భక్తిరసశతకసంపుటము/మొదటిసంపుటము/చిత్తబోధశతకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పీఠిక

ఈచిత్తబోధశతకము, మాససబోధశతకము నొక్కడే రచించినటులఁ దోచుచున్నది. విషయమునందు రచనమునందుఁ బదముల గూరుపునం దీరెండుశతకములందు సామ్యముంటయేగాక వంశవృత్తము దెలుపుపద్యము మంగళపద్యము ఇంచు కూర్పులతో సమముగా నున్నవి. కాని చిత్తబోధశతకము మానసబోధశతక మంత ప్రౌఢముగా నుండకపోవుటచే చిత్తబోధశతకము ప్రథమప్రయత్న మని యూహింప నవకాశము కలుగుచున్నది.

శతకము రచించినకవి తాడేపల్లి పానకాలురాయఁడు. ఇతఁడు నియోగి బ్రాహ్మణుడు. మంగళగిరిపొన్నూరుక్షేత్రములను పలుమాఱు వర్ణించుట బట్టియు శ్రీకాకుళక్షేత్రమాహాత్మ్యము వాకొనుట బట్టియు నితరాధారముల బట్టియుఁ గృష్ణాతీరమునందలి తాడేపల్లి నివాసియేమొ యని నిర్ణయింపవచ్చును.

కవి యీశతకమును “సకలపురాణసంగ్రహ"మని చెప్పికొనినాఁడు. విశేషముగాఁ బద్యములలో విష్ణుమహిమను భావమును దెలుపు పురాణాంశములే కలవు. ప్రతిపద్యము రసాస్పదమై సుబోధకమగు భక్తిరసమున కాటపట్టుగ నుంటచేఁ జదువుటకుఁ జవులూరుచుండె ననుటకు సందియము లేదు.

హృదయమును ఐహికములనుండియు విషయాదులనుండియు మఱలించి భగవచ్చింతనమునకుఁ బురికొల్పుట కీశతకము ముముక్షువులకుఁ దోడ్పడఁగలదు. కవిజీవితము మానసబోధశతకమునఁ దెలుపఁబడియున్నది.


నందిగామఇట్లు భాషాసేవకులు,

1-1-25శేషాద్రిరమణకవులు

శ్రీరస్తు

తాడేపల్లి పానకాలరాయకృత

చిత్తబోధశతకము

ఉ.

శ్రీరమణీయవైభవవిశేషములై సనకాదియోగిహృ
చ్చారుతరమ్ములై గగనశైవలినీజననప్రవర్ధనా
గారములై జగత్త్రితయగణ్యములై బుధలోకజీవనా
ధారము లైనశ్రీహరిపదమ్ములు కోరిభజించు చిత్తమా.

1


చ.

హలకులిశాంకుశధ్వజశరాసనతోరణశంఖచక్
కోమలజలజాతమత్స్యయవమంజులరేఖల సుందరమ్ములై
జలజభవాభవాద్యమరసంఘము సంతతభక్తియుక్తి నౌ
దలల ధరించు శ్రీహరి...

2


ఉ.

నందసునందసేవిత సనందనవందితసుందరాంగ గో
వింద ముకుంద భాస్వదరవిందదళాంబకకందవర్ణ
శ్రీమందిరవిశ్వతుందధృతమందర వందనమయ్య వేదవి
ద్వందిత యంచు శ్రీహరి...

3


ఉ.

తమ్ములఁ దమ్ములంచు విదితమ్ముగ లాలన సేయుచుం బ్రవా
ళమ్ములడాలు డీలుపడులక్షణకాంతుల మించి పద్మరా

గమ్ముల ప్రస్తరమ్ములన గ్రమ్మిన విమ్ములనొంచి హల్లకా
ర్థమ్ములఁబోలు శ్రీహరి...

4


చ.

యమున సుకాళియోరగవిశాలఫణాంతరసీమఁ జేర్ దిం
ధిమికిటదింధిమింధీమిత తెయ్యని తాండవకేళి సల్పు నీ
యమలినకోమలాంఘ్రియుగ మల్లనఁ జూపగదయ్య మొక్కెదన్
దమిగొని యంచు శ్రీహరి...

5


ఉ.

దండము పాండుతుండరథ దండము పాండవరాజ్యదాయకా
దండము చండికేశనుత దండము కంజభవాండనాయకా
దండ మఖండతత్త్వమయ దండము కుండలిరాజతల్పకా
దండ మటంచు శ్రీహరి...

6


ఉ.

దేవ మహానుభావ వసుదేవతనూభవ వాసుదేవ రా
జీవభవాదిదేవగణసేవిత మాధవ సర్వలోకసం
భావిత నీగుణత్రయము బ్రస్తుతిఁ జేసెద నంచు నాత్మబో
ధావశవృత్తి శ్రీహరి...

