భక్తిరసశతకసంపుటము/రెండవసంపుటము/సూర్యనారాయణశతకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పీఠిక

ఈ సూర్యనారాయణశతకమును వరాహవేంకటనృసింహకవి రచించెను. ఇతఁడు భారద్వాజ గోత్రుఁడు, బ్రాహ్మణుఁడు. జగన్నాయకశతకము రచించిన వరాహగిరి కొండరాజు నీతఁడు నేకగోత్రులె గాని యిరువురును తమ పూర్వులను జెప్పికొనకపోవుటచే నిందెవరు పూర్వులో యిరువురకు గల సంబంధమెట్టిదో యెఱుఁగ వీలు కాలేదు.

"శ్రితసంపత్సుమవల్లియౌ సరసవెల్లిన్" అను పద్యమువలనఁ గవి నరసవెల్లిలోని సూర్యనారాయణస్వామిని గూర్చి యీశతకము రచించెనని యూహంపనగునుగాని నరసవెల్లి యెచట నున్నదో కవి సంబంధు లెవరేని యటఁ గలరేమో తెలియవచ్చుటలేదు. తత్రత్యు లీవిషయమునఁ బ్రయత్నించి కవిజీవితము ప్రచురించుట యవసరము.

ఈ సూర్యనారాయణశతకము భాష జటిలముగ సాంస్కృతిక సమాసబంధురముగ నున్నది. కొన్నిచోటుల పద్యమునంతటి నాక్రమించికొనిన సమాసములు గలవు. భావములు స్వతంత్రములై రమణీయములై యున్నవి. సూర్యభగవానుని తేజోవిభ వములు, ప్రభావములు, శక్తిసామర్థ్యములు పురాణకథలు ఒక్కొక్కపద్యమున నొక్కొక్కరీతిగాఁ గవి వర్ణించి తనకవితానైపుణ్యము సాటియున్నాఁడు. ఇందలి పద్యములు స్వతంత్రము లనియుఁ బ్రాతస్స్మరణీయము లనియుఁ దలంచుచున్నారము.

ప్రశస్తమగు నీశతకము ప్రచురించిన వావిళ్లవా రాంధ్రజనులకు వందనీయులు.

నందిగామ.

ఇట్లు,

1-1-25

శేషాద్రిరమణకవులు, శతావధానులు.

శ్రీరస్తు

సూర్యనారాయణశతకము

శా.

శ్రీమత్సర్వసుపర్వసేవితము లై క్షేమాంగలక్ష్యంబు లై
ధామధ్వస్తసమస్తలోకనిబిడధ్వాంతంబులై మించునీ
రామాఘ్రుల్ గొనియాడి వృత్తశతకగ్రంథంబు నీ కింపుగాఁ
బ్రేమన్ గూర్చెదఁ జిత్తగింపు మెలమిన్ శ్రీసూర్యనారాయణా.

1


శా.

భారద్వాజపవిత్రగోత్రజుఁడ విప్రశ్రేష్ఠవంశ్యుండ వి
ద్యారక్తుండ వరాహవేంకటనృసింహాఖ్యుండ సద్భక్తి నిం
పారం గొల్చుచు నీకు వృత్తశతకం బర్పింతు వాగ్దోషముల్
నేరం జూచి కృపన్ సహింపు మదిలో శ్రీసూ...

2


మ.

అరయన్ బావనమైన యీశతకపద్యవ్రాత మాలించినన్
బరమప్రీతిఁ బఠించినన్ బుధులు నీపాదాంబుజధ్యాతలై
దురితధ్వాంతవిముక్తి గాంచి శుభముల్ తోడ్తోఁ బ్రవర్తింప నీ
చిరకారుణ్యమతిన్ సుఖంతు రెపుడున్ శ్రీసూ...

3


మ.

శ్రితసంపత్సుసుమవల్లి యౌనరసవిల్లిన్ మల్లికాద్యుల్లస
ల్లతికావేల్లితసాలమూలకుసుమారామస్ఫురద్ధేమని

ర్మితగేహంబునఁ బద్మినీముఖసతుల్ సేవింప ధాత్రీసురా
ర్చితలీలాకృతి నొప్పునిన్నుఁ దలఁతున్ శ్రీసూ...

4


శా.

శ్రీమత్పద్మసముద్భవాదితనువుల్ చేకొంచు నెవ్వాఁడు నా
నామాయల్ గనుపట్ట ముజ్జగములన్ గావించి రక్షాలయ
వ్యామోహంబున నొప్పునట్టి నిగమవ్యాలీఢపాదాబ్జునిన్
బ్రేమగా గన్గొని సంస్మరింతు మదిలో శ్రీసూ...

5


శా.

ఛాయాదిప్రియకాంతలన్ మధురభాషాలీలచేఁ దన్పుచుఁన్
,గాయం బుజ్జ్వలమై పరిష్కృతపరిష్కారంబునై మించ లో
కాయాసంబు లణంచి దుర్మదబలవ్యాసంగిదైత్యోత్కరా
జేయస్ఫూర్తి నెసంగు నిన్నుఁ దలఁతున్ శ్రీసూ...

6


శా.

వేదప్రోక్తనమస్కృతు ల్సలుపుచున్ బృథ్వీసురు ల్మెచ్చి నీ
పాదాబ్జస్మరణైకనిత్యభజనాపారీణులై నిల్వఁగా
ఖేదంబు ల్తొలఁగించి వారలకు నుత్కృష్టాపవర్గం బవి
చ్ఛేదాసక్తి నొసంగు నిన్నుఁ దలఁతున్ శ్రీసూ...

7


మ.

అకలంకస్ఫటికంబు నూతనజపోద్యద్దీపి నాగంతుక
ప్రకటచ్ఛాయ ధరించినట్లు జలగోళం బౌటఁ జంద్రుండు నీ

సకలోస్రంబులు దాల్చి షోడశకళాసంపూర్ణుఁడై ధ్వాంతమా
లికలెల్లన్ బరిమార్పుచున్ దిరుగఁడే శ్రీసూ...

8


మ.

అవనిన్ భూసురవర్యు లవ్విధినిషేధాచారసంసక్తులై
సవనాదిక్రియ లగ్నిహోత్రజపముల్ సంధ్యానమస్కారముల్
శివపూజ్యముగా ఘటించి నిఖిలక్షేమంబు లర్థించుచున్
శివరూపుండ వటంచు నెంతురు గదా! శ్రీసూ...

