Jump to content

భక్తిరసశతకసంపుటము/మొదటిసంపుటము/రామరాఘవశతకము

వికీసోర్స్ నుండి

పీఠిక

ఈ రామరాఘవశతకమును పల్లి పార్వతీశముగారు రచించిరి. ఈయన నివాసస్థానము గుంటూరు జిల్లా పల్నాడు తాలూకాలోని గుత్తికొండ యనుగ్రామము. వీరి దారపుత్రాదులు గుత్తికొండలోనే యున్నారు. 1908-వ సం॥ న నేను దాళపత్రగ్రంథాన్వేషణప్రయత్నములో నున్నతఱిఁ బార్వతీశముగారి కుమారులు వారింట నున్నగ్రంథముల నా కొసఁగిరి. వానిలో నీశతకముకూడ నుండెను. పార్వతీశముగారి తండ్రిపేరు నరసింహముగారు. నరసింహముగారుకూడఁ బద్యరచన చేయుచుండినట్లు కన్పట్టుచున్నది. శబ్దాలంకారములకొఱకుఁ బాటుపడినస్థలములఁ దప్పఁ దక్కినచోటుల నీశతకమున దోషము లంతగా లేవు. అందందు వ్యాకరణవిరుద్ధప్రయోగములు కన్పట్టుచునే యున్నవి. గ్రంథ మొక్కటి రచింపవలెనను సంకల్పముచేతమాత్రమే ప్రేరేపింపబడినవారు వ్రాసిన గ్రంథము లనేకములు మనకుఁ గలవు. పార్వతీశముగారు శతకము వ్రాసినకాలమునఁ బద్యరచనయందలి వేలమువెఱ్ఱి యిప్పుడున్నంత లేదు.

యాచనకుఁ బచ్యరచనయే యప్పటికి నిప్పటికిఁ బరమసాధనముగా నున్నది. కాకునూరి అప్పయ్యలాక్షణికుల వారికతమున మా పల్నాటిసీమయే పద్యరచనామార్గమును విశాలపఱచెను. తిట్టుపద్దెము లల్లి వ్యాపింపఁ జేయుదురనుభయము కవిబిరుదధారులయెడఁ బూర్వకాలమునుండి వచ్చుచున్నది. ఈభయమువలన నేమి, పద్యరూపస్తోత్రాపేక్ష నేమి, యాచించినప్పుడు వైదికావధానులకు, (వేదమును వల్లించు నవధానులు) శాస్త్రులకు, సోమయాజులకుఁ, బాకయాజులకు నిచ్చినదానికంటె జను లిప్పటికిఁ గవీశ్వరబిరుదధారులకే యెక్కువగా నిచ్చుచున్నారు. కవీశ్వరబిరుదమును ధరించిన యాచకులు వేలకువేలు గడించితి మని విఱ్ఱవీగుటయు సంభవించుచున్నది. ఈయాచకులవలనఁ గవిశబ్దమునకు గౌరవము పోయినదని చెప్పవచ్చును. ఈయాచకులు ఘనమైన కవిశబ్దమును బాడుసేయుచుండఁగా దానిని గమనింపక వారికి నూఱాఱు లిచ్చు నిప్పటిప్రజల యజ్ఞానమునుగూర్చి మిక్కిలి చింతింపవలసియున్నది. కవీశ్వరబిరుదమును ధరించి చేసినయాచనయే మహాగౌరవకర మని తలంచి యాత్మస్తుతులు గావించికొనుచు, మాకంటే ఘనులు లేరని చెప్పుకొనుచు గర్వపర్వతశృంగము నధిష్టించి యుండునజ్ఞులకు నట్టివారి కిచ్చు ప్రజలకుఁ బైపఙ్క్తు లన్వయించును. విద్వాంసులు, శాస్త్రజ్ఞులు, సత్కవులు సంతత వాజ్మయపరిశ్రమము చేయుచుందురు. వారు రాజులయొక్కయు బ్రజలయొక్కయు నాదరణమును బొందుట యవసరంబైననగును. ప్రజలు భరింపకపోవుదురుగాక! రాజు లాదరింపకపోవుదురు గాక! ఉదరపూరణార్థము స్వేదకణంబు లొలుక శరీరమును గష్టపెట్టవలసియున్నను, నపారదారిద్ర్యంబునఁ గడగండ్ల నందుచున్నను నాత్మగౌరవంబు, స్వాతంత్ర్యంబు వదలక యుత్తమమార్గమునఁ బ్రవర్తించిన బమ్మెరపోతరాజు నెయ్యది కడుపు చల్లగాఁ గనెనో యాయాంధ్రదేశమునకు జయము. పార్వతీశముగారో వారితండ్రి నరసింహముగారో కొందఱఁ బొగడుదుఁ గొందఱఁ దెగడుచు వ్రాసిన పద్యములు కొన్ని తాళపత్రములమీదఁ గాన్పించినని. ఆపద్యముల నుదాహరించుచున్నాను.

క.

ఉత్తముల కీయ నేర్చిన
యుత్తములను నడుగనేల యుత్తలపడమా
కిత్తఱిని వేడనేటికిఁ
జిత్తము మీ రెఱుఁగరయ్య చింతితఫలదా.

1


క.

విత్త................
విత్తాఢ్యుం డైన క్రొత్త వేంకటనరసా
యుత్తమలోకము కేగెను
జిత్తము రంజిల్ల మోక్షచింతారతుఁడై.

2

క.

అంతట మంత్రాగ్నిక్రియ
సాంతముగా నిత్యకర్మసంస్కారచయం
బెంతందుశాస్త్రధర్మం
బెంతయుఁ జేసితివి నీవ యందఱు సుతులే.

3


శా.

ఈరీతిన్ బితృయజ్ఞములలో నేవర్తకుల్ చేసిరీ
దారం బ్రౌఢిమ మీఱ షోడశమహాదానాదిగోదానముల్
సారోదారతనూతనాంబరజలస్థాలీలతో నిచ్చితౌ
వీరాగ్రేసర క్రొత్తబస్వయసుధీ విఖ్యాతభాగ్యోన్నతీ!

4


క.

అడుగక యిచ్చెడు దాతలు
నడుగుదురా క్రొత్తబస్వయంతటివాఁడై
నడుపక నడచెడిదానము
కడువడి సత్కవులఁ దన్సు గాదే భూమిన్.

5

ఈ పద్యములలోని “క్రొత్త" వారు గుత్తికొండలోను, దానికి సమీపమున నున్న జూలకంటిలోను నున్నవారు. వీరు వైశ్యులు.

క.

అలఁగుచు రేపల్లెంగల
బలవంతులచుట్టు నిన్ను బలిద్రిప్పుచు మీ
పొలిమేరయొద్దఁ బెట్టద
వెలయఁగ పువ్వాడ మొండి వేంకటరెడ్డీ!

1


క.

భూసురులు నర్థవాదులు
భాసురు లవనీశులంత భావింపంగా
శ్రీసహితు లెల్లవైశ్యులు
వాసిగ రేపల్లెఁ బొగడ వశమే మాకున్.

2

క.

ఇలలో దాతల నెన్నఁగ
ఫల మే మిఁక నిన్నుఁ జూడఁ బాల్పడితిని నా
బల మెఱుఁగ వేమి చెప్పుదు
వెలయఁగ పువ్వాడ మొండి వేంకటరెడ్డీ!

3


క.