7


చ.

ఉరమున లక్ష్మి నాభి నలినోద్భవుఁ డంగములందు దేవతల్
కరముల శంఖచక్రములు కంఠమున న్మణిహారకాంతులున్
శిరమున రాజరత్నరుచిచిత్రకిరీటము గల్గువేల్పు సా
దరమునఁ బ్రోచు శ్రీహరి...

8

ఉ.

నల్లనివాఁడు కుందరదనములవాఁడు సమస్తలోకముల్
చల్లఁగ నేలువాఁడు రిపుసంఘముల న్బొలియించువాఁడు వ్రే
పల్లె ప్రజాంగనామణుల భావజకేళినిఁ దేల్చువాఁడు నీ
తల్లడ మార్చు శ్రీహరి...

9


చ.

సిరిఁ జెలువొందు పెన్నురము, చిందము చందము నొందుకంఠము
న్దరదరవిందనేత్రములు దర్పకుసింగిణి బోలు కన్బొమల్
సురుచిరకుందబృందముల సొంపగుపల్జవగల్గుదైవ మా
దరమునఁ బ్రోచు శ్రీహరి...

10


ఉ.

లౌకిక మింతె చాలు నతిలౌల్యమున న్గతిదూలు నీశ్వరా
లోకన సేయ మేలు ప్రవిలుబ్ధషడూర్ములు గూలు మోక్షమున్
గైకొనవీలు దుర్భవనికాయములన్ని రసింపఁజాలు మే
ధాకృతి నేలు శ్రీహరి...

11


చ.

క్రమమున సర్వలోకములఁ గల్పనఁ జేసెడిచో విధాతయై
సమతను సర్వరక్షణము సల్పెడుకాలమునందు విష్ణుఁడై
యమరినవృత్తి సర్వవిలయం బొనరించెడు వేళ రుద్రుఁడై
తమిఁ జెలువొందు శ్రీహరి...

12


ఉ.

సోహము వీడు భాగవతశూరులఁ గూడు తదీయభక్తి దా
సోహ మటంచు వేఁడు పరిశుద్ధిగ విష్ణునిఁ బాడుమింక సం

దేహము లేదు చూడు హరి దీనులపాలిటివాఁడు సంతతో
త్సాహత నేఁడు శ్రీహరి...

13


చ.

సిరులు చెలంగు లోనిరిపుచేష్ట లణంగు మహోగ్రకాలకిం
కరభయము ల్దొలంగు సుకరమ్ముగ సంపగ లిం పెసంగు దు
ర్భరభయము ల్దలంగు వివరమ్ముగ ముక్తి గలుంగు కల్మషో
త్కరములు ద్రుంగు శ్రీహరి...

14


ఉ.

సారెకు సారెకున్ దనుజసంహరుదివ్యకథామృతంబు వే
సారక క్రోలుడు న్వినుచు సంతత మచ్యుతదివ్యమంగళా
కారము ధారణావశతఁ గట్టిగ నాత్మను జేర్చి భక్తిబో
ధారత గల్గి శ్రీహరి...

15


చ.

నిరుపమ నిత్య నిర్విషయ నిర్గుణ నిర్మల నిర్వికల్ప ని
ర్జర నిగమాంగ నిర్మమ నిరంజన నిశ్చల నిర్వికార ని
ర్భరణ నిరావలంబ నిరుపద్రవ నీసుగుణమ్ము లెంతు స
త్వరముగ నంచు శ్రీ హరి...

16


చ.

బలి జన కాంబరీష ధ్రువ పార్థ విభీషణ భీష్మ దాల్భ్య పి
ప్పల హనుమ త్పరాశర సుపర్ణ గజేంద్ర వసిష్ఠ వత్స దే
వల శుక నారద ప్రముఖభాగవతోత్తములం దలంచినం
దలఁగక మెచ్చు శ్రీహరి...

17

చ.

కరివరుదైన్యమున్ హరిణిగండము ద్రౌపది భంగ ముత్తరో
దరశిశుబాధ కుబ్జమదితాపము విప్రునిపుత్త్రచింత భూ
భరము నృపాలకోటిచెఱ బాపిన దైవము నేఁడు నిన్ను స
త్వరముగఁ బ్రోచు శ్రీహరి...

18


చ.

కరివరునిన్ జలగ్రహము గట్టిగఁబట్టిన డస్సి వేయు వ
త్సరములు కుయ్యిడంగ విని సర్వమయత్వము లేమి వేలుపుల్
వెఱఁగుపడంగ నచ్యుతుని వేఁడిన నక్రము ద్రుంచి హస్తి నా
దరమున బ్రోచు శ్రీహరి...

19


చ.

