భారతీయ నాగరికతా విస్తరణము/ఆఫ్‌గనిస్థానము

వికీసోర్స్ నుండి

భారతీయ నాగరికతా విస్తరణము.

3. ఆఫ్‌గనిస్థానము.

ఆఫ్‌గనిస్థానము ప్రాచీనకాలమున బ్రఖ్యాతి బడిసిన పర్షియా మున్నగు పశ్చిమ ఆసియాదేశములకును, హిందూ దేశమునకును నడుమనున్నది. ఇందుండిన కొంత కాలమునకు బిమ్మటనే యొక యార్యశాఖ భారతదేశమునకు వచ్చినది. పిమ్మట నీ భూభాగము పర్షియను, గ్రీకు, హైందవశక, హూణ, తురుష్క, ఆఫ్‌గను, మొగలు జాతీయుల వశమై విచిత్రమగు పరిణామమును గాంచినది. కాన నీ దేశమున వివిదజాతుల యొక్కయు వారివారి నాగరికతల యొక్కయు సమ్మిశ్రణము జరిగినది. సామీప్యతనుబట్టి యీదేశమునకు బ్రాచీన కాలమునుండియు భారతదేశముతో సంబంధమేర్పడినది. హిందూ దేశమునుండి బశ్చిమ ఆసియా దేశములకు బ్రకృతి దత్తములగు రెండుమార్గములేర్పడినవి. అందొకటి సింధునదియును కాబుల్‌నదియును గలయుస్థలమునుండి బయల్వెడలి, కాబూల్‌నదిననుసరించి, హిందూకుష్‌పర్వతములను దాటి, బ్యాక్ట్రియను మైదానము గుండా పర్షియాకు పోవుచుండెను. రెండవమార్గము సింధునది యొక్క క్రిందభాగమున బయలుదేరి సులేమాన్ పర్వతముల ప్రక్కగా కాందహర్ నగరముమీదుగా హీరట్ నగరమున కేగి, యటనుండి ఎల్‌బర్‌జ్ పర్వతములకు దక్షిణముగా పశ్చిమదేశముల కేగుచుండెడిది. వీనిలో మొదటి మార్గము మిగుల ముఖ్యమైనది. డరయన, అలెగ్జాండరు, సెల్యూకస్, కాడ్‌ఫైసిస్ మున్నగు హిందూదేశ విజేతలును, హ్యూన్‌ష్వాంగ్ మున్నగు ఇచ్చట పుస్తకములోని 16 వ పేజి ఉండవలయును. నుండిరని తృణీకారభావము జూపబడినది. అపస్తంభ, బౌథాయనులు, గాంధారపారసీకదేశములకు పోకూడదని శాసింసిరి.

పర్షియను విజయము = క్రీ. పూ. 522-486 నడుమ పర్షియా నేలిన డరయస్ అను రాజు బ్యాక్ట్రియా, గాంథార, సింధుమైదానములను తన రాజ్యమున చేర్చికొనెను. గాంధారదేశమునకును భారతదేశమునకు ననేకవిదములగు సంబంద ముండెడిది. భారతదేశమునందలి పదునారు మహా జనపదములలో గాంధార మొక్కటిగ పేర్కొనబడియున్నది. సంస్కృత వ్యాకరణ నిర్మాతయగు పాణిని యాదేశముననే జన్మించెను. బౌద్దజాతకములలోని రంగము లనేకము లచ్చటివే. ఇదిగాక హిందూదేశపు సరిహద్దులో తటగు, అపరిటై, శక, పర్షియను సామ్రాజ్య విభాగము లుండెడివి. వీనిలో తటగుదేశవాసులగు దర్దెస్ అనువారు మహాభారతమునందు నితర సంస్కృతగ్రంథములందును దరదులని పేర్కొనబడియున్నవారు, శక యను ప్రదేశమున కాస్టిడిం అను జాతి యుండెడిది. పాణని కౌటిల్యుడు, మున్నగువారు వీరిని కాపిశులని పేర్కొనియున్నారు.

