పీఠిక
ఈశతకము వ్రాసినకవులు బ్రహ్మశ్రీ తిరుపతివేంకటేశ్వరకవులు. ఆంధ్రకవులలో సుప్రసిద్ధులని పేరెన్నికగన్న యీకవియుగమురచించిన గ్రంథములను జదువనివారును ఈకవుల ప్రతిభాదికము నెఱుంగనివారును వర్తమానకాలమున జాల యరుదుగా నుండిరనుటలో సాహసము లేదు.
బహుగ్రంథరచయితలు శతావధానులు వివిధబిరుదాంచితులునగు నీకవులకవిత కేవల ద్రాక్షాపాకముగ మృదుమధురపదగుంభితమై యాదికవులకవితను సర్వవిధములఁ దలపించుచుండును. వీరి యాంధ్రీకరణములగు శ్రీనివాసవిలాసము, బాలరామాయణము, ముద్రారాక్షసము, మృచ్ఛకటికము, స్వతంత్రగ్రంథములగు శ్రవణానందము, బుద్ధచరిత్రము, పాణిగృహీత లోనగుపుస్తకములు భాషావిదులమన్ననకు యువకకవులవరవడికి గూడ బాత్రము లయ్యెననుట వీరి మహాకవితాప్రతిభకు దృష్టాంతములు కాగలవు.వీరికృతులలోని నీకామేశ్వరీశతక మొకటి. రచనాకౌశలమును విషయసందర్భమును బట్టి యీశతకము వేంకటశాస్త్రిగారు రచించినటులఁ దోఁచుచున్నది. (నా కేదిరోగంబు నీవివిచ్చన్ నిక్కము మూడఁ జేసెదవు. కృధ్రనామకవు మున్నర్కంపురోగంబు, సకలామయంబులును నెమ్మి న్నన్ను సేవించు) లోనగుపద్యములవలనఁ గవి వ్యాధిపీడితుఁడై శతకమునందు బాధానివృత్తికిఁ గొన్నిపద్యములు రచించిరని తోఁచును. కొన్నిపద్యములు కవికిగల యాత్మగౌరవాభిమానములు, స్వతంత్రభావములు పూర్వాచారప్రీతిని వెల్లడించుచున్నవి. ఈకవుల గ్రంథములవలెనే శతకము గూడ నూతనభావసమన్వితమై వాఙ్మయమున నొకగౌరవస్థానముగా నొందఁదగియున్నది.
ఆధునికులు సుప్రసిద్ధులునగు శ్రీ తిరుపతి వేంకటేశ్వరకవుల జీవితచరిత్రము, వారి శతావధానసారము, నానారాజసందర్శనము, లోనగుపొత్తములవలనఁ దెలియుటవలనఁ నింతలోఁ గవితాప్రశంసయు నితరచరిత్రసందర్భములు జర్చింపక వదలుచున్నారము. ఈశతకమును పునర్ముద్రణము గావించుటకు
సెలవొసంగినందుకు వారికి కృతజ్ఞులము.
కామేశ్వరీశతకము
శా.
శ్రీరామా రమణాదినిర్జరశిరస్సేవ్యంబు సంసారసౌ
ఖ్యారామాంకురదోహదంబు పరితాపాసార మత్యంతశో
భారమ్యంబు పరార్థదాయకము నీపాదంబు మోదంబు దై
వారన్ గొల్తు నమస్కరింతు మది సంభావింతుఁ గామేశ్వరీ.
1
శా.
నేరంబేనియు నేరుపేనియును మన్నింపన్ భవత్పాద మా
ధారంబౌనని నిశ్చయించికొని నాతప్పొప్పులం జెప్పి సం
సారాంభోనిధి నుత్తరించుటకు నిచ్చన్నిచ్చలుం గోరి ని
న్నారాధింపఁగఁ బూనినాఁడ దయలేదా? తల్లి కామేశ్వరీ.
2
మ.
అనురాగానుగతాంగనాజితుఁడనై యానందశబ్దార్థమున్
వనితాసౌఖ్యపరమ్ము చేసి మనమున్ వారింపఁగా లేని నా
జననం బేమిటికంచు నొక్కొకయెడన్ జర్చించియున్ మాననే
రని నన్నెట్లు భరించెదో యెఱుఁగఁగా రాదంబ కామేశ్వరీ.
3
మ.
తఱచే నెప్డు విరాగమందు మది సంధానింతు నన్ మాట నీ
కెఱుఁగన్ రానిదె? అట్టినాదుమది కేనొందువైకల్యమున్
4
బొరయన్ జేయు నిమిత్త మేర్పఱచి యేమోమాంద్యముం గూర్చె దె
క్కరణి న్నేను దరింతుఁ? దెల్పు మిది సౌఖ్యంబౌనె? కామేశ్వరీ.
4
మ.
చదువన్ లే దొకవిద్యకేనియు యదృచ్ఛాలాభమేకాని నే
నొదుగన్ లే దొకఱేనికేనియును నోహో యంటయే కాని నే
వెదకన్ లే దొకవేడ్కకేనియును దా విందౌటయే కాని యి
య్యది యేరీతిగ నెల్లకార్యములు నా కౌఁగాక కామేశ్వరీ.
5
మ.
ధన మార్జించితి నిచ్చితిన్ యశము నందన్ గంటి భోగమ్ములన్
దనివిన్ జెందితిఁ ద్వత్కటాక్షమున విద్వాంసుండనై మించితిన్
జననీ! యెందు గొఱంత నాకు లవలేశం బైననున్ లేదు నీ
చనవున్నప్పుడొ కంటరిక్తుఁ డగునే సంసారి కామేశ్వరీ.
6
మ.
జననం బందుట పెద్దయాటయు గృహస్థత్వమ్ము గైకొంట నం
దనులం గాంచుట పెండ్లిసేయుట యిటుల్ నానాఁటి కేదేనియున్
బనియున్నట్టులె తోఁచు నొక్కొకపని బైపై విసర్జించి శాం
తిని వేగన్ గని నిన్నుఁ గొల్చుటయె ముక్తిప్రాప్తి కామేశ్వరీ.
7
మ.
ధనమార్జించుట గాదు సూ? ఫలము విద్యల్ నేర్చుకొన్నందు కి
మ్మనమున్ సత్క్రియలందుఁ జొన్పవలె సామాన్యమ్ముగా ధర్మమే
తనకృత్యంబని యెంచికోవలయు నద్దానన్ బరిజ్ఞానమున్
గొని నానాఁటికి నిన్నుఁ జేరవలెఁ గోర్కు ల్వీడి కామేశ్వరీ.
8
శా.
