమీఁద మార్కొన వచ్చు నంభోధి, తరఁగలగవిఁ బోలు తురగములును
        బంచాననముమీఁద బలువిడి నడచు వే, దండయూథముఁ బోలు దైత్యభటులు
         కులిశసమమార్గణుండును నలఘుబలుఁడు, నుగ్రతేజుండు రాజసింహుండు నైన
         రాముఁ గని యార్చి నడచె నుద్దామభీమ, గమనవిభ్రాంతి మెఱయంగ ఖరునిఁ గడలి.
    ఉ. ఆభీలంబుగ నిట్లు దైత్యఘనసైన్యం బుద్ధతం ద్రోవఁ బై
         పై భూరేణువుఁ బర్వ బాణమున కుద్యద్భంగి గాఁ జాఁచినన్
         శోభిల్లెన్ రఘురాముహస్తము దిశాశుండాలతుండాభ మై
         భూభృద్విద్ఘనభూభరావహమహాభోగీంద్రభోగాభ మై.
  19. ఈవచనము మొదలు 244 పద్యమువఱకు వ్రాఁతప్రతులయందుఁ గనఁబడుపాఠము.
    మ. కదియం జూచి మహీవిభుండు నగుచున్ గాంధర్వబాణంబు బె
          ట్టిదుఁ డై యేసిన నంపవెల్లువలమాడ్కిం బొంగి పైఁ బేర్చినం
          జదిసెన్ నారణపంక్తి కూలె రథముల్ సర్వంబుఁ జచ్చెన్ హరుల్
          పొదు లై కూలిరి దైత్యవీరులు సమిద్భూభాగ మల్లాడఁగన్.
    మ. బల మెల్లం దుము రైన దూషణుఁడు కోపంబున్ సమాటోపముం
         జలమున్ శోకముఁ గప్ప నవ్విభునిపైఁ జండాశుగంబుల్ వెసం
         గలయన్ నాటిన నొచ్చి వాని విరథుం గాఁ జేసె రా జుగ్రతన్
         విలసద్బాణపరంపరాప్రతితిచే విస్ఫారదోశ్శక్తిమై.
    మ. విరథుం డయ్యను బీఱువోక ఘనదోర్విన్యాస మొప్పారఁగాఁ
          బరిఘం బుద్ధతిఁ బుచ్చుకొంచుఁ గదయం బాఱంగ వే త్రుంచెఁ ద
          త్కరయుగ్మంబును బాణయుగ్మమున నల్కన్ వ్రచ్చెఁ దద్వక్ష ము
          ద్ధురబాణంబునఁ గూలె వాఁడు భువనోద్బోధంబుగా రోఁజుచున్.
    చ. మఱియు మహాకపాలుఁడుఁ బ్రమాథియుఁ బంచసహస్రయోధులుం
         దఱిమి నరేంద్రు నుగ్రశరధారల ముంచిన వారి నందఱం
         బఱియలు నుగ్గునూచములు భాగశతంబులు నై ధరిత్రిఁ బె
         ల్లొఱలుచుఁ గూలి క్రందుగను నొక్కటఁ బ్రోవులు గట్ట నేసినన్.
    క. స్థూలాక్షుఁ డార్చి కదిసిన, వాలమ్ములు నిగుడఁ జేసి వచ్చెను వడి భూ
         పాలుం డర్కరథాంగ, స్థూలం బగువానికన్నుదో యుగ్రగతిన్.
    ఉ. వ్రచ్చిన నమ్మహాసురుఁడు వాలినవేదన గూరి ఱోలుచుం
         జచ్చిన శ్యేనగామి యనుసైనికుఁ డాదిగ నాప్తకోటితో
         వచ్చి ఖరుండు దాఁకె నవివారణ మైఁ ద్రిశిరుండు దాను గా
         ర్చిచ్చున కగ్గమై యుఱుకుసింగమున ట్లతిరౌద్రభంగిగన్.
    ఉ. తాఁకినఁ బేర్చి యేసె వసుధావరుఁ డార్చి శరాలి నుగ్గుగా
         దాఁకఁగఁ జండదీప్తి దివి దాఁకెడునమ్ముల గుండె వ్రయ్యఁ గాఁ
         దాఁకినఁ గూలుదానవులు దందడి కొండొరుతోడ వీడ్వడం
         దాఁకఁగ దత్కబంధములతాఁకున ధాత్రికి వ్రేగు దాఁకఁగన్.
