భారత అర్థశాస్త్రము/మొదటి భాగము - పదునొకండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పదునొకండవ ప్రకరణము

శ్రమవర్గు - పురుషకారము

శ్రమయనగా నేతదర్థముగాక భిన్నలాభప్రాప్తికై పడునట్టి ప్రయాస. చెండాడుట, జలకేళి, వనవిహారము ఈలాటివి అలసట బుట్టించునవి యైనను పరిస్రమార్థము చేయబడునవి గాన వ్యాయామము లనబడును. ఆటలలో ఆటయే కాంక్షితంబుకాని వేఱొండులేదు. నేయుటకై బట్టలు నేయువాం డ్రెవ్వరునులేరు. మఱి సాలెవాండ్రేల నేతపని జేతురన బట్టలనమ్మి వలయుసామగ్రుల గొనుటకు. అంత:పుర కాంతలు ఉద్యానవనవిహారమునకుం దొడంగిభంగి కృషీవలుడు నాగేటిని విహారార్థముగా భుజముమీదనెక్కించి పొలములకుబోవుట లేదు. కావున శ్రమ వ్యాయామములు భిన్నములనుట గ్రాహ్యంబు.

మహాత్ములైనవారు కృతకృత్యతకన్న మించిన మేలులేదని యెంచి తమ శక్త్యనుసారముగ బాటుపడుదురు. కాళిదాసునివంటి కవి జీతమునకై పద్యములు చెప్పునా? మన కాటలలో బాటవ ముండురీతి గొందఱికి శాస్త్రాధ్యయనమున నుండును. సాలెపురుగు తంతుసద్మముల నిర్మించునట్లును తేనెటీగలు మధువును గూడబెట్టు మాడ్కిని మహాకవులును విశేష శేముషీశోభితులైనవారును చిత్రకారులును సహజోద్యోగులై తమతేజంబు వెలిబుత్తురుగాని ప్రయోజనాంతరముల నంతగా ఆశించిచేయరు. కోయిల తనకు వశములేక కూయునట్లు కళాదక్షులు తమ నైపుణింజూపుట సహజము. అట్టివారికి ధనాదులు లభింపకపోయినను గీర్తి లభింపకపోదు. కావున ధనసిద్ధి ప్రసిద్ధులకై వారు తమ ప్రభావంబు బ్రకటించిరనుట న్యాయంబు గాదు. అమోఘంబులు నఖండ యశ:కరములగు సంకల్పము లట్టి మహామహులనుండి స్వచ్ఛందముగ నుద్భవించును. అయినను కేళుల వోలె తమవిధులం దీర్చుకొనువారు వెయ్యింటి కొకరును గలుగుట యరుదుగాన శ్రమ కార్యసాధనంబునకు దావలంబనుట నిజమే.

ఒకనికి క్రీడగా గనుపించునది మఱొక్కనికి క్లేశకరమైన క్రియగా దోపవచ్చును. రాజులకు వేట వినోదము. మాంసమునమ్మి బ్రతుకు సాగించుకొను బోయవాని కందులో నానంద మేమియు నుండదు. మఱి పొట్టకొఱకై పడవలసిన పాటుగాన నప్రియముగా నుండును.

పురుషకారము హీనముగా నెంచుట తగదు

ఉద్యోగయుక్తులమైనంగాని ఫలసిద్ధిచేకూఱదు. పక్వమైన పండ్లు సైతము తమంతటవచ్చి మననోటబడవు. దేవుడే గతియని యూరకున్న అభావమేగతి. ప్రయత్నంబులెల్ల సఫలంబులౌనా యని కొందఱాక్షేపింపవచ్చును. ప్రయత్నములేనిది సిద్ధికాదని యంటిమిగాని సర్వ ప్రయత్నములును సిద్ధినొందునని వచింపలేదు. కాన నీయాక్షేపణ యప్రయోజనము. ఈ విషయమైన వాదముల గొన్నిటి నింకను విమర్శించుట యర్హంబు.

భారతములో జెప్పబడిన

       గీ. "కార్యఫలములయెడ దాన కర్తననుట
           కడు నెఱుంగమి జువ్వె: దా గర్తయేని
           దవిలి తనదైన కార్యజాతంబు లెల్ల
           జెడక ఫలియించునట్లుగా జేయరాదె?"

