భారత అర్థశాస్త్రము/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఉపోద్ఘాతము

ప్రవేశకము

అర్థశాస్త్రము పాశ్చాత్య దేశముల యందును క్రొత్తదిగ నెన్నబడు చున్నది. అట్లగుట దీనిని గుఱించి వ్రాయుటయనిన మాచదువరులకు బొత్తిగా దూరమగు విషయమును ప్రదర్శించుట యగును కాని ఈ శాస్త్రసాహాయ్యములేక ప్రస్తుత కాలమున నాగరిక దేశముయొక్క జీవయాత్ర దుర్ఘటము. కాలమును స్థలమును అద్బుతవిధమున లోబఱచుకొన గలుగు రైలుమార్గములును, మహానావలును, టెలిగ్రాపు, టెలిపోను మున్నగు వార్తావహ యంత్రములును ఇంకను రానున్న విమానజాలమును అన్నియునుజేరి లోకము నంతటిని ఒక్క యింటివలె నొనర్చి యున్నవి. అన్నవస్త్రాదులు సమృద్ధిగ సమకూర్చుకొని వన్నెకలిగి జీవింపవలెనని ఎల్లజాతులవారికిని ఆశవొడమినది. " అదేశము అర్థవంతమై సంపద్యుక్తమై నెగడుచున్నదే ? మనదేశమేల ఇట్లు వలవంత లందుచుండవలెను ? సాధ్యమైనచో ఈ దుస్థితిని దొలగించుకొందము " అను తీర్మానము కొంచెము వెనుకబడి యుండు ప్రతిదేశముయొక్క పుత్రుల ఎడను కానవచ్చుచున్నది. ఈ తీర్మానము సఫలీకృతము చేసికొనుటకును నానాదేశముల యైశ్వర్య తారతమ్యంబు నెఱుంగుటకును మన మభివృద్ధి నొందుటకును అర్థశాస్త్రజ్ఞాన మవసరము.

గ్రంధ కర్త

అట్లగుట నీయర్థశాస్త్రమును మామండలికి వ్రాసియిచ్చుట కంగీకరించి శ్రమపడి మనదేశముయొక్క ఉపయోగమునకయి స్వతంత్ర గ్రంథమును రచించి యిచ్చినందులకు మ. రా. రా. కట్టమంచి రామలింగారెడ్డిగారిని అభినందించుచున్నారము. జగమెఱిగిన బ్రాహ్మణునకు జందెమేల ? వీరిని గుఱించి మేము పాఠకులకు పెంచిచెప్పనవసరమేలేదు. వీరు మానసిక సాంఘిక శాస్త్రములయందు ఈ దేశముననేగాక ఇంగ్లాండునందును కృషిచేసి జ్ఞానము సంపాదించి బహుసమర్థులయి బిరుదము లందినవారు. ఇక వీరిభాషాపాండిత్యమును అసామాన్యము. వీరు తెలుంగునను నుత్తమపరీక్షలలో నుత్తములుగ నుత్తీర్ణులై రనిచెప్పి విరమించినం జాలును.

అర్ధశాస్త్రభాగములు

లోకములోని సంపత్తంతయు అర్థమే. అర్థశాస్త్రమనునది లోకములో సంపత్తి ఎట్లుపుట్టునో ఎవరెవరు ఎట్లెట్లు దానిని అనుభవింతురో అట్టి అనుభవమునకు సాధనములేవియో విశదముగా విమర్శించును ఈ విషయములను బట్టియే అర్థశాస్త్రమున ముఖ్యభాగము లేర్పడియున్నవి. ఉత్పత్తికాండమనునది సంపదయొక్క పుట్టుకనుగుఱించి చర్చించును. విభజనకాండము అ పుట్టిన సంపద ఎవరిని ఎంత వఱకు చెందునో విశదపఱచును. వినిమయకాండము సంపత్తును ఒకరినుండి ఒకరికి మార్చునట్టి సాధనములను గుఱించి బోధించును. ఉపభోగకాండము సంపత్తు అదే అర్థము ఎట్లు వినియోగపడునో తెలియజేయును.

అర్థము

అర్థమునకు కొన్నిగుణములుకలవు. ఉపయోగకరములును, పరిమితములును, మార్చుకొనబడ గలవియునగు వస్తువులు అర్థము. ఉ. భోజనపదార్థములు, ఇండ్లు, బండ్లు, వస్త్రములు మొ. ఈ గుణములలో ఏదిలేకున్నను అది అర్థముకాదు. ఉ. గాలి పరిమితము కానందువల్లను, ధూళి ఉపయోగము కానందువల్లను బుద్ధి మార్చుకొనుటకు రానందువల్లను అర్థములుకావు.

అర్థమును ఉత్పత్తి చేసికొనుట అనగా మనుష్యునికి కావలసిన సామగ్రులను చేయుట. అతని ఆశ లనంతములు. కావున చేయబడవలసిన సామగ్రుల సంఖ్యయు అనంతము.