అలెగ్జాండరు విజయము :- ఈయవనవిజేత భారత దేశముపై దండెత్తివచ్చిన సమయమునం దఫ్‌గనిస్థానముపై హిందూదేశ ప్రభావము ప్రబలముగనుండినది. ఆకాలమున హిందూకుష్ పర్వత ప్రాంతమును శశిగుప్తుడను నత డేలుచుండెను. అపెసినియ్, అస్సికులు నను తెగలవారు బ్రకృతకునార్, పాన్‌జ్‌కోరా, స్వాత్‌నదితీరములం దుండిన భారత జాతీయులు. ఇచ్చట ననేకస్థలములకును నదులకును హిందూనామము లుండెడివి. సువాస్తు, గౌరీనదులును పుష్కరావతీ నగరము నిందు కుదాహరణములు. మహాభారతమునం దొకచో (5-9-333) నదీవర్ణనమునం దీనదులుగూడ పేర్కొనబడియున్నవి. మౌర్యయుగము :- అలెగ్జాండరు మరణించిన పిమ్మట నాతని సేనానులలో నొకడగు సెల్యూకస్ యవనరాజ్యమునందలి తూర్పుభాగమును స్వాధీనము జేసికొనెను. ఉత్తర హిందూదేశమునం దప్పుడే దలయెత్తిన చంద్రగుప్త మౌర్యుని ధాటి కాగలేక నీ యవన సేనాని పరోపనినది, అరియానా, అరకోసియా యను విభాగముల నాతని కొసంగి సంధి చేసికొనెను. ఈ మౌర్యులు బశ్చిమోత్తర ప్రాంతసంరక్షణార్థమై తక్షశిలానగరమునం దొక రాజ ప్రతినిదిని నియమించిరి. అప్పటినుండియు నా నగరమునుండి హైందవ నాగరికత బశ్చిమమునకు విస్తరించినది. అశోకచక్రవర్తి పరిసరములనుండు స్వతంత్రరాజ్యములకే గాక యవన, కాంభోజ, గాంధారదేశములలోని తన యేలుబడి క్రిందనుండిన భూభాగములకు గూడ బౌద్దభిక్షువుల నంపియు, ధర్మమహామాత్రులను నియమించియు, మతప్రచారమొనర్చెను. క్రీ. శ. 7 వ శతాబ్దమున భారతదేశము బర్యటన మొనర్చిన హ్యూన్‌ష్వాంగ్ అను చైనాయాత్రికుడు కపిశానగరరాజ్యమునం దశోకుడు స్థూపములను గట్టించెనని చెప్పియున్నాడు.

యవనరాజులు :- అశోకునిబిమ్మట శుభసేనుడను హిందూరాజు హిందూకుష్‌పర్వత ప్రాంతమును వశపఱచుకొనెను. తరువాత 'డెమిట్రియస్‌' అను యవనరాజు కాబూల్, అరకోషియా, పంజాబులను జయించెను, అటుపై యూక్రటైడిస్ అను నాతడు కపిశ గాంధార రాజ్యములనుగూడ జయించెను. ఈ యవనరాజులకాలమున హిందూదేశ నాగరికత ప్రబలినది. వీరు తమ నాణెములపై నామములను ప్రాకృతభాషలో బ్రాహ్మీ, ఖరోష్ఠీలిపులతో ముద్రించిరి. "కావిశియె నగర దేవతా" యను నొక నాణెముపై వ్రాతనుబట్టి యీకాలమున సుదూరమునందుండిన కపిశానగరమున బ్రాకృతభాష వ్యాప్తిలో వుండెనని తెలియుచున్నది. శకరాజులు :- వీరు యవనులను జయించి భారతదేశబశ్చిమోత్తరభాగమున కదిపతులైరి. పిమ్మట యూఏచీ తెగకు జొందిన కుషానురాజులు వీరినణంచి తాము ప్రబలిరి. వారిలో నగ్రగణ్యుడగు కనిష్క చక్రవర్తి కాలమునం దిప్పటి ఆఫ్‌గనిస్థానములోని కాబూల్, కాందహార్‌లును, గాంధారమును - మద్య ఆసియాలోని కాష్‌ఘర్, యార్‌ఖండ్, కోటానులును కాశివరకునుగల యుత్తర హిందూదేశమును గలసి యొక మహాసామ్రాజ్య మేర్పడెను. ఈసమయమునందిట ననేక నాగరికతలు కలసినవి. కనిష్కునిచే బునరుద్దరింపబడిన బౌద్దమతము బశ్చిమోత్తరముగ వ్యాపించి, యటనుండి బ్రాగుత్తరముగ మధ్యఆసియాను బ్రవేశించినది. గాంధారమున నొక క్రొత్తశిల్పపద్దతి బయల్వెడలెను. ఆఫ్‌గనిస్థానమున గనుగొనబడిన స్థూపములపై శాసనములనుండి థియోడోరస్ అను నొక యవనోద్యోగియు, వెస్‌పేసి కపిశామండలముల పాలకులునుగూడ నీకాలమున బౌద్దులైయుండిరని తెలియుచున్నది.