    క. ఖరుఁడును ద్రిశిరుఁడు జక్కఁగ, నొరలును సైన్యంబు నపుడు ద్రుంగిన వెస నా
        ఖరుతోఁ ద్రిశిరుఁడు నన్నుం, దిరమై యిటు సూడు మనుచుఁ దీవ్రస్ఫురణన్.
    ఉ. లావు దలిర్ప మూఁడుతలలం ద్రిజగంబు చలింప నార్చుచున్
        వావిరిఁ దేరు దోలుకొని వచ్చి రఘూద్వహుఁ దాఁకి యేసె నా
        నావిధచండకాండగమనస్ఫుటజాతసమీరకంపితా
        శావలయక్షమావలయసామజభూధరభూరుహంబుగన్.
    వ. ఇ ట్లేసిన.
    మ. కని యత్యుద్ధతి రాముఁ డవ్విశిఖముల్ ఖండించి తత్సూతుఁడుం
         దునియన్ వాజులు గూల వాఁ డవశుఁడె తూఁగాడి వ్రాలంగ నే
         సిన నాలోనన మూర్ఛదేఱి యలుకన్ శీఘ్రంబుమై ఖడ్గముం
         గొని యంకించుచుఁ బెల్చఁ బై నడరినం గోపించి భూపాలుఁడున్.
    మ. తల లోలిం దెగ నొక్కయేటునను దోర్దర్పంబుమై నేసినం
         గులిశాఘాతవిభిన్నపక్షవిపులక్షోణీధ్రముంబోలె భూ
         స్థలిఁ గూలెం దనుజేంద్రుమొండెము వడిం దత్పాతముం జూచియుం
         దలఁ కొక్కించుక లేక పేర్చి నృపతిం దాఁకెన్ ఖరుం డుద్ధతిన్.
    వ. ఇట్లు దలపడి.
    మ. ఖరదైత్యాధిపుఁ డేయుబాణములు నాకాకుత్స్థుబాణౌఘముల్
         సరి నాకాశము నిండి తాఁకుదలలం జండాగ్నికీలాసము
         త్కర ముగ్రంబుగఁ జేయఁ దద్గతఘనధ్వానంబు బ్రహ్మాండక
         ర్పరముం దాఁకి తెరల్చి రాల్చె నూరుతారామాక్తిక శ్రేణులన్.
    క. సేనలతోఁ బెనఁగుట ని, మ్మానవపతి డస్సె నింక మర్దితుఁ డగు నా
         చే నని ఖరుఁ డాసాసల, నానరపతితోడఁ బెనఁగె నాగ్రహభంగిన్.
    క. ఖరుఁ డించుక యెడ గని యా, ధరణీశ్వరువిల్లు దునుమ దందడి నృపశే
        ఖరుఁడును గుంభజుఁ డిచ్చిన, వరచాపం బెత్తి యేసె వడి నాఖరునిన్.
    చ. అలయక పోరుదానవుసమగ్రత సైఁపక సూతు నేసి వా
         జులఁ బటుచాపముం దునిమి శోణితపూరితగాత్రుఁ జేసినం
         బ్రలయవిజృంభమాణయ మభాతి దలిర్పఁగ విస్ఫురద్గదా
         కలితకఠోరబాహుబలగర్వ మెలర్ప నెదిర్చి యార్చుచున్.
    క. ఓరాఘవ యిప్పాటునఁ, జేరుదు జము నంచు ఘోరశీఘ్రసమగ్రో
       దారత వైచిన మంటలు, పూరించుచు నడరె నది నభోభాగమునన్.
    చ. అడరిన నుజ్జ్వలాస్త్రనిచయంబు రయంబున నేయ నంత బ
        ల్పిడుగును బోలు చుల్కలను బెల్లుగ రాల్చుచుఁ బేర్చుమంట న
        య్యడవి ననేకభూరుహచయంబులఁ గాల్చుచుఁ దూలి మేదినిం
        బడియె మహోగ్రమంత్రబలభగ్నభుజంగమపుంగవాకృతిన్.
