భక్తిరసశతకసంపుటము/మొదటిసంపుటము/రామప్రభుశతకము

వికీసోర్స్ నుండి

పీఠిక

ఈ రామప్రభుశతకము వ్రాసినకవి కాశ్యపగోత్రుఁడనియు కామేశ్వరాఖ్యుఁడనియు నిందలి మూఁడవపద్యమువలనఁ దెలియుచున్నది. ఇందలిపద్యములు మనోహరమగు శైలిలో ధారాశుద్ధిగలిగి కేవల భక్తిరసోద్దీపకములుగా నలరారుచున్నవి. ఇతరపద్యానుకరణము లీశతకమునఁ గొలఁదిగా గలవు. కవి తాను వయో౽తిరేకంబునిఁ గామాంధతచే వర్తించితిననియు జీవితమంతయు రాజసేవచే గడిపితిననియు బాల్యమున నార్జించిన విద్యావివేకాదికములను బరమార్థచింతనమున కుపయోగింపనైతినని పశ్చాత్తాపము నొందుచుఁ బలవించుచుఁ బద్యములు వ్రాసినటుల నాయాతావులఁ గలపద్యములు బోధించుచున్నవి.

శ్రీమన్నారాయణుని లీలావిశేషంబుల మానవులు పెక్కువిధంబుల వర్ణించుట సహజంబు. అందు నెక్కువఁగ శతకరూపమున లోకంబున భక్తివర్ణనం బగపడుచున్నది.ఎంద ఱెన్నివిధంబులఁ గొల్చినను బరమేశ్వరుండు సర్వాంతర్యామియేగాన సముండయి యందఱఁ బ్రోచుచుండు.

ధారాశుద్ధియుఁ బరితాపవిధము జూడ నీగ్రంథము కవికిఁ దుదిపొత్తమనియే తోఁచును. పలుతావుల వ్యాకరణదోషములు గానవచ్చుచున్నవి. కేవల భక్తిపారవశ్యమునఁ బశ్చాత్తాప మొందుతఱిగూడ ఛందోవ్యాకరణాదినిర్బంధశృంఖలలకు లోనుగావలెనా యని కవి స్వతంత్రించినటుల నిందలి వ్యాకరణదోషములు తెలుపుచున్నవి. మొదటినుండి కడమవఱ కీశతకము కవికి దుదిగ్రంథమనియే తెలుపుచున్నది. ఈకని యౌవనమున గోపాలలీలాసుధాలహరి యను ప్రబంధము మూఁడాశ్వాసములుగ వ్రాసెను. ఈతనియింటిపేరు ప్రయాగవారనియు, వైదికబ్రాహ్మణుఁడనియు, సర్వేశ్వరపుత్రుఁడనియు నాప్రబంధమునఁ గలదు. గోపాలలీలాసుధాలహరి కేవలశృంగారరసముతోఁ దులతూగుచున్నది. గోపాలలీలాసుధాలహరి రామతీర్థస్వామి కంకితము గావింపఁబడుటవలనను కవివంశావతారాదికమువలనను ఇతఁడు విశాఖపట్టణమండలమునకుఁ జెందినవాడని యూహచేయ వీలుకలుగుచున్నది. ఈశతకలిఖితప్రతి మాడుగులలోఁ జిక్కుటయుఁ గవి విశాఖపట్టణము మండలమువాఁడనుట కొకతార్కాణము. ఈకవి యిప్పటికి నూటయిఱువదిసంవత్సరముల క్రిందనున్నటులఁ జెప్పుచున్నారు.

ఈశతకము వ్రాఁతప్రతి మాకంపిన విశాఖపట్ణము జిల్లా మాడుగులవాస్తవ్యులు శ్రీయుత బీ. సీ. వై. నారాయణశర్మగారు వందనీయులు.

వావిళ్ల . రామస్వామిశాస్త్రులు ఆండ్ సన్స్.

శ్రీరస్తు

ప్రయాగ కామేశ్వరకవికృత

శ్రీరామప్రభుశతకము

శా.

శ్రీమత్తారకనామ రామ జయలక్ష్మీధామ నీలాంబుద
శ్యామా వైరివిరామ రూపలలితశ్యామావళీకామ సం
గ్రామోద్దామ రచింతు వృత్తశతకగ్రంథంబు నీపేర ని
ష్కామాసక్తిని సావధానమతి నాకర్ణింపు రామప్రభో.

1


శా.

నానామౌనిజనార్చనీయ మగు నీనామంబు సద్భక్తి స
న్మానోదారసలక్షణాంచితలసన్మత్తేభశార్దూలవృ
త్తానీకస్థితసూత్రసూచితసువర్ణాలంకృతప్రాప్తి సం
ధానాస్మద్వచనాళిహారగతరత్నంబయ్యె రామప్రభో.

2


శా.

శ్రీమత్కాశ్యపగోత్రసంభవుఁడ నుర్వీదేవవంశ్యుండ ని
ష్కామాసక్తుఁడ సత్కవిప్రియమతిం గామేశ్వరాభిఖ్యుఁడన్
బ్రేమ న్నీ కొకవృత్తసత్కృతి సమర్పింతు న్వచోదోషముల్
స్వామీ సత్కృపచే క్షమింపు హరినీలశ్యామ రామప్రభో.

3

మ.

తరుణీలాలసుఁడైన లోభమదమాత్సర్యాదిమోహక్రియా
పరుఁడైనన్ ఖలుఁడైన దీని వినినన్ బాపౌఘవిద్వేషియై
పరమార్థైకవిశేషయుక్తి మది నాపాదించి సుజ్ఞానత
త్పరుఁడౌ నిక్కము నీకృపామహిమచేత న్మించి రామప్రభో.

4


మ.

నరుడై పుట్టినవాని కెల్లను భవన్నామంబు పాపార్ణవో
త్తరణంబై ధరణిం జెలంగఁగ ననంతవ్యాప్తి నీనామసం
స్మరణం బెన్నఁడుఁ జేయలేని నరజన్మం బేమిజన్మం బయా
పరికింప న్బశువైన మేలు కృతసద్భావంబు రామప్రభో.

5


శా.

సంతాకూటముగాదె యంతయును సంసారంబుఁ జింతింప లో
నంతా దుర్మలినాకులంబెకద మే నంతా మహారోగభీ
సంతాపాన్వితమేకదా జగము నశ్యంబేకదా దీనికై
యెంతోవ్యాప్తులఁ బొర్ల నేమిటి కయా యీజీవి రామప్రభో.

6


మ.