వలలు నిషాదుఁ డేసి గమివహ్నియు గ్రమ్మఁ బ్రసూతివేదనన్
కళవళమందుచున్ హరిణకామిని యోహరి యోరమేశ్వరా
విలయముఁ బాపవే యనుచు వేఁడ దయామృతదృష్టిముష్టిచేఁ
దలఁగక ప్రోచు శ్రీహరి...

20


చ.

పదపడి కౌరవు ల్సభకు బల్మిని ద్రౌపది నీడ్చి తెచ్చి దు
ర్మదమున పల్వ లొల్వఁగ రమావర నాదురవస్థఁ బాపవే
యదువర కావవే యనఁగ నక్షయచేలము లిచ్చి ప్రోచు భ
ద్రదుఁ డగునట్టి శ్రీహరి...

21


చ.

తరలని ద్రోణిబాణశిఖి దార్కొని యేఁచఁగఁ దాళజాల నో

మురహరకృష్ణ యోభువనమోహన కావవె యంచు వేఁడ ను
త్తరజఠరస్థబాలుని ముదంబునఁ బ్రోచిన శౌరి నిన్ను స
త్వరముగ నేలు శ్రీహరి....

22


ఉ.

కామముఁ జెంది శూర్పణఖ కంసునిదాసిగఁ బుట్టి కుబ్జయై
యామధురాపురిన్ మధుమదాంతకుఁ బొంది ధరించె నింక నీ
కేమిటి కీవిచార మెవ రెట్టులఁ గోరిన నట్లు ప్రోచు శ్రీ
ధాముఁడు గాన శ్రీహరి...

23


చ.

వరుస కుశస్థలీపురనివాసుఁడు విప్రుడు పుత్త్రు లీల్గినన్
నరునిప్రతిజ్ఞ దూలెనని నందకుమారుని వేడినంతనే
కరుణను దత్తనూజశతకంబు సజీవముఁ జేసి తెచ్చి స
త్వరముగ నిచ్చె శ్రీహరి...

24


ఉ.

ఆలమునందుఁ దొల్లి దెగటారిన దైత్యులు ద్వాపరంబునం
దోలిఁ బ్రలంబ కంస నరకోరగ కౌరవ సాల్వ చేది భూ
పాలక దంతవక్త్ర ముర పౌండ్రకులన్ బడఁగూల్చి మాన్చె ను
త్తాలభరంబు శ్రీహరి...

25


చ.

సురవరులం జయించి[1] బలశోభితుఁడై నరకాసురుండుభూ
వరులను బట్టి యాఁకగొని వంచన సేయఁగ కావవే హరీ

26

శరణని వేఁడి వారిచెఱ సయ్యనఁ బాపినదేవదేవుఁ డా
దరమునఁ బ్రోచు శ్రీహరి...

26


చ.

విను మొకరక్కసుండు తనవీనుల కెయ్యెడ విష్ణునామముల్
వినఁబడకుండుఁ గా కనుచు విక్కుచు నెప్పుడు రెండువీనులన్
ఘనముగ జంటగంట లొగిఁగట్టిన వాని నెఱింగి సత్కృపం
దనియఁగ బ్రోచు శ్రీహరి...

27


చ.

తొలుత మహాపరాధులయి తూలి గయాఖ్యుఁడు దాక దానవుం
డల భృగువుం బురందరుఁడు హాటకగర్భుడు దీనవృత్తిచే
వెలువడి కావవే యనుచు వేఁడినఁ దప్పు క్షమించి ప్రోచెఁ గొం
దల మణఁగించి శ్రీహరి...

28


చ.

చెలిమిని యాదవుల్ భయముచేతను గంసుఁడు భక్తితో మునుల్
వలపున గోపకామినులు వైరము మానక పెక్కురక్కసుల్
తలపడి శౌరినిం దగిలి ధన్యతఁ గాంచిరి గాదె నీ విదే
తరఁగని ప్రేమ శ్రీహరి...

29


ఉ.

తన్నినఁ బట్టికొట్టినను ద్రాటనుగట్టిన ఱాల రువ్వినన్
మిన్నక దుండగీఁ డనిన మిండఁ డన న్మటుమాయివన్న సం
పన్నులగా నొనర్చినకృపాళుఁడు వెన్నుఁడుగాన నన్యచిం
త న్నొగిలేవు శ్రీహరి...

30

చ.

తలఁప నహల్యఁ దార కురుదార దశాననదార ద్రౌపదీ
లలనను నమ్మహాత్ముడు విలాసయశఃపరిపూతగాత్రలై
వెలయఁగఁ జేసినాఁ డనుచు వింటిని సంశయ మెందుకింక వం
తలఁ బడ నేల శ్రీహరి...

31


చ.

అడవుల నొక్కలుబ్ధకుఁ డహర్నిశలం దతిక్రూరకృత్యముల్
నడుపుచు రామ రామయని నర్మిలిఁ బల్కుట చేతఁ బూతుఁడై
వడి జడదారియై కడకు వాసికి నెక్కుట వింటి వీ వయో
తడఁబడ నేల శ్రీహరి...