9


మ.

భవదుస్రంబులు కాలవేగమున శుంభద్వ్యోమభాగంబునన్
బవనోద్ధూతములై ఘనంబు లగుచున్ బాటిల్లి నిర్ఘాతలై
రవరావంబు లెసంగ భూరిజలధారావృత్తి రక్షింపవే
నృవరు ల్మెచ్చఁగ సస్యపంక్తి నెచటన్ శ్రీసూ....

10


శా.

లోకాలోకము దాఁటి చండకిరణాలోక్యస్వకాయప్రభా
నీకం బొప్ప ననేకలోకతిమిరోన్మేషంబు వారించి య
స్తోకాసక్తి నశేషజంతుతతి నెంతో బ్రోచు నిన్ జిత్తనా
ళీకాభ్యంతరసీమ నిల్పి కొలుతున్ శ్రీసూ...

11


మ.

ఖనటత్త్వత్కరదీపమూర్తు లగుచున్ గన్పట్టు చంద్రాదులన్
గనుఁగొంచున్ గణకుల్ సుఖార్తిఫలసంధాతల్ గదా యంచు గొ
బ్బున నూహింతురు కూడునే భువనముల్ పుట్టించి రక్షించి త్రుం
చి నటింపంగలకర్త వీవు గలుగన్ శ్రీసూ...

12

మ.

 హరిపాదంబునఁ బుట్టి దేవనది పూతాకారయై తా మహే
శ్వరమౌళిన్ విహరించుచాడ్పునఁ జతుర్వక్త్రాననోత్థంబు లై
గిరులై వేదము లాత్మమండలమునన్ గీర్తించుచున్ నిల్వఁగా,
సిరులన్ బెంపగుచున్న నిన్నుఁ దలఁతుం శ్రీసూ...

13


మ.

అనలప్రాప్తనిజోచితాహుతులు నీ కర్పించి బర్హిర్ముఖుల్
వెనువెంటన్ గొనియాడి బ్రహ్మమని భావింపంగ వేఱొక్కదే
వునిఁ గైవల్యమొసంగుమంచుఁ గుజనవ్యూహంబుతోఁ గోరినన్
వినువారందఱు నవ్వకుందురె ననున్ శ్రీసూ...

14


మ.

జలజన్యాదినిజాంగనాముఖసరోజాతంబులం జెంది ని
శ్చలసరంగము లైనచూపులఁ గృపాసారంబు వర్షించి చం
చలభక్తోత్కరతాపపావకశిఖాసంఘంబుఁ జల్లార్చుచున్
జెలువొందన్ గనుపట్టునిన్నుఁ గొలుతున్ శ్రీసూ...

15


మ.

స్వకళాచాతురి నైంద్రజాలికుఁడు నాసారంధ్రమార్గావరో
ధకనాళంబులఁ గుంభనీరముఁబలెన్ ధాత్రీజలం బెల్ల ది
వ్యకరౌఘంబునఁ బూని యభ్ర మయి యయ్యప్పున్ విసర్జించుచున్
వికృతు ల్మాన్చి వెలుంగు నిన్నుఁ గొలుతున్ శ్రీసూ...

16

మ.

హరిసక్తిన్ జనవృత్తిఁ గాంచి యరుణోద్యద్దీప్తిఁ బెంపారి ని
ర్జరకోటుల్ జయశబ్దపూర్వకనమస్కారంబు లర్పింప నం
బరమార్గంబున నేగు నీరథగతప్రస్ఫీతచక్రంబు సు
స్థిరతన్ మించు సుదర్శనంబుకరణిన్ శ్రీసూ...

17


శా.

రక్తశ్వేతవినీలవర్ణములచే రంజిల్లు కాలత్రయ
వ్యక్తస్వాకృతి పంకజోదరపురార్యంభోరుహాక్షప్రభా
యుక్తిన్ దత్కృతవాసకాలమునుఁ దద్యోగంబుఁ దెల్పం గృపా
రిక్తస్వాంతముతోడఁ జూడఁదగునే శ్రీసూ...

18


మ.

జలకుంభాతర్యములందు నభముం జందాన జంతూత్కరో
జ్జ్వలదంతఃకరణంబులన్ బ్రతినిధి వ్యాపారమున్ జూపి పెం
పలరన్ బ్రాణివితానమై మునిమనోధ్యానార్హరూపంబు రం
జిలఁ గన్పట్టెడు నీ కొనర్చెద నతుల్ శ్రీసూ...

19


మ.

త్రుటి యైనన్ జెడకుండ షష్టిఘటికారుద్ధంబు లౌచున్ సము
త్కటవృత్తిన్ దినరాత్రముల్ సమము లై కల్పాంతపర్యంత మె
చ్చటఁ గానంబడు నెవ్విభుం డఖిలవిశ్వధ్యేయచిద్రూపుఁ డై
నిటలాక్షంబున మించు నీవు గలుగన్ శ్రీసూ...

20


మ.

జగతిన్ వార్షికవృష్టి నంకురతతిచ్ఛాయన్ జికీర్షోన్నతిన్

జగము ల్గ్రక్కున నీపయిం బొడముచున్ వర్తించుచున్నన్ జిహీ
ర్షఁ గృశానుండు జలంబునంబలె నదృశ్యస్ఫూర్తి వాటింపుచో
నిగమంబుల్ దెలుపంగ శక్యమె నినున్ శ్రీసూ...

21


మ.

మునిదిగ్భర్తలు విష్ణుశంకరులనం బూజ్యుం డజుం డంబికా
వనజాతేక్షణ యోగమాయ ఖచరవ్రాతాగ్రగణ్యుండ వీ
వనుచుం బల్కు పురాణశాస్త్రములు సత్యం బంచు నార్యుండు కో
రినకోర్కుల్ కొనసాగ నిన్నుఁ గొలుచున్ శ్రీసూ...

22


శా.

వేదంబుల్ భవదీయబింబగము లై వెల్గొంది యేవేళ నీ
పాదధ్యానము సేయుచున్ గనుచు ని న్భావింపలేకున్నచో
భేదజ్ఞానముచేత నా కెటులొకో వేద్యంబు లై యుండు సు
శ్రీదాకారము లైననీదుపదముల్ శ్రీసూ...