బలిముఖుకైవడి నినుఁ గొని
చలమున నూరూరఁ బాత చెప్పతకలచే
నలగఁగఁ గొట్టుచుఁ ద్రిప్పెద
వెలయఁగ పువ్వాడ మొండి వేంకటరెడ్డీ!

4

ఈపద్యములలోని "వేంకటరెడ్డి” యనువారు రెడ్డికులజులనుభ్రాంతి కలుగవచ్చును గాని వైశ్యులే యని యెఱుంగనగును. ఈరీతి దూషణపద్యములకుఁగాని భూషణపద్యములకుఁ గాని విలువ యేమాత్ర ముండునో వేఱుగఁ జెప్పనక్కఱలేదు. వీనిని జల్పములలోఁ జేర్పవచ్చును. పార్వతీశముగారు సంస్కృతముకూడఁ గొంత చదివినట్లు కాన్పించుచున్నది. వీరు సంస్కృతభాషలో రామలింగాష్టకము, రామచంద్రాష్టకము నని రెండష్టకములు వ్రాసిరి. వీరు స్మారులు. వీరి శివభక్తిని విష్ణుభక్తినిఁ దులయం దిడి తూప విష్ణుభక్తివైపునకే ములు సూపును. ఈరీతి శివభక్తి, విష్ణుభక్తి యొక్కరియందుండుట మన మతచరిత్ర నెఱుఁగనివారికి విచిత్రముగా నుండును. అద్వైతమతవ్యాప్తిచేఁ గలిగిన ఫలమిది. పార్వతీశముగారు స్వగ్రామాభిమానసూచకముగా గుత్తికొండలో నివసించు రామలింగమును భజించుచున్నా నని చెప్పికొనినాఁడు. వారియష్టకముల దిగువ నుదాహరించుచున్నాను.

రామచంద్రాష్టకము

శ్లో.

శ్రీజానకీశం రవికోటిరూపం
హేమాంబరం భక్తజనాళిపోషం,
మోక్షప్రదం దానవదర్పభంగం
వందామహే శ్రీరఘురామచంద్రం.

1


శ్లో.

పంకేరుహాక్షం దురితౌఘనాశం
కామప్రదం రత్నకిరీటభాసం,
కోదండపాణిం మునియాగరక్షణ
వందామహే శ్రీరఘురామచంద్రం.

2


శ్లో.

సాకేతవాసం గిరిజేశమిత్రం
వల్కాంశుకం కౌస్తుభసద్విభూషం,
సురేంద్రసంపూజితపాదపద్మం
వందామహే శ్రీరఘురామచంద్రం.

3


శ్లో.

జీమూతగాత్రం దశకంఠలుంఠం
గ్రైవేయసద్భూషణరాజితాంగం,
కల్యాణదం వానరబృందవంద్యం
వందామహే శ్రీరఘురామచంద్రం.

4


శ్లో.

కుందేందుహాసం గహనేవిహారం
తార్క్ష్యధ్వజం కాయజకోటిభావం,
శ్రీకంఠకోదండహరం శుభాంగం
వందామహే శ్రీరఘురామచంద్రం.

5

శ్లో.

మారీచగర్వోపహారం మునీశం
మున్యంగనాశాపవిమోచనంచ,
పాపౌఘతూలాగ్నినిభాత్మరూపం
వందామహే శ్రీరఘురామచంద్రం.

6


శ్లో.

వేదాంతవేద్యం ఖరదూషణఘ్నం
శాఖామృగేంద్రేష్టఫలప్రదానం,
కారుణ్యసింధుం కమలాయతాక్షం
వందామహే శ్రీరఘురామచంద్రం.

7


శ్లో.

నాగేంద్రతల్పం పితృవాక్యపాలం
మార్తాండవంశార్ణవశీతభానుం,
ధాత్రీసుతామానసకంజమిత్రం
వందామహే శ్రీరఘురామచంద్రం.

8


శ్లో.

శ్రీపల్లివంశాబ్ధిసుధాకరేణ
శ్రీపార్వతీశాఖ్యకవీశ్వరేణ,
రామాష్టకం యఃపఠతే మనుష్యః
సతతం సమోక్షం లభతే హి సత్యం.

9

రామలింగాష్టకము

శ్లో.

గౌరీనాథ మనంగదర్పహరణం శ్రీకంఠమిందూల్లన
న్మౌళిం చంద్రదివాకరాగ్నినయనం నాగేంద్రభూషోజ్వలం,
సారంగాంచితపాణిపద్మ మనఘం దేవౌఘసంపూజితం
శ్రీ[1]గుచ్ఛాద్రిపురాధివాసమనిశం శ్రీ రామలింగంభజే.

1


శ్లో.

గంగాశుభ్రతరంగచంచలజటాజూటత్రిశూలాన్వితం
నాగేంద్రాజినసంవిశత్కటితటం నాగోజ్వలత్కుండలం,

కారుణ్యాంచితలోచనం పురహరం కందర్పకోటిప్రభం
శ్రీగుచ్ఛాద్రిపురాధివాస మనిశం శ్రీరామలింగంభజే.

2


శ్లో.

గౌరీమానససారసోష్ణకిరణం రుద్రాక్షమాలాధరం
శ్రీనారాయణచిత్రపద్యనిలయం వరాసనాద్యర్చితం,
సంసారాబ్ధిపతనోరుతరణీం సంగీతలోలం శివం
శ్రీగుచ్ఛాద్రిపురాధివాస మనిశం శ్రీరామలింగంభజే,.

3


శ్లో.

సంధ్యాకాలవిలాసనృత్యచతురం భక్తేష్టకామప్రదం
నందీశాదిగణేంద్రబృందవినుతం నాకేశసంపూజితం,
లక్ష్మీనాథదృగబ్జపూజితపదం యక్షేశ్వరాభ్యర్చితం
శ్రీగుచ్ఛాద్రిపురాధివాస మనిశం శ్రీరామలింగంభజే.

4


శ్లో.

శ్రీమద్భక్తజనాళిరక్షణపరం భస్మోజ్వలద్విగ్రహం
కైలాసాధిప మప్రమేయ మభవం సోమం సురేంద్రార్చితం,
శార్దూలాజినధారణం క్రతుహరం వేదాంతవేద్యం విభుం
శ్రీగుచ్ఛాద్రిపురాధివాస మనిశం శ్రీరామలింగంభజే.

5


శ్లో.

గౌరీభూషితవామభాగ మసురప్రధ్వంసినం భాసితం
శౌరేర్దత్తసుదర్శనం భవహరం ముక్తిప్రదం శంకరం,
కంజాతాక్షశరం పయోధిశరధిం జ్యాభూతసర్వాధిపం
శ్రీగుచ్ఛాద్రిపురాధివాస మనిశం శ్రీరామలింగంభజే.

6


శ్లో.

సూర్యాగ్నీందురసాపదాగతినభోం బ్వాత్మానిరూపానిమాన్
ధృత్వాయోపతతం విరాజతిముదా తందేవ వంద్యం సదా,
కోదండీకృతకాంచనాద్రి మృషరాడ్వాహాదిరూఢం భవం
శ్రీగుచ్ఛాద్రిపురాధివాస మనిశం శ్రీరామలింగం భజే.

7


శ్లో.

వ్యాసాత్రిప్రముఖర్షిచిత్తమధువిట్సంసేవ్యపాదాంబుజం
కుందేందూజ్వులమందహాసలహరీరాజన్ముఖాబ్జం హరం,

భక్తామంగళ శైలభేదన మహాదంభోళిధారావహం
శ్రీగుచ్ఛాద్రిపురాధివాస మనిశం శ్రీరామలింగంభజే.