అను పద్యము ప్రబలప్రమాణముగా నందఱిచేతను గ్రహింపబడియున్నది. ఈ తర్క మెట్లున్న దనగా "నేను సర్వశక్తుడనుగాను. కావున నాకు ఏశక్తియులేదు" అన్నట్లు. "నాకు ఎగురుటకు ఱెక్కలులేవు. కాబట్టి నడచుటకును కాళ్ళులేవు" అనిన నెంత పరిహాసపాత్రమో యోచింపుడు. "పౌరుషమొండే చాలును వేఱేమియు బనిలేదు" అని వాదించువార లెవరును లేరుగాన నీప్రత్యాఖ్యాన మెవరిపై నెత్తబడిన బ్రహ్మాస్త్రమో తెలియ రాకున్నది. ఈగ్రంథమున జెప్పియుండునదేమన, "సర్వఫలములకును మూలాధారములైనవానిలో పౌరుషంబొండు" అని. ఇంతకన్న నెక్కుడు ప్రభావంబు పురుషుల కారోపింప బడదయ్యె. మఱియు ఆపదలు, రుజలు, మరణము పుట్టుక తనవశముగాకుండును గాన సర్వము దైవముయొక్కయో కర్మయొక్కయో వశమనుటయు గలదు. అనగా అసాధ్యములు కొన్నిగలవు గాన సాధ్యములేవియు లేవనుట! ఇది పొసగునో పొసగదో యోచించిచూడుడు! ఇంతే కాదు. నేను సర్వకర్త కాదనుట నిజమేకాని యది హేతువుగ సర్వకర్తృత్వ మింకొకని కెట్లు సంఘటింపవచ్చును? నేను పరమదరిద్రు డైనందుననే కుబేరు డింకొక డున్నాడని సాధింపగలుగుటెట్లు? నావికార మింకొకని సౌందర్యమునకు గారణమా? అది యట్లుండె. ప్రకృతియు నాధారకారణములలో నొకటియని యంటిమి. కావున ప్రకృతి ధర్మములకు విరుద్ధములైన వర్తనములు అసంగతములో అనిష్టాకరములో యౌటబట్టి దానితో సంశ్లేషించినంగాని వ్యర్థంబవు పౌరుషంబు తనంతట పూజనీయముగాదని సాధించుట హేత్వాభాసం బగుట కేమిసందియము? మరణము స్వభావసిద్ధము. అనగా ప్రకృతి ధర్మములలో నొకటి. ప్రకృతికి సహకారియు ననుకారియునైన మానుషయత్నంబుచే నది నిర్జితంబు గాకపోవుటంబట్టి మనయత్నంబు లెందునకు నుపయోగింపవనుట యసంబద్ధప్రలాపమేగాని వేరుగాదు. విత్తు భూమిలో పడనిది చెట్టుమొలవదు. కాబట్టి చెట్టుమొలచుటకు విత్తుగాదు కారణము భూమియే అన్నట్టున్నది. ఇది సరియైన వాదమే యైనపక్షమున ఇదేరీతిని భూమికాదు. విత్తేకారణమనియు జెప్పవచ్చునుగదా! అన్యోన్యాశ్రయములనుగూర్చి విచారించునపుడు ఒకటి హెచ్చు మఱియొకటి లొచ్చు అనుట మిధ్య. రెండును సమముగ ప్రధానములనియు వాని సాంగత్యము కార్యసిద్ధి కాలవాలంబనియు నెఱుంగునది. ఏడును రెండును గుణించిన పదునాలుగు అగును. పదునాల్గు కలుగుటకు 'ఏడాకారణము రెండాకారణము?' అని యడుగుట మోఢ్యసూచకమేగదా!

మఱియు ఒకప్పుడు అసాధ్యములని యుద్యోగింప బడనివి కూడ సుసాధ్యములౌటయు గన్నులార జూచుచున్నాము. రైలు టెలిగ్రాప్ ఆకాశయానము ఇవి మనుజమాత్రునిచే రచియింపనౌనని మన తాతముత్తాత లెఱిగియుండిరా? ప్రకృతి శాస్త్రజ్ఞులచే నిర్మితములును పరిగృహీతములునైన యిట్టి యద్భుతముల కెవ్వడు మేర నేర్పఱుపగలడు? కాలక్రమేణ వీర్యవంతులగుచు వృద్ధిమార్గముల నిరోధించు నంతరాయముల నడంచుచు విఘ్నేశ్వరులై వృద్ధినొందు వారిం జూచుచుండియు "పురుషప్రయత్నము వృథ. ఏమిచేసిన నేమిలాభము? చచ్చినవారు మఱల బ్రదుకరుకదా" యని మూలగూర్చొని మూల్గువారి నేమనవచ్చు? చచ్చినవారు బ్రదుకుటయట! బ్రతికినవారు చచ్చినవారివలె నుండకున్న జాలదా?

పౌరుషహీనతకు స్వప్రయోజన పరత్వము కారణము

ఇట్టి విచారములకుం గడంగువారు స్వప్రయోజనపరులేకాని సంఘవృద్ధి నభిలషించు పరోపకార బుద్ధిగలవారుకారు. "మాకు మరణము తప్పదు? చచ్చునప్పు డేమియు నెత్తుకొనిపోము. కావున కష్టపడి సంపాదించి లాభమేమి? ఆ కష్టమునైన జాలించి నష్టములేనివారై యుందుము" అని తలపోయువా రెంత నికృష్టాత్ములో యోచింపుడు! తాము శాశ్వతులుగాకున్న సంతతియు దేశమును శాశ్వతత్వములేనివా? తనచావు జలప్రళయమా? ఆర్జించినది తాను దీసికొని పోలేకున్న నితరులం జెందదా? ఇతరు లనుభవించుటంజూచి యోర్వలేనివాడు మనుష్యుడా రాక్షసుడా? తనకు వలసినంత మాత్రమేకాని యెక్కువ యార్జింపరాదనుట నీచబుద్ధి. ఈ స్వోదర పోషతత్వమే "దేవుడు బెట్టినట్లుకానీ. ఈ ప్రయాసలేల? జగమున మమతయుంచరాదు. ఈ దేహము నమ్మకముకాదు" ఇత్యాది తత్త్వములకుం గన్నతల్లి. సోమరితనమునకుం దావలంబు.

