Jump to content

భారత అర్థశాస్త్రము/మొదటి భాగము - పండ్రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పండ్రెండవ ప్రకరణము

మూలధనము అనగా పుంజీ

           "మూలకరి పుష్పములు గోయు మాడ్కి తేటి
            పువ్వు దేనియగ్రోలెడు పోల్కి (మొదలు)
            గందకుండంగ గొనునది కార్యఫలము
            బొగ్గులకు బోలె మొదలంట బొడవరాదు." - భారతము

నిర్వచనము

ప్రకృతి పౌరుషములవలె ఆద్యంబుగాకున్నను అర్థబాహుళ్యమునకు మూలధనం బతిముఖ్యంబైన కారణంబు గావున దీనిని కొందఱు మూలాధార తుల్యమనియండ్రు. అయినను స్వభావమునకును బురుషునకును దరువాతిదనియు ఫలస్వరూప మైనదనియు తెలియుట సుగమమే. సాధారణములగు ఫలంబులకన్న నిద్దానికిగల ఋజుగుణంబేమన్న ఫలములపుడే వినియోగమునకు దేబడి నశించును. మూలధనమన్ననో ఇతర ఫలప్రాప్తికి నుపకరణముగ బ్రయోగింపబడును. నేరుగ ననుభవమునకు దేబడక సుఖములగు ఫలములను గడించుటయందు ప్రయోగింపబడు వస్తు సమూహంబు మూలధనంబు నాబడు.

మృగములు కష్టమున జీవించునవిగాని యురువులం బ్రోగుచేసి తద్ద్వారా మఱింత సంపాదించు నేర్పుగలయవికావు. పశుప్రాయులైన వారును మెకంబులట్లు అయ్యైదినముల చింతదప్ప ముందునాళ్ళ గూర్చి యోచింపరు. నాగరికతతో భావిప్రజ్ఞయు బరిణతిగనును.

తొలుదొల్త మూలధనముం గూడబెట్టుట కష్టసాధ్యముగాని సులభముగాదు. తమయొక్కయు దమవారియొక్కయు బోషణమునకు పోగా ప్రాప్తవిత్తములలో బీదలకేమి మిగులగలదు? ఒక్కతూరి యేతీరుననో మిగిల్చికొన్నయెడల దరువాత మిగులబెట్టుట కష్టము గాదు. మిగుల మిగుల మిగిలించుట సులభము. కూలివాండ్రు దినము నకు ఒక యణానైన జేర్పజాలరు. లక్షాధికారులు నూఱులకొలది మూటలుగట్టుదురు. అనగా నీరాసులలో అధికవృద్ధిన్యాయము చెల్లుచున్నదనుట. కావుననే యొక్కతూరి ముందునకు వచ్చినవారు సరసరమని బహుత్వరలో బైనికెక్కుటయు వెనుకబడినవారు వారలం జేరజాలక ఇంకను అథ:పతితులై పరితపించుటయు నగుచుండుట. ఐరోపా ఖండము మిగుల జిన్నదియయ్యు దానికన్న నెన్నియోమడుంగులు విస్తీర్ణతనుదాల్చిన ఆసియాఖండమును వెలకుగొనునంత లక్ష్మీయుతంబై యుండుటకును, మనము వెనుకంజిక్కి దౌర్భాగ్య చక్రవర్తులుగ నుండుటకును ఇదియే మూలంబు. మనము ఒకింత సేకరించు లోపలవారు పదింతలుగను రెండింతలు సేకరించులోపల వారు ముప్పదింతలును జేర్చిపెట్టుచు నానాటికి మనకును వారికింగల యంతరమును నిడివిజేయు చున్నారేగాని కుఱుచగానిచ్చునట్లుగానము. ఇప్పుడు పదేడులలో మనదేశమునందు సుమారు 10 కోట్లు ప్రయోగింపబడియె. ఇంగ్లాండులో దూదిసరకుల వ్యాపారమునకు ముఖ్యస్థానమైన మాన్‌చెస్టర్ అను నొక పట్టణమునందే ఇంతకన్న ద్విగుణరాశి నుపయోగించిరి. ఐరోపావారితో సమానపదవి బడయవలయునన్న వారికన్న మన మెన్నియోతరము లెక్కువగ బాటుపడవలయు.

మూలధనోత్పత్తి

ఏకారణముచేతనైన ఫలాతిశయము ప్రాప్తింపుడు మితంబుగ భోగించి మిగతదానిని సెలవుజేయక పునరుత్పత్తికై ఉంచుటచే మూలధనము సిద్ధించును. చేతులతో గువ్వలబట్టి జీవించువా డొక డుండెననుకొందము. వాని కొకనాడు పక్షుల మితముగజిక్కిన కొన్నింటిని భుజించి తక్కినవానితో వేటకు సాధనములైన విల్లును అమ్మును గొనిననుసరే. లేదా మఱునాడు భుక్తికి దక్కువలేనందున పక్షుల వెదకుటమాని విల్లు నమ్ములను రచియించిననుసరే పుంజ మేర్పడు. ఈ గుణంబునకు వితరణమనిపేరు. వితరణమన దానుదినక యొకరికినిబెట్టక భూమిపాలు చేయుటగాదు. సమయాసమయములం బాటించి ఇంకను గూర్ప నుద్యమించుట.

మూలార్థసిద్ధికి హేతువులైన ధర్మగుణంబులు

వితరణమునకు సహాయభూతంబులైన గుణంబు లెవ్వియన:- 1. దీర్ఘదర్శిత్వము. ఇయ్యది నాగరికాగ్రేసరులయెడ సహజమైయుండు. తక్కిన మనవంటివారి కనవరతానుష్ఠానముచేతగాని యలవడదు. రాబోవు కాలమునకువలయు సాధనముల నిప్పటినుండి సిద్ధపఱుపం గోరుట మంచిదియని యోచించినమాత్రాన లాభంబులేదు. ఎఱుకతో నడకయు నుండవలయు. ఎఱిగినంతన నడత తనంతట కుదురుననుట యసత్యము. ధైర్యమునుగూర్చి వ్యాఖ్యానముచేయ నందఱును సమర్థులేకాని పిఱికితనములేనివారు కొందఱే. ప్రవర్తనము గరిష్ఠత నొందవలయునన్న క్రమము దప్పక సాధించుటయే సాధనము. వేఱొండులేదు. కొందఱు జనుల విద్యావంతుల జేసినజాలును. సన్మార్గావలంబనంబు విధిలేక తనంతట అనుగమించును అని భావించెదరు. ఇది వెఱ్ఱితలంపు. ఇది నిక్కమేయైన ఇప్పటికాలపు బి.ఏ. ఎం. ఏలు బయట నొకమాటయు నింట వేఱొకమాటయుగా ద్విజిహ్వులై యేలయున్నారు? కావున నభ్యాసమే అన్నింటికిని శ్రేష్ఠంబు.