8


శ్లో.

శ్రీమత్పల్లికులార్ణవేందువిలసచ్ఛ్రీనారసింహన్యస
తుత్రేణేహతుపార్వతీశకవినాప్రోక్తం శివస్యాష్టకం,
శ్రీగుచ్ఛాద్రినివాసినోభపహరం శ్రీరామలింగస్యవై
యేభత్తాస్సతతం పఠంతి మనుజాస్తేయాంతి మోక్షంధ్రువం.

9

వీరి నీరచన కెయ్యది పురికొల్పెనో యది విచార్యము. ఘనభావములు గాని, భక్తవరులహృదయసీమలయందుఁ బ్రతిఫలించు దివ్యతేజస్సుయొక్క ఛాయ గాని, కవితాజ్వలనముయొక్క వేడిమిగాని, దృశ్యప్రపంచయవనికాంతర్గతలీలాదర్శనవిలాసంబు గాని శతకంబున వెదకవలసి యున్నది. ఆనందాశ్రువు లట్టహాసములు, చాంచల్యము, సంస్తంభనము, పార్వతీశముగారి కవస్థాభేదము కలిగించినట్లు తోఁపదు. పురాణగాథల నుల్లేఖించువిశేషణములు, సంబోధనములు మొదలగువానితోఁ బద్యములను వీరు నింపి "విరచించుశక్తి పుట్టని పురుషునిచదువులు ప్రకాశములుగావు.” అని కాకునూరి అప్పయ్యలాక్షణికులవారు చెప్పినవాక్యములను వీరు దృఢముగా మనస్సునం దుంచుకొనియుందురు. చుట్టును గొండలచేతను నడవులచేతను గృష్ణానదిచేతను నావరింపఁబడి తక్కినదేశమునుండి వేఱైయున్న మాపల్నాటిసీమలోఁ బద్యరచనచేఁ బ్రజలయాదరమునుగాని గౌరవమునుగాని పొందలేనికాలమునం దీదృశకృషి సల్పినందుకు పార్వతీశముగారినిఁ గొనియాడఁదగును. పార్వతీశముగారిశైలి ధారాళముగా నున్నది. వీరు శబ్దాలంకారప్రియులు, యమకమును దఱచుగ వాడుదురు. పద్య మెట్లు రచించినఁ జదువుట కింపుగా నుండునో వీరికి దెలియును. వీరిరచనయందు దఱచు గానట్టుండదు. [2]పార్వతీశముగారి కుమారులు వేంకటనారాయణగారును, హనుమయ్యగారును, నాకుఁ దాళపత్రగ్రంథము లొసఁగినప్పు డీశతకము నచ్చు వేయించెదరాయని యడిగిరి గాని వేయించెదనని చెప్పఁజూలకపోయితిని. తాళపత్రగ్రంథము లిచ్చువారంద ఱట్ల యడుగుదురు. అచ్చు వేయింతుమని యెవరికని చెప్పఁగలము? ఔదార్యముతో నచ్చొత్తించిన శ్రీయుతులు శ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రులుగారికిని, నీవిషయమున శ్రమపడిన శ్రీ మజుందారు రామారావుపంతులుగారికిని పార్వతీశముగారి కుటుంబపక్షమునఁ గృతజ్ఞతను దెల్పుచున్నాను.

52. ఆఫీసు వేంకటాచలమొదలివీథి,

అక్కినేని

తిరువల్లిక్కేణి, చెన్నపురి.

ఉమాకాంతం

18-9-13.

శ్రీరస్తు

పల్లి పార్వతీశకృత

శ్రీరామరాఘవశతకము

ఉ.

శ్రీమహిజాకుచస్తబకసీమవిలిప్తపటీరకుంకుమో
ద్దామ! మృగీమదాగురుయుతస్ఫుటగంధవిశేషవాసిత
స్థేమభుజాంతరస్ధితవిచిత్రమణీమయహారవల్లికా
స్తోమ! గుణాభిరామ! పటుదోర్బలవిక్రమరామ రాఘవా.

1


ఉ.

భానుకులాబ్ధిసోమ! జితభార్గవరామ దయాభిరామ! స
జ్జానుపరీతబాహుధృతచాపవిముక్తశరాళిగర్వయు
గ్దానవనాథయూధమదఖండనభీమ! సమస్తయోగిస
న్మానితదివ్యనామ! రిపుమర్దన విక్రమరామ...

2


ఉ.

శ్రీధర కాళిదాసులను జిత్తమునం దిడి సన్నుతించి శ్రీ
నాథకవీంద్రముఖ్యులకు నమ్రుఁడనై నుతియించి భక్తినా
మోదకచంపకోత్పలసమున్నతమౌ శతకం బొనర్చెద
న్సాధులు మెచ్చ నిచ్చెదను సత్కృప గైకొను రామ...

3

చ.

దశరథరాట్కుమార! భవతాపనిరాకరణప్రచార! స
త్కుశికతనూజబోధితసుగోప్యతరోజ్జ్వలమంత్రవార! శ్రీ
పశుపతికార్ముకాస్ఫటనభాసురబాహుయుగప్రసార! దు
ర్వశదశకంఠదోర్బలనివార! దయాకరరామ...

4


ఉ.

శ్రీరఘువీర! భక్తజనచిత్తసరోజవిహార! దీనమం
దార! విరోధిదానవవితానవిదూర! మనోజసుందరా
కార! వినీలనీరదవికాసశరీర! విపక్షయూధకాం
తారరుఠాక! దుర్జనవిదార! గుణాకరరామ...

5


ఉ.

రామ! విరోధిరాక్షసవిరామ! విరాజితనీలకంధర
శ్యామ! కృపాభిరామ! కలుషవ్రజమోచనామ! సద్గుణ
స్తోమ! మహీలలామ! రిఫుసూదనకామ! దశాస్యఖండనో
ద్దామ! సరోజమిత్త్రసమధామ! పరాక్రమరామ...

6


చ.

జలరుహపత్రనేత్ర! రిపుశాసనసుందరవేత్ర! హాటకో
త్కలనకటిప్రసూత్ర! ఖరదైత్యమహావనవీతిహోత్ర! దు
ష్కలుషలతాలవిత్ర! సురసంఘహృదంబుజుమిత్ర! మేచకో
జ్జ్వలఘనగాత్ర! యోగివనచైత్ర! జనస్తుతరామ...

7


చ.

అసురమదప్రభేద! యమరేంద్రసమర్చితపాద! భక్తహృ

ద్భిసజవినోద! దుష్టరివువీరశ్రుతామితచాపనాద! రా
క్షసపతిచిత్తఖేద! రవిజాతవిభీషణసుప్రసాద! తా
పసజనహృద్విమోద! నిజభక్తఫలప్రద! రామ...

8


ఉ.

రామ! కకుత్థ్సవంశజలరాశిసముజ్జ్వలసోమ! నీరద
శ్యామ! త్రిలోకధామ! త్రిదశద్విషదీశవినాశనక్రమో
ద్ధామ! నిజాంఘ్రిభక్తజనతావనకామ! కృపాభిరామ! సు
త్రామమణిప్రభాధగితధామ! సురోత్తమ రామ...

9


ఉ.

సుందరజానకీహృదయశుభ్రసరోరుహపద్మినీశ! స
ద్వందితసత్ప్రదేశ! బలవద్రిపునాశ! వినీలవారిభృ
దృృందసకాశ! నిర్దలితభీకరదుష్కృతజన్మపాశ! రా
కేందుయశఃప్రకాశ! దనుజేంద్రగజంకుశ! రామ...

10


చ.

వనజదళాయతాక్ష! భవబంధవిమోచనదీక్ష! ఘోరదు
ర్జనతతిశిక్ష! బాహుబలశౌర్యనిశాటవిపక్షభండనా
ర్జునభుజపంచకద్విశతసూదనభార్గవరామగర్వశా
సనకృతిదక్ష! దీనమనుజవ్రజరక్షక! రామ...

11


ఉ.

మండితభోగిరాట్నయన! మర్దితపాపవితాన! చండకో
దండకళాప్రధాన! రిపుదారణశౌర్యవిరాజమాన! దో

ర్దండభరావనీన! ఖగరాజసమాహితయాన! పూతమా
ర్తాండకులీన! భక్తజనతావనపావన! రామ...

12


చ.

అతులితభక్తపోష! పరమార్థవిశేష! మణీమయప్రజా
వితతవిభూష! సర్వకపివీరదయాపరితోష! నామవా
రితసకలప్రదోష! శబరీలలనామృతదాభిలాష! వా
క్పతిహృదయాబ్జపూష! రిపుభంజనపౌరుష! రామ...

13


చ.

అతులితభాగధేయ! జలజాప్తతనూజసహాయ! భక్తసం
తతవరదాయ! దీనజనదానవిధేయ! సువర్ణకుండల
ద్యుతి సముదాయ! మేచకపయోధరకాయ! కబంధదైత్యసం
హృతసదుపాయ! తాపససుహృత్ఫలదప్రియ! రామ...

14


చ.

పవనతనూజరక్షణ! భవవ్రజశిక్షణ! దీనపోషణా!
ప్రవిమలకుంతలాభరణ! పద్మదళేక్షణ! సత్యభాషణా!
రవికులభూషణా! త్రిదశరాట్హృదయాంబుజపూషణా! మునీ
ట్సవనవిఘాతరాక్షసవిదారణకారణ! రామ...

15


ఉ.

అండజరాట్తురంగ! దనుజాధిపదర్పవిభంగ! యోగిహృ
త్కాండజభృంగ! వానరవితానలసత్కరుణాంతరంగ! కో

దండశరప్రసంగ! దురితాటవిపానకవిస్ఫులింగ! మా
ర్తాండజమానసాంబుజపతంగ! భుజాంగద రామ...

16


ఉ.

నారదగానలోల! మునినాథసమాజమనోనుకూల! దు
ర్వారబిడౌజనందనవిఫాల! నిరంతరధర్మశీల! శృం
గారసువర్ణచేల! మణికాంచనకుండలకాంతిజాల! వి
స్తారచయాలవాల! రిపుసంఘదవానల రామ...

17


ఉ.

అంబుజనేత్ర నీదు చరణాబ్జయుగంబులు నాదు మానసా
బ్జంబున నిల్పి సాధుజనసమ్మతిగా రచియించు పద్యకా
వ్యంబునఁ దప్పులుండిన భవత్కృపచేతఁ దొలంగిపోవె పం
కాంబువు చిల్లవిత్తున నవామలమైనటు రామ...

18


ఉ.

అండజవాహనుండు కనకాంబరభూషితుఁ డవ్యయుండు వే
దండసరప్రదాయుఁ డరితండదవానలుఁ డద్రిజేశకో
దండవిఖండనుండు నగు దైవము నీవని నమ్మియుంటి బ్ర
హ్మాండసహస్రనాయక! హరాబ్జజసన్నుత! రామ...

19


ఉ.

శ్రీమహనీయమూర్తికి, విశేషవచఃపరిపూర్తికి, న్మహో
ద్దాముదయానువర్తికి, నుదంచితకీర్తికి, రామమూర్తికి
న్వేమరు సాటి లేదనుచు వేడుక ఘంటికమ్రోత లొప్పు నీ
నామము దిక్కుల న్వినఁగ నంగ నొనర్చెద రామ....

20

ఉ.

గ్రక్కునఁ గాలకింకరనికాయము డాయఁగ నంతలోన ము
న్మిక్కిలి వాతపైత్యములు మించఁగ నప్పుడు నిన్ దలంపఁగా
నెక్కొనదాత్మ మీస్మరణ నే నొనరించెద నిప్పుడే మది
న్మక్కువతోడఁ ....మిఁక నారదవందిత రామ...

21


ఉ.

కుక్షి నజాండపంక్తు లొనఁగూర్చి జనంబులఁ బ్రోది సేయఁగా
దక్షుఁడ వీవ ప్రోచుటకుఁ దండ్రివి నీతనయుండ నన్ను సం
రక్షణ చేసి జన్మజలరాశి తరింపఁగఁ జేయుదంచు నే
దీక్ష వహించినాఁడఁ గడతేరఁగఁ జేయుము రామ...

22


చ.

బలమదగర్వభావమున బాహుయుగోజ్జ్వలదుష్టకర్ముఁడై
జలనిధి డాఁగియున్న శ్రుతిచౌర్యవినీతుని రాక్షసేంద్రునిం
జెలఁగి వధించి వేదములు చేకొని బ్రహ్మకు మత్స్యమూర్తివై
వెలయఁగనిచ్చి ప్రోచితివి వేడుక మీఱఁగ రామ...

23


చ.

మహితసుధాబ్ధి భాండముగ మందరశైలము మంథనంబుగా
నహి తరిత్రాడుగాఁ గొని సురాసురసంఘము వార్ధిఁ దర్వ ని
మ్మహి చలియింప దిక్కరులు మానుగ భీతివహింపఁ గూర్మమై
విహితముగా ధరాధరము వేడుకనెత్తవె రామ...

24


చ.

ప్రబలమదాతిరేకమున బాహుయుగోద్ధతి పెంపుమీఱఁగ

న్విబుధవరేణ్యుఁ బట్టి పరివేదనచే నలయించి క్రూరత
న్నిబిడధరాతలంబు కడునేర్పునఁ జుట్టిన హేమనేత్రునిన్
సబలత ఘోణివై తునిమి సంభ్రమ మొందవె రామ...

25


చ.

శుంభదనర్గళప్రబలశోభితవీరనృసింహమూర్తివై
స్తంభమునందున న్వెడలి దారుణవిక్రమబాహుశక్తి ను
జ్జృంభణచే మదాన్వితకుచేష్టుని దుష్టునిఁ బుత్రఘాతుకు
న్గుంభన మొప్పఁ ద్రుంచి సుతుకొర్కు లొసంగిన రామ...

26


ఉ.

పాదయుగంబు భూగగనభాగముల న్బ్రసరింపజేసి స
మ్మోదమున న్బలీంద్రుని నమోఘచమత్కృతితో నణంచి దే
వాదిమునీంద్రులెల్లఁ గొనియాడఁగ ధారుణి వజ్రి కిచ్చి సం
పాదితదివ్యకీర్తివగు వామనమూర్తివి రామ...

27


ఉ.

వీరభుజప్రతాపపృథివీశుల నిర్వదియొక్కమాఱు నే
పారఁగఁ ద్రుంచి పార్థివజనావళిరక్తముచేఁ బితృక్రియల్
సార మొనర్పఁ జేసి త్రిదశవ్రజ మెన్నఁగ విప్రకోటికిన్
ధారుణి ధారవోసితివి తథ్యము భార్గవరామ...

28


చ.

తరణికులంబునన్ దశరథక్షితిభర్తకుఁ బుట్టి జానకి
న్బరిణయమొంది కానననివాసము చేసి విరాధదైత్యసం

హరణ మొనర్చి వానరసహాయము గైకొని పంక్తికంఠుని
న్దురమునఁ బట్టి త్రుంచితివి తోయజలోచన రామ...

29


చ.

వెఱువక నాప్రబలంబుఁ డొగి వెన్నున నిన్ను ధరించి యాడఁగా
నరుగఁగ వానిమాయఁ గని హస్తతలంబునఁ దద్దురాత్ముని
న్శిరము బగిల్చినావు కురుసింహునిగర్వ మణంగ నాఁగటన్
గరిపుర మెత్తు సీరివి జగన్నుతదైవమ రామ...

30


చ.

యదుకులదుగ్ధసాగరసుధాకరుఁడై దగుకృష్ణమూర్తివై
ముదమున లోకబాధకుల మూర్ఖబకప్రముఖాసురాదుల
న్గదనమున న్వధించి శిశుఘాతుకు దుష్టునిఁ గంసుఁ ద్రుంచి పెం
పొదవఁగ నుగ్రసేనునకు నుర్వి నొసంగిన రామ...

31


చ.

త్రివురములం దహింపఁగ సతీశుని కస్త్రమ వౌచు నంతపైఁ
ద్రిపురసతు ల్భ్రమల్ గొనఁగఁ దేజున రావిని యావరించి త
ద్విపులసతీవ్రతంబు విడిపింపఁగ నీ విటు బుద్ధరూపు దా
ల్చిపు డిల నెన్న శౌర్యమతి వీవె మురాంతక రామ...

32


చ.

ధరణినిఁ గల్కిరూపమును దాల్చి జగంబుల దుష్టవర్ణసం
కరమనుజాళిఁ జూచి తురగంబును నెక్కి దురంతదంభము

ష్కరుల హరించి బాహుబలశౌర్యసముజ్జ్వలదుగ్రశక్తివి
స్ఫురణ వహించి సజ్జనులఁ బ్రోతువు నీ విఁక రామ...

33


చ.

పరమదయాంబురాశి నినుఁ బల్మఱు మామకమానసంబునన్
నిరతము సన్నుతించెదను నిత్యము న న్గృప జూచి ప్రోవు మీ
శరణని వేఁడితి న్విమలసారసనాభ సురేంద్రసేవితా
తరణిశశాంకలోచన శతారధరస్తుత రామ...

34


ఉ.

సూరిజనాళిపాల! మణిశోభితకుండలకాంతిజాల! య
క్రూరమనోనుకూల! శరకుందసితాజ్జయశోవిశాల! బృం
దారకహృద్విలోల! విబుధద్విషదీశవిఫాల! పాపసం
చారవిపక్షకాల! మురసాళ్వఘనినాలరామ...

35


ఉ.

తల్లివి తండ్రి వీవ! పరతత్త్వము నీవ! సఖుండ వీవ! నా
తొల్లిగురుండ వీవ! హతదోషుఁడ వీవ! పరుండ వీవ! సం
ఫుల్లసరోజనేత్ర! పరిపూర్ణ దయాంబుధి వీవ! మేదినీ
వల్లభదైవ మీవ! యపవర్గశుభప్రదరామ...

36


ఉ.

పూరిశరంబుగా విడువ భూరిభయంబున మూఁడులోకముల్
చేరి చరింప రక్షకుఁడు చిక్కకయున్నఁ గలంగి త్రాతగాఁ
గోరిన కాక దానవునికోర్కు లొసంగితివయ్య నీదు దు
ర్వారమహత్త్వ మెన్నఁగ సురాళి కశక్యము రామ...

37

ఉ.

పొంచి రఘూద్వహుండు ధనువు న్గుణరావ మొనర్చి లక్ష్యము
న్గాంచి మహోగ్రదివ్యవిశిఖంబున భూస్థలిఁ గూల వాలి భం
జించి పతంగపుత్రకునిఁ జేకొని రాజ్య మొసంగి వాని క
భ్యంచితలీల గామితవరాల నొసంగవె రామ...

38


చ.

కడువడితోడ మీపనులఁ గాంక్ష జనింప సమీహితేచ్ఛచే
నుడుగక వాలమం దిడి మహోర్జితసైకతజాల మంబుధి
న్విడువక వేయునయ్యుడుత వీపు పయిం దొరలాడఁ జేతితో
దడయక ద్రువ్వి బ్రోచితివి దైత్యవిభంజన రామ...

39


ఉ.

వాచవిఁగొన్న తియ్యని నవాయతపక్వఫలంబు లాత్మకున్
నీచముగాఁ దలంపకయ నిస్తులలీల భుజించి ప్రీతిచే
గాచఁదలంచి యిష్టశుభకామఫలంబు లొసంగి వేడ్కతోఁ
గాచవె సత్కృపన్ శబరి కామిని నీ విల రామ...

40


ఉ.

శ్రీకరపుణ్యమూర్తి వని చిత్తమునందు మునీంద్రులెల్ల నీ
రాకను గోరియుండి మది రంజిలుచున్ వినతాంతరంగు లై
చేకొనఁ బూర్ణశీతకరుఁ జేరు చకోరనికాయమట్ల నీ
ప్రాకటసత్కృపోన్నతికి బాల్పడియుండరె రామ...

41


ఉ.

నక్ర మవక్రవిక్రమమునం జలమందుఁ బదంబుపట్టి ని

ర్వక్రతతోఁ బెనంగఁగను వారణరా జతిభీతచిత్తుఁడై
చక్రి హరీ రమేశ నను సత్కృప సేయు మటన్న నక్రమున్
జక్రముచే హరించి గజసత్తముఁ బ్రోచిన రామ...

42


ఉ.

లేగల గోపబాలకుల లీల విరించి హరింప వేడ్కచే
బాగుగ బాలురన్ బశుల బ్రహ్మల సృష్టి యొనర్ప భీతిలోఁ
దూఁగఁగ ధాత మ్రొక్కిన విదోషునిఁ జేసితి వట్టి సత్కుృప
న్వేగమె నాపయిం బఱపి వేమఱుప్రోవుము రామ...

43


ఉ.

గోవుల గోపబాలకుల గోపికలన్ వెసఁజుట్టిముట్టుచున్
గావురు రీతిచేఁ బొదివి కారుపొగల్ గుమికూడ భీతులై
గావుము కృష్ణ కృష్ణ యన గమ్యదవాగ్ని హరించి సత్కృపం
బ్రోవవె మున్ను వారల నిరూఢిగ సంభ్రమ రామ...

44


ఉ.

అండలఁ జేరకుండ భుజగాధిపుబైఁ బవళించి వెంటరా
కుండ ఖగేంద్రవాహనముగూడి వసించెడిపట్టు చూడరా
కుండఁ బయోధిమధ్యమునఁ గూర్మివసించితి వింక నెట్లు నీ
దండకుఁ జేరుటొప్పు నిఁక దైత్యవిభంజన రామ...

45


చ.

పరమదయార్ద్రమూర్తివని ప్రస్తుతి చేయఁగఁ బల్కవేమయో
సరసిజనేత్ర! మీచరణసారసభక్తుని నార్తచిత్తునిన్

గరుణ యొకింత లేక యిటఁ గావకయున్నను జూచి నిన్ను ని
ద్ధరణిఁ గృపామయుండ వని దల్తురె భక్తులు రామ...

46


ఉ.

వేదచతుష్టయంబునను విశ్రుతమైన భవత్ప్రతాపము
న్వాదన చేయఁజాల మిము వాసిగ నమ్మితినయ్య దాసులన్
వేదన సేయ నేల దయ వేడుక పుట్టదె యింక నేమొకో
యాదర మొప్పఁ బ్రోవుటకు నర్హత లేదొకొ రామ...

47


ఉ.

దాసుఁడనంటి మీకథ లుదారత నేను దలంచుచుంటి నే
గాసుకు గవ్వకైనఁ గొఱగాని మనుష్యుఁడ సంతతంబు నే
వేసట లేక నిన్ను మొఱవెట్టుచు వేఁడిన రావదేమయా
భాసురచిద్విలాసగతిఁ బాటిల నీవిఁక రామ...

48


ఉ.

సారథివై సదాప్రియవిశాలుఁడవై హితబాంధవుండవై
తారకమూర్తివై పరమధన్యుఁడవై కరుణారసుండవై
భూరిగుణాబ్ధివై నను విముక్తునిఁ జేయుమఁటన్నఁ బార్థునిం
పూరఁగఁ బ్రోచి తీవె పురుషోత్తమ నీ విఁక రామ...

49


ఉ.

ఎంతని యెంతు నిన్ను మఱి యెంతని దూరుదు సాధువృత్తిచే
నెంతని విన్నవింతు నిఁక నెంతకు ని న్వినుతిప్రసంగ మే

నెంతగఁ జేసినన్ మన సదేల కరంగదదేమి భారమో
శాంతదయాసముద్రజలజాతవిలోచన రామ...

50


చ.

పతితుఁడఁ బాపమానసుఁడ భక్తివిహీనుఁడఁ బాపకర్ముఁడ
న్మతిరహితుండ లాలసుఁడ మానవిదూరుఁడ మత్తచిత్తుఁడ
న్వితతమత ప్రదూషకుఁడ విశ్రుతసజ్జనసంశకుండ దు
ష్కృతుఁడను నన్ను సత్కృపను శీఘ్రము ప్రోవవె రామ...

51


చ.

నలినదళాయతాక్ష! రవినందనవాయుతనూజరక్ష! స
త్కలితవిశాలవక్ష! వినుతాఖిలదానవనాథశిక్ష! దు
ష్కలుషవినాశదక్ష! బలశౌర్యవిరాధవిపక్ష! యోగిరా
ట్సలలితకల్పవృక్ష! ఘనసద్గుణలక్షణ రామ...

52


ఉ.

శ్రీరఘువంశతోయనిధి శీతమయూఖుఁడు సేవకామర
క్ష్మారుహుఁ డద్రిజాదయితచాపవిఖండనుఁ డప్రమేయుఁడున్
సారసనాభుఁడే కృపను సారెకుఁ బ్రోచునఁటంచు మీపదాం
భోరుహముల్ మదిం దలఁతు భూమిసుతావర రామ...

53


ఉ.

శారదనీరదేభరిపుశర్వసుపర్వగజాశ్వభారతీ
తారతుషారహీరకలధౌతమహీధరనాకవాహినీ
పూరమరాళదేవవృషపుంగవకామగవీసుధాబ్ధిమం
దారఫణీంద్ర శుంభదవదాత యశస్కర రామ...

54

చ.

మనవి వినంగరాదె పరమార్థవిశేషము చూపరాదె నీ
మనమున నిల్పరాదె సుకుమారసులక్ష్యము చూపరాదె నా
వినయము చూడరాదఁటవె వీనులకు న్విన నింపు రాదె యో
వనజదళాయతాక్ష ననువారకప్రోవవె రామ...

55


ఉ.

యవ్వనవేళలందున మదాంధుఁడనై కుజనోరుసంగతిన్
దవ్వులఁ జేరి దుర్విషయతత్పరతం గడుదుష్టబుద్ధిచే
నవ్వుచు రౌరవాదుల ఘనంబుగఁ గూలెడు దుర్మనీషినై
క్రొవ్వుచు నీపదంబు మదిగోరకయుంటిని రామ...

56


చ.

నిరతము నీపదాబ్జములు నిక్కముగా మదిలోన నిల్పెదన్
పరమదయాసముద్ర నను పాలన సేయఁగ నీవె సుమ్ము భా
సురగతి నాదు నేరములు శ్రోత్రపథంబునఁ బెట్ట కిప్పుడే
ధరధరధీర! పోషితమదావళ నాయక రామ...

57


ఉ.

దానవవైరులందఱును దైత్యులకై త్రిదివంబుఁ బాసి యో
దీనశరణ్యమూర్తియని దీనత ని న్గొనియాడ వారికిం
పూర మహాదరంబున సముజ్జ్వలమోదముతోడ దైత్యరా
ట్సేనలఁ జంపి దైవమునిసిద్ధుల బ్రోచిన రామ...

58


ఉ.

నే భవదాశ్రయుండ ఘననిర్మలదాతవు నీవె యంచు ని

న్నే భజియింతునయ్య మఱి యేగతికైనను సాక్షి నీవయో
శోభనసంపద న్మిగులఁ జొన్పడఁజేయను నీవె గావునన్
లాభ మొసంగ నమ్మితిని లంపట దీర్పుము రామ...

59


చ.

తనయులఁ బెంచు తల్లివలె దాలిమిగల్గిన తండ్రికైవడిన్
ఘనముగ దీససంఘముల గాచు నృపాలకురీతి నీవు న
న్ననవరతంబు దాసుఁ డని యంచితభక్తివిలాసవైఖరి
న్మనమున సంఘటించి దయమానుగఁ బ్రోవవె రామ...

60


ఉ.

ఏ నిరుపాధికుండ నని యెంతయు వేఁడినఁ బ్రోవ వంతటం
బూనికతోడ నన్నుఁ బరిపూర్ణదయారసదృష్టిఁ జూడవే
మానితనీతిసాంద్ర! యసమానపరాక్రమ! భక్తసన్నుతా
ధీనయశౌర్యధుర్య! జగతీతనయేశ్వర రామ...

61


ఉ.

చూచితి గౌతమీనదినిఁ జూచితి భద్రనగాధిరాజము
న్జూచితి జానకీసతినిఁ జూచితి వాయుతనూజముఖ్యులం
జూచితి నిన్ను లక్ష్మణునిఁ జూచితి శత్రునిషూదనాదులం
జూచితి పూర్ణభావమున సూటిగ నిన్నును రామ...

62


ఉ.

కామము గోరి సంతతవికారమున న్బడి క్రోధయుక్తులై
వేమఱు లోభము న్విడక వెంటనె మోహమదాతిమత్తులై

యేమర కిన్నరాధములు హెచ్చగుమత్సరభావలోలులై
నీమఱుఁగంద రట్లగుట నేను భజింతును రామ...

63


ఉ.

పూసల సూత్ర ముండుగతి బూని జగంబున నీదురూపమున్
దాసుల కబ్బుఁగాక మఱి తావకలీలలు చెప్ప శక్యమా
వాసిగ నీపదంబుఁ గనువారికి జింతన వేఱె లేదయా
రోసితి యీకళేబరము రొంపినిఁ ద్రోయకు రామ...

64


ఉ.

అండజగర్భజాది బహుళాంగములన్నియు నీటిపై గడుం
దండిగ బుద్బుదాకృతులు దాల్చిన నచ్చుఁ దలంచి సూక్ష్మమై
యుండుట గాంచు దెల్విఁగను నుత్తము లెవ్వరొ వారె నీవయా
పండితులైనవార లిటు ప్రస్తుతి సల్పరె రామ...