సంఘపరత పౌరుషోద్దీపకంబు

ఐరోపాఖండీయు లీవిధమున గలలోనైన దలపరు. "నేను బోయినను నావారీ భూమండలమున నిలుతురుగాదె! వారు ప్రసిద్ధిగను సుఖముగను ఉండిన నంతకన్న తృప్తికరమేమి? సంఘంబు శాశ్వతంబుగాన దానికై పడుపాట్లును శాశ్వతములే. కార్యమిపుడు సమాప్తి జెందినను దానిఫలము యుగాంతమునకుంగాని నశింపదు. నేడు యుద్ధముచేయుట కుపక్రమించితి మనుకొనుడు. అపజయమైనను ఇప్పుడు చూపిన బలపరాక్రమములు పరిశ్రమచేత నుత్కృష్టములగును. ఈమాత్రముకాదు. వినినవారికిని కనినవారికిని మున్ముందు ఉత్సాహము బుట్టించు. వీరియుత్సాహము వీరితో బోవునదిగాదు. తదనంతరులంజేరి యట్లే కాలంబు కొనవఱకును వ్యాపించును. కావున పురుష కారంబు బుద్బుదప్రాయమనియుం బ్రయోజనకారి గాదనియుం జెప్పుటతప్పు. తనకుంగాకపోయినను సంఘంజెందును. సంఘం తనకన్న నెక్కుడుగాన నట్లగుటంగూర్చి చింతించుట అధమస్వభావంబు. ఇమ్మాడ్కి బరిగణించువారు గావుననే పశ్చిమ ఖండీయులు ప్రధిత స్థితింగాంచి సార్వభౌమపదవి నందియుండుట. ఇక వేయేల? "తనదు:ఖమె సర్వలోక దారిద్ర్యంబున్", "తనచావు జలప్రళయము" అని వేమన నుడివినట్లు మనదేశములో ప్రతివాడును ఏవిచారణ కారంభించినను తన సుఖదు:ఖములదప్ప నితర విషయములను గుఱించి చర్చింప బూనుటలేదు. పాశ్చాత్యులు సంఘము ప్రధానముగానెంచి సంఘపరమైన చూపుతో దత్త్వాదుల నిర్ణ యింతురు. తన పరమైన యాలోచన లాధారముగాగొని విశ్వస్వభావము నిర్ణ యింపజూచుట మనపద్ధతి. ఇయ్యది యెంతమాత్రము గణ్యమైనదిగాదు. జాత్యుపజాతి భేదములచే విభిన్నులైన యీ దేశము వారికి సంఘీభావ మనుమాట యూహకు రానిదై నందున వేఱొక సరణిని తత్త్వనిర్ధారణముచేయుట కలనైన దట్టకపోయెను. అసలు సంఘమే లేనప్పుడు సంఘలక్షణ ధర్మములకును ప్రత్యేక ప్రాణిలక్షణ ధర్మములకునుగల వ్యత్యాసము గనిపెట్టి పృధక్పాత్రలకన్న సంఘమే ముఖ్యమని గ్రహించి తన్మూలముగ సత్యాస్త్య (సత్తు అసత్తు అను) విచారణలు జరుపుట యన నెక్కడనుండి వచ్చును? ఇదియే హిందూయూరోపియనుల తత్త్వములకుగల ముఖ్యాంతరము. ఇంగ్లీషువారు జగత్తు సత్యమనియు దినదిన ప్రవర్ధమానమనియు సుఖదాయియనియు సంఘలక్షణములంబట్టి నిరూపింతురు. మనము మనయింటగల్గు నొకటిరెండు జననమరణాదులం జూచి "సంసారము దు:ఖసాగరము. నిధ్య, గర్హ్యము" అని వాపోవుదుము. ప్రతివాడును దుర్బలుడైనను సంఘ మేకీభావము దాల్చెనేని యనిరుద్ధమగుననుట తెలియనివారమౌటను, దేశముయొక్క యుష్ణప్రకృతిచే శోషితసత్త్వులమగుటను; గ్రీకులు మహమ్మదీయులు చీనావారు మొదలగువారు దండెత్తి యథేచ్ఛముగ గొల్లలాడి కష్టించి ఆర్జించినవాని దోచుకొని మనకష్టమును వృధచేయుటం బట్టియు, అశక్తులకును సహజమగు తనివి జెందవలయునను నాశచే "దైవకర్మములే అన్నిటికిని గర్త" లనియు, "బురుష కారంబు నిష్ప్రయోజనం" బనియు, "శుభాశుభంబు లాత్మతంత్రంబులుగా" వనియు బూతు సంకేతములు గల్పించుకొని అపజయమునకన్న ననర్థములగు తృప్తిని సోమరితనమును దాల్చితిమి. పౌరుషము సాగనందున గల్పించుకొనబడిన తత్వములుగాని ఇవి, వీనిచే బౌరుష హీనులమైతిమనుట బొంకు. అపజయముచే ఉత్సాహహీనతయు, నందుచే నన్నియు నుడిగి మూలజేరి తప్పించుకొందమనుబుద్ధియు, శమదమాది నిరతియు బొడమును. ఇపుడైననేమి, జయము లబ్బునేని రాజసత్వంబుదాల్చి ప్రతాపమూర్తులము కాగలము. మనవారు బల గరిష్ఠులుగానున్న కాలంబున

        మ. "విను ముద్యోగము రెంటియందు బర ముర్వీనాథ: యుద్యోగ వం
             తునకుం దైవము తోడ్పడంగ ఫలసిద్ధుల్ చేకుఱున్ మానసం
             బున నొక్కొక్కెడ సిద్ధిదప్పిన వగల్ వొందంగ రానీక య
             ప్పని దైవోపహతంబుగా గనుట భూపాలార్హ వృత్తంబవున్."

