భారత అర్థశాస్త్రము/మొదటి భాగము - పదునాఱవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదునాఱవ ప్రకరణము

కర్మకరుల శక్తియుక్తులు

శ్రమను అతిశయిత సామర్థ్యముంజేయు విధానములు ద్వివిధమ్ములై ప్రవర్తిల్లు.

1. కర్మకరుల దేహమనోదార్ఢ్యంబులు ఆఢ్యంబులై యుండునట్లొనర్చుట.

2. వృత్తులను తగువిధంబులదీర్చి నిర్మించుట.

ఇందు మొదటిదాని ననుసంధించు సమయంబు లెవ్వియనిన:-

పారంపర్యప్రాప్తమగు శరీరబలము

లోకములోని జనులందఱును తుల్యబలులుగారు. నేలలయందుం బలె నరులలోను సారవిషయకములగు నంతరములున్నవి. ఇవి నిర్హేతుక జాయమానములుగాక శీతోష్ణస్థితి, సంఘచర్యలు, చిరకాల పరిచిత కర్మలు, వైవాహికాచారములు ఇత్యాదుల ననుకరించి యుండును. "పుట్టుకతోనే చెడిపోయినారము; ఇక నేమిచేసినను పరిష్కృతుల మగుట దుర్లభము" అని నిరాశులై యుండుట తెలివిమాలినతనము. "పురాకృత కర్మమువలన నాకు నీగుణములు పట్టువడినవి; పుట్టుకతో వచ్చినది పుడకలతోగాని పోదు" అని సాహసరహితులై యుండుట పామరలక్షణము. జననసిద్ధములగు లోపములను పాపములకు పౌరుషమే ప్రాయశ్చిత్తము.

జపానీయుల విజృంభణము

జపానుదేశీయు లేబదియేడులకు బూర్వము మనవలెనే పాశ్చాత్యులన్న భయకంపితులుగ నుండెడివారు. వారిదేశములో మనంబలె జాత్యుపజాతులు వర్ణధర్మంబులనబడు నానావర్ణాధర్మం బులును పెచ్చుపెఱిగి ఏకదేశీయభావమునకుం బ్రత్యూహములై జనులను శక్తిహీనులంజేసి యలయించినవి. వాణిజ్యార్థము వచ్చిన ఐరోపావారినిజూచి యశుద్ధులని తెగడి దూరంబుగ వెళ్ళుటయు వారి యాచారములలో నొకటిగానుండెను.

ఆసమయమున అమెరికాదేశస్తులు తమవారికైన తిరస్కారమునకు బ్రతీకారము జేయబూని, జపానువారిని శిక్షింప యుద్ధపు నావలం బంపిరి. అవి రేవునవిడిసి ఫిరంగుల బేల్చగనె జపానీయులు తమకిక నోటమి తప్పదని యెఱింగినవారై నయము మెఱయ సమాధానము జేసికొని "ఇక ముందైన మానభంగము రాకుండవలయునన్న దేశమును వృద్ధిపఱుచుటయే యుపాయంబుగాని వేఱొండులేదు; శాంతప్రవర్తనలచే శత్రువులు శాంతింపరు" అని చక్కగా నెఱింగినవారై యానాటగోలె నోటిమాటల బ్రసంగించుట లేకున్నను, అభ్యుదయక్రియల ననుష్ఠానములోనికి దెచ్చుటకు రోమరోమంబుల నుండిపుట్టి ప్రజ్వరిల్లు పౌరుషంబుతో ప్రారంభించిరి. ముప్పదియైదు సంవత్సరములలో సంఘసంస్కారముం బూర్తిగావించి, క్షత్రియ బ్రాహ్మాణాదులకును తక్కుంగలవారికిని బొత్తుగల్పించి, జాతిభేదములు మూఢజనాదరణీయములని నిరసించి, ప్రాచీనవేదములు ప్రకృత కాలమునకుజాలవని నవీన కళావిషయక శాస్త్రములనేర్పు పాఠశాలలం బ్రతిష్ఠించి, యావిద్యలం బ్రసరింపజేసి, ఐకమత్యము గలవారౌట నవక్రవిక్రమాఢ్యులై, సేవలను యుద్ధంపునావలను ఆధునికరీతి సర్వసన్నాహ సమేతములం గావించి, ముప్పదియైదేడులలోన చీనాదేశపు జక్రవర్తినోడించి విజృంభించిరి. అదిచూచి రష్యా, జర్మనీ, ఫ్రాన్‌స్ దేశములవారు అసూయాగ్రస్తులై జపానువా రాక్రమించు కొనిన భూములను, చీనావారికే ప్రతిదానమిచ్చునట్లు నిర్భంధించిరి. వారినెదిరించినిలుచు శక్తిలేనివారగుట జపానువారు తలలువంచి యప్పటి కంగీకారముసూపి పగదీర్ప నదను వేచియుండిరి. ఈకలికాలములో రణక్రీడ కృతయుగాదులయందుంబలె సెలవు లేక చేయబడు వినోదముగాదు. భారతాది యుద్ధములలో వీరుల కెప్పుడోగాని ఆకలిదప్పులు గలుగుట వినబడదు. అప్పటివారు కృశోదరులు; ఈనాటివారు వృశోదరులు. ఆకాలమున భీమసేనుడొకడు మాత్రమెట్లో ఈకాలమువారి జాతికిజేరినవాడు! మనకు మంత్రతంత్రములు ఇంద్రజాలములును సుముఖములుగావు. యుద్ధభూమిలో నుండియేతీరవలయు; దెబ్బలే తినవలయు! ప్రాచీనులదెబ్బ వేరు. వా రస్త్రబలముగలవారు. ఒకడు తన యింటిపెఱటిలోనే మఱ్ఱి యూడతో బండ్లుదోముకొనుచు గ్రహచార వశమున నావేళకు శాత్రవుడెవడైన జ్ఞప్తికివచ్చెనన్న కోపోద్దీపితుడై, ఆ యూడ కటుక్కని విఱుగునట్లు పండ్లు పెటపెటగొఱికి బ్రహ్మాస్త్రముం బ్రయోగించిన ఆయస్త్రము సూర్యకోటి సదృక్షప్రకాశ దుర్నిరీక్షమై ప్రళయకాల జాజ్వల్యమాన కీలికీలాకలాపంబు నిరసించు ప్రక్రియ రేగి, త్రోవనెదురుపడినవారి మీసములనైన గమలజేయక నేరుగ ఆశ్రాతవునేకదిసి, వాడొకవేళ నప్పుడు నిదురించుచుండిన, సంహరించుట ధర్మవిరుద్ధంబు గావున, వాడు లేచి సన్నద్ధుండగువఱకు వాకిటగాచియుండి నోటీసిచ్చి పిమ్మట వానిపై బడుటయో లేక వాడికింకనుం బ్రచండుడై పాశుపతాస్త్రంబుం దీటుకొల్పిన తోక ముడిచికొని యింటికి మఱలివచ్చి యజమానునకు సర్వముం దన పౌరుషంబు నివేదించి తూణీరగతంబై తూగుటయో యొక్కటి యాచరించి విరమించుట గతయుగ గౌరవంబు! ఆబేడలు ఈ కలియుగపు నీటిలో నుడుకవు.

ప్రధమగణ్య బలంబులగు రాష్ట్రంబులు దాకెనేని కురుపాండవ సంగరంబట్లు 18 దివసంబులంగాక 18 నెలలను సమాప్తినొందుట సందేహంబు. వత్సరమునకు సుమారు అధమపక్షము 100 కోటుల రూపాయలైనలేకున్న సైన్యం నాయితపాటుతోనుంచుట దుర్లభము. కావున ప్రపంచమునంగల ఆంగ్లేయాదిరాజ్యంబులతో ననుకరింప గోరిన నాహవములకువలయు ధనబాహుళ్యముండుట యావశ్యకము. అట్టిధనములు ఆధునిక విధంబుల వివిధంబులగు కళల నభివృద్ధి చేసినం గాని పడయబడవు. సంప్రదాయమే సర్వశ్రేష్ఠం బనువారికి నధమత్వ విమోచనంబుకానిపని. అట్లగుటచే జపానీయులు నవనాగరికతయే ప్రాణమానసమాశ్రయంబని ధృఢముగనమ్మి తదుచితరీతి దేశాచారములలో మార్పులంజేసి యంత్రకళలస్థాపించియు, జనులశక్తి కనుగుణములగు వృత్తులం బ్రవేశింపంజేసియు, సంప్రాప్తార్థ పౌష్కల్యులై, రష్యావారి వికలతనొందింప సందు జూచుచుండుతఱికి, ఇంగ్లీషువారు తమకును రష్యావారికిని ద్వేష హేతువులుంటబట్టియు, సముద్ర యుద్ధమున గుశలులైన జపానువారు తమకుగాని వారితోగలిసిన తమకు మంచిది కాదగుటంబట్టియు, వర్ణమతాచార వేషభాషా విరుద్ధులయ్యు జపానువారితో బద్ధసఖ్యులైరి. అపుడు రష్యావారు అరులయంతరువును సంపూర్ణముగ గనుగొన్నవారు కానందున జపానువారు మునుపటి యట్లు తమకు వెనుబడినవారను గర్వంబుతో జిన్నజేయ వారిక వేడిజూపనిది మర్యాదదక్కదని యుక్కుమిగిలి రెండేండ్లయుద్ధములో శత్రువుల భంజించి కృతార్థతయు లోకమాన్యతయుబడసి తమ యాహవదోహలులనుకీర్తిని నలుదెసల నింపిరి. ఇది మనవలెనే తూర్పువారును మతాచారములలో నించుమించు సరిపోలినవారును జూపిన పరాక్రమము. కావున జాత్యాదులకన్న పౌరుష ప్రభావం బెక్కుడు.

జాతిగుణంబులు

మునుపు జీవశాస్త్ర పారంగతులగు కొందఱు జన్మగుణంబుల మార్చుట యసాధ్యమని యభిప్రాయ పడివుండిరి. ఆధునికులు వారితో నేకీభవింపరు. మఱేమన్న పుట్టుకకన్న పెంపకమే ప్రధానమని యేక వాక్యముగా బలికెదరు. బ్రాహ్మణ పుత్రునైనను చిన్ననాడే శూద్రునియింటవదలిన వానికి శూద్రబుద్ధియే అబ్బునుగాని బ్రాహ్మణ్య మలవడదు. శూద్రునైన బ్రాహ్మణ గృహంబునంబెంచి పెద్దవానింజేసిన వాడు శుద్ధోచ్చారణతో సంధ్యావందనముం జేయగలడు. మనదేశము నేలిన రాజులలో తక్కువలెక్కకు ముక్కాలుమంది జాతిచే శూద్రులయ్యు క్షత్రియపదవి నధిష్ఠించినవారై యజ్ఞోపవీత ధారణాది క్రియలచే ద్విజులుగ గణింపబడి ద్విజకుల కారకులైయుండుట సుప్రసిద్ధము. చెన్నపురి రాజధానిలో బ్రాహ్మణులనబడువారు ఆదిని అనార్యులైన ద్రావిడులనియు ఈనాడును బ్రాహ్మణత్వ సిద్ధినొందినవారనియు వారిముఖశిర:పరీక్షణమున మనుష్య శాస్త్రవేత్తలు స్థాపించి యున్నవారు. కావున జన్మమునకన్న కర్మమే యుత్తమ బలవంతమనుట విశదము.

కర్మతత్త్వ విచారణ

కర్మమనుపదము తెలిసియో తెలియకయో ప్రయోగించితిమి. అపద మందఱును వాడునదిగాన దానియర్థము నిట విమర్శించి సోష్టీకరించుట వదలగూడని కార్యము. మఱియు నది యీ చర్చతో సంబంధించిన విషయమే.

మనవారు "పూర్వోపాత్త కర్మహతిచే నీదుస్థితికి వచ్చితిమి" అని వాడుకగా బలికెదరు. ఎవరికర్మము చేత నెవరు క్రిందబడిరనుట వివరముగ విచారింతము.

సాధారణమైన యర్థమేమనగా:- "నేను మున్ను పాపము జేసితిని. దానిఫలమే యిపుడు బీదనై వందురుట." సరే. అయిన నొక్కటి. ఈజన్మము పూర్వజన్మముచే నిర్ధారితము. అయ్యది తత్పూర్వజన్మస్థాపితము. ఇట్లే నిర్ణాయకముల నిరూపించుచు వెనుకకు బోవంబోవ నాదిజన్మ మెద్దానిచేతను నిర్ణయింపబడనిదగును. ఏలయన దానికి నాద్యజన్మ మెద్దానిచేతను నిర్ణయింపబడని దగును. ఏలయన దానికి నాద్యమెయ్యదియునుండదు. కావున కర్మముచే బీడింపబడని జన్మమొకటి యుండుననుట నిర్వివాదాంశము. ఆ యాదిజన్మమునందైన మనము స్వతంత్రులమైయుండుట యొప్పుకోవలసిన పలుకుగదా! ఇది యొప్పుకొన్న దాముజేసిన సిద్ధాంతములకెల్ల భంగము వాటిల్లునని కాబోలు వేదాంతవాదులు కర్మమనాదియని వాక్రుచ్చిరి. అనగా కర్మము పుట్టినకాలము నిరూపించ సాధ్యముగాదనుట. నిష్కృష్టార్థ మేమన జగత్సృష్టిమొదలు కర్మము జనులవెంట బిశాచమువలె నంటుకొనియుండునని! ఇది యెంత సమంజసముగనున్నదో చూడుడు! కర్మము స్వతంత్రమా లేక ఆచరణజనితమా? ఎవడైన నొకడాచరింపనిది కర్మము తనంతట బుట్టునా? ఒకవేళ సృష్ట్యాదినుండియే కర్మ మనువర్తించుచున్నదని యొప్పుకొందము. అప్పుడుగూడ నరుడు స్వాతంత్ర్యము వహించియే కర్మము నాచరించి యుండవలయుగదా! కావున నామూలాగ్రముగ తత్వపరిశోధనముజేసిన సర్వమును స్వతంత్రవర్తనచే నిర్ణీతముగాని పారతంత్ర్య ప్రసిద్ధముగాదనుట నిక్కువమగు.

