Jump to content

భక్తిరసశతకసంపుటము/రెండవసంపుటము/మాధవశతకము

వికీసోర్స్ నుండి

పీఠిక

మాధవశతకమును వ్రాసినది అల్లంరాజు రంగశాయికవి. ఈయన బహుగ్రంథనిర్మాతయు సుప్రసిద్ధకవియునగు అల్లంరాజు సుబ్రహ్మణ్యకవివర్యుని కుమారుఁడు. ఉభయభాషాకవి. అవధానవిధాననిపుణుఁడు. ఈకవి వ్రాసినయాంధ్రీకరణమగు చంపూరామాయణమువలన నీయన ఆరామద్రావిడబ్రాహ్మణుఁడనియుఁ బీఠికాపురసమీపస్థమగు చేబ్రోలు నివాసి యనియుఁ దెలియుచున్నది.

మాధవశతకము నీకవి ప్రౌఢవయస్సునందు రచించెను. రచనకాలము శాలివాహనశకాబ్దములు 1837 అనుటచే శతక మిప్పటికిఁ బదిసంవత్సరముల క్రిందటఁ బూర్తిచేయఁబడినటుల స్పష్టమగుచున్నది. ఈశతకము పీఠికాపురవాస్తవ్యుఁడగు కుంతీమాధవస్వామి కంకితముగా రచింపఁబడినటులఁ దొలిపద్యమువలనఁ దెలియనగును. ఈశతకమునందు శ్రీకృష్ణలీలలు విపులముగా నభివర్ణింపఁబడినవి. శతకకర్త జీవత్కవియు విమర్శనిపుణుఁడును నవయుగమున నున్నవాఁడును నగుటచే నీశతకము నాగరకులకు రుచించునటుల భావసమన్వితముగ వ్రాసెను.

ఈశతకమునందలి ప్రతిపద్యము భక్తిరసోద్బోధకమై మృదుమధురభూయిష్టమై శ్రావ్యముగ నున్నది. ఎనుబదియెనిమిదవపద్యము మొదలుకొని పండ్రెండుపద్యము లంత్యనియమాలంకారముతో మనోజ్ఞముగా రచింపబడినవి. పదజటిలము, నియమపరిపాటి, ధారాసౌష్టవము బట్టిచూడ నాయాపద్యములు కృతుల కాశ్వాసాంతములందుఁ జేర్పఁదగినవిగాఁ దోచుచున్నవి.

తొలుత నీశతకము కీ॥శే॥ చెలికాని లచ్చారావుగారి శతకసంపుటములందు ముద్రితమయ్యెను. పిదప మేము ప్రకటింపఁబోవు భక్తిరసశతకముల సంపుటములలోఁ బ్రచురించుటకు అనుజ్ఞ నొసంగి మాయుద్యమమునకుఁ దోడ్పడిన శ్రీ అల్లమురాజురంగశాయికవిగారియెడలఁ గృతజ్ఞులమగుచున్నారము,

తండయార్పేట

ఇట్లు,

చెన్నపట్నం

వావిళ్ల. రామస్వామిశాస్త్రులు

26-1-1926

అండ్ సన్స్

శుభమస్తు

అల్లంరాజు రంగశాయికవికృత

మాధవశతకము

మ.

శ్రీపీఠాపురమందు భక్తులను రక్షింపం దలంపూని త
ద్వ్యాపారంబులఁ జక్కఁజేయుచుఁ గిరీటాద్యుత్తమాలంక్రియల్
దీపింపన్ జిఱునవ్వు మోము దగఁ గుంతీదేవిచేతం బ్రతి
ష్ఠాపూజల్ గనియున్న నిన్ గొలిచెదన్ స్వామి హరీ మాధవా.

1


శా.

క్రూరుల్ చేసెడి దుష్టకృత్యములఁ బోఁగొట్టంగ శిష్టావళుల్
ప్రారంభించిన సాధుకృత్యములఁ గాపాడంగ నూహించి పొ
ల్పారన్ యాదవవంశమందు జననంబై మున్ను శ్రీకృష్ణుఁడన్
పేర న్వర్తిలినాఁడ వీవేకద సేవింతు న్నినున్ మాధవా.

2


మ.

తొలి ధర్మజ్ఞులు పాండునందనులకున్ దుర్యోధనుం డెన్నికొం
దలముల్ గూర్పదలంచినన్ భువి భవత్కారుణ్యయుగ్వీక్షణం
బులచే నయ్యవి గీటణం బగుచు శుభంబుల్ వారి కెల్లప్పుడున్
గలిగెన్ గావున నీవు సాధుజనరక్షన్ జేయుదౌ మాధవా.

3

మ.

మినుకుల్ వే యిఁకనేల కూళయు నజామీళుండు నారాయణా
యనుచున్ దాను నిజాత్మజుం బిలువఁగా నమ్మూఢు నెంతేదయన్
గనుచున్ వానికి గాలకింకరులసంఘాతంబుచే సంభవిం
చినబాధల్ దొలఁగించి మోక్షపదవిం జేకూర్చితౌ మాధవా.

4


మ.

దురితాత్ముం డగుకైటభుం డనెడుదైత్యుం డెల్లలోకంబులం
దురుహింసాన్వితకృత్యముల్ సలుపఁగా సుద్యన్మహాక్రోధవి
స్ఫురతస్వాంతుఁడ వౌచు నయ్యసురుని న్బోరన్ వడిం గూల్చి భూ
భరము న్మాన్పినవాఁడ వీవెగద దేవా శ్రీహరీ మాధవా.

5


మ.

అల రాధానలినాయతాక్షిపయి నత్యంతానురక్తుండవై
లలితంబై సుమనోజ్ఞమైన సరసాలాపంబున్ లీలతోఁ
బలుకన్ డాయుచు యామునాంబువులలోఁ బల్మాఱు క్రీడావిచే
ష్టలు గావించి తదంగనామణిని హృష్టం జేసితౌ మాధవా.

6


మ.

కపటస్వాంతముతోడఁ బూతన విషాక్రాంతస్తనద్వంద్వయై
నిపుణత్వంబున నీకుఁ బా ల్గుడుప నానీచాత్మభావంబు నీ
వు పరబ్రహ్మమ వౌటచే నెఱిఁగి యాపూఁబోఁడిప్రాణంబు లొ

క్కపరిన్ బీల్చి వధించినాఁడవు జగత్కళ్యాణదా మాధవా.