23


మ.

కులిశాబ్జాంకుశఖడ్గచక్రజలరుట్కోదండమత్స్యధ్వజా
ద్యలఘుప్రస్ఫుటరేఖ లొప్ప విమలోద్యద్రక్తశాంతిచ్ఛటా
కలనోత్కృష్టము లై యజాదిసుమనోగమ్యంబు లై కూడి వ
ర్తిలు నీదివ్యపదంబు లాత్మఁ దలఁతున్ శ్రీసూ...

24


మ.

ఉదయాద్రిన్ గనుపట్టి జలజవ్యూహంబుతో జంతువుల్
ముదమొందన్ భటవర్గమోహతమమున్ లోకాంధకారంబుతోఁ

దుదిముట్టన్ విదలింపుచున్ భువనబంధుత్వంబు వాటించు నీ
మృదుపాదాంబుజముల్ దలంతు మదిలో శ్రీసూ...

25


శా.

ఆయుర్దాయ మణంచి మానవులు పుణ్యాపుణ్యరూపక్రియల్
సేయంజూచుచు సాక్షివై నిలిచి యక్షీణప్రభావోన్నతిన్
గాయంబుల్ పడఁద్రోచుచున్ యముఁడ వై నాకాదిలోకస్థితుల్
దేయప్రక్రియ సంఘటింతువు గదా శ్రీసూ...

26


మ.

సుతదారాద్యవసంబె ముఖ్య మని చూచున్ శాశ్వతం బంచు సం
తత మజ్ఞాని బుధుండు శోకరహితానందామృతోద్యోగసం
గతి కర్తవ్య మటంచు నాగమశిఖాగమ్యత్వదంఘ్రిద్వయా
ర్పితచిత్తంబున నర్తనంబు సలుపున్ శ్రీసూ...

27


మ.

అరుణత్వంబును బంకజాతదళనవ్యాపారమున్ శ్రీమనో
హరరూపంబును దేవతామకుటరత్నౌఘప్రతిచ్ఛాయయున్
దరచక్రాసిధనుర్ముఖప్రబలనానాచిహ్నము ల్దాల్చి మిం
చిరి నీవున్ భవదంఘ్రు లొక్కకరణిన్ శ్రీసూ...

28


మ.

సునిదాఘవ్యథఁ జిక్కి చాతకము సంక్షోభించి నీలాభ్రద
ర్శనముం గోరినమాడ్కి భూరిభవసంజాతార్తి నే నెంతయుున్

దనటన్ గుందుచు నిష్టమొందక మదిన్ బ్రార్ధించి తేవంకఁ జూ
చిన యుష్మద్దయ దక్క యొండు గలదే శ్రీసూ...

29


మ.

ఇలఁ దీవ్రాతపబాధ కోర్వక నరుం డెంతే వడిన్ బాఱి చెం
తల నున్నట్టికుజంబుఁ జేరుగతి నానాఘోరసాంసారిక
జ్వలనజ్వాలలఁ జిక్కి మానవుఁడు సంజాతార్తి నీపాదముల్
విలసద్భక్తిఁ దలంచి కొల్పును గదా శ్రీసూ...

30


మ.

కలికాలంబున భక్తియోగమహిమన్ గైవల్య మర్థించి యా
ర్యు లమేయశ్రవణక్రియావిముఖులై యుష్మత్కథాజాలమున్
బలుమాఱున్ బఠియించి నిత్యము భవత్పాదాంబుజధ్యాన మ
ర్మిలిఁ గావింపుచు ముక్తు లౌదురుగదా శ్రీసూ...

31


మ.

అరవిందప్రభవాభవప్రముఖసర్వామర్త్యవర్యుల్ భవ
త్పరమప్రాభవసాగరోర్మికలనాప్రాదుర్భవాంభఃకణో
త్కర మొక్కుమ్మడిఁ గ్రమ్మినన్ వివశులై కన్పింతు రేనెంత చె
చ్చెరఁ గారుణ్యముతోడఁ బ్రోవఁ దగదే శ్రీసూ...

32


శా.

మాయాపింఛికఁ దాల్చి కౌతుకముతో మాయావిచందంబునన్
ద్రోయన్ రాని తమోవిభూతి జగతిన్ దోరంబుగా నింపి యే
చాయన్ మూల మెఱుంగనీక మహిమన్ సర్గాదికృత్యంబులన్
జేయం జాలిన నీ కొనర్చెద సతుల్ శ్రీసూ...

33

శా.

నీనామస్మరణంబుచేత దురితానీకంబు మాద్యద్బృహ
ద్భానుజ్వాలల శుష్కదావముగతిన్ భస్మీకృతం బై జనం
దా నత్యంతవిశుద్ధబుద్ధిఁ దగి నీదాసుండు హృత్సారసా
సీనుం జేయుచు నిన్భజించునుగదా, శ్రీసూ...

34


మ.

అమనోవాక్ప్రతిపాద్యుఁ డంచు శ్రుతు లుద్చ్ఛక్తి దెల్పంగ న
క్రరువృత్తిన్ మదిలో స్మరించుచు నవార్యస్ఫూర్తి గీర్తించినన్
సుమనీషుల్ దగ దండ్రు దోషము ఘటించున్ గాన ని న్నెంతయున్
విమలజ్ఞానఫలోపలబ్ధిఁ గొలుతున్ శ్రీసూ...

35


మ.

అభవేభాస్యహరీనచండికలలో నాద్యుండ వీవంచు నొ
క్కభవద్భక్తియ ముక్తిహేతువని వేడ్కంగోరి యుష్మత్పద
ప్రభవప్రాభవముల్ గణించుచున్ మదిన్ బ్రార్థించి తెబ్భంగి భూ
రిభవాంభోధిఁ దరింపఁజేసెదొకదా శ్రీసూ...

36


శా.

కామక్రోధమదాదిశత్రువులు వీఁక న్మూఁకయై తాఁకి చే
తోమాలిన్య మొనర్పఁ దత్కలుషచిత్తు ల్బోధనిర్ముక్తులై
నీమంత్రంబు జపించి నీచరణముల్ నిత్యంబు సేవించుచున్
బ్రేమన్ బంధవిముక్తిఁ గాంతురుగదా శ్రీసూ...