65


ఉ.

దీనదయాలవాల! భవదీపితభంజనశీల! యార్తస
మ్మానప్రమోదలీల! మునిమానసనృత్యవినోదఖేల! దు
ర్మానవరాడ్విఫాల! గజరాజహృదబ్జసదానుకూల! ప్రా
చీనమునీంద్రసంచయవిశేషసుపాలన రామ...

66


ఉ.

ఘోషజనానుమోద! ముచుకుందముఖార్చితపాద! భక్తిసం
తోషవచోవినోద! రిపుదోర్బలశౌర్యవిభేద! సత్యసం
భాషణవాద! దుష్టశిశుపాలవిఖండనచక్రనాద! దు
ర్దోషఖరాసురప్రముఖదుష్టనిషూదన రామ...

67

చ.

అతిదురవస్థలంబడి సదార్తుఁడనై మొఱవెట్టుచున్న మీ
మతి కఱఁగంగబోవ దిది మంచిగుణంబె? భవత్కృపారసా
మృతజలబిందుసేచనము మిక్కిలి దీనుఁడ నైన నాపయిన్
సతతము గల్గఁ జేయుమిఁక సాధుజనావన రామ...

68


ఉ.

అన్యసుఖోపభోగముల కాశల నొందుచు ముందు గాన కే
ధన్యుఁడ నంచు దుర్విషయతత్పరతం గడుహీనబుద్ధియై
యన్యమతాభిలాషకుల యాశ్రయ మొంది పశుప్రవృత్తిచే
మాన్యభవన్మహామహిమ మర్త్యుం డెఱుంగఁడు రామ...

69


ఉ.

పావనమౌ భవత్కథలఁ బాల్పడి నే వినలేదు ప్రీతిచే
భావములోన మీచరణపద్మయుగంబులు గొల్వలేదు సం
భావన చేయలేదు నిను స్వాంతమునం దతినిష్ఠభక్తిచే
సేవ యొసర్పలేదు ననుఁ జేకొని గావుము రామ...

70


ఉ.

కామసుఖోపభోగములఁ గాముకులై యిహసౌఖ్యసంగులై
పామరచిత్తులై భవముఁబాయ నుపాయము గానలేకయు
న్వేమఱు మోహవార్ధిఁ బడి వేదనలం బరితాపయుక్తులౌ
సోమరిపోతు లేగతినిఁ జూతురు ని న్నిల రామ...

71


ఉ.

శ్రీమహనీయచిత్త సరసీరుహసారసమిత్ర! జానకీ,
రామధరాధినాథ! రవికోటిసమానవిరాజమాన! సు

త్రామసనందనాదినుత! దైత్యవిలుంఠనబాణతూణ! సం
గ్రామమహోగ్రదివ్యమణికంకణభూషణ రామ...

72


ఉ.

నీపదభక్తి గల్గి కడునిర్మలులై నరకాదియాతన
ల్దీపితయుక్తిచే నణఁచి ధీయుతులై విలసిల్లువార లే
తాపములొంద రీవు భవతారకమూ ర్తివి నిన్ను గొల్తుఁ జి
ద్రూపభవత్పదాబ్జములు రూఢిగఁ జూపవె రామ...

73


ఉ.

నారదశౌనకాబ్జజసనందనమానసపద్మలోల డిం
డీరశశాంకపారదపటీరసితాబ్దయశోవిశాల! దు
ర్వారమృగాసురప్రముఖవర్గవిఫాల! కుచేలరక్షణా
పారకృపాలవాల! పరిపంథిదవానల! రామ...

74


చ.

సనకసనందనాద్యమరసన్నుత! భాస్కరవంశజాత! కాం
చననవరత్నసంఘటితచారువిభూషణభూషితా! ప్రభం
జనసుతభానుజార్జిత! నిశాచరసంహృత! నిర్జరేంద్రనం
దన! జితఘోరపాతకవితాననివారిత! రామ...

75


చ.

చిలువ నశించెఁ గానమునఁ జిక్కె మదేభము మైనసంబుకు
న్బొలుపుగ మీను వాచవికిఁ బోయి యణంగె గృశానుదీప్తికిం
బొలసెను సిళ్లు తావికిని బోయి చెడె న్భ్రమరంబు గాన నీ
ఖలగుణపంచకంబులను గడ్చుట శక్యమె రామ...

76

ఉ.

వంచన సేయ నేల! యనివారితసత్కృప గావ వేల! న
న్నించుక చూడ వేల! మది నెంచెద నీకథలెల్లఁ జాల! నీ
వంచనచిత్త మేల! నను వాసిగఁ జూడ వివాదమేల! మి
మ్మెంచగ నేను చాల మది నెంచుచునుంటిని రామ...

77


చ.

సతతము మీపదాబ్జములసన్నిధి గోరుచు సంప్రమోదులై
వితతసమస్తదోషముల వృత్తినణంచి యకల్మషాత్ములై
హితమగు రామమంత్రమును నిష్టమున న్బఠియించువాఁడనే
యతులితభక్తి నిన్నుఁ గొనియాడరె యుర్విని రామ...

78


ఉ.

ఎంతని దూరువాఁడ నిఁక నెంతకు నే వినుతించువాఁడ మీ
కెంతని దెల్పువాఁడ నిపుడెంతకు యాచన సేయువాఁడ నే
నెంతని యెంచువాఁడ మఱి యెంతగ నే మొఱవెట్టువాఁడ నా
చింత భవన్మనంబున వసింపఁగఁ జేయుము రామ...

79


చ.

ముదమలరంగ సద్గురునిబోధనచేఁ బరిపూర్ణచిత్తులై
వదలక నీదు నామరసపానమున న్ముదితాంతరంగులై
సదమలభక్తిచే నతతశాంతితిరస్కృతభేదమోదులై
చెదరనిబుద్ధి భక్తు లిల సేవ యొనర్తురు రామ...

80


ఉ.

దారసుతాళిరక్షణ కుదారమహీశులవద్ద చేరి వే
సారక మాటిమాటికిని సంస్తుతి చేసిన పాపసంఘము

ల్పారఁగఁదోల నిన్నొగి నుపాసన చేసెద సంతసంబునన్
సారదయాప్తిఁ గైకొనుచు సద్గతి నీఁగదె రామ...

81


చ.

జలధరదేహ నామనవి శ్రావ్యముగా వినకున్న భావము
న్దెలిసి మనంబులోనఁ గడుదీనత నొందుచునున్న నాయెడ
న్మెలఁగుటకై నిజంబుగ నిమీలితనేత్రుఁడ నౌచు నెమ్మదిం
దలఁచుచు నున్న నాతలఁపుఁ దప్పక దీర్పుము రామ...

82


చ.

అనవరతంబు మీమహితు లాత్మగతంబున నిల్చిగాదె స
న్మునివరులెల్ల యోగపరిపూర్ణసమాధి వినిశ్చలాత్ములై
మనమున సన్నుతించుచుఁ బ్రమాదపరిభ్రమ లేమి లేక యే
మునుఁగుచును న్వినోదముల మోదమునొందరె రామ...

83


ఉ.

మోహరసాబ్ధిలోఁ బడి ప్రమోదమున న్విషయాతురంబున
న్సాహసధుర్యులై సతులసంగతులం బడి తాపయుక్తులై
దాహము దీఱ నారిసురతంబులనే రుచిగాఁ దలంచి సం
మోహనిబద్ధులై చెడిరి మూర్ఖులు భూస్థలి రామ...