7


మ.

పటుకేయూరపరిష్కృతంబయిన నీబాహాచతుష్కంబు ది
క్తటముల్ నిండినశోభతో నెనయఁ బద్నాల్గౌనలోకాళి యు
త్కటభారంబు వహింతు వీ వని జనౌఘం బెన్ను నే నీదయా
స్ఫుటవీక్షావళి సోఁకి రక్ష నిడునంచున్ దెల్పెదన్ మాధవా.

8


మ.

యమునాతోయములందు గోపికలతో నానంద మొప్పన్ విహా
రము గావించుచు శీకరంబు లరుదారన్ జల్లుకొన్నట్టికా
లమునన్ వారికి గల్గినట్టిసుఖము ల్వర్ణింప శక్యంబె యా
ప్రమద ల్చేసినపుణ్య మిట్టిదియొ చెప్పంజాల నో మాధవా.

9


శా.

శూరుండౌ నరకాసురుండు జగముల్ క్షోభింపఁగా జేసి చె
న్నారంగాఁ బదియాఱువేలనృపకన్యాశ్రేష్ఠలన్ బల్మిచేఁ
గారాగారముఁ జేర్ప నయ్యసురునిన్ ఖండించి బంధస్థలౌ
వారిన్ నీవు వదల్చి యందఱ సుఖంపంజేసితౌ మాధవా.

10


శా.

నీతోడన్ సహకారులై నిరతమున్ నీసత్కృపాపాత్రులై
గోతండంబుల మేపుగోపకులు పెక్కుల్ గా భవద్వేణుసం

జాతంబుల్ ఘనగీతముల్ విని యతిశ్రావ్యంబులై యుంట సం
ప్రీతిం బొందిరి వారొనర్చిన తపశ్శ్రీ యెట్టిదో మాధవా.

11


శా.

రాసక్రీడ లొనర్ప గోపక వధూరాజ్యంతరస్థుండవై
నాసాగ్రంబున మౌక్తికం బమర మందస్మేరవక్త్రంబుతో
భాసిల్లంగను దొంటినోములఫలంబా యంచు వా రెన్నఁగన్
నీసాన్నిధ్యము వారి కబ్బెనుగదా నిత్యంబు శ్రీ మాధవా.

12


శా.

నీసందర్శన మాచరించిననరుండే మోక్షముం బొందెడున్
నీసేవన్ సతతం బొనర్చుపురుషుండే మంచి ధన్యాత్ముఁడౌ
నీసూక్తుల్ వినినట్టిమానవులకు నిత్యంబు వైకుంఠసం
వాసం బబ్బునటంచుఁ జెప్పఁగఁదగున్ బక్షీధ్వజా మాధవా.

13


శా.

నిన్నున్ జూడని కన్ను లేల యెపుడున్ నీస్తోత్రమున్ జేయలే
కున్నన్ జిహ్వ యదేల నిన్ను మదిలో నూహించి ధ్యానింపలే
కున్న జిత్త మదేల నీకుఁ గుసుమవ్యూహంబుచేఁ బూజలన్
బన్నన్ లేని కరం బదేల యనుచున్ వాక్రుచ్చెదన్ మాధవా.

14


శా.

నీయాలింగనసౌఖ్యముం బొరయ నెంతేఁ గోరుచున్నట్టి స
త్యాయోషామణియున్ మొద ల్గలుగు నబ్జాక్షుల్ నినుం జూచువా

డై యుద్వాహము బొంది రట్టిచరితం బాలించు మర్త్యాళికిన్
బాయున్ సంసృతిపాశబంధములు సంభావింపఁగన్ మాధవా.

15


శా.

నీనామంబు స్మరించెనేని దురితానీకంబు నిర్మూలకం
బౌనంచున్ మదిలోఁ దలంచుచును నిత్యంబున్ భవన్నామమే
శ్రీనారాయణ వాసుదేవ యనుచుఁ గృష్ణా స్మరింతున్ జుమీ
దీనుండ న్ననుఁ బ్రోవుమా కరుణతో దేవా హరీ మాధవా.

16


మ.

తొలి సాధుండు గజేంద్రుఁ డమ్మొసలిచే దుర్వారబాధాప్తివి
హ్వలుఁడై నిన్ను హరీ హరీ యనుచుఁ బ్రోవన్ వేడుకోఁగా దయా
కలితస్వాంతుఁడవైన నీవు మొసలిన్ ఖండించి నాగేంద్రునిన్
పలరన్ బ్రోచితి వయ్యెడన్ మనుపుమయ్యా నన్ను శ్రీమాధవా.

17


శా.

సోమాదిత్యులు మీకు నేత్రయుగ మౌచున్ జీఁకటిం గొట్టి యు
ద్దామం బైనవెలుంగు లోకముల కొందన్ జేయుచున్నారు ము
న్నామందాకిని నీదుపాదములయం దావిర్భవించెంగదా
నీమాహాత్మ్యము నా కెఱుంగ వశమే నే మూఢుఁడన్ మాధవా.

18


మ.

అల బాణాసురుఁ డాజిరంగమున డాయ న్వచ్చినన్ వాని దో

ర్బలదర్పంబు నణంచి తద్భుజసహస్రంబుం బడంగొట్టి ము
త్కలితుంగా ననిరుద్ధునిన్ సతి నుషాకన్యన్ వడిన్ దెచ్చితౌ
తలమే తావకదోశ్చతుష్కపటుసత్వం బెన్నఁగన్ మాధవా.

19


మ.

మురదైత్యేంద్రుని సంహరించి మధుఁడన్ పూర్వామరాధ్యక్షునిన్
దురమందున్ బఱిమార్చి కేశిపలలాంథోనాయకుం గూల్చి ము
ష్కరుఁడై వర్తిలు వజ్రనాభదనుజుం జక్కాడి నీ వీవసుం
ధర నిష్కంటకఁ జేసినాఁడవు మహాత్మా మ్రొక్కెదన్ మాధవా.

20


మ.

