భారత అర్థశాస్త్రము/మొదటి భాగము - పదునైదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదునైదవ ప్రకరణము

యంత్రకళలు

వెనుకటి ప్రకరణమున యానోపకరణముల చర్చచేయబడినది. దాని నంతటితో జాలించి వినియోగ్యవస్తు సృష్టియొనరించు యంత్రముల గూర్చి కొంతయోచింతము.

2. యంత్రకళలు, అనగా యంత్రములచే నూలువడకుట, బట్టలునేయుట ఇత్యాదిక్రియలు.

చెన్నపురిలో పదునైదు సంవత్సరములక్రిందట రాకపోకలకు బడుగు గుఱ్ఱములంబూన్చిన మూడుమొగముల జట్కాబండ్లుండునవి. ఇంకను వానికి ప్రళయము రాకపోయినను ప్రకృతము ట్రాంబండ్లు వేయబడినందున వానిప్రాబల్యముతగ్గినది. దీనిచేత చెన్నపురికి లాభమా నష్టమా యనుట చింత్యము. నష్టములు - 1. గుఱ్ఱపుబండ్ల యజమానులు తోలువారు వీరికి జీవనము కష్టతరమైనందున ననేకులావృత్తి వదలవలసినవారైరి. 2. ఆగుఱ్ఱములకు బెట్టుటకుగాకున్నను చూపుటకైన దెప్పింపబడు కసవును పెంచువారు, మోయువారు, అమ్మువారు వీరికి బత్యము సున్నయయ్యె. ఇట్లు కొంద ఱిడుమల నొందిరనుట నిర్వివాదాంశము. ఇక లాభములు - 1. నికరమైన బాడుగ లుండబట్టి లడాయీలు లేకపోవుట, ప్రయాణములు సుఖముగాను మునుపటికన్న నయముగాను జరుగుటచేత జనుల దేహమునకును సంచికిని నష్టము లాఘవంబునొందుట. 2. ఇన్‌స్పెక్టరులు, ట్రాములనడుపు వారు, టిక్కట్లు ఇచ్చుటలో తమకుగొంచెము, కంపెనీకి గొంచెముగా జాగ్రత్తతో వేసికొనువారు, పైతంతులు క్రిందికమ్ములును సరిచేయువారు, ఇట్లు క్రొత్త క్రొత్త నౌకరులేర్పడి మొత్తముమీద జీవనోపాయములు విరివిజెందుట ఇత్యాదులు. మఱియు నీనౌకరులు వీరిచే పరాజితులై కర్మచ్యుతులైన జట్కావాలాలకన్న విద్యయందును గుణమందును గొంతకు గొంతమేలైనవారేగాన గడించిన సొమ్ములో మునుపటియంత కల్లంగడిలో గుల్లయౌటలేదు.

కావున యంత్రఫలంబులు తాత్కాలికోత్తర కాలికంబులని రెండువిధములు. అప్పటికి నష్టమైనను ముందునకు బ్రకృష్టమే యగుననుట మొత్తముమీద నొప్పుకొనవలసినదే.

యంత్రములచే సృష్టిక్రియ యతిత్వరితముగను హృద్యముగను నడచుననుట తెలిసినవిషయమేగాన విశేషించి వివరించుట యధిక ప్రసంగము. కాలికైన కట్టెబండిమేలు; కట్టెబండికైనను కోటిమడుంగులు ఆవిరి విద్యుచ్ఛక్తి వీనిచే బోవుబండ్లుమేలు. చేతిమగ్గముతో దినమున కొకచీరనేయుట బహుప్రయాస; యంత్రములతో గంటకు నూఱునేయుట సామాన్యకార్యము. మఱియు నమానుషములైనవియు యంత్రసాధ్యములు గోదావరివంతెన చెన్నపురిలోని రేవు వీనిర్మాణములో వేయబడిన ఇనుపదూలములు విశాలములైన బండలు మొదలగునవి మోయుటకు గ్రొత్తయాంజనేయు డావిర్భవించి రావలయు గాని మనకు సాధ్యమా? యుద్ధపునావలలో గుండుదెబ్బకు చీలకుండు నట్లు దట్టమైన యుక్కుపలకలు ప్రక్కలవేసి బిగింతురు. బిగియెక్కువ యగుటకై వానిలో బెజ్జములు వేయకయే మిక్కిలి గొప్పవైన చీలలను నీటిశక్తియంత్రములచే జొనుపుదురు. భీకరోద్యోగములు మాత్రమేనా? సుకుమారమైన చేతలన్ననో చేతలని నామమాత్రమేగాని చేతులతో నౌనా? గుండుసూదులు యంత్రసహాయములేక చేయవలయునన్న అలతియా?

పరుపలుకులేల? మనసాలెవాండ్రు వాసిదఱిగి వగపుల పాలగుటకు యంత్రవిస్తరమేకదా కారణము? యంత్రజంబుల యెదుర కరజంబులు నిలువలేవనుటకు నింతకుమించిన నిదర్శనమున్నె? పూర్వా చారక్రమంబున ననువయింపబడిన పరిధానములను పూర్వాచార గ్రస్తులే పరిత్యజించునట్లు చేయునంతటి మహాత్మ్యముగల యంత్రములు నిర్వక్రవిక్రమములనుట యతిశయోక్తికాదు. నవీనవిధానముల నల్లబడినవి చూపునకును ముఖ్యముగా క్రయమునందును సరసము లౌటచే నవీనములను నిషేధ్యములను వారుసైతము వీనియందు తగులుగలవారైరి. దేశాభివృద్ధికి యంత్రకళాప్రాబల్యము ఏడుగడ.

మనదేశములోని యంత్రకళల ప్రకృతపుస్థితి

మనవారును ఈ విషయమున నేమఱి యుండలేదు. ఇందునకు దృష్టాంతము.

ప్రత్తి వృత్తి. దూదిగింజలను వేఱుపఱచుట, ఏకుట, వడకుట, నేయుట ఇత్యాదులు. పూర్వము చేతితో నేయబడిన ఢాకా బందరు మల్లులు ఐరోపాలోను సుప్రతీతములై మిక్కిలిగ నెగుమతి జేయ బడుచుండినవిగాని అదిచూచి యోర్వలేక స్వార్థపరులై ఆంగ్లేయులు వానిని ఇంగ్లాండునకు దేగూడదని శాసించుట మొదలగు దుర్మంత్రములచే ద్రుంగుడునొందించి పుణ్యముగట్టుకొనిరి. అదిప్రాతకథ. ప్రకృత వృత్తాంతమునకుం బోదము

బొంబాయిలో ఆవిరిశక్తిచే వడకునేయుయంత్రములు తొలుత ఇంగ్లీషువారిచే స్థాపింపబడియె. అవి జయమునందుట, స్థిరపడుడు, పార్సీలు, మహమ్మదీయులు, మార్వాడీలు మొదలగువారును అందు బ్రవేశింపసాగిరి. నేటికి నందుబ్రయోగింపబడిన మూలధనములో నెక్కువభాగము స్వదేశస్థులకు జేరినదిగాన నిదిభావిశుభసూచకంబని దృఢంబుగ జెప్పవచ్చును.

యంత్రరూపమైన మూలధనప్రవృద్ధి దెలుపుసంగతులు

1851 వ సంవత్సరములో మొదటి యంత్రశాల స్థాపింపబడెను. 1861 వ సంవత్సరములో 12 కర్మశాలల గట్టిరి. 1879 వ సంవత్సరములో 56 ను, 1887 వ సంవత్సరములో 96 యును, 1897 వ సంవత్సరములో 155 ను, 1904 వ సంవత్సరములో 204 ఫ్యాక్టొరీలునుగా వడివడి నీవ్యవహారము వ్యాపించినది. 1904 వ సంవత్సరములో 46,000 మగ్గములు, 52,13,000 వడకు కుదురులుగలిగి యీ యంత్రాళి యమర్పబడి యుండెను. ఈ మొత్తములో బొంబాయికి జేరినవి 84 యంత్రశాలలు, అహమ్మదాబాదునకు 32, తక్కినవి ఇతర సీమలకు.

ఈ మూలధనముయొక్క మదింపు 1,35,00,000 సవరనులు; పనివాండ్రసంక్య 3,50,000; 15 కోట్లరూపాయల దూదిని ఈయంత్రములలో నూలుగుడ్డలుగా దయారుచేసెదరు. అట్లుండియు నింక పదునైదుకోట్లు రూపాయలదూది జర్మనీ మొదలగు నన్యదేశములకు బంపబడుచున్నది. అనగా నింకను 200 యంత్రశాలలకు గావలసిన ముతకదూది పండుచున్నదనుట.

