Jump to content

భాసుని భారత నాటకములు

వికీసోర్స్ నుండి

భాసుని భారత నాటకములు

మూలము

భాసమహాకవి



అనువాదము

చిలకమర్తి లక్ష్మీనరసింహకవి



ప్రచురణ

కార్యనిర్వహణాధికారి

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి

2007

BHASUNI BHARATANATAKAMULL

By

BHASA MAHAKAVI

TRANSLATION

CHILAKAMARTI LAKSHMI NARASIMHAKAVI

T.T.D. Religious Publications Series No: 717

All Rights Reserved

T.T.D. First Edition: 2007

Copies:1000

Published by

K.V. Ramanachary, I.A.S.,

Executive Officer,

Tirumala Tirupati Devasthanams,

Tirupati-517 507.


DTP by

M/S SAR Infotec (P) Ltd.

15-3-200,GN.Mada Street,

Tirupati- $17501.


Printed at

Tirumala Tirupati Devasthanam Press.

Tirupati.

ముందుమాట

సంస్కృత నాటకకర్తలలో ప్రథముడు, కాళిదాసుడి (క్రీ.పూ. ప్రథమ శతాబ్ది) కన్నా పూర్వుడు ఐన భాస మహాకవి రచించిన నాటకాల్లో మనకిపుడు 13 మాత్రమే లభిస్తున్నాయి. వాటిలో మధ్యమవ్యాయోగం, దూతవాక్యం, దూతఘటోత్కచం, ఊరుభంగం, పాంచరాత్రం అనేవి మహాభారతగాథకు సంబంధించినవి.

1. మధ్యమ వ్యాయోగం - ఇది దశరూపకాల్లో ఒక భేదమైన వ్యాయోగ విభాగానికి చెందిన ఏకాంకిక. పాండవులు వనవాసంలో వున్నప్పుడు జరిగిన కథగా కవి దీనిని కల్పించారు. భారతంలో ఈ గాధ లేదు. ఇతరేయ బ్రాహ్మణంలోని శునశ్శేపుని కథ, భారతంలోని బకాసుర వధ ఈ నాటిక కల్పనకు ప్రేరకాలై వుండపచ్చు, తల్లిదండ్రులచేత విడువబడిన బ్రాహ్మణ బాలకుణ్ణి భీముడు రక్షించడం దీనిలోని ప్రధానేతివృత్తం. కుంతీ కుమారులలో మధ్యముడైన భీముడీ నాటికలో నాయకుడు. కాబట్టి దీనికీ పేరు పెట్టబడింది.

2. దూతవాక్యం - ఇది వ్యాయోగ భేదానికి చెందిన ఏకాంకిక, శ్రీకృష్ణుడు పాండవ దూతగా దుర్యోధనుని కడకు రాయబారం నడపడం ఇందులోని వృత్తాంతం. ప్రదర్శనానుకూలతకై భాసుడిందు మూలానికి భిన్నంగా చేసిన కొన్ని చిరుమార్పులు కన్పిస్తాయి.

3. దూతఘటోత్కచం - ఇది వ్యాయోగ విభాగానికి చెందిన ఏకాంకిక. భారత యుద్ధంలో అభిమన్యుడు మరణించిన తర్వాత ఘటోత్కచుడు శ్రీకృష్ణుని ఆదేశానుసారం ధృతరాష్ట్రుని కడకు రాయబారం నడిపి, దుర్యోధనుడి చేత అవమానించబడి, అర్జునుడి చేతిలో కౌరవనాశం జరిగి తీరుతుందని హెచ్చరించి వెళ్లడం ఈ నాటికలోని గాథ. భారతంలో లేని ఈ కథ కవి కల్పితమే. 4. ఊరుభంగం - ఈ ఏకాంకిక కూడ వ్యాయోగ విభాగానికి చెందినదే. ఈ నాటికలో దుర్యోధనుడు భీముని గదాఘాతంతో తొడలు విరిగి పడిపోవడం, ధృతరాష్ట్రాదులు యుద్ధరంగంలోనే రారాజును చూడడం, అశ్వత్థామ సౌప్తిక వధకు ప్రతిజ్ఞ బూనడం దీనిలోని ప్రధానేతివృత్తం. ఈ నాటికలో దుర్యోధన పాత్ర ఉదాత్తంగా చిత్రించబడింది.