శ్రమ విభాగము

ఒక్కడే కొరముట్లు చేసికొనుటయు, బావి త్రవ్వుకొనుటయు, సాగు చేసికొనుటయు, వస్త్రములు నేసికొనుటయు, ఇల్లు గట్టుకొనుటయు పొసగదు. ఒక్కొక్క డొక్కొక్క సామగ్రిని అది పూర్తిచేయలేకున్న అందులో నొక భాగమునుచేసి అది కావలసిన వారనేకులకు దాని నందించి వారినుండి తనకు గావలసిన ఇతర సామగ్రులను సంపాదించుచున్నాడు ఇట్లు శ్రమవిభాగము ఏర్పడుచున్నది శ్రమవిభాగమువలన అభ్యాస మెక్కుడయి చాతుర్యాభివృద్ధియగుచున్నది. ఒక పనినుండి మఱియొక పనికి ఒకడే కర్మకరుడు మారవలసినపని లేనందున కాలనష్టమును కష్టనష్టమును దక్కుటయేగాక పనులు సత్వరముగను నగును. శ్రమవిభాగము కాను కాను ఇప్పటి పాశ్చాత్య కర్మశాలలయందువలె ఒక్కవస్తువు తయారగుట యనిన వేనవేలు కోటానుకోటులు తయారగుట యగును. ఇంతేకాక శ్రమవిభాగముచే ఎవరిశక్తికి తగినపని వారికి అలవడి సంఘీభావము కుదురుచున్నది.

అర్థశాస్త్రమునపాత్రలు

ఈ శ్రమవిభాగమువలననే సంఘమును ఇటీవలి అర్థశాస్త్రమును ఏర్పడినవని చెప్పవచ్చును. ఒక గుండుసూది మొనను తన జీవితకాలమంతయు తట్టివిడుచుచుండు కర్మకరుడును. ఇట్టి కర్మకరులను పదివేలమందినిచేర్చి పని తీసికొని లాభము సంపాదించుచుండు కర్తయు, పని జరుగుచుండునపుడు ఇందఱను పోషించుటకు ఇతనికి కావలసిన మూలధనమును సేకరించి పెట్టుకొనియుండు సాహుకారియు అధవా బ్యాంకులును, అందఱకును అన్నముపెట్టు ప్రకృతి శక్తులును అనగా భూమి మున్నగునవియును, సామగ్రుల నిక్కడనుండి యక్కడికి మార్చుచు కావలసినవారికి కావలసినవి అందజేయు వర్తకులును, వ్యాపార సంఘములును, భూమిని ప్రజలను ఒక్కటిగజేర్చి కలహము లేకుండదీర్చి వీరిలో వ్యవహారములకు వలసిన వినిమయ సాధనమగు అనగా సామగ్రులను సులభముగా మార్చుకొనుటకు సాధనమగు నాణెములను నియమించి చెలగు ప్రభుత్వములును అర్థశాస్త్రమునందు పాత్రములు.

సిద్ధాంతములు

ఈ పాత్రములకుగల పరస్పర సంబంధములను ప్రదర్శించుటయే అర్థశాస్త్రపు బని. వీనిలో ముఖ్యము మనస్సుగల నరుడగుటవలనను మనస్సుయొక్క తత్త్వము ఇదమిద్ధమని ఎప్పుడును నిర్ణయింప రానందునను ఈ అర్థశాస్త్ర సిద్ధాంతములలో గొన్ని ఆయా సందర్భములనుబట్టి నిర్ణయించుకొనవలసినవి యుండును.

ఉత్పత్తి

బ్రహ్మ సృష్టించునట్లు మనము క్రొత్తసామగ్రులను సృజించుటలేదు. మన చేయునదెల్లయు ఏమన ప్రకృతిలోనుండు వస్తువులనుగొని స్థలరూపములనుమార్చి సామగ్రు లొనర్చుకొందుము. ఉ. విత్తులను, ఎరువును, నీటినిచేర్చి వరిని సంపాదింతుము ప్రత్తిని పనిచేసి వస్త్రములుగ మార్చుకొనెదము. ఇట్లగుట ఉత్పత్తికి మూలాధారములు మనముచేయుపని. ప్రకృతి అనగా భూమి మొదలుగాగల స్వభావసిద్ధ నిర్మాణములు. అయిన మనము పనిచేయవలయుననిన ఇచ్చమాత్రమున పనిగాదు మనకు తదర్థమయి పెట్టుబడి భోజానాదుల రూపమునను కర్మాగారాదుల రూపమునను అవసరము. ఈ పెట్టుబడినే అర్థశాస్త్రమున మూలధనము. వుంజీ అను నామములచే వ్యవహరింతుము అప్పటికప్పుడు వ్యయమయిపోవు భోజానాదులవంటి మూలధనము చలము. కర్మాగారములవలె బహుకాల ముపయోగపడు మూలధనము స్థిరము అనబడుచున్నవి. మూలధనము మొదట ఎట్లు ఏర్పడె ననుటను గుఱించి మనము తర్కింప నిట నవసరములేదు. కాని ఒక్క విషయముమాత్రము చెప్పనగు. మూలధనమును, బుద్దియు రెండునుచేరి ఆర్థికలోకమునందలి అతికరినావస్థల నన్నిటిని బుట్టించినవి.