2. సాహసము. అనగా ఫలసిద్ధి నిశ్చయముగాదు. కావున మొదలు మునిగినను మునుగనీ యనుధైర్యము. ఐరోపావారి సాహస మేమనవచ్చును! బలాఢ్యులై చెలగుటకు బూర్వమే ఇండియా, చీనా, జపాన్ మున్నగు పరరాజ్యములలో వాణిజ్యార్థము ప్రవేశింప బూనిరి. తేజోనిధులకు కారాకాల నిర్ణయ మున్నట్టు కానము.

3. సంఘక్షేమమే పరమధర్మమని భావించుట. తమమేలే చూచుకొనువారు ఎన్నటికోగాని సిద్ధిజెందని వ్యవహారముల కాయత్తులుగారు. తత్కాల ఫలప్రదములకుమాత్ర మాసింతురు. సంఘము నలక్ష్యముగా జూచుటచే సంఘము క్షీణించును. అది కారణముగ దామును దుర్గతిపాలవుదురు. స్వలాభాపేక్ష తనలోనే యుదయించి తనకే ముప్పుదెచ్చునట్టి ఏడవయంతశ్శత్రువు. దేశఘనత నాకాంక్షించువారు రాష్ట్రంబుతోడ దామును ఉదారస్థితింగందురు. ఐరోపావారి ధనకనక సమృద్ధిగాంచి వారు పదార్థతృష్ణం దగిలినవారని యెన్నుట సామాన్యమేయైనను ఇది పొరబాటు. అర్థములు ఫలముగా వాలారి నంతనే అవియే వుద్దేశభూతములని అనుమానించుట హేత్వాభాసంబు.

4. దమము. అనగా అప్పటప్పటికి సర్వమును మ్రింగివేయక వస్తువుల మిగులబెట్టుటకై ఆశల నాపుట.

5. దేశమున సౌరాజ్యము. అట్లుకాదేని

         క. "తన ధనమిదియని యూఱడి
             మన బరిణయమాదియైన మహితోత్పవముల్
             గొనియాడనెవ్వరికి వ
             చ్చునె జనపాలుండు లేనిచో నిర్భయతన్?"

అన్నట్లు స్వామ్యరక్షణము లేమింజేసి ఎవ్వరును గూడబెట్ట నుద్యమింపరు. మఱి "గతకాలము మేలువచ్చు కాలము కంటెన్" అని గ్రుక్కుమిక్కనక మెక్కి యూరకుందురు. పూర్వము మనదేశమున కీగతి పట్టియుండుటచేతనే ప్రాచీనులు జీవితంబు బెట్టిదంబగుట "సంసారము చంచలము; ఎండమావులట్లు మిథ్య; దు:ఖసాగరము; వర్జనీయము" అని విధిలేక తలపోసియు, నిరాశతో జీవంబుల నిలుపుట దుర్భరంబుగాన, స్వర్గంబున సుఖంబులు వడయుదమని కొందఱును; అంతకుం బేదయైన మనసుగలవారు నిర్వాణత్వంబుజెంది నిర్వికార స్థితినుంటయే విమోచనమార్గంబనియు, ఇట్లు నానావిధముల తత్త్వంబులం బ్రకటించి మనశ్శాంతిం బ్రతిపాదించిరి. ప్రాణమానములు భద్రములుగానప్పుడు, మానములో నేమున్నది ప్రాణములో నంతకు మున్నే యేమున్నది యని విరక్తివహింపక యేమిచేతురు?

6. సంఘస్థైర్యము. జాతిమతాది భేదములచే భిన్నులమై వారి వారి సొంతములగు కుటుంబముమీదదప్ప నితరములయెడ ననాదరణ బుద్ధిగలవారమగుటచే మనదేశమున సంఘము శిధిలమైపోయినది. మఱియు దూరదేశ ప్రయాణములు విస్తరించుటకు ప్రతికూలములైన ఆచారాదులు తిథివార నక్షత్రములు నసంఖ్యములుగ నుండబట్టి వ్యవహార వాణిజ్యంబులు మనయెడ సంక్షిప్తంబులయ్యె. సంక్షేప వ్యాపారముల కెక్కువ మూలధన మక్కఱలేనందున నార్జన బుద్ధియం దుపేక్ష వహించినవారమైతిమి.

అడ్డంకు లట్లుండగా వితరణమును నిర్మూలించు కష్టసంప్ర చాయములు మనలో లెక్కకు మిక్కిలిగగలవు. అవియేవన చచ్చిన వారు చావగా బ్రదికినవారును యావజ్జీవము శవంబులట్లుండుటకై విధింపబడిన దానధర్మాదులు, పెండ్లికాలమునందు శక్తికిమీఱి సెలవు జేయవలసినదని భార్యాబంధువులు నిర్బంధించుట మొదలగునవి. కావున మనకు నూలిపూసయంతైన మిగులబెట్టుట కష్టమైనది.

ఇంగ్లీషువారి కృపచే మనకును గొంతకుగొంత బుద్ధికుదిరి ఇప్పుడిప్పుడు వృద్ధికి వచ్చుచున్నాము. బొంబాయి, అహమ్మదాబాదు ప్రాంతములలో మనదేశస్థులు దూదియంత్రశాలలు మొదలగువానికి యజమానులై ప్రబల వ్యాపారపారీణులై యుంటజూడ దారిద్ర్య దేవత నిక ముందైన వెడలగొట్టగలముగదా యను కుతూహల మంకురించెడి.

మూలధన ప్రవృత్తి

వస్తుసమృద్ధికి బీజంబునుం బోనిదగుట నింకను విస్తరించి మూలధనముయొక్క గుణముల గీర్తింపవలయు.