ఇండియాలో 1903-4 వ సంవత్సరములలో తయారైన వస్త్రములకొరత 43,60,00,000 గజములు. ఇదిగాక విదేశనుండి రాబట్ట బడిన బట్టలు 196,60,00,000 గజములు. చూడుడు! ఇంకను ఎంతనేతకు ఈ రాజ్యములోనే ఎడమున్నదో

మొత్తముమీద సాలెవాండ్రకు యంత్రములు ప్రక్కబల్లెము లైనవి. వీరిబ్రదుకు పాడుబ్రదుకయ్యె. అయినను చిత్రపునేత చేతితోనేగాని యంత్రములచేనగు కళగాదుగాన, సరిగెబట్టలు, నేత్రోత్సవములైన కాశీచీరెలు, ధర్మవరముచీరలు ఇట్టివి నేయువారికి యంత్ర నిర్యాతములును మిక్కిలి వెలకుఱుచలును అయినవస్త్రములచే గిరాకి తగ్గినను బ్రతుకు బొత్తిగా నశించలేదు. సాధారణమైన బట్టల నేయువారికి ప్రాణము కంఠగతమైనది. ఈమధ్యమున విదేశవస్తు బహిష్కరణ సమయబద్ధకంకణులైన దేశభక్తుల ప్రచండప్రయత్నముచే వారి కిసుమంత గిరాకిహెచ్చి లాభము గిట్టగలిగినను ఇది తాత్కాలిక విజృంభణమేగాని నిక్కమైన యభివృద్ధిగాదు "ముల్లుదీయుటకు ముల్లేసాధన" మన్నట్లు, యంత్రబలములచే మన వృత్తులపై ధాటి చేయువారిని యంత్రబలముతోనే యెదిరించుటతప్ప వేఱొండు జయ ప్రదోపాయంబులేదు. స్వదేశవిషయక ప్రతిజ్ఞలకన్న స్నిగ్ధతర వస్తు సంఘటనము కార్యసిద్ధికి బ్రహ్మాస్త్రము.

దూదిని గింజలను వేఱుపఱచి దూదిని అదిమి బిగిమూటగా గట్టుయంత్రములు. ప్రత్తిపంటలు ప్రజ్వరిల్లు బొంబాయి , అహమ్మదాబాదు ఇత్యాది ప్రాంతములలో నూఱులకొలదినున్నవి. బరోడా సంస్థానములో నొక యంత్రశాలయైనలేని గొప్పగ్రామములఱుదు.

1904 సంవత్సరములో నీయంత్రశాలలసంఖ్య 895. అందలి పనివాండ్రు 75,500 మంది, ఇవియన్నియు నించుమించుగ స్వదేశజన స్థాపితములు.

జనపనార (జూట్) యంత్రములు

జనపనార ముఖ్యముగా బంగాళాదేశముననగుపంట. గోతములు కుట్టుట మొదలగు కర్మలు యంత్రములచే రచింపబడుచున్నవి. 1828 వ సంవత్సరమున 620 రూపాయల స్వల్పమగుసరకు ఇంగ్లాండునకు బంపిరి. ప్రప్రధమము యంత్రశాల నిర్మింపబడినది 1854 వ సంవత్సరమున.

1892 వ సంవత్సరపు ఆదినివుండిన ఫ్యాక్టొరీలసంఖ్య 26. వీనిలో మొత్తపు మూలధనపరిమితి 137 లక్షల రూపాయలు

1904 వ సంవత్సరాదిని ఫ్యాక్టొరీలసంఖ్య 38 టికిని మూలధనం 748 లక్షలకును ఎక్కెను. ఇందులో నొకవిశేషము. ఆంగ్లేయుల మూలధనము వాయురోగము వచ్చినట్లు పూర్వస్థితిలోనే కదలలేక నిలిచియున్నది. స్వదేశీయులది కపిసైన్యమురీతి గంతులువేయుచు నెగయుచున్నది.

నారనదిమి మూటలుగట్టుయంత్రములు 1904 వ సంవత్సరములో 155 ఉండినవి. వీనిలో పనిజేయువారిసంఖ్య 21,000 1904 సంవత్సరములో 13 కోట్ల వెలగలసరకు పరదేశయాత్రవెడలెను. ఈ నారవలె స్వదేశాభిమానము గల చేతనాచేతనము లెవ్వియులేవు. ఏలన ఇది హిందూదేశమునందుదప్ప మఱెచ్చటను ఎదుగదు. దేశము విడిచిన ప్రాణమువిడుతుమనువారు మనదేశములో ననేకులు. ఈవిషయమున గోగునారవంటి యోగ్యులేరునులేరు. ఇకముందు "వందే మాతరం" అని అభివాద నాశీర్వాదములు చేయుటకుబదులు "గోగునారవంటివారు గండు" అనిన నెంతో స్వారస్యముగ నుండునని నాయభిప్రాయము. దీనియందు మనకు నేకచ్ఛత్రాధిపత్యము గలదుగాన వెలలు హెచ్చుచేసినను అమెరికావారు మొదలగు వాడుక వారు మనయొద్దనే కొనవలసినవారుగానున్నారు. ఈ విషయంబటుండ నిండు. యంత్రప్రాబల్యము హస్తకళల నంతమొందించినది. చేతితో సిద్ధపఱుపబడు సరకులు బహ్వల్పములు. పూర్వమువలె సంచులు, గోతములు, నారచాపలును అట్టె కరకృతములుగావు.

కాకితములు

చేతితో జేయబడు కాగితములు ఈ దేశములో నున్నవారేవాయని సంశయింపవలసినంత తక్కువయైనవి. తక్కువమాత్రమే గాదు. మిక్కిలి మోటుగనుండుటచేత బొట్లములు గట్టుటకును దగనవిగానున్నవి. పూర్వమొకానొకప్పుడిది యాద్యంతమును చేతికి జేరినపని. ఇప్పుడు వానికి చేతివాసన యనునది తగులదు. యంత్రకళల పోటీయను వెల్లువలో హస్తకళలుబడి కొట్టుకపోవు చున్నవి. ఏలన యంత్రకళలలో నుత్పత్తిమేలు. ఎక్కువ. వెలయుతక్కువ.

ఈదేశములో బొంబాయిరాజధానిలో నాలుగును, బంగాళాలో నాలుగును, యునైటెడ్ ప్రావిన్‌సెన్‌లో ఒకటియు నంతుమొత్తము 9 కాగితములశాలలు 59 లక్షల మూలధనమును, 4,500 మంది పనివారునుగలవి 1904 లో నుండినవి.

ఈ దీర్ఘ చర్చవల్ల దేలిన విషయము లేమన్నను:1. మనవారు ఆంగ్లేయులు త్రోవజూపినంగాని ఇదివఱలో నైజసామర్థ్యంబున ప్రత్యగ్రపద్ధతుల నవలంబించునంత సాహసికులుగా నుండలేదు. ఇప్పు డిప్పుడు ప్రౌడులై స్వచ్ఛంద ప్రవర్తనకుం గడంగు చున్నారు. అయినను మొత్తముమీద అవునో కాదో యని సందిగ్ధములైన వ్యవహారములజోలికి నంతగాబోరు. ఇందునకు గారణములు. ధైర్యము చాలమి. అవివేకము, "నవీనమన్న నాకువలదురా అబ్బా!" యను పెద్దలనాటనుండివచ్చిన ప్రవృత్తి, నష్టమునకోర్చునంతటి ధనికులుగాకుంట, సంఘీభావశక్తి మొలచియు మొలవక యుండుటయు ఇత్యాదులు.

2. అయినను మనవారు ఉపేక్ష గలిగియుండలేదు. దీర్ఘ నిద్ర నుండి యిప్పుడే లేచిరి. కన్నులు తటాలున దెఱచుట కష్టము, కాకపోయినను ఊపిరిబిగబట్టియైన తెఱవనుద్యుక్తులై యున్నారు.

3. యంత్రకళలు అధికవృద్ధి న్యాయానుసృతములు. రాశి యెక్కువయౌకొలది వ్యయప్రయాసలు యధాక్రమముగ హీనములై వెలలకు నపజయము బుట్టింపజూచును. హస్తకళలు కొంచెముగా మాత్ర ముత్పత్తిజేయుట కనుకూలించునవిగాన నిట వెలలు జాల తక్కువజేయుట సాధ్యముగాదు. కావున యంత్రకళలు దండెత్తి వచ్చెనేని హస్తకళ లస్తమింపవలసినదే.

ఈ కడపటి యంశము విమర్శచేయుటకునై, సంగతులు తెలియనిచో విమర్శచేసియు నర్థము కాదుగాన, నుపోద్ఘాతముగా యంత్రవృద్ధింగూర్చి యింత వ్రాయవలసివచ్చె. ఇక ముఖ్యాంశ ప్రశంస కారంభింతము.

యంత్రకళలవలన ప్రజకు మేలా కీడా?