అతిదారిద్ర్యము నొంది విప్రుఁడు కుచేలాఖ్యుండు నీబాల్యమి
త్రత నాత్మం దలపోసి పిమ్మట భవత్సాన్నిధ్యముం జేరి నీ
కతఁ డర్పింపఁగ దెచ్చినట్టి యటుకుల్ హర్షంబుతో మెక్కి భూ
రితరైశ్వర్యము లిచ్చి తీ వతనికిన్ శ్రేయఃప్రదా మాధవా.

21


శా.

నీకున్ వాహనమై ప్రపత్తి గనుచున్ నిన్ను న్భుజాగ్రంబునన్
జేకొంచున్ వహియించునట్టిఁడగు పక్షిస్వామి పుణ్యంబులన్
నాకుం బేర్కొనఁగాఁ దరంబె యెపుడుం దల్పంబు దానౌటచే
నాకాకోదరరాజు పుణ్యము లగణ్యంబుల్ గదా మాధవా.

22

శా.

భూనేతల్ ఘనగర్వయుక్తు లగుచున్ బోషింపకున్నా రిఁక
న్మానంబౌనెడ సంతసంబు నవమానం బైనచోఁ జింతయు
న్మానంబూని నిను న్భజించెద మదిన్ నాపైఁ బ్రసాదింపు మ
య్యా నీవే గతి నీపదాబ్జముల నే ధ్యానించెదన్ మాధవా.

23


శా.

నీ వావిష్ణుఁడ వంచుఁ దా నెఱుఁగమిన్ నీరేజగర్భుం డొగిన్
గోవత్సంబుల నాలఁ దాఁచఁ గను గో గోవత్సరూపంబులన్
నీవే దాల్పఁగ నబ్బురంబు పడి వాణీజాని నీస్తోత్రముం
గావించెంగద నీదుమాయ దెలియంగా శక్యమే మాధవా.

24


శా.

ధీచాంచల్యము దేవదానవుల కొందింపన్ జగన్మోహనం
బౌచున్నట్టి స్వరూపమెత్తి యమృతం బాదేవతారాజికిన్
బ్రాచుర్యంబుగ నిచ్చి రాక్షసులకున్ రాకుండఁగాఁ జేసితౌ
నీచర్యల్ మిగుల న్విచిత్రముగఁ గాన్పించుంగదా మాధవా.

25


మ.

ప్రకటంబై తగుమల్లయుద్ధ మరుదారన్ జేసి చాణూరము
ష్టికులం బట్టి వధించినాఁడ విఁక దుశ్శీలాన్వితుం గంసునిన్
వికటాకారుని సంహరించితివి పృథ్వి న్నీవు గోపాలబా
లకరూపంబున నున్న దేవుఁడవు నిన్ శ్లాఘించెదన్ మాధవా.

26

మ.

వికృతాకారిణి నాత్రివక్రను దయ న్వీక్షించి నీ వప్సరో
నికరం బెల్లను మెచ్చుకోఁదగినదానిం జేసితౌ ద్రౌపదీ
ముకురాస్యామణి కీవ నిర్మితములౌ పుట్టంబులం గూర్చి యా
మెకు మానంబును గాచినాఁడవు జను ల్మెచ్చంగ శ్రీమాధవా.

27


మ.

కొలువై తుంబురునారదాదులగు భక్తుల్ వల్లకీగాన ము
జ్జ్వలతన్ జేయఁ దదీయగోష్ఠిఁదగుచున్ వైకుంఠమందున్న నీ
యలఘుప్రాభవసంపదున్నతులఁ గన్నార న్విలోకించువా
రలకున్ మ్రొక్కినఁ బాపముల్ దొలఁగి దూరంబౌగదా మాధవా.

28


శా.

నీచారిత్రములం బఠింప శుభముల్ నెక్కొంచునుండున్ సదా
వాచాకౌశలిచేత నీదునుతులన్ వాక్రుచ్చిన న్వారి కౌ
రా చేకూరుచునుండెడి సకలతీర్థస్నానపుణ్యంబులున్
నీచే లోకము లుద్భవస్థితిలయాన్వీతంబులౌ మాధవా.

29


శా.

నీవక్షస్థలమందు బాలరవికాంతిం గేరఁగాఁజాలుచున్
ఠీవిన్ భాసిలునట్టి కౌస్తుభమణి న్వీక్షించిన న్వాఁడు మో
హావేశంబులఁ బాసి జ్ఞానకలితుండై మోక్షముం బాల్పడున్
దేవా నీవు ధరించు చిహ్నమయినన్ ని న్బోలు నో మాధవా.

30

శా.

నీకంఠస్థలియందు వ్రేలుచు సుధీనిర్వర్ణ్యసౌరభ్యలీ
లాకల్పద్రుమజేతలైన వనమాలావైజయంతీమనో
జ్ఞాకారంబు లెదందలంచినను బుణ్యస్తోమముల్ వానికిం
జేకూరుంగద తన్మహత్తులు మనీషిశ్లాఘ్యముల్ మాధవా.

31


శా.

ఆదుర్యోధనముఖ్యదుర్జనుల కత్యాశ్చర్యభీతిప్రదం
బై దీపింపఁగ సజ్జనుల్ వినుతి సేయన్ విశ్వరూపంబు నెం
తే దర్శింపఁగఁ జేసి యాసమయమందే తత్సభన్ వేడ్కనిం
డౌదృష్టిన్ ధృతరాష్ట్రభూపతికి నీవందించితో మాధవా.

32


శా.

నీహస్తంబున నున్నశార్ఙ్గధనువున్ నిత్యంబు ధ్యానించినన్
దేహారోగ్యము గల్గు నందకముఁ బ్రార్థింప న్సమస్తాఘముల్
నీహారం బినదీప్తిఁబోలె నణఁగు న్నిన్ గొల్వఁగా భద్రసం
దోహంబుల్ సమకూడునంచును దలంతు న్బక్తిచే మాధవా.

33


శా.

నీచక్రంబును సన్నుతించినను వానిం జెందరా వాపదల్
వైచిత్ర్యం బగునట్లు నీఘనగద న్వర్ణింపఁగా వానికిన్
దోఁచ న్సోకదరాతిభీతి జగమందు న్నీదుశంఖస్తవ
ప్రాచుర్యం బొనరింప సౌఖ్యములు గన్పట్టుంగదా మాధవా.

34

శా.