32


ఉ.

నింగికి నేగి దైత్యుల ననిం దెగటార్ప సురాళి మెచ్చి ఖ
ట్వాంగుఁడు వేఁడినట్టుల నిజాయువుఁ దెల్ప నతండు ధాత్రి దీ
క్షం గమలాక్షుసంస్మరణ సల్ప ముహూర్తములోఁ దరించెఁ ద
ద్భంగిని నీవు శ్రీహరి...

33


ఉ.

భూసురదాసిగర్భముసఁ బుట్టి సదా హరిభక్తుఁ డౌటచే
భాసురవృత్తి నారదుఁడు బాగుగ దేవఋషిత్వ మొంది దే
వాసురమర్త్యలోకముల నందఱికి న్గురుఁ డయ్యెఁ గాన నీ
దాసి నటంచు శ్రీహరి...

34


ఉ.

హేయపుబానిసెం గలసి హీనుఁ డజామిళభూసురుండు లేఁ

బ్రాయమునందు సంతుగని ప్రాణముఁ బాసెడివేళఁ బుత్త్రు నా
రాయణ యంచు దా నుడువ నచ్యుతలోకము గల్గెఁ దత్కథా
ధ్యాయివి యౌచు శ్రీహరి...

35


చ.

పరువడి కోసలాత్మజయుఁ బంక్తిరథుం డరయంగ దేవకీ
వరవసుదేవులై పొడమి వారిజనేత్రుని గాంచి మించి ర
చ్చరితము లెంచి ఘోరభవసంఘముల న్నిరసించి ముక్తి స
త్వరగతిఁ గాంచి శ్రీహరి...

36


ఉ.

పొందుగ ద్రోణుఁ డన్వసువిభుండును భార్య ధరాభిధానయున్
నందయశోదలై బొడమి నందనుగాఁ గని పెంచి ముక్తులై
రందురుగాదె భావ మెటులైనను రక్షకుఁ డంచు నమ్మి యే
తందర లేక శ్రీహరి...

37


చ.

అలర సుమిత్ర రోహిణిసమాఖ్య వహించి జనించి కాంక్షచే
హలధరుఁ గాంచి కాంచె నఖిలామరు లందఁగలేని సౌఖ్యమున్
దలఁగక తచ్చరిత్రము యథావిధిగా నుడువంగ నీకుఁ ద
త్ఫలము గలుంగు శ్రీహరి...

38


చ.

నయమును బాసి పూతనయు నందునిమందిరమందు వెన్నునిన్
రయమున నొంపఁబట్టఁగను రంజనఁ దత్కుచదుగ్ధరక్తముల్

ప్రియమునఁ గ్రోలి కూల్చి దయపెంపున నైక్య మొసంగె నేమివిం
తయొ తలపోసి శ్రీహరి...

39


చ.

మదమునఁ గాలనేమి హనుమంతునిచే హతుఁ డౌచు ద్వేషిగాఁ
బదపడి కంసుఁడై పొడమి పంకజనాభునిఁ జేరె మాయురే!
యదనుస భక్తినైనఁ బగనైనను బన్నగతల్పుఁ గోర భ
ద్రదమగు గాన శ్రీహరి...

40


ఉ.

[2]ధాతృశిరోవిఖండనకృతంబున ద్రౌపదిగా నొనర్చి యా
నాతికి దుష్టి దీఱగ రణస్థలి కౌరవసేన నిచ్చి బల్
జాతర జేసి రుద్రగతజాడ్యము బాపితి వీవ హేజగ
త్త్రాత యటంచు శ్రీహరి...

41


చ.

చతురత గాధినందనుని జన్నము గాచె నహల్యశాప మా
తతమునఁ బాపె నాజటలతన్వికి మోక్ష మొసంగె నత్యుదం
చితముగ సర్వలోకములు జేకొని యేలినదేవదేవుఁ డు
ద్ధతి నినుఁ బ్రోచు శ్రీహరి...

42


ఉ.

గోరిక దీఱ నొక్కపరి కోమలసౌరభపుష్పదామముల్
గూరుప మాలికు న్మనిచెఁ గొంగుపసిండిగ మోక్ష మిచ్చి య

య్యారె! నిరంతరార్చకులు నైనమహాత్ముల కేమి లోపమౌ
ధారుణి నంచు శ్రీహరి...

43


చ.

కలిమి కుచేలుఁ జేర్చె వ్రజకాంతల కిచ్చెను భోగభాగ్యముల్
వలువ లొసంగె ద్రౌపదికి వైభవ మూసరవెల్లి కిచ్చె దో
ర్బల మల పాండవేయులకు రాజ్య మొసంగిన శౌరిదీక్షచేఁ
దలఁగక ప్రోదు శ్రీహరి...