యంత్రములు సర్వానర్థములకుంబాపి, దారిద్ర్యముదొలగించి, భూలోకమును స్వర్గసమముంజేయునని కొందఱు పేరాసతో నెదురు చూచుచున్నారు. ఈ చిత్తభ్రమకు గల్పకము లేవనిన; 1. కార్యసాధనమునకు చలన మాధారము. ఉత్పత్తి యనగా రూపస్థలభేద మావిర్భవించుటయేకాని స్వతంత్రమగు వస్తుసృష్టి గాదనుట పూర్వమే ప్రకటింపబడియె. చలనమువలన స్థలభేదము కలుగుననుట స్పష్టము. రూపభేదమన్నను నదియే. నూలును బట్టలుగా నేయుట యననేమి? వాని నొకవిధముగా జేర్చుటయని కాదే? చేర్చుటయన్న స్థానాంతరకల్పనియేకదా? మఱియు, తుపాకీ మందునకు నిప్పుతగిలిన మందు మాయమై గర్జతో వాయురూపమైపోవును. బట్టలలో నూలు గోచరముగానున్నది ఇందు మందు అగోచరమైనది గదా! ఇదియు నట్టిమాఱ్పేనా వేరా? అని యడుగవచ్చును. మనుష్యకార్య సంబంధములనుబట్టిచూడ నిదియు భిన్నముగాదు. ఎట్లన, మందు డమ్ అని పెట్లుట అందులోని స్వతస్సిద్ధమైన శక్తిచేనైనదిగాని మనుష్యప్రభావ జనితంబుగాదు. మనకు సాధ్యమైనది యొకటే. ఏమన భిన్నములుగానుండు నిప్పు మందు వీనికి సంయోగము గల్పించుట. తక్కినవన్నియు నావస్తువుల స్వాభావికములై అంతర్గతములైయున్న గుణములప్రభావములు. కావున మనుష్యమాత్రులకుండు మాహాత్మ్య మొక్కటియే. చలనశక్తి. ఈయొక్కదానిచే లోకమునంతయు వశముగ జేసికొనుచున్నాము.

చలనశక్తికి నిదివఱలో బాహుబలమే తావలంబుగానుండెను. కేవల బాహుబలముచే నెంతని సాధింపవచ్చు? ప్రకృతము బాహుబలమునకుదోడు ప్రకృతశక్తుల బొమ్మలవలెనాడించు ధీశక్తి వచ్చినది. ఇకముందు అనంతములును అశ్రాంతములునగు ప్రకృతిశక్తులే సర్వముంజేయును. మనము మోటుపనుల గాలియైనదగులక నాగరికత గలిగి హాయిగ నుండవచ్చును.

అవునుగాని ప్రకృతిశక్తులను యంత్రముల నిమిడ్చినంగాని యవి మనకు సేవావృత్తి జేయవు. యంత్రోద్భూతికి ఇనుము బొగ్గు కావలయునుగదా! ఇంగ్లాండులోనుండు బొగ్గు ఇక నిన్నూఱేండ్ల కన్న నెక్కువ చాలిరాదని శాస్త్రజ్ఞులు మితముగ బలికిరే? బొగ్గు నుగ్గైన మనగతి యప్పటికి "యధాస్థానం ప్రతిష్ఠాపయామి" యేనా?

అని యడిగిన సమాధానము, బొగ్గులేకున్నను విద్యుచ్ఛక్తి గమనకారిగ నుండలేదా? ఒక్క కావేరినదినుండి శివసముద్రము, కన్నంబాడి యనుచోట్ల నీరు ఆకాశగంగగా బడుటచే తత్పతన వేగం వలన నెంతో విద్యుచ్ఛక్తి యావిర్భవింపంజేసి గవర్నమెంటువారు కోలారులోని గనులకును బెంగుళూరు మైసూరు పట్టణవాసులకును యధేష్టముగ శక్తినొసగుచున్నారనుట తెలిసియేవున్నది. పృథివిలో నుండు నదులనంతయు కనుమలలో కట్టలుగట్టియాపి, 30 లేక 35 అడుగులుపొంగి దుముకునట్టు చేయుటచేతను, హిమవంతము, ఆల్పుసు, ఆండీసు ఇత్యాది గగనచుంబగంభీరగిరులనుండి పాఱునదులలోను సాంద్రనీహార ప్రవాహములలోను నడగియున్న శక్తిని వెలికిదీయుట చేతను చలనక్రియ యంత్రాధీనముగ జేయవచ్చును. ఈనదులు సమసి పోవువఱకును నిద్రపోముగదా! నూతన ప్రయోజకముల గనుగొన కుందుమా? ఇపుడే అక్షయద్రవ్యమనందగు 'రేడియ' మను లోహమును వాడుకలోనికి దీసికొనిరాలేదా? అని శాస్త్రజ్ఞులు పల్కుదురు.

మఱియు నమెరికాలో 1902 సంవత్సరములో 40,000 రైల్వేఇంజన్‌లు పనిలో నుండినవి. వీనిచేనగు కార్యము యంత్రరహిత తంత్రములచే జేయంబూనిన 7,60,00,000 గుఱ్ఱములు. 1,90,00,000 మనుష్యులును గావలసివచ్చును. అయినను రైల్వేలలో తోలువారు, స్టేషన్‌మాష్టర్లు సహా సిబ్బందియంతయు 10,00,000 మందే. కావున 1,80,00,000 మంది శక్తి యితరోద్యోగములకై యంత్రయుక్తిచే మిగిలింపబడిన దనుట యెంతచోద్యమో యోచింపుడు! ఒక్కమిషన్ ఉండిన నూఱుగురు పనివారుండినట్టు. అందఱికిని యంత్రములు దొరకిన హాయిగా దొరలవోలె పనిజేయించుకొని తమయిల్లే యింద్రలోకముగా నుండ వచ్చునుగదా! ఈ విపరీతములైన యూహలు నీటిబుగ్గలువంటివి. మిగుల తళుకుగానున్నవికాని గట్టివిగావు. ఎట్లన;

1. శ్రమలేని యింద్రభోగము కొనసాగు కోరికగాదు. యంత్ర నిర్మాణమునందును పనిజేయించుట యందునునైన మనము ప్రయాసపడియే తీరవలయు. ఈమాత్రపు గష్టమును నష్టమౌట యేనాటికిని తటస్థింపదు.

2. యంత్రములవల్ల ప్రాణాధారములైన పరిగ్రహణ క్రియలు అనగా కృష్యాదులు అంతగా వైపుల్యమునకు రావు. అన్నిటికన్న యానమునందు యంత్రము లతిసమర్థములైయున్నవి. ఓడలు, పొగబండ్లు ఇత్యాదు నిట దృష్టాంతము. దీనిచే వినిమయము వికసిల్లినదే గాని తత్సమంబుగ పంటలు, లోహములు, నాతతములుగాలేదు. యానమునకు దరువాత రూపభేదకళలలో యంత్రములు విరివిగ ప్రయోజకములు. అయిననేమి? వినిమయ పరివర్తనము లెంతస్ఫారములైనను భూమ్యాదులనుండి యాకర్షింపబడు వస్తువుల ననుక్రమింప వలసినవేగాని యతిక్రమింపజాలవు.

3. పరికర్ష ణార్థమై యంత్రముల గొంతవఱకేగాని ఎక్కువగా నుపయోగించుట లాభకరముగాదు. ఏలయన, కృషి విషయమైన నిదర్శనముం జూడుడు! విత్తులు చల్లుటకును బావులనుండునీరు లాగి పాఱునట్లు చేయుటకును యంత్రములనుకూలములు. అయినను వానలు గావలసినవేగద! యంత్రములచే వాన నాకర్షింపజూచుట పిచ్చి తలంపు. మఱియు కాఱు ననుసరించి ఫలితముండును. ఇచ్చవచ్చినప్పుడు కోరిన గింజలుచల్లిన మొలచునా? కావున నదనులవేసి పని చేయవలయునేకాని ఫ్యాక్టొరీలలోవలె సమయాసమయములు విచారింపక ప్రవేశించుటతగదు. ఇందుచేత యంత్రములను సదాపోనిచ్చుట యసంగతము. సర్వదా త్రిప్పుచునునుండక అప్పుడప్పుడు వత్సరమున గొన్నిమాసములుమాత్రము ఉపయోగించినచో గిట్టిరాదు. మఱి త్రుప్పుపట్టిచెడును. యంత్రములు బీగములవలె వాడుచుండిననేగాని లేనియెడబీడువడును. భూమి యలసి విస్సారమైవుండు వేళల యంత్రములతో నుసిగొల్పగాదు.

ఇట్లనుటచే యంత్రములు శుద్ధముగ నసేవ్యములని యెన్నబోకుడు. ఐరోపా, అమెరికా దేశములలో మైళ్ళకొలది విస్తీర్ణమైన క్షేత్రము లుండబట్టి దున్నుట, కోయుట, పాఱుదల ఇత్యాదులు యంత్ర మూలముగజేతురు అయినను వినిమయ పరివర్తన తంత్రం జులంబలె కృష్యాదుల యంత్రములు ప్రశస్తములుగావు. అనగా పోల్చి చూచిన నల్పశస్తములనుటగాని బొత్తిగా శస్తములే కావనుటగాదు.