నీపాదార్చన మెన్నిజన్మముల కేనిన్ జేయ నా కబ్బునే
నీపంచాక్షరమంత్రసజ్జపము నే నిత్యంబుఁ గావించెదన్
నీపాదానతభక్తబృందములతో స్నేహంబు గావింతు న
య్యా పద్మాక్ష కృప న్నను న్మనుపుమా యశ్రాంతమున్ మాధవా.

35


మ.

నినుఁ గన్నట్టిది యైనదేవకి పురంద్రీరత్న మైయొప్పున
వ్వనితాగర్భము పావనంబు నొనరింపం బుట్ట మున్నామె నో
చిననోముల్ ఫలియింపఁజేసితివనన్ శ్రీకృష్ణరూపంబుతో
డను గోపాలకబాలురం గదిసి యాట ల్నేర్పితౌ మాధవా.

36


మ.

వసుదేవుండు తపోవిశేషములు పూర్వంబందుఁ జేయంగ సం
తసమొప్ప న్ఫలియించినట్టిఫల మితం డంచుఁ దా హృష్టమా
నసుఁడై ని న్నల నందగోపకునియింటన్ జేర్పఁ బుత్తెంచుచో
వసమై యామునతోయ మీ వరుగఁ ద్రోవంగూర్పదే మాధవా.

37


మ.

తనదుగ్ధంబుల నిచ్చి పెంచిన యశోదాదేవి పుణ్యాళి యిం
తని లెక్కింపఁగ శక్యమే యెవనికేన్ హస్తంబుతో దువ్వుచున్
నిను నాడించుచుఁ జంకఁబెట్టుకొని పానీయంబులం బోయుచుం
డినదై యర్మిలి ముద్దుఁబెట్టుకొనియె న్నే ర్పొప్పఁగన్ మాధవా.

38

మ.

అల నందుండు నిజాత్మజుం డవని నీకత్యంతముం బ్రేమ జొ
బ్బిలఁగ న్భూషలలంకరింపఁగని సంప్రీతుండవై గొల్లపి
ల్లలతోడ న్విహరించినాఁడవు సులీల న్నీచరిత్రంబు ని
చ్చలు నాత్మందలపోయువారలకు నాశ్చర్యంబగున్ మాధవా.

39


శా.

పాకారాతి దురాగ్రహంబున శిలావర్షం బహోరాత్రముల్
వీఁకన్ దాఁ గురిపింప నంత మొదవుల్ భీతిల్ల గోవర్ధనా
ఖ్యాకం బైనగిరీంద్ర మెత్తి వెస నీవాగోపగోపాళి క
స్తోకం బైనసుఖం బొసంగితివి నీదోశ్శక్తిచే మాధవా.

40


మ.

పరకాంతాపరవిత్తనిస్పృహుఁడనై స్వామీ భవద్ధ్యానత
త్పరబుద్ధిన్ విషయోపభోగములపై వాంఛ న్విసర్జించి నీ
స్మరణంబే యొనరించుచుంటి నిఁక నీచారిత్ర మాలించుచున్
బరమానందము డెందమం దెనసి ని న్బ్రార్థించెదన్ మాధవా.

41


మ.

అల సాళ్వక్షితినేత సౌంభకవిమానారూఢుఁడై కిన్కచేఁ
గలహంబుం బొనరింపఁగా నతనిపైఁ గౌమోదకి న్నీమహో
జ్జ్వలశక్తిం బడవేసి గండణఁచితత్ప్రాణంబు లొక్కుమ్మడిన్
దొలఁగం జేసితి నీవ కావె సకలాప్తుల్ మెచ్చఁగన్ మాధవా.

42

మ.

అనివార్యుం డగునట్టి కాలయవనుం డన్వాఁడు యుద్ధంబొన
ర్చిన వాని న్ముచికుందసంశ్రితధరిత్రీభృద్గుహాంతంబునన్
జనఁగాఁ జేసి మునీంద్రుచేత నతని న్జంపించి యమ్మౌనిచే
ననుకూలస్తుతు లొందినాఁడవుగదయ్యా శ్రీహరీ మాధవా.

43


మ.

నినుఁ బూజింపఁగ ధర్మనందనుఁడు యత్నింపన్ దదుద్దేశము
న్విని యంతఁ శిశుపాలుఁ డాగ్రహముచే నిన్ దూలగా నప్పు డా
తనిశీర్షంబును ద్రుంచినాఁడవు సభాస్థానంబున న్సభ్యులె
ల్లను మెచ్చంగ భవద్విదూషకులు నేలంగూలరే మాధవా.

44


శా.

కాళిందీహ్రదమందుఁ గాళియమహాకాళోదరుం డంబువుల్
క్ష్వేళజ్వాలల నిండఁజేసి జనుల న్వేధింప నీ వప్పు డా
వ్యాళోద్గర్వ మణంచి తచ్ఛిరములం దంఘ్రిద్వయం బుంచి స
ల్లీల న్నాట్య మొనర్చినాఁడవు ప్రజ ల్మెచ్చంగ నో మాధవా.

45


మ.

సమరాజేయపరాక్రముండగు జరాసంధుడు నీతోడ యు
ద్ధముఁ గావింపఁదలంచుచున్నతఱిఁ దద్బాహాసముద్రిక్తగ
ర్వము వారింపఁగ భీమునిన్ జొనిపి సంగ్రామంబున న్వాని నం
తము నొందించితి వబ్బురంబుగను క్షుద్రధ్వంసకా మాధవా.

46

శా.

శ్రీరంగంబున రంగనాయకుఁడవై చెల్వొంది భద్రాద్రిలో
శ్రీరామాఖ్య వహించి నీలగిరిలో శ్రీమజ్జగన్నాథుఁ డన్
పేర న్వర్తిలి శేషశైలమున ఠీవి న్వేంకటేశాఖ్యఁ జె
న్నారం బూనినవాఁడ వీ వొకఁడవే యై యుంటివో మాధవా.

47


శా.

నీకు న్మ్రొక్కెద నీదుసేవకులతో నెయ్యంబుఁ గావించెదన్
నీకీర్తిం గొనియాడెద న్మనసులో నీ ధ్యానముం జేసెదన్
నీ కెవ్వారును సాటి లేరనుచు నే నిత్యంబు వాక్రుచ్చెదన్
నాకు న్మోక్ష మొసంగఁగావలయు శ్రీనారాయణా మాధవా.