స్వతంత్రత యుండెననుకొందుము. అయ్యది యొకజన్మమున జేసిన కృత్యములచేబద్ధమై కాలాంతరము పర్యంతమును కదలక మెదలక యుండుననుట సమ్మతింపదగినమాటకాదు. ఆస్వాతంత్ర్యమే మఱల మఱల సవరించుకొని యుత్తమస్థితికి రానేల యుద్యమింప గూడదు? కాలుజారి క్రిందబడినవాడు "ఇది నాకర్మము. మఱల లేవగూడదు" అని యట్లే పడియుండగలడా?

మఱియు నాగుణములు చరితములన్నియు గర్మాధీనములండ్రు. అట్లేని స్వేచ్ఛావర్తన మున్నదనుటయు నది కర్మబద్ధంబుగాదనుటయు గర్మాధీనములేయగును. ఇది స్వరూపా సిద్ధముగదా?

మఱియొకటి. స్వతంత్రతయే లేనిపక్షమున "ఇది తగును, అది తగదు; ఇటుజేయుము, అటుజేయుము" అని ధర్మశాస్త్రములను విధించుట పొసగనిమాట. స్వతంత్రతలేని స్థావరమగు వృక్ష










`అ మునుజూచి "ఓ చెట్టా! నీవు మనుధర్మ శాస్త్రప్రకారము నడచుకో. నవనాగరికులమాట పెడచెవిని బెట్టుము" అని యెవడైన మందలించునా? సంస్కరణశక్తి మనకుంటంగాదె అవ్వలు , అయ్యలును అన్నిధర్మముల నుపదేశించుట మనమువిని యట్లాచరింపం దొడంగుట?

కర్మముయొక్క తత్త్వంబేమన:- చేష్టలతో స్వభావము మాఱుననిగాని నిరోధింపంబడునదికాదు. దృష్టాంతము. దేహపరిశ్రమం జేయువారు వ్యాయామములందు సక్తచిత్తులై యుందురు. సోమరి పోతులయినవారికి క్రీడార్థము పరువులు వాఱుదమన్న గాళ్ళురావు. మనసు నామోదింపదు. అయినను పట్టుబట్టి కొన్నినాళ్ళు నొప్పికోర్చి శ్రమించిన నట్టిపాటులు భరములుగ దోపవు. మఱియు మున్ముందుగ నుత్సాహము సుఖము నిచ్చును. అటుపిమ్మట ఏనాడైన లీలావిహారములం జేయకున్ననాడు శరీరమానసంబు లుత్సాహహీనంబులై వాడుబాఱును. కావున గర్మలచే స్వభావమును స్వభావముచే గర్మలును యుక్తపథంబుల నడుపవచ్చుననుట తథ్యము. పౌరుషంబు సహజ గుణంబులలోనెల్ల నాయకత్వంబుదాల్చిన ధర్మంబు. కర్మములు వాడుకయట్లేగాని యంతకన్న మిన్నలుగావు. వానిందలంచి భీతిం గలంగుట తననీడజూచి తాభయముగొన్నట్లు.

మనకార్యములు మనలనేగాక సంఘముంగూడ జెందుననుట న్యాయము

కర్మమెట్లున్ననేమి? అది యెవరి నావేశించుననుట యింకను ముఖ్యమైన యంశము. పామరజనమత మేమనగా:- "నే జేసిన కర్మము నన్నేపట్టును. దానిచేత నాకు నింకొకజన్మమున గొప్ప పదవియో చిల్లరయుద్యోగమో ప్రాప్తించును.

       క. "ఈ యొడలువిడిచి వేఱొక
           కాయముగైకొని శరీరి కర్మవాసగతిం
           బోయి సుఖదు:ఖముల గను
           నాయక వెండియును దేహబంధము బొందున్."

     చ. "స్థిరమగు పుణ్యకర్మమున దేవభవంబగు బుణ్యపాప సం
         కరమున మానుషత్వమగు గల్మషముల్ వశుకీటభావముం
         బొరయగజేయు................................" - భారతము

ఇట్టితత్త్వములు సంఘీభావదృష్టి లేశమైననులేక స్వప్రయోజనమే పరమార్థంబుగానెంచు కాపురుషుల యందుంగాక యింకెయ్యెడను నావిద్భవింపదనుట సులభముగ నిరూపింపబడియె. చూడుడు!

తనకర్మము తన్నే చెందుట నిజమైన వర్ణ ధర్మంబుల కనుగుణమగు వెఱపునంజనుట యుక్తంబనుట యేలకలిగె? వర్ణధర్మము లనగా వర్ణోద్ధారకధర్మములు. ఈ నడవడిచే నేరికి మేలు ఉద్దిష్టమయ్యె? తనకా? వర్ణమునకా? తనకనుట పొసంగుటెట్లు? శూద్రులు ద్విజ సేవలో మునింగియుండవలసిన వారట? ఈలోకమే నరకమౌనట్లు పరితపించుట మాలమాదిగలయొక్క ధర్మమట! అల్పసంఖ్యగల బ్రాహ్మణ క్షత్రియులుదక్క పెఱవారెవ్వరును ఈ ప్రపంచమున ముందునకు రాగూడదు! రాబ్రయత్నించుట మహాపాతకము!! రౌరవాది నరకావహము!!! అట్లగుట నీధర్మంబులు శూద్రాదుల కురిత్రాడులయ్యె. కావున జనసామాన్యమునకివి యుపకరించుననుట కల్ల. కొన్నివర్ణములవారి లాభార్థము స్పష్టములనుట యధార్థము.

కావున గర్మము తన్నుమాత్రము జెందుననుట యార్యులే నమ్మలేదని మాయభిప్రాయము. దాని ఫలములు సంఘముం బొందుననుట తెలిసికొనినవారయ్యు నగ్రజాతివారు తదితరులం దమ యధీన మందుంచికొనుటకై యీ మాయామయమగు తత్త్వముం బన్నిరి. ఎట్లనిన హీనకులస్థులకు స్మృతి విహితాచారములవలన హింసయేగాని సుఖములేదు. వారలారీతి బోడిమిసెడి సర్వదా యుండ వలయునన్న నింకేదైన నొక యాసజూపనిది సాధ్యముగాదు. ఈమిధ్యాలాభము స్థాపించుటకై కాబోలు "శరీరి కర్మవశగతిం" బోవుననిరి. ఈ కుటిలముయొక్క యంతరంగభావమేమనగా "ఓ నిర్భాగ్యులారా! మాకై ప్రయాసపడి చావుడు. ప్రత్యక్షముగనున్న ధనమును సుఖ మును మేముచూఱగొనెదము. మీకేమియు లేకపోయెనేయని మీరు చింతింపనేల! మీసత్కర్మము ఉత్తవోదు. ఇంకొకజన్మమున మీకు వడ్డీతో గట్టివచ్చును. కావున ద్వరపడకుడు! మీచేతిలోనుండు రొక్కము నిట్లు మాచేతిలో దిలోదకముతో వేయుడు. మీకు దేవలోకముపై బత్రము వ్రాసియిచ్చెదము" అనుట! వంచింపబడిన వారును నీచులౌటచేతనే ఈ మాయదారి సిద్ధాంతములకుం బ్రకృష్టత గలిగె. ఎట్లు నీచులందురో "సంఘ మేగతికిం బోయిన బోవనీ. మాజీవాత్ములు ఉచ్చస్థితి కెక్కినం జాలు" నను దురాశోపహతులౌట కతన. కావున గర్మము ఆత్మమాత్రప్రయోజకముగాని లోకముంజెందినది కాదుఅనుట లోభమను పుట్టనుండి వెల్వడిన విషపుబురుగు.

ప్రవర్తనల ఫలములు తన్నుజెందునో చెందవోగాని తప్పక సంఘమునకు మేలో కీడో చేయుననుటకు ప్రమాణములు:

అట్లుగానిచో ధర్మము లేల విధింపబడవలె? ధర్మముయొక్క ముఖ్యసంకల్పము సంఘముయొక్కయో, జాతియొక్కయో, ఉపజాతియొక్కయో, ఏదైన నొక సముదాయముయొక్క శ్రేయస్సో, లేక శ్రేయస్సని యెన్నబడినదియోకాని వేఱుగాదు. తనకుమాత్రము సంబంధించు కార్యముల ధర్మములను విధించుట మౌఢ్యము. అట్లైన దొంగయు దొంగతనమును ధర్మమని వాదింపవలసివచ్చును, తుమ్ముట, కనుఱెప్పలల్లార్చుట, ఒడలుగీరికొనుట యిట్టివి ఇతరులకు జుగుప్స బుట్టింపని మార్గమున జేసికొన్న నెవరేమియు ననబోరు. స్వానుగత చర్యల యుక్తాయుక్తవిచారణ పాడిదప్పినపని. ధర్మాధర్మములు న్యాయాన్యాయములును సంఘానుగతచర్యలయంద బ్రవర్తిల్లు.

అట్లెన నాత్మహత్య యేలకూడదందురు? ఈ ప్రశ్నకు సదుత్తరము. ఆత్మహత్యయ నిషేధ్యమయిన నానాటికిం బ్రజాసంఖ్యకు క్షీణతవాటిల్లు. సంఘము బలహీనమౌను. శత్రులతో బోరుటకు మునుపటివలె సమర్థముగా జాలదు. కావున ప్రతిమనుజునియొక్కయు దేహమనోదార్ఢ్యంబులు సంఘమునకును సంబంధించినవి. వానియందు సంఘమునకుగల యాజమాన్యము మనుజునకులేదు.

ఒకవేళ సంఘముం జెందదని యనుకొందము. ఇండియాలో పాపకర్ము లనేకులుగలరు. మన జనసంఖ్య దాదాపు30 కోట్లు. అందెంతలేదన్నను 25 కోట్లు నికృష్టజీవులు. వీరందఱును గృతకృత్యులు గారుకాబోలు! మఱియు నిక్కలికాలములో మన శాస్త్రకారులు చక్కగ నిర్ణయించునట్లు ఇంచుమించుగ నెల్లరును నీతి బాహ్యులు, ఆచారవిదూరులునుగా నుండవలయును. లేకున్న నాశాస్త్రకారులకు ననృతదోషమువచ్చును. మనమేమైన నేమిగాని యేనాడో చచ్చి సున్నమైన ఋషులకు ననృతదోషము రాగూడదు! అట్లయిన మనమానము పోవును!

ఈయెగతాళి యటుండనిండు. మనదేశము నానాటికి క్షీణించుటయు ఐరోపాదేశము దినదిన ప్రవర్థమానమై తేజరిల్లుటయుంజూడ ఆత్మలు ఒకేదేశమున పున: పున: పుట్టవలయునను నిర్హేతుక కర్మము గలవనియైనననుసరే: లేదా, మనుజుల సుకృత దుష్కృతములు సంఘముం జెందునని యైననుసరే నిర్ణయించుటతప్ప వేఱుత్రోవ గానరాదు. బుద్ధిమంతు డెవ్వడును రెండవ తీర్మానమే సత్యమని యొప్పుకొనకపోడు.

నాకర్మములు ఇతరులం బట్టునుగాన నేనేలచెడ్డజేయగూడదు? చేసినచో నాకేమినష్టి? చేయనిచో నేమితుష్టి? యని వాపోవునంతటి మూఢులెవ్వరు నుండరని తోచెడిని. ఒకవేళ నుండిరిపో: వారి గర్హించు విధములేవన:-

1. తనచేసినకర్మ తన్ను బాధింపదని మేము చెప్పలేదు. ఇతరులను బాధించునంటిమి అంతటనే తనకు దప్పునని యర్థముచేయుట వెడగుదనము. తన్నును తనవారిని నాక్రమించుగాన పూర్వులు తలచినంతకన్న నెక్కువ ప్రభావముగలదిగా చూపింపబడినది గావున సత్కర్మాచరణమున కింకను బ్రబలహేతువు చూపింప బడియె. 2. ఇతరులనియంటిరే ఇతరులెవ్వరు? నీసంతతికి సంఘమునకుం జేరినవారిని పెరవారని యనునంత ఱోతబుద్ధి యెవరికైన నుండునా?