కావున యంత్రములచే నాహారపదార్థము లపారములై ఆకలి యనునది యెట్టిదో యనునట్లు సుభిక్షత వెలయుజేయుననుటకల్ల. తిండిలేక తల్లడిల్లుదుమేని యంత్రములచే నెన్నిసింగారములు లభించిన నేమి? భోజనముమట్టై కట్టను దొడుగను నిట్టలముగనున్నను ఇంద్రుని నీటు మనకురాదు.

4. గృహనిర్మాణమునందును యంత్రము లల్పప్రయోజకములు. జనసామాన్యమునకు ముఖ్యముగా వలసినవిరెండు. ఉదరపోషణము, నివాసస్థానము ఈ రెంటియందును యంత్రము లంత యుపయోగ కరములుగావు.

5. ఐరోపాలో యంత్రములవల్ల అత్యుత్పత్తికలిగి అతివృష్టిరీతి నుపాధి కాస్పదమౌటయు సకృత్తుగ గలదు. యంత్రశాలలు నూరక నిలిపిన సాధనములు చెడునుగాన సరకులెంతయున్నను వెలలు పాడైనను వెనుదీయక నిరంతరోత్పత్తికింబూని యొండొరుతో స్పర్థించి తాము జెందుటయేగాక, అన్నిసరకులును బరస్పర సంబంధము కలవిగాన, ధరల నెల్ల నుయ్యాలలూగించి దేశమును క్షోభాస్పదముగజేతురు. ఇది నిజమైన కష్టమేగాని, మనదేశములో నంకురించు నాపదగాదు. ఆధిక్య ప్రయుక్తబాధలు ఇంకను గొన్నిశతాబ్దములకైనం నిట బ్రవేశించునో లేదో? ఆకలిచే జచ్చువాడు దానికన్న నజీర్ణ బాధయేమేలని తలచుగాదే? కావున పాశ్చాత్యుల పాలిపెద్దమ్మను మనము లక్ష్మీదేవియనియే కొనియాడవచ్చును.

6. పూర్వోదితరీతి నితరులకు భరణప్రాప్తియై మొత్తముమీద రాజ్యము బాగువడినను యంత్రములచే స్థానభ్రష్టులైన కర్మకరులకు నదియొక సమాధానము గాదుగనక వారుహింసగండ్రు. చూడుడు! ట్రాంబండ్లచే కూలిగోలుపోయిన జట్కాబండ్లు తోలువారికి ఇంకెవరో కల్లుద్రావక భార్యలకు బంగారు సొమ్ములు పెట్టుటచే గడుపుచల్ల నవునా? దేశమునకు మేలయుంటిమి. ఉండనిండు! వారిగతియేమి? అమెరికాలో 180 లక్షలమందికి శ్రమ మిగిలింపబడెననియు జెప్పితిమి గదా! తినుటకు తియ్యగ నన్నియునున్న శ్రమమిగిల్చినను మేలే. ఆ శ్రమచేతనే జీవనము జరుగవలసియున్నపుడు దానిని మిగిలించిన యెడల నేదేవునకు ప్రీతి?

వృద్ధియొక్క లక్షణము

యంత్రములచేత కొందఱికి కీడుమూడుననుట నిజమే. ఎవ్వరి కెన్నండును ఎట్టి కష్టమును గలుగదనుట బాధితమైన యతిశయోక్తి. ఇందుచేత యంత్రములు హానికరములనియు త్యాజ్యములనియు భావించుట యవివేకము. యంత్రకళలేగావు. ఏవిధమైన వృద్ధికిని తద్విరుద్ధమైన వస్తుక్షయంబు ముఖ్యంబు. ప్రాచీనులు వచించినట్లు లయమును సృష్టికి బ్రధానము. నూతనముగ మేడగట్టింపవలయునన్న ప్రాత గోడను బగులగొట్టింపవలసినదే. బిడ్డను బెంచవలయునన్న తల్లికిబాలు నష్టమౌను. అనేకులు వీరస్వర్గగతులైనంగాని రణమున విజయమురాదు. కావుననే స్వపరమైన దృష్టితోజూచు నికృష్టాత్ములు పురోవృద్ధియం దనాదరులై యుండుట. జనసామాన్యమునకు మేలుగలిగినను తమకుం గలుగునను నిశ్చయము లేదుగాన అట్టివారు 'కష్టించి ఫలమేమి' యని తమతమ పనులనుమాత్రము చూచుకొని సంఘమేగతిబోయిన నేమియనియుందురు. ఇందుచే ముందు వీరికిని చేటుమూడుట నిజమని ఇదివఱకే వివరించితిమి. చూడుడు! ప్రతిభటుడును "జయము నొందిననేమి? నేను బ్రతికి రాగలనో లేదో? ఒకవేళ నేను జచ్చితి నేని దేశమంతయు నైశ్వర్యవంతమైయున్నను నాకేమిలాభము? ఎవ రెట్లైననుసరే. తప్పక నేనుమాత్రము జీవముతో నిలుతునని దేవుడు వరమిచ్చినంగాని యుద్ధమున కుద్యుక్తుడంగాను" అని యోచించెనేని పరాజయముమాడయేల, యాసైన్యము యుద్ధమునకేతొడంగదు. అట్లుండు మూకల శాత్రవు లరటిమ్రాకుల గూల్చినట్లు పడగొట్టుదురు. తనపరముగాక సంఘపరమైన దృష్టితో గణించువారు తమకెట్టి పాడైననుసరే, రాజ్యమైన బాగుపడిన జాలుననియు, సంఘ మడుగంటిన నెట్లును తమకును మానప్రాణపరిహారము తప్పదనియుదలంచి ఇహపరములం దొక్కెడనైన సుఖమును గీర్తియుం గాంక్షించి యుద్ధోన్ముఖులై మగంటిమిం బ్రకటింతురు. అందుచే దమకును జయమబ్బిన నబ్బవచ్చును.

కావున ప్రవర్తనలు యుక్తములా, అయుక్తములా, యని చర్చించువేళల సంఘపరమైన బుద్ధితో మేలుగీళ్ళ తూచిచూచి, మొత్తముమీద సమూహమునకు మంచివని యేర్పడిన నాచర్యలు అవశ్యానుష్ఠేయములని గ్రహించి ప్రవర్తించుట యొక్కటే యిహపర సాధనంబైన తత్త్వంబు. అప్పటముగ మేలుమాత్రముగలిగించు క్రియ లీలోకంబునలేవు. "కష్టములేనిది ఫలములేదు" అనునట్లు ప్రతిఫలమునకు సుంకమురీతిని కష్టమొండు విధింపబడియున్నది. ఈ కష్టము "నామీదబడునో నీమీదబడునో" యని వెఱచువారు పిఱికి పందలు. అట్టివారికి బానిసతనమే ముమ్మాటికిసిద్ధము. కావున యంత్రకళలు నిష్కృష్టముగ ఉపకార మొనరించునవి గాకున్నను సమష్టిని శ్రేయస్కరంబులౌట సంగ్రహణీయములుగాని నిగ్రహణీయములుగావు.

7. యంత్రములలో నేకపరిమాణ రూపములుగల వస్తువుల జేయవచ్ఛుగాన వానిలో నేదైననొకభాగము విఱిగినచో మరామత్తు కొఱకు పనివానిని వెదకికొనిపోక, యట్టిభాగము నింకొక్కటిదెప్పించి వేసికొనవచ్చును. బైసికలులు (అనగా కాలితో ద్రొక్కంబడు రెండుచక్రముల రబ్బరు బండ్లు) చేతిగడియారములు వీనిలో నొక చక్రమో ముల్లో చెడిపోయిన ఇంకొక చక్రమో ముల్లో రప్పించి యథాప్రకారము నడుచునట్లు చేసికొనుట బహుసులభము. హస్త కళలలో నింత నిష్కృష్టముగా పరిమాణములు గుదుర్చుటకు గాదు గాన, మనయిండ్లలో నగలు క్రిందబడి కీళ్ళు, మరలు, మొక్క బోయిన సాధారణముగ నానగను జేసినవాడేగాని ఇతరు డద్దాని నలవరింపజాలడు.

అమెరికాలో కాపువారు అందఱు నొకచోట నిండ్లుగట్టుకొని సముదాయముగా వసియించుటలేదు. తమతమ పొలములలో గృహము లేర్పఱిచి వసింతురు. ఆపొలములు నూఱులకొలది నెకరాల విస్తీర్ణములు గలవిగాన వారు ఒంటరిగాండ్రరీతినుండుట పద్ధతిగానున్నను వ్యవసాయమునకువలయు యంత్రముల తఱుచుగా వాడెదరు. సమీపమున మతమ్మత్తు షాపులులేకపోయినను యంత్రముల నుంచుకొనుటకు పైని వివరింపబడిన నిష్కృష్టపరిమాణలక్షణమే అనుకూలకారణము.