48


శా.

నీవే విద్యల కెల్లఁ దానకమవై నెక్కొంచు సాందీపభూ
దేవశ్రేష్ఠునిచెంత విద్యలను బూర్తి న్నేర్చికొన్నాఁడ విం
కావిద్వన్మణి పూర్వజన్మకృతపుణ్యం బెట్టిదో యేరికిన్
భావింపం దరమౌనె భక్తజనకల్పక్ష్మారుహా మాధవా.

49


శా.

ఆపత్కాలమునందు నీస్మరణ మత్యంతంబుఁ గావించినన్
గాపాడంగఁ దలంతు వీవు వనిలోఁ గార్చిచ్చు వేష్టింపఁగా
గో స్త్రీ లును గోపబాలకు లనేకుల్ వేఁడఁగా నప్పు డా
యాపత్తు న్హరియించి ప్రోచితివి కావా యందఱన్ మాధవా.

50


శా.

చోరుండై తగుసోమకుండు ద్రుహిణశ్రుత్యుత్కరంబెల్లఁ బెం

పార న్మ్రుచ్చిలి వార్ధి డాఁగఁ గని నీ వవ్వేళ మత్స్యంబవై
యారక్షోధిపుఁ జంపి వేదసముదాయంబు న్వడి న్దెచ్చి యం
భోరుడ్జన్మున కిచ్చినాఁడ వతఁ డామోదింపగన్ మాధవా.

51


మ.

అమృతంబు న్భుజియింప దేవదనుజుల్ యత్నించి మంథాద్రిఁ గ
వ్వముగాఁ బన్నగరాజు రజ్జువుగ నొప్పంజేయుచు న్బాలసం
ద్రము బల్మి న్మథియింప నీ వపుడు కూర్మస్వామివై యానగేం
ద్రము నీకర్పరమందుఁ బూనితివి ధీరగ్రామణీ మాధవా.

52


మ.

అవని న్జాపను జుట్టినట్లుఁగ హిరణ్యాక్షుండు చుట్టంగ నీ
వు వరాహాకృతిఁ దాల్చి యాదనుజుని న్బోర న్వడిం గూల్చి యీ
భువి నీకొమ్మునఁ బూని ప్రోచితివి నీభూరి ప్రభావంబుఁ జె
ప్పవశం బెవ్వరికైనఁ గాదు వికచాబ్జాతాక్ష శ్రీమాధవా.

53


మ.

అవిభేద్యాశయుఁ డాహిరణ్యకశిపుఁ డత్యుగ్రకోపంబుతో
భవదీయాంఘ్రిసరోజభక్తవరుఁడౌ ప్రహ్లాదు బాధింప మా
నవసింహాకృతిఁ దాల్చి రాక్షసుని పెన్వక్షంబు భేదించి భ
క్తవరుం బ్రోచితి వీవ కావె దురితౌఘధ్వంస శ్రీమాధవా.

54

మ.

బలిదైత్యాగ్రణి వంచనంబు నొనరింప న్వామనాంగుండ వై
యిల మూడంఘ్రులుమాత్ర మీ వడిగి యీపృథ్వీదివు ల్జాలమిన్
దలపై వానినిఁ ద్రొక్కి నాగభువనస్థానంబునన్ జేర్చితౌ
జలజాతాక్ష భవత్ప్రభావ మెఱుఁగ న్శక్యంబె శ్రీమాధవా.

55


మ.

జమదగ్న్యాత్మభవుండవై సకలరాజన్యాళియు న్నీదు క్రో
రోధమహాగ్నిస్ఫుటకీలకు న్శలభబృందంబై చన న్వారిర
క్తముచేతం బితృదేవతర్పణములం గావించి హర్షించి తీ
వమర న్నీయవతార మద్భుతకరం బయ్యెంగదా మాధవా.

56


మ.

శమదాంత్యాదులఁ బూని పంక్తిరథ కౌసల్యాతనూజుండవై
ప్రమథాధీశధనుస్సుఁ గూల్చి యపు డావైదేహిఁ బెండ్లాడి దు
ర్దములౌ రావణకుంభకర్ణులను యుద్ధంబందుఁ జక్కాడి యీ
క్షమ నిష్కంటకఁ జేసినాఁడవు సురల్ శ్లాఘింపఁగన్ మాధవా.

57


మ.

యదువంశంబు ముదంబు నొంద బలరామాఖ్యుండవై రేవతీ
మదిరాక్షీమణిఁ బెండ్లియై ముసలముం బల్లాంగలం బూని దు
ర్మదుఁడైనట్టి ప్రలంబరాక్షసునిఁ బోర న్దున్మి కాళిందియన్
నది మర్దించినవాఁడ వీవె జగదానందప్రదా మాధవా.

58

మ.

పరమానందము భక్తకోటికి నిడ న్బౌద్ధస్వరూపుండవై
దురితధ్వాంతదివాకరుండ వగుచు న్దుర్వాదముల్ మాన్పి సు
స్థిరచిత్తంబున నిన్నుఁ గొల్చు మనుజశ్రేణి న్సదా ప్రోచుచున్
గరిమన్ లోకము నేలుచుంటివి కటాక్షం బొప్పఁగన్ మాధవా.

59


మ.

కలికి స్వాకృతిఁ దాల్చి దుష్టజనసంఘధ్వంసముం జేయ ని
స్తులదోర్విక్రమము న్వహించి విలసత్తుంగాశ్వరాజంబుపై
లలిఁ గూర్చుండి కరంబునందుఁ గరవాలం బూని తద్దుష్టని
ర్దళనంబుం బొనరింతు వెంతయు జగత్సంరక్షకా మాధవా.

60


శా.

ఈవే తండ్రివి తల్లి వీవె చెలి వీవే ప్రాణమిత్రుండవున్
నీవే నా కిఁక సద్గురుండ వయిన న్నీవే సహాయుండవున్
నీవే యాపదలందు రక్షకుఁడవు న్నీవేసుమీ భ్రాతవున్
నీవే గావున నిన్ను భక్తి గొలుతు న్నిక్కంబుగన్ మాధవా.

61


శా.