84


ఉ.

శ్రీకరభక్తచిత్తసరసీరుహబంధురచంచరీక సు
శ్లోక సురారివారక వసుంధరనాయక! రావణాంతకా
ప్రాకటనిర్జరప్రముఖపాలక! కాంచనకుండలప్రభా
నీకఫలప్రదాయక! వినిర్జితపాతక రామ...

85

చ.

తలఁచెద నీదుమంత్రము సదార్తినివృత్తికి నిష్టసిద్ధికై
కొలిచెద జానకీరమణ కోరిక దీర్చు ప్రసన్నదృష్టికై
నిలిచెద నాత్మనిశ్చలత నీరజలోచన మోక్షకామినై
పిలిచెద నిన్ను యోగిజనబృందము గూడెద రామ...

86


ఉ.

అంగజసుందరాంగ విహగాధిపదివ్యతురంగ సాధుస
త్సంగ! ఫణాయతాంబుధీనిషంగ! మదత్రిదశాహితాబ్జమా
తంగ! మునిప్రసంగ! దురితవ్రజగాఢతమఃపతంగ! సా
రంగ! హృదబ్జభృంగ! సుహిరణ్యకురంగద! రామ...

87


చ.

జలచరశంఖచక్రహలచాపగజాంకుశనక్రచామరో
జ్వలహయపద్మభృంగకులిశధ్వజకల్పలతాకిరీటరే
ఖలఁ జెలువొందు మీచరణకంజపరాగము సోకినంతనే
శిలరుచిరాంగనామణిగఁ జెన్ను వహింపదె రామ...

88


చ.

జలదశరీరభాస మునిసంచయచిత్తనిశాంతవాస మం
జులదరహాసరత్నమయశోభితకుండలసద్వికాస యు
జ్వలతరపీతవాస నపచంపకపుష్పసమాసనాస స
ల్లలితవిలాస రాసభబలాసురనాశక రామ...

89


చ.

భవహరమైన మీమహిమ భావగతంబున నిల్చి కీర్తనల్
కవివరులున్ నుతింప విని కల్మషఘోరతమార్కమూర్తి యై

ప్రవిమలమౌ భవత్పదముఁ బ్రాపుగఁ జేరెద నన్ను బ్రోవుమా
శివకరభక్తపాలన విశేషయశోజ్వల రామ...

90


ఉ.

ని న్ననిశంబునుం బొగడనేరని నోరొకపాడుబొందఁగా
నెన్నదగుం దలంచుటకు నిత్యముగానికళేబరంబు పెం
పెన్నగఁ గొల్మితిత్తియన నెన్నఁబడున్ నినుఁజూడనట్టి యా
కన్నులు కుడ్యరంధ్రములు గావఁటె గన్గొన రామ...

91


చ.

రయమున నీదుపూజను గరంబుగఁ జేయని చేతులేల స
న్నయముగ నిన్నుఁ గోరని మనం బదియేల వినోదలీలల
న్నియతిగ నిన్ను నెంచని మనీష యదేల దలంప నన్నియున్
నియతము గావు భక్తులకు నెమ్మది కెక్కవు రామ...

92


ఉ.

కారణజీవకోటులకుఁ గాయములో వెలి మధ్యమందు నిం
డారగనుండు దైవమని హర్షమునం దగ నీదునామముల్
ధీరులకే నుతింపనగు దివ్యతరాకృతివైన నిన్ను వే
మాఱుగ శాస్త్రజాలములు మానుగఁ బల్కవె రామ...

93


ఉ.

నీపదపద్మరేణువులనేరు పహల్య యెఱుంగుఁగాని నీ
తాపభయానకంబు లొగి దాసుల కెన్నఁడు పెట్టరాదు నీ

ప్రాపునఁ జేరి ని న్నెపుడు ప్రస్తుతిచేయుచునున్నయట్టినా
యాపదలెల్లఁ దోలుటను నర్హముగాదఁటె రామ...

94


ఉ.

నీపదపద్మరేణువులనేరు పహల్య యెఱుంగుఁగాని నీ
రూపము రావణానుజుఁ డెఱుంగునుగాని భవత్ప్రభావ మ
గ్గోపతి నారదుం డెఱుఁగు క్రూరుఁడ నేఁ దెలియంగఁజాల నా
తాపములెల్లఁ దీర్చుటకు దాతవు నీ విఁక రామ...

95


ఉ.

ఇష్టముతోడ మిమ్ము భజియింపగ నింతపరాక దేల నా
యిష్టము దీర్ప మీ మది కభీష్టముగాదె భరించువారలే
కష్టముగాఁ దలంప నిఁక గావఁగ నేరిఁక నిట్టికష్టముల్
నష్టమొనర్చి ప్రోవు మిఁక నన్నుఁ బ్రసన్నత రామ...

96


చ.

తనయుఁడవై దయారసతఁ దారకమంత్రము నా కొసంగవే
యన విని దేవహూతికి సమంచిత్రమంత్రరహస్య మంతయున్
మనమున నిండఁజెప్ప కడుమానితమోక్ష మొసంగినట్ల నా
మనమునఁ గోర్కిదీర్చి నను మన్నన చేయవె రామ...

97


చ.

నిను మదిఁ గోరి నమ్మినను నేరము లెంచిన నేమి చేయువాఁ
డను గృప నన్ను వేడుకను డాయగఁ రావె యవస్థలన్నియు
న్మునుకొని మీకుఁ దేటపడ ముందుగ నేఁ దగవిన్నవించితిన్
గనుఁగొని కావకున్న ననుఁ గావఁగ నెవ్వరు రామ...

98

చ.

దొరవని నిన్ను నేఁ గొలిచి దోసముఁ బాసితి నింక నీవు నా
మొర వినవేల మాధవ! సముజ్జ్వలభూరికృపారసంబుచే
నరయవదేల ఘోరదురితాంబుధియందు మునుంగఁజాలు నీ
మఱుఁగునఁ జేరినాఁడ మటుమాయలఁ బెట్టకు రామ...

99


ఉ.

నారదగానలీల! ఖగనాయకయానవిభాసమాస! వి
స్తారమహోగ్రదుష్కృతవితానవిదారణసన్నిధాన బృం
దారకనాథవహ్ని హరిదశ్వసుతాస్రపజీవనాధిరా
ణ్మారుతరాజరాజ శివనారదరక్షణ రామ...

100


చ.

పరమయాసముద్ర భవబంధవిమోచన బాణతూణ వి
స్ఫురదరవిందనేత్ర సురపూజితకంఠలసద్విభూషణో
త్కరదశకంఠలుంఠ మగుతావకకీర్తిలతాంగికం బురు
ట్సరములు గాఁగ నాకవితసారె కొసంగెద రామ...

101


ఉ.

శ్రీయుత కాశ్యపాన్వయ సరిద్వర శీతకరుండు పల్లివం
శీయుఁ డనంగ నొప్పు నరసింహకవీంద్రున కాత్మజుండ నే
నో యతులప్రభావలసదుత్పలమాలలు నీ కొసంగెదన్
బాయక పార్వతీశుఁడను భక్తుఁడఁ బ్రోవుము రామ...

102

శ్రీరామరాఘవశతకము సంపూర్ణము

  1. గుచ్ఛాద్రి = గుత్తికొండ
  2. ఈకవి యేబదిసంవత్సరముల క్రింద నీశతకము రచించియండును.