    మ. గద ను గ్గై పడినం గడంక నొకవృక్షం బుద్ధతం గొంచు వే
         కదియన్ వచ్చిన మ్రాను ద్రుంచి పటుదోర్గర్వంబుమై నొంచినన్
         మది శంకింపక చొచ్చి పట్టుకొన నాత్మం గోరి డాయంగ వే
         పదినూఱుల్ శరముల్ నిగిడ్చె ఖరుశుంభద్దేహముం దూఱఁగన్.
    క. ఉరుశరము లవయవమ్ముల, సరభసముగ నాటి యుచ్చి చన గైరికభూ
        ధర మట్టు లెదురుసను నా, ఖరుతో నరపాలుఁ డనియెఁ గలుషం బెసఁగన్.
    తే. ఇంచుకేనియు దయలేక యేపు రేఁగి, మునులఁ బెక్కండ్ర నమలి తివ్వనమునందు
        నేఁడు జముఁ గూడఁ బుచ్చెద నీచకష్ట, చరిత నిలు మని రోషసంభరితుఁ డగుచు.
    క. పలికి యమోఘాస్త్రం బు, జ్జ్వలతేజం బెసఁగ వింట సంధించుటయుం
         గలఁగె మహీవలయనభో, వలయంబులఁ గలుగుభూతవర్గం బెల్లన్.
    మ. అతిఘోరాస్త్రము నిమ్మెయిం దొడిగి గాఢాకర్షణాపూర్ణసం
         గతి గావించి నరేంద్రుఁ డేయ నది వీఁకం దాకి కూలన్ సము
         ద్ధతిమైఁ బేర్చి ఖరాసురాంగము మహేంద్రక్రూరబాహావిని
         ర్గతవజ్రచ్యుతపక్షతిక్షతకులక్ష్మాధ్రంబుచందంబునన్.
    వ. ఇ ట్లారాక్షసవీరు వధించి వృత్రాసురవధం బొనరించిన నాఁటిసురేంద్రుండునుంబోలె నన్నరేం
         ద్రుండు దేజరిల్లె నాసమయంబున.
  20. 259 మెదలుగా 262 వఱకుఁ గలపాఠమునకు
    చ. పొలుపఱ ముక్కునుం జెవులుఁ బోయిన మోటమొగంబుమీఁద న
        శ్రులు దొరుఁగంగ రక్కసులు చూచి కడున్ వెఱఁ గంద నార్తి ది
        గ్వలయము మ్రోయ నేడ్చుచును వచ్చి సభాస్థలిఁ గూల వ్రాలి పే
        రెలుఁగునఁ బేర్చి శూర్పణఖ యి ట్లని యేడ్చెఁ గరంబు దీనతన్.
  21. 264 మొదలుకొని 277 వఱకుఁ గలపాఠమునకు
    చ. అని తనభంగపాటు రిపున గ్రహవృత్తియుఁ దోఁపఁ బల్కినన్
        గని విని గోపవర్తనవికారఘనభ్రుకుటీకఠోరరౌ
        ద్రనిటలపట్టికాప్రకరదారుణదృక్చయవిస్ఫురోగ్రదం
        ష్ట్రనిశితదంతఘట్టనద, శాముఖుఁ డయ్యె దశాస్యుఁ డయ్యెడన్.
    క. కనుఁగొని దానవు లందఱు, దనుజాధిప యభయ మిమ్ము దశముఖ యనుచుం
        గొనియాడి రతఁడు దగ శూ, ర్పణఖం గని పల్కె నిట్లు భంగము నీకున్.
    ఉ. ఎవ్వఁడు సేసె వానినెల వెక్కడ వాఁ డెట వోయె వానిపే
         రెవ్వఁడు వాని కిట్టిమద మెవ్వనిచేఁ గలిగెన్ వధింతు వాఁ
         డవ్వల నెట్టివాఁ డయిన నత్తెఱఁ గేర్పడఁ జెప్పు మన్న మో
         మవ్వల వాంచి శూర్పణఖ యన్నకుఁ జెప్పఁ దొడంగె వంతియున్.