దేహస్వాస్థ్యముకన్న వేఱొకటి ముక్తిప్రాప్తికిన్ సాధనం
బూహింపంబడదెందు దానికి మహాయోగుల్ త్వదీయాంఘ్రిసే
వాహంభావము హేతువందు రది ని న్నర్థించుచున్నాఁడ సం
దేహం బేటికి? దేహి యన్నప్పుడు శక్తీ! తల్లి! కామేశ్వరీ.
9
శా.
ఆధివ్యాధిపరీతమైన తనకాయం బర్థిఁ బోషించుచున్
శోధింపన్ వలె వేదశాస్త్రములు సంశోధించి యద్దానిచే
సాధింపన్ వలె ముక్తిమార్గ మదియున్ సాధించి మోక్షార్థికిన్
బోధింపన్ వలె జన్మమన్న నదియే పో! దేవి? కామేశ్వరీ.
10
మ.
ధనమున్నన్ సతిలేక తత్సుఖము సందర్శించినన్ సంతతిం
గ నకాభాగ్యము గల్గ వేఱొకటి యక్కామ్యంబు చేకూరనిం
కను నొక్కం డది గల్గ నొక్కఁ డదియున్ గల్గ మఱొక్కండు లే
దనుకో ల్దప్పదు తృప్తి యెక్కరణి లభ్యంబౌనొ? కామేశ్వరీ.
11
మ.
జననాభావ మనుగ్రహింపు మది నీశక్యంబు గాదేని పై
జననంబందును నా కొసంగు మెటులో సంగీతసాహిత్యముల్
పనిలే దీయుదరంపుఁబోషణకునై భాషాంతరంబుల్ జగ
జ్జననీ! దీనికి నింతవ్యర్థపుఁ బ్రయాసం బేల? కామేశ్వరీ.
12
మ.
ఎవఁ డేరీతిని బెట్టిపుట్టు నటులే యేర్పాటగున్ వాని వృ
త్తివిశేషమ్ములు దీని కింత మది నుద్రేకించి తా నెక్కుడౌ
వ్యవసాయం బొనరింప నేమి యగుఁ? ద్వత్ప్రాణేశుఁడా! బిచ్చమె
త్తవలెన్ గర్మముదాఁట నెవ్వరికి సాధ్యంబౌనె? కామేశ్వరీ.
13
మ.
ఇలువేల్పైనను దాతవైనను మఱిం కేమైనను న్నీవె నీ
బల మొక్కించుక కల్గువారలకు నైశ్వర్యమ్ము హస్తస్థితా
మలకప్రాయము నిన్ను వీడి నరులం బ్రార్థింపఁగాఁ గల్గునే
కలుముల్ ధేనువు గాక దున్న లెటు దుగ్ధ మ్మిచ్చుఁ? గామేశ్వరీ.
14
మ.
నరనాథుల్ పలుమంది మిత్రులయియున్నన్ గాని తత్సన్నిధిన్
స్థిరవాస మ్మొనరించునట్టి పని నాచేఁ గాదు నీవంటి స
త్కరుణాశాలిని పెంపఁగాఁ బెఱిఁగి విద్యాబుద్ధుల న్నేర్చి నేఁ
బరుల న్నిత్యము గొల్చుటోప్పగునె? యంబాదేవి! కామేశ్వరీ.
15
మ.
ఋణబాధల్ వ్రణబా ధలండ్రు బుధు లా యీబాధ నా కిప్డు దా
రుణమై తారసిలెన్ ద్రిశుద్ధిగ నపర్ణుం డీతఁ డన్మాట ధా
రుణి భావత్కకటాక్షవీక్షణము లారోపించు వేఱొక్కకా
రణ మింకియ్యెడ లే దిదే నిజ మపర్ణా? తల్లి! కామేశ్వరి.
16
శా.
నారుంబోసినదేవుఁ డెట్టిగతినైన న్నీరు దాఁ బోయఁడే
“యేరీతి న్మన కేగుఁగాల” మనిలో నేడ్వంగ నేమౌ? జమీం
దారుల్ మాత్రము సర్వరీతులను మోదం బందిరే? లోటులే
దే? రారాజునకైనఁ, దృప్తికలవాఁడే రాజు కామేశ్వరీ.
17
మ.
“తన పుత్రుల్ స్వమతేతరమ్ములగు విద్యల్ నేర్చి పోషింతు”రం
చు మతభ్రష్టులఁ జేయు పండితులు నీచుల్ గారె? వీ రింక ద్ర
వ్యముకై కూఁతుల రోవెలందులుగఁ జేయలేరే? యెవ్వారిదూ
ర మఱేమౌఁ, గలికాలపున్మహిమ వార్యంబౌనె? కామేశ్వరీ.
18
శా.
ఆచారమ్ములు పోయె వేదములయం దాసక్తి లేదాయె దు
ర్ధీచాతుర్యము హెచ్చె నీచులకు నాధిక్యమ్ము దా వచ్చె సం
కోచం బెందును లే"దిహమ్ము పర”మన్ గొండాటకుం బోరువా
రేచోటన్ గనరారు పాప మిది యేమీ? తల్లి! కామేశ్వరీ.
19
మ.
మును నుద్యోగులు లేరొ? వారలు ధనమ్ముం గూర్పరో? పూర్వవ
ర్తనలన్ మానిరె? పూనిరే మలినమౌ ధర్మమ్ము వా రిట్టు లే
మనవచ్చున్ బ్రకృతప్రపంచగతి వర్ణాచారముల్ మాఱె నె
వ్వని నెవ్వండని నిశ్చయింపఁదగు?నో వామాక్షి! కామేశ్వరీ.
20
మ.
సకలముం గొఱిగించుకొందు రకటా! సన్యాసులా? కారు బొ
ట్టొకయింతేనియు ఫాలమం దిడ రదేమో? ముండలా? కారు వి
ప్రకులోతంతంసుల కిట్టిపాటు కలిగెన్ బైవారిమా టేల? యెం
దుకు లోకం బిటు మాఱె? నీకెఱుఁగరాదో, దేవి! కామేశ్వరీ.
21
శా.
అచ్చాఫీసులటంచు హూణుల కుపాధ్యాయత్వమంచున్ మఱిన్
వెచ్చన్ బిచ్చడిబచ్చుటిండులకడన్ వేదాంతమంచున్ మహో
ద్యచ్చారిత్రులు పండితుల్ మెలఁగఁగానయ్యెంగదా? పొట్టకై
చచ్చున్ గాలమువచ్చె గౌరవము నాశంబయ్యెఁ గామేశ్వరీ.
22
మ.