3. నీచులు తమమేలునాసించియ మేలుచేయుదురు. ఇది కూలికైచేయు ధర్మమువంటిది. మహాత్ములత్రోవవేఱు. తమప్రయోజనమునే సమకూర్చునదియైన "ఈ చిల్లర మానిసియైన నాకొఱకు పాటుపడవలయునా" యని ధర్మమునైన సైరింపరు. "నేనొక్కడు తేలిననేమి మునిగిననేమి" యని యుపేక్షజేతురు. తమకార్యముచే నితరుల కెగ్గో లగ్గో యగునేని అప్పుడు తమచే నితరుల కేయుపాధి తటస్థించునో; లేక, ప్రాప్యహితమ్ములు ప్రాప్తింపకపోవునో యని మెలకువతో వర్తింతురు. సమూహ శ్రేయంబునకు గారణమగుటం జేసియే ధర్మాచరణంబు కర్తవ్యంబయ్యె.

4. ఆత్మపక్షమగు తత్తరపాటేగాని ప్రజాచింతలేనివారమగుటం గాదె మనదేశమునకును మనకును భంగము దెచ్చుకొంటిమి.

5. స్వప్రయోజనపరత పాతకంబగుటయకాదు. కుంఠితమనియు వ్యర్థమనియు పూర్వమే బోధించితిమి.

ధర్మమునకు నాశ్రయము సంఘము

ధర్మము సమూహపరంబు. సమూహములు వివిధంబులును విరుద్ధములునుగాన ధర్మంబులు నట్లే భిన్నంబులై పఱగు. దృష్టాంతం: సమూహములకు కుటుంబము, కులము, జాతి, వర్ణము, సంఘము లేక దేశము. నిదర్శనములు: హనుమయ్య శాస్త్రి యిల్లు; ముఱికినాడు స్మార్తులు; బ్రాహ్మణవర్ణము; హిందూజాతి; భారతసంఘము; భారతీయులలో ప్రకృతము ఆర్యులేకాక అనార్యులగు తురుష్కులు పారసీకులు మొదలగు జాతివారును జేరియున్నారు. సమూహములు స్థానము ననుసరించియు నేర్పడును. ఉదాహరణము; తాలూకా, జిల్లా, దేశము, ఖండము ఇత్యాదులు. ధర్మంబులు వివిధము లనుటకు గృహస్థధర్మము, వర్ణధర్మము, కులధర్మము, దేశధర్మము ఇవి మొదలగునవి.

ఇందులో ననుష్ఠేయములెవ్వి! ఈసందేహమును జపానీయుల చరిత్రయు దానిచే వారు సంపాదించిన యౌన్నత్యమును బొత్తిగ బరిహరించినవి. వారిమతము సర్వజనాదేయము. అదేదన:- కులము, వర్ణము మతము ఇత్యాదులు దేశసంఘముల నాశ్రయించి బ్రదుకునవి గాని ప్రత్యేకముగ బ్రసిద్ధికివచ్చు స్వతంత్రశక్తియుతములుగావు. దేశీయమహావృక్షము తావలముగబెఱుగు బదనికలవంటివి. ఎట్లన దేశము క్షయంబునొందుడు నివియును పేదవడును. తురుష్కుల రాజ్యకాలములో నీదేశములో హిందువుల మతాచారములకును గుడి గోపురములకును గలిగిన క్షోభ జ్ఞప్తికి దేవలసినదిలేదు. కావున మతాదు లెంతమంచివైనను అపౌరుషేయుములైనను, జనులను పౌరుషరహితులం జేసియు నైకమత్యంబు విథారించియు రాష్ట్రము నేలకుందెచ్చిన తుదకు నవియును అడుగంటుననుట విస్పష్టముగాన బెనువాదమిట బనిలేదు. కావున సర్వార్థములకు నాద్యంబైన దేశీయశోభనమే పరమపుణ్యంబు. సంఘధర్మము ఇతరధర్మములకెల్ల శ్రేష్ఠతమము. సంఘాభివృద్ధికి బ్రతికూలములైన యనివర్జ్యంబులు. జపానువారు ఈ తత్త్వముల మనమున జక్కగా బాదుకొలిపి కుల, మత, వర్ణాచారంబులలో సంఘాభివృద్ధి మహాకార్యమునకు విఘాతుకములైన ధర్మముల నిర్మూలించి ఒండొరులతోడి పొత్తును నూత్న కళావిన్యాస కౌశలమును వలయునంత యలవరించుకొని ఆంగ్లేయులతో సరిగ సంధిజేసికొను నంత ప్రాభవము వడసిరి.

అదిచూచి మనవారు కొందఱు, మనకు నొకానొకనాడు ఇట్లే ధ్యానము జేసికొనుచుండినవారివలె సంఘముగానుండు విభవము ఘటిల్లునని వెఱ్ఱియాసనొకటి నిల్పుకొని, కృత్రిమతృప్తివడసి, సుకృతములజేయని పాపముచాలక పూర్వాచారములనబడు దుష్కృతముల నింకను శ్రద్ధతో జేయుచు గన్నులల్లార్చుచు నోరుదెఱిచికొనియుండుటంజూడ నెంత చిత్రముగనున్నది జపానువారి పదవికి రావలయునన్న వారిపద్ధతులం బూనవలయును, కడకలేక కార్యము లడరవు. ఉంఛవృత్తి, అవిభక్త కుటుంబములుగల దేశములలో కష్టపడకయ ఫలము లందజూచుట యనేకులకు సహజగుణము. సహజగుణమేగాని సాధనకు జాలిన గుణముగాదు. ఆంగ్లేయులవలె బరదేశంబుల దయాదాక్షిణ్యములతో బాలించిన ప్రభువులెవ్వరునులేరు. వారిచే తత్తములైన విద్యలును మనకు ప్రత్యక్షముగ వారియందే ప్రకటితములగు సంఘధర్మములును ఈదేశమున చవిటినేలలోని విత్తనముంబలె నంకురింపక పోవుటజూడ విస్మయ విషాదంబు లుల్లంబుం గలంచెడిని. చెన్నపురి రాజధానివారికన్న బంగాళా, బొంబాయి, పంజాబు మొదలగు సీమలవా రెక్కుడుగ జొరవజూపెదరు. ముఖ్యముగ బంగాళా వారు పౌరుషమే ప్రధానమనుటకు నిదర్శనముం జూపించు వారలు. పదేండ్లక్రింద బంగాళీలన్న "పిఱికిపందలు. కడుపు గదలింపనేరని సోమరిపోతులు; పుస్తకముల గ్రుడ్డిపాఠముజేసి పరీక్షలందు గడదేరుట తప్ప నింకెందునకుం దరముగానివారు!" అని యెల్లరు హేళనము జేయుచుండెడివారు. ఇపుడీరీతివారి నెవరు గర్హింపుదురు? పౌరుష ప్రకటనమే ముమ్మాటికిని సర్వసమ్మానావహంబు.

కావున "జాతిచే దిక్కులేని హీనుడను" అని తలంచి యెవ్వరు నధైర్యపడగూడదు. పుట్టుకకన్నను తలవ్రాతకన్నను శిక్ష(తరిబీతు) అధికశక్తిమంతము. అల్పములైన ప్రయోజనములు, ధర్మములు, గౌరవములు, యోగ్యతలుకలిగి కొన్నిమర్యాదలు జరుగుచుండినను మానవంతులు సమానస్థాన భావములేనిది విరమితయత్నలుగాఠు.

       "తనిసిరే వేల్పులుదధి రత్నములచేత?
        వెఱచిరే ఘోరకాకోల విషముచేత?
        విడిచిరే యత్నమమృతంబు వొడముదనుక?
        నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు." - భర్తృహరి.

జాతిచే సంబంధించిన తక్కువలు సంస్కారమున కధీనములుగావు. సంఘమునకును మనకునుగల సంబంధము చందందెలియనివా రగుటచే హిందువులు నిక్కంపు టహితములను హితములనినమ్మిచెడిరి. దేశసంఘము శరీరము. వృత్తులు అవయవములు. ప్రజలు రుధిరవ సాధులవంటివారు దేహము ప్రధానము. రుధిరాదులు పరిచారికములు. దేహారోగ్యము కార్యము. పెఱవాని బ్రదుకు లుపకరణములు. దేహమునకై యవయవచ్ఛేదము జేతురుగాని యవయవమునకై దేహము నెవ్వరును ఖండింపరు. అంగములు కొన్ని చెడినను మొత్తముమీద గాయము సురక్షితమైయుండుట గలదు. కాని యొడలెల్ల నశించెనేని ముక్కుమోములు గాననగునా? కావున నంగముల ధర్మము శరీర సౌఖ్యము ననుకరించుటయ గుణము. పేరాసచే బొలివోయిన జ్ఞానము గలవారై హిందువు లీన్యాయము నుల్లంగించి వర్ణములు దేశసంఘమున కంగము లట్లుండవలయుననుట విడనాడిరి. అగ్రజాతులవారు స్వప్రయోజనముపొంటె "రాజ్యముయొక్క ముఖ్యోద్దేశము వర్ణధర్మములం బ్రతిపాదించుటయ" యని చాటించి పుణ్యము గట్టుకొనిరి. ఇది యెట్లున్నదనగా తలయొక్క ముఖ్యకర్మము పడిసెమును భద్రముగ గాపాడుకొనుట యనునట్లు వర్ణములు దేశప్రయోజనమునకు లోనైయుండిన రెండును నేటిరీతి బరిహాసపాత్రములై యుండవు.

ఈశరీరాంగసామ్యముచే నింకను ఒక యాక్షేపమునకు బ్రతియియ్యవచ్చును. "మనపూర్వులుచేసిన సుకృత దుష్కృతములు మనలో గానుపించునని యంటిరే. ఎవరో చేసిన దానిచే నేదోషము నెఱుగని మనము వెతలగుడుచుట న్యాయవిరుద్ధముగదా!" అని యడుగువారికి సమాధానములు. దేశసంఘము శరీరము. సఖ కశముల వల ప్రజలు వచ్చుచు బోవుచుండినను అయ్యది శాశ్వతంబైవుండు. కాన కార్యములన్నియు మనమూలకముగ సంఘముచేత జేయబడునవియని యనవచ్చుగాన సంఘకర్మ సంఘమునేజెందుట యాశ్చర్యం గాదు. రెండవది. కాలికి దెబ్బతగిలినను ఇతరావయవములును నవయుమాడ్కి సంఘములో నొకతెగవారి యనుచిత కర్మములవలన నెల్లరకును గీడుమూడుట సహజము. మూడవది. తలిదండ్రులనుండి పడయబడిన దేహమిది. వారిసొత్తులతోగూడ వారి గుణదోషములకును భాగస్థులగుటలో నేమి యవలక్షణమున్నది? మనపూర్వులు గావుననే వారును మనము నేకమని చెప్పవచ్చును. పురుషుడు భార్యయందు బుత్రరూపమున నవతరించుననెడు మనపూర్వపు బెద్దల వాక్యము వినలేదా? కావున తరతరములవారి యైక్యము సంఘము శరీరమనియు ప్రజ లందులోని యవయవములనియు నిరూపించుటకు బ్రశస్తమైన సాక్ష్యము.

కార్యములచే గర్తకుదప్ప నింకెవరికి నేమియు సంభవింపని పక్షమున నెవరెట్లుజేసిన నేమియని యశ్రద్ధగానుండినం దప్పులేదు. కార్యములు మనతో నంతమొందునవిగావు. మఱి యితరులను ఇక ముందురాబోవు తరములవారిని బట్టునవిగాన దేశసంఘమునకు బ్రతికూలములైన యాచారముల బరిత్యజించుటయే పరమధర్మము. ఒక్కసంతతివారికేగాదు. పూర్వులకును సంఘము ఏకమను న్యాయముం బట్టి మనచే హీనతగల్గును. ఎట్లన, మనము ఏవపుగతికివచ్చిన, "పెద్దలలో దోషములేనిది వీరికిట్టి దుస్థితివచ్చునా" యని యందఱు వారిం గూడ నిందింతురు. కావున భూతభవిష్యద్వర్తమానములను అన్యముగాని మూర్తితో స్థిరముగానుండు దేశసంఘమునకు గౌరవా భ్యుదయముల గలిగించుటయే నిజమైన పితృతర్పణము. ఇతరములు నూగుల నీళ్ళ చేటుమాత్రమేగాక పితృఘాతుకములును.