5. పాంచరాత్రం - ఇది మూడంకాల నాటకం, దశరూపకాల్లో సమవాకారమనే భేదానికి చెందిన ఈ నాటకం భారతానికి సంబంధించిన కథే అయినా ఇతివృత్తంలో చాలా భాగం కవి కల్పితమే. దుర్యోధనుడు యజ్ఞం చేసి గురుదక్షిణ కోరుకొమ్మని ద్రోణుణ్ణి ప్రార్థిస్తాడు. అతడు పాండవులకు అర్ధరాజ్య మిమ్మని కోరతాడు. ఐదురాత్రులలోగా పాండవుల పునికిని తెల్సినట్లయితే రాజ్యభాగ మిస్తానంటాడు దుర్యోధనుడు. విరటుని గోగ్రహణం, తద్ద్వారా పాండవులు బయటపడడం, దుర్యోధనుడు ధర్మజుడికి అర్థరాజ్యమివ్వడం జరుగుతుంది. ఇందులోని ప్రధాన గాథ ఇది. ఈ నాటకం ప్రకారం భారత యుద్ధం జరిగిందనడానికి అవకాశంలేదు.

భాసమహాకవి ప్రతిభాశాలియైన నాటకరచయిత. ఏకాంకికల్ని ఇంత వైశిష్ట్యంగా రచించిన నాటక కర్త సంస్కృత వాఙ్మయంలో లేడని చెప్పవచ్చు. కథా నిర్వహణం, సన్నివేశ కల్పనం, సంభాషణ చాతుర్యం, పాత్ర చిత్రణం, రసపోషణం ఈ కవీంద్రుని రచనకు వన్నె పెడుతున్నాయి.

ఈతని నాటకాల్ని శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహకవి లలితమైన గ్రాంధికంలో తెనిగించారు. భాసుని ప్రతిభావ్యుత్పత్తుల్ని తెలుగువారు గ్రహించాలనే తలంపుతో తి.తి.దేవస్థానములు వీటిని ముద్రించింది. విజ్ఞలోకం ఈ నాటకాల్ని ఆదరిస్తుందని నా ఆకాంక్ష.

కార్యనిర్వహణాధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.

పీఠిక

మధ్యమవ్యాయోగ మను నీరూపకము సంస్కృతభాషయందు సుప్రసిద్ధనాటక ప్రణీత యగు భాసుఁడు రచియించె నని సేనింతకు మున్ను తెలిఁగించిన స్వప్న వాసవదత్త నాటక పీఠికలో వ్రాసియుంటిని, భాసుఁ డీరూపకమును రచియించినట్లు గ్రంథములో వెచ్చటను జేర్పఁబడక పోయినను బలవత్తరము అయిన కారణములచేత నిదియు, మఱి పండ్రెండు రూపకములు నతఁడు రచియించినట్లు నిశ్చయింపఁ బడినది. వ్యాయోగ మనఁ గా-మహావీరుఁ డొక్కనాడు చేసిన వీరకర్మము వర్ణింపఁబడిన రూపకము. నరకాసుర విజయ వ్యాయోగము, ధనంజయ విజయ వ్యాయోగము మొదలగున నీజాతిలో ఁ జేరినవి. కాని యీరెండు నవీసములలో మధ్యమవ్యాయోగము మిక్కిలి ప్రాచీనము. ఇందలి యితివృత్తము మహాభారతాది గ్రంథములలో నెక్కడఁ గానఁ బడదు. భాసుని స్వకపోలకల్పిత మని తోఁచుచున్నది. ఇందలి కథ కొంతవఱకు రామాయణములోని శునశ్శేపుని చరిత్రమును, గొంత వఱకు మహాభారత మందలి బకాసురవృత్తాంతమును బోలి యున్నది. ఆ రెండుకథలు మనసులోఁ బెట్టికొని భాసుఁడు దీని రచియించె నని చెప్పవచ్చును. దీని కీపేరు గలుగుట కొక ముఖ్య కారణము గలదు. పాండవ మధ్యముఁడైన భీమసేనుఁడు ముగ్గుఱు బ్రాహ్మణ కుమారులలో మధ్యముని ప్రాణము రక్షించుటచేత దీని కీపేరు కలిగెను.