“బలి పాడాయెను గర్ణుఁడున్ జెడియె విప్రస్వాము లర్థించు కో
ర్కెల నీఁ బూని మఱెవ్వఁ డెట్లు నిలుచున్ బృథ్వీస్థలిన్ దాతగా
వల”దం డ్రజ్ఞులు గొంద ఱిందుఁగలలాభం బింత గు ర్తింప రి
క్కలికాలం బిటు కాలుచున్నయది దిక్కా? మొక్క? కామేశ్వరీ.
23
శా.
నానానీచకృతుల్ పొనర్చి సుతుహూణప్రక్రియాధ్యక్షుఁడౌ
వానిం జేసినఁ “బొట్టకూటి కిది నేర్వంబడ్డ" దన్నట్టి వి
జ్ఞానంబించుక లేక వేద మనినన్ శాస్త్రమ్ము లన్నన్ సదా
తా నిందింపఁగఁజొచ్చువాఁ డెఱుఁగునే? తత్త్వమ్ము? కామేశ్వరీ.
24
మ.
గురువన్నన్ భయభక్తిసంభ్రమము లేకోశమ్మునన్ గానరా
వరయన్ రా వొకకొన్నియేనియును మర్యాదాస్థితుల్ హూణవి
ద్య రహి న్నేర్చెడి బాలురందు భృతకోపాధ్యాయతాదోషవి
స్ఫురణం బియ్యది కాక వేఱుగలదే మూలంబు కామేశ్వరీ.
25
మ.
ధనమార్జింపదె? వేశ్య యంతకును నింద్యంబౌ నసత్యప్రవ
ర్తనయున్ సేవయు విప్రజాతులకు మేరా "నశ్వవృత్యాకదా
చన” యంచున్ మనువాడఁడా? "యిదియ దూష్యం బిట్టికాలమ్మునం”
దనవర్ణాశ్రమపద్ధతుల్ విడుటయు న్న్యాయంబె కామేశ్వరీ.
26
మ.
ఎవఁ డేగోతినిఁ ద్రవ్వు దాని మఱి వాఁడేకాక “తాఁ జెడ్డ కోఁ
తి వనం బెల్లను గాల్చురీతిఁ" గులనీతిం దాఁట శంకించున
ట్టి వివేకాత్ములఁ గూడఁ ద్రోయుటకుఁ జాడీకోరు అత్యంతగ
ర్హ్యవిధు ల్బోధనసేతు రియ్యదియు సహ్యంబౌనె? కామేశ్వరీ.
27
శా.
"మాల ల్దవ్వున నుండఁగావలెనె? యామ్నాయమ్ము లంఘింపరా
దే? లండన్ జన నేమగున్? మడికిని స్త్రీబట్ట నింద్యంబె?" యం
చాలోచింతురు పూర్వ మెవ్వరును లేరా? యింతవా రక్కటా!
పాలంబోలుకొలమ్మువారలకు నిపాట్లేల? కామేశ్వరీ.
28
మ.
మనధర్మమ్ములు తప్పు లన్యమతధర్మమ్ముల్ ప్రశస్తమ్ము లం
చును వాపోయెడి మూర్ఖు లీయుభయమున్ శోధించిరే? పొట్టకూ
డొనరం బెట్టెడివిద్యకుం గలదె యీయుక్తాపయుక్తత్వయో
జన తా నియ్యది వేదమౌనొ? మఱి శాస్త్రంబౌనొ! కామేశ్వరీ.
29
మ.
తనధర్మమ్మున కన్యధర్మమ విరుద్ధం బెంతయౌ నంత గై
కొని వర్తించిన వ్యావహారికులు తన్ గొట్టించిరే? యింటఁ జే
సినయాచారము వారి నేమిటికి హింసించున్? మతాచారమూ
నని మాత్రమ్మునఁ దాను బెద్దదొర యౌనా? తల్లి! కామేశ్వరీ.
30
మ.
నెఱవారిన్ గికురించి విత్తముగొనన్ బ్రేరేపణ ల్సేయు ట
క్కరుల న్నిక్కము న్యాయవాదులని పల్కన్ దప్పు వేశ్యాగుణ
స్ఫురణం బంతయు వీరియందుఁ గనవచ్చున్ వీరలు న్వారలున్
ధర గేస్తు న్జెడఁదీయఁ గారకులు సత్యంబింత కామేశ్వరీ.
31
శా.
ఈవే యింద్రుఁడ వీవె చంద్రుఁడ వటం చెవ్వానినేని న్ధనా
శావేశమ్ముమెయి న్నుతించుకవు లాహా! యెంత మూఢాత్ములో
దేవీ! వీరొక కొన్నిపద్యముల నీతేజమ్ము వర్ణింపరా
దా? విత్తము నొసంగు దార్ఢ్య మది లేదా? నీకుఁ గామేశ్వరీ.
32
మ.
కలవా రెందఱు? రిక్తు లెంద? ఱిపు డిక్కంజాతభూసృష్టి నా
ద్యులు బంగారము మెక్కి మృత్తికఁ దదన్యు ల్మెక్కుచున్నారె? యి
క్కలుము ల్నిక్కములో? వయస్సు సతమో? కాయంబు నాపాయమో
కల యేని క్కలయో మఱేల ధనికు ల్గర్వింత్రు కామేశ్వరీ.
33
మ.
అతిథు ల్వచ్చిన గారవించుటకుఁ బ్రత్యబ్దమ్మును న్నీమహా
వ్రతము న్సల్పుటకు న్సుఖమ్ముగను గార్హస్థ్యప్రచారమ్ము సం
తతము న్నెగ్గుటకు న్సరాసరి సిరిన్ దల్లీ! నినుంగోర ని
చ్చితి వామాత్రమ చాలు నెందు కధిక శ్రీమత్త? కామేశ్వరీ.
34
మ.
తలిదండ్రు ల్పనిఁబూని బాల్యమున విద్యాబుద్దుల న్నేర్పలే
దెలమి న్ద్రవ్యము గూర్చి యిచ్చుటయులే దీనాకు సర్వమ్ము నీ
బలమే కారణమై యెసంగె జననీ! ప్రార్థింతు నీరీతిగాఁ
గలకాలమ్మును బోవని మ్మధికమున్ గాంక్షింపఁ గామేశ్వరీ.
35
శా.
ఈవేళన్ మృతియేని రేపటికి రెండేతాదృశమ్మైన యీ
జీవమ్మందును గాయమందును సుతస్త్రీబంధుగేహాదులం
దేవా రేనియు నాససేయుటది తప్పే యొక్కచోఁ జేసినన్
భావింపన్వలె "నెంతసత్య"మనుచుం బల్మారుఁ గామేశ్వరీ.
36
మ.