దీనినుండి ప్రాచీనకాలమున భారతవర్షము సింధునదికి బశ్చిమమున, హిందూకుష్‌పర్వతముల కావలివరకునుగూడ వ్యాపించియుండెనని స్పష్టమగుచున్నది. క్రీ. శ. 11 వ శతాబ్దము వరకునుగూడ బ్రకృత ఆఫ్‌గనిస్థానములోని ప్రాగ్బాగమంతయు నుత్తరాపథముగనే బరిగణింప బడుచుండెడిది.

ఆఫ్‌గనిస్థానమునందలి బౌద్దనిర్మాణములు :- ఒకరి వెంబడి నొకరుగా నేగుదెంచిన యనేక విజేతల ధాటికినశింపగా మిగిలిన బౌద్దశిధిలము లెన్నియో యిచ్చటగలవు. ఈ విషయమున బ్రకృత జలాలాబాద్ మైదానము ముఖ్యమైనది. దీనికిబూర్వము నగరహారమనిపేరు. ఇచ్చటి కైదుమైళ్ళదూరములోనున్న హద్ద యనుచోట నొకచక్కని స్థూపముగలదు. ఇయ్యది బుద్దదేవుని పుఱ్ఱెయెముకపై నిర్మింపబడినది. ఇందుగాంధార పద్దతి శిల్పము లనేకములుకలవు. కాబూల్‌నగరముచెంత గొన్ని బౌద్ద నగరీశిదిలములున్నవి. కపిశానగరమున కనిష్క చక్రవర్తి యాస్థానమునందుండిన చైనారాయబారులచే నిర్మింపబడిన స్థూపమును, హ్యూన్‌ష్వాంగ్ వర్ణించిన యితరకట్టడములును గనుగొనబడినవి. హిందూకుష్ పర్వతముల నంటియున్న బమియన్ నగరమువద్ద కొండలలోనెన్నియో విహారములు, మహోన్నతములగు బుద్దవిగ్రహములగు బుద్దవిగ్రహములు నున్నవి.