    సీ. దశరథుం డనుధరాధవునిపుత్రుఁడు తండ్రి, యాజ్ఞచేఁ దమ్ముండు నాలుఁ దాను
         మునివేషములు దాల్చి వనములఁ బదునాల్గు, వర్షంబు లుండంగ వచ్చి నిల్చి
         దండకాటవిఁ జొచ్చి తాపసప్రీతిగా, దనుజులఁ ద్రుంచెద ననుచుఁ బూని
         విహరించుచుండ నవ్వీరునికులకాంత, త్రైలోక్యసుందరి ధరణిజాత
         తోన వర్తింపఁ గన్గొని యేను నీకు, నవ్వధూమణిఁ దెచ్చెద ననుచుఁ జేరి
         మెలఁగుటయుఁ బట్టి యిటు వేసె నలుకతోడ, నసు పతితోడఁబుట్టువ ననిన నుఱక.
    వ. మఱియు నానరపాలుండు.
    క. అలిగి జనస్థానంబునఁ, గలదానవు లెల్ల మీఁదఁ గవిసిన లీలం
        పొలియించె నాఖరాదుల, నలవోకయపోలె మదభరాలసుఁ డగుచున్.
    ఉ. అనరముఖ్యుఁ డప్పు డసురావలిఁ జంపఁగ నేను జూచితిం
         గానఁగ వచ్చు నప్డు తెగ గైకొన వట్రువ యైనవిల్లుఁ బె
         ల్లై నభ మెల్లఁ గప్పుచు మహాధ్వనితోఁ జనుదెంచునమ్ములున్
         మేనులు ద్రెవ్వి మిట్టిపడి మేదినిఁ గూలునిశాటకోటులున్.
    క. అని పలికి యన్నచిత్తము, జనపాలకుదేవి యైన జానకిదెసకుం
        జను టెఱిఁగి విను దశానన, వినిపించెద సీతలలితవిభ్రమభంగుల్.
  22. నయ్యింతి చిఱునవ్వు, పొలసిన వెన్నెలవెలుఁగుఁ గడచు
  23. 279 మొదలుకొని 289 వఱకుఁ గల వ్రా. ప్ర. పాఠము
    క. అని కొనియాడిన దనుజుని, మనమంతన మరుఁడు సొచ్చె మారీచుతపో
        వనమున కరిగె రయంబునఁ, గనకరథం బెక్కి గగనగతి నట్టియెడన్.
    చ. గరుడుఁడు తొల్లి లీల గజకచ్ఛపయుగ్మముతోడఁ గూడ నే
        తరువున శాఖ నూనె విదితంబుగ నప్పెనుమఱ్ఱిముందటం
        దెరువునఁ జూచుచుం దనమదిన్ వినతాసుతులావు మెచ్చుచున్
        సరభసభంగి నేఁగియును సాగరతీరతపోవనంబునన్.
    క. మారీచుఁ గాంచుటయు నతఁ, డారక్షోవిభునిఁ జూచి యర్చించి ప్రియం
         బారఁగఁ గ్రమ్మఱ వచ్చిన, కారణ మే మనినఁ బంక్తికంధరుఁ డనియెన్.
    చ. పరమహితుండ వార్యుఁడవు బంధుఁడ వాప్తుఁడ వెల్లభంగి నీ
        వరయఁగ నీసహాయమున నంబుజలోచన రాముదేవి న
        ద్ధరణిజ నేను గైకొని ముదంబునఁ దేలుదు నాబలంబు నీ
        వెరవును మాయయుం గలుగ వేయువిధంబుల నబ్బు నింతియున్.
  24. తే. ఎన్నివిధముల నైన నయ్యిగురుఁబోఁడి, నాకుఁ జేరునుపాయంబు నీకు నెట్లు
           పోలు నట్లుగ నొనరించి భూపసుతుల, మొఱఁగి మాతుల యెంతయుఁ దెఱఁగుపఱుపు.
    క. అనినం జిత్తము జల్లనఁ, దనమదిలోఁ గలఁగి వణఁకి దనుజేశ్వర రా
        మునివిక్రమంబు నీకును, వినిపించెద నున్నరూపు విను తెలియంగన్.
  25. యతచిత్తపంకజుఁ డా, శ్రితరక్షణగుణమహాధురీణుఁడుఁ