తనువు న్నమ్మగలేదు సంపదలపై తాత్పర్యమున్ లేదు దు
ర్జనసాంగత్యము గోరలేదు మది సంసారంబుపై లేదు గాం
చనకాంతాదులప్రేమ లే దితరవాంఛన్ లేదు నీపాదసే

వనమే గోరుచు నుంటి నమ్ము మిఁక దైవం భాన రామప్రభో.

7


శా.

బంధువ్రాతము నమ్మలేదు సుతసంపత్ప్రీతియున్ లేదు సం
బంధంబుల్ మదిఁ గోరలేదు మది సంపర్కంబులున్ లేవు నీ
సంధానం బది నెమ్మది న్నిలిపితిన్ సందేహమున్ లేదయా
గ్రంథంబుల్ పదివే లిఁకేల నవమేఘశ్యామ రామప్రభో.

8


శా.

చేరన్ రాని మనుష్యులం గొలిచితిన్ సేవించితి న్నీచులన్
గోరన్ రాని యభీష్టకామముల బెక్కు ల్గోరితిన్ జాలు సం
సారవ్యాప్తులు నీపదాంబురుహదాస్యం బాత్మఁ గైకొంటి న
న్నేరీతిం దరిఁ జేర్చెదో గుణనిధీ యిన్నేల రామప్రభో.

9


శా.

స్త్రీలోలైకవిశేషమత్తులు ధరిత్రీపాలు రామీఁద వి
ద్యాలాలిత్యము లేక యున్నతఱి తత్సాంగత్యమున్ గీడగుం
శీలంబూడ్చి దురాశ వారి దినము ల్సేవించి సేవించి నే
జాలిం బొందితి నిన్ను జెందితి దయాసంకల్ప రామప్రభో.

10


మ.

కరిరాజుం గరుణించినా వెలమి గంగానందనుం బ్రోచినా
వరనిందాక్షిని ద్రౌపదిన్ మనిచినా వాధర్మరాజాదులం

బరమప్రీతులఁ జేసినావు విదురు న్బాలించినా వింక స
స్గరుణం బ్రోవఁగదయ్య మ్రొక్కెదను మేఘశ్యామ రామప్రభో.

11


మ.

మునిదారం గరుణించినావు శబరి న్మోక్షంబుఁ జెందించినా
వినజున్ రాజును జేసినావు ధరణిన్ బృందారకస్వామిపు
త్రుని జీవింపఁగ జేసినావు పదభక్తు న్గుంభకర్ణానుజ
న్ముని లంకాధిపుఁ జేసినావు దయ నన్నున్ బ్రోవు రామప్రభో.

12


శా.

ఏనాఁ డాప్తుఁడు పక్షిరాజు కవిరా జేనాఁటిచుట్టంబు లం
కానాథానుజుఁ డెన్నినాళ్లు హితుఁ డాకంఠీరవాఖ్యాత్మజుం
డేనాఁ డాత్మకిరాత నేఁ డవనిలో నేనాటిచుట్టం బయా
నేనే యన్యుఁడ నైతినా పరసతీనిష్కామ రామప్రభో.

13


శా.

నేరంబు ల్పరికించకయ్య వినుమా నే నేమియు న్బల్కినన్
భారంబు న్మదినుంచకయ్య యిఁక నీపాదంబె దిక్కయ్య నీ
వారిం జేర్పఁగదయ్య బంధములత్రోవం జెందనీకయ్య నన్
గారుణ్యంబునఁ బ్రోవవయ్య నవమేఘశ్యామ రామప్రభో.

14


శా.

నీవే తల్లివి తండ్రివి న్గురుఁడవు న్నిర్ణేతవున్ ధాతవున్
దైవంబు న్బతియు న్సదాగతియు నానాబంధుమిత్రాదులు

న్నీవే భాగ్యము భోగ్యము న్నీఫలము న్నిత్యోత్సవవ్రాతమున్
భావింపన్ మరి వేఱె లేదు నతశుంభత్ప్రేమ రామప్రభో.

15


శా.

కాంతారత్నము సీతపై గుహునిపై కౌసల్యపై నల్ల శా
కుంతాధీశునిపై సుమిత్రసుతుపై కుంభశ్రవోభ్రాతపై
కంతుద్వేషివధూటిపై భరతుపై కారుణ్యమున్నట్టి శ్రీ
కాంతా నాపయి ప్రేమ నిల్పు మిఁక మేఘశ్యామ రామప్రభో.

16


శా.

ఏమంత్రంబు జపించె పక్షి కవిరా జేతంత్రముం జూచి తా
నేముఖ్యాగమ మభ్యసించెను గిరాతేశుండు నేశాస్త్రమున్
ప్రేమ న్జెంచిత నేర్చె ముక్తిపదవీశ్రీదంబు నీపాదసే
వామాత్రంబె సమస్తజీవులకు దైవస్వామి రామప్రభో.

17


శా.

వేదంబుల్ నిజమైన ముఖ్యముగ నీవే దైవమైన న్భవ
త్పాదంబుల్ శుభరంబులైనను భవన్మంత్రంబు పాపౌఘవి
చ్ఛేదం బైనను నీదునామము శుభశ్రీతారకంబైన యెం
దేదీ ముక్తికి సందియంబు సకలోర్వీశేంద్ర రామప్రభో.

18


మ.

సతులంచు న్సుతులంచు మాతలనుచుం జామాతలంచు న్నిజా
శ్రితులంచున్ హితులంచు భ్రాతలనుచున్ చెల్లెళ్లటంచున్ కుల

స్థితులంచున్ జనకాదులంచును మహిన్ జీవాత్మకున్ బంధసం
తతి సంపర్కము లెన్ని గూర్చితి వయా కంజాక్ష రామప్రభో.

19


శా.

రేతోబిందువు కాంతగర్భగతమై వృద్ధిన్ జరాయుస్థితిన్
జైతన్యంబు వహించి పాదముఖనాసాహస్తముఖ్యాంగసం
పేతంబై తనుబాల్యయౌవనజరావేషంబులం జెంది వి
ఖ్యాతిం బొంది చరించు నీమహితమాయం గాదె రామప్రభో.

20


మ.

ఉరుబీజంబు మహీగతంబయి పయోయోగంబుచే సూకరా
కరరూపంబు వహించి పత్రఫలశాఖాపుష్పసంశోభియై
తరువై నిల్చి ఖగాదిజంతునివహోదారైకసంస్థాయియై
ధరణిం బొల్చుట నీమహామహిమచేతం గాదె రామప్రభో.

21


మ.