తమప్రాయమ్మునఁ బూర్వులౌ కవులు చిత్తభ్రాంతిచే స్త్రీసమా
గమముం గూర్చి రచించు నాటకములుం గావ్యమ్ములుం జూచి బా
ల్యము నెట్లో వెడలించి యౌవనము రా నాసౌఖ్యమందు న్మునిం
గి మనం బిప్పు డిసీ! యటంచును విరక్తిం జెందెఁ గామేశ్వరీ.
37
మ.
అనుమానింపక కల్పనారుచులపై నాస ల్పిసాళించు నె
మ్మనముం ద్రిప్పఁగ లేక దుర్విషయము ల్మన్నించుచు న్సాధుస
జ్జనసాంగత్యము వీడినట్టి పరమజ్ఞాని న్నను న్శుద్ధవ
ర్తనకుం దార్చిన నీకృపారస మపారంబంబ? కామేశ్వరీ.
38
మ.
మతి నూహింప సతీసుతాదిగతసంబంధమ్ము సర్వమ్ము క
ల్పిత మవ్వారలపోషణార్థమకదా? లెక్కింపఁగారాని దు
ష్కృతులం దేహి యొనర్చు టక్కటకటా యీబంధమే యీజగ
త్స్థితికిం గావలెనే? మఱొక్కగతి నీచేఁగాదె కామేశ్వరీ.
39
మ.
ఒక కొంతేని నిజమ్ముగాని వనితాయోగంపుసౌఖ్యమ్ము సృ
ష్టికి మూలమ్మని నిర్ణ యించుటఁగదా చేట్పాటు వాటిల్లె నీ
వొకటిం జేయ మఱొక్క టాయె నిది యేమో బ్రహ్మముం జూపు నం
చకటా! యెట్టిమహాత్ములుం జెడుదు రన్యాయంబు కామేశ్వరీ.
40
శా.
జ్ఞానం బించుక లేని కన్నియలతోఁ గైవల్యముం జెంది బ్ర
హ్మానందం బిదియంచు నెంచు బుధులన్నా? యెంతమూఢాత్ము లెం
తే నింద్యమ్మని నోటఁ బల్కుచును దేని న్వీడఁగా లేరు వి
జ్ఞానుల్ వానిఁదలంచిన న్బొడము నాశ్చర్యంబు కామేశ్వరీ.
41
మ.
గృహశృంగారము చేసి చేసి గృహిణీశృంగారముం జేసి చే
సి హృదంతఃప్రతిబింబితమ్ములగు నిస్సీమంపుఁగోర్కెల్ వృథా
బహుళత్వమ్మును బొందఁ దన్మయత సంభావింప లేఁ డన్య మీ
యిహమే శాశ్వతమంచు నెంచుకు జనుం డింతేనిఁ గామేశ్వరీ.
42
మ.
ఎవ రేమన్న మఱేమికాని మదిలో నేనిట్టు లూహింతు నీ
యవనిన్ స్త్రీ యన వేఱు కా దదియె మాయాపుంజ మద్దాని కే
రు వశుల్ గారె? యథార్థము న్గ్రమముగా రూపించి పద్మచ్ఛదాం
బువిధి న్వర్తిలు నేర్పుగన్గొనవలె న్మోక్షార్థి కామేశ్వరీ.
43
శా.
ఎన్నోసంస్కృతు లెందఱో తరుణు లెన్నేశయ్య లెన్నోగృహా
లెన్నోదేశము లెన్నియోవసతులై యీమాయకాయమ్ము తాఁ
గన్నుల్గానదు ముందెఱుంగ దరయంగా లేదు కాలక్షయం
బు న్నీదయ గల్గు నంతకుఁగదా? మోహమ్ము కామేశ్వరీ.
44
శా.
ఏయేకార్యములందుఁ దన్మయుఁడనై యేనుంటినో మున్ను నా
కాయాకార్యములెల్ల నిప్పటికి హేయప్రక్రియం దోఁచు నీ
మాయన్ దాఁటుటకు న్ద్రిమూర్తులకు సామర్థ్యమ్ము లేదన్నచో
జాయాపుత్రహితార్థులౌ నొరులకు న్శక్యంబె? కామేశ్వరీ.
45
మ.
ఒకమాట న్వచియింతు మత్సుకృత మేమోగాని నే నెట్టిదు
ష్టకృతి న్మగ్నత చెందియుండినను రూఢంబైనజ్ఞానమ్ము త
క్కక భక్తి న్భవదీయపాదయుగళిం గల్పించె నీభక్తి మి
న్నక పోనేర్చునె ముక్తి నా కిడదె? యెన్నండేనిఁ గామేశ్వరీ.
46
మ.
వ్యసనము ల్పదివేలు గల్గినను గామాసక్తికిన్ లొచ్చు త
ద్రససంసక్తులు దేహగేహములకే రాగిల్లరన్నప్పు డొం
డు సొరన్నేర్చునె? వారిచిత్తముల నేను న్వారిలో నెల్ల న
గ్రపరత్వము వహించి నిన్ను మఱవంగా లేదు కామేశ్వరీ.
47
మ.
మన మీదుర్వ్యసనముల న్మఱిగి ధర్మం బెల్ల లంఘించి యీ
జననము న్వృథ సేయుచుంటి మని పశ్చాత్తాపముం జెందుచు
న్నను దుర్వృత్తి యొకింతకాలము ననుంగాఱించెఁ బ్రారబ్ధక
ర్మనిదేశం బనివార్య మన్నపలు కామ్మాయమ్ము కామేశ్వరీ.
48
శా.
కష్టంబేని సుఖంబు లేనియును భోగమ్మేని రోగమ్ములే
నిష్టం బేని యనిష్ట మేని మఱియింకేదేనిఁ బ్రారబ్ధని
ర్దిష్టంబై సమకూరు నన్ననిగమాదేశమ్ము తప్పింపఁగా
సృష్టింజేసెడి బ్రహ్మకేనియుఁ దరంబే? తెల్పు కామేశ్వరీ.
49
శా.
ప్రారబ్ధమ్మున వచ్చు సంపదలు నాపత్తుల్ తదంతర్గతుల్
ధీరుల్ గా రొకభంగి నీయుభయమున్ దీర్ప స్సమర్థత్వ మె
వ్వారల్ గాంతురొ వారె ధీరులు బుధు ల్వారే కవు ల్వారె య
వ్వారే ముక్తులు వారె నీవు మఱి యవ్వారేరి? కామేశ్వరీ.
50
శా.
అంబా? లేదని యేడ్వనున్నదని యత్యానందముం జెంద నా
కుం బాల్యమ్ముననుండి యీసరణి చేకూరె న్భవత్పాదప
ద్మంబే యేడ్గడగాఁ దలంతు నితరుల్ దైవమ్ములే కా రటం
చుం బాటింతుఁ ద్వదైక్య మిట్లు కనవచ్చు న్గాదె? కామేశ్వరీ.
51
మ.
జననం బేటికిఁ గష్టమండ్రు భవదంశస్ఫూర్తి మన్మూర్తికే
జననంబైన మఱేమి? కూర్మమును మత్స్యము న్వరాహమ్మునై
కొనలేదే? సుఖమున్ యశమ్ము నళినాక్షుం డింతకన్నన్ నిద
ర్శన మొం డేమిటి కంబ? నీదయ సమస్తం బిచ్చుఁ గామేశ్వరీ.
52
మ.
హరి యన్చు న్హరుఁ డంచు బ్రహ్మ యనుచు న్హర్యశ్వుఁ డంచు న్నిశా
కరుఁ డంచున్ బలురీతులన్ జనులు శంకల్ సేయుదుర్ వీరుత్వ
త్పరులౌ టొక్కరు నే నెఱుంగ రిది మున్ దాఁగాళిదాసుండు శం
కరులు న్నిక్క మెఱింగి రామతమె నేఁ గైకొంటిఁ గామేశ్వరీ.
53
శా.
ఫాలమ్మందునఁ గుంకుమ న్నిలిపి విద్వత్తా కవిత్వాధిక
త్వాలంబములు నీదుపాదములు చిత్తాంభోజమం దెవ్వఁడే
నీలోలుండయి నిల్పు వారి కిఁక నెందేనిన్ జయం బబ్బు వాఁ
డేలోకమ్మున కేగ నేమి యగు? సర్వేడ్యుండు కామేశ్వరీ.
54
మ.
శతలేఖన్యవధానిఁ జేయవో వచస్సారస్యముం గూర్పవో
ప్రతి లే రీతని కన్నపే రిడవొ? ద్రవ్యం బీయవో? రాజుల
న్నతులన్ జేయవొ? యెన్నియేన్గతుల నానందంబు గల్పించవో
గతి నీవే? యనువారి కేమి కొదవో కామాక్షి? కామేశ్వరీ.
55
శా.
విద్దెల్ నేర్పితి మంచు నిక్కెద రహో! వేదమ్ములు న్శాస్త్రముల్
హద్దు ల్పద్దులు గల్గియున్నవియె? యేలా నేర్వఁగా వచ్చు? నీ
షద్దార్ధ్యం బది యేమి చేయఁగలుగు? న్సత్యవ్రతు న్మున్ను బల్
మొద్దు న్దిద్దితి తత్సము ల్గలరు? యీలోకానఁ గామేశ్వరీ.
56
శా.
ధనికుం డెవ్వఁడు? రిక్తుఁ డెవ్వఁడు? భవత్కారుణ్యత చ్ఛూన్యతల్
పొనరించు న్మఱి వాని వీనిఁగ నగు న్భూనాయకు న్శత్రుజి
త్తును వేగ న్బరిమార్చి న్యాయ మెదయందున్ జేర్చినాఁ డాసుద
ర్శను రిక్తు న్బదభక్తు రాజుగ నొనర్పన్ లేదె కామేశ్వరీ.
57
మ.
మనయైశ్వర్యము లెంత? యెంత మన మమ్మాంధాతకన్న న్యయా
తినృపోత్తంసునికన్న మొల్చినవె నెత్తిన్ గ్రొత్తశృంగమ్ము లి
చ్చినదిం దిన్నది దక్కవమ్మని మదిం చింతింపఁగా లేని దు
ర్ధనులు న్రాజులె? వారిఁ జూచుకవియు న్ధన్యుండె? కామేశ్వరీ.
58
మ.
మనకన్ను ల్గనుచుండ నెందఱుజను ల్మన్నైరొ కానున్నవా
రును నిం కెందఱో యంచుఁ దెల్విమెయి ధీరు ల్సంసృతిన్ లోన న
మ్మనివారయ్యును బైకి నమ్మినగతి న్మన్నింతు రవ్వారివ
ర్తన మవ్వారికె గోచరం బితరదుష్ప్రాపమ్ము కామేశ్వరీ.
59
శా.
లక్ష ల్దెచ్చెదఁ గోట్లు తెచ్చెద సిరుల్ రక్షింతు భక్షింతు న
ధ్యక్షత్వము వహింతు నంచు నిటు లూహ ల్సేయుటేకాని తా
యక్షేశుం డగునే యథోచితముగా నావేళ కావేళయే
కుక్షిం దేల్చెడి నీదుభక్తులకుఁ జిక్కు ల్లేవు కామేశ్వరీ.
60
మ.
అనవద్యాంగికి నాథుఁ డొక్కఁడొకఁడో హాస్యాస్పదంబైన కా
మినికి న్నాథుఁడు వేఱొకం డిరువురం ప్రేమించుఁ దుల్యమ్ముగా
మన మేతాదృశమంచుఁ దెల్పుటయు సామాన్యంబె యద్దానితృ
ప్తి నిరూపింపఁ దరంబె? యయ్యది యిటు ల్పీడించుఁ గామేశ్వరీ.
61
శా.
కట్టు న్మేడ యొకండు వేఱొకరుఁడు నాగట్టు న్గృహం బన్యుఁడున్
గట్టు న్జిన్నకుటీర మింకొకఁడు పాక న్గాపురముండు వాఁ
డెట్టు ల్మోదము గాంచు వీరు నది యట్లే కాంతు రీకోర్కులన్
గుట్ట ల్గుట్టలు సేయునట్టి మది కెగ్గో? సిగ్గొ? కామేశ్వరీ.
62
మ.
తనవిత్తమ్మని యన్యవిత్తమని యాత్మన్ గొంకు నుంకింపగా
బని లే దన్నియు స్వీకరింపనగు నెప్పట్ల న్బ్రయత్నమ్ము చే
సిన మూడు న్దురితమ్ము గర్మమున వచ్చె న్బోయె నన్నట్టులుం
డనగున్ గల్గునె స్వీయమంచొకటి యెన్నండేనిఁ గామేశ్వరీ.
63
మ.
తనజన్మించిన వేళఁ దెచ్చికొనెనో తాఁబోవునవ్వేళ గై
కొనునో రెంటికిఁ గాని దెట్టిదియు మూర్ఖుల్ స్వీయమంచు న్దలం
చిన నే నొప్పను గర్మమొక్కటి యగున్ స్వీయమ్ము వచ్చు న్జను
న్దనతో నయ్యది తచ్చరిత్ర మతిచిత్రం బంబ! కామేశ్వరీ.
64
శా.
సంతానమ్మున ముక్తిచేకురుటయే సత్యమ్మయేనిన్ జడ
స్వాంతమ్ము ల్పశుపక్షికీటములు మోక్ష మ్మందుటే నిక్క మి
క్కాంత ల్కాంతులు గొడ్డువాం డ్రగుటయున్ గల్గు న్దటస్థింప వీ
చింత ల్వాని కటంట నిక్కమగదా? శ్రీదేవి? కామేశ్వరీ.
65
మ.
ధనమంనదిచ్చ యొకప్డు కామినులపైఁ దాత్పర్య మొక్కప్డు గే
హనివాసమ్మున నొక్కవేళఁ బరదేశావాసమం దొక్కవే
ళను వైరాగ్యమునం దొకప్పుఁ డొకవేళ న్దానికి న్భిన్నమం
దును వర్తించుమనమ్ము గట్టు నరుఁ డందు న్ముక్తి కామేశ్వరీ.
66
మ.
తనచిత్తమ్మును గట్టువాఁడు పరమందు న్నేర్చుఁగా దానికే?
తనస్వాతంత్య్రము లేనిచోఁ దనయునిం దత్వజ్ఞుఁ గావించి యా
తనిసద్వర్తన కారణమ్ముగఁ బరస్థానమ్ము తానందునే?
ఘనులౌ జ్ఞానులత్రోవ గామి నిది యజ్ఞానంబు కామేశ్వరీ.
67
శా.
భార్యాపుత్రులయందు రక్తియును ద్రవ్యంబందు నాసక్తి యే
యార్యు ల్చెందరు? చెందుమాత్రమున నేమాయె? న్మనమ్మందు నై
శర్యం బస్థిర మాత్మజాతు లరు లీజన్మం బనిత్యంబ స
చ్చర్యల్ త్యాజ్యము లన్నజ్ఞాని గను నీస్థానమ్ము కామేశ్వరీ.
68
శా.
ఎంతే ద్రవ్యము దేశము ల్దిరిగి యేదేరీతి నార్జించి భూ
కాంతశ్రీ వహియింపఁ బో నొకఁట నిక్కం న్జక్కఁ గూర్చున్నచో
నింతిం బిడ్డల నన్నవస్త్రములకై హింసింపఁగాఁ బోనుగా
స్వాంతం బెందుల కింకనేనిఁ గుదియింప న్రాదు? కామేశ్వరీ.
69
మ.
మన మీపాటికి శాంతము న్సలుపు మంబా? సర్వభోగమ్ములుం
గనినాఁడ న్సగమాయె నాయువును సంస్కారుల్ "కలౌషష్టి" నా
వినమే? పైసగమైన బహ్మమువినా విశ్వమ్ము సర్వ మ్మస
త్తనుచర్చన్ గమనింప ని మ్మధికము న్బ్రార్థింపఁ గామేశ్వరీ.
70
మ.
ధనమంచు న్గల దొక్కచి క్కది గొన న్దాత్పర్యమే లేనిచో
జననాథు ల్మఱి యెంద ఱుందురొ కవీశద్వారముల్ గొల్చుచున్
బనియే మొక్కనితోడ నొక్కనికి నీప్రారబ్ధమేగాక కోఁ
తిని గొండెక్కిన దాని నయ్యది త్రుటం దింపించుఁ గామేశ్వరీ.
71
మ.
ఎవ రే మన్న మఱేమి? నిన్ను మదిలో నెవ్వాఁడు తానమ్ము వాఁ
డు విశేషమ్మగు సౌఖ్యముం బడయు వాఁడు న్పుణ్యుఁడు న్గణ్యుఁడు
న్గవియుం గాఁగల డాపద ల్బొరయ వెక్కాలమ్మున న్వానిఁ గ
ర్మ విధిన్ గల్గినచోఁ దొలంగు నతిశీఘ్రం బంబ? కామేశ్వరీ.
72
శా.
వారు న్వీరును దిక్కటంచు మది సంభావించుటేకాని య
వ్వారు న్వీరును గష్ట మబ్బినయెడ న్వారింపఁగాలేరు నీ
వో రాఁబోయెడివానితోడ నవి యేదోరీతి వారింతు నీ
వే రాజిల్లుము నాకు ది క్కగుచు, నిన్నే గొల్తుఁ గామేశ్వరీ.
73
శా.
ఈ వేప్రోవనిదాన వే నపుడు నన్నే వారు రక్షించి రా
యీవారింపఁగరాని వ్యాధియు ఋణం బెన్నేని పైచిక్కులున్
బైవాలాయము వ్రాల నన్నిటిఁ ద్రుటి న్వారించి కేళీగతిన్
జీవం బిచ్చుటటుండ మాన మిడవే? శ్రీదేవి? కామేశ్వరీ.
74
మ.
మనుజుల్ గొల్వఁగనేల? యన్యులను "నోమాతుః పరా దేవతా”
యనువాక్యమ్మున మాతృశబ్దమున కన్యార్థమ్ముగా నేర్చునే
జననీరూపమున న్సదా సులభవై శాసించు నిన్ను న్భజిం
చినఁ జేకూరవె భుక్తిముక్తులు యశశ్శ్రీ లెందుఁ గామేశ్వరీ.
75
శా.
గాయత్ర్యర్ధము నిన్నుఁ దెల్పుఁటయె నిక్కమ్మేనిఁ దన్మంత్రమే
ధ్యేయంబేని సమస్తవిప్రులకు నీతేజం బమేయంబ యే
నాయుశ్శీబలపుష్టికీర్తు లిహమం దాపైని ముక్త్యాప్తి తా
మై యీనన్ను వరింపవే యనుచు ధైర్యం బంబ? కామేశ్వరీ.
76
శా.
ఇంద్రుం డెవ్వఁడు? చంద్రుఁ డెవ్వఁ డనిలుం డెవ్వాఁడు కంజోద్భవో
పేంద్రేశప్రముఖు ల్మఱెవ్వరు? భవానీ? త్వన్మహొలేశ మీ
యింద్రుం గింద్రునిఁ బెంచుఁ ద్రుంచు నఖిలం బీవే భవత్యక్తమే
నిం ద్రైలోక్య మశక్యమై పొలుపఱు న్నిక్కంబు కామేశ్వరీ.
77
శా.
ఏవేళ న్మఱి యేస్థలమ్మునను నేయేరీతిగా నున్నదో
ఆవేళ న్మఱి యాస్థలమ్మునను నాయారీతియై తీరు సూ
ర్యావిర్భావము ప్రొద్దుగ్రుంకుటయు దృష్టాంతమ్ము లిప్పట్ల నీ
భావం బింత యెఱుంగ దైర్యము మదిం బాటిల్లుఁ గామేశ్వరీ.
78
మ.
బల మిచ్చున్ యశ మిచ్చు సంపద లిడు న్భంజించు గుంజించు దు
ర్బలులన్ జేయు బలాఢ్యులం బొనరుచు న్బాలించుఁ దేలించు నీ
కళయే తాదృశమంచు నిక్క మెఱుఁగంగా శక్తుఁ డెవ్వాఁడు లో
కులు పల్ రీతుల నట్టిసంగతుల నాక్రోశింత్రు కామేశ్వరీ.
79
శా.
సంసారం బతిహేయమం చెఱిఁగియుం జాలించుకోనేర మా
శంసాపాత్రముగాని యీజగమునన్ జాపల్యమా హెచ్చు ప్ర
ధ్వంసాభావము ప్రాగభావ మనుచుం దర్కించు శాస్త్రమ్ము లీ
హింస న్మానుపనేర వయ్యది మనంబే నేర్చుఁ గామేశ్వరీ.
80
శా.
ఎన్నేఁ దెచ్చితిఁ దెత్తు నింక మఱి యెన్నేవస్తువు ల్వీనిలోఁ
గొన్నింటి న్దిని గొన్ని డాతుననుచుం గొండాడుటేగాని తాఁ
గన్ను ల్మూసెడినంతలో నొకటియుం గన్పట్ట వీనీటిపై
చిన్నెల్ నమ్ముటకన్నఁ బండితునకుం జేటున్నె? కామేశ్వరీ.
81
మ.
తన తెల్వి న్దనవాంఛచే జడులచెంతన్ బూదెపన్నీటిపో
ల్కెను వమ్ముం బొనరించుకన్న వినియోగింపందగు న్విద్యలో
నని నాసమ్మతి యెంతరా జయినఁ దా నాపై నొకం డుండు వి
ద్య నఖండత్వము త్వత్కృపావశత నందన్వచ్నుఁ గామేశ్వరీ.
82
మ.
నిను నే నమ్మినదాని కీయిహమున న్నేర్పున్ గళావత్తయున్
ధనము న్భోగము రాజపూజ్యత కవిత్వమ్ము న్యశమ్మున్ సుఖం
బును సంపూర్తిగ నిచ్చుచు న్నిరతముం బోషించుచున్నా విఁ కె
వ్వనిఁ గొల్వం బని యేమి యిక్కరణి నెవ్వం డిచ్చుఁ గామేశ్వరీ.
83
మ.
ధనికుండైనను రిక్తుఁడైనఁ గడులుబ్ధత్వమ్మున న్నించుదు
ర్ధనుఁడైనన్ నృపమాత్రుఁ డే నరిగినన్ దాతృత్వపర్యాప్తుఁడై
వినయం బొప్పఁగ నూఱులాఱు లిడి బల్విశ్వాసముం జూపు నీ
యనిమిత్తం బగుపేర్మిగాక యిది నాదా? శక్తి కామేశ్వరీ.
84
మ.
ఇలువేల్పంచును నిన్నుఁ గొల్చుటయ కా దీరేడులోకమ్ములన్
గలవే ల్పెవ్వరు? నీకుఁ దక్క జననీ? కళ్యాణముల్ గోరియో
కలుము ల్గోరియొ సౌఖ్యము న్బడయఁగాఁ గాంచియో నిన్ను ని
చ్చలు సేవించెద నెందుకే నగుఁగటాక్షంబున్నఁ గామేశ్వరీ.
85
శా.
నానాసాలవిశాలమై మఱియు నానాకల్పవృక్షాఢ్యమై
నానారత్నమయాచలాకలితమై నానామరప్రాప్యమై
నానాశక్తికమై సుధాలసదుదన్వత్ఖేయమై యొప్పు ద్వీ
పాన న్బొల్చెడినీకు మ్రొక్కెద నను న్బాలింపు కామేశ్వరీ.
86
మ.
కలనైన న్గనఁజేయు మొక్కపరి వేడ్క న్మంత్రిణు ల్గొల్వ ము
క్తులు గానమ్ములు సేయఁ దక్కుఁగలశక్తు ల్వేనవే ల్చుట్టు నె
చ్చెలులై సేవ యొనర్ప మధ్యగతమౌ చింతామణిం గొల్వులో
పలఁ బేరోలగముండు నీచెలువము న్బ్రార్థింతుఁ గామేశ్వరీ.
87
మ.
ఋతురాజు ల్వసియించుచోటు సకలశ్శ్రేయములన్ గూర్చుమం
త్రతతు ల్వొల్చెడితావు సత్కలలు వేదమ్ము ల్పురాణమ్ములున్
స్మృతులు న్గాయము దాల్చియుండునెడ లోకైకేశ్వరుం డాత్మ నీ
పతి నీతో వెలుగొందుదీవి మది సంభావింతుఁ గామేశ్వరీ.
88
శా.
స్త్రీ లై రెయ్యెడలన్ ద్రిమూర్తు లెచటం జెల్వొందు దీవెప్పు డా
పాలం బెయ్యది ముక్తి కెద్ది లయము న్బ్రాపింప దేపట్ల నె
చ్చో లక్ష్మ్యాదులు నెచ్చెలుల్ కలుములన్ జోడించు నెద్దానిపే
రాలాపించినమాత్ర ద్వీప మది వర్ణ్యంబౌనె? కామేశ్వరీ.
89
మ.
పరగేహమ్మున భుక్తి యన్యసతితో భాషించు బల్ రక్తి య
క్కఱకుం గాని ప్రసక్తి వేఱొకనికిన్ గంపించుధీశక్తి నీ
చరణమ్ము ల్గనలేనిభక్తియును నిస్సారమ్ము లీయైదిటి
న్నఱుగన్నీకుము మన్మనం బిదియె ని న్బ్రార్ధింతుఁ గామేశ్వరీ.
90
శా.
అంబా! నాదు ప్రమాణపూర్తిగ నొకం డాలింపు వాక్రుత్తు నీ
చంబౌ జన్మము నెత్తుఁ గాక గడుఁదుచ్ఛంబైన దుర్వృత్తియం
దుం బూర్ణుండగుఁగాక నెమ్మనమునందు న్భక్తిమై నీదుసే
వం బాటించెడివాని కెల్లజగము న్వశ్యంబు కామేశ్వరీ.
91
శా.
ఏనాడౌ భవదాజ్ఞ యాక్షణమనే నీసర్వము న్వీడి త్వ
ధ్యానైకాత్ముఁడనై చరించుటకు సిద్ధ మ్మింత నిక్కంబు నే
నే నానాశము గుర్తెఱుంగుదును గానీ భ్రాంతియుంగల్గు నే
మో నీ వించుకమున్న తెల్పవలెఁ జు మ్మోతల్లి? కామేశ్వరీ.
92
శా.