తురుష్కులు :- క్రీ. శ. 5 వ శతాబ్దిలో నీభూమియంతయు హూణులకు వశమైనది. స్వపక్షపరపక్ష నిర్దూమధాములై యీక్రూరు లిట నవనవలాడుచుండిన భారతీయనాగరికతను ధ్వంసముగావించిరి. ముఖ్యముగ గాంధార ఉద్యానరాజ్యములకు వీరివలన గొప్పకీడుగల్గెను. 6 వ శతాబ్దమున తురుష్కులు హూణులను బారదోలి యీప్రదేశము నాక్రమించిరి. హ్యూన్‌ష్వాంగ్ కాలమున హిందూకూష్‌పర్వతములకు బశ్చిమమున 27 చిన్న రాజ్యములుండినవి. ఈ తురుష్కప్రభువులు బౌద్దమతమును విశేషముగ నాదరించిరి. క్రీ. శ. 626 లో 'షిహూకగన్‌' అనునతడు చైనాదేశమున ధర్మప్రచార మొనర్పనేగుచుండిన ప్రభాకరమిత్రుని, పిమ్మట చైనానుండి-భారతదేశమున కేతెంచుచుండిన హ్యూన్‌ష్వాంగ్‌నుగూడ మిక్కిలియాదరించెను. 7 వ శతాబ్ది మధ్యభాగమున హిందూదేశమునకు వచ్చిన 'పూకుంగ్‌' అను నొకభిక్షువు కాశ్మీరగాంధార దేశములలో నొకతురుష్కరాజు నాతనిభార్య పుత్రులును గట్టించిన దేవాలయములనుగాంచెను. కుస్‌డుజ్ అనుభాగమున జనులు విశేషముగ బౌద్దులైయుండిరి. బాల్‌ఖ్ రాష్ట్రములో 3000 మంది భిక్షువులుగల 100 విహారములీకాలము నందుండెడివి. హిందూకుష్‌పర్వతములకు గొంచెముత్తరముగ నుండిన నవసంఘారామమున గౌతమబుద్దుని స్నానపాత్రమును, దంతమును బదిలపరుపబడియున్నవి. బాల్‌ఖ్‌రాష్ట్రమునకు రాజగృహమను నగరము రాజధానిగ నుండినది. ఇయ్యది మగధదేశము నందలి యానామముగల నగరమునకు బ్రతికృతి. గజ్ అను విభాగమున పెక్కువిహారములును, స్వరాస్తివాదులగు 300 మంది సన్యాసులు నుండిరి. బమియన్ రాష్ట్రము మిగుల ముఖ్యమైనది. ఇది లోకోత్తరవాదులగు బౌద్దులకు స్థానము. ఇచ్చట పరినిర్దాణబుద్దువిగ్రహ ముండినది. కపిశారాజ్యమున మహాయానశాఖీయు లుండిరి. క్షత్రియుడగు నిచటిరాజు లంపాక, నగరహార, గాంధారములపైగూడ నధికారమును నెరపుచుండెను. 'ఈత్‌సింగ్‌' అను మఱియొక చైనాయాత్రికు డీ బశ్చిమోత్తరభాగములనుండి యనేకు లార్యావర్తనమునందలి పుణ్యక్షేత్రముల కేగుచుండిరని వ్రాసియున్నాడు. బుద్ధగయలో నమర్‌ఖండ్, టొఖరిస్థానము, కపిశామున్నగు దేశముల ప్రజలు దమ దేశీయులగు యాత్రికులసౌకర్యములకై వసతులను గట్టించిరట.

క్రీ. శ. 7 వ శతాబ్దినాటికి యీఆఫ్‌గనిస్థాన ప్రాంతమున బౌద్ద మతమేగాక నితరమతములుగూడ వ్యాపించినవి. వీనిలో శైవమతము ముఖ్యమైనది. గాంధారదేశమున దొరికిన యొక ఖరోష్ఠిశాసనమునుండి యచ్చట ఉరుమజుని పుత్రుడగు మొయికుడను నతడు కుషాన్‌రాజగు రెండవకాడ్ ఫెసిస్ కాలమునందొక శివాలయమునకు దాన మొసంగెనని తెలియుచున్నది. ఈకుషాన్‌రాజు నాణెములపై నొకవైపున శివునిప్రతిమ గలదు. బౌద్దమతధ్వేషి యగు మిహిరగులుడు శైవమునెడ నాదరమును జూపెను. కాన హ్యూన్‌ష్వాంగ్ కపిశారాజ్యమున పెక్కుబ్రాహ్మణదేవాలయములను, పాశుపత, కాపాలిక శైవులను గాంచెను. ఇట్టియాలయములు లంపాక, నగరహార, జొగుడ, అంతరాబ్ మున్నగు రాష్ట్రములలోగూడ నుండెడివి.

ఇస్లాము విజృంభణము :- 7 వ శతాబ్దిలో ఆఫ్‌గనిస్థానమును చైనాటిబెట్‌దేశీయులును, మహమ్మదీయులగు నరబ్బులును వరుసగా జయించిరి. క్రీ. శ. 663 లో నీఇస్లాముమతస్థులు సుప్రసిద్దమగు నవ విహారసంఘారామమును నాశమొనర్చి కాబూల్‌ను బాల్‌ఖ్‌ను వశపరచుకొనిరి. 8 వ శతాబ్దమున నీ చంద్రద్వజులు బెలూచిస్థానమును జయించి పంజాబులోని ముల్తానువరకును విజృంభించిరి. అనతికాలమునకే బమియన్ రాజ్యమును మహమ్మదీయమతము నవలంభించెను. ఈదేశమిట్టి విప్లవములకులోనైనను భారతీయ నాగరికత యిట బూర్తిగా నశింపలేదు. క్రీ. శ. 753 లో గాంధారమున సుఖావతి పద్మావతియను రెండువిహారము లుద్యాననగరమునం దుండినవి. క్రీ. శ. 785-810 ల మధ్య కుభా (కాబూల్) నగరవాసియగు ప్రజ్ఞుడను శ్రమణుడు కొన్నిబౌద్దగ్రంథములను చైనాభాషలోనికి తర్జుమాచేసెను. నగరహారమునందలి యొక బ్రాహ్మణకుటుంబమునకు జెందిన వీరదేవుడనుభిక్షువు మహాబోధీయాత్రనుజేసి పిమ్మట వంగ రాజగు దేవపాలునిచే నాలందా విద్యాపీఠమున కధ్యక్షుడుగ నియమింపబడెను.

9 వ శతాబ్దిలో పర్షియాదేశమునుండి మఱియొక మహమ్మదీయ విజయతరంగ మేతెంచి ఆఫ్‌గనిస్థానము నంతటిని గలంచివైచెను. క్రీ. శ. 870 ప్రాంతమున కాబూల్‌రాజ్యమును తురుష్కజాతికి జెందిన షాహియ వంశీయు లేలుచుండిరి. వీరు బౌద్దులు. ఇందు కడపటిరాజును తుదముట్టించి యాతని మంత్రియగు 'లల్లియ' యనునతడు రాజ్యమును వశపరుచుకొనెను. ఈ లల్లియకు నీతని సంతతివారికిని "ఒహింద్‌అగర్ హిందూషాహియు" లని పేరు. దక్షిణహిందూ దేశమునందలి విజయనగర రాజులవలె నీవంశపు రాజులు హిందూమతోద్దరణ దీక్షితులై మహమ్మదీయులతోబోరి. తుదకు దమసర్వస్వమును గోల్పోయిరి. లల్లియ సింహవ్యాఘ్రములబోలు దరదతురుష్క రాజ్యముల మధ్యనుండిన తన రాజ్యమును కడునిపుణతతో గాపాడుకొనెను. గాంధారము, ఉద్యానము, పంజాబులోని గొంత భాగము నిందు చేరియుండినవి. ఈవంశీయులలో కడపటివారికి - గజినీ సుల్తానులతో పోరాటము సంభవించినది. వీరిలో జయపాలుని పుత్రుడగు ఆనందపాలుడు వ్యాకరణశాస్త్రము నాదరించెను. శత్రువగు గజనీ మహమ్మదునెడ నీహిందూరాజు విశేషమగు దయనుజూపెనట. ఆనందపాలుని పుత్రుడగు త్రిలోచనపాలుడు తౌషీనదీతీరమున మహమ్మదుతో నొక ఘోర యుద్ధ మొనర్చెను. ఇందు విజయలక్ష్మి మహమ్మదీయులనే వరించెను. తళ్ళి కోటయుద్దానంతరము విజయనగరమువలె నీహిందూషాహియుల రాజధానియగు ఉదభాండపురము మహమ్మదీయులచే నాశమొనర్పబడెను. మిగిలినరాజ్యమంతయు వారికి సులభముగ వశమయ్యెను. ఇంతటితో ఆఫ్‌గనిస్థానమందలి భారతీయనాగరికతా విస్తరణచరిత్ర మంతమగు చున్నది.


________________