జననీగర్భమునందు గొన్నిదినముల్ సంతాప మొందించి చ
య్యన జన్మింపఁగఁజేసి శైశవము బాల్యంబున్ వయోవృద్ధతా
దినదీనాకృతులం ఘటించి నిజమౌ దేహంబులోఁ బ్రాణికిన్
ఘనవేషంబు లివెన్నిఁ గూర్చితి వయా కంజాక్ష రామప్రభో.

22


శా.

హేయోద్యోగకళావిలాసముల బోయెన్ బాల్యభావం బయో

ప్రాయం బెల్లను కామినీసురతదుర్వ్యాపారతన్ నిష్ఫలం
బాయెన్ బోయెను కాయపాటవము మిథ్యామోహముల్ హెచ్చె నే
యేయోగంబులుఁ జాలుచాలు నిఁక నీవే దిక్కు రామప్రభో.

23


శా.

ఆయుర్దాయములోన నర్ధము చనెన్ వ్యర్థంబుగా నిద్రచే
బోయెన్ బాల్యముచేత కొంత తరుణీభోగేచ్ఛచే యౌవన
ప్రాయం బెల్లను వోయె దుర్భరజరాభారంబుచే వార్ధకం
బాయాసప్రదమయ్యె సత్క్రియలు చేయంజాల రామప్రభో.

24


మ.

మదనద్వారవిలాససౌఖ్యములు ప్రేమం జూచి రోచితిన్
మదిరాక్షీకుచపర్వతోపగతసీమావాసముం జేసితిన్
వదలెన్ మోహము నీతనూభవుఁడె నానావ్యాప్తులం బెట్టె నె
మ్మది నెవ్వారి భజింప నీవె గతి శ్రీమన్నామ రామప్రభో.

25


మ.

యువతీనాభిబిలంబు సత్కుచపదంబో నాతినూఁగారు నా
గవధూటీతిలకంబొ నెమ్మొగముపొంకంబో సహస్రారమో
చనియౌ మోవిరసంబు చెన్నగు సుధాసారంబొ కాంతామణిన్

గవయన్ యోగికి ముక్తికాంత యగునా కాంక్షింప రామప్రభో.

26


మ.

తరుణీసీనపయోధరోద్ధతులచేతన్ రాపడెన్ పెన్నురం
బు రతిశ్రాంతినిశాతబాణహతి నెమ్ముల్ గుండపిండయ్యె సుం
దరులం జెందిన సౌఖ్యమింతె సరి మీఁదం గీ డదే మున్నదో
దరిలే నాపద బొందఁజాల గతి మీఁదన్ నీవె రామప్రభో.

27


శా.

నానాదుర్వ్యససంబులం దిరుగుచు న్నాళీకప్రత్యేక్షణా
ధీరవ్యాప్తులఁగాలమెల్లఁ గడచెందెన్ మేను వట్రిల్లె వృ
ద్ధానారీపతి దేవతా యనెడుశాస్త్రం బన్నచందంబునన్
జ్ఞానం బిప్పుడు గల్గె ముప్పున దయాసంకల్ప రామప్రభో.

28


శా.

వేదాభ్యాసము చేసి శాస్త్రముల నుద్వేలంబుగా నేర్చి దు
ర్వారంబుల్ సఫలంబుఁ జేయుచు నృపద్రవ్యంబులం గోరుచున్
గాదంచు న్నవునంచు ధిక్కరణముల్ గావించు విద్వాంసులం
భూతదయాళుతాసమత వారేకాక రామప్రభో,

29


మ.

వ్యసనాసక్తి వధూటికాజనముపై వాగ్వృత్తి విత్తంబుపై
వసగా నెమ్మెయి భక్తిచిహ్నములు దోఁపన్ నోరు తోడేలు నె

న్నొసలున్ భక్తుఁ డటన్న చందమున నెంతో కైతవాకారులై
పొసఁగన్ గాలము బుచ్చు మాదృశులతప్పుల్ సైపు రామప్రభో.

30


శా.

నానాయోనులయందు దూఱితిని నానాగర్భముల్ జేరితిన్
నానావస్తువులన్ గ్రహించితిని నానాదేశముల్ సూచితిన్
నానాజాతులఁ జెందితిన్ విసికితిన్ నామీద కారుణ్యమున్
రానిమ్మా యిఁకనైన గర్భగుహ దూరంజాల రామప్రభో.

31


శా.

నీమంత్రంబె జపించి నిన్నె మదిలో నిత్యంబు భావించి నీ
నామంబే స్మరియించి నీపదములన్ సద్భక్తిఁ బూజించి ని
ష్కామాసక్తి భవత్కథాశ్రవణమున్ గావించు ధన్యాత్ము లీ
భూమిన్ బౌవనమూర్తు లాఘనులనే పూజింతు రామప్రభో.

32


మ.

హరుపైనైనను దైత్యసంహరునిపైనైనన్ సదా భక్తి సు
స్థిరవృత్తిన్ ఘటియించి తత్పదములన్ సేవించి సద్వృత్తిత
త్పరులై దూషణమాని యీషణలపైఁ దప్పించి వర్తించు స
త్పురుషశ్రేష్ఠుల నీగతిం దలఁచి నే పూజింతు రామప్రభో.

33

మ.

చలమౌ నాయువు యౌవనంబు మృగతృష్ణానీరపానీయకాం
క్షలు సంసారసుఖంబు లంగనలసాంగత్యంబు లంతర్విషో
జ్జ్వలమృష్టాన్నము లంబుబుద్బుదము లీచాంచల్యమౌ సంపదల్
కలలోనైనను వీని నమ్మఁదగునా కంజాక్ష రామప్రభో.

34


మ.

ధనగర్వంబున కొందఱున్ మహితవిద్యాగర్వులై కొందఱున్
ఘనరాజ్యోన్నతి కొందఱున్ కులబలఖ్యాతిప్రభారూపయౌ
వనగర్వంబున కొందఱున్ నిను భజింపన్లేక మౌఢ్యంబునన్
జననంబుల్ విఫలంబు చేయుదురు భాస్వద్ధామ రామప్రభో.

35


మ.

ఉదయం బస్తమయం బటంచును మహోద్యోగంబుచే వాసరం
బిది మాసం బిది వత్సరం బనుచు దుర్వృత్తిన్ బరిభ్రాంతులై
యిది రాత్రిం దివ మంచు మూఢమతి నింతేకాని కాలాహిచే
తుది నాయుక్షయ మౌట కానరు మహాదోస్సార రామప్రభో.

36


మ.