44


ఉ.

క్రేపులఁ బాపల న్గుహను గీష్పతి దాఁచ గణించి ప్వఁడే
బాఁపనిబాణవహ్ని పసిబాలుని నేఁచఁగ నాచికావఁడే
పాపగతి న్గతాసులగు బ్రాహ్మణపుత్త్రుల నుద్ధరింపఁడే
దాఁపురమేల? శ్రీ హరి...

45


చ.

వ్రత మొనరించి సాత్రజితి వాసిగనిచ్చినభర్తృదాన ము
ద్ధతి సురమౌని యమ్ముతరి తత్పతితుల్యధనమ్ము లేనిచో
వెతఁబడి సత్య రుక్మిణిని వేఁడఁగఁ దత్తులలోన భీష్మక
క్షితిపతిపుత్త్రి యొక్కతులసీదళ ముంచిన తుల్యుఁడౌ జగ
త్పతి నినుఁ బ్రోచు శ్రీహరి...

46


చ.

విరివిగ రంగమందిరము వేంకటశైలము తోతశైల పు
ష్కరబదరీవనమ్ములను గండకి నైమిశనీలశైలముల్

హరి నిజమూర్తులౌ నెనిమి దారయ నేఁగఁగ లేవు ముందునా
దరియెటు లంచు శ్రీహరి...

47


చ.

పొరిపొరి పైఁడిపువ్వులను పూజలు చేసిన భూమిపాలునిన్
విరివిగ మంటిపువ్వులను వేడ్క నొనర్చినకుంభకారునిన్
సరసత మల్లెపూవుల నొసంగిన భూసురవర్యునిన్ మహా
దరమునఁ బ్రోచు శ్రీహరి...

48


ఉ.

పొందున మేనమాను తనపుత్త్రిక నిచ్చె నటంచు మాని గో
విందున కీయకున్న వెనువెంటనె సాక్షిగఁ గాశినుండి పే
రొందగ వచ్చి పెండ్లి నిగమోక్తుని పొన్నురిలో నొనర్చి త
ద్వందితుఁడైన శ్రీహరి...

49


చ.

విరిసరు లీయఁ గైకొనుచు వింతనెఱుల్ సరులందుఁ గాంచి భూ
వరుఁ డలుగన్ దదర్చకునివాక్యము నిక్కముగా శిరోజముల్
విరివిగఁ జూపి యాబెడఁద వీడఁగఁజేసెను మున్ను కాకుళాం
తరమున నట్టి శ్రీహరి...

50


ఉ.

తేనె ఘృతంబు పాలు గడుతీర్థము నాల్గుయుగక్రమంబులం
దానును శంఖచక్రముఖరాయుధముల్ స్వకరాంబుజంబుల

న్బూనుచు సాధుసంగములఁ బ్రోదిగ సాఁకుచు మంగళాచలా
స్థాపకుఁడైన శ్రీహరి...

51


ఉ.

పొంగుచు నొక్కవిప్రకులపుంగవుఁ డంగజకేళిఁ దేల్చువా
రాంగన వీడిన న్వగచునంతటి కుండినవేషధారియై
బంగరుగిన్నె నొసంగి బాగుగఁ బ్రోచినరంగఁ డార్యహృ
ద్సంగతుఁ డంచు శ్రీహరి...

52


ఉ.

పాతకురాల నోపతితపావన నీమహనీయరూపముల్
ప్రీతిగఁ జూపుమంచు మొఱఁబెట్టగ నీలధరాధరంబునన్
ఖ్యాతిగఁ జేర్చి దాని గతకల్మషురాలిని జేసితౌ జగ
త్త్రాతవటంచు శ్రీహరి...

53


ఉ.

కోరితి నీపదాబ్జము లకుంఠితభక్తిని బూజసేయఁగాఁ
జేరితి నీమహోన్నతవిచిత్రచరిత్రము లాలకింపఁగా
దూరతిఁ గావలెన్ దురితదూర దయామృతదృష్టిఁ జూడు నా
దారితినంచు శ్రీహరి...

54


ఉ.

నీగుణముల్ నుతింపఁగ ఫణీంద్రుఁడు చాలఁడు నీచరిత్రము
ల్బాగుగఁ గార్తవీర్యుఁ డొగి వ్రాయఁగ నేరఁడు నీదుసోయగం
బాగిరిభేది నిక్కముగ నారయనోపఁ డజాండపాలనో
ద్భాగుఁడ వంచు శ్రీహరి...

55

ఉ.

నీకు నమస్కరించెదను నిర్మలిభక్తిని నిన్ను గొల్చెదన్
నీకథ లాలకించెదను నీపదభక్తుల సేవఁ జేసెదన్
నా కిలవేల్ప వీవ నిను నమ్మితి నన్నుఁ గృతార్థుఁ జేయగా
చాకొనుమంచు శ్రీహరి...