8. మఱియు చేతిపనివాండ్రు తమ వృత్తిలో నష్టమైన వేఱొక వృత్తిలో తటాలున బ్రవేశించుట సాధ్యముగాదు. వడ్రంగి యెంతో తరిబీతులేనిది కమ్మరికానేరడు. చాకలి మంగలియౌటయు, మంగలి చాకలియౌటయు వరప్రసాదమున్నంగాని ఈడేరదు. కావున నష్టమున్నను కుడితిలోని బల్లిమాదిరి నందేనిలిచి శ్రమపడుటయో తుదకు వ్యాపారరహితుడై యేమియు జేయుటకులేక తిరిపెమునకు దిరుగుటయో వారినొసల లిఖింపబడిన వ్రాత.

యంత్రకళలలో వృత్తులుమార్చుట యంత దుస్తరముగాదు. ఏలన సర్వయంత్రములకును గొన్నిగుణములు పోకలుసామాన్యములు. వీని నెఱింగినవాడు ఒకశాలవిడిచి ఇంకొకశాలకు బోయినను అతి శీఘ్రకాలమున నీక్రొత్తపనిని నేర్చుకొనగలడు. కావున లాభ మెక్కడ నెక్కువగనుండునో అందుదిగుటకు హస్తకళలకన్న యంత్రకళలలో నెక్కువవీలున్నది. అనగా జనులు జాతిమతాచారబద్ధులు గాక విచ్చలవిడి సంచరించు దేశములోనను సమయమూహ్యంబు.

యంత్రములకు బ్రవేశములేని వృత్తులు

ఈ వ్యాఖ్యానముజూచి కొందఱు కాలక్రమమున యంత్రములు సమస్తవ్యాపారముల నాక్రమించుకొనునేమో చేతులు జేయను పనులేమియులేక నానాటికి జీర్ణములై నిస్సారములై పోవునేమో! అని శంకింతురేమో? అట్లు శంకింప నక్కఱగానము. ఐహికంబుల కన్నింటికింబలె యంత్రశక్తికిని మేరలున్నవి. అది యపారంబుగాదు. అనేకక్రియలు హస్తసాధ్యములుగాని యంత్రసాధ్యములుగావు. అవి యేవనిన:-

యంత్రము లేకవిధమైన గమనముచే కార్యము జేయును. దూదికర్మశాలలో నూలువడకు యంత్రముల జూడుడు! అవి యొకే తీరున నొకేవేగముగ తిరుగునుగాని స్వచ్ఛందగమనశక్తిగలిగి మన యట్లు వంకరటొంకరగ నానావిధగతుల జరింపజాలవు. రైల్‌ఇంజన్ చక్రములయొద్ద ముందునకు వెనుకకును గొట్టుకొను గుండ్రమును స్థూలమును ఒకగజము పొడుగునుగల కమ్మిని మీరుచూచియుందురు. అది ముందునకు వెనుకకు బోవుగాని పిచ్చికుక్క వలె చుట్టిచుట్టి తిరుగుమన్న దానిచేతగాదు.

కావున నేయంత్రమైననుసరే నియమితమైన యొకేతీరున తిరుగుటమాత్రమేగాని పలుదెఱంగుల విహరించుట దానికి నతీతమైన మాహాత్మ్యము. చేతనాచేతనములకుగల ముఖ్యవ్యత్యాసములలో నిదియొకటి. అర్ధరూప్యము వెలజేయు కోడి తిరుగు తెఱగున లక్ష రూపాయలుచేయు యంత్రము దిరుగనేరదు. కావున అఖండములగు చిత్తరువులు యంత్రములచే రచింపబడుటకుగాదు. చీటీగుడ్డలు మొదలగువానిలో వేయబడియుండు ప్రతిమలు తొలుత హస్తలిఖితములుగాని యంత్రలిఖితములుగావు. నేతపనికిని, నేసినవానిపై ముద్రింపబడు ప్రతిమలపనికిని ఇదియొక్క తారతమ్యము. నేతపని యాద్యంతము యంత్రకృతము. ప్రతిమలన్ననో చిత్రించుట, చేతిపని. ముద్రించుటమాత్రము యంత్రకల్పితము.

ముద్రించుటయననేమి? ఒకపలకలో అక్షరములో రంగులో యొకతీరునజేర్చి కూర్చితిమేని ఆపలక కాగితము, వస్త్రము, ఇటువంటి వస్తువులపై నొకదానివెనుక నొకటిగా పదేపదేపడుట. కాగితము నొకయంత్ర మొకజాడగా బ్రక్కకు లాగుచుండును. అది యొక నిముసమో రెండునిముసములో సాగుచుండిన పిదప పలకను ఇమిడ్చియుండుభాగములేచి తనముందువచ్చిన కాగితపుభాగముపైబడి మఱల వెనుకకుబోవును. కాగితము మునుపటియట్లు అవతలికిబోవుచుండును. మరల రెండునిముసములకో నియమితమైన యెంతకాలమునకో పలక యధారీతినిపడి వెనుకకు మఱలును. ముద్రాపణమన నింతయే. యంత్రములు నియమప్రకారము ఏకవిధమైన గమనమును గుణీకరించునేగాని చిత్రకారుడు వన్నెలు, గీతలు, పొందికపొసగజేర్చునట్లు నానావిధగతుల సమన్వయింపజాలవు. ఇంతేకాదు. చిత్రమనగా భావప్రదర్శనమైన కృత్యము. చిత్రకారుడు, కవి, గాయకుడు వీరలు స్త్రీపురుషుల హృదయములోని భావములను, రసములను, ఇంగితములను ప్రకటించునట్టియు, నుద్దీపింపజేయునట్టియు క్రియలను సృష్టింతురు. జడపదార్థములైన యంత్రములకు భావము లెక్కడివి? కాళిదాసునివలె కవిత్వం జెప్పుమా యని యెంత బొగ్గు నీళ్ళువేసినను ఆవిరిమ్రోతదక్క ఇంకే ధ్వనియు బయటికిరాదు. సౌందర్యము, హాస్యము, కోమలత, ప్రచండత ఇత్యాది రసములు మనుష్యమానసాంతర్గతంబులు. వీనిని వెలిబెట్టు చేష్టలు మనుజసాధ్యములుగాని యన్యంబు లెన్నంటికింగావు.

కావుననే వస్త్రాభరణాదులయందును అద్భుతములైనవి హస్త రచితములుగానుండుట. మిక్కిలి సుకుమారములైనవియు రంగులు, తళతళలు, గీటులు, ఛాయలు మొదలగువాని యలంకారకరమగు కలయికచే దీర్పబడునవియునైన కళలలో యంత్రములకు బ్రవేశము బొత్తుగాలేదు. శ్రీ శ్రీ అలెగ్ఝాండ్రా మహారాణిగారి పట్టాభిషేక పరిధానములు డిల్లీలో చేతితో నేయబడి బంగారుసరిగె, ముత్యములు, నానావిధ వర్ణ చిత్రములు వీనితో శృంగారింపబడినవి.

కావున యంత్రవ్యాప్తివలన చుఱుకుదనముగలవారి కేనాడును పనికి గఱువుగాదు. తామసగుణ పూరితులైన మందస్వభావులకు యంత్రములుండిననొకటే లేకున్ననొకటే. అట్టివా రెన్నంటికిని ఎన్ని పనులున్నను కృతప్రారంభులుగారు.

సౌఖ్యస్వభావము

ఈ కారణంబులంజేసి యనాయాసస్వర్గము యంత్రములను సోపానప్రాప్తిచే దిగివచ్చి మన కింద్రభోగము సిద్ధింపజేయుననుట పిచ్చిమాటయని వ్యక్తీకరింపబడియె. దేవేంద్రభోగము రాదుగదాయని బుద్ధిశాలి ఎవ్వడునుజింతింపడు. ఎందునకన, ఒక్కపనిపాటును లేక యూరక కూర్చుండిన నెట్టిభోగములును మనకు రుచింపవు. కష్టపడిననేగాని సుఖము సుఖముగ దోపదు. మఱియు సౌఖ్యమునాశించి యద్దానినే అన్వేషించిన నీడయుంబోలె నది మనము వెనుదగులు కొలది ఇంకను ముందునకు బోవుచుండునేగాని చేజిక్కదు. సౌఖ్యము తన్నేగోరి వచ్చువారి నిరసించును. అట్లుగాక కార్యసాధన కృతావధానులై చింత లేక తమ పనుల జాడలంబట్టి పోవువారిని వలదన్నను వెన్నాడి కలయజూచును. ఇది సౌఖ్య స్వభావము. నాకుం జూడ పురుషార్థములు పెక్కు లిటువంటివ యని స్ఫురించెడివి. ప్రొద్దస్తమానము 'నాకు దేహము ఆరోగ్యముగా నున్నదా లేదా' యని నాడి నిమిష నిమిషమునకును బరిశీలించి చూచువానికి ఆరోగ్యము నిలుచునా? ఆ యారోగ్య చింతయే యొక రోగము. చక్కగా చల్దిగుడిచి నాగేలి భుజముపై నుంఛుకొని పొలముల బుద్ధి నిలిపి తన్ను దామఱచువాడు ఆరోగ్యవంతుడుగ నుండుటయే కాదు, సమాధి నానందించు యోగీశ్వర తుల్యుండనినను దప్పులేదు. ఇట్లే ముక్తి, ఆత్మజ్ఞానము ఇత్యాది సిద్ధులు ధర్మనిరత చిత్తులను తమంతటవచ్చి చేరును. అర్థోదయమునట్లే. కేవల లోభబుద్ధుని ధనమునే యాకాంక్షించి పలవరించువారి దేశమున లక్ష్మి చిరకాల నివాసము జేయదు. ఐరోపావారు ధనపిశాచానిష్టులు గారనుటకు వారిఐశ్వర్యమే ప్రమాణము. ఇది వింతయైన పలుకుగ దోచునేమో! వివరించెద వినుండు. లోభులు ధనమును బాతిపెట్టి దీపముబెట్టుకొని కావలి యుందురేకాని ఇంకెన్నడో ఫలములనిచ్చిననిచ్చు నుద్యోగముల వినియోగింపరు. మూలధన ప్రయోగంబులేనిది ద్రవ్యములు విస్తరింపవు. ఈ ప్రయోగమునకు సాహసము ప్రేరేపక హేతువు. చూడుడు! వారు ఆశాహతులను కొందము. మన మాశలేనివారముకాముగదా? ఐన వారుమాత్ర మేల సర్వవిభవసమేతులై యుండుట? మన మష్టదారిద్ర్య తాడితులై మలయుట? నిజము చూడంబోయిన నాదికారణమొక్కటే. అయ్యది పౌరుషవంతులై నైజశక్తుల నిగ్రహించి దేశాభిమానము గ్రుంగనీక సత్యనిరతిగలిగి తమతేజంబును ప్రకటించిన సర్వసిద్ధులు కరతలామలకములౌట స్వాభావికము. పౌరుషహీనతయే మనదుస్థ్సితికి గారణము. కావుననేగదా ఇప్పుడు సుమారై నూఱు సంవత్సరములుగ కవిత్వము, తత్త్వశాస్త్రము, ప్రకృతిశాస్త్రము, శిల్పకళ ఇత్యాదుల యందెందును ఉత్కృష్టములైన కృతులెవ్వియు నీఖండంబున నుద్భవిల్ల కుంట? తత్పూర్వము ప్రాచీనులు ఈఅన్నిటియందును బ్రగల్భులై యుండిరి. ఏకాలమున మనవారు పౌరుషమే ప్రధానమనినమ్మి ఉక్కు తునకలట్లుండిరో ఆవీరయుగంబులైన భారతకాలాదులలో శత్రుభంజన క్రీడతోడ సర్వక్రీడలు, శాస్త్రములు ప్రబలివుండినవి. ఎప్పుడు బానిస తనంబు ప్రాప్తించి శత్రువులయు, దురాచారములయు, కనుసన్నల గ్రుక్కుమిక్కనక మెలంగవలసినవారమై మీసముల సింగారమున కకాని మగతనము దెలుపుట కుంచుకొననివారమైతిమో నాడే ఈశిఖండులచేనిండిన దేశములోనుండ రాదని అర్థలక్ష్మియొక్కతెయే కాదు, ఆమె నెడబాయకుండు సర్వలక్ష్ములును అంతర్థానమొందినవి. పురుషకార ప్రకాశితులగుటచేత పాశ్చాత్యులు సర్వవిధములైన యభ్యుదయములకు బాత్రులైరనుట యుక్తము. ఊరక వారిని లోభులనుట పాపము. ధనమునుమాత్రము మూటలగట్టి ఇంకేగొప్పతనము లేనివారైయున్నచో నొకవేళ నట్లనినను జెల్లునుగాని ప్రత్యక్షముగ శాస్త్రసంచయములనెల్ల శోధించి వికసింపజేసిన మహాత్ములను శుద్ధ లోభులనుట చెల్లదు. అదియటుండనిండు.

యంత్రకళలచే దేశమునకు మొత్తముమీద మేలుగలిగినను జీతమునకు బనిజేయు జనసామాన్యమునకు వీనివలన ఎగ్గా లగ్గా, యనుట విచార్యము.

యంత్రకళలచే జీతగాండ్రకు తటస్థించు సుఖదు:ఖములు

1. యంత్రోద్భవముల వెలలు సాధారణముగ దఱుగుచు వచ్చును. అదెట్లనిన, యంత్రవ్యవహార మధికవృద్ధి ననుసరించును. కృషివలె హీనవృద్ధి పీడితముగాదు. కావున సరకులు హెచ్చుకొలది వెలలు లొచ్చగును. అట్లౌట ఒకవేళ కూలితగ్గినను ఆ తగ్గినకూలికే మునుపటియంతయో ఇంకను ఎక్కువయో సామానులు గొనవచ్చును గనుక మొత్తముమీద లాభమే.

పైవాదమునకు ఆక్షేపణములు:- ఈలాభము నెప్పుడు వడయ జాలుదురు? తాము వినియోగించు వస్తువులు యంత్రకృతములైన యెడలగదా! ధనికులు వాడెడి జరతారుశాలువలు, లోహపాత్రములు మున్నగునవి యంత్రములచేజేయబడి, బీదలుపయోగించు మట్టి పాత్రలు మోటుగుడ్డలును పూర్వమువలె హస్తనిర్మితములేయైన యంత్రీయముల వెలలుతగ్గిన ధనికులకేగాని తక్కువవారు కేమిమేలు? మఱియు పూర్వము వివరింపబడినట్లు జనసామాన్యము తమ రాబడిలో ముక్కాలు మువ్వీసముపాలు వినియోగించు భోగ్యములు భోజనము గృహములు గట్టిగుడ్డలు, నివాసాహారముల యుత్పత్తిలో యంత్రము లంతసహాయకారులుగావు. ఇక గుడ్డలన్ననో ఇవి కొంతమట్టునకు నయములైనను సరాసరికి కోమల దుకూల రచనయందుబలె కర్కశ వస్త్ర అనువయమున యంత్రములు ప్రయోజకములుగావు. కాన మోటుగుడ్డలధరలు విశేషము వ్రాలవు.

ఇందుచేత నుద్ధతులతో సమానమైన యుపయుక్తతను పరిహీణులైనవారు యంత్రములవలన బడయజాలరనుట స్పష్టము. ఈ విషయమునే ఇంకను విస్తరించి నుడివెద.

వస్తుసముదాయములు రెండుతెఱంగులుగ విభజింపవచ్చును. ఆవశ్యకములు, అలంకారములు అని.

ఆవశ్యకములు: భోజన నివాసాదులు. అలంకారములు: చీని చీనాంబరంబులు, భర్మహర్మ్యములు, మృష్టాన్నములు, మణిగణ ఖచిత భూషణంబులు మున్నగునవి.

మొత్తముమీద నావశ్యకములు హీనవృద్ధి పాత్రములు. అనగా బండములు విశేషించి యుత్పత్తి జేయవలయునన్న వ్రయము క్రయము హెచ్చును. జనసంఖ్య యెక్కువయగుదు, బాడుగలు, ధాన్యముల ధరలు పనికెగయుచుండుట యనుభవ విదితమే.

అలంకారము లధికవృద్ధిపాత్రములు. అనగా రాశి గురుత్వంబు వహింపుడు వ్రయక్రయములు లఘువులగును. వీనియందుబలె పై వాని యందు యంత్రము లంతతఱుచుగ వాడబడవు.

బీదలును సామాన్యప్రజలును తమయాదాయములో నెక్కువపాలు ఆవశ్యకములవాతవేతురు. మహారాజులైనవారు అలంకారముల కర్పింతురు నెలకు 1000 రూపాయలు వేతనముగ యుద్యోగస్థుడు ప్రాణాధారములకై 200 రూపాయలు సెలవుచేసినను ఆదాయములో నైదింటనొకవంతే. నెలకు 5 రూపాయలుతీయువాడు ఒక్కరూపాయ సారాయికిబెట్టి 4 రూపాయలు ప్రాణమాన రక్షణార్థమువేసిన 4/5 వంతు ఆవశ్యకవ్రయముగదా? ధనికుడు ఆదాయములో 100 కి 20, బీదవాడు 100 కి 80 వ వంతులు ఆవశ్యకములకు బెట్టుదురు.

యంత్రములచే నలంకారములుమాత్ర మెక్కువ నయమగును గాన పోల్చిచూచిన ఆఢ్యులంజెందునంత ఫలంబు దీనులం జెందనేరదు.

2. యంత్రములచే నుత్పత్తి హెచ్చుచున్నది. దానిచే వెలలు పడును. వెలలు తగ్గుడు అమ్మకము జాస్తియగును. వాణిజ్య విన్యాసముచే మునుపటికన్న నెక్కువపని వర్తకమున నేర్పడును. కావున యంత్రములచే స్థానభ్రష్టులైనవారు నూతనముగ గల్పింపబడిన ఇతర కార్యములలో బ్రవేశించి ప్రాప్త భరణులు కావచ్చును. కావున యంత్రములచే నేమాత్ర మెవ్వరికిని గష్టముగాదు.

ఈవాదము పూర్వమే ఖండితమయ్యును మఱియు జర్చింతము.

వెలలు క్రుంగుకొలది వాణిజ్యములు పొంగుననుట యమోఘ న్యాయంబుగాదు. కొన్నిటియందు మనయాసక్తి త్వరలో మితిమీఱినదగును. కొన్నిటియందుగాదు. బంగారు నెంతకూడబెట్టినను ఇంకను గూడబెట్టుదమను ఆశవదలదు. కావున నది యెంత సరసమైనను దానిక్రయము విరసముగాదు. మితాసక్తి పాత్రములై నవస్తువు లూరక లభించినను మనమెక్కువగా ప్రోగుజేయగోరము. ఉప్పునయమయ్యె గదాయని హద్దుపద్దులేక నోటిలో నెవ్వడు నిండించును? మొత్తము మీద ఆవశ్యకములమీద యనురక్తి త్వరలో నంతమొందుట స్వాభావికము. అలంకారములయం దంతశీఘ్రముగ నార్పబడదు. భోజనమునకై నూఱురూపాయలు సెలవుజేసిన నిది దుండగముగదా యనివిస్మితులౌవారును, నగలు, కాశీచీరలు, సొగసైనబండ్లు, శృంగారా గారంబులు, ఉద్యానవనములు, ఇత్యా ద్యతిశయిత భోగభాగ్యంబులకై వేలకొలది ధారవోసినను అమితవ్రయమని చింతింపరు ఈమనో భావము మేరమీఱినదిగాకున్న యుక్తమనియు, పురోవృద్ధికి ననుకూలమనియు, నాగరికతాలక్షణ మనియు తొలుత వాంఛావిమర్శ సందర్భమున బ్రకటించితిమి. అది యట్లుండె.

మఱియొకటి. సంకల్పితములైన వ్యవహారములలో నొకదానికి మాత్రము వెలతగ్గిన దానియమ్మకము పెఱుగజాలదు. దృష్టాంతము. ఊరుగాయబానలు మామిడికాయలులేనిది వ్యర్థములు. వానివెల యెంతచులకనైనను మామిడిపంట ననుసరించి ఎక్కువగనో తక్కువగనో యని చేయబడునుగాని ధరలు తేలికయయ్యెగదాయని ఎక్కువగ నెవ్వరును గొనరు.

కావున నయము క్రయము యథాక్రమబద్ధములనుట సరాసరికి సరియైనను విఱుగులులేని న్యాయముకాదు. మఱియు, క్రయములు అధికములై తుట్టతుదకు నూతనములైన యంగళ్ళు స్థాపింపబడు నను కొందము. ఈ స్థాపన తలచినమాత్రాన అయ్యెడుపనిగాదు. కాలాంతరంబునంగాని తక్షణంబు ననపణ్యశాలలు పుట్టుగోగులట్టు బయలు వెడలవు. అట్లగుటచే నిప్పుడు పనిబోగొట్టుకొని పరితాపపడువానికి ఇవియెట్లు శైత్యోపచారములవును? నేడు కూడులేదని వాపోవు బీదలకు ఇంకాఱునెలలకు దివ్యమైన యుద్యోగము తనంతటవచ్చి మీ పాదములం బట్టుకొనునన్న నేమితృప్తి? కాలాంతరము సన్నియత మగునంతలో తమకే యాపనికుదురునని ఏమినిశ్చయము? ట్రాంబండ్లు, జట్కాబండ్లును పరస్పర వైరముననున్న సమయంబున కొందఱికి గీడుమూడకపోదనుట అనివార్య సిద్ధాంతంబని యంటిమి. అయ్యది నిశ్చంచలము.

3. మూలధనము శ్రమకునాలవానము. మూలధనం బభివృద్ధియైన అనగా నుద్యోగముల నెక్కువగ బ్రయోగింపబడిన పనులును ఎక్కువలౌను. పనులెక్కువయైన పనివాండ్రకుమేలు. దీని యాథార్థ్యము నంగీకరించితిరేని యంత్రములు కర్మకరుల కుద్యోగదాయకము లనుట నిరూపింపవచ్చును. అదెట్లన; యంత్రోత్పాదితముల వెల తగ్గును. దానివలన బీదలుగాకున్నను ధనికులైననను ఈప్సితవస్తుసంపాద నంబున మునుపటికన్న తక్కువవ్రయము జేయుదురు. తక్కువ వ్రయముచే నెక్కువగ మిగులబెట్టగలరు. ఇట్లు మిగిలిన విత్తంబులు మూలధనంబులుగ నూతనోత్పత్తికై యుద్యమములం దొడంగుదురు. అందుచే వృత్తులు వర్ధిల్లు తొల్లి యంత్రకలాపోదయమ్మువలన స్థానభ్రష్టులైన కర్మకరులకు మఱల జీవనోపాయముల సమకూర్చును. యంత్రములు శ్రమను మిగుల్చుటయేకాక మూలధనమునుమిగిల్చి మూరుకొనజేయు గావునను, ఈ మిగిలింపబడిన రెండును కలసినం గాని వ్యర్థములగుగాన, పరస్పరాకర్షణశక్తియుతము లగుటంజేసియు చిట్టచివరకు దప్పక సంగమించి నిరవధిక ధనరాసులకు జన్మభూములై భాగ్యవంతులకును నిర్భాగ్యులకును సమానముగ సౌఖ్యము లొడగూర్చును. కావున యంత్రములును హస్తములును ఇతరేతర ద్రోహులు గావు. అన్యోన్యసహాయకారులే.

పై వాదమునకు ఆక్షేపణలు:-

చిట్టచివరకుగలిసి సుఖించుట యట్లుండనిండు. చిట్టచివర యనగా కాలాంతరమున ననుట. ఈ కాలము స్వల్పమో దీర్ఘమో ఎవరెఱుంగుదురు? క్రొత్తవృత్తుల నతిశీఘ్రముగ నలవరించుట యసంభవము. ఈ మధ్యములో కడుపాత్రము నెట్లు భరింపనేర్తుము?

మఱియు గూలివారమైన మేము బిడ్డపాపలుగల సంసారులము గావున తావుమార్చుట బహుదుర్లభము. తావుమార్చుటయే దుర్లభమనగా నిక దేశదేశముల ద్రిమ్మరుటయన కలనైన నసంభావ్యము. మూలధనమో మాయట్లు స్థావరముగాదు. ఱెక్కలుగల పక్షవంటిది. ఇంగ్లాండులో మిగులబెట్టబడిన వసువులు ఇండియారైల్వేలలోను చీనాదేశపు రైల్వేలలోను, దక్షిణ అమెరికాయందలి గోధుమపంటల యందును విక్షిప్తములైయుండుట సర్వజన విదితమేగదా! కావున విశేషించిన విత్తములచే మాదేశములోని వృత్తులు వీర్యవంతము లౌననుట యేమినిజము? చంచలమైన పరిపణముతో ప్రపంచాటనము జేయ మేము హనుమంతులముగాము నారదులముగాము! ఒకవేళ చీనా, ఇండియా, అమెరికాలోని ప్రజలకు బత్యము సత్యమైనను ఇంగ్లాండులో యంత్రములచే గతజీవనులై వగలనొగులు మాకు నందుచే నాకలి యంత మొందునా? కావున యంత్రములు సర్వశ్రేయ:ప్రదములనుట పుంజిగలవా రనవలసినమాటగాని కర్మకరులు వచింపదగిన వాక్కుగాదు. సాహుకారులకు సుఖమే. మాకు దత్కాలమునందైన దు:ఖమే! ఉత్తరకాలమున సుఖమున్నను కాచివేచి యుండుటకు సొత్తులేనివారమగుట మాకు సాధ్యముగాదు. "దీని గడచి దీర్ఘాయుష్మంతుల మైనగదా పెన్నదాటి పెరుమాళ్ళసేవ జేయుట?"

ఈ చర్చచే స్ఫుటములగు విషయములు

1. పుంజిగలవారు కర్మకరులును గొన్నివిధముల మిత్రులును గొన్నివిధముల శత్రువులును గానున్నారు. దీనివివరము.

