Jump to content

భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు/నామాట

వికీసోర్స్ నుండి

నామాట

ప్రపంచ చరిత్రలో అపూర్వం అనదగిన రీతిలో సాగిన భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింలు నిర్వహించిన పాత్రను వివరిస్తూ రాస్తున్న పుస్తకాలకు పాఠకులు, ప్రజలు,పత్రికల నుండి లభించిన ఆదరణ, ప్రోత్సాహంతో స్వాతంత్య్రోద్యమంలో భాగంగా,ఈ నేలతల్లి బిడ్డలైన ముస్లింల భాగస్వామ్యంతో సాగిన ప్రధాన ఉద్యామాలను ఈ గ్రంథాంలో క్లుప్తంగా వివరించాను.

భరతగడ్డ మీద బ్రిటిషర్లు బలపడుతున్న సమయాన,1763 ప్రాంతంలో ప్రారంభమై 1947 వరకు సాగిన పలు ప్రజా పోరాలలో ముస్లింలు తమదైన పాత్ర వహించారు. ఈ పోరాటాలన్నింటిలో ఖిలాఫత్‌ఉద్యమం అగ్రభాగాన నిలచింది. ఈ ఉద్యమం ముస్లిం-ముస్లిమేతర జనసముదాయాల మధ్య ఐక్యతకు, స్నేహానికీ, సామరస్యానికి ప్రతీకగా నిలిచి, విఖ్యాతిగాంచింది. జాతీయోద్యమం ప్రథమార్థంలో ప్రారంభమై,స్వాతంత్య్ర పోరాటానికే తలమానికంగా నిలచిన, ఖిలాఫత్‌ ఉద్యమం గురించి ఈ గ్రంథాంలో ప్రస్తావించటంలేదు. మరొక ప్రత్యేక గ్రంథం రాస్తే తప్ప, ఆ ఉద్యమ చరిత్రకు సరైన న్యాయం జరగదు.

ప్రస్తుత గ్రంథాంలో ఐదు ఉద్యమాల గురించి ప్రస్తావించాను. అవి ఫకీర్ల తిరుగుబాటు, వహాబీల పోరాటం, ఫరాజీల ఉద్యమం, మోప్లాల తిరుగుబాటు, ఖుదా-యే-ఖిద్మత్‌గార్‌ల అహింసా ఉద్యమం. ఈ ప్రతి ఉద్యమం గురించి ఒక ప్రత్యేక పుస్తకం రాయాల్సినంతగా ప్రజల సాహసం, త్యాగం, ఆత్మార్పణలు ఇమిడి ఉన్నాయి. నాకున్న పరిమితుల మేరకు ఆ వివరాలను రేఖా మాత్రంగా పేర్కొన్నాను.

ఈ అమూల్యమైన సమాచారాన్ని పుస్తక రూపంలో మీ ముందుంచగలిగే అవకాశం నాకు లభించినప్పటికీ, ఈ కృషిలో సమాచారం కోసం నేను సంప్రదించిన పలు గ్రంథా రచయితల, ప్రముఖుల పరోక్షభాగస్వామ్యం ఉన్నందున, ఆ మహనీయులందరికీనా ప్రత్యేక కృతజ్ఞతలు. నేను కోరగానే ముందుమాట రాసిచ్చిన గురుతుల్యులు,'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ప్రధాన సంపాదాకులు కె. రామచంద్రమూర్తి గారికి, పరిచయ వాక్యం రాసిన ప్రముఖ దళిత ఉద్యమకారులు, బహుగ్రంథ రచయిత కత్తి పద్మారావు గారికి, ఈ సమాచారాన్ని ధారావాహికంగా ప్రచురించిన 'గీటురాయి' వారపత్రిక సంపాదాకులు యన్‌.యం. మల్లిక్‌ గారికి, చిత్తు ప్రతిని చదివి, పలు సూచనలు చేసిన ప్రముఖ సాహితీవేత్త కొత్తపల్లి రవి బాబు గారికి, కవర్‌ డిజైన్‌ చేసిన ప్రముఖ చిత్రకారుడు అబ్దుల్లా గారికి, పుస్తకాన్నిఅందంగాతీర్చిదిద్దిన ముద్ర ఆఫ్‌సెట్ ప్రింటర్స్‌, విజయవాడ వారికి, నా ప్రయత్నాలకు అన్ని సమయాలలో ప్రేరణగా నిలచి, ప్రోత్సహిస్తున్న నా జీవిత భాగస్వామి షేక్‌ రమిజా భానుకు నా ధన్యవాదాలు.

అప్నాఘర్‌ ఉండవల్లి సెంటర్‌ - 522 501

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 01-12-2003