1. దీనిచే కాలము వృధా వెచ్చింపబడక మిగులును. చేతులతో మడిని విత్తుటకు బక్వము చేయవలయునన్న నెలలు పట్టును. అదేమడకతో జేయుదుమేని కొన్నిదినములు చాలును ఇట్లు మిగిలిన కాలము నిద్రకు నాహుతిగానీయక ఇతర యత్నముల గొనసాగింప వచ్చును గాన ఉత్పత్తి యుద్దీపించును. 2. కాలమును రక్షించుటయేకాదు. కాలమును ప్రతీక్షించుటకును ఇది దావలంబు. ఘనతరోద్యమములు ఒకనాట నొకయేట సమాప్తినొందవు. కార్యము పండవునంతవఱకు చేతిలో నేమియులేని వాడు వేచియుండజాలడు. కాచియుండనేరని కర్మమువలనగాదె కూలివాండ్రు తక్కువ జీతమునకు విధిలేక కుదురవలయుట? కాలం బేరీతి ననుకూలత ఘటించుననుట కింకను ఒక దృష్టాంతము. బావిలోని నీరు త్రాగవలయునన్న దాహమైనప్పుడెల్ల దిగి చేతితోగొని త్రాగవచ్చును. ఇందు కార్యారంభమునకును పూర్ణతకును కాలభేదము మిగుల స్వల్పము. ఫలమును గొంచమే. ఎన్నిమార్లని దిగి కొంచెము కొంచెముగా ద్రావుచు వృధా కాలవ్రయ మొనర్ప వలయుననియెంచి ఒక్కవారము పనిజేసి ఒకకుండను త్రాడును సంపాదించినవాడైన దినమునకు రెండు మూడు పర్యాయములు చేది పెట్టుకొన్న జాలివచ్చును. ఉత్పత్తిచేయుటలో దాక్ష్యము హెచ్చ వలయునన్న యత్నమునకును వినియోగమునకును కాలభేదమును హెచ్చును. ఇంకను గాలభేదమునకోర్చి గొట్టములు యంత్రములు గడించిన తలచినప్పు డశ్రమమున దలచినన్ని నీళ్ళు దొరకును.

కాలప్రభావ విమర్శనము

కాలంబిట్టి ప్రభావము నొందుటకు గారణంబు గలదు. ఎట్లన, ప్రకృతిశక్తులు మనకుం దోడ్పడవలయునన్న అనువగు నుపకరణములం గూర్పవలయు. ఇందుల కెంతోకాలము పట్టును. ఆవిరిశక్తి, విద్యుత్కాంతి ఇవి మనకులొంగి సేవజేయుటకు యంత్రనిర్మాణము ప్రధానము. అతిచాతుర్యము గలిగినవాడు సాధనకలాప సృష్టిచే దనకోరికలన్నింటిని ప్రకృతిశక్తులచే హాయిగ గూర్చుండి యీడేర్చు కొనవచ్చును. స్వచ్ఛంద ప్రవర్తన పూర్తిగనో కొద్దిగనోకల మనుష్యులవలెను మృగములవలెనుగాక నిద్రాహారములులేక చెప్పినట్లు మఱుమాటాడక పనిచేయునవి యంత్రములు. స్వాభావిక శక్తులు విజృంభింప నవసరమొసగునదిగాన కాలంబు మనకు మహోపకారియయ్యె. కార్యప్రారంభ పరిసమాప్తులకు నడుమ కాలమెంత దీర్ఘత గనునా ఆర్జనమును అంత సమగ్రత జెందును. నేరుగా వినియోగ్యముల సంపాదించుటకన్న పనిముట్లు మొదలగు సాధనముల సహాయముచే పరోక్షముగా నాహరింపంజూచుట సుఖాధిక్య హేతువు. ప్రత్యక్షమునకన్న పరోక్ష మెక్కువఫలవంతము. కావున దొలుత గాలవ్రయమైనను తుదకు ననాయాసమగు నుద్యోగప్రాప్తి యగుంగాన మొత్తం మీద భవిష్యత్తును లెక్కించిచూచిన కాలమెంతో మిగులును.

3. కొందఱు ఉత్పత్యర్థమైనవికాని విత్తంబులు మూలధనంబులుగావనియండ్రు. మఱికొందఱు పుంజీభవించి స్థిరతదాల్చి చిరకాలయోగ్యములైన వస్తువులును పరిపణములేయని యందురు. ఇంకనుం గొందఱు ఎద్దానినుండి యాదాయమువచ్చునో అయ్యదియు నీవియేయని వాక్రుచ్చిరి. చూడంబోయిన నీమూడభిప్రాయములును యాథార్థ్యము గలవిగాను కొంతకుగొంత పరస్పర మిత్రములుగను వున్నవి.

పెద్దలు గడించిపెట్టిన ఆస్తితో వడ్డిజీవనము జేయువారు ఉత్పత్తి కెట్లుసాధకులగుదురు? వీరు వ్యవహారులకేగాక త్రాగుబోతులకును ధనికులకును అప్పులియ్యవచ్చును. భోగములయందు వ్రయము చేయువారు దేశమునకు నష్టము దెత్తురుకాని లాభముతేరు. ఇట్టివారి సొత్తుల గుదువబెట్టుకొని వడ్డి బిగబెట్టి వచ్చుబడి ననుభవించువారు అప్పుగా విచ్చిన ద్రవ్యము మూలధన మౌనాకాదా? ఉత్పత్తికి నిజముగా ప్రతికూలమే యయినను ఇదియు మొదలేయని యందఱును వాడుకొందురు. ఏదియెట్లుండినను తన కుత్పత్తికరముగానేవున్నదిగదా!

ఒకానొకవైద్యుడు వృత్తివిషయమై రాకపోకలు చేయుటకునై బండినుందుకొనియెబో. ఉత్పత్తర్థమైనది గాన నిదియు మూలధనమే. అదేబండిలో దానును దనభార్యయు గూర్చుండి షికారు వెళ్ళిరేని అప్పుడు మూలధనము కాకపోవునా! కాదేని వస్తువు ఉద్దేశ్యమాత్రమున రూపుమాఱుట సంభవించు

మఱియు నాగేళ్ళు కత్తులు ఱంపములు వీనిని మూలధనమను టేల? తాముచెడక చాలదినములుండి ఇతరవస్తువు లుద్భవిల్లుట కాధారములౌటగాదె! గృహములు నట్టివియేకదా! వస్తూత్పత్తికై వినియోగింపబడినవి కాకున్ననేమి? తాము జన్మస్థానములుగా తమ నుండి సుఖానుభవము నిరంతరధారగా బ్రవహింపజేయును. ఈసుఖములు క్షణభంగురములు♦[1] తామోచిరంతనములు. సుఖము నాదాయమేకదా! రూప్యములనేనా ఆదాయమనుట? రూప్యములేల? వస్తువులగొని వినియోగించుటకేగదా! ఆ వినియోగమే ప్రాపించిన దానినేల ఆదాయమనగూడదు?