అని పురుషకారంబునకు నాయకత్వంబును దైవంబునకు భటత్వము గల్పించి ప్రతికూలకాలములలో మనస్తాప శమనార్థము దైవమునకు గర్తృత్వము గట్టవలయు ననిరిగాని కాలము, కర్మము ఇత్యాదులకు భూభారధౌ రేయతం బట్టము గట్టలేదు.

మనప్రాణము శాశ్వతము గానంతనే లోకమంతయు మిథ్యయనుట యెంత అహంభావమును సూచించుచున్నదో యోచింపుడు! రెండవది. ఉండు జీవమును సార్థకము జేయజాలనివారలకు చిరంజీవిత్వ మేలకావలయునో తెల్పుదురా? కార్య కౌశలమున సిద్ధ సంకల్పులట్లుండియు బాశ్చాత్యులు కాకులరీతి జిరజీవిత్వ మపేక్షింపరుగా? ఇది ఆలోచింప సోమరిపోతులకేకదా కాలము చాలదనుట ప్రస్ఫుటంబయ్యెడు. ఒక్కవేళ దేవుడు ప్రత్యక్షమై మీ రమర్త్యు లౌదురని వరంబొసఁగెఁబో అపుడైన వీర లుద్యోగయుక్తులౌదురా! బహుశ: కారు. "ఎట్లును చావులేని బ్రతుకు గడించితిమిగదా! ఇంకేల కష్టపడవలయు? ఏమిచేయకున్నను చావేమోలేదు. పాటుపడుటెల్ల ప్రాణములు నిలుపుకొఱకు. అవి యెట్లున్నను నిలుచును గాన హాయిగా నిద్రబోవుద" మని కుంభకర్ణదీక్ష నవలంబింతు రేమో!

తొలుత గవర్నమెంటువారు కలరా మశూచి మొదలగు రోగములకు వ్యాఘాతముగా క్రియలు వాడుకకు దెప్పించినపుడు "అబ్బా! ఇవి తగిలినవారుగూడ బ్రతుకగలరా" యని హేళనము జేసిరి. ఫలాని ఫలానివారు చావరు అని అభయమిచ్చుటకు బ్రిటిష్‌వారు మంత్రవాదులుంగారు; ఋషులుంగారు. వారి యుపదేశముచేత మొత్తముమీద అనగా సరాసరికి మునుపటికన్న నెక్కువమంది పోవుచున్నారా, తక్కువమంది పోవుచున్నారా యని విమర్శించి ప్రశ్నింప వలయుగాని తన పుత్రుడో పెండ్లమో పరలోకగతు లైనందున చికిత్సలన్నియు హుళుక్కియనుట తెలివితక్కువమాట యౌటమాత్రమేకాదు. "సంఘ మెట్లున్ననేమి మేము మాకుటుంబ మును క్షేమముగనున్న జాలును" అని యెంచు నీచాత్ము లనుకొను వాక్యము. ఇంతేకాదు. ఇట్లుచెప్పుట తమమేలునే యథార్థముగ నెఱుంగమియుం బ్రకటించుచున్నది. ఎట్లన:- వీరు కాలోపహతులైనను సంఘము స్థిరముగా నుండును. సంఘ మడుగంటిన వీరొంటిగా నిలుచుటకగునా? నిలిచి యేమిచేయ గలుగుదురు?

కావున నేను నొక్కి వకాణించున దేమన్నను, పౌరుషము గౌరవముగలది. తుచ్ఛమైనదిగాదు. ఏవిషయముయొక్క యాధార్థ్య మెఱుగగోరినను భిన్నపాత్రముల పరముగ విచారించుట సంపూర్ణ తత్త్వ బోధకంబుగాదు. అక్షరములు పదములచేతను, పదములు వాక్యములచేతను, వాక్యములు గ్రంథములచేతను అర్థవంతంబులు గాను గణనీయంబులుగానునౌను. అట్లు నరుండును సంఘముంజెందిన జరితార్థుడౌనుగాని, తనంతట గనిగొనిన నిరర్థకుడును, నిష్ప్రయోజనుడును, నశ్వరుడుగాను దోచును. సంఘము, జాతి, దేశము, రాష్ట్రము, లోకము అను సమూహములకు మనము అంగంబులును అంగములలో నణగియుండు నణువులను బోలినవారము. సంఘీభావము లేనివారమగుటచే నిమ్మహాతత్త్వంబు నెఱుగక వెఱ్ఱివేదాంతములను ఉరులం దవిలి యలజడింగొంటిమి. ఇకనైన మనకు బుద్ధివచ్చునా? యాథార్థ్యము విచారింప గడంగుదుమా? ఈ యురులలోనుండి విమోచనము గలుగునా? చూడవలయు.

శ్రమ యర్థముల సమకూర్చు విధంబులు

ఇక శ్రమ అర్థప్రాప్తి నేయే విధంబుల సమకూర్చుననుట వివరింతము.

1. పరిగ్రహణక్రియలచే ప్రకృతిలోనుండి ఉరువిడి నుప్పతిల్లం జేయుట. ఉదా. ధాన్యలోహమీనమాంసాది పరిగ్రహణము.

2. రూపభేదంబుల గల్పించుట-వడ్లు ప్రత్తియు నట్లే యుపయోగమునకురావు. మఱి అన్నవస్త్రాదిరూపంగ మార్పుజెందవలయు. 3. స్థానభేదము గల్పించుట - కాశిలోని పట్టుచీరలు మద్రాసులోని సుందరీమణులు ధరించి వాహ్యాళి వెడలవలయునన్న తొలుత నాచీర లింతదవ్వు తేబడనిది వారి కుపయోగ్యములుగావు. ఎచ్చట భోగ్యములో అచ్చటికి సరకులందెచ్చుట ఆనయంబు నాబడు.

4. రక్షక సంఘటనము. సంచితవిత్తముల భద్రముజేయుటకు ఇండ్లు ఇనుపపెట్టెలును వలయుగదా! లేనిచో మనకు దక్కవు.

5. ఉపకరణ నిర్మాణము - ఉలి, ఱంపము, మడకలు, యంత్రమలు ఈలాంటి సాధనములులేక చేతులతోమాత్రము పనిచేసిన ఎక్కువ గడింపజాలము.

6. వినిమయము - అనగా క్రయవిక్రయములు. వీనిచే నెవ్వని కేమాత్ర మేవస్తువుగావలయునో యది నిర్ణయింపబడుగాన నిదియు సార్థకశ్రమయే.

7. విచారణ - అనగా పనివారు పాటుపడుచున్నారా లేదా యని గమనించుట.

8. యంత్రసృష్టి వాణిజ్యవిస్తరము - ఇత్యాదులకు నాద్యంబగు మంత్రశక్తి. అనగా ఆలోచనాసామర్థ్యము. బుద్ధిబలము దేహబలంబునకుం దోడ్పడినగాని కార్యము జరుగుట యఱిది.

ఇట్లు పురుషకారంబు నానావిధంబుల నర్థప్రాప్తికి సాధనం బగును.

ప్రత్యక్ష పరోక్ష ఫలంబులు

నేరుగా అనుభవమునకు దెచ్చికొనుటకై పడెడుపాటు ప్రత్యక్ష ఫలదాయి. ఉదా. పండ్లుగోసితినుట. మధువుగ్రోలుట. ఈ జాతికిజేరిన యుద్యోగము లంతగాలేవు. ధాన్యమాంసంబులు సైతము వండబడినం గాని నాగరికులకు దినుటకుంగావు. కావున వ్యాపారములన్నియు దఱుచు పరోక్షఫలదాయకములని తెలియునది. అనగా వర్తమానంబునంగాక భావిని వినియోగ్యార్ధముల నిచ్చునవి యనుట, కృషికుడు దున్నినది గోలె సుమారు నాలుగైదు నెలలు పక్షివలె వేచియున్నంగాని గింజలు లభింపవు. లభించిన ధాన్యం నెండబెట్టి దంచి, పొట్టు, తవుడు వేఱుచేసి బియ్యము వడయుటకు మఱియొకనెల పట్టును. అప్పటికి నది యనుభావ్యముగాదు. పిమ్మట భార్యచేతికిచ్చి వండించి విస్తరిలో వేయించు కొనవలయును. తదనంతరము భుజించి కృతార్థుడౌట. ఈ కడపటి కార్యము ప్రత్యక్ష ఫలదాయి తక్కినవన్నియు నిందున కనుగుణములైన పరోక్ష ఫలప్రదాయిక క్రియలు. కావున నారంభసిద్ధులకు నడుమ గొద్దియో గొప్పయో కాలము గలదు.

కాలప్రభావము

ఇక గాలప్రభావంబు నిర్ణయింతము. అర్థంబుల యుత్కృష్టతతోన నిరీక్ష్యమాణకాలంబును యధాక్రమంబుగ వృద్ధిజెందెడిని. వేటకాడు బాణసంధానముజేసిన కొంతకాలమునకే మాంసము గడించిన వాడగును. అయినను వేటకాని బ్రతుకొక బ్రతుకా? నేడు మృగముల మందలుగ గనుగొని చావగొట్టవచ్చును. మఱునాడు వెదకి వేసరిల్లియు నేమియు బడయకపోవచ్చును. చింతలేని జీవనము గావలయునన్న తానే మేకలను జింకలనుబెంచి గొల్లవాని వృత్తి నవలంబించుట యావశ్యకము. మేలైన జీవితముగావున పిల్లలు పెద్దవి యగువఱకును పెద్దవియీని మంద సమృద్ధిగ జేయువఱకును వేచియుండవలయుటయేగాక మితముగా మందచెడకుండునట్లు హింసింప వలయునేగాని అశ్వత్థామ పాండవసేనం జేరినట్లు ఒకేరాత్రే చించి చెండాడిన మఱునాడే అష్టదరిద్రుడౌను: ఇంకొక దృష్టాంతము ఒక నెలలో తయారు చేయబడగల మగ్గముతో మనసాలెవాండ్రు 20 రూపాయల సరకుల నేయగలరు. ఒక సంవత్సరమునకైనంగాని ఆవిరి విద్యుచ్ఛక్తి వీనితోనడచు దూదియంత్రమునుచేసి నిలుపుటకుగాదు. కాలయాపనమైననేమి? పనికి మొదలుపెట్టినతోడనే దినమునకు వెయ్యి రెండువేల రూపాయల సామానుల దయారుచేయవచ్చును. కావున నుద్యమము ఘనంబగుడు నిరీక్షణకాలము నెక్కువయగును. త్వరత్వరలో లాభమువలయునన్న అల్పలాభప్రాప్తియేకాని విపులధనము నార్జింపలేము.

దీర్ఘదర్శితము దమము ధైర్యము అర్థార్జన కారణములు

చూచితిరా కాలమహిమ? విత్తము లుద్భూతంబులు కావలయునన్న వేగిరపడగూడదు. మఱి దూరపు జూపుగలవారమై దమముం బూనివుండుటఆవశ్యకంబు. దీర్ఘదర్శిత్వమును దమమును స్వప్రయోజన పరులై ఆతురతగొన్నవారి కలవడవు. "ఆత్రగానికి బుద్ధిమట్టు" అనగ వినమే! మఱియు ధైర్యము ప్రధానంబు. భవిష్యత్తు వినిర్ణీతంబుగాదు. ఎప్పు డెట్టి విఘ్నములు తటస్థములౌనో! ఎట్టి ఆలోచన పరులకును ఒకానొకప్పుడు తా మెదురుచూడని ముప్పులు వచ్చును. అట్టివేళలందు దమ సర్వస్వమును మునిగినను మునుగును. అపాయములు కలుగునని భయపడరాదు. అట్లు భయపడుట వృద్ధికి గొప్ప యర్గళము.

మృగములకు ముందు చూపులేదు. ఆకలియైనప్పుడు దినుట, తక్కినకాలముల నూఱకుండుటయు వానికి స్వాభావికములు. అట్లే మృగప్రాయులైన మనుజులును ముందు జాగ్రత్తలేనివారై కష్టములు వచ్చినపుడు "ఇట్లు చేసినబాగు, ఇక ముందు ఎంతోతెలివితో వర్తింతుము" అని యనుకొని మఱల నెప్పటియట్లు ఆ ఆలోచనముం గొల్పోయి యిడుములు గుడుతురు. పెండ్లి పేరంటములలో ముందు వెనుకలు విచారించక వెచ్చమొనరించి యప్పులపాలైన వారి నెందఱి జూచుచుండలేదు? చూడుడు! ఇంద్రియనిగ్రహ మవశ్యకర్తవ్యమని బోధించు మతము మనది. ఈ నిగ్రహము నోటిమాటలలోనేగాని చేతలలో లేదనుట తేటతెల్లంబు. ఎట్లన మితిమీఱి శుభాశుభములలో సెలవుజేయుట కేమికారణము? అక్క ప్రక్కల బంధువులేమైన నందురను భీతియేకదా? పిఱికితనమునకు లొంగువానికన్న నధము డెవ్వడు? వెఱపునే ఆపజాలనివాడు ఇంకెద్దాని నడ్డగింపగలడు? యోచింపుడు. తన మనోనిశ్చయమునకన్న ఎల్లమ్మ పుల్లమ్మ ఎక్కువయని యాదరించువాడు మగవాడో మ్రానో?

మూలధనము

విపులార్థసాధనంబునకు కాలంబొక కతంబు. ఫలము చేతికందు వఱకును కర్ముకరులకు భరణము జరుగవలయుగదా! నిరాహారులై వుండుటకు వీరివల్లగాదు. అట్టిగారడీవిద్య ఋషులపాలిసొత్తు. మఱియు నితరసాధన కలాపము పచ్చిసరుకులును గావలసియుండును. పరిశ్రమ కాలంబున వినియోగ్యములు లభించు పర్యంతము కర్మకరపోషణాది ప్రయోజనములకై యుపయోగింపబడు వస్తుసముదాయంబు మూలధనంబు. మూలమనగా వేరు. చెట్టునకు వేరు ఎట్లో అట్లే వ్యవహార విస్తృతికి మూలధనం బాధారంబు. మూలధనంబులేనిది గడన గొంత మట్టునకున్నను అది వ్యాపింపజాలదు. పశ్చిమఖండపువారి కళా వాణిజ్యము లింత విశ్వవ్యాప్తములై యుండుటకు వారికింగల అమిత పరిపణములే నిదానంబులు. ఈ విచార మింకను ముందు చర్చింతుము.

దీర్ఘదర్శిత్వము నాగరికుల లక్షణము

ముందు జాగ్రత్తయనునది నాగరికతంబట్టి యుండును. మృగప్రాయుల కుండదు అడవిమనుష్యులకన్న మనముమేలు. మనకన్న ఇంగ్లాండ్ జపాన్ దేశస్థులుమేలు. ప్రాజ్ఞులైనవారు తాత్కాలిక ఫలములనేఆశింపరు. చిత్తసంప్రధారణముగలిగి భావికి వలయువానిని సిద్ధము జేయుటయందే యుద్యోగింతురు. దృష్టములకన్న నదృష్టంబులు ముఖ్యంబులు.

సార్థక విరర్థక శ్రమలు

సార్థకము నిరర్థకము అని శ్రమ ద్వివిధంబు అని కొందఱి అభిప్రాయము. కృష్యాదులలో ఒకతూము వడ్లుచల్లి యొకపుట్టి వడ్లుం గైకొందుము. గనులు త్రవ్వుట మొదలగు క్రియలలోను నిట్లే. పరిగ్రహణక్రియలలో వెచ్చింపబడిన దానికన్న ఉత్పన్నమగు రాశి అధికముగాన నిక్కమైన యుత్పత్తి వీనిలో గలదుగాని, రూపస్థలభేద మాత్రంబునుంజేసి రాశిని వృద్ధిజేయని కళావాణిజ్యాదులు సార్థకములు గావనియు వానిచే సరకులకు గురుత్వంబు రాదనియు దర్కించుట పూర్వపక్షము. దీనికి ఉత్తరపక్షమేమన్నను 1. సరకులు బరువెక్కువగాకున్నను యానవాణిజ్యాదులచే పూర్వము వివరింప బడినట్లు వానియుపయుక్తత వృద్ధికివచ్చును. కావున నివి సార్థకములే. 2. కృషియందును పరిమాణవిస్తృతిలేదు. "ఇదేమి చిత్రము. ఒకచిన్న గింజనునాటి కౌగిలికినందని గుమ్మడికాయ లిరువది యుత్పత్తి జేయుచున్నాముగదా! పరిమాణవిస్తారమిందులేదా?" అందురేమో కనుగొనుడు! గుమ్మడితీగపీల్చు నీరు గాలి సత్తున వీనినన్నియు జేర్చి తూచినచో ఆగింజనుండి యుద్భవించిన ఆకులు పువ్వులు పండ్లు వీనికి సరిపోవును. ఇది పరీక్షించి కనుగొన్న న్యాయంబు విశ్వమునందు మార్పాటులు గలవుగాని ప్రకృతి యెచ్చు తక్కువలు బొందుట యసంభవము. ఒకవస్తువు వృద్ధిజెందుట యనగా నేదైన ఇతర పదార్థమునుండి సారము గ్రహించుననుట. కావున నొకచో పెఱుగుట యున్న నింకొకచో తఱుగుట యుండును. ప్రకృతి పరిమాణము వికార రహితము.

కృషియందు ఎక్కువపంట లభించునట్లే కర్మలయందును జేయవచ్చును. సాలెవాడు దట్టముగ రంగుబట్టించిన నాదోవతి దానిలో బెట్టబడిన నూలుకన్న బరువుగ నుండును. రంగు పదార్థముయొక్క రాశి తగ్గినదిగదా యని యాక్షేపింతురేమో కృషిలో మాత్రము భూసారాదులు కృషింపలేదా యను బ్రశ్నయే యిందులకు బ్రత్యుత్తరము.

వినియోగమునకు నవసరమైన క్రియలన్నియు సార్థకములే

పోలీసువారు, వకీళ్ళు, ఆటపాటల నభినందింప జేయువారును సార్థకులా, నిరర్థకులా యనుట విచారణీయము. ఉల్లాసము నుత్సాహము నిచ్చును గాన నాటక ప్రదర్శనాదులును పరోక్షంబున సఫలంబులే. విరామములేక ఎడతెగని యత్నములం దొడరియుంట యెవ్వనికిని సాధ్యంబుగాదు. కొందఱు విరామసమయంబున పరిశ్రాంతియని భ్రమించి యేమియు జేయక శయనింతురు. ఇది మూడత్వము. నిష్కర్మత క్లేశకరంబు. దేహమునకు మనమునకు నాయాసము దెచ్చునది. విశ్రాంతియనగా కార్యాంతరగామియౌట. భూమి వివిధ సస్యంబులం బంటబెట్టిన నేరీతి నవంధ్యయై పరిడవిల్లునో అట్లే వివిధ కృత్యాచరణంబున మనమును అక్షయ బలోపేతుల మగుదము. మఱియు బనులెంత శ్రద్ధవహించిచేతుమో విరామంబున నంత యాసక్తితో క్రీడాపరాయణుల మగుదుము. మందులకు రెంటి యందును తవులు తక్కువ. యూరోపియనులు కార్యములపట్ల సాహసోదగ్రులుగాన వినోదప్రియులు నైయున్నారు. ఆటలయం దాదరాతిశయము గల్గియుంట కర్జంబు గాదనుట కరము ప్రమాదంబు.

ఇక ఉద్యోగస్థులన్ననో వీరును దొరతనము నడుచుటకు పాత్రములు. రాష్ట్రంబు చక్కగ పరిపాలితము గాకపోయిన "ధన దారాదికముల నెవ్వనికిని రక్షింపవశమె?" అని శుక్రాచార్యు లన్నట్లు ఒక్కసంపదలేకాదు ఎవ్వియు మనకు నిలువజాలవు. కాన నేయుద్యమమునకుం గడంగుట గలుగదు. ఈ దేశ మరాజకమై వివిధోత్పాత పీడితంబౌటబట్టికాదె మనము తాత్కాలిక ఫలాపేక్షులమై ఉత్తర కాలముల నరయక చిక్కినమట్టు చాలునని యీ గతి పౌరుషహీనులై యుండుట తటస్థించె? కావున రాజ్యాంగములు చక్కగా నడువ వలసినవియేయైనను అవియే అనుచిత మార్గములంబూనిన అరాజకమున కన్న నెగ్గగు. అక్రమ ప్రభుత్వమునకన్న నిష్ప్రభుత్వమే నీటు. కావలివాడే దొంగయైన నేమిగతి

ప్రకృతము న్యాయవాదులు లెక్కకు మిక్కిలిగ పుట్టలోని చెదలట్లు బయలుదేరుచున్నారు. "వీరు బ్రిటిష్ గవర్నమెంటు అను పాలసముద్రములో హాలాహలప్రాయులై యున్నారు" అని యొకరు నుడివిరి. న్యాయవాదు లైనవారు వివాదములు నానాటికి గొఱత వడునట్లొనరింపవలయుగాని తామే వానికి చోదకులై మునుపటికన్న వాని నుప్పతిల్లంజేయుచు నన్యాయవాదులౌట గౌరవహీనమొనరించు పని. ఏది ఎట్లుండె? వీరి నిందించిన లాభమేమి? కారణభూతులయిన గవర్నమెంటువారే యీ నిందకుం బాత్రులు. అదెట్లన:- విద్యాభ్యాసము, రెవిన్యూ, పోలీసు, సైన్యము ఈ యిలాకాలలో మనవారు గుణానుగుణ ప్రాశస్త్యము బడయ వసతులు లేనందున, జాతి వర్ణాది నిమిత్తములచే నిరోధింపబడని న్యాయవాదిమార్గంబున బుంఖాను పుంఖములుగ జీవయాత్రకై ప్రవేశించుట యేమియాశ్చర్యము. "అందఱును వకీళ్ళయ్యెద" రని మనల గర్హించి పలుకు దొరలు ఆ వకీళ్ళకేతప్ప తదితరులకు మహోత్కృష్ట పదవుల నొసంగ జాలరు గాన వారి పరుషములు వారికే చెందవలయునని తోచెడి.

అమితంబైన నేవృత్తియు హాని ఘటించును. కృషి వ్యవహారములు సాధారణముగ నపారములౌట యసంభవము. రాజసేవ, న్యాయవాదిత ఇత్యాది రక్షక వృత్తులు పెల్లుపెఱిగెనేని నిమిషములో భక్షక వృత్తులౌను. అలంకారవృత్తులును ఇట్లే. స్వర్ణకారకులు కొద్దిగానున్న గీడులేడు. అసంఖ్యులైన దుస్సహులగుదురు. కావున మొత్తముమీద వకీలి మొదలగునవి తమకు ఆదాయావహములైనను దేశమునకు నపాయావహములు గావచ్చునుగాన జాగ్రత్త జెప్పవలసె.

స్వార్ధదేశార్థక్రియలు

సార్థకక్రియలన నర్థములు రెండు. తనకు సంపదల దెచ్చునది; దేశవిభూతి నుద్ధరించునది యని. ఇందు రెండవ యర్థమే ప్రధానము. ఏవృత్తిగాని నిరాఘాటముగ నింద్యమే యనుట కష్టమేయైనను కాల దేశ వర్తమానంబులం బరిశీలించి దేశానుకూల వ్యాపారముల నాశ్రయించుట కర్తవ్యంబు.

ఉంఛవృత్తి

ఈ ప్రపంచమున నెక్కడనులేని వ్యవహారంబొకటి ఈ కర్మ భూమిలో ప్రబలమైయున్నది. అదియేదన ఉంఛవృత్తి. ఇది యనర్థ ప్రతిపాదక మనుటకు సందేహము లవమాత్రమునులేదు. బెల్లము గొట్టిన ఱాయివలె చియ్యచే నిగనిగలాడువారు తాము సోమరిపోతులై యుండుటయేకాక ఇతరుల కష్టార్జితంబుం దినుటయు, వీరింజూచి కర్మణ్యులును జీతమునకన్న భిక్షమే యెక్కువయని పనులు చాలించి వివిధ వేషంబులతో దేశాటనంబు జేయుటయు నిత్యాది విపత్తులు మనవారు మూర్ఖులై, పాత్రాపాత్రత గణింపక దానము లిచ్చినను పుణ్యము వచ్చునని, యెంచుటవలన గలుగుచున్నవి. దేశార్థపరిహీణత, దొంగతనము, ఆలుబిడ్డలను వదలుట, సోమరితనము, కైతవము మొదలగు దౌష్ట్యములకు నీమూఢభక్తి ముఖ్యకారణము దేశమునకు దౌర్భాగ్యముదెచ్చి పాడుసేయుట పంచమహాపాతకములకన్న మించిన పాతకముగాన ఈ విపరీత దానములచే స్వర్గలోక ప్రాప్తియగుననుట సత్య మెన్నటికినిగాదు. పరోపకారమనగా తాత్కాలికోపకారము గాదు. మఱి ధ్రువంబును దేశమునకు నెడరు గలిగింపనిదియునైన యుపకారము, దేశమునకు నపకారము జేయుట దేశస్థులకును ఇక ముందు బుట్టబోవువారికిని అవధి గల్పించుట గాదె! ఇందఱికిని ఎగ్గాచరించి తాముమాత్రము తటుక్కున స్వర్గమునకు బోవుదు రేని, అట్టి స్వర్గములో నెందఱు దేవతలు బ్రతిమాలుకొన్నను వీరిపొత్తున మానముగలవా డెవ్వడును సహవాసముజేయ సమ్మతింపడు. ఆ స్వర్గమును మనదేశ మట్లేయుండునేమో! ఏమీ! హిందూమహా జనుల బట్టిన మౌఢ్యము. శ్రీకృష్ణులు బొధించినది ఫలాపేక్షలేనిపని. వారి శాస్త్రముద్ధరింప నవతారమెత్తిన యుత్తమవర్ణు లాచరణమున బ్రకటించునది పనిలేని ఫలాపేక్ష. ఇయ్యది సిగ్గునకు దొలగిన వృత్తి యనియైన రోయక, తమ్ముమాత్ర మావేశించిన హక్కనియు గౌరవ విశేషమనియు వారు తలయెత్తికొని తిరుగుట దలపోయ నీరాజ్యమున నొక్కమతమేకాదు మానమును నిలువకపోయెనో యని సంశయింపవలసియున్నది.