తమపూర్వుల్ మును జావఁగా వినిరొ లేదో మృత్యు వెవ్వారికిన్
యముఁ డెవ్వారికి జుట్టమా తనుపపాయాభావమా! దేహగే
హములున్ శాశ్వతమా! నరాధము లిఁకేలా గొల్తు రుర్వీశులన్
సుమసామ్యంబగు లక్ష్మిఁ గోరి తనువుల్ శోషింప రామప్రభో.

37

శా.

ఎందుంజూచిన కాయ మెల్ల మలినంబే లోనిసౌరభ్య మే
మందున్ దుస్సహరక్తమాంసమలమూత్రాసహ్యమే దానితోఁ
బొందైనన్ సతమా? గదాన్వితముఱేపో నేఁడొ పోనున్న దీ
బొందిన్ నమ్మగరా దిఁకేటిదరిపై భూజంబు రామప్రభో.

38


శా.

ఎన్నా ళ్లుండుదు రేమి చేయుదు రొకో యేసౌఖ్యముల్ గాంతురో
నిన్నన్మొన్నను జచ్చువారిఁ గనరో నిర్మోహముం జెంద ర
న్నన్నా మానవు లెంతమూఢమతు లన్నా నిన్ను సేవింప రా
పన్నత్రాణధురీణ! శాశ్వతమొకో! భాగ్యంబు రామప్రభో.

39


శా.

మందు ల్మాకులు వేల్పు వైద్యులు మణుల్ మంత్రంబులున్ దంత్రముల్
బొంది న్నిల్పఁగఁజాలునా! యమునితోఁ బోరాడునా! ధాత వ్రా
తం దప్పించునొ యాయు వొక్కక్షణమాత్రంబైన యెక్కించునో
మందాత్ముల్ గనఁజాల రీగతుల శ్రీమన్నామ రామప్రభో.

40


మ.

తనుగర్భంబున నున్నవాఁడు మలమూత్రస్విన్నుఁడై శైశవం
బున సంతాపము నొందునాఁడు కనుదమ్ముల్ మూసి నిద్రించు వే

ళను నేపుణ్యుఁడు ప్రోచినాఁడొ యతఁ డేలాగుండిన న్బ్రోవఁడా
మనుజుం డన్యుని జేరి వేడినను క్షేమంబౌనె రామప్రభో.

41


మ.

నృపులం గొల్చుట బేరమాడుట మహీభృద్వాసముల్ నీచసే
వ పరావాసము జ్ఞాతివైరము మహావారాసిపై నేఁగుటల్
కపటత్వంబున వేషధారియగుటల్ సంసారి కీకృత్యముల్
కృపణత్వంబున సేయునీతి యివి భుక్తింగోరి రామప్రభో.

42


శా.

ఏదేశంబున కేఁగిన న్నృపులఁ దా నెన్నాళ్లు సేవించినన్
లే దింతైన ఫలంబు పూర్వకృత మోలిందప్ప దవ్వేళకున్
పాదాయాసము దూర
యానము మహీపాలాతి సేవాప్తి నా, నాదోషం
బు లపారసౌఖ్య మటం గానరాదు రామప్రభో.

43


మ.

తనపూర్వార్జితమైన పాపములచేతం దుఖసంతాపమౌ
ఘనపుణ్యంబులచేత భోగసుతభాగ్యశ్రీమహాసౌఖ్యముల్
గను నింతే తన కెవ్వరున్ సుఖము దుఃఖంబైన సేయంగలే
రనయంబు న్బరు నాశ్రయించుట వృథాయాసంబు రామప్రభో.

44


శా.

సప్తద్వీపమహాధికారమున నాశాతృప్తులైరే నృపుల్

సప్తార్చిర్ముఖనేతసర్వభువనేశత్వంబు దా నాత్మలో
వ్యాప్తిం బొందుట మానెనే యితరుల న్వాక్రువ్వఁగా నేటికిన్
దృప్తిం బొందఁగరాదు భోగసుఖవృద్ధిం గోరి రామప్రభో.

45


మ.

కరుణం బ్రోవఁగ నేర్తురో శుభములం గావింపగా నేర్తురో
వరముల్ గూర్పఁగ నేర్తురో దురితము ల్వారింపఁగా నేర్తురో
పురుషార్థంబు లొసంగ నేర్తురొ భవాంభోరాశి దాఁటింతురో
ధరణీపాలురఁ గొల్వనేల మది సంతాపింప రామప్రభో.

46


మ.

తనవారంచును దా నటంచుఁ దనసత్వం బంచుఁ దా శక్తుఁడం
చును దుర్మానత మానవుండు విహరించు న్మోహవిభ్రాంతుఁడై
తనవా రెవ్వరొ దా నెవండొ తనసత్వం బెద్దియో శక్తి నె
వ్వనిలో గానఁడు మూలకారణము దైవం బెన్న రామప్రభో.

47


మ.

ధనమెందైన నృపాగ్ని చోరులకు సంతానంబులం జెందుఁ జెం
దును గాయంబు చితాగ్నియందుఁ దిరమై దుష్కీర్తియుం గీర్తి మా
యనిదై నిల్చు మహీతలంబునను ధర్మాధర్మముల్ వెంటనే
చనుదెంచుం జనుఁ డెంతఁ జేసిన విశేషం బెంత రామప్రభో.

48

మ.

తనపూర్వార్జితపుణ్యపాపఫలముల్ తన్నొందు నెన్నాళ్లకున్
దనకై వండిన వంటకంబుఁ దినకున్నం బోవ దేవేళకున్
మనుజుల్ దుఃఖసుఖైకహేతుగతిమర్మంబైన కర్మంబుఁ గ
న్గొనఁగాలేరు మనీషతోఁ దెలిసి నిన్నుం జెందు రామప్రభో.

49


శా.

ఏయేజన్మము లెత్తెనో మునుపు నేయేజన్మముల్ పొందునో
యాయాగృత్యము లేమియుం దెలిసెనా యాబాంధవస్నేహ మే
మాయెన్ దీనికి నింతవింతవలెనా యాచందమే కాదయా
కాయంబు ల్పరికించి చూచినఁ ద్రిలోకస్వామి రామప్రభో.

50


శా.

దాయాదు ల్థనచోరు లాఖలులబాధల్ మాధురీఖడ్గముల్
మాయామోహినిదార దాని చపలోన్మాదక్రియావారిద
చ్ఛాయ న్చెల్లవు సంకెలల్ సుతులు పుష్పన్యూతపాశంబు లీ
యాయాసంబుల వాఁడు నిన్ను నుతిఁ జేయన్ లేఁడు రామప్రభో.

51


శా.

ఎన్నోజన్మము లెత్తియెత్తి కడగా ళ్లెన్నో మును న్బొంది యె
న్నెన్నో నారకదుఃఖముల్ గుడిచి తా నిన్నాళ్లకుం జీవలో
కౌన్నత్యాస్పదవిప్రదేహకులవిద్యాయుక్తుఁడై జ్ఞానసం
పన్నత్వంబు వహింపకున్న నరజన్మం బేల రామప్రభో.

52

శా.

నిన్నుం గొల్చిన భాగ్యసంపదలు రానీవేమి రానీ సమ
స్తౌన్నత్యంబులు గల్గనీ గలుగనీ హైన్యంబు సంజ్ఞానసం
పన్నత్వంబు లభింపనీ జడమతిప్రాయంబు సిద్ధింపనీ
యెన్నైనా యవి మాకు సమ్మతమయా యిన్నేల రామప్రభో.

53


మ.

మతిలో నాకొకయాస పుట్టె వినుమా మాయయ్య విద్వజ్జనుల్
పతితవ్రాతము నీవు బ్రోతువనుచున్ భాసింతు రెల్లప్పుడున్
శ్రుతివాక్యంబులచేత ధర్మవిలసత్సూక్తుల్ నిజం బైనచో
గతి మాకుం బరికింప నీవె కద లోకస్వామి రామప్రభో.

54


మ.

కరము ల్గల్గుటకున్ ఫలంబు కడువేడ్క న్నిన్ను బూజించుటే
చరణద్వంద్వఫలంబు తావకనివాసంబు ల్గనం బోవుటే
పురుషార్థంబులఁ జెందు వాక్సరణి నీపుణ్యాభిధానస్తుతిన్
వరలున్ వీనులు నీకథ ల్వినిన భావ్యంబౌచు రామప్రభో.

55


శా.

పాషాణంబు భవత్పదాంబురుహసంపర్కంబుచే శుద్ధమై
యోషారత్నము నీనె నీవిమలనామోద్దేశయుక్తిన్ మహా
దోషంబుల్ విడనాడి నాకు భవుఁ డెంతో మౌనియై మించఁడే
భాషావల్లభుఁ డైన నీమహిమ దెల్పన్ లేడు రామప్రభో.

56


శా.

దానంబుల్ వ్రతవిరామము ల్క్రతువులున్ ధర్మక్రియాతంత్రముల్

నానాతీర్థజలావగాహనములు న్నానాఁటికి న్సేయఁగా
బోనౌనే భవదీయనామము భవాంభోరాశికిన్ నావచం
దాన న్దాఁ గనుపింప వార్షికపయోదశ్యామ రామప్రభో.

57


శా.

క్షీరంబు ల్లుడనీరముల్ మధువు లక్షీణామృతాసారఖ
ర్జూరీగోస్తనసద్రసాలపననేక్షుస్వాదుమాధుర్యముల్
సారోదారము నీదునామసుధ నాస్వాదించు నాజిహ్వకున్
క్షారంబై గనుపించు నీలమణిమేఘశ్యామ రామప్రభో.

58


మ.

గురుశుశ్రూష యొనర్చి వేదములు పెక్కుల్ నేర్చి దండాజినాం
బరముల్ గైకొని భైక్షము ల్గొనుచుఁ బ్రేమం బ్రహ్మచర్యవ్రతం
బరుదారన్ ధరియించి నిత్యమును సాయంప్రాతరగ్నిక్రియా
పరిచర్యం జరియింపలేదు జనియెన్ బ్రాహ్మ్యంబు రామప్రభో.

59


మ.

నిజకాంతాఋతుకాలసంగతుఁడనై నిత్యంబు సత్సంచయ
జ్ఞజపాద్యాపరహోమదైవపితృయజ్ఞస్మార్తకర్మక్రియా
వ్రజమున్ శ్రౌతవిధిం జరింపుచును గార్హ్యంబు వేదక్రియా
భజనీయంబుగ సేయలేదు జనియెన్ బ్రాహ్మ్యంబు రామప్రభో.

60

మ.

కులభారంబు కుమారుపై నిలిపి యగ్నుల్ గొంచుఁ గాంతారభూ
ములకున్ ధర్మసతీసమేతముగ సమ్మోదంబుతో నేగి కా
నలఁ జాంద్రాయణకృఛ్రతత్పరత వానప్రస్థదీక్షావిధిన్
సలుపన్ లేదు నిరర్థకంబుగఁ జనెన్ జన్మంబు రామప్రభో.

61


మ.

గతవిద్వేసహితక్రియాపరుఁడనై కాషాయదండంబు లా
యతరీతికిన్ ధరింపుచు న్బ్రణవసుధ్యానైకపారీణతన్
వ్రతము ల్సల్పుచు నీషణల్ విడివడన్ గ్రామైకరాత్రస్థితిన్
యతినై యుండుట లేదు బ్రహ్మ మతిగమ్యం బయ్యె రామప్రభో.

62


శా.

నాసాగ్రంబున దృష్టినిల్పి జగమంతా బ్రహ్మసద్భావమై
భాసిల్లంగను నగ్నవృత్తి సమతాభ్యాసంబుఁ గావించి శ్రీ
వ్యాసాదిప్రముఖప్రణీతగతి నాత్మారామతన్ హంసవ
ద్వ్యాసంగంబు వహింపలే దెచటికైవల్యంబు రామప్రభో.

63


శా.

ఆధారస్థితవాయుపూర్వగతిగా నంకించి రేచించి స
ద్బోధానందఘనప్రకాశమహిమన్ బూరించి కుంభించి స

ర్వాధారంబులు మూసి నిశ్చలసహస్రారామృతం బాని యో
గాధీనస్థితి నుండలేదు భవదైక్యం బెట్లు రామప్రభో.

64


మ.

ధరణిన్ తీర్థము లెల్ల నీరములెకా దైవంబులెల్లన్ శిలాం
తరమృద్ద్రూపము లేకదా విమలసుధ్యానైకపారీణుఁ డౌ
పరయోగీంద్రున కిన్ని యేల నిజభావం బందుపై నంతటన్
తిరమై నిల్చిన నిన్ను జూచుకొను చింతేకాక రామప్రభో.

65


మ.

అణుమాత్రంబొ మహత్తరంబొ హృదయం బత్యంతమౌనో బహి
ర్గణనీయంబొ దృగంతగోచరమొ యీక్షావృత్తికిం దూరమో
గుణియో నిర్గుణియో వికోశమొ లసత్కోశంబొ నీరూపమున్
గణుతింపం దరమా ఝరీనిలయవద్గణ్యంబు రామప్రభో.