56


ఉ.

నీవు సమస్తలోకము నెమ్మి సృజించితి వందులోన న
న్నే వసుధ న్మనుష్యునిగ నేఁటి కొనర్చితి వట్లుగాక నా
నావిధదుష్కృతమ్ములఁ బెనంగొనఁ జేసితి వేమి సేతు ని
ధావన కంచు శ్రీహరి...

57


ఉ.

నిక్కము దాత వీవు కరుణింపఁగఁ బాత్రము నేన సుమ్ము వే
ఱొక్కటి వేఁడ నీదుపదయుగ్మమున న్విడరానిభక్తియే
తక్కఁ గొనంగఁగోరితి గృతజ్ఞుడఁవై దయసేయకుండుటే
తక్కువ యంచు శ్రీహరి...

58


ఉ.

అక్కట జన్మవేదనల నాఱడిఁ బొందితినయ్య నీకు నే
మ్రొక్కెదనయ్య నే నిటుల మోసము పుచ్చుటెఱుంగనయ్య నా
దిక్కిటు చూడుమయ్య మది దీనతఁ బాపఁగదయ్య నీకు నే
దక్కెదనయ్య శ్రీహరి...

59


ఉ.

మన్ననఁ గుంభకారకుఁడు మంచిఘటమ్ము లొనర్చినట్లు భా
స్వన్నిగమోక్తి లోకము నసంఖ్యముఁ గల్పనఁ జేసి ప్రోచు సం

పన్నుఁడ వీవు న న్నొకవిపన్నుని మన్నన సేయరాదె వి ద్వన్నుత యంచు శ్రీహరి...

60


ఉ.

మానసమా! వృథావిషయమగ్నత నందఁగ నేల పూరికై
కానక మేఁక నూతఁ బడుకైవడిఁ గన్పడె నీ ప్రచారముల్
మానుము మాధవు న్గొలువ మంచిసుఖంబు ఘటిల్లుఁ గాన వి
ద్యానయవృత్తి శ్రీహరి...

61


ఉ.

ఉత్తమధర్మముల్ నడుపనోప వనుత్తమధర్మకర్మముల్
మొత్తముగా నొనర్చెదవు మోసము వచ్చు టెఱుంగవైతి వే
యెత్తున మోక్షమందెదవొ! యెందుకు జాగిఁక నీదువృత్తి త
ద్దత్తము చేసి శ్రీహరి...

62


ఉ.

ఎత్తఁగరానిజన్మముల నెన్నిఁటఁ ద్రోచితి వన్ని యెత్తి నేఁ
డుత్తలమంది కుంది యిపు డోరువఁజాలక నిన్ను వేఁడ న,
న్నిత్తఱి నిర్నిమిత్తముగ నేఁటికి యేఁచెదవయ్య మాన్పు నా
తత్తఱ మంచు శ్రీహరి...

63


ఉ.

దాకొనుపుణ్యపాపములఁ దప్పక మానవలోకమందు దు
ర్వ్యాకులవృత్తిఁ బుట్టి యపవర్గముఁ గానక గోరుచుట్టుపై
రోకలివడ్డరీతి నెదరోయక సంసృతిఁ జిక్కి యింక నెం
దాఁకఁ జరింతు శ్రీహరి...

64

ఉ.

ప్రాయము కాయమున్ సతమె భక్తిఁ బఠించినవారిఁ బ్రోవ నా
రాయణుఁడున్ దదీయ మగురాజ్యము లుండఁగ ఘోరదుర్గతి
న్బాయక గూలు మానవుల బాధలు చూడు నహో విచిత్ర మా
దాయము లేదు శ్రీహరి...

65


ఉ.

ఆర్వురుచక్రవర్తులు పదార్వురురాజులు రాజ్య మేలిరి
యుర్విగలంతకాల మిటులుండిరె నీబ్రతు కెంతలోని దీ
పర్వులు పర్వనేల మురభంజనుసేవయె ముక్తికర్వు కా
దర్వుగ నెంచి శ్రీహరి...

66


ఉ.

వేమరు మాధవు న్దలఁపవే యని నీచెవిఁజాఁటి చెప్పగా
నేమఱుపాటుఁ జెంది విన వేమిపురాకృతకర్మ మయ్యయో!
పామరవృత్తి మైమఱచి బాములకే యొడిగట్టుకొంటి వీ
తామస మేల శ్రీహరి...

67


చ.

ప్రకటితవేదశాస్త్రముల భాసిలుతత్త్వ మెఱుంగలేక యీ
వికటతమంబులం దగిలి వెక్కిరిచేష్టల విఱ్ఱవీగుచున్
సకలము నాని నే ననుచు సంసృతిఁ జిక్కి చరించువారితోఁ
దకబిక లేక శ్రీహరి...