నీమందస్మిత మాసుధాంశుకిరణానీకస్ఫురచ్చంద్రికా
భూమాభిఖ్యఁ దిరస్కరించి కలశాంభోరాశి సద్వీచికా
స్తోమంబు న్నిరసించి భక్తులకు నస్తోకానుకంప న్సదా
క్షేమంబు ల్గలుగంగఁజేయు ననుచున్ గీర్తించెదన్ మాధవా.

62


శా.

నీనేత్రంబులశోభ యెవ్వనికి వర్ణింపం దరంబౌనె ల

క్ష్మీనారీమణికి న్నివాసమగుచుం జెల్వొంది త్రైలోక్యర
క్షానైపుణ్యముఁ బూని చూపరులకు న్సంధించు భద్రంబులన్
గానన్ దానికి నద్దియే సరియనంగ న్జెల్లునో మాధవా.

63


శా.

నీదేహంబును గన్నులారఁ గనిన న్నీలాభ్రసంకాశమై
మోదంబు న్ఘటియించుఁ దావకభుజంబుల్ చూచిన న్గల్పశా
ఖాదర్పంబు హసింపఁగాఁదగి మదిం గౌతూహలం బూన్పు నీ
వే దైవంబవటంచుఁ గొల్తు మదిలో నెల్లప్పుడున్ మాధవా.

64


శా.

కామక్రోధముల న్జయించి మదిలో గర్వంబు వర్జించి ని
న్నేమర్త్యుండు దలంచి కొల్చునొ యతండే శుద్ధధన్యాతుఁడై
తా మోక్షంబును జెంద నర్హుఁడని డెందంబందు నే నమ్ముచున్
నీమీఁద న్మది నిల్పి కొల్చెదను దండ్రీ ప్రోవుమీ మాధవా.

65


శా.

నీశంఖంబు సుదర్శనంబు మొదలౌ నీదివ్యచిహ్నంబు లెం
తే శృంగారముగా ధరించిననరు న్వీక్షించినన్ జ్ఞాన మా
వేశించు న్సుకృతంబుగల్గునని విస్రబ్ధచిత్తుండనై
నీశుంభద్వరచిహ్నముల్ దలఁచెదన్ నీభక్తుఁడన్ మాధవా.

66


శా.

పాశంబు న్ధరియించి కాలుఁడు నను న్బాధింప నూహించుచో

లేశంబైన నిను న్దలంపఁగలనో లేనో యటం చిప్పుడే
కౌశల్యంబునఁ దావకస్మరణముం గావించెద న్భక్తితో
నోశాంతాకృతి నన్నుఁ బ్రోవుము దయాయుక్తుండవై మాధవా.

67


శా.

తర్కవ్యాకరణాదిశాస్త్రములు శ్రద్ధాయుక్తిఁ జర్చించుచున్
దర్కింపం బనిలేదు దాన యమబాధ ల్వాయునే యన్యసం
పర్కం బేమియు లేక నీచరణసేవాసక్తుఁడై యుండినన్
గోర్కు ల్వానికిఁ జేకురు న్భవవిముక్తుండై తగున్ మాధవా.

68


శా.

ఘంటాకర్ణుఁడు యుష్మదాఖ్యను వినంగా రాదటం చెప్పుడున్
ఘంటల్ కర్ణములందుఁ గట్టుకొనుటం గాదే తదంహశ్ఛటా
లుంటాకాత్ముఁడవై దయారసము వెల్లు ల్గ్రమ్మఁగా వాని కీ
వంటం జేసితివయ్య మోక్షము ననాయాసంబుగన్ మాధవా.

69


శా.

శ్రీకాంతామణి భూమియుం బదముల న్సేవించుచుండంగ నా
వైకుంఠంబున శేషశాయివయి సద్భక్తుల్ మహాభక్తితో
నీకీర్తి న్వినుతించుచున్నతఱినౌ నీవైభవం బాత్మలో
నేకాగ్రత్వమునం దలంచెదను లోకేశా హరీ మాధవా.

70


శా.

నీసత్యంబు విభీషణుండె యెఱుఁగు న్నీస్నేహధర్మంబునం

దా సుగ్రీవుఁడె సాక్షి భక్తజనరక్షాసక్తి బ్రహ్లాదుఁడన్
దాసుండే యగుసాక్షి నీయభయదానంబందు దంతీంద్రుఁడే
యౌ సాక్షీకృతుఁడంచుఁ గొల్తు మదిలో నశ్రాంతమున్ మాధవా.

71


శా.

ఏలోకంబుననుండి యిచ్చటకు దా నేతెంచెనో యింకఁ దా
నేలోకంబున కేగునో యది రవంతే నాత్మ భావింపఁగాఁ
జాలం డెన్నిసహస్రముల్ గడచెనో జన్మంబు లెన్నందగం
డాలోచింప నరుండు నీదుఘనమాయాక్రాంతుఁడై మాధవా.

72


మ.

వినిన న్నీచరితంబులే వినవలె న్విశ్రాంతిమై నెప్పుడున్
గనిన న్నీభువనైకమోహనకరాకారంబె కాంచన్వలెన్
జనిన న్నీరుచిరాలయంబులకె యిచ్చం దా జనంగావలెన్
మనిన న్నీపదసేవచే మనవలె న్మర్త్యుండు శ్రీమాధవా.

73


శా.

స్వర్ణోశాంచితభోగము ల్మదిఁ దృణప్రాయంబుగా నెన్నుచున్
నిర్లక్ష్యంబుగఁ జూచి నీదుపదసాన్నిధ్యంబె నేఁ గోరి యం
తర్లక్ష్యంబుగఁ జేసికొంచు నెదలోన న్నిల్పి ధ్యానింతుఁ జ
క్షుర్లీల న్ననుఁ గాంచి ప్రోవుమయ యంచు న్వేఁడెద న్మాధవా.

74

మ.

నరజన్మం బతిదుర్లభం బనుచు నెన్నం బొల్చెగా యందు
భూసురజన్మంబు లభించు టుత్తమమటంచు న్వేదవేత్తల్ వచిం
తురుగా కట్టిద్విజుండు నీదుపదభక్తుం డయ్యెనే న్మోక్షముం
బొరయు న్భక్తివిహీనుఁ డొందఁగలఁడే మోక్షంబు శ్రీమాధవా.

75


శా.

ఏజాతి న్జనియించిన న్మఱియుఁ దా నెచ్చోట వర్తించిన
న్సౌజన్యాకలితాంతరంగుఁ డగుచు న్సద్భక్తితో నుండి నీ
పూజల్ చేసినమానవుండు సతతంబు న్సౌఖ్యముల్ నొందుచు
న్దేజశ్శాలియునై చిరాయువుగ వర్ధిల్లు న్భువి న్మాధవా.

76


మ.

తనయుం డజ్ఞతఁ జేసినట్టి యపరాధంబుల్ విలోకించి త
జ్జనకుం డవ్వి క్షమించినట్లుగను యుష్మద్దాసుఁడన్ నే నొన
ర్చిన నేరంబులు సైఁచి నాపయి దయాదృష్టిప్రసారంబుచే
నను రక్షింపుము దేవకీతనయ కృష్ణా శ్రీహరీ మాధవా.

77


శా.

రంభాదుల్ దనచెంగటన్ నిలిచి యశ్రాంతంబుఁ గ్రీడించినన్
సంభోగాదృతి లేశమైనవిడ దా స్వర్గాధిపత్యం బిఁకన్
జంభారాతికిఁబోలె నను దృష్ణల్ వీడవట్లౌట వి
స్రంభం బొప్పఁగఁ గోరుచుంటిని భవత్సాన్నిధ్యమున్ మాధవా.

78

శా.

అన్యాయాధ్వమునందు వర్తిలక సత్యజ్ఞానయుక్తుండనై
మన్యూద్రేకసుఖంబులేక గతిసంభావించుచున్ నీదు పా
దన్యాసోద్ధితధూళి నాశిరమునం దాల్తున్ హరేయంచు నే
నన్యుం గొల్వక నీపదాబ్జములనే యర్చించెదన్ మాధవా.

79


శా.

నిన్నున్ లోన స్మరించుమాత్రమున వానిన్ సత్కృపాదృష్టిచే
త న్నీ వెప్పుడుఁ బ్రోచుచుందువని పెద్దల్ చెప్పఁగా మున్ను నే
విన్నాఁడన్ మఱి యార్తరక్షకుఁడ వీవేకాక జేజేలలోఁ
గన్నాకుల్ మది నెన్నగాఁ గలరె నీకన్నన్ హరీ మాధవా.

80


మ.

జననం బందినతోడనే కలిగె యుష్మన్నామసంకీర్తనం
బును నీపాదసరోజభక్తియు భవత్పూజాపరత్వంబు గా
 వున నాకీ వనుకూలదైవమవుగా బుద్ధిన్ వితర్కించుచున్
వినుతింతున్ నిను సంతతంబు మదిలో వేడ్కన్ హరీ మాధవా.

81


మ.

ప్రళయానేహమునందు లోకములు వోవంగా రహిన్ నీవు ని
శ్చలతేజోమయరూపదీపితవిశేషజ్యోతివై యత్తఱిన్
వెలుఁ గేకాకృతి నొందుచున్ జగము లీవే వెండి పుట్టింతువో
జలజాతాక్ష భవత్స్వరూపమె జగజ్జాలం బగున్ మాధవా.

82

మ.

వ్రతముల్ దానము లెన్ని చేసినను దద్వారాణసీముఖ్యపు
ణ్యతమక్షేత్రము లెన్ని చూచినను దా నాయశ్వమేధాదిస
త్క్రతువుల్ చేసినఁ దావకీన మృదుపద్రాజీవసేవాసమా
గతపుణ్యంబును బోలఁజాలవని వేడ్కం బల్కెదన్ మాధవా.

83


మ.

తులసీదామములన్ ధరించుకొని చేతుల్ మోడ్చి సత్పుండ్రవ
ల్లులు ఫాలంబున దిద్ది శుద్ధపటముల్ శోభిల్లఁగాఁ గట్టి ని
చ్చలు నీనామము సంస్మరించుచు భవత్సంకీర్తనల్ పాడుచున్
బలుమాఱున్ నిను సన్నుతించు నరుఁడే భక్తుండగున్ మాధవా.

84


మ.

జటియై యుండుట ముండి యౌటయును గాషాయాంశుకంబుల్ ధరిం
చుటయున్ జేతుల సత్కమండలువుఁ గొంచున్ వేషముం బూనుచుం
డుటయున్ లోనగునవ్వి యెట్టు లొసఁగు న్మోక్షంబు తృష్ణన్ జయిం
చుటయై నిన్ను భజించుచుండుటయె యిచ్చు న్మోక్షమున్ మాధవా.

85


శా.

ఘోరంబౌ కురుపాండవాహవమునన్ గ్రూరాతులం గెల్వ దో
స్సారంబల్ల కిరీటి కీ వొసఁగి నీచాతుర్యముం జూపుచున్

సారథ్యం బొనరించి యాతనికిఁ దత్సంగ్రామసీమన్ జయం
బారన్ నీ వొనఁగూర్చినాఁడ వతిసాహాయ్యంబునన్ మాధవా.

86


మ.

అమృతం బానిన మానవోత్తమునకున్ వ్యాధుల్ జరామృత్యువుల్
క్రమ మొప్పం దొలగున్ దలంప భవదాఖ్యన్ నిత్యమున్ సంస్మరిం
చు మనుష్యాగ్రణి కుద్భవంబె నశియించున్ సత్యవైకుంఠవా
సమె గల్గున్ సుధ నీదునామసమ మేచం దాననౌ మాధవా.

87


మ.

అఘవీరుత్తతిదాత్ర దాత్రలఘుబల్యసోగసన్మందిర
శ్రమణార్చావిధిపాత్ర పాత్రనిశభాస్వద్గోత్ర గోత్రాసకృ
న్నిఘసాపాదకగాత్ర గాత్రమరమౌనిశ్లాఘ్యదోశ్శక్తిభా
ఙ్మఘవత్పుత్రకమిత్ర మిత్రశశిశుంభన్నేత్ర శ్రీమాధవా.

88


మ.

కటిభాగావృతధర్మచేల విలసత్కస్తూరికాచిత్రక
స్ఫుటఖండేందుసమానఫాల ప్రణతస్తోమద్యుషత్సాల స
ద్విటపత్రాధిశయత్వశీల కమలాబ్జాతాననాలోల హృ
త్పుటచంచత్కరుణాలవాల వినమద్గోపాల శ్రీమాధవా.

89


మ.

అసితాభ్రోపమకాయకాయదతిభక్తాంహస్తమస్సూర్య సూ
ర్యసురక్షాంచితభావ భావభవజన్మాధాననైపుణ్య పు

ణ్యసమూహప్రద సత్కథారవరసజ్ఞాత్యంతమాధుర్యదా
య్యసమానాఛ్ఛసమాఖ్యమాఖ్యశశభృత్ప్రాంచద్యశా మాధవా.

90


మ.

ఖలగంధర్వఖలీనఘోరపలభుగ్వ్యాళావళీవీనని
స్తులకారుణ్యనదీనగోపతరుణీదోశ్శ్లేషణాధీనకుం
డలిరాట్తల్పశయాన యోగిజనబృందస్వాంతయుంజాన శ్రీ
జలజాక్షీఘనకౌస్తుభాకలితవక్షస్థాన శ్రీమాధవా.

91


మ.

కరిరాజార్తివిచారచంద్ర రుచిరంగత్స్మేరయేనస్సము
త్కరకుత్కీలశతారదుగ్ధసరిదీడ్గంభీరబృందావనా
చరితాపారవిహార సర్వజగతీసంరక్షణాధార శ్రీ
హరిణాక్షీయుగగారభక్త శుభదాయ్యాకార శ్రీమాధవా.

92


మ.

పతగాధీశ్వరయానవేల్లదరిషడ్వర్గావరుంధానర
క్షితగీర్వాణవితాన యాదవకులశ్రేయోదనిధ్యానరా
జితశంఖారి దధానరాత్రిచరహస్తిశ్రేణి కాలానభ
క్తతతిజ్ఞాననిదాన యోగివరహృద్వ్యాలీన శ్రీమాధవా.

93


మ.

భృతవేధోండకటాహవల్లవ పురంధ్రీక్షీరదథ్యాజ్యభు
క్త్యతులోత్సాహ విశిష్టజాన్వవథిబాహానాహ దుగ్ధాబ్ధిమ

ధ్యతలాంచద్వర గేహదారిత సుధాంధశ్శాత్రవవ్యూహప్రీ
ణిత పద్భక్తసమూహ పాండవవిపన్నగ్రాహ శ్రీమాధవా.

94


మ.

రవికోట్యంచితతేజపాతకతమిస్రశ్రేణికాపూర్ణకై
రవిణీరాజపదంబుజాశ్రితసుపర్వక్ష్మాజలోకేశ వా
సవపూజ్యాంఘ్రిసరోజ చారుతరతుక్సంశోభిచేతోజ జై
ష్ణవనీలత్తను భాసమాజ సమనుష్యవ్యాజ శ్రీమాధవా.

95


శా.

శ్రీవత్సాంచదురఃకవాటజలరాశిస్తూయమానప్రభా
వా వార్యాశుగఝాట యధ్యుషితరమ్యద్వారకావాట పా
దావిష్టాష్టదిగీడ్లలాటమణిదీవ్యత్కుండలద్వంద్వశో
భావిష్కారికిరీటసంస్తువద శేషభ్రాట శ్రీమాధవా.

96


మ.

ఫణిభుగ్బర్హయుతోత్తమాంగవిపదబ్జవ్రాతమాతంగ స
ద్గుణరత్నాళ్యనుషంగ కోపనిహతక్రూరక్షపాటాంగ కా
రుణికాపూర్ణతరాంతరంగ గరుడారోహక్రియాచంగ మా
ర్గణబృందాక్షయసన్నిషంగ పదనిర్యద్గంగ శ్రీమాధవా.

97


మ.

నిగమోక్తస్తుతిఘోష కౌస్తుభసుమాణిక్యోల్లసద్భూష లో
కగణాత్యద్భుతగోపవేష త్రిదివౌకశ్లాఘ్యసద్భాష సౌ

భగసంయుక్తమనీష లాలితరమాబాహాసమాశ్లేష పా
ణిగృహీతీక్షితియోష దుష్కృతహిమానీపూష శ్రీమాధవా.

98


మ.

సమరోర్వీజితబాణసేవక సమాజప్రోతకళ్యాణ దు
ర్దమరక్షోభయకృత్కృపాణ నిజభక్తత్రాణకుర్వాణ స
ర్వమహీభారధురీణ పాలనకళాపారీణ కౌంతేయవి
క్రమజాగ్రత్తనువారవాణ కృతలోకప్రాణ శ్రీమాధవా.

99


మ.

యదువంశాంబుధిసోమ దుష్కృతసమూహక్షోదకృన్నామ దు
ర్మదరాత్రించరభీమ చంచదసితాభ్రవశ్యామ వందారుస
మ్మదసంధాయిచరిత్రథామ సుమదామ స్తోమ పత్కంఠసీ
మ దిశాపూర్ణయశోలలామ నతశుంభత్ప్రేమ శ్రీమాధవా.

100


శా.

శ్రీకృష్ణా హరి మంగళంబు దనుజారీ మంగళం బయ్య స
త్యాకాంతాధిప మంగళంబు యదునాథా మంగళం బచ్యుతా
పాకారిస్తుత మంగళంబు గరుడార్వా మంగళం బర్మిలిన్
గైకొ మ్మీశ్వర మంగళం బిదియె మాంగళ్యంబు శ్రీమాధవా.

101

మ.

ధరణీమండలి శాలివాహనశకాబ్దంబు ల్మహీద్రాగ్నికుం
జలశీతాంశులసంఖ్యచేఁ బరగఁ జంచద్రాక్షసాఖ్యాకవ
త్సరమందున్ దగు జ్యేష్ఠపుంబహుళపక్షంబందునౌ సప్తమీ
స్థిరవారంబున నెల్ల నీశతక మొందెం బూర్తి శ్రీమాధవా.

102


మ.

భువిలో నల్లమరాజవంశకలాశాంభోరాశిపూర్ణేందుఁ
డార్యవరశ్లాఘితసచ్చరిత్రుఁడగు సుబ్రహ్మణ్య సంజ్ఞాక స
త్కవికిన్ జిన్నమకు న్సుతుండ నమరంగన్ రంగశాయ్యాఖ్యానౌ
కవి నే నీశతకంబు నీ కొసఁగితిన్ గైకొమ్ము శ్రీమాధవా.

103


మాధవశతకము
సమాప్తము.