37

శా.

ప్రావృట్కాలము దోఁచువేళ నసితాభ్రశ్రేణు లభ్రంబునన్
భావింపం బ్రభవించుమాడ్కిఁ దరితో నానాప్రవృత్తు ల్మదిన్
బ్రోవు ల్గట్టి జనించు బద్ధు లగుజీవు ల్ముక్తు లౌచున్ భవ
త్సేవం జేసి వడిన్ సుఖింతురు గదా శ్రీసూ...

38


మ.

భ్రమ శుక్తిన్ గనుపట్టు రాజతములీలన్ దోఁచె నీయందు లో
కము లజ్ఞానసమృద్ధి నంచు బుధవర్గం బెంచి తత్త్వప్రబో
ధము రంజిల్ల భవత్పదాంబురుహముల్ ధ్యానించి నీలోన వా
రిమహాబ్ధింబలె నైక్య మొందును గదా శ్రీసూ...

39


మ.

మృగతృష్ణ ల్మరుభూములంబలె భవల్లీలాస్వరూపంబునన్
 జగము ల్గన్పడఁ జూచి యజ్ఞుఁడు సదాసత్యం బటంచున్ మృగం
బు గతిన్ నమ్మి భవాంబురాశిఁ గడవన్ బోలేక తాపత్రయా
ర్తిఁ గడున్ స్రుక్కుచు నిన్నుఁ జెందఁడు గదా శ్రీసూ...

40


మ.

గరిమన్ వహ్ని జనించి తచ్ఛమనమున్ గావించునీరంబు వై
ఖరిఁ జిత్తంబునఁ బుట్టి తన్మలినమున్ గన్పట్ట బాధించు మ
త్సరముఖ్యారులఁ గూడఁబట్టి యపరోక్షజ్ఞానఖడ్గంబునన్
శిరముల్ ద్రుంచినవాఁడె ముక్తుఁడుగదా శ్రీసూ...

41


మ.

అకలంకద్యునదీతరంగముల నుద్యత్పంకముంబోలెఁ దా

వకకారుణ్యముచేఁ దమం బణఁగి సత్వం బుద్భవం బైనచో
నొకయద్వైతవిశిష్టవృత్తిఁ గనుచున్ యోగప్రభావంబు దా
ల్చి కడున్ భక్తుఁడు ముక్తి నొందునుగదా శ్రీసూ...

42


శా.

కీలాలంబున బుద్బుదంబుగతి నగ్నిన్ ధూమముంబోలె ను
ద్వేలం బై తగు నీస్వరూపమున నావిర్భూత యైనట్టిమా
యాలీలన్ గొని సృష్టిరక్షణలయవ్యాపారము ల్సేయుచున్
గేలీవృత్తి నెసంగునిన్నుఁ దలఁతున్ శ్రీసూ...

43


మ.

భువనంబుల్ ముకురంబునంబలె మదిన్ బోలేక చూపట్టు నం
చవలోకింపుచు భక్తియోగమున నార్యవ్రాత మత్యంతమున్
భవదంఘ్రు ల్భజియించి సైంధవ ముదన్వద్వీచికం బోలె నీ
శివరూపంబున నైక్య మొందును గదా శ్రీసూ...

44


మ.

మధుమాసంబునఁ బుష్పరాజి వనసీమన్ బోలె నీసత్కృపన్
శిథిలీభూతతమస్కుఁ డై సుగుణము ల్సేవింప నీసేవకుం
డధికోత్కృష్టనదీనదప్రతతి యయ్యాదోధిత్రోవన్ బలెన్
పృథివిన్ యోగపదంబు గాంచునుగదా శ్రీసూ...

45


శా.

నీతేజఃపటలం బశేషభువనానీకస్థమై క్రాలుచో
భీతిన్ గూటికిఁ జేరుఘూకమటులన్ విజ్ఞానసంభావ్యమై

నీతత్త్వం బలరార నజ్ఞుఁ డెలఁమిన్ వీక్షింపఁగాలేక నిన్
జేతోవీథిఁ దలంచి కొల్చునుగదా శ్రీసూ...

46


మ.

ద్విజరాజప్రభచే సుమార్గ మటులన్ విద్యావికాసోన్నతిన్
భజనీయస్ఫుటయోగవైభగగతుల్ భావింపఁ గన్పట్టుదా
నజనుం డుత్తమకాంతనాథునిబలెన్ భావంబులో నిల్పి నిన్
సృజనాద్యేకమనీషుఁ గొల్చునుగదా శ్రీసూ...

47


మ.

క్షితి సర్వజ్ఞత నీకు జీవునికిఁ గించిద్జ్ఞత్వమున్ గూర్చి యు
న్నతి నమ్మాయ యవిద్యయున్ బెరుగ నానావేషముల్ గట్టి మీ
రతులజ్ఞానసమృద్ధి నేకమయి జన్మాదు ల్విసర్జింపుచున్
గృతకృత్యవ్రతులై సుఖింతురు గదా శ్రీసూ...

48


మ.

తమి శుల్బంబునఁ దోఁచుపాముకరణిం ద్వద్రూపమం దోలి వి
శ్వము గన్పించునటంచుఁ జిత్తసరణిన్ భావింపుచో స్వప్నతు
ల్యములై లోకము కాలము క్రియలు కర్తల్ కల్ల లౌనంచుఁ గూ
రిమితో దెబ్బరె తత్వబోధకలితుల్ శ్రీసూ...

49


శా.

లోకంబు ల్గల లొక్కభంగి మది నాలోచించు తత్త్వప్రబో
ధాకల్పుఁ డటులన్ భవత్పదయుగధ్యానోచితస్వాంతనా

ళీకుం డెప్పుడు యుష్మదీయకృప కోలిన్ బాత్రుఁ డౌచున్ సము
త్సేకం బొప్పఁగ ముక్తిఁ గాంచునుగదా శ్రీసూ...

50


శా.

వైరాగ్యంబును దత్వబోధమును శశ్వద్యోగముం గల్గి సం
సాంరాసక్తిఁ దొలంగుచున్ బుడమి నిస్సంగాత్ము లైనట్టివా
రారూఢాక్షరభావమున్ గనుచు నందానందమున్ గాంచుటల్
చేరన్ రానిభవత్కృపామహిమగా శ్రీసూ...