66


మ.

యమునాసంగముఁ జూడనేటికి సుషుమ్నాసంగముం జూదుచోఁ
గమలాసంగము గోరనేమిటికి షట్కంజాప్తుఁడై యున్నచో
నమృతాంధత్వము గోరనేటికి సహస్రారామృతం బానుచోఁ
దమియై యుండిన సన్మునీంద్రున కసాధ్యం బెద్ది రామప్రభో.

67


మ.

మతభేదంబులు సేయనేల యతికి న్మాయాప్రపంచంబు స
మ్మతివయ్యుం గడుసేయనేల వ్రతము ల్మాత్సర్యశూన్యుండు నై

సతులం గోరఁగ నేల ముక్తితరుణీసౌఖ్యంబు సర్వేషణా
యుతమై యుండగ మౌనిలోకసురలోకారామ రామప్రభో.

68


మ.

వసుధాతల్ప మనల్పసౌఖ్యకరమై స్వాధీనమై యుండ న
భ్యసనాయాసము తూలికామృదులతల్పం బేల బాహూపథా
నసుఖాసంగముచెంత నిల్పను బ్రధానం బేల పుణ్యాంగనా
వసతిన్ భిక్షలు గల్గనేల నృపసేవావృత్తి రామప్రభో.

69


మ.

సముఁడై భూతదయాళుతాగుణవిశేషంబున్నచో బంధుబృం
దము లేలా దమమున్న మిత్రబహుమానం బేల సుజ్ఞానికిన్
శమమున్నన్ నృపభోగభాగ్యసుఖవాచావర్తనం బేల సం
యమియైనన్ ధన మేల మౌనిజనదైవాధీశ రామప్రభో.

70


మ.

సరిదౌఘంబులు లేవె నీరములు "భిక్షాందేహి మే” యన్న భూ
సురపుణ్యాంగన లన్న మివ్వరె తరుస్తోమంబులం ధామవా
సరసామోదము గల్గదే వసుమతీశయ్యాసుఖం బొప్పదే
వరము ల్గూర్చఁగ నీవు నేల నృపసేవావృత్తి రామప్రభో.

71


శా.

అంతా సమ్మతమే జగన్నటన మాత్మారాముఁడౌ యోగికిన్
చింతాశూన్యము ద్వేషవర్జము వధూనిర్మోహమున్ శాంత మ

త్యంతాహ్లాదము సంతతాగమశిఖాంతాలోవనభ్యాంతరం
బింతే నిత్యము నీపదాంబురుహచింతే వృత్తి రామప్రభో.

72


శా.

ఆచార్యుండయి వీగవచ్చు నయగారై శిష్యులం గూర్చి మి
థ్యాచారంబులు చెప్పవచ్చు నుతి సేయింపంగ వేదాంతముల్
వాచాలుండయి తెల్పవచ్చు నిగమవ్యాఖ్యార్థసంవేద్య నీ
ప్రాచుర్యాదిమతత్త్వ మజ్ఞులకు లభ్యంబౌనె రామప్రభో.

73


మ.

జననవ్యాధినివారకంబు భవసంసారాబ్ధికిం దారకం
బనఘ శ్రీపదవీపదంబు నిగమవ్యాపారసారంబు స
న్మునిదిష్టంబగు రామతారకము వీనుల్ చేరి నర్తింపకన్
జను లేలా యమకింకరార్భటికి సంతాపింప రామప్రభో.

74


మ.

కరు లశ్వంబులు కాంత లందలములున్ గంధప్రసూనంబు లం
బరముల్ రత్నవిభూషణంబులు గృహప్రాకార మారామభా
స్వరశయ్యాసనవస్తుజాలములు మోక్షం బివ్వఁగాఁజాలు నా
నరులయ్యో నిను గొల్వ రీభ్రమలలోనం జిక్కి రామప్రభో.

75

శా.

రా జన్నట్టిపదంబు ధర్మతనయున్ రామున్ హరిశ్చంద్రునిన్
భోజుం జేరె యశోదయానయకళాపుణ్యక్షమాయుక్తమై
తేజోహీనులు నేటిరాజులు యశోధీరాజు లీరాజులన్
ధీజాడ్యంబున గొల్వఁ గష్టఫల మింతే సుమ్ము రామప్రభో.

76


మ.

కళ లశ్వత్థదళంబు లర్థములు మేఘచ్ఛాయలున్ బ్రాణవృ
త్తులు విద్యుల్లత లెండమావు లిల ఖద్యోతంబులున్ బుద్బుదం
బులు దంతావళకర్ణరీతులు నభఃపుష్పంటు లుల్కారుచుల్
చలసంపత్తుల నుబ్బువాఁడు నిను గొల్వన్ లేఁడు రామప్రభో.

77


శా.

ఆధివ్యాధుల కౌషథంబు గ్రహపీడారణ్యదానంబు చి
ద్బోధానందఘనప్రదీపకళికాపూర్ణకృతస్నేహమో
హాధారాధరమారుతంబు భవదీయోదగ్రనామంబు జి
హ్వాధీనంబయి నిల్వ సంశయ మింకేలా మాకు రామప్రభో.

78


మ.

తరుణీబాహులతోగ్రపాశవలయాంతర్వర్తినై మోహదు
స్తరవారాశి తరింపలేక తిరుగన్ దాక్షిణ్యశీలుండవై
కరుణాలోకనరాశిగోచరలసత్కళ్యాణసంధాయి నీ
చరణద్వీపము చేరితిన్ సుఖనివాసంబయ్యె రామప్రభో.

79

శా.

కాంతానాభికుచోరువక్త్రములు వేడ్కన్ జూచితిన్ రోసితిన్
కంతుప్రాజ్యవిలాసకేళి మది కెక్కన్ గూడితిన్ బ్రేమమై
సంతాపం బొకయింత లేక కులటాసంయోగినై యోగినై
రంతుల్ మానితి నిన్ను జేరితి కృపన్ రక్షింపు రామప్రభో.

80


శా.

రాజద్వారము నాశ్రయించి భటదుర్వారైకహుంకారతిన్
తేజోభంగము జెంది కుంది మదవృత్తిన్ మన్మథద్వారసే
వాజాడ్యంబున లోకనిందఁ బరితాపం బందితిన్ జెందితిన్
జేజే స్త్రీనృపసేవ చాలునిఁక లక్ష్మీధామ రామప్రభో.