ఈరూపకము చూచునప్పుడు నా కొకసందేహము తోఁచినది. ఇందు భీమసేనుఁడు పాండవమధ్యముఁడని కవి చెప్పియున్నాఁడు. అర్జునుఁడు పాండవమధ్యముఁ డగునుగాని భీమసేనుఁడు కాండు. భీమసేనుఁడు కుంతీపుత్రులలో మధ్యముఁడు. కుంతికొడుకులు ముగ్గురే పాండవులని మనము గ్రహించిన పక్షమున భీమసేనుఁడు మధ్యముఁ డగును. అట్లు గ్రహించుటకు వీలు లేదు. కుంతికొడుకులు మాద్రికొడుకులుఁ గలిసి పాండవులగుదురు. తిక్కన సోమయాజికూడ నిటువంటి సందేహము గలిగించు శబ్ద మొకదానిని విరాట పర్వములోఁ బ్రయోగించి యున్నాఁడు. "వచ్చెం గుంతీసుత మధ్యముండు" అని యర్జున విషయమును సోమయాజి వ్రాసెను. అర్జునుఁడు పాండవమధ్యముఁడు కాని కుంతీసుతమధ్యముఁడు కాఁడు. మాద్రిమరణానంతరమున నందజను గుంతియే పెంచి పెద్దవారిని జేసిన కారణమునఁ గవిబ్రహ్మ ప్రయోగము సాధింపఁదలఁచుకొన్న పక్షమున ప్రధానపురుషు లైన కుంతీసుతులే పాండవులని మనమంగీకరింపవలెను. ఇంతకుమించినగతి వేడొకటి లేదు. లేదా, పూర్వభారతములలో భీముఁడే మూఁడవ కుమారుఁడుగాఁ జెప్పఁ బడియున్న దేమో? ఈవిషయమై పండితులు విమర్శింతురు గాక?

ఈయాంధ్రీకరణములో నే నొక క్రొత్తపుంత ద్రొక్కితిని. సంస్కృత గ్రంథములలోని కొన్ని శ్లోకముల భావము తెలిఁగింపఁబడునప్పుడు వృత్తముల లో నిముడక పెద్దదయి సీసమునకుఁజిన్న దై యాంధ్రీరించు వానికి గొప్ప మనస్సంకట మును గల్గించుచుండును. తెనిఁగించువా డట్టిసమయమున సీసపద్య మెత్తికొని భావము మొదటి నాల్గుపాదముల నిమిడిపోవుటచేత నెత్తుగీతమునకు భావ మభావముపుట చేత సహంభావము కొంత బూని తనసొంత కవిత్వమును జెప్పియో పదము అనవసరముగా దీర్ఘములు చేసియో కవిత్వమును లాగి లాగి యీడ్చియీడ్చి పూర్తిచేయును. అట్టిచిక్కు నాకును సంభవించినది. ఈవఱకు నేను నట్లు చేసినాఁ డను కాని యిప్పుడెట్టి పని సమంజసముగా లేదని తోఁచినందున శ్లోకభావము పెద్దదైనప్పుడు దానిని సీసపద్యములో నిమిడ్చి క్రింద నాటవెలఁదిఁగాని తేటగీతినిగాని చేర్చుట మానితిని. ఇందువల్ల కవిభావము వ్యక్తపఱుచుట కెంతపద్య మవసరమో అంత పద్యమే యల్లఁ బడుచున్నది. మూలకవిహృదయములో లేని నూతనభావము వచ్చుటకు వీలులేదు. నాయొనర్చినపని మిక్కిలి క్రొత్తమార్పుగాడు. నేను లక్షణ మతిక్రమింప లేదు. వ్యాకరణమును మీఱలేదు, సీసము క్రిందఁ జేర్పవలసినదని చెప్పిన పద్యమును జేర్చ లేదు. ఇది యే నాయపరాధము. ఇందుకుఁ బండితాభిప్రాయమే ప్రమాణము. ఇది త ప్పన్నపక్షమున వారి యభిప్రాయము శిరసావహించి దిద్దుకొందును. సంస్కృతమున మధ్యమవ్యాయోగము కవిత్వము నందు భావమునందు మిక్కిలి రసవంతమై యున్నది. నాయొసర్చీన యాంధ్రమధ్యమ వ్యాయోగమునం దిట్టిరసము కనఁబడక పోవునేని సయ్యది నాలోపముగాని భాసమహాకవిలోపము గాదు. అన్ని వ్యాయోగములలో నుండునట్లే దీనియందుఁగూడ నొక్కటే యంకము కలదు. అందుచేత దీనిం బ్రయోగించుటకు రమారమి యొకగంట కాలము పట్టును. కథాచమత్కృతి ప్రేక్షకులకుఁ జదుపరులకు నాహ్లాదముఁ గలిగించు నని నిస్సంశయముగాఁ జెప్పవచ్చును.

ఇట్లు,
చిలకమర్తి లక్ష్మీనృ సింహం.

విషయసూచిక

ఇందలి నాటికలు

1. మధ్యమ వ్యాయోగము

2. దూతవాక్యము

3. దూత ఘటోత్కచము

4. ఊరుభంగము

5. పంచరాత్రము