హిందూజాతియొక్క క్షీణతకు గారణములు

ఎవ రెన్నివిధముల వాదించినను హిందూజాతి కొంతవఱకును క్షీణదశకువచ్చినదనుట యొప్పుకోవలసిన విషయమే. దీనికేమి కారణము అనుట చింతనీయము. అందు గొన్నిమాత్ర మిటసూచింతము:1. అతిసమీప సంబంధములు. రక్తసామ్యము ఎక్కువగాగల సంబంధములు శరీరమునకును బుద్ధికిని నుపాధికరములని జీవశాస్త్ర కోవిదులు సిద్ధాంతీకరించియున్నవారు. మఱియు దగ్గఱచుట్టరికమువల్ల ఏకరీతినే మర్యాదలు, చర్యలు, ఆలోచనలుగలవారు కలియుదురుగాన నూతనవిధ పరిచయమును తద్ద్వారాకలుగు వికాసమును మనకు లేకపోయె. చూడుడు! భోజనమునందుగల సూక్ష్మబుద్ధి మనవారి కింకెందును లేదుకాబోలు! జిహ్వకుమాత్రము వివిధరుచులు పాకములును గావలయు. బుద్ధికిని దక్కినవానికిని ఒకేరీతినుండు సామగ్రియే చాలును! అన్నకోశముమీది జ్ఞాపకము దేశముమీద లేదుగదా! ఇంగ్లీషువారన్ననో తమదేశములో నిచ్చవచ్చినచోట్ల బెండిలియాడుటయేగాక వర్ణసాదృశ్య మొకటియున్న నితరదేశములలోను వాలాయముగ బాంఢవ్యమొనరింతురు. (వర్ణమన్న శ్వేతవర్ణము గాని యజ్ఞోపవీత ధారణముగాదు) రక్తమును గుణగణమ్ములును ఇంచుక భిన్నములయ్యును పరస్పర లోపపూరణములై యున్న నావివాహము వివాహముగాని నూతనవిషయముల గ్రహింపను నివేదింపను జాలనివారి పొత్తు పొత్తుగాదు. ఇంచుమించు తమవలెనే యుండువారి సంగతి యప్రయోజనకారి. కావున గ్రొత్తసంబంధములు మొత్తముమీద సంఖ్యనుమాత్రమేగాక తేజోగుణమ్ములను వృద్ధినొందించునవి.

పూర్వికులకు ఇరుగుపొరుగిండ్ల పిల్లలను జూచుకొనుట విధిలేని కృత్యము. యానసౌకర్యము లేమిని, దేశమరాజకమై రక్షణములేని దగుటను దవ్వుల బెండ్లియాడుటయన్న, "నింటికి బిలుచుకొని వచ్చునంతలోన, మధ్యనెవరైన బెండ్లికూతు నెత్తుకపోవుదురో, యటయిన వృథాద్రవ్యనష్టముగదా" యని సంకోచించువారు ప్రాచీనులు. బ్రిటిష్‌వారి ప్రకృతరాజ్యములో నట్టి యిక్కట్టుల కెడము లేకున్నను మనజనులు తెగువలేనివారుగాన ప్రాతరీతులమించ నెంచకున్నారు. కారణములులేకున్నను గార్యములు వదలకుంటయేగదా మనలోని యద్భుతవిశేషము! 2. అతిబాల్య వివాహములు, బిడ్డలుగా నుండునపుడే బిడ్డలగనుమర్యాద ఈకర్మభూమిలోనెకాని మఱెక్కడను లేదు. ఇది ఘోరమనియు వినాశకారియనియు నందఱును ఉపన్యాసము లిచ్చువారేకాని దానిని విడిచినవా రొకరునులేరు. మహమ్మదీయుల దౌర్జన్యమే యీ యాచారమునకు మూలకారణమని యనేకుల యభిప్రాయము. నాకీవ్యాజమునందు నమ్మకముతక్కువ. ఏలన, మనువునుదప్ప నింకెవరిని ప్రమాణముగా నంగీకరింపమని వాదాడుమనము మ్లేచ్ఛులవల్ల గలిగిన యీయాచారమును పాయకుండుట మనమతమునకు భిన్నతనముగాదా! రెండవది మనవారే కామమోహములు కానివందురు. ఆ కామమోహములకు సందులేకుండునట్లు పసికూనలకు బొమ్మలకు బోలె బెండ్లిజేసి వేదవాక్యముల నిలుపజూచిరో! ఏడేండ్ల బాలికా బాలకులకు గామమోహము లంతగానుండవు. కాబట్టి భవద్గీతా వాక్యప్రకారము వీరిపెండ్లి నిష్కామవ్యవహారముగాన సద్వ్రతమని యెంచిరో! ఈకారణముచేతనేమో పండుముదుసలికి లేతపడుచును దెచ్చికట్టుట? ఇదియును అప్పటికి నిష్కామ వ్యవహారమే. ఒకరికి కామము కాలకంఠుని సహాయము లేకున్నను గాలసహాయముచే గాలినది. ఇంకొకరికింకను మొలవనేలేదు. కావున భగవద్గీతలకు దత్కాలమునకు భద్రమే! మనసులేని పెండ్లి మృగకృత్యప్రాయమనుట యీ జనులకేనాటికి స్ఫురించదుగాబోలు! కామములేకయ సంతానఫలము బడయవలయునట! ఇది సాధారణముగ ముసలివారుచేయు నింద్రజాలమేయైనను, వయసువారిట్టి వ్యాసవరప్రసాదము నెన్నడునుగోరరు! "నిర్మోహత్వం నిశ్చలతత్త్వమ్" అన్నట్లు మోహములేక పడయబడిన సంతానమునకు జడత్వం బెప్పుడును దప్పదు. అట్టివారికి "జీవన్ముక్తి" యేగతి. ఈ దేశములో వరుడున్న తాతలు అవ్వలచేత వరింపబడినవాడనియేకాని కన్యకచే వరింపబడినవాడని యర్థముగాదు. స్త్రీపురుషులకు స్వయంవరములేనిది ఈ దేశమునకు దిక్కు గతియు నేనాటికినిలేక నిత్యవైధవ్యము నొందియుండుననుట. నిష్కర్ష స్వయంవరమనగా దామైకోరుకొనుట. అనగా దమకు హితులని తోచువారల నేర్పఱిచి సఖ్యముజేయుట. కావున గాంధర్వ వివాహము నిషేధింపబడని దేశములో మేలైన రకములు గూడుటచే జాతికి వృద్ధియు గుటుంబమునకు బరమోల్లాసంబును ఉండును. ఉల్లాస ముత్సాహమునకు బుట్టినిల్లు. ఉల్లాసహీను లుత్సాహహీనులుగానుండుట యేమి యాశ్చర్యము? సంసారము దు:ఖసాగరమని యిక్కడ బ్రసిద్ధి. ఇక స్వతంత్రతనియ్యక ముక్కుపట్టుకొనియైన నసహ్యమైన పెండిలి చేసికోవలసినదని నిర్బంధపెట్టింప నాసంసారము దు:ఖసాగరముగాక ఆనందవార్థిగానుండునా? సంసారమును బంధన మందురు. బంధనమననేమి? పారతంత్ర్యవర్తనము. కావున నీదేశములో నది బంధనమే. అంతేగాదు. పశువులను ఎనుములను గుమిగా దోలు బందెదొడ్డివంటిదని చెప్పినను నెక్కువగాదు. ఇదంతయుంజూడ సన్యాసమే యిహపరసాధనము అనుటలో నేదో కొంతగుణమున్నట్లు తోపకమానదు. పరమును సాధింపకపోయినంబోయె. ఈదౌర్భాగ్యపు ఇహమునుండి తప్పించుకొనుటయే మోక్షమను పురుషార్థముకాబోలు!

ఈ యనాచారములు ప్రబలియుండగా సంఘసంస్కార పారాయణులు (అనగా సంఘసంస్కారమును గుఱించి యుపన్యాసముదప్ప మఱేమియు జేయనివారు) కన్యాశుల్కము వరశుల్కము బుచ్చుకొనుట గూడదని యేకవాక్యముగా ననేకకంఠములతో గుయ్యిడెదరు. నాకుం జూడమోహమున్న ద్రవ్యాపేక్ష యేరికిని ఉండదు. మోహములేనివాడు పెండ్లియేల? ఇక మోహమునకుంగాకున్న ధనమునకైన నుండవలయుగాని నిష్కారణముగా నిచ్చలేని పిచ్చిపెండ్లి కెవడైన సమ్మతించునా? అట్లైన మోహనష్టమునకై ధనముగొని యింకొక్కెడ మోహపూర్తికైపెట్టనెంచుట యస్వాభావికమా! వివాహ క్రయవిక్రయములనిలుప మార్గమొక్కటియే. అది మోహము నిలుపుట. అదిలేనిచో గన్యాదానము బేరసారములలో నొక్కటియౌను. కూతులుం గొడుకులును సరకులౌదురు. ద్విజులలో నగ్నికా వివాహము విధిగావున నాడుబిడ్డలుగలవారు ఏగోడులకైన లంచములకైననోర్చి కాలము మీరకుండునట్లు వరునిసంపాదింపజూతురు. అట్లగుట మగబిడ్డలచే దలిదండ్రులకు మంచిలాభమున్నది. అందులకే "అపుత్రస్య గతిర్నాస్తి" యని వైదికులు పుత్రాభ్యుదయమే నిరీక్షించి శోభనమును వేచియుండుట.

మఱికొందఱు "తరుణులైనపిమ్మట పెండ్లి జేయ మనవల్లనగు పనిగాదు. అయినను నాలుగైదేడులలో గాక తొమ్మిది పదిలో జేయించిన కొంతకు గొంతమేలు?" అని వివాహవయస్సు కించిత్తు పొడుగు చేయవలసినదని పారాయణముజేతురు. వరించుస్వాతంత్ర్యము గుణము వీనికి వెలియౌట, అతిబాల్యమునందే బిడ్డలుగనుట, ఇవి యనుచితములైయుండగా వీనికిం బ్రతికారణముగాని కించిద్వయోవృద్ధి యెవరికొఱకు? పరాధిష్ఠిత పరిణయములు పశుకృత్యములని యేమో ఒక్కతూరికి నాహింసచాలునని విధవావివాహములం జాలించిరి. దేహమును ఆజ్ఞలోనికి దెచ్చికొన్నను ఒరులమనస్సు ప్రియముచే దక్క నితరములైన వెఱపుల సాధింపనగునా?

నిర్బంధవివాహము లింత రోతలయ్యును సహజముగ నెవ్వరు సహింపనివయ్యును ఏల వ్యాపకమునకు వచ్చినవని ప్రశ్నింతురేమో. మనదేశములోని యరాజకము, దారిద్ర్యమునే కారణములనుట సదుత్తరము. బీదలు దేహపరిశ్రమ యమితముగ జేయువారుగాన వారికి కాయముతో గూడ మనసును కాయగాచి కఱ్ఱబాఱును, అట్టి వారికి మృగప్రాయములైన భోజన నిద్రాది సుఖములందక్క కోమల రసాన్విత భోగము లున్నవియనియైనం దెలియదు. భోజనముతమ కడుపునిండుగ గోరుదురేకాని రుచుల నాసింపరు. పాపము నిఱు ఈ పేజి వ్రాయబడియున్నది. ఈ ప్రపంచమున ఆహారసౌకర్యమునందు ఆంగ్లేయులు అమెరికనులును అగ్రగణ్యులు. వీరిలో గూలివారుసైతము దినమునకొకతూరియైన మాంసముం దినకుందురు. జర్మనీ ఫ్రాన్‌స్ రష్యా మొదలైన సీమలవారు జపానీయులును ఇంత చక్కగ జీవింపలేకపోయినను మొత్తము మీద నీవిషయమందు దేఱినవారే.

హిందూదేశము క్షామదేవతకు హృదయరంజక విహారస్థలము. ఈదేశమునందు జనులు తిండిలేక పరితపించు విధముజూడ ఱాతి గుండెయైన కరుగును. పనియు నందునకు దగినట్లు మిక్కిలిజబ్బు.

చిత్తూరుజిల్లా ప్రాంతములో నెల కైదురూపాయల జీతము లభించిన నది శుక్రమహాదశయనిపేరు. ఇక పెండ్లాము పిల్లలు వేఱుగ రెండు మూడు రూపాయ లార్జింతురేమో. ఈ యేడెనిమిది రూపాయలతో గిరాకిగానుండు కాలములో ఐదారుమంది యన్నవస్త్రాదుల యుక్తపరిమాణముల గొనవలయునన్న వితరణ ప్రసిద్ధమైన కల్పవృక్షమే కోమటియవతారమెత్తినంగాదు. మఱియు మిక్కిలిముఱికియై క్రిక్కిరిసిన యిండ్లలో నుండుటచేత అప్పుడప్పుడు వ్యాధులచే బాధితులై తిన్నగా దినము దప్పక పనికినిరారు. వ్యాకరణధోరణి నీవిషయము వాక్రుచ్చితిమేని వీరికి జనులతోగల సంధి వైకల్పికమేగాని నిత్యముగాదు. తుదకు బహుళమునుగాదు.

"ఆతురగాండ్రకు బుద్ధిమట్టు" అన్నట్లు సేవకులకు మిగుల గొద్దిగా తిండిబెట్టి పనిలాగజూచుట యజమానులయొక్క యాచారము. క్షుద్బాధయాఱి ముఖమునకు గాంతివచ్చునంత దిన్నవారు ఆకలిచే గృశించినవారు రెండుగంటలలో జేయుపనికన్న నెక్కువ యరగంటలో జేయగలరని యెఱింగినవారైనను "కాలవ్రయమైన నేమి రొక్కము మిగిలిన జాలును" అని తలచి కూలివారికొక ముద్దకు మారరముద్ద సంకటివేసి యదలించి పొలముల దున్నుటకో కోతకోపంపుదురు. చొఱవపనికైన తూగుచు జేయునదియే మేలనుట కాలవ్రయభీతిలేని యీ దేశమున మాత్రమే చెల్లును. ఇంగ్లాండులో నరరూపాయ సెలవైనను అరగంట మిగిలిన నితర యత్నములం బూరింపవచ్చునను త్వరయున్నది. అల్పోద్యోగములు గలదౌట ఇండియాలో కాలయాపనచింత మందునకైన దొరకదు. వేగిరపాటు వారికెట్లో యట్లే మందయానము మనకు సొంపుగాకున్నను ఇంపైన పద్ధతి.

హిందువులు మృదుహృదయములు గలవారగుట ప్రత్యక్షముగ సాపాటుచేయించుటలో దఱుచు కాఠిన్యముం జూపరు. రూకలులేని దేశముగాన రొక్కజీతముల యేర్పాటులో నెక్కువ కఱుకుగా నుండెదరు గ్రామములలో సేద్యగాండ్రకు భూస్వాములే మధ్యాహ్న భోజనంబిడుట సర్వసాధారణము. కొందఱు ఇది యన్నదానబుద్ధిచే గుదిరిన యభ్యాసమని పొరపడెదరు. అన్నదానబుద్ధి యున్నది గాని దానికనర్గళ సహాయకారియు నొండుగలదు. అదేదన స్వప్రయోజన పరత. ఎట్లన మాదిక్కు కలుపుదీయుట, కోత, కళ్ళము ఈ పనులకు కూలి మధ్యాహ్నపు గడితో 1 1/2 అణా. కడిలేక 2 అణాలు. ఇక పెట్టబడు విందుసంగతి. ఒకముద్ద లేక ఒకటిన్నరముద్ద అరచేతిలో నుంచుకొని యారగింతురుగాని ఆకులసెలవులేదు. ఈ నైవేద్యము ఒకరొకరికి 1/2 అణాకువచ్చిన దానకర్ణత్వ మనవచ్చును! మఱియు రొక్కము జీతమునకన్న గొంత మెక్కువకు వచ్చినను కూలివారు తప్పక తినెదరుగాన పనియు నెక్కువయై, క్రియాపూర్తికి వలయుకాలము తక్కువజేయుటవలన చిట్టచివరకు యజమానులకు లాభ మాపాదించును. అట్లుగాక రెండణాలు వారిచేతిలోనిడిన, పాపము, నిరుపేదలు గావున, పస్తుపడియైన గూడబెట్టుదమని వారొకపూట జలాహారముతో విరమించిరేని పని తక్కువయగును. రెండునాళ్ళలో ముగియుపని మూడునాళ్ళవును. కూలియు నెక్కువకు వచ్చును. కావున నీపురాతన మర్యాద యిరుదెసల వారిక్షేమమునకై వాడుకకు వచ్చినదేగాని బీదల ప్రయోజనార్థమే శాసింపబడినదనుట హుళిక్కి.

మనదేశము అన్నివిధముల యమితములకు నాకరము. ఒకదిక్కున మాలమాదిగెలు కడుపీడ్చుకొని పోవునట్లు ఎండుచున్నారు. ఇంకొకదిక్కున తుమ్మిన మెతుకులురాలునట్లు సంతర్పణములదిని పొట్టలు కదల్చలేక గొప్పవర్ణములవారు కూలబడియెదరు! ఇవి రెండును ఉపద్రవకారులే భోజనము మంచిదన్న మాత్రమున నెంత తిన్న నంతమంచిదని కూరుచున్న లేవక మెక్కజూచుట మౌఢ్యము.

అనగా మిక్కిలి జీర్ణమైన దేహము గలవాడు తినుటకుబూని యొక కబళము మ్రింగజూచిన ఆహారస్పర్శచే హర్షమైనను శక్తిచాలమి. నాహర్షము నంతగా అనుభవింపలేడు. డస్సిన వారికి దొలుత సరళముగ లోపలికిబోవు పాలవంటి ద్రవపదార్థము నియ్యవలయును. సేదదీర్చికొని తినను తినను సౌఖ్యము యథాక్రమమున కన్న నతిశయముగ స్ఫురించును. అనగా పారణారంభమున సౌఖ్య మధికవృద్ధిని గలిగియుండును. కొంతవడికి కుంభకర్ణునికైన నాతురత లాఘవమునొందును. అదిమొదలు సౌఖ్యము హీనవృద్ధి ననుసరించును. ప్రతికబళముదెచ్చు నానందము మునుపటికన్న దక్కువగ నుండును. చిట్టచివరకు తృప్తిసంపూర్ణ మగుడు తినుటయందలి సౌఖ్యం నాసక్తియు సున్నయగును. ఇంకనుం దిండిపోతుతనమున గుడువబూనిన దిండ్లపై బొరలాడ వలయుటయు సంభవించును.

భోజనసౌఖ్యము అనేక సౌఖ్యములట్లు తొలుత నధిక వృద్ధిని తరువాత హీనవృద్ధిని జెందుననుట వ్యక్తము. అనగా ఆరోహణావరోహణములు అనులోమ విలోమములు, అను లక్షణ సంయుతంబు.

ఉచితాహార సౌఖ్యములు లేనివారు చొఱవతప్పి మనపనివారి రీతిని కార్యములం దనాదరమును మాంద్యమును గలవారై యుందురు. ఉల్లాసములేనిది వికాసములేదనుట కిదియొక దృష్టాంతము.

4. ఆరోగ్యకరములైన స్థితిగతులును ఏపునకు దావలములు. మిక్కిలి యుక్కగలిగి గాలిలేని గదిలో నూపిరి యాడుటయే కష్టమన్న గష్టించుట శక్యమా! కర్మశాలలో గాలి శుభ్రముగాలేకున్న బనివారు ఒకవిధమైన మత్తుగలవారై మూర్ఛమునుంగనుండువారివలె నేమియు దోపక జాగ్రత్తతో బాటుపడనేరరు. తమకుం దెలియక యంగములుదూలి భరముతో బ్రయత్నము సాగించుచుండిన దానికిని బుద్ధికౌశల్యముతో గమనించి చేయుపనికిని ఈడుండదు.

ఇంగ్లాండు, అమెరికా, జర్మనీ, ప్రాన్‌స్ ఇట్టి నాగరికాగ్ర గణ్యములైన రాష్ట్రములలో ఇప్పుడు కర్మశాలలను హర్మ్యములట్లు రమ్యముగా గట్టుచున్నారు. కోకో యను పదార్థము శుద్ధిచేసి ఆహార యోగ్యముగానొనర్చు 'కాడ్‌బరీ' యను కుబేరోపముడైన వ్యాపారి కట్టించిన మనోహరమైన 'బోరన్‌విల్‌' అను గ్రామమును నేను కనులారదర్శించి నేత్రసాఫల్యముంబొందితి. ఆగ్రామమెట్లున్నదన; ఇండ్లు చిన్నవియైనను గృహములోని యాయాకృత్యముల కనువైన వెవ్వేఱుగదులుగలిగి ముందఱను వెనుకను రెండుగుంటల తోటనేల లుంటబట్టి విస్తృతముగను గూరతోటలతో బచ్చగను ఉన్నవి. కోకో ఫ్యాక్టరీసేవకులకుదప్ప ఇతరులకు వీనిని బాడుగ కిచ్చుటలేదు. ఇతరులకు అద్దెకియ్యమని యొడంబడిక జేసినగాని శిల్పులకుసైత మందు బ్రవేశములేదు. అట్లగుటచేత నాశిల్పులు నివాససౌఖ్యము దామే తప్పక స్వీకరింతురు త్రాగుబోతు తనముచే ననారోగ్య వ్యయములకుం బాత్రులౌదురను శంకచే నాయూర మదిరాశాల లుండగూడదని నిబంధనయుంగలదు. వీనికి మాఱుమత్తు నియ్యని భోజ్యపదార్థముల విక్రయించు నంగడులున్నవి. ఈ స్థలములు జనుల నాకర్షించుటకునై బహుచిత్రముగ గట్టబడినవేగాక లోన మంచి కుర్చీలు, సోఫాలు, మేజాలును గలిగి ప్రతిమలచే నలంకృతమై 'బిలియర్డ్స్‌' మొదలగు క్రీడలకును వసతులుకలిగి తేజరిల్లెడు. కర్మకరులు గుమిగూడి సభజేయుటకొక మంటపమును చదువుటకు బుస్తకభండారమును చికిత్సార్థము వైద్యశాలయు చెండ్లాడుటకు విశాలమైన భూములుగలిగి 'బోలిన్‌విల్లు' విరాజిల్లుచున్నది. ఈగ్రామాధికారము యజమానులును భృత్యుల ప్రతినిధులును గలిసిన పంచాయతిదారుల వశముననున్నది.

లక్షలకొలది సెలవుజేసి కాడ్‌బరీ లట్లేలచేసిరి? నష్టముగాదా? యనిన వారు ధర్మార్థమేగాక కర్మార్ధము నియ్యది ప్రతిష్ఠించి రనవచ్చును. ఎట్లన నిశ్చితావాసములు ఆరోగ్యముగల యధీనులుండుట వల్ల పనినిలువక నికరముగ గడియారమువలె నడచుటచే వారికి లాభమెక్కువ. మఱి యుల్లాసముతో బాటుపడుదురు గావున నచ్చులేక పని త్వరత్వరలో ముగింపవచ్చును. పసందుగాను ఉండును. పనివారు కపటవేషములకుం గడంగిన నష్ట మింతంతయని చెప్పితీరదు. బొంబాయిలో దినమునకు సరాసరి 1000 మంది రావలసినచో 1200 మందిని సేవకు గుదుర్చుకొనకున్న సాగదు. అనగా దినమునకు రమారమి 200 మంది మిషజెప్పియో చెప్పకయో మఱుగౌచున్నారనుట. దీనిచే జీతము సేగి యొకటేనా, పనిక్రమమును దప్పును. మాటప్రకారము సరకుదింపి వర్తకుల కిచ్చుటకుగాదు. అందుచే వారికి నష్టము గట్టియిచ్చుట, వాడుకచెడగొట్టుకొనుట మొదలగు బాములు ప్రాప్తించును. తమవెచ్చమును కాసైనబోక కట్టియిచ్చునంత లాభ మప్పుడే వచ్చినదని కాడ్ బరీ లనియెదరు! దూరపుజూపుగాజూచిన ధర్మమే జయమనుట బొంకుగాదు. అప్పటి కననుకూలముగా దోచినను మునుపటికి మోసములేదు.

కాడ్ బరీల చందాన 'లీవర్‌' వారు సబ్బుఫ్యాక్టరీల స్థాపించుకొఱకు 'సన్‌లైటు' రేవును, అమెరికాలో ఇనుము ఫ్యాక్టొరీల పనివారికై 'పిట్స్‌బర్గ్‌' ను ఇట్లనేక వ్యాపార ధురంధరులు కర్మకర గ్రామముల స్థాపించి ఇతరులతోసహా తమకును శ్రేయస్సు బడసియున్నారు. ఇపుడు బంగాళాలో నేర్పాటునకు వచ్చు అయ:కర్మశాలవారును ఇంకను గొందఱు ఈ యుద్దేశములచే వేతనకారులకు నివాసములను ఫ్యాక్టొరీల పరిసరభూముల నీదేశములో గట్టుచున్నారు. మనపనివారు యజమానుల కన్నుండిననేగాని కనుమఱుగౌవారుగావున విదేశములకన్న నీధర్మపద్ధతి యిచ్చట గార్యానుకూలతకు సాధనము.

యంత్రకళలలో దేహబలముకన్న మనోజాగ్రత్త మిగుల ముఖ్యము. కావున మనసులకు నలజడిగాన కుండునట్లు బొమ్మలు చిత్తరువులు ఇట్టివినోదములచే కర్మశాలల నలంకరించుటయుం గలదు. కండలశక్తికన్న బుద్ధిజాగరూకత శ్రేష్ఠము గావున మనము సవికాసముగా నుంచుట తగును.

5. తెలివితేటలు. ఆధునిక కళలలో తెలివితేటలు లేనివారు దక్షులు గానేరరు. తెలివితేటలు శిల్పప్రావీణ్యమును భిన్నములు. శిల్పప్రావీణ్యమనగా అభ్యాసాదులవలన నేర్చిన క్రియలలోని నైపుణి. మతిమంతుడనగా నేపనినైనను యోచనతోజేసి త్వరలో నేర్చుకొను శక్తిగలవాడనుట. అల్పబుద్ధిగల వాడైనను నిరంతర పరిశ్రమచే రచనాసమర్థుడు గావచ్చును. ఈ తెలివితేటలలో ముఖ్యములైన గుణములు తత్పలములు

గుణములు:--ఆజ్ఞలను శీఘ్రముగా గ్రహించుట, గ్రహించిన దానిని మఱువకుండుట. చిత్తవైశద్యము. విచారశక్తి. ఏకారణముచేత నీయారీతులు జేయుచున్నానని కార్యముయొక్క కారణములను దెలిసికొనవయుననెడి కొతూహలము. కొందఱు పశువులపోలిక గ్రుడ్డి తనముగా జెప్పింట్లు వోదురు. అట్టివారికి మనసున్నతో లేదో యను శంకయు బొడము.

జర్మనీ, ఇంగ్లాండు, స్కాట్లండు, అమెరికా దేశాముల యుతర భాగములోని శిల్పులు ప్రజ్ఞలో ప్రధములు.

ఐరోపా, అమెరికా, జపాను దేశములలో చదువు సర్వసామాన్యము. ప్రతిబాలుదును ఐదేండ్లుమొదలు పదునాలుగేండ్ల వఱకుకు బడికి బోయితీరవలసినదని రాజాజ్ఞయౌట చదువను వ్రాయను దెలియని స్త్రీలైన నారాజ్యములలేరు. అట్లు విద్యాశాలలకుంబోక నిలిచిరేని తల్లిదండ్రులు దండ్యులౌదురు. ఇంగ్లాండులోని పద్ధతి యిపుడు 40 సంవత్సరములుగ నడచుచున్నది.

మనదేశమున నగ్రజాతివారు తమయగ్రతకు నంతము వచ్చునను భయంబున, శూద్రులు మూఢులుగానున్ను దమకుమేలని, విద్యా దానము వారికి గూడదని నియమించి పాపము గట్టుకొనిరి. మూఢమతమునకు మూఢత యాధారము గావున, నీమార్గమున బౌరాణిక మతము శాశ్వతముగానిలిచి, తమకు గొప్పపదవియు నాదాయమును స్థిరముగ నిల్చుననియెంచి దేశము చేటునకోర్చి తాముమాత్రము పచ్చగానుండ బ్రయత్నించిరి. ఆంగ్లోమహాజనుల ప్రషాదమున నీనాట్కి వర్ణ భేదములు లేక విద్దెవ్యాపించుచున్నదిగాని, యుగముల నుండివచ్చు నాచారము లింకను విఘ్నకరములుగా నున్నవి. యుక్తాయుక్త వివేకము లేనివారికి అలవాటులే నీతి మార్గములు. అట్టివారిని బానిసలంజేసి కొంతవడికి స్వాతంత్ర్యమిచ్చినను ఇది నవీన నాగరికతయని దానిపొంతంబోరు. దీనికి దృష్టాంతములు. పూర్వము ఘోర హింసచే మాలలను బశువులకన్న నికృష్టస్థితి నుండజేసిరి. నేడు గవర్నమెంటువారు వారిజూచి ఇకముందు మిమ్ముల నెవ్వడువున బాధపెట్టనియ్యము. స్వేచ్ఛగా నుండుడు. అని బతిమాలుకొన్నను ఉత్తమవర్ణజులం జూచిన "వారికి మానీడగాలి సోకకుండునట్లు తొలగి నడుచుటయే ధర్మము. లేకున్న మోక్షమురాదు" అని నీచత్వ విమోచనంబును అరటిపండువలె నొలిచి చేతులలోనిడినను చేదని పాఱవేతురు. మనస్త్రీలును అట్లే మోటుకాలమునాటి లోకువతనము పతివ్రతాధర్మమనిభావించి యేసొంతములేని దాసీజనంబులట్లు పరమ సమ్మోదముతోనున్నారు. ఎంతకంపైనను ప్రాంతయైనచో మనవారికి అత్తరుపన్నీరులవలె నలరును గాబోలు! ఈ చందంబుననే జనులనేకులు పుస్తకములు బ్రాహ్మణులసొత్తని భ్రమించి వానిపొంతకుం బోయిన గురుద్రోహమని విద్దెనొల్లకున్నారు. దీనతయే దివ్యధర్మం బనువారి దేర్ప నెవరితరము?

ప్రజ్ఞచే వచ్చులాభములు:- చుఱుకుగలవారు పనులం ద్వరలో నేర్చుకొని ప్రవీణులౌదురు. అందుచే గాలవ్యయము తఱుగును. అట్టి వారికి బైవిచారణకర్త లక్కరలేదుగాన కూలిసెలవు మిగులును. వస్తువుల వృధాపాడుచేయక యిచ్చిన సామగ్రితో నెంతవరకు రచింపవచ్చునో యంత రచింతురు. మందబుద్ధులు తక్కువజీతమునకు వచ్చినను సామగ్రిం బాడుసేసి యెక్కువ నష్టముం దెత్తురు. మఱియు యంత్రకళలలో కాయపుష్టికన్న మనశ్శక్తి యెక్కుడనుట పూర్వావేదితము. ఇంకను ఒకగుణము. ప్రజ్ఞానిధులుగానివారు జలచరములట్ల వృత్తియెండినచో నచ్చటనే నిలిచియు మురియుదురు. ప్రజ్ఞానిధులు పక్షులట్లు సమృద్ధియుండు వ్యవహారముల కెగయుదురు. అనగా వారికి వృత్తులుమార్చుట సుగమము. 6. ఎట్టికుశలుడైనను తనకు లాభము మంచిపదవియు రాదను నిశ్చయమున్న ననురాగముతో శ్రమింపడు. నిష్ప్రయోజన కార్యాసక్తి మృగ్యంబు.

హిందువులలో వర్ణభేదము లనర్థహేతువులు ఎట్లన ఉత్తమ కులజులు ఎల్లభంగులం బూజ్యులకాన వారికి సత్ర్పవర్తనయున్న లేకున్న నొక్కటే. కావున లేకయ యుందమని వారు నుదాసీనులై యుండుట. ఈవిషయము పురోహితులు మఠాధిపతులు దేవార్చకులు మొదలగువారిచర్యలు చూచినవారికి వేద్యము. ధర్మాపేతులయ్యు ద్విజులు పూజనీయులుగనుండుట కీమూఢభక్తియేమూలము. పూర్వం యథార్థధర్మము ననుసరించి వర్ణము లేర్పడకుండినను వర్ణముల ననుసరించిన కృత్రిమ ధర్మంబైనను అనుష్ఠానములోనుండె . నేడీమాత్రపు ధర్మమైనలేదు. ఒక బహిరంగ వివాహములందక్క నింకెందును వర్ణ ధర్మములు ప్రవర్తిల్లకుండుట యెల్లరకుం దెల్లంబ. చర్యానుగుణములైన గౌరవములు జరుగు దేశములో నామమాత్ర వర్ణము లొక్కనాడైననిల్వవు. "నడువడి యెట్లున్ననేమి; వారిపాపముల వారు పోదురు. పెద్దలు సకారణముగ జూపిన మర్యాదలను మనము నిష్కారణముగజూపి పుణ్యము మూటగట్టుదుము" అని తలపోయు మౌఢ్యాత్మకంబైన సమూహం బౌటంబట్టి వేషములకుండు గారవము నడవడికి లేకపోయె. ఇక హీనకులస్థులన్ననో ఎంతతపస్సుజేసినను వారికీజన్మమున భద్రములులేవు గాన వారును శత్రుప్రాయులైన నితరవర్ణస్థులకైన యేల పాటుపడవలయునని యజాగ్రత్తగానున్నారు. కావున నిరుదెఱుగులవారికిని క్షీణతాప్రాప్తికి వర్ణభేదములు ముఖ్యకారణములు.

మఱియు శాస్త్రఘోష లెట్లున్ననేమి? పదవులు ధనము ననుసరించి లౌకికరీతిని వర్తిల్లును. కష్టములకుదగిన ఫలము లేనిచో కార్యంబులయెడ గాంక్షచెడును. మనదేశములో నీవిషయములైన దురాచారములు పెక్కులుగలవు. పనియొక్క కఠినతను గుణమును జూడక మామూలు జీతముమాత్రమిచ్చుట, అల్పవేతనములు, విరామమేలేక పనిదీయుట, క్రమములేని కర్మలను విధించుట ఇత్యాదులు.

ఇంగ్లీషువారి యిండ్లలో సేవకులు చుఱుకుదనమున బనిజేతురు. మన యిండ్లలోనివారు మునికోలతో బొడుచుచున్నను కదలరు. కారణమేమి? స్వదేశీయులయు విదేశీయులయు గృహసేవా పద్దతులంబోల్చి చూతము.

ఇంగ్లీషువారి పద్ధతి హిందువుల యాచారము
1. నెలకు ఎనిమిది రూపాయలు మొదలు ఇరువది వఱకును సంబళము 1. అన్నమువేసి రెండు మొదలు నాలుగు రూపాయలవఱకును నెలకూలి.
2. పరిచారకులకు పనిపోయిన నేమిగతియని భయము గల్గియుంట 2. పనిపోయిననేమి: ఇంతకన్న నధమస్థితి రాబోవునాయను నిరాశ ధైర్యము
3. తప్పుచేసిన, పాత్రలను విఱుగగొట్టిన నపరాధము వేతురు. ఇచ్చియైన పని నిలుపుకొనుటమేలని సేవకులుభరింతురు. జీతము స్వల్పముగాన జల్మానాలకు వీలులేదు. అందులకు బదులుగ గడుపార దుర్బాషలతోదిట్టి చిన్నబిడ్డలకుగూడ భాషాజ్ఞానము గలుగజేతురు.
4. సేవకులు రాజోద్యోగస్థులట్లు భయముతో వర్తింతురు. 4. యజమానురాలు పనికత్తెలు అప్పుడప్పుడు ములుకులవంటి ముచ్చటలను బ్రయోగించుటయు గలదు.
5. సేవకులకు కర్మలు నియతములు. అవిచేసి ముగించినవెనుక యింటిముందఱ విరామముగా బిలిచిన బలుకునట్లు గూర్చుండియున్నను యజమానులు దోషమని తలవరు. ఎంత త్వరలో బనిజేసిన నంత విరామము దొరకునను నావేగమున బనిజేతురు: 5. క్రమములేని పనులు గావున ఒక్కపనియయి కాకమున్నె రెండు పనులు పెట్టుదురు. ఎంతచేసినను విరామ మియ్యరు గావున పనులను ముగించిన ప్రమాదమని సోమరితనమున దూగుచు నిదానముగ జేతురు. చొఱవచేత నష్టము గలిగినచో మాంద్యము నెవ్వ డవలంబించడు.
6. నచ్చులేని పని. కాలము మిగులుట. ఆలస్యము లేకయుండుట. యజమానులకు గోపము మొదలగు చిత్తక్షోభము లవసరము లేకుండుట. ఇవి ఫలములు 6.ఫలములు మీకనుభవ వేద్యములే గాన వర్జన లధిక ప్రసంగములు.
కర్మకరులు మృగములు జడములుగారుగాన వారి మనస్సులను ఆకర్షించునట్టి విధానము లున్నంగాని మొత్తముమీద ననర్థమే ప్రాపించును. మనవారు భయముచేతనే కర్మసాఫల్యము నొందజూచెదరు. ఇది తెల్వితక్కువపని. తనకు నేశుభమునులేనిది వెఱపున్నను నిండుమనసుతో నెవ్వడును గృతయత్నుడుగాడు. ప్రయత్నశీలత జయోత్సాహసంజనితము. జయము మాయమైన నుద్యోగము నస్తమించు.

"అవునుగాని ఎక్కువ కూలియిచ్చిన నాకూలి కల్లంగడిలో వినియోగమగువఱకును మఱల బనికిరారు. లంఘనమువలె లక్షణములు పురికొల్పజాలవు" అని కొందఱాక్షేపింపవచ్చును. ఇందు కొంత నిజమున్నది. అయిన నింకను విమర్శింతము.

అధమవర్ణస్థులు చేతి కించుకడబ్బు తగిలినతోడనే ఇంకను ఆర్జింపవలయునను కోరికగొనక పనివదలి మధుమాంసాదులకు వెచ్చింతురు. ఈరీతి నితరులేలచేయరు? కారణము స్పష్టము. పూర్వహింసలచే బట్టువడిన వాడుకలంబట్టి, ధనముగూడబెట్టిన నేమహాత్ముడైనను "ఓహీనుడా! నీకు ధనమెందుకు?" అని శాస్త్రముచేతనో శాసనముచేతనో లాగుకొందురను నివ్వెఱపాటుచే "వచ్చినమాత్రం లాభము. ఇప్పుడే తిని త్రాగిన గ్రక్కించి నాకబోరుగదా" యని నికృష్టులైనవారు నిరాసచే నర్థార్జనమున కుద్యమింపరు. సోమరితనము, కలిగినప్పుడు కల్లంగడికిబోవుట, లేనివేళ దీనతతోవేడి యాశ్రయించుట ఇత్యాది దుర్గుణములకు హింసాపరులై యగ్రజాతులవారు బలియురగుటంజేసి విధించిన యాచారములే మూలాధారములు. ఈ కార్యములు బ్రాహ్మణాదులయందు వర్తింపవుగాన వారిలో ఆశ, ఉత్సాహము, వసూత్పాదనాసక్తి. ఎడతెగక శ్రమజేయుశక్తియు నెలకొనియున్నవి. ఈ దు:ఖసాగరము నంత్యజులు - కడవనీదవలయునని కరుణగొంటిమేని రిక్తవాక్యముంవిడిచి వారు దరిజేరిన నీర్ష్యచే మఱల దోయకుండుటయగాదు. నివసించుటకు వసతులను నేర్పఱచినంగాని వారు గడిదేరుటయు గడిదేరవలయునను ఇచ్ఛయు నసంభావ్యంలౌను. ఇది సులభసాధ్యము గాకున్నను కిరాతహృదయము లేనివారెల్లరు నాదరముంచి సహాయపడవలసిన ధర్మోద్యమంబు.

జయమెంత శీఘ్రముగ సిద్ధించునో యంత యాతురతతో బనిచేయుదుము. శూద్రులు మొదలగు వారలకు "ఇంకొక జన్మములో సర్వశోభనములు సిద్ధించును. ఇప్పటికిమాత్రము నిరాశగానుండి యార్జించినది గొప్పవారికి దానము చేయుడు" అని బోధించిన నింకొక జన్మమనునది యెప్పుడో, యేయుగముననో "కాశీలో దొంగలించుటకు రామేశ్వరమునుండి వంగికొనుమన్నట్లున్నది" అని యదైర్యపరులై విశ్రాంతిజెందుదురు. కావున కాలమును ముఖ్యము, చిరమునకన్న నచిరము ప్రోత్సాహకరము. ఇందుచే బ్రత్యక్షమే పరమమూల్యమని భ్రమింపరాదు. అచిరమనగా నించుమించు లెక్కకు వచ్చుకాలమనియర్థము. ఎవ్వరికిని గుఱుతులేని మన్వంతరములనికాదు.

కూలిపనికన్న సొంతపని యెక్కువ సమర్థమనుటకొక నిదర్శనము. భృత్యులకు బని ముగించినవెనుక జీతముల నిత్తురు. అనగా పనిముందు ఫలము తదనంతరము. సొంతపనిలో నట్లుగాదు. పనియు ఫలమును సమకాలికములు. ఎట్లన, కార్యము నడుచుటయే ఫలము. సేవకులకు కార్యము ఫలముగాదు. జీతము ఫలము. కార్యము నిష్కర్ష. ఎందుకన అది ముందుముగింపునకు వచ్చునది. బత్యము దానిని వెంబడించునదిగాన నది కార్యముతోబాటు నిశ్చయము గలదిగాదు. తమపని తామేచేసిరేని కార్యమెంత నిశ్చయమో ఫలమునంతే నిశ్చయముగాన ఎక్కువ పూనికతో ప్రారంభింతురు.

స్వామ్యము సామర్థ్యాతిశయమునకు ప్రబలకారణము. నిద్రకనులతో గూలిజేయువాడుసైతము నీకేయని కొంత భూమి నిచ్చితిమేని రేయనక పవలనక భూమిని దినదినము బిడ్డమాదిరిగ నరయుచు వృద్ధికిదెచ్చును. కావుననే పోరంబోకు నేలలనిచ్చి పంచములను సాహసవంతుల జేయవలయునని దేశోపకారకజను లర్థించుట.

7. దుశ్శాసన దురాచారములు వితరణకు బాధకములు. దురాచారము లుత్సాహభంగముంజేసి జనులకు సోమరితనమును దుర్వ్రయబుద్ధిని బొందజేయుననుట విశదంబు. అన్యాయరాజశాసనం లటువంటివి. మితిమీఱిన పన్నుల రాజులు విధింతురేని ప్రోగుచేయ నెవ్వరికిని బుద్ధివొడమదు. "సర్పంబు పడగనీడను, గప్పవసించెడు విధంబుగదరా సుమతీ" యనునట్లు లోభుల యాశ్రయమున గరికయైన బచ్చగనుండదు. ఇంగ్లీషువారిచే బరిపాలితమగు 'ఐర్లండు' అను దీవి యొండుగలదు. అందు దుశ్శాసనములు పూర్వకాలమున బ్రబలియుంటచే, జనులు, ఆర్జించినను శేషించునను నాశలేదమి, మనజను లట్లు అప్రయోజకులైరి. ఆ ద్వీపనివాసులు అసంఖ్యజనులు రక్షాకరములైన ఇతర రాజ్యములకు వలసబోయినవారు ఉద్యోగోల్లాస వితరణంబుల ననన్యసామాన్యులని పేరువడసిరి.

బ్రిటిష్‌వారి పరిపాలనకు బూర్వం హిందూదేశం సౌరాజ్యం గలదియై యుండలేదు. తురకలు, మహారాష్ట్రులు చేసిన దౌర్జన్యమును వేఱుగ జెప్పనేల? తత్పూర్వమందును అనగా మనవారు కృతయుగమని కొనియాడుకాలమునందును జనసమూహముయొక్క క్షేమమును మనరాజులు పాలించినట్లు గానము. అల్పసంఖ్యులైన బ్రాహ్మణ క్షత్రియులకుదక్క తదితరులకు సర్వమును వమ్ముగాజేసి జీవనము దుస్సహముగాజేసి యలయించిరి. మఱియు నితరదేశములలో సంఘాచారములువేఱు. రాజశాసనములువేఱు. ఈ భిన్నత బ్రిటిష్ వారి కారుణికత్వమున మనలో నిప్పుడు గానబడుచున్నది. దృష్టాంతము. సంఘధర్మప్రకారము అంత్యజులు ద్విజులతో బోగూడదని యున్నను ప్రజలెల్లరు శక్త్యనుసారము సమముగ బన్నులిచ్చువారు గావున ఇట్టిభేదముల రాజులు గణింపరాదని న్యాయస్థానములు, కచ్చేరీలు, రైలుబండ్లు మొదలగు రాజరచితస్థానములయందు నందఱికిని బ్రవేశము సమమని గవర్నమెంటువారు చాటించియున్నారు. అప్పటము ఆర్యులకాలములో సంఘాచారములైన వర్ణాదులును రాజశాసనములతో నేకీభవించి యుండినవి. దానివలనగలిగిన గోడును వర్ణింపనలవిగాదు. ఇపుడు సంఘములో నెంతదిక్కులేనివాడైనను రాజ్యాంగవిషయములయందైన తలయెత్తుకొని తానును మనుజులలో మనుజుడుగా దిరుగవచ్చునను ధైర్యముగలవాడై యున్నాడు. శ్రీరామాదుల కాలములో సంఘములో దిక్కులేని వానికెక్కడను దిక్కులేదు. సంఘములో నగ్రగణ్యుడైన వానికిమాత్రము రాజ్యాంగములలోను పదవి, దొరతనమును లభ్యములు. జనబాహుళ్యమునకు బన్నులుగట్టుటదప్ప మఱేమర్యాదయుం గానము. వేయేల? అభివృద్ధి నాసించి పాటుపడుటయు నింద్యము! ఒకరికొక కీడునుజేయక మోక్షార్థియై తపంబునకుబూనిన శూద్రునకు శ్రీరామచంద్రులు శిరచ్ఛేదనముంజేసి కృతార్థులై ప్రపంచము ధర్మచ్యుతముగాక నిలిపిరట! మనపెద్దల యోగ్యత యీమాత్రము.

దీనిచే నార్థికక్రియలకు నిరోధ ముప్పతిల్లె. ఎట్లనిన:-

అన్యాయముగ నవనీశులు దోచుకొందురను భయమున జేర్చిపెట్ట నెవ్వరు నుత్సహింపరైరి. చేర్చుటయే లేకున్న వృద్ధికై పున:ప్రయోగముంజేయుట యంతకుముందే నహి వితరణబుద్ధి వెడలిపోయె. అథవా యెన్నడైన శుక్రదశవీచి అధిక ధనప్రాప్తి నందజేసిన వ్రతము, వివాహము, పండుగ అను మిషనొకటిబెట్టి త్వరలో భోజనాలంకారాదుల వ్రయమొనర్చి నిర్వ్యాకులులై యుండుట ప్రాజ్ఞలక్షణమని గణింపబడియె. ఎట్లును నష్టము నిక్కంబుగాన దానమైన నొనర్చి స్వతంత్రవ్రయ తృప్తింబొందుదమని పాత్రాపాత్రవిచారణలేక వినియోగముంజేయు వాడుకలలవడె. దానకర్ణతకు దుశ్శాసనములు ప్రోత్సాహకరములైన సఖులు. ఈదేశములో నీగియెక్కుడని కొందఱు విఱ్ఱవీగి పలుకుటగలదు. తమసొత్తునకు దమకును బలాత్కార వియోగము గలుగదను నమ్మక ముండిన, నింతధారాళముగ నిచ్చు నభ్యాసము ద్విజుల బోధనలచే మాత్రము పట్టువడియుండు ననుట సంధిగ్ధము.

ఈకారణములచే సమర్థతయొక తీరుననుండక క్షయవృద్ధులకు బాత్రంబైయుండు. ఇండియావారు సత్త్వంబున నాంగ్లేయులకు సదృశ్యులుగారు. దృష్టాంతము.

ఈ దేశములో సరాసరికి ప్రతికూలివాడును ఉత్పత్తిజేయు సీమబొగ్గుతూనిక 75 టన్నులు. తక్కిన బ్రిటిష్‌రాజ్యములలో సరాసరి కొలత 285 టన్నులు. అనగా ప్రతిమనుజుడును మనకన్న నాల్గురెట్లు సమర్థులనుట. స్వదేశీయులు నలుగురు చేయుపనిని వారిలో నొక్కడు చేయును. ఇంగ్లాండులో ప్రతివానికిని సరాసరి దినకూలి ర్పూ 2-8-0. ఇండియాలో 0-4-0 మొదలు 0-6-0. కూలిలో నమితభేదమున్నను ఈ దేశమున నొకమైలు ఇనుపదారికి ఇంగ్లాండులో నొకమైలునకగు సెలవేపట్టును. తక్కువయేల కాదనగా ఇక్కడ నెక్కువ పనివారని బ్రోగుచేయవలయును. రెండవది. ఈ పనివారు పాటుపడునట్టు తనికీచేయుటకై విచారణకర్తల నియమింపవలయు. ఈ విచారణకర్తలు విచారించెదరా లేదాయని పైవిచారణకర్త లుండవలయును. ఈరీతుల గూలితక్కువయైనను సెలవు తక్కువయగుట లేదు. మనవారిలో నమ్మకము గ్రమము మెఱయ గడంకం గొనిరేని ఇక్కడంత సరసముగ నైరోపాలో సరకులు రచితములుగావు. విదేశవస్తువుల దిగుమతియు నవసరముండదు.

పోల్చిచూచిన నుద్యమములలోనగు మొత్తపుసెలవులో తనికీ విషయమైన వ్రయ మీదేశమున నైరోపాకన్న నధికము. తనికీ నేల చేయవలయునన పనివారు మాటప్రకారము కర్మలను స్వేచ్ఛగా జేయరు. ఈ నికృష్టత యరాజకము మొదలగు వానిచే గలిగిన వాడుక. ఈకారణముల నన్నింటిని మఱల జర్చించుట యనావశ్యకముగాన నప్రసంగతములైన రెంటినిమాత్రము పేర్కొనెదము.

1. ఉంఛవృత్తి. ఆర్జించినవారి బీడించిబ్రదుకుట సగౌరవ జీవనోపాయములలో నొకటిగా మనదేశమున నెలకొనియున్నది. ఇందుచే గష్టించక ఫలము గొనవలయునను దురాశవర్ధిల్లి మోసపు మార్గముల గడించుటయను నాచారమును ఉత్పాదించినది. "ఫలము లభించినంజాలు, పద్ధతులెట్లున్ననేమి?" అను దురాలోచన అంతటను నిండియుండుటంజూడ ఫలాపేక్షారహిత కర్మముంబోధించు భగవద్గీతలకు వచ్చిన అనుభవ గ్రహచారమేమోయని తట్టకమానదు. ఇంగ్లాండులో భైక్ష్యము నీచమని యెవరును దానిచెంతకుంబోరు. కష్టించక కూలిగొనుట భిక్షమేకదా అను లజ్జచే విచారణకర్తలు లేకున్నను ఒప్పుకొన్నంత చేయజూతురు! కావున నది మేస్త్రీలు, సూపర్‌వైజర్‌లు, ఇన్‌స్పెక్టర్లు మొదలగు నిరర్ధక శ్రమకరులు బలిసి క్రిక్కిరిసిన దేశముగాదు.

2. అవిభక్త కుటుంబములు. వీనిలో మంచిగుణములు లేక పోలేదు. అయినను ఎవడైన నొకడు సంపాదనపరుడుండిన వాని న్నమ్మి అనేకులు ఎదిగినవారుండుట సోమరితనమునకు బహుమాన మిచ్చినట్లు. స్వార్జిత ముత్తమము; అన్యము లధమములు అను గరువపుదిరస్కారబుద్ధి లేనిదేశములో మానము నర్థము రెండును మెండుగావు. మానములేనిది గౌరవమడంగును. గౌరవముమీద దృష్టిలేనిది మగతనముం జూపుదమను తెగువదొరకొనదు. కాళ్ళుపట్టుకొని బ్రతుకుటయ అశ్రమమని విక్రమములకు మొదలిడరు. మానరక్షణమున కెవ్వికారణంబులో ఆ గుణంబుల అర్థాభివృద్ధికి నాద్యంబులు. ధర్మార్థము లెడతెగనివి.

ఫ్యాక్టొరీ చట్టములు

పూర్వమునవలెగాక ఇపుడు స్పర్ధ మిక్కుటము గావున ఒకరికైన నొకరు తక్కువకు నుప్పతిల్లజేసి యమ్ముకొఱకు అతిబాల్య ప్రాయమువారిని పనులకుం గుదుర్తురు. ఈ దురుద్యోగములకు మూలములు రెండు. తక్కువ సంబళమునకు వత్తురని యజమాను లాసగొనుటయు, కుటుంబమునకై యేమాత్రమైన గడించిన నూరక దండుగ తిండి తినియుంటకన్న మేలుగదాయని తలిదండ్రులు పేరాసగొనుటయు. శుభ్రమైన గాలియు తఱుచు విరతియులేని కెలసములలో లేబ్రాయపు గొమరులం బ్రవేశింపజేసిన, అప్పటికి వరుమానము గలిగినను పెఱుగుటకు భంగమై దేహముచెడి కృశించిన వారౌదురు గాన ముందఱికి ముప్పుతప్పదు. కొమరుంబ్రాయపువారు కందినం దత్సంతతియు బడుగువడుగాన దొరతనమువారు అతిబాల్యశ్రమను గుఱించి తద్దోషావదారణార్థము శాసనములం జేసియున్నారు. ఇటు చేయుట తగినదైనను గవర్నమెంటువారు నిక్కపు టుపకారబుద్ధితో గాక మనకు వ్యవహారముల నెదిరినవారైన ఇంగ్లీషు వ్యాపారులకు సహాయము జేయవలయునను అభిలాషతో విధించిన నియమములనియు, ఇన్నికట్టుబాటులకు బాల్పఱిచిన బరరాష్ట్రీయులతో మత్సరించి వారికన్న నధికము సులభముగ వస్తువుల నమ్మునంత నయముగ సరకులం బరిష్కృతములు చేయలేమనియు మనలో గళాగ్రేసరులు కొందఱు వాదించిరి. గవర్నమెంటువారి మనసు పరిశోధించునంత వాడిచూపులు నాకులేవు. మనసెట్లున్ననేమి? శాసనము ప్రశస్తమనుటకు జంకులేదు. మఱియు గొందఱు "గర్భిణీస్త్రీలను, ఆఱేండ్ల బాలికాబాలకులను గనులలో సైతము పనికి దింపుట కొన్నితరముల క్రిందట ఐరోపాలో బీదలలో సామాన్యముగ నుండెగాన "పశ్చిమ ఖండీయులు ఎట్టికఠినాత్ములు! కాంచనమునకై భార్యాపుత్రులం బలియిచ్చు పాపచిత్తులు" అని కేరడించి వాపోయెదరు. ఇది గురిగింజ సామెత. అతిబాల్యవివాహమునకన్న నతిబాల్యకర్మకరత ఎక్కువ హాని జేయునదికాదు. మఱియు నైరోపావారు ఎన్నడో తమ లోపములను సవరించుకొనిరి. ఏసవరణలును లేనిమనము ఒరులజూచి నవ్వుట తలపోయ హాస్యముగనుంటయేకాదు. "తమదోషముల నెఱుగజాలని మూఢులుగనున్నారు; వీరికి నెన్నడు మంచిగుణము లలవడును" అని చింతయు గలుగకపోదు.

ఈ దేశములో నతిబాల్యశ్రమను సక్రమముగ జేయుటకై చేయబడిన యేర్పాటులు ముందు ప్రకటింపబడియుండు ఆవేశన నిబంధనలో గననగు.

పసివారు నిరంతర శ్రమాన్వితులు గాకుండిన నేమినష్టము? పెద్దలు పూనికతో పాటుపడకుండుటయే మన దౌర్భాగ్యమునకు నాది సదనము. సరాసరికి వారములో నైదునాళ్ళైన పూర్ణముగ గష్టపడరు. ఇంకను గొసరిని తిథివారనక్షత్రములను మిధ్యావాదము లాధారముగ దలచినప్పుడు అంతర్థాన మౌదురు. మనలో మతవిషయక ద్వేషము లమేయములయ్యును పండుగలని పనివీడి నిలిచి పోవుటలోమాత్రము అందఱికి నైకమత్యము చక్కగ బ్రబలియున్నది. అల్లా నీళ్ళలో బడునాడని తిరుమలాచార్యులును శివవిష్ణులు వేట బోయెదరని అగ్బరుఖానును నిష్కర్ములై వాలాయముగ గాలక్షేపముం జేయుటలో అన్యోన్యమైత్రి నెరపుదురు. తదితరదేవసేవనమ్మున నేకీభవింపని వారమయ్యు సోమరితనము నుపాసించుటలో నెల్లరు నొక్కటిగనుంటజూడ నిద్రాదేవికి మించిన దైవత మీదిక్కున లేనట్లు తోచెడిని.

ఆవేశన నిబంధనలు

ఇండియా గవర్నమెంటువారు శాసించిన 1911 వ సంవత్సరపు చట్టము ప్రకారము ఏర్పఱుపబడిన ఫ్యాక్టొరీలలోని శ్రమవిషయమైన నిబంధనలు:-

1. కర్మకరుల దేహపరీక్ష:-

గవర్నమెంటువారిచే నియమింపబడిన వైద్యులచే గూలివారు తమదేహముల బరీక్షింపించుకోవచ్చును. ఈ శోధనకార్యము యజమానులు గోరినను జేయవలయుట యావైద్యులవిది.

2. ఆరోగ్యార్థమైన భద్రములు:-

1. ఆవేశనమును సదా శుభ్రముగనుంచుట. 2. దుర్వాసనలకు నెడమీకుండుట. 3. ఒకగదిలో నధికసంఖ్య పరిజనములను క్రిక్కిఱియునట్లు గుమిజేర్చి శ్రమింపజేయమి. 4. మంచిగాలి ధారాళముగ బర్వునట్లొనర్చుట. ధారాళముగనన నేమియన్న. శ్రమ సంజనితములైన దుమ్ము, దుర్వాయువులు మొదలగునవి కొట్టుకొనిపోబడునంత సమృద్ధముగనని యర్థము. సహజమైన గాలిచే నీసిద్ధి సమకూరదేని విద్యుదాదిశక్తులచే గమనభావముగాంచు వీవనల నలవరచుట యగత్యము.

3. వెల్తురు:-

గుడిలోని గర్భగృహంబుంబలె ముసురుగ్రమ్మిన వెలుతురుండినజాలదు. విస్పష్టమైన కాంతి యావశ్యకము. లేనిచో గన్నులకు సెబ్బర.

4. నిర్మల జలంబులు:-

త్రాగుటకుగాని లేక చల్లిచెమ్మయో చల్లదనమో కలిగించుటకుగాని యుపయోగింపబడు జలంబులు నిర్దుష్టములుగనుండుట సంభావ్యము. మోక్షమార్గహేతువులైన తీర్థములమాడ్కినున్న జుల్మానాప్రాప్తి నిశ్చయము.

5. అగ్నిభయ ప్రతీకారము:-

కాలవైపరిత్యంబునంజేసి లాక్షాగృహ దహనముంబోని దహనము సంభవించిన దప్పించుకొనుటకు వలయు నుపకరముల సేకరించి వాడుటకు ననువైనరీతి నెల్లపుడును సిద్ధముగ నుంచి యుండవలయు. మఱియు, త్వరలో రవుల్కొను వస్తువులు పెట్టియున్న స్థలములో చుట్టగాల్చుట, దీపము వెలిగించుట మొదలగు హనుమంతునిచేష్టలు కూడవు. చేసినవారు దండ్యులు.

6. యంత్రములవలని యపాయములు:-

వీనిచే నెవరును బాధపడకుండునట్లు అపాయకరములైన యంత్రభాగములకు కంచెలు గట్టుట ముఖ్యమైనక్రియ. అట్లుచేసిన నాకస్మికముగ వానిం దాకుటలు తఱుచు సంభవింపవు. 7. స్త్రీలు, బాలురు:-

వీరల నపాయకరములైన యంత్రక్రియలలో జొనుపుట గొప్పనేరము.

8. విరామము:-

1. ఆరుగంటల కొకపర్యాయమైన నరగంట విరామమిచ్చుట తగవు. విశ్రాంతి కాలములో సర్వవ్యాపారములకును విశ్రాంతికల్పితము. 2. వారమునకు ఆదివారమునాడో, మఱియేదైన నొకదినముననో ప్రతివానికిని రజా యియ్యవలయు. ప్రతిదినము నేకవిధగతినే ఆటనక పాటనక పాటునకుంజొచ్చిన నెట్టివాడైనను జుఱుకుతఱిగి మొద్దువారుట స్వభావం. ఉచితపరిశ్రాంతి నొసంగుట దేహమునకు మనసునకును బదునుపెట్టినట్లు.

9. బాల్యోద్యోగము:-

1. బాల్యమనగా పదునాల్గేడులకు దక్కువయైన వయసు. 2. తొమ్మిదేండ్లు నిండని వారికి ఫ్యాక్టొరీలలో బనియియ్యరాదు. వయసునిండియుండిరిపో, అప్పటికిని వైద్యుల యనుమతిలేనిది కర్మలకుం దార్చుట న్యాయవిరుద్ధము. 3. ఉదయము 5 1/2 గంటలకు ముందుగ గాని సాయంకాలము 7 గంటలకన్న మించికాని వారిని పనులనుంచుట తప్పు. 4. మఱియు దినమునకు వారు కష్టించు గంటలపరిమితి 7 నకన్న నెక్కువకు బోగూడదు.

10. స్త్రీజనోద్యోగము:-

1. ఉదయము 5 1/2 గంటలకైన ముందుగగాని, సాయంకాలము 7 గంటలకన్న మించికాని వారిని పనులనుంచుటతప్పు. 2. మరియు దినమునకు వారు కష్టించు గంటల పరిమితి 11 నకన్న నెక్కువకు బోగూడదు.

ప్రతిశాలయందును బాలుల వయస్సు. వారికింగట్టబడిన పనులయొక్క స్వభావము మొదలగు వివరముల దెలుపు జాబితాయొకటి నుంచుటయు నీనియములలో నొకటి.

ఇంగ్లాండు మొదలగు పశ్చిమరాజ్యములలో ఫ్యాక్టొరీల వ్యాపారములం గూర్చిన సమయము లింతకన్న నెన్నియో మడుంగులు కఠినతరములు. కొన్నిచోట్ల నెదిగినవారి సయితము 9 గంటలకన్న నెక్కువకాలము శ్రమింపనీరు: ఇట్లు శ్రమకు పరిపరివిధముల పరిమితు లేర్పఱుపబడి యున్నను, ఈ యాశ్చర్య మేమిచెప్ప: ఉత్పత్తి కొఱతపడినది గాదు. దీనికిం గతంబు లెవ్వియని యందురో, చూడుడు:

1. 'ఆత్రగానికి బుద్ధిమట్టు' అనుట వినియున్నారుగదా: అట్లే యమితశ్రమయు నిష్ప్రయోజనము.

2. ఆధునికకళలలో నొకయజమానులయందేకాదు, భృత్యులయందును బుద్ధిబలము, నిర్వికల్పమైన గమనము ఇత్యాది మనస్సంబంధములైన లక్షణములు ముఖ్యములు. అరమోడ్పు గన్నులతో గాయమును శ్రమింపజేసినను జేయనగునుగాని, మనస్సును దీటు కొల్పుట సాధ్యమా? కావున యుక్తమైన విరామము లాభదాయకము. అదిలేనిచో మనసు ముడుచుకొనిపోవును. మనసులేనిపని ఈకాలపు బెండ్లిండ్లుబలె సుమనస్సులకు నరుచ్యము. అసహ్యము, అభివృద్ధి విఘాతుకము: 3. తూలుచు దూగుచు బదిగంటలు చేయుటకైన దీవ్రముగ నైదుగంటలుచేసిన ఫల మధికమగును. పున:ప్రవేశమునకు శిల్పులును వాడిచెడరు. మనదేశములోన నేకాగ్రములును, దీక్ష్ణములునువగు నుద్యోగములు పూర్వమెపుడో మనపెద్దలుచేసిరని వదంతిగల తపస్సులందేగాని, ప్రకృతము ప్రత్యహములగు కార్యము లన్నింటను అప్రయుక్తములో అల్పప్రయుక్తములో యనునట్లున్నవి. కాలముంబట్టిచూచిన బాశ్చాత్త్యులకన్న మనకు కర్మము మిక్కిలి ఎక్కువ. దేహమనోదార్ఢ్యంబులు శిధిలములైన వారగుటంజేసి సమర్థతం బట్టిచూచిన మిక్కిలి తక్కువ. పనులకుం బూనువేళల వేదాంతము స్మరించుచు నివియెల్ల మిధ్యలు మాయలు అని గొణుగుకొనుచు నిదురించుటయు, నిక నాధ్యాత్మిక తత్వములకుం దొడంగితిమన్ననో "లోకవాసన యెంత రమ్యము: యెంత యాహ్లాదకరము:" అని యింద్రియముల ప్రచారములను స్మరించి మెచ్చుకొని గ్రుక్కిళ్ళు మ్రింగుచు, వేదాంతమునకు మించిన వేదాంతాంతమును జెందుటయు; ఇట్లు రెంటికింగాని నిర్వ్యాపారత్వమను పురుషగుణంబు నుద్ధరించుటయే మనజనుల ముఖ్య సంప్రదాయము. కావుననే ఇహమునకు దూరస్థులమయ్యు బరమునకు సమీపస్థులుగాక యుభయభ్రష్టులమై యుప్పర సన్యాసము దీసికొనియుండుట:


భారత అర్థ శాస్త్రము మొదటి భాగము సంపూర్ణము

__________ ♦ __________