51


మ.

క్షమయున్ సత్య మహింసయున్ సమతయున్ సర్వేంద్రియోత్థానమున్
శమమున్ ద్యాగము గల్గి నిశ్చలతపశ్శక్తిన్ బ్రవర్తింపలే
క మదిన్ భక్తి జనింప నీచరణసక్తధ్యానబుద్ధిన్ జరిం
చి మహానందము నొందఁ గంటి జగతిన్ శ్రీసూర్య...

52


మ.

సగుణుం డంచును నిర్గుణుం డనుచు శాస్త్రజ్ఞుల్ వివాదింపుచో
సగుణవ్యక్తియె నీకు నిత్యమయి సత్యస్ఫూర్తిఁ గన్పట్టు కా
క గుణశ్రీకలితుండవేని జగముల్ గన్గొంచు మెచ్చన్ దయా
దృగనీకావృతుఁ జేసి నన్మనుపవే శ్రీసూ...

53


మ.

శ్రుతిశాస్త్రంబు లెఱింగి బోధమహిమన్ శుద్ధాంతరంగుండునై
మతిమత్సంగతి గాంచి యోగసరణిన్ మన్నింపుచున్ సోహమం

చతులప్రౌఢిని ని న్భజించు విబుధుం డంభోధి నప్పాయసా
కృతి దోఁపన్ భవదైక్య మొందును గదా శ్రీసూ...

54


శా.

యోగస్యందన మెక్కి సత్వగుణనూతోపేతుఁడై యీషణ
త్యాగాస్త్రాసన మెక్కువెట్టి హృదమోఘాస్త్రంబు సంధించుచున్
యోగు ల్మెచ్చఁగ నీపయిం బరవుమర్త్యుం బట్టి నిర్వాణల
క్ష్మీగేహంబునఁ గట్టివైతువుగదా శ్రీసూ...

55


మ.

మునిసభ్యు ల్వెఱఁగంది చూడఁ దమితోఁ బూర్వక్రియాపాశముల్
గొని యజ్ఞానపరంపరాయవనికన్ గొట్టాడఁగా నిల్పి జీ
వనికాయోచితసాలభంజికల భాస్వత్ప్రీతి నర్తింపఁజే
సిన నిన్నెంచి భజింప శక్యమగునే శ్రీసూ...

56


మ.

జలధిన్ గ్రుంకినవాఁ డశేషతటినీస్నానవ్రతోద్భూతస
త్ఫలమున్ గాంచినమాడ్కి సర్వదివిషద్వర్యాకృతిన్ మించుని
న్నలఘుప్రీతి భజించువాఁ డఖిలదేవాగణ్యకారుణ్యదృ
ష్టిలతాబద్ధముఖాబ్జుఁ డై తిరుగఁడే శ్రీసూ...

57


శా.

సంతానద్రుమ మర్థికిం బలె నశేషస్వీయభక్తాళి క
త్యంతేష్టార్థ మొసంగు ని న్విడిచి యన్యాదిత్యునిం గొల్చుచున్

భ్రాంతిన్ భూపతిఁ జేరఁబోక సుభటున్ బ్రార్థించువాఁ డట్టులన్
జింతింపం గతమేమి మోహవశుఁ డై శ్రీసూ...

58


మ.

మును నీపాదసరోజభక్తుఁడగు రాముం డార్తవిప్రాంగనా
మునిదైతే వనాటముఖ్యుల మదిన్ మోదంబు రెట్టింపఁ గ
న్గొని కైవల్యపదం బొసంగె భవదంఘ్రుల్ వేడ్కఁ జింతించువా
రి నుపేక్షించుట నీకుఁ బాడి యగునే శ్రీసూ...

59


మ.

ధనదారాత్మజసక్తి లేక మదిలోఁ ద్వత్పాదపంకేరుహా
ర్చనముం గోరి యొనర్చువాఁ డెపు డుదంచత్కర్ణరంధ్రంబులన్
వినునే కాలలులాయకంధరవిలంబిస్వర్ణఘంటావళీ
నివదాసహ్యతదీయకంఠరవమున్ శ్రీసూ...

60


శా.

శాంతిన్ గ్రోధము లోభ మస్థిరమతిన్ సత్సంగతి న్మత్సరం
బంతర్మోహము దత్త్వగోష్టిని నిది ధ్యానప్రవృత్తి న్మదం
బెంతే కామము దేహధర్మకలనాదృష్టి న్విదారించి నీ
చింత న్వర్తిలువాఁడె ముక్తుఁడుగదా శ్రీసూ...

61


మ.

హరిసంరక్షణమున్ సుధాకరధరుం డంతంబు సర్గంబు వా
క్తరుణీభర్తయు సల్పుటల్ బుధులు వక్కాణింతు రాకృత్యముల్

పరమేష్ఠిప్రముఖాకృతిప్రభలు దోఁపన్ జేతు వీవంచు నెం
చిరి వేదాంతవిశారదుల్ నిజముగా శ్రీసూ...

62


శా.

నే నెం తే మదిఁ జింతఁ జెందుటకు నై నీ విట్టు లంతంతకున్
నానానూనుధనాంగనాదిభవబంధశ్రేణి బంధించినన్
దీనత్వంబున భీతి గాంతునె భవద్భృత్యుండు మీఁదన్ సమీ
చీనస్ఫూర్తిఁ బునర్భవంబు గనునే శ్రీసూ...

63


శా.

నేనే రక్ష్యుఁడ రక్షకుండ వెపుడున్ నీవే యటం చన్యులన్
గానంబోక భవత్పదాంబురుహముల్ గాంక్షించి సేవించుచున్
నానాత్యాగముఁ జేసినాఁడ నిఁక న న్బాలింపకున్నన్ మనో
లీనాస్మత్పరితాప మెన్న వశమే శ్రీసూ...

64


మ.

స్మరణం బెప్పుడు సేయుచున్ మనుజు లస్మత్పాదము ల్గొల్చినన్
గరుణం బ్రోచుచు వారికెల్ల నపవర్గం బిత్తు నేనంచు మేల్
బిరుదోక్తు ల్వచియించు ని న్విడిచి పేర్మిన్ బీదలన్ వేఁడఁగా
సిరి లాభించునె ముక్తియున్ గలుగునే శ్రీసూ...

65


మ.