81


శా.

సంసారం బనుసాగరంబు దరిగాంచన్ శక్యమా యేరికిన్
హింసాకృత్యములందుఁ జెప్పదరమా యేనాఁటికిం గామముల్
సంసర్గంబున హెచ్చుగాని యొకలేశం బైన శాంతింప నీ
సంసారాంబుధి దాఁట నావ విను నీసంసేవ రామప్రభో.

82


శా.

నామాటల్ భవదీయసన్నుతులుగా నాచేయుసంచారముల్
నీమాంగల్యతనుప్రదక్షిణముగా నిద్రాసమాధిస్థితిం
గా మావల్లభ! భోజనాదివిషయాభ్యాసంబు నీపూజగా
నేమేఁ జేసిన నీసపర్య విధిగా నీక్షింపు రామప్రభో.

83


మ.

ఉపవాసంబులు చేసినన్ దివసమధ్యోర్వీస్థలీవాసులై

జపము ల్జేసిన యాగవైదికమహాచారంబులం జేసినన్
దపము ల్జేసినఁ బూజఁ జేసిన మహాదానంబులం జేసినన్
విపరీతంబగు నీకొసంగని క్రియావిఖ్యాతి రామప్రభో.

84


శా.

నీకే నెంగిలి పెట్టఁజాలను దయన్ నీరొమ్ముపై దన్నఁగా
నా కాలాడదు వ్యత్యయంబు గను నీ నామంబుఁ జింతింపఁగా
నేకాగ్రస్థిరబుద్ధి నిల్వ దకటా యేలాగు నీరూపమున్
నాకున్ గానఁగవచ్చు భక్తి యిసుమంతన్ లేక రామప్రభో.

85


శా.

శ్రౌతస్మార్తవిధానయజ్ఞముఖదీక్షావృత్తు లేజాడవో
జ్ఞాతృజ్ఞేయము లెట్టివో విపులమంత్రాచారపూజాతపః
ప్రాతస్నానవిధాన మేవిధమొ జీవబ్రహ్మ లేచందమో
యీతాత్పర్యము లే నెఱుంగ నిఁక నీవే దిక్కు రామప్రభో.

86


శా.

అన్నల్దమ్ములు నాలుబిడ్డలు ధనం బార్జింపుచున్నంతకున్
దన్ను న్మన్ననఁ జేతు రెంతయును వృద్ధత్వంబునన్ ఖిన్నుఁడై
యున్న న్గన్నులఁ జూడ రీవిఫలసంయోగంబులే సౌఖ్యముల్
దున్నల్ మానరుగాక మానవులు పొందుల్ కీడు రామప్రభో.

87

మ.

పరకాంతారతిఁ గోరు నన్యధనముల్ ప్రాపింపఁగాఁ జూచు నొ
క్కరి భాగ్యోన్నతికి న్విషాదపడి లెక్కల్ పెట్టు పైదోషముల్
మఱచు న్దా నొనరించు దోషముల నున్మత్తంబు నీచిత్త మె
వ్వరి మన్నింపదు దీనిగర్వ మకటా వారింపు రామప్రభో.

88


శా.

వీడీవీడడు దుష్టసంతతి వధూవిస్రంభలీలారతుల్
కూడీకూడదు భక్తసాధుజనసద్గోష్ఠిం భవత్కీర్తనన్
పాడీపాడదు నాదుచిత్త మధికౌన్నత్యంబు సత్యంబు తా
నాడీయాడదు దీనియు బ్బడపవయ్యా వేగ రామప్రభో.

89


మ.

కొడు కేతప్పులు చేసినన్ బరులతోఁ గొట్లాటపైఁ దెచ్చినన్
చెడుజాడ న్విహరించిన న్జనకుఁ డాక్షేపింప కాపుత్రునిన్
కడులాలించి యభీష్టభోగముల వేడ్కల్ గూర్చి రక్షించుకై
వడి భక్తావళి నీవు ప్రోతు వట దైవస్వామి రామప్రభో.

90


శా.

పుత్రుల్ మోక్షదు లన్నచో శుకమరుత్పుత్రాపగాపుత్రులే
పుత్రు ల్గాంచిరి యాగదీక్ష సుమనోభోగాస్పదం బన్నచో
పత్రీశుండు కిరాతుఁ డేముఖములం భావించి గావించిరో

సుత్రామార్చిత నిన్నుఁ గొల్చిన లభించున్ ముక్తి రామప్రభో.

91


మ.

జననం బాదిగ నేను జేసిన సుదుష్కర్మంబు లెన్నయ్య ప్రా
క్తనజన్మార్జితకర్మసంఘము లసంఖ్యాతంబు లీకర్మబం
ధన మెన్నాళ్లకు దీఱ దెన్నఁడు చిదానందంబు సిద్ధించు నీ
జననం బేవిధిఁ బోవు బ్రోవఁగదవే సద్వంద్య రామప్రభో.

92


మ.

ధనమందుం బ్రియజారకాంతలపయిం దారాత్మజశ్రేణిపై
ఘనగ్రీవాదులమీఁద గేహముపయిన్ గాపేయమున్నట్లె పా
వనచారిత్ర భవత్పదాబ్జములపై వాంఛాలతల్ గూర్పవే
నిను సేవింపదు నామనం బకట! దీని న్బంచు రామప్రభో.

93


మ.

పరదోషంబుల నుద్ఘటించుతఱి జిహ్వల్ రెండు లేకంతఁ బెం
పర నాత్మీయగుణంబులం బొగడుచో వక్త్రంబులు న్వేయునౌ
పరకాంతావళిఁ జూచుచో నయనముల్ భావింపఁగా రెండువే
లరయంగానగు మూఢచిత్తుల కహాల్యావంద్య రామప్రభో.

94


మ.

ధరణీరేణువులు న్తుషారగణము ల్తారాగణశ్రేణులున్
తరగల్ చిమ్మినబిందువు ల్తఱుచువానన్ వారిధారావళుల్

సరవిన్ సంఖ్య యొనర్పవచ్చు మును నాజన్మంబు లెన్నయ్యెనో
పరికింపం దరమా విధాతకయిన న్భావింప రామప్రభో.

95


మ.

కలపం బంతటఁ బూసినన్ సహజదౌర్గంధ్యంబు తామానునా
చెలిమి న్బూతపదంబు దెచ్చినను దుశ్చేష్టల్ విడన్ జూచునా
మలభూయిష్టము మేను దీని సుఖము ల్మాయామయాల్పస్థితుల్
పలుగున్ జాడలు దీనియున్నగతి జెప్పన్ రోఁత రామప్రభో.