ఆయావిద్యలనన్నిటి న్స్వయముగా నార్జింపఁగాఁజేసి నీ
వేయంచు న్బుధు లెంచు బ్రహ్మగురులోకేడ్యు న్గురుంగా సహా
ధ్యాయింగా నలతిర్పతి న్సలిపి శాస్త్రప్రక్రియ న్స్వల్పమే
నాయాసమ్ము వినాగ నిచ్చిననినున్ ధ్యానింతుఁ గామేశ్వరీ.
93
శా.
నే నేకర్మ మెఱుంగ నన్నను భవానీ? మత్కవిత్వప్రసా
రా నూనాశు శతావధానకృతి కత్యాశ్చర్యపర్యాప్తులై
యీ నే ర్పాజగదంబయే యిడె నటందెల్ల న్కవుల్ రాజసం
స్థానస్థు ల్వచియింతు రియ్యది యపార్థంబౌనె! కామేశ్వరీ.
94
శా.
ఈనాఁ డెందఱు లేరు సత్కవులు వారెవ్వారు మత్ప్రజ్ఞ లో
లో నెన్నేని వికల్పకల్పనల నాలోచించుటట్లుండఁ బ
ద్యానీకమ్ముల నెన్నిట న్నను నితాంతానందుఁ గావింప రం
బా? నాశక్తి యన న్వశంబె? యిది, నీదౌశక్తి కామేశ్వరీ.
95
మ.
సకలము న్సమకూర్చి దేహమొకటే సామాన్యముంజేసి తే
మికతంబో? సకలామయమ్ములును నెమ్మి న్నన్ను సేవించు ని
ట్టికలంకం బెడవాపి యెప్పటికినట్లే నీవు న న్పేర్మిఁ గొం
డిక నాఁ దాదిగఁ బ్రేచుచుంటమనుచుంటిం జుమ్మి కామేశ్వరీ.
96
మ.
తృణము న్ర్వజ్రముగాఁగఁ బంది నొకనందింగా సమర్థించు నీ
వణుమాత్రంబు గటాక్ష ముంచి యొకమా ఱాలోకనన్ జేసినన్
గణుతింపంగ వశమ్ముగాని బలము న్గార్కశ్య మారోగ్యమున్
బ్రణతు ల్సేయుచు నామెయి న్నిలువ రావా? దేవి? కామేశ్వరీ.
97
శా.
ప్రారబ్ధ మ్మది భోగ్య మన్నవిధి నీప్రా పున్న మాబోట్లకున్
గారా దయ్యది చారితార్థ్యమును బొందన్వచ్చు నన్యత్ర ని
న్నారాధించినవానికి న్ఫలము నే నాసించు టీయొక్కటే
భారం బెంచక దీని ని మ్మిదియె సర్వంబిచ్చుఁ గామేశ్వరీ.
98
శా.
హెచ్చౌ యోగము చేసి వెంబడినె నా కేదేనిరోగంబు నీ
వెచ్చో నిక్కము మూడఁజేసెదవు వీఁ డీలాగు గాకున్నచో
నిచ్చ న్నన్ను స్మరింపనేరఁ డని లో నీక్షించితేమో మఱే
రచ్చ న్నిన్ను స్మరింపనో నొడువు మర్మంబేల? కామేశ్వరీ.
99
మ.
కరుణ న్నీపతి ప్రోచె మున్ను నల మార్కండేయుని నన్ను నా
తురునిం బ్రోచి తదీయసామ్యమును బొందుంగాక నీపేర్మి యం
బరొ? యీలాగున నెంతకాల మిఁక నీభక్తుండ నయ్యుందు రు
ద్ధరమౌవ్యాధి భరింతు నీ కిది యసాధ్యం బౌనె? కామేశ్వరీ.
100
మ.
పడిసెంబో తలనొప్పియో జ్వరమొ తాపంబో మఱేమంచు నీ
నడి కాలమ్మున గృచ్ఛనామకపుమున్నర్కంపురోగంబు నా
కడకున్ ద్రోచితి దీనిపే ర్దలచినన్ గంపించు దేహంబు నీ
యడుగు ల్మ్రొక్కెద దీనిబారి కిఁకఁ ద్రోయంబోకు కామేశ్వరీ.
101
శా.
పున్నెం బెన్నఁడు చేసి నే నెఱుఁగ నేప్రొద్దు న్మహాపాపసం
పన్నుండ; న్భరదూషకుండను; బశుప్రాయుండ; దుష్టుండ; నా
పన్నుండన్; శరణంటి; నాపిదకు, నాభాగ్యంబు, నీచిత్త
మాపన్నార్తి ప్రశమౌషధాయితకృపాపారీణ కామేశ్వరీ.
102
మ.
“పదరా పాపదరా” యటంచు మెడపైఁ బాశంబులం బెట్టి గెం
టుదు రాకాలునిభృత్యు లంచు మదిలో డొంకింతయన్ లేక నీ
పదభక్తి న్విడనాడి పందనయి పాపం బెన్న నార్జించి నీ
పదరాజీవము లాశ్రయించితిని సంబాళింపు కామేశ్వరీ.
103
శా.
బాల్యం బెల్లను గ్రీడచే నరుగుఁ బో భామారతిప్రక్రియా
లౌల్యోద్రేకముచేత యౌవనము నేలంగూలు; సంతప్తమౌ
మాల్యంలో యన నొప్పు వార్ధకము దా మాయుంగదా? చింతల
న్శల్యంబు ల్మిగులున్ ద్వదీయపదవి న్సాధింపఁ గామేశ్వరీ.
104
మ.
తపముం జేయఁగలేదు దానములు నేఁ దథ్యంబుఁగా జేయలే
దెపుడుం బెద్దలు వల్కుచట్టములయం దిచ్చం జరింపంగ లే
దిపు డేలాగుననో భవచ్చరితమం దిష్టంబు గల్గె న్మదిన్
నెపము ల్మూలకుఁ ద్రోచి ప్రోవుమి నను న్నీచాత్ముఁ గామేశ్వరీ.
105
మ.
జననీగర్భములోనఁ గొన్నిదినము ల్సాధుత్వముం జెందియుం
టినొ లేదో వివరింపరా దవల నాఠీవు ల్గణింపంగ నీ
కును శక్యంబని యెంచఁబోననిన నాకుం జక్కఁగా నీకడ
న్మనవింజేయఁగ నెట్లు శక్యమగు? న న్మన్నింపు కామేశ్వరీ.
106
శా.
శ్రీ రంజిల్లెడిపద్యము ల్శతకమై చెన్నొంద నీమీఁద నే
నారంభించిన దాది ని న్నడుగునాయాకోర్కులన్ గొన్ని మున్
దీరెన్ దీరుచునుండెఁ దీరఁగల వీ తీ ర్కొంతసూచ్యార్థతన్
గూరె న్వచ్చెడిదానిసూచన లెఱుంగున్ గాదె! కామేశ్వరీ.
107