అనుభోక్తవ్యముగాక కర్మసముదాయం బౌర పోదండ్రు భూ
జను లట్లైనను జన్మముల్ చనునె? తత్సంరక్షణార్థంబు ద
ప్పునె కృత్యంబులు ముక్తి లభ్య మగునే ముమ్మాఱు నిన్నెంచి ప
ల్కిన వేదోక్తులు నిల్వకున్నె మృసలై శ్రీసూ...

66

శా.

తూలం బై భవదాగ్రహంబున మరుద్గోత్రంబు తూఁగాడు స
త్తూలం బైన సుమేరులై నిలుచు నీతూర్ణప్రసాదోన్నతిన్
గాలాదు ల్జనియింప నెల్లజగముల్ గావించి రక్షించువా
రే లోకేశముఖుల్ ద్వదన్యులగుచున్ శ్రీసూ...

67


శా.

లోకంబుల్ గలిగింపఁ బెంపఁ జెరుపన్ లోలుండవై చిత్తమం
దాకాంక్షించినమాత్ర మక్షణమె సత్యస్ఫూర్తి వర్తించుచో
నేకాలంబు రణేచ్ఛ మాన కెదురై హింసించుమందేహు లే
చీకై కొందఱు వధ్యు లౌదు[1]రుగదా శ్రీసూ...

68


శా.

నీకారుణ్యము లేక ప్రాగ్భవకృతానిత్యక్రియారాశి బ్ర
హ్మాకారంబు వహించి మానవుల కత్యంతార్తిసౌఖ్యోన్నతుల్
చేకూరంగ నటించు తావకమరీచివ్యాప్తి లేకున్న ను
ద్రేకస్ఫూర్తిఁ దమిస్రముల్ పెరుగవే శ్రీసూ...

69


మ.

శితనారాచపరంపరన్ దెరల కక్షీణప్రతాపోన్నతిన్
బ్రతిబాణంబుల నిన్ ద్రికాలముల నొంపన్ జూచు మందేహదై
త్యతతిన్ విప్రవిసర్జితార్ఘ్యమహిమన్ దాఁటించి నీమంత్ర మూ
ర్జితశక్తిన్ నిను మించి వర్తిలుఁ గదా శ్రీసూ...

70

శా.

పాపంబు ల్పచరించె నం చలుక నన్భావింపవేమో కృపా
లోపంబున్ గనుపింప నీపదపయోరుడ్భావనాసక్తి న
ప్పాపంబు ల్గలవే యపథ్యవికృతుల్ భైషజ్యసేవాగతిన్
ఱేపు న్మాపును గాక యెట్లు నిలుచున్ శ్రీసూ...

71


మ.

కపటప్రక్రియ సేవకున్ మనుప కే కాలంబు నేకాకృతిన్
జపలస్వాంతులు కాక తావకపదాజ్జాతార్చనల్ సేయు మం
చుపదేశించితి వస్మదాదులకు నట్లూహింప శక్యంబె నీ
కృప లేకబ్బునె ముక్తి పౌరుషగతిన్ శ్రీసూ...

72


శా.

ఖన్నుండై స్వభటుండు బ్రోవు మనుచున్ గేల్మోడ్చి ప్రార్థించుటల్
గన్నారం గనుఁగొంచు లేశమయినన్ గారుణ్యమున్ దాల్ప వా
పన్నత్రాణపరాయణుం డనుచు సంభావించి యామ్నాయముల్
ని న్నెబ్భంగి నుతించి పల్కఁదొడఁగెన్ శ్రీసూ...

73


శా.

నీవే ది క్కని నమ్మి వేఁడుకొనుచున్ నీదివ్యపాదాబ్జముల్
భావింపం దొరకొంటి న న్నిఁక దయన్ బాలింపు లేకున్న చో
దేవా! నాగతి కేమి నిన్ను జను లుద్దేశించి నిందించినన్
నే నాసంగతి నాలకింపవశమే శ్రీసూ...

74

మ.

అనుకంపారసదృష్టి ము న్నఖిలభృత్యశ్రేణి రక్షింపవే
నను రక్షింపకయున్నచోఁ గలుగవే నైర్ఘృణ్యవైషమ్యముల్
జను లెంచన్ సమవర్తివై నిలిచి కాంక్షన్ బక్షపాతంబుఁ జే
సిన ని న్నుత్తము లెల్ల మెత్తురె మదిన్ శ్రీసూ...

75


శా.

యోగజ్ఞానవిరక్తి సత్త్వగుణసక్తోర్వీసురశ్రేణికిన్
రాగం బొప్పఁగ ముక్తిసౌఖ్య మిడి నన్ రక్షించకున్నన్ గృపా
యోగు ల్మెత్తురె బీదలన్ విడిచి భాగ్యోదారుల న్మున్నుగాఁ
గ్రీఁగంటన్ గనుఁగొంచుఁ బ్రోవ నగునే శ్రీసూ...

76


మ.

ద్విరదంబుల్ రథముల్ ధనంబులు మణుల్ తేజీలు రాజ్యంబు మం
దిరము ల్భూషలు చేలము ల్నిడువడిన్ దెమ్మంచుఁ గాంక్షింపలే
దురు సంసారసముద్రతారణవిధానోద్యుక్తయుష్మత్పద
స్థిరబుద్ధిం దయసేయు మంటి నెపుడున్ శ్రీసూ...

77


శా.

ఏలా వేదపురాణశాస్త్రములు ని న్నేప్రొద్దు సేవింప న
బ్బాలేందుప్రభఁ జీకటుల్ బలె నఘవ్రాతంబు నిర్మూలమై
వ్రాలన్ ముక్తిపదంబుఁ గాంతు రనుచున్ వాక్రుచ్చె నే నగ్గతిన్
శీలం బొప్ప భజింతు నీచరణముల్ శ్రీసూ...

78


మ.

ఘనము ల్నీచము లైనజన్మములు మత్కర్మానుకూలంబులై

వెనుకన్ గల్గినఁ గల్గనీ హృదయ మేవేళన్ భవత్పాదచిం
తనమున్ దప్పకసల్పుచుండుటకు నానోటన్ బ్రసాదించవే
చెనఁటు ల్గన్గొని చిత్తవీథి వగవన్ శ్రీసూ...

79


మ.