కావున మూలధనంబు మూడుమూర్తుల వెలయునని ఎఱుగునది. వీనిని ఉత్పత్తి స్థితి లయ స్వరూపములనియు జెప్పవచ్చును. ఎట్లన, 1. ఉత్పత్యాధారము. 2. ఆదాయసంధాయకము. 3. వినియోగానుకూలము ఇమ్మూటి సామాన్యలక్షణము లేవియన:-

1. మూలధనము ధ్రువంబు. ఆదాయ మప్పుడప్పుడు వెచ్చించుటకై యుంచబడినది. దృఢంబయ్యును శాశ్వతంబుగాదు. ఎట్టి యంత్రమును నేడుగాకున్న నిక నూఱేడులకైన శిథిలమగును. భర్మహర్మ్యములును ప్రళయకాలపర్యంత ముండబోవు. అయిననాదాయమునకన్న నెక్కువకాలమువచ్చును. ఇది సంభావనీయాంశము.

2. మూలధనము పుంజి. అనగా నిజమైన మొత్తముగా జూడబడునది. గృహములు బండ్లు ఇవి నానాటికి క్షీణించును. కాన తొలుతనుండి యీ నష్టమునకుగాను వచ్చుబడిలో గొంచెమెత్తి వేరుగబెట్టుట వ్యాపారులకాచారము. ప్రతికంపెనీవారును పరిహీణతాపూర్తికై లాభములో నొకపాలు వినియోగింపకయుంతురు. కావున నియతి తగ్గదు.

3. ఆదాయనిర్వచనమున సద్య: ఫలప్రదాయకత్వము ముఖ్యం. మూలధన విచారణములో నుత్తర ఫలప్రాప్తి ముఖ్యము. ఒకతూరి వాడినంతనే లయించువస్తువులు ఉత్పత్త్యర్థమై వాడబడినవికానిచో


మూలధనంబును కానేరవు. ఉదా. చుట్టలు, నస్యము (అమ్మువారికి దప్ప) ఏఅర్త్థమైననుసరే అప్పటికి వినియోగ్యమనియైనను భావిఫలము నిచ్చునదియనియైనను భావింపవచ్చుగాన ఉపయుక్తింబట్టి అర్థములు మూలధనములౌనో కావో యనుట నిర్ణయింపవలయు. "ఇది సదా మూలధనమే. ఇది యెన్నటికి మూలధనము కానేరదు" అని వస్తువుల విభజించుట అసాధ్యము. చుట్టలు, కల్లు, వస్త్రములు ఇత్యాదులు సాధారణముగ గొందఱికి వినియోగ్యములైన యర్థములు గానున్నను వానిని సృష్టించువారికిని విక్రయించువారికిని ఆదాయావహములైన మూలార్థములేకదా!

4. మఱి యన్నివస్తువులును లయమునకుం బాత్రములంటిమి. అట్లైన కల్లునకు ఇల్లునకును భేదమేమి? ఒకటి యరగంట సుఖమిచ్చును. ఇంకొకటి అరయుగము సుఖమిచ్చును. ఏమాత్రము కాలవ్యత్యాసమున్న మూలధన మనవచ్చును? ఒకదినమా వారమా వత్సరమా? యని ప్రశ్నింపవచ్చును. ఈమాత్రమని వ్యవధియేర్పఱుప వీలుకాదు. వాడుకమీద సరాసరికి నిత్యా నిత్య నిర్ణయముం జేయవలెను.

5. అవును! పరిపణము వృద్ధియగుచునేయుండిన అపారమై మూల్యరహితముగాదా? కాదు. ఏలయన పరిపణముతో నాగరికతయు హెచ్చును. నాగరికతతో మనుష్యవాంఛలును ప్రబలును ఒకకోరిక ఆరులోన పదికోరికలు మొలకలెత్తును. అభిమతము లనంతములు. రుధిరాక్షునిదేహమువంటివి. ఒకటి నశించులోన ఇతరములు వేయిపుట్టును. మఱియు ఆశను బంధించుటకు ఆశాపాశమేగాని వేఱొండులేదు. అదెట్లన ఆశను బంధింపవలయునను ఆసలేనిది నిగ్రహంబునకేల తొడంగుదుము? ఏకామమును గూడదనువారు మముక్షుత్వమును వర్జనీయమనరైరి. మోక్షేచ్ఛ ఇచ్ఛగాదా! మఱియు ఫలములయెడ మనసుంచక పనులు జేయవలయునని కొందఱు స్వభావవిరుద్ధమైన బోధలజేతురు. ఫలపరిత్యాగబుద్ధియు గోరికలలో జేరినదేకాన ఎట్లును వాంఛారహిత వర్తనంబు సమగూరుట యసాధ్యంబు. సిద్ధుల గోరక సమారబ్ధుడౌట యెట్లో చెప్పువా రెవరునులేరు. పంటయం దిచ్ఛలేకున్న విత్తులేల చల్లవలయు? ఫలములయెడ బ్రహ్మార్పణ బుద్ధితో లోకయాత్రకొరకు పాటుపడవలయునందురేమో. పాపసంచయమెల్ల "కొఱకు" లో నిమిడియుండ లోకయాత్ర "కొఱకు" మాత్ర మెట్లుయోగ్యమౌను? రక్తిలేమినా శక్తిలేమినా మనమాసలు గూడవనుట! యోచింపుడు!

"అపజయమైన చింతించుట న్యాయంబుగాదు; తనకుం గీడు గలుగనీ మేలుగలుగనీ ధర్మంబు వదలరాదు" అను తత్త్వము లుత్తమములు. "అపజయమైన విచారపడకుము" అను వాక్యమునకు మనవారు "జయకాంక్షయే యుంచుకొనరాదు. ఆ కాంక్షలేకున్న నపజయమైనను దు:ఖ ముండదుగా" అని యర్థముచేసిరి కాబోలు. ఎట్లు చూచినను ఆశ లడుగంటుటయుగాదు. అడుగంట వలయుననుటయు గాదు. మఱేమన వీనిలో నుత్తమాధముల నిర్ణ యించి శ్రేయస్కరము లైనవాని దృప్తిజేయబూనుట కర్తవ్యంబు.