శ్రమ సహాయకాదిగానిది మూలధనము నిష్ప్రయోజనము. ఒకసంచిలో సవరనులు భద్రముగా దాచియుంచిన నవి కోళ్ళరీతిని తమంతట గ్రుడ్లుబెట్టి పిల్ల నాణెముల మనకియ్యవు. మూలధనము వృద్ధికి వచ్చుననగా పాటునకు దోడుపాటైన ననియర్థము. సముత్థానపరులు వ్యవహారముల విక్షేపించినంగాని పుంజిగండనకురాదు. శ్రమయు బరిపణములేనిచో కుడిభుజము లేనిదట్లగును.

ఇక శత్రుత్వ మెట్లనిన:- కూడినవఱలో చేతిపనికి బదులు యంత్రపుబనిని ప్రవేశ పెట్టవలయునని పుంజిగలవారి యుద్దేశము. ఏలనగా, యంత్రములు "ఆలస్యముగావచ్చుట, ఆటవిడుపుగోరుట, పెద్దలకు దర్పణము విడుచుటకై రజాకావలయుననుట. చెప్పి రాకపోవుట, వచ్చి చెప్పకపోవుట, ఎక్కువ సంబళము గావలయుననుట, గొణుగుట, కార్యవేళల గన్నులు మూతవేయుట ఇత్యాది చేష్టలు లేనివియును అధిక ఫలప్రదములు నుగానున్నవి. దీనిచే నెల్లప్పుడు గాకున్నను గొన్ని సందర్భములయందు పనివాండ్రకు నష్టమువచ్చు ననుట మందలించితిమి. కావున తాత్కాలికమైన శత్రుత్వము గలుగుటయుం గలదు.

మనదేశములో యంత్రపు వస్త్రములు ప్రసరించుటంజేసి సాలెవారి కాదాయము క్షీణతకు వచ్చుటయు నీశత్రుత్వమునకు నొక తార్కణము. అయినను యంత్రములు మితిమీఱిప్రబలిన దేశములం గాని యీహాని రాష్ట్రమునకు బాధాకరముగాదు. అట్టిదేశములసైతము సరాసరికి దీర్ఘకాల ఫలముల గణించిచూచిన శుభమేకాని యశుభమని ఖండితముగా జెప్పుటకు వీలులేదు. కావున నేదియెట్లున్నను హిందూదేశములో యంత్రములు పొంగి పొరలి మనలనెల్ల గొట్టుకొనిపోయి సముద్రములో జేర్చునను భయము ఇక గొన్నిశతాబ్దములవఱకును మనము పడవలసినదిలేదు. అప్పుడైన భయముపడవలసిన ప్రమేయముండునా యని శంకించెదను.

యంత్రీయముల వెల న్యూనతవహించు జాడగలవియనియంటిమి. ఈవిషయమై కొంద ఱిట్లు సందేహింపవచ్చును. యంత్రములలో వేయబడు అపక్వవస్తువులు (బొగ్గు, దూది, ఇనుము ఇత్యాదులు) హీనవృద్ధికి జేరినవి. ఇవియు విస్తరించినంగాని యంత్రోత్పత్తి విస్తరించుట యసంభావ్యము. వస్త్రము లాధిక్యముజెందుట ప్రత్తి ఎక్కువ పండినంగాని కాదు. ప్రత్తి ఎక్కువగ బండించవలయునన్న భూములకు సారమెక్కువగ వేయవలయు. లేదా అల్పసారమైన భూములలో ప్రత్తినాటవలయు. ఎట్లుచేసినను కృషికులకు సెలవు హెచ్చుటంజేసి ఎక్కువ క్రయములేనిది వారికి గిట్టిరాదు. కావున ప్రత్తియొక్కధర పెరుగుననుట ప్రతీతము. ప్రత్తివెల పొడుగైన మల్లులు వెల కుఱుచౌట యెట్లు? ఈసంశయము నివారించు వ్యాఖ్య:-

వస్త్రముయొక్క వెలలో ప్రత్తియొక్కవెల బహుస్వల్పభాగము. చూడుడు?

వస్త్రరచనోపకరణములు

1. ప్రత్తి.

2. వడకుట.

3. నేతపని

వస్త్రము తాను పదిరూపాయలు జేయునదియైన అందులకు వలయు పచ్చిప్రత్తివెల ఒకరూపాయయుండిననెక్కువ. ఈదంశాంశం మాత్రమే హీనవృద్ధికి జేరినది. ఈయంశము ప్రియమైనను ఎక్కువ సరకు తయారుచేయుటవలన అధికవృద్ధి గతములైన తక్కినభాగములు నయమైనచో మొత్తముమీది వస్త్రముల వెలలుదిగుననుట సుగమము.

నాలుగురూపాయలుజేయు సాధారణమగు నినుపకమ్మి వస్తువులుగా పక్వముచేయబడి ఈ క్రిందిధరలకు నెగయును.

ఇనుపదారికమ్ములు రూ. 6-0-0

గుఱ్ఱపులాడములు రూ. 11-0-0

ఱంపములు రూ. 60-0-0

మేలైన కత్తెరలు రూ. 1800-0-0

తీక్ష్ణములైన పేనాచివ్వుకత్తులు రూ. 2640-0-0

చూచితిరా! నాలుగురూపాయల వెలయిచ్చి అసంస్కృతమగు నునుమును పక్వమునకు దేనుదేను 2640 రూపాయల యనర్ఘసామగ్రి యైనది! ఈరెండువేల చిల్లరరూపాయలలో క్షీణవృద్ధికి లొంగిన భాగము 4 రూపాయలుమాత్రమే. ఈభాగమువెల పదింతలు విజృంభించినను సరకులు సవిస్తరములౌటచేనైన యంత్రసంస్కారముచేనైన అధికవృద్ధికి వీలు ఎక్కువగ గుదిరెనేని ఱంపములు, కత్తెరలు, పేనా కత్తులు ఇత్యాది సంస్కృత పదార్థములు సరసములౌననుట స్పష్టము.

సంకేతనామములు

లేత, పచ్చి, అసంస్కృత, అరచిత ఇత్యాదులు తయారుచేయబడని వస్తువులయందును, పక్వ, ముదురు, సంస్కృత, రచిత ఇత్యాదులు తయారుచేయబడిన వస్తువులయందును ప్రయుక్తములు.

హెచ్చఱిక:- ఒకేవస్తువు ఒండుకళలో పక్వమనియు వేఱొంట నపక్వమనియు గణింపబడినను బడవచ్చును. దృష్టాంతము. ప్రత్తి సేద్యగానికి విరచితము. అనగా వాడు దానితో నమ్ముటదప్ప వేఱిమియుజేయడు. గింజలను దూదిని వేఱుపఱిచి బస్తాలుగట్టు ఫ్యాక్టొరీవారికి ప్రత్తి యరచితము ఏలన; వారు దానినింకను బక్వమునకు దెత్తురుగాన వారికి బస్తామూటలు ముదిరినవి.

ఈ మూటలగొని నూలువడకువారికా దూది పచ్చిది. నూలు పాకము

నేతగాండ్రకు నూలు లేత. బట్టలు తరుణములు.

ఉడుపులు జేయువారికి బట్టలు పచ్చి. చొక్కాయీలు మొదలగునవి ముదిరినవి.

ఇట్లే ఇనుము, కొయ్య ఇత్యాదులయందును గ్రహించునది:

కళలలో దయారుచేయ దేబడునవి యపక్వములు. తయారై దింపబడునవి పక్వములు. ముందఱి కళపరముగ జూచిన వస్తువు లసంస్కృతములు; వెనుకటి కళపరముగ జూచిన సంస్కృతములు.

భూమిలోనుండి యుత్పత్తియైనవి వెనుకటి కళలనుండి పుట్టినవి గావుగాన వానిని శుద్ధాసంస్కృతములందురు. నేరుగా వినియోగ్యములైనవి శుద్ధసంస్కృతములు. ఈరెంటికిని మధ్యనుండునవి మిశ్రములు లేక కించిద్రచితములు. అనగా నివి రచితారచితములు. రెంటి యొక్కయు లక్షణములుగలవి.

మనదేశములో పచ్చివస్తువులు దిక్కులుబుకునట్లున్నవి గాని పక్కాసరకు లంతదట్టముగాలేవు. ఇదియెంతయు జింతనీయము. రూప భేదోత్పాదకములైన కళలు విలసిల్లమింజేసి మనవస్తువుల మనమే తయారుచేసికోజాలనివారమై బయటిదేశములకుంబంపి విరచితములం జేయించి దిగుమతి చేయించుకొనుచున్నాము. పంటలతోబాటు రచనలును ఈదేశమున బ్రబలించిన భరతఖండమునకు నీడుదోడైన రాజ్యము లెవ్వియునుండవు. ఈదేశోత్పత్తిలోని విశేషము లేమనిన:- అరచితములు మెండు. విరచితములు గుండు.

ఈ విషయ మికముందు సాంతముగ జర్చింపబడును గాన నింతటితో నీ ప్రకరణము పూర్ణింతము.