తనువు ల్వీడుచు ము న్నశేషనిరయస్థానస్థితానేకయా
తనలం బల్మి భుజించినాఁడ నిఁకఁ దద్బాధ ల్విజృంభించినన్
గని చింతింపనుగాని నీభటుఁడ నానాదుర్గతుల్ చేరఁగాం
చె నటంచున్ జనులాడుచుండ వగతున్ శ్రీసూ...

80


మ.

నిగమాంతంబు లనేకరూపములచే నీతత్త్వమూహించుచోఁ
బొగడం జొచ్చితి మందబుద్ధి నకటా బోధ్యుండ వెట్లౌదువో
తగబోధం బెటు లబ్బునో తెలియ దీతత్త్వంబు గాంక్షించుచున్
మిగులం గొల్చెద నీపదంబు లెలమిన్ శ్రీసూ...

81


మ.

జననీగర్భగుహాంతరాళనిరయస్థానంబులం దున్నయా
తన లొక్కుమ్మడిఁ బాయునంచు మదిలోఁ దర్కించి నీపాదచిం
తనము న్మానక చేయుచుంటి నిఁక నన్గారుణ్యదృక్సింధువీ
చినికాయంబు నటింపఁ బ్రోవఁదగదే శ్రీసూర్య...

82


మ.

శ్రుతిశాస్త్రంబులు సత్యమంచు భవదస్తోకాద్యమంత్రంబు దు

ష్కృతవిచ్ఛేదక మంచు నీదుపదముల్ సేవ్యంబు లంచున్ దిర
స్కృతదేవుండవు నీ వటంచు మదిలోఁ జింతించి నిన్నొక్కసం
సృతిబంధం బెడఁబాపు మంచుఁ గొలుతున్ శ్రీసూ...

83


శా.

కాయం బెల్లం గృశించి వాతకఫరోగం బెంతయున్ దుస్తరం
బై యుండెన్ మదికిన్ జడత్వ మొదవెన్ వ్యాపించెఁ జిత్తంబు దు
ర్వ్యాయామంబుల నక్షము ల్దరగతిన్ బ్రాపించె నీభృత్యునిన్
జేయన్ రాదె విదేహముక్తికలితున్ శ్రీసూ...

84


మ.

జలజాక్షున్ గనకాంబరున్ సకలభూషాభాషితాంగున్ మహో
జ్జ్వలతూణాసిధనుర్ధరున్ గమలినీసంసేవ్యపాదాబ్జుఁ బు
ష్కలతేజోనిధి నాదిదేవు నిను సాక్షాద్బ్రహ్మ మంచున్ దలం
చి లసద్భక్తి భజింతు మాన కెపుడున్ శ్రీసూ...

85


మ.

కలలో దాఁచిన చిత్తవృత్తులగతిన్ గన్పట్టు నజ్ఞానభా
వ్యులు జీవు ల్ఘటియించుకృత్యములు నీ వొక్కింత కర్తృత్వబ
ద్ధు లటంచున్ గని వారికన్యఫలముల్ దొడ్తోఁ బ్రసాదింప క
ర్మిలిఁ బ్రోవం దగదే యవార్యు లనుచున్ శ్రీసూ...

86


మ.

హరి తేజోమయ పద్మినీరమణ లోకాధ్యక్ష పద్మాక్ష భా
స్కర మృత్యుంజయ శంకరా శ్రుతిశిఖాసంభావ్య విశ్వంభరా

సురవర్యా నిటలాక్ష కేశవ మునిస్తుత్యాంఘ్రిపంకేజ సు
స్థిరసంజ్ఞారమణీశ లోకనయనా శ్రీసూ...

87


శా.

ఛాయావల్లభ దుష్కృతాంతక మహేశా భద్రసంధాయకా
ధ్యేయాకార శివస్వరూప శుభటార్తిస్తోమవిచ్ఛేదకా
మాయాతీత ముకుందవాసరమణీ మార్తాండ నక్తంచరా
జేయాద్వాదశరూప చండకిరణా శ్రీసూ...

88


శా.

అంతాదేవతలాహరిత్కరికరోగ్రాఖండదోర్దండసం
క్రాంతేష్వాసవిముక్తకాందజలధారాధ్వస్తమందేహక
ల్పాంతవ్య క్తహుతాసనోజ్ఝితసమస్తామర్త్యమర్త్యావళీ
చింతాసంతతి ని న్గణించెడుతఱిన్ శ్రీసూ...

89


మ.

కలరే నీసరివేల్పు లిజ్జగములన్ గంగాధరాంభోజభూ
బలభిద్వామనముఖ్యనిర్జరశిరోభాస్వత్కిరీటాగ్రభా
గలసద్రత్నసమంచితశ్రుతిశిఖాగమ్యప్రభాభూషితాం
ఘ్రిలుఠత్సేవకభూరిదుష్కృతగణా శ్రీసూ...

90


శా.

సరివే ల్పెచ్చట లేడు నీకు శుచిమచ్ఛాస్త్రాగమాభ్యాసభా
సురవిజ్ఞానకళావిలోలహృదయక్షోణీసురాలోక్యదు
ర్భరభానూత్కరచండమండలవినిర్యద్దివ్యరుగ్వారిత
స్థిరకాండోజరపూరితోరుతిమిరా శ్రీసూ...

91

మ.

మెఱపు ల్చాడ్పున సంపద ల్పొదలు నెమ్మేను ల్ఘనచ్ఛాయలై
పరగున్ సంసృతిసౌఖ్యముల్ బహువిధస్వప్నంబు లై తోఁచు బం
ధురభోగంబులు బుద్బుదంబులగతిన్ బొల్పొందు నివ్వార ల
స్థిరరూపంబులు వీని నమ్మనగునే శ్రీసూ...

92


మ.

శరణం బంటి భవత్పదస్మరణదీక్షావృత్తి నూల్కొంటి మ
త్సరమోహాదుల నంటకుంటి మతిమత్సాంగత్య మిమ్మంటి నే
మఱుపా టెంతయుఁ గానకుంటిఁ దొలికర్మశ్రేణి పోఁగంటిఁ జె
చ్చెరఁ దాపత్రయిఁ బాపుమంటి నెపుడున్ శ్రీసూ...

93


మ.