విభజనము - ఉపభోగము

ఉత్పత్తికి మూలాధారములగు ప్రకృతి, [1] పని, మూలధనము ఇవి మూటికిని ఉత్పత్తియందు భాగము కలదని వేరె చెప్పబనిలేదు.

దేశమును ఉత్పాతములనుండి రక్షించియు ఇతరవిధములను ఉత్పత్తుల సృష్టికి తోడ్పడుచుండు ప్రభుత్వములకును ఉత్పత్తియందు భాగముకలదు. ప్రకృతి, శ్రమ, మూలధనము, ప్రభుత్వము వీనికి ఉత్పత్తులందుగల భాగములకు వరుసగ గుత్త, కూలి, వడ్డి, పన్ను అను పేళ్ళు.

వినిమయము

ఆశలు మిక్కిలి పరిమితములయి ఉత్పత్తులసంఖ్యయు స్వల్పమయి వ్యవహారాదులు ప్రబలకయుండు అనాగరిక సంఘములయందు ఉత్పత్తిని పంచుకొనుట సాధ్యముకానోవు. నాగరికముహెచ్చి ఆశలు అనంతములయి ఉత్పత్తులు లెక్కకు మీరిన వెంటనే ఉత్పత్తులను మార్చుకొనుటకు వీలుపడక నాణెరూపమగు ద్రవ్య మను మధ్యవర్తి యవసరమగు చున్నది. ఈ నాణెములను నిర్మించువారు నిర్ణయించువారును ఎల్లెడలను ప్రభుత్వము వారగు చున్నారు. ప్రభుత్వములెల్లయు దైనికములు కావుగదా. కావున నాణెములవలన అర్థశాస్త్రమున ననేకాభ్యానములు వెలువడియున్నవి.

నాణెములువచ్చి వినిమయము అనగా సామగ్రుల మార్చుకొనుట హెచ్చిన కొలదిని లోకమంతయు ఒక్కటే ఇల్లగుపగిది వ్యాపారము విజృంభించినది. ఈ వ్యాపారమువలన నానాదేశములకు నుండవలసిన పరస్పర సంబంధములు తేలవలసి వచ్చినది. లోకవ్యాపారమున మనదేశము నిలుచునా క్రుంగునా యను భయము ప్రతిదేశమునకును పొడకట్టమొదలిడి దానివలన నిర్బంధవ్యాపారము అనిర్బంధ వ్యాపారము మొదలగు అభ్యాసములును వ్యాపార చట్టములును చిహ్నములును బయలుదేరినవి. ఇచి ఎల్లయు అర్థశాస్త్రాంతర్గతములే.

ఉపాఖ్యానములు

చెట్లునఱకు కూలివాడుమొదలు రాజ్యతంత్రమును నడపు మంత్రిపుంగవునివఱకు అందఱు చేయుపనికిని శ్రమయనియే పేరు. కాని ప్రజ్ఞావంతులగు కొందఱు అంత యెక్కువగ జ్ఞానసంపాదనముచేయని పెక్కురను లోబఱచుకొని మొదట మొదట సాహసముల జేతురు. పెక్కురును జ్ఞానవంతులయినతోడనే ఈపెక్కురకును అకొందఱకును ఘర్షణ తప్పదు. ఇదియే పాశ్చాత్యదేశముల సంభవించి యున్నది. ప్రకృతిని లో బఱుచుకొని మూలధనమును చేర్చుకొనిన ప్రజ్ఞావంతులగు కర్తలు కర్మకరులచేత (అనగా సాధారణపు కూలివారిచేత) పనుల చేయించుకొని కోటీశ్వరులయియున్నారు. కర్మకరులును రానురాను ఎక్కుడు జ్ఞానవంతులగుచు వచ్చుచుండుటచేత కర్తలతో తమ్మునుపోల్చుకొని వాఠిని ప్రతిఘటించుచున్నారు. ఇట్లు కర్తలకును కర్మకరులకును పొడమిన పోట్లాటల వలన కూలిసంఘములు, వీనిమీద నాదారపడియుండు 'సిండికలిజము' అను నూతన తత్త్వము, సంభూయ సముత్థానసభలు, సమిష్టివాదములు వెలువడినవి.

విజ్ఞాపనము

ఈసంపుటమునను ముందుసంపుటములయందును మాగ్రంథకర్తగారు ఈవిషయముల నన్నిటిని మానసికాది శాస్త్రములతో సమన్వయముచేసి భారతఅర్థశాస్త్రముగ రచించుచున్నారు. అభిప్రాయముల నెన్నయేని భేదములుండుట ఈ శాస్త్రమున వింతగాదు. కావున అట్టి భేదములను పాటింపక వాచక ప్రపంచ మీ గ్రంథమును వరించి శ్రేయస్సునందుదురుగాత :

సహాయ సంపాదకుడు,
కె. వి. లక్ష్మణరావు ఎం. ఏ.
  1. దీనినే అర్థశాస్త్రమున 'శ్రమ' యందుము.