ఇంతేకాదు. కూడబెట్టిన ధనంబులు అగ్ని, భూకంపము, సముద్ర ముప్పొంగుట మొదలగు ననాహుతములచే నశించుం గావున ఎన్నటికిని ఒకటేవిధముగ వృద్ధిజెంది యర్థములు కొలదికి మీఱుట యసంభవము.

ఒకవేళ కొలది నతిక్రమించునను అవధి యుండెబో, అది ఈ దారిద్రదేశములో నగుననియెన్ని భయము బొందనక్కఱలేదు. ఇక గొన్నియుగముల కమితధనరాసు లుండునేమో! ఐనను ప్రళయ కాలములో వానలు విపరీతముగ గురియునని ఇప్పుడే చెఱువుకట్టల దెగగొట్ట నెవడును బూనడు. అట్లుచేయుట నిరక్షరకుక్షులు జ్ఞానాధిక్య పైత్యమగునను భయంబువలన విద్యల విసర్జించినట్లు.

మూలధనము మూడు తెఱంగుల నర్థము నుద్దీపింపజేయు

1. కర్మకరులకు భుక్తి నాపాదించుట. ఇయ్యది అద్దాని ఆదిమ కర్మంబు. ఇదియొక్కటి గుదిరిన తక్కినవి సులభముగ సాధ్యము లౌను. హిందూదేశములో ముక్కాలువాసి జనులు ఈమాత్రమును గూడబెట్టజాలనివారైనందున ఒక్కసంవత్సరము వానలేకున్నను మిలమిలలాడి కార్చిచ్చున మిడుతలంబలె గుంపులుగట్టి గతించు చున్నారు. ఇదియెంతయు శోచనీయ విషయము. ఏడాది భుక్తి ప్రాప్తించినట్లైన తెగువ చొరవ వినీతియుగలవారు ఇంకెన్నటికిని లోపముతాకుండునట్లు సామగ్రులను ఉపకరణములను నిర్మింపగలరని శాస్త్రజ్ఞుల యభిప్రాయము.

2. భుక్తికి దరువాత పనిముట్లు ముఖ్యము. పశ్చిమఖండములో కోట్లకొలది ద్రవ్యము యంత్రస్వరూపమై యున్నది.

3. యంత్రములు పనిలేక యుండనిచ్చిన కొన్నాళ్ళకు ద్రుప్పుపట్టి చెడును. కావున వానిచే దయారుకాబడు సరకులు దండిగ నుండవలయును. దూదియంత్రములు సదా తిరుగుచుండ వలయునన్న ప్రతిదినమును బండ్లకొలది ప్రత్తి ప్యాక్టరీలో దిగుచుండవలయును.

చలాచల మూలధనములు

మూలధనము చలము అచలము అని రెండు విధములు. యంత్రాదు లచలములు. చిరకాల మేకరూపముతోనే యుండునవి. తారుణ్యమునకురాని దూది నార వడ్లు మున్నగునవి చంచలములు. అనగా అచిరములును పరిపాకమునకు వచ్చునప్పటికి వస్త్రములు గోనెలు అన్నము మొదలగురీతుల రూపుమాఱునవియువని భావము. ప్రకృతినుండి పరిగ్రహింపబడు సరకులు సాధారణముగ జంచలములు.

అచల మూలధనములు

అచల మూలధనం బెంతయు గణనీయంబు. దీనియందు ముఖ్య లక్షణములు కొన్నిగలవు. అవేవన; 1. ఉపకరణము లెంత దృఢంబులు శాశ్వతంబులునో వానిని సృష్టించుటకు యధాక్రమముగ నంతకుదగినకాలముపట్టును. ఐరోపా, ఇండియా దేశములకు నౌకాయాత్రలు సులభముగా జరుగుట కొఱకు 'సూయజ్‌' అనుచోట సముద్రములకు సంధి యేర్పడుటకై నావలు నిరాఘాటముగ బోగలిగినంత గంభీరమును లోతు వెడల్పుగలదియునైన కాలువను ద్రవ్విరి. ప్రకృతము 'పసిఫిక్‌', 'అట్లాంటిక్‌' మహాసముద్రములు సంగమించి వాణిజ్యము నిరాటంకముగ జరుగుటకై 'పనామా' యను నమెరికా ఖండములోని సీమలో సూయజునకన్న మించిన కాలువను ద్రవ్వుచున్నారు. ఇట్టి ధ్రువములైన సాధనములు సమకూరుటకు పదిపదునైదు వత్సరములు పట్టును. అంతవరకు భరణాదులకు పూర్వార్జిత నిధు లుండవలయును. ఇవి పేదలచే సాధ్యములకు కార్యములుగావు.

అయినను ప్రతివాడును గుబేరుడు గాకున్నను అందఱునుచేరి కొంతకొంత చందావేసి సంఘముగకుదిరి పనిజేసిన ఎట్టి యసాధ్య కార్యములనైన సాధించుట యొక ప్రమాదంబుగాదు.

2. అచలపదార్థము లనేకవత్సరములు స్థిరములుగా నుండుగాన భావిని వ్యవహార స్థితిగతు లెట్లుండునను దూరదృష్టియు, ఎక్కినను దగ్గినను సమాళించుకొందమను ధైర్యమునులేనిది వానినెవరును తఱుచు నిర్మింపబూనరు.

3. అతిధ్రువమగుటయు గీడే. ఏలయన లోకమున నెందఱో క్రొత్తక్రొత్త సాధనములం గనిపెట్టు చుందురుగాన విశేష నష్టము లేకయే అమ్మియో తీసివేసియో నూతనయంత్రముల స్థాపించుచుండ వలయును. "ఒకయంత్రమున్నదిగదా, ఇక దీనికి మించినదేమి యుండును?" అని పరామరికతో నుండిన పోటీచేయువా రింకను శీఘ్రగతినో నిపుణతతోనో పనిచేయు యంత్రముల గనిపెట్టి యుపయోగించి ఇంకను నయముగనమ్మి దివాలెత్తజేయుదురు. అమెరికాలో ఇరువది ఇరువదియైదేండ్లకు యంత్రముల మార్తురు ఇంగ్లాండులో యంత్రసముదాయముయొక్క ఆయు:ప్రమాణంబు సుమారు ముప్పది లేక ముప్పదియైదు వత్సరములు. జపాన్, జర్మనీ, ప్రాన్‌స్ ఈదేశములలో నలువదియేడులవఱకును ఉండనిత్తురు. మనదేశముననన్ననో తెగువ పూజ్యముగాన ఆ యంత్రమే తనంతట జీర్ణమై కృశించి ఇక నొక యడుగైన నెత్తివెట్టజాలునని నాలుకచాచుకొని తునకలై క్రిందపడినను చెన్నపట్టణపు జట్కాగుఱ్ఱములమాడ్కి అవసానకాల పర్యంతమును పనిజేయించుకొందురు.

4. యంత్రము లూరకున్న నష్టముగాన వెలలు అనుకూలమైననుసరే ప్రతికూలములైననుసరే సరకులుదెచ్చి పనిజేయుచుండుటయే విధానము. దీనిచే ధరలు చంచలములౌను. అదెట్లన గిరాకి మందముగానున్నను ఉత్పత్తితగ్గదు. ఉత్పత్తియైన సరకులను కర్మశాలలోనే యుంచుకొనియుండుటకును గాదు. కావున నెట్లైన నమ్ముడు బోవలసినదేయని అడిగినవెల కిచ్చివేయుదురు. ఉన్నట్టుండి వెలలు తగ్గును. అందుచేత పోటీవారు కొందఱు దివాలెత్తి నెత్తినగుడ్డవేసికొని రామేశ్వరయాత్ర బోవలసివచ్చినను వచ్చును. సహకర్ముల సంఖ్య కొద్దియౌకొలది ఉత్పత్తియు నల్పమౌను. గిరాకి రుచిమరిగినదగుటచేత ఇంకను గావలయునని యాసించును. అపు డున్నట్టుండి వెలలు హెచ్చును. ఈ రీతిని యంత్రకళాబంధురములైన దేశములలో వెల లుయ్యాల లూగుచుండును.

5. ఇంగ్లాడులో తొలుత రైల్వేలువేసినప్పుడు జనులసంఖ్యులు లాభార్థులై కంపెనీలలో భాగములుకొనిరి. రైల్వే కొంచెపుగాలంలో బదులిచ్చునట్టిదిగాదు ఇనుపదారి చెదరకుండ మట్టి సమముగవేయుట ఒకటి; గమనశక్తిగల యంత్రముల గుదుర్చుట రెండు, లోకులు "ఇవి యుత్పాతకములుగావు వీనిలో సామానులు బంపవచ్చును. మనమును గూర్చొనవచ్చును" అని నమ్మకముగొనుట మూడు, వాణిజ్యము లున్నట్టుండి ప్రాతదారినివదలి క్రొత్తదారికి రావనుట నాలుగు. ఈకారణములచే చిరకాలమునష్టముగలిగె. ప్రజలు ఉత్కంఠ గొన్నవారగుటచే దమభాగముల నితరుల కమ్మజూచిరి. కొనువారు మాత్ర మెవరుగలరు? కావున తాల్మిలేక మిగుల హింసజెందిరి. ఇయ్యది ఆర్థికోత్పాతములలో నొక్కటిగ నెన్నబడునంత యుపద్రవ కారియయ్యె. కావున ఫలము శీఘ్రముగ రావలెనను తలంపు గొనుటవలన కాచి కనిపెట్టుక యుండుటకు సామర్థ్యము లేనివారు అచలములలో నంతగా బ్రవేశింప బూనరాదు.

భూమినేమాత్రము మూలధన మననగును

భూమి నిసర్గజంబంటిమి. నిజమేకాని క్షేత్రములు ప్రకృతి దత్తములా? కంటకపాషాణ దుర్గమంబై, వన్యసత్త్వ భయంకరంబై, జలాధారరహితమైన యీ పృధ్విని సమంబుగ జేసియు, మృగంబుల వధించియు, చెఱువులద్రవ్వియు, కాలువలేర్పఱచియు, నింతటి స్థితికిం దెచ్చినవారు మనుష్యులేకదా! అట్లౌట నది ఆదిని స్వభావసిద్ధంబయ్యు ఇప్పటికి మనుష్యకృతంబాయెనని చెప్పవలదా? కావున పొలములును కొంతవఱకు పరిపణంబులే.

అయినను వ్యాప్తి (దిగంతరము, విస్తారము, వైశాల్యము) పౌరుషేయంబుగాదు. వట్టి విస్తారములో నేమియున్నదని చులకగ జూతురేమో యని తగదు. మహాపట్టణములో వైశాల్యము స్వల్పమగుట చేతనేకదా గృహములన్నియు వెడల్పుగగట్ట ననువులేక పొడవుగబోసాగి లెక్కలేని యంతస్తులతో మేడలు నిర్మింపబడిన వాయె! అమెరికాలో 'న్యూయార్క్‌' అను పట్టణములో 45 అంతస్తుల మేడలున్నవి. నేను కనులారజూచి యాశ్చర్యమగ్నుడనైతిని. మఱియు నేకస్థలమున ననేక గృహములుగట్టుట తరముగాని తలంపు. అనగా శరీరములో నాత్మ యావేశించియుండునట్లు ఒకయింటిలో నింకొకయిల్లు పిశాచిబట్టిన వడువున లీనమైయుండుట అసంభవము. కావుననే లోకులందఱు నేకసద్మనివాసులుగాక ప్రక్కప్రక్కల గేహముల నిర్మించుకొని యుండవలసినవారైరి. అనుకూలమగు చోటుననే అన్నియిండ్లును ఉండనేరని కతంబునగాదె స్థలసంబంధియగు తారతమ్య మావిర్భవించి బాడుగలలో వ్యత్యాసము గల్పించె? కావున వ్యాప్తికృతంబైన స్వామిభోగంబు శ్రమ ప్రతిఫలంబుగాదు. మఱి ప్రకృతిచే సృష్టితమైన భూప్రదేశమును గ్రహించుటవలన గలిగినది.

భూమికింగల యుత్కర్షము అందలి ద్రవ్యవిశేషమాత్రంబునం గాదు. మఱి వ్యాప్తిచేతనువచ్చినది. జాతోద్యోగులమై అనంతశ్రమలకోర్చి సారవిస్తరమును చేకూర్పజాలితిమేనియు వైశాల్యవిస్తరము మనుజశక్తికిమించిన గుణంబుగాన ప్రజాసంఖ్య వృద్ధిజెందుకొలది చోటుచాలక అన్యోన్యకలహముల కాస్పదమగును వ్యాప్తి స్థిమితము. ఒకరి కెక్కువయైన నితరులకు మిగిలినది తక్కువకు వచ్చుంగావున మహీపతిత్వంబు ప్రాణతుల్యంబునువలసిన ప్రాణపరిత్యాగార్హంబునునై వఱలుచున్నది. వ్యాప్తియు మూలార్థములట్లు వృద్ధిపఱుపగూడునదియై యున్నయెడల నింత ఘనతకు బాత్రమైయుండదు.

కళానైపుణి, వాణిజ్యకౌశల్యము ఇత్యాది బృహదర్థ ప్రతిపాదక విద్యలు పరిపణంబులా? ఇవి పుంజీకృతములట్లు అనేక కాలము ఒక్కనియందే నిలుచునవియేగాక పారంపర్యముగ వ్యాపించి శతాబ్దముల పర్యంతము సజీవములై పెంపెక్కుటయుంగలదు ఇవి సిరులకు నెలవులు. అభ్యుదయాస్పదంబులు. కాబట్టి వీనిని నీవి (మూలధనము) అన్నదోషంబులేదు. కాని ఎవ్వరి భోగంబునకై సంపద లుపార్జితంబులగునో వారిని (అనగా మనుష్యులను) మూలధనముగా బరిగణించుట సరికాదు. అర్థము భోగ్యము. నరుడు భోగి. భోగిభోగ్యమ్ములకు సమత్వం బసిద్ధంబు.

అధికపాఠము

మూలధనము

ముఖ్యలక్షణములు:-

1. ఉత్పాదనశక్తి. 2. భావిఫలదత్వము. పద్య:కాల సుఖమునకన్న నుత్తరకాలసుఖము ప్రథానమనియెంచు ప్రాజ్ఞత మూలధనావ్యాప్తికి బీజకారణము.

ఉత్పాదకశక్తి మూలధన ప్రవృద్ధికి గారణము. అనగా మూలధనము లాభదాయి గావున దానినెల్లరు ప్రోగుచేయుదురనుట.

ఉత్తరకాలమున ఫలమునకు వచ్చునది గావున నంతలోనే ఏ విఘ్నములువచ్చునో, యేదోషమువచ్చి తన్ను కొనిపోవునో అట్లయిన చిలుక బూరుగంరానిపండు నాసించినట్లగుగాదాయను శంకయు భయమును నెల్లరకు సహజములు. అవి మూలధనవృద్ధికి నిరోధ కారణములు. నష్టము వచ్చునను భయమునకన్న లాభోత్సాహముమీఱి మెఱయుదేశములలో పరిపణము లపారములగును.

అర్ధము, మూలార్థము వీనికింగల వ్యత్యాసము

1. సంఘపరముగా జూచిన:-

ఆదాయమునొసగు పౌరుషేయ పదార్థములన్నియు మూలార్థములు. స్వభావసిద్ధములు. ప్రకృతికిం జేరిన యుత్పత్త్యాధారములుగాన నిందులో లెక్కకురావయ్యె.

2. సాంఘికుల పరముగా జూచిన:-

అనగా ప్రతిపురుషునియొక్కయు పక్షముగా జూచిన ననియర్థము. తాము డబ్బిచ్చి కొన్నవగుట నేలలు మొదలగు నిసర్గజ పదార్థ సంచయంబులుసైతము వారికి మూలధనములే.

అట్లయిన నర్థములకును మూలార్థములకునుగల భేదమేమి?

స్థిరతములు నుత్తరకాలికములునైన యర్థముల ప్రాప్తికై ప్రయోగింపబడు నర్ధము మూలార్థము. అయ్యదియ తాత్కాలిక వినియోగార్హముగ భావింపబడిన సాధారణార్ధము. వీని యందు వస్తువుంబట్టి భేదముపుట్టలేదు. మఱి యీ తారతమ్యంబు ప్రయోజనసిద్ధంబు.

ఆదాయము ద్వివిధము మొత్తము శిష్టము (నికరము) అని. సెలవులుపోగా మిగిలిన రాబడి శిష్టమనబడు.

దేశాభ్యుదయము గొలుచుపద్ధతి:-

ఇది యెంతయు ముఖ్యమైన విషయము, వస్తురాసులంబట్టి కొల్చుట సరియా? ఆదాయముంబట్టి కొలుచుట సరియా? ఈ యంశము విచార్యము. ఆదాయముంబట్టి గణించుటయ యుక్తమని శాస్త్రజ్ఞుల మతము. ఎందులకన:1. ఇండియాదేశములో వస్తువు లఖండ పరిపూర్ణములై యున్నవి. గంగాప్రముఖ నదులు, సారము తోరమైన శాలిక్షేత్ర సముదాయము. సాంద్రములైన మహారణ్యములు మనకున్నట్లు ఇంగ్లీషువారికిలేవు. అందుచేతనే మనము వారికైన ధనాఢ్యులమని వాదింప బిచ్చివాడైన నుదిలగొనడు వస్తువులున్నను ఫలములు యధాక్రమములుగావు. ఏలన వస్తువుల సఫలంబులజేయు శక్తిలేమికతన.

2. మఱియు వస్తువుల విలువ యాదాయము ననుసరించి యుండును. గొడ్డుభూముల విస్తీర్ణత యెంతయుండిననేమి? అమ్మువారుందురుగాని కొనువారుండరు. క్రొవ్విన నేల యొకకాణియున్నను కన్నుమూసికొని విక్రయించినను వేయిరూపాయలు వెల రూడి. ఈ యంతరువునకు గారణ మాదాయమని వేఱ చెప్పవలయునా?

గోదావరినది పూర్వము యధేచ్చగా బ్రవాహముపాఱి సముద్రునితో దానాతురమున బోయి చేరుటయకాదు. త్రోవలోని పంటలసైత మాక్రమించి యతనికి గానుకగా గొని పోవుచుండెను. ఇపుడు ఆనకట్టలు, వంతెనలు మొదలగువానిచే నిరోధింపబడి యత్యధిక ప్రయోజనకారిణియాయె కావున వస్తువుల యుపయుక్తత వేదములట్లు అపౌరుషేయముగాదు. మఱి పౌరుషాను క్రాంతమే. అట్లుండ వస్తురాసులమాత్రము జమచేర్చుటచే దేశశ్రేయంబు నుర్ధారితంబుగాదు. మూలమునకైన ఫలము ముఖ్యము. ద్రవ్యసంచయములకన్న దజ్జనితోత్పత్తి సుభావ్యము.

3. మఱియు ఫలితముయొక్కయు మాత్రుభూమియొక్కయు వెలలు యధాక్రమములు గావు. తంజావూరి జిల్లాలోనివియు మైసూరు సంస్థానములోనివియు వడ్లు చెన్నపురిలో నమ్మిన వెల యొక్కటే. రాకపోకల సౌలభ్యముచేత తుదకు దంజావూరిలోని వెలలు సైతము మైసూరు వెలలకన్న నధికములుగావు. అట్లుండియు దంజావూరిలో నేలలు మైసూరిలోని చిత్రదుర్గ ప్రాంతము నేలలకన్న ముప్పది నలువదిరెట్లు ప్రియములు. కావున మూలార్థములయొక్క ధనమూల్యముంబట్టి ప్రాభవము మతింపజూచుట పొరపాటు. అది యెక్కువగ నుండిన మాత్రన రాజ్యమునకు భూరికల్యాణము రాబోదు.

4. ఇంకను నొకవిశేషము. మొత్తపు టాదాయము గొలుచుటయు నాభాసమ జనసంఖ్య గణించి ప్రతిమనుజుని యాదాయ మింతయని నిర్ణయించి సరాసరి చూచినంగాని నిజమేర్పడదు.

ఉదా. హిందూదేశముయొక్క జనసంఖ్య దాదాపు 30 కోట్లు. ప్రతివానికిని వత్సరమునకు రెండురూపాయలు ప్రాప్తించినను సాంవత్సరి కాదాయము 60 కోట్లగును. ఇంగ్లాండులోని జనసంఖ్య సుమారు 4 కోట్లు. దానిలోనొక్కొక్కరికి 15 రూపాయ లాదాయమున్నను దేశీయ వత్సరాదాయము 60 కోట్లే అందుచేత మనము వారును తుల్యులమని ఎంచుట యర్హమా? పరిశీలించిన వారిలో నేడవపాలు భాగ్యమైనను మనకు లేదనవలయును:

కావున దేశసంపదలబోల్చి తారతమ్యము నిరూపింపగోరిన సరాసరి పరిమాణముల నిర్ణయించుటయ యకుంరిత పద్ధతి.

  1. ♦ తాత్కాలిక సుఖములును బ్రయోజనములేయైనను ఉత్కృష్టములుగావు. ఉత్కృష్టం లేవియనిన: దేశముయొక్క యుత్పాదశక్తిని వృద్ధిపఱుచు యంత్రములు. వ్యవహార తంత్రములు. సంఘాచారములు. రాజ్యాంగపద్ధతులు ఇత్యాదులు. ఇవి వినియోగానుభవములట్లు క్షణ భంగురములుగావు. మఱి నిరంతర సౌఖ్యదాయకములు. కావునసార్థకంబనగా స్థిరత వస్తు సమార్జనోపకరణంబు. బాణముల వేడుక యెంత యుల్లాసము గలిగించినను నది త్వరలో లయించునది. అ సెలవుతో నావునొకటికొన్న నాఱునెలలకైన పాలు సమృద్ధిగ ద్రావవచ్చునుగదా. వినియోగమును సార్థకము. నిరర్థకము నని ద్వివిధము. ఏవినియోగముచేత నుత్పాదనశక్తి వృద్ధిగాంచునో యది సార్థకము. ఉదా. మితభోజనము. దేనప్రజకును రాజ్యమునకును బలక్షయము ప్రాప్తించునో యయ్యది నిరర్థకము, అనర్థకరమన్నను దప్పులేదు. ఉదా. అమితముగ బౌట్టలు పగులునట్లు పదాఱుమారులు భుజించుట; వివాహాదులజేయు విపరీతపు సెలవు ఇత్యాదులు. మేరకుమించని సౌఖ్యరాసులు సార్థకములు ఇవి నిషేధ్యములనుట దుర్వచనము. శ్రమ వినియోగాది క్రియలు పునరుత్పత్తికి భంగకరములుగా నుండ గూడ దనుట యీ తారతమ్యములోని యాంతరభావము. కావున నమితభోగంబుల పొంతబోక యావశ్యక వినియోగముచే దృప్తినొందుట మంచిది. అవశ్యక వినియోగమును గాలదేశాదుల ననుసరించి పరిణమించునుగాని నిర్వికారంబు గాదు. ఉదా. అడవిమనుష్యులకు మానరక్షణముసైత మనావశ్యకముగా దోచును. ఐరోపాలోనిజనులు మాంసాశనము విడువరానిదందురు. ఇదిమనకు నసహ్యమనిపించును. మన యిండ్లలో నెల్లరు నొకకూటములో బంతిగా బరుండి నిద్రవోదురు. ఇంగ్లీషువారి యూహప్రకార మిది చెడ్డ ఱోత. ఇట్లగుట నావశ్యకము లివియని గుర్తించుట కష్టము. అయినను నొకవిజ్ఞప్తి:- నాగరికులు దెలివిగలవారు నవశ్యానుషేయములని నిర్ణయించునవియు తేజోమానోత్సాహాధిక్యమునకు ననుకూలములైనవియును అపరిహార్యములు. మఱియు ప్రకృత మిట్టివానియందు ప్రజలకు నబిరుచి లేకపోయినను అ విరక్తిమాన్చి యనురక్తి నొడగూర్చుటయ నాగరికతయొక్క లక్షణము. అట్టి రక్తి యంకురింపదేని వృద్ధి నశించును బీదలు అంబలితో దృప్తిసెందెదరని యా యంబలియు చింపిఱిగుడ్డలును జాలు నని యున్నవారెట్లు ప్రశస్తస్థితికివత్తురు? హెచ్చైనకోరికలు పాతకములుగావు. వికృష్టస్థితియే ధర్మము ధర్మమనియుంట యదింటిని మించిన యాఱవ మహాపాతకము.