ధనలుబ్ధత్వము దీఱెఁ గామముఖచేతశ్శత్రువు ల్వాఱె స
జ్జనసాంగత్యము మీఱెఁ బుత్రతతివాత్సల్యంబునుం జారెఁ ద
క్కినకాంక్షల్ గడతేరె నెల్లపుడు సత్కృత్యంబు లెల్లన్ ఘటిం
చి నినుం గొల్చితి నన్నుఁ బ్రోవవలదే శ్రీసూ...

94


శా.

విత్తప్రాప్తిగతు ల్దలంపక సదా విద్యావినోదంబునన్
మత్తుండై దినకృత్యముల్ సలుపుచుం మాన్యద్విజేంద్రాళిచే
జిత్తస్థైర్యము గల్గి నీదుపదముల్ సేవించుభూదేవుఁ డు
ద్వృత్తిన్ ముక్తిపదంబు గాంచును గదా శ్రీసూ...

95


మ.

మనుజుం డర్థముఁ గోరి నీచరణముల్ మన్నింప కర్థించుచున్

ధనికశ్రేణుల నాశ్రయించి పిదపన్ దైన్యంబు దీపింపఁ ద
న్ననయంబున్ జనులెల్ల హాస్యములున్ సేయన్ బ్రాప్తి లేదంచు నేఁ
చినవంతన్ బలుచింతఁ జెందునుగదా శ్రీసూ...

96


మ.

తనయు ల్తములు నన్నలున్ సతియు మిత్రశ్రేణియుం గొల్వఁగా
ధనికత్వంబునఁ దత్సుఖంబు తనకు దక్కోల టంచున్ మనం
బున హర్షించుచు మూఢుఁ డంతకభటుల్ పోరాడువేళన్ జనిం
చిన భీతిన్ గడుదుఃఖ మొందునుగదా శ్రీసూర్య...

97


మ.

నృపులం గొల్చుచు వేషధారి యగుచుం బేరంబు లశ్రాంతమున్
జపలత్వంబున సల్పుచున్ పరగృహస్థానేచ్ఛ వర్తించుచున్
విపులద్రవ్యముఁగూర్చి మోదమునః బృథ్వీదేవవంశ్యుండు దాఁ
గృపణుండై చెడుఁ గాదె ని న్నెఱుఁగమిన్ శ్రీసూ...

98


మ.

కృతపాపంబులు లెక్కపెట్టక మహాహీనాకృతిన్ దాల్పి దా
నతతిన్ గైకొనుచున్ దురన్నముల నంఃప్రీతి భక్షించుచున్
వ్రతము ల్గోరక యాహ్నికక్రియ లొగిం వర్జించి విప్రుండు సం
చితచిత్తంబునఁ దృప్తిఁ జెందక చెడున్ శ్రీసూ...

99


మ.

మతిమద్ధ్యేయు నచింత్యకాయు సుమహామాయున్ పఠనాద్ధ్యేయు ని
ర్జితతదైత్యేయు సతాదితేయు ధృతకౌక్షేయున్ జగధేయు సం

భృతతిగ్మాంశునికాయు సద్గుణగణామేయున్ హృతాపాయు స
త్కృతరాధేయు నహేయు నిన్నుఁ గొలుతున్ శ్రీసూ...

100


మ.

ధృతచక్రాబ్జనిషంగచాపు విలసత్కీర్తిప్రభావంచితా
మృతసంతానకలాపు ఖండితభటశ్రేణీబృహత్పాపు ధీ
రతతిధ్యేయసురూపు సత్యమధురాలాపున్ నతశ్రీపు వ
ర్జితకోపున్ సుకలాపు నిన్నుఁ గొలుతున్ శ్రీసూ...

101


మ.

అవితాంభోజభవాండుఁ గిల్బిషకదళ్యారణ్యవేదండు ర
త్నవిచిత్రార్జునకుండలద్యుతిసముద్యద్గండుమందేహదా
నవసేనాదళనోన్ముఖప్రబలనానాకాండుఁ గాండాదిభూ
రివిహారార్హపిచండు నిన్నుఁ గొలుతున్ శ్రీసూ...

102


మ.

సతశక్రాదికిరీటకోటిమణిసంతానస్ఫురత్పాదుదా
రితభక్తాఖిలఖేదు మౌనిజనతాశ్రీదున్ మహామోదుఁ బా
లితమర్యాదు విపక్షహృద్భయదమౌర్వీనాదు దివ్యాస్త్రని
ర్జితనానాపలలాదు నిన్నుఁ దలఁతున్ శ్రీసూ....

103


మ.

సురవర్యస్తుతనాము భవ్యసుగుణస్తోమున్ సమస్తాశ్రితో
త్కరసంతాపవిరాము లోకభయకృత్సంగ్రాము నానావిధా

భరణోద్దాము సుధాము సత్కులసరస్వత్సోము నిష్కాము భూ
రిరమాలంకృ థాము నిన్నుఁ దలఁతున్ శ్రీసూ...

104


మ.

శతపత్రాయతనేత్రు సర్వసుమనస్సంస్తుత్యచారిత్రు దు
ష్కృతసంఘాతలతాలవిత్రు మునిరాడిష్టాటవీచైత్రు ని
ర్జితమందేహనిశాటగోత్రుఁ గిరణశ్రేణిలసద్గాత్రు సం
శ్రితలోకావనసూత్రు నిన్నుఁ దలఁతున్ శ్రీసూ...

105


మ.

కుతుకం బొప్ప నమస్కరింతు మఱి నీకున్ సేవకశ్రేణికిన్
ధృతదివ్యాయుధపాణికిన్ మణిగణోదీర్ణప్రభాపుంజరం
జితగాంగేయశతాంగమౌళికి సరోజిన్యాదికాంతాళికిన్
గృతకృత్యుం డని వేడ్క నన్మనుపవే శ్రీసూ...

106


శా.

ఈమీఁదన్ భవదీయభూరిదయ నే నెంతేసుఖశ్రేణిచే
నామోదించి నిరామయప్రకృతి నై హర్షించుచున్ బాపచిం
తాముక్తిం గని ముక్తికాంక్ష మదిలో స్తంభింప నీపాదముల్
వేమా రెంచి భజించుచున్ దిరిగెదన్ శ్రీసూ...

107

శ్రీసూర్యనారాయణశతకము సంపూర్ణము.

  1. రె భటుల్