96


మ.

భరితగ్రాహజలాశయంబు తృణముతో పైఁగప్పుకూపంబు త
స్కరసంక్రాంతవనంబు లీన భుజగాగారంబు సింహస్థకం
దర మంభోధివిహారిజీర్ణతరియంతఃకీటభూజంబు దు
ర్భరసంసారము దీనిసౌఖ్యములు గోరన్ రాదు రామప్రభో.

97


మ.

అవలోకించితి వేదశాస్త్రములు మంత్రామ్నాయము ల్జూచితిన్
వివరింపంబడె సాంఖ్యయోగములు నన్వేషించితిన్ దంత్రముల్
లవమాత్రంబును జ్ఞాన మబ్బ దిఁక నేలా యన్యథా చింతనల్
దివిజాధీశ్వరవంద్య నీస్మరణమే దిక్కయ్య రామప్రభో.

98

మ.

తనభావంబునఁ దన్నుఁ జూచుచు సమస్తప్రాణిసంతానమం
దునఁ దన్నుం గనుఁగొంచు భూతములయందుం బ్రీతి రెట్టించి ప్రా
క్తనకర్మంబుల కోర్చి భావిఫలముల్ దానంటకున్నట్టి ధ
న్యు నకంపస్థితి ముక్తికాంతయగు ధీరోదాత్త రామప్రభో.

99


మ.

వరుసం జేసినపాపము ల్దలఁపఁ ద్రోవన్ రానిదుఃఖంబులౌ
మరణాయాసము దల్చుకొన్న భరియింపన్ రాని సంతాపమౌ
నరకావాసదురంతఖేదములు విన్నన్ భీతి రెట్టిల్లు నీ
పరితాపంబు హరించు బంధువుఁడ వీవా కావె రామప్రభో.

100


మ.

దయ భూతంబులయందుఁ జిత్తము భవత్పాదాబ్జయుగ్మంబుపై
భయ మంహశ్చరితంబులన్ వ్యసనముల్ బ్రహ్మైక్యవిజ్ఞానమం
ద యశోవృత్తి నసూయ సజ్జనసమూహాత్యంతసాంగత్యమున్
దయచేయంగదవయ్య వార్షికపయోదశ్యామ రామప్రభో.

101


మ.

పదము ల్పూజ యొనర్తునో కరములన్ భావించి పూజింతునో
హృదయం బర్చ యొనర్తునో భుజయుగం బేవేళ పూజింతునో

వదనాలంకృతిఁ జేతునో శిరము గ్రీవాపీఠిఁ బూజింతునో
సదయాంతఃకరణాసమర్చనవిశేషం బెంతు రామప్రభో.

102


మ.

తులసీకోమలదామ ముంచవలయున్ దోరంతమున్ జూపుమా
విలసద్రత్నకిరీట ముంచెద శిరోవీథిన్ దయంజూపుమా
జలజాతంబులఁ బూజఁజేసెదఁ బదాబ్జాతంబులం జూపుమా
కలమాన్నం బమృతోపహార మిదిగో కైకొమ్ము రామప్రభో.

103


శా.

మందారంబులొ కుందమాలికలొ శామంతీలతాంతంబులో
యిందుక్ష్వేళదళారవిందకరవీరేందీవరశ్రేణులో
ఛందోవందితపారిజాతతులసీచాంపేయదామంబులో
యింకేదీ ప్రియ మిందిరారమణ నీ కేనిత్తు రామప్రభో.

104


మ.

కలధౌతాంబర ముత్తరీయము లసద్గంధానులేపంబు కో
మలమందారలతాంతమాలికలు శ్రీమద్రత్నకేయూరమం
డలమంజీరకిరీటహారములు నానాసౌధశయ్యాసనో
జ్జ్వలభోగ్యంబు లొసంగెదన్ గొనుము శశ్వత్ప్రేమ రామప్రభో.

105


మ.

చరణన్యాసవిలాసయోగ్యమగు లాక్షారాగముం జందనా

గురుకర్పూరమృగీమదాంజనలసద్గోరోచనాకుంకుమా
దిరసామోదవిలేపనాభరణమున్ ధీచాతురిన్ సీతవ
న్నె రుచింపం గయిసేతు చేతులలరన్ నీ వెన్న రామప్రభో.

106


మ.

తరుణార్కాంశునిభోత్తరీయపట మంతర్వస్త్రకౌశేయభా
సురకూర్పాసవిచిత్రసత్కనకవాసోవాసనావాససం
వరణంబుల్ పరిధేయభూషఇము దేవా దేవి కర్పించెదన్
సరసాలోకసుధారసోల్లహరి నాచారింపు రామప్రభో.

107


శా.

మందారాంబుజపారిజాతసుమశామంతీజపామంజరీ
కుందేందీవరకేతకీవకులసద్గుచ్ఛప్రసూనావళుల్
పొందొప్పన్ గచధార్యభూషణములన్ భూజని గైసేసెదన్
వందారుప్రియ ప్రేమఁ గైకొనుము సేవావృత్తి రామప్రభో.

108


మ.

మణిమంజీరసువర్ణకింకిణిరణన్యాణిక్యవన్మేఖలా
గుణరత్నాంచితకర్ణపూరమణిమత్కోటీరకేయూరకం
కణహారాదిశరీరధారసదలంకారంబులన్ భక్తపో
షణ సంవీత మొనర్చెదన్ గనుము శశ్వత్ప్రేమ రామప్రభో.

109


శా.

దీనం దప్పులు గల్గిసన్ బుధజనుల్ ధిక్కారము ల్మాని బో
ధానందస్థితి నీకృతిన్ గరుణచే నంగీకృతిం జేసినన్

.

దానన్ సత్కృతిఁ గాంచి సర్వజనమాన్యంబౌను దుత్తూరమున్
జానొందన్ నుతి గాంచి మించదె భువిన్ సర్వజ్ఞ రామప్రభో.

110


శా.

శ్రీరామప్రభునామనిహ్నుతము భూరిజ్ఞానశాంతిక్షమా
వైరాగ్యప్రద మాత్మబోధకము దుర్వ్యాపారవిచ్ఛేదవా
గ్సారోదారము నీకృతిం జదువ నాకర్ణించినన్ వ్రాసినన్
శ్రీరామప్రభుఁ డిచ్చు నవ్యయపద శ్రీభోగసౌభాగ్యముల్.

111


శ్రీరామప్రభుశతకము
సంపూర్ణము