68


ఉ.

ఆతతముక్తిమార్గము నయం బుపదేశముఁ జేసిఁ జూడఁగాఁ
గోఁతికి రత్నహారములు గొంకక వేసినమాడ్కిఁ దోఁచె నీ

నీతికి నేమ నందు నిఁక నేర్పరివై భయభక్తితో ముని
ధ్యాతములైన శ్రీహరి...

69


ఉ.

నీరము వృక్షమూలమున నించినఁ జల్లఁదనంబు కొమ్మలం
జేరినమాడ్కి విష్ణునకుఁ జేయు సపర్యల సర్వదేవతల్
భూరితరేష్టభోగపరిపూర్ణతఁ గాంతురు నీకుఁ గల్గు వి
స్తారసుఖమ్ము శ్రీహరి...

70


చ.

ఉరమునఁగల్గు రత్నరుచిరోజ్జ్వలహారము వెఱ్ఱివాఁడు దా
నరయఁగలేనిమాడ్కి భవదంతరుత్మనుగాననైతి వ
స్థిరముసుమీ యొడల్ తెలివి దెచ్చుక యింతటనైన భక్తిత
త్పరత ఘటిల్లు శ్రీహరి...

71


చ.

పనుపడ లౌకికక్రియలు పాయక సల్సఁగవచ్చునంటివా
విను మొకనీతి దెల్పెదను విప్రగవామరభూతకోటికిన్
గొనకొని యెగ్గు సేయక యకుంఠితవృత్తిని జిడ్డు నాలుక
న్దనరనినీతి శ్రీహరి...

72


చ.

కలఁగని లేచి తద్విధము గాననికైవడి దైవమాయచేఁ
దలపడి దేహధారులయి తప్పుడుమోహముఁ జెంది తత్త్వము
ల్దెలియక మోసపోయెడిగతిం జలియింపక మోక్షకాంక్షచేఁ
దలఁపు వహించి శ్రీహరి...

73


చ.

ఎన్నికఁ జేసి ని న్నిటుల నెన్నివిధంబుల బోధఁ జేసినన్

జె న్నలరంగ హీనునకుఁ జేసిన మేల్ చెడునట్లు గన్పడెన్
గన్నడఁబుద్ధిలోఁ గలపి కాలముఁ బుచ్చక నింకనైన వి
ద్వన్నుతుఁ డైన శ్రీహరి...

74


ఉ.

అంధతమంబులోపలఁ బదార్థగవేషణ మెల్ల నైధన
గ్రంధి జలంబులో నిడుటగావున నార్తజనావనైకహృ
ద్బంధుఁడు సంహృతోగ్రభవబంధుఁడు లౌకికగాధమాసుమీ
దంధన లేల శ్రీహరి...

75


ఉ.

గానము మేళవించి మరుగాళలు నటించు మనుష్యుఁ డౌదల
న్బూనినదొంతులన్ మఱపుఁ బొందనిడెందముభంగి సంసృతి
న్మానక సర్వకర్మము లమందముగా నొనరించుచో సదా
ధ్యానము గల్గి శ్రీహరి...


ఉ.

తరణినమస్కృతుల్ సలుపు ధన్యులఁ గన్గొని వానరంబు ద
త్సరణి నొనర్చుచందమున సాధుల హేళనఁజేయ కెంతయున్
పరమపదాధినాథు పదభక్తులఁ గూడి విశిష్టవర్తివై
తరలనిభక్తి శ్రీహరి...

76


ఉ.

బట్టలఁ గొట్టి చిట్టెలుక పట్టెడుపొట్టకుఁ గాంచనట్టు లి
ట్టట్టు మెలంగి మోక్షగతు లారయనేరనిచెట్ట నైతి వీ
వెట్టుల గట్టు బట్టెదవొ? ఏఁటికి బుట్టఁగ గిట్టఁగా నయో
దట్టపుభక్తి శ్రీహరి...


ఉ.

తంతువునన్ గృహంబు బలితమ్ముగఁ జేయుచు నందుఁ జిక్కి తా

రెంతయు లేక బుస్నిపురు వేర్పడ నంతమునొందినట్లు వి
భ్రాంతి వహించి సంసృతిని బాల్పడి గోల్పడ నేల కల్లయా
ధ్వాంతమణంచు శ్రీహరి...

79


చ.

చిరిగినచీర మాని మఱుచీర ధరించినమాడ్కి మాటికిన్
విరివిగ దేహము న్విడచి వేఱొకదేహములోనఁ జొచ్చు తాఁ
దరలనిమాయలోనఁ బడి తల్లఁడపాటునఁ దన్ను కాడుచున్
దరిఁగన వేల శ్రీహరి...

80


ఉ.

కూసముగప్ప నేర్పునను గొబ్బున నూడ్చెడిచిల్వపోలికన్
వేసట సేయు జన్మపరివేదన వీడు నుపాయమార్గ ము
ల్లాసమున న్గనుంగొనినలక్షణవంతులఁ గూడి నిర్మలో
ద్భాసురవృత్తి శ్రీహరి...

81


ఉ.

అన్నము ధాత్రియం దమృత మావులమందలయందు పావకం
బెన్న సమిత్తులందు నరు లేర్పడఁగాంచినభంగి బుద్ధిచేఁ
గ్రన్నన మోక్షము న్వడయఁగా నగుఁగావున భక్తిచేత వి
ద్వన్నుతుఁడైన శ్రీహరి...

82


చ.

నిరతము నీరుపక్కియలు నీరములందు మునింగి యీల్గు నే
గుఱుఁతుగ మేడిపండ్లఁ గ్రిమికోటులు పుట్టుచు లోనఁ జిక్కునే

విరివిగ సంసృతిన్ బొరలి వెల్వడుమార్గ మెఱుంగవన్న నీ
తరమె తరింప శ్రీహరి...

83


ఉ.

మాయురె! డెంద మాహరికి మార్పడి యన్యుల గోరుకుందమా
పాయక గంగచేరువను బాలి యొనర్పఁగ బూను టందమా
కాయము నమ్మి కాలగతి కానని చంద మదేల ముక్తిసం
ధాయకుఁడైన శ్రీహరి...

84


ఉ.

మిథ్య సుమీ జరామరణ మేదురమైన యొడల్ దురంతశా
స్త్రాధ్యయనము లెల్లను మహాఫలదమ్ములు కావుసుమ్మి యీ
మధ్యమలోక మింతటిది మర్వకు మస్మదుదీరిత మ్మిదే
తథ్యము వేగ శ్రీహరి...

85


ఉ.

జారుని దుష్టవర్తనుని సజ్జనదూరు నసత్యవాదినిన్
జోరుని లుబ్ధు నిర్దయుని జూదరి బ్రాహ్మణవృత్తిఘాతుకు
న్గ్రూరుని ధర్మదూషకుని గూడక నిత్యము సర్వకల్మషో
త్తారములైన శ్రీహరి...

86


ఉ.

భూసురవృత్తిపోషకుల భూతదయాళుల పుణ్యవర్తనా
భ్యాసుల మాతృభక్తిపరిపాలననిష్ఠుల నాత్మతత్త్వవి

న్యాసుల సత్యభాషుల ననంతునిదాసులఁ గూడి నిర్మలో
చ్భాసురలీల శ్రీహరిపదమ్ములు కోరి భజిందు చిత్తమా.

87

దశావతారవర్ణనము

ఉ.

అండజ కూర్మ సూకర మృగాధిప కుబ్జ కుఠారిధారి మా
ర్తాండకులాచ్యుతాగ్రజపురాసురభేదకతాదిచర్యలన్
తాండవచండిమన్ దితిజదర్పము లార్పఁగ నేర్చుదంట నీ
దండఁగలండు శ్రీహరి...

88


ఉ.

నీరజసంభవుం డలిసి నిద్దురఁబోయినరాత్రి చోరుఁడై
యారసి వేదము ల్గొనుచు నంబుధిఁ జొచ్చినసోమకాసురు
న్వారక త్రుంచి వేదములు నల్వ కొసంగినమత్స్యమూర్తి మ
ద్భారముఁ బూను శ్రీహరి...

89


చ.

కడువడి మందరాచలము కవ్వముగా ఫణిరాజు త్రాడుగా
జడధి మధింప నంబుధిని శైలము గ్రుంగఁగ దేవదానవుల్
తడఁబడి వేఁడ గూర్మమయి తద్దిరిఁ దాల్చిన శౌరి ని న్నహో
తడయక ప్రోచు శ్రీహరి...

90


ఉ.

ఈక్షితిఁ జుట్టిపట్టుకొని హెచ్చి రసాతలచారి యైన హే
మాక్షుని బట్టి కొట్టి సకలామరు లెన్నఁగ భూమి కోఱపై

దక్షతఁ దాల్చినట్టి క్రతుదంష్ట్రి దయామతి నిన్నుఁ బ్రోచునే
తక్షణమందు శ్రీహరి...

91


చ.

హరిగిరి నిందుఁ జూపుమన హంకృతి స్తంభముఁ జర్వ నందు భీ
కరనరసింహుఁడై వెడలి గ్రక్కున రక్కసు డొక్కఁ జించి ని
ర్భరముగఁ దత్సుతు న్నెనరు బాయక ప్రోచుమహానుభావుఁ డి
త్తఱి నిను బ్రోచు శ్రీహరి...

92


చ.

సురలను బాఱదోలి బలి సుస్థిరతన్ భువనంబు లేల సