Jump to content

భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/రబియాబీ

వికీసోర్స్ నుండి

యుద్ధం వద్దని నినదించిన తెలుగింటి ఆడపడుచు

రబియాబీ

స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న సామాన్య స్త్రీలు పలు ఇక్కట్లు పడాల్సి వచ్చింది. ఈ వెతలు మూడు రకాలుగా ఆనాడు మహిళలను చుట్టుముట్టాయి.తొలుత కుటుంబం, ఆ తరు వాత సమాజం, చివరకు బ్రిటిష్‌ పోలీసు మూకల నుండి ఇబ్బందుల వాతావరణం. ఈ వెతలు ముస్లిం మహిళ విషయానికి వచ్చేసరికి మరింత కఠినమై వారిని ముందుకు సాగనిచ్చేవి కావు. బ్రిటిష్‌ పోలీసుల దారుణ దాష్టీకాల కంటే, కుటుంబం, సమాజం కల్పించే ఆటంకాల ప్రభావం వారి మీద తీవ్రంగా ఉండి, మాతృదేశ సేవామార్గంలో కొంతవరకు అవరోధాలయ్యాయి. అయినప్పటికీ శ్రీమతి రబియాబీ లాంటి సాహసులు ప్రతికూల వాతావరణాన్ని అధిగమించి జాతీయోద్యమంలో పాల్గొని చరిత్ర సృష్టించారు.

రబియాబీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం అనంతపురం జిల్లా చియ్యడు గ్రామానికి చెందిన మహిళ. ఆమె భర్త యం.మొహిద్దీన్‌ సాహెబ్‌. ఆయన స్వాతంత్య్ర సమరయోధులు. ఆమె భర్తతోపాటుగా జాతీయ భావాలను అలవర్చుకున్నారు. ఆనాడు మహాత్ముని నేతృ త్వంలో సాగుతున్న జాతీయోద్యమంలో భాగం పంచుకోవాలనుకున్నారు. కుటుంబం, సమాజం సహజంగానే ఆమె ఆలోచనలను ముందుకు సాగనివ్వలేదు. ఆమె నిరాశ చెందాలేదు. భర్త కూడ స్వాతంత్య్ర సమరవీరుడు కావటం వలన ఆయనతో తన

1327 అభిప్రాయాలను పంచుకున్నారు. భార్య ఆలోచనల పట్ల మొహిద్దీన్‌ సాహెబ్‌ ఎంతో సానుకూలంగా స్పందించారు. విముక్తి పోరాటంలో పాల్గొనాలని అభిలషిస్తున్నఆమెను ముందుకు సాగమని ప్రోత్సహించారు. ఆమెకు తోడుగా నిలిచారు.

ఆ సమయంలో ద్వీతీయ ప్రపంచయుద్ధం సాగుతోంది. భారతీయుల ఇష్టా యిష్టాలతో పని లేకుండ, భారతదేశాన్ని కూడ బ్రిటిష్‌ పాలకులు తమ పక్షంలో కలిపేసుకున్నారు. అందుకు వ్యతిరేకంగా భారత జాతీయ కాంగ్రెస్‌ ఉద్యమించింది. భారతదేశ వ్యాప్తంగా యుద్ధా వ్యతిరేక ప్రదర్శనలు ఊపందుకున్నాయి. ఆంధ్రులు కూడ ఏమాత్రం తీసిపోకుండా ప్రదర్శనలు నిర్వహించారు. ఆ కార్యక్రమాలలో భాగంగా అనంతపురం జిల్లాలో జరిగిన యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలలో రబియాబీ పాల్గొన్నారు. పర్దా చాటున వుండే ముస్లిం మహిళ బహిరంగ ప్రదర్శనలో పాల్గొని యుద్ధం వద్దని నినదించటం పట్ల సాంప్రదాయ వాదులంతా విమర్శలు చేయ గా ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆమెను అభినందించారు.

ఆ తరువాత కూడ ఆమె పలు కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. 1941లో అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల ఆటల మైదానంలో జరిగిన వ్యక్తి సత్యాగ్రహంలో కూడ రబియాబీ పాల్గొన్నారు. ఒక ముస్లిం మహిళ జాతీయోద్యమంలో భాగంగా సాగిన ప్రదర్శ నలో పాల్గొనటం, యుద్ధానికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం, వ్యక్తి సత్యాగ్రహంలో పాత్ర వహించడం తెలుగుగడ్డ మీద ప్రథమమని పలువురు శ్లాఫిుంచారు.

ఆనాడు జైళ్ళల్లో మహిళలకు అవసరమైన కనీస వసతులు ఉండకపోవడంతో మహిళలు అరెస్టులకు ఇష్టపడేవారు కాదు. జాతీయోద్యామంలో భాగంగా సాగిన పలు కార్యక్రమాలలో రబియాబీ పాల్గొన్నప్పటికీ, ఆమె అరెస్టు కాకపోవడంతో ఆ యోధురాలి సాహసకృత్యాలు పోలీసు రికార్డులలో నమోదుకు నోచుకోలేదు. ఆ కారణంగా శ్రీమతి రబియాబీకి సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో లేకుండాపోయింది.

ఆమె (బేగం అజీజున్‌) హృదయం షంషుద్దీన్‌ కోసం ఎంతగా తపించిపోయేదో, భారత స్వాతంత్య్రము కోసం కూడా అంతగా తపంచిపోయేది...ఆమె ప్రేమను బజారులో అమ్ముకొనలేదు. స్వతంత్ర సమర రంగంలో దేశభక్తికి కానుకగా అర్పించింది.

                                                                           - వి.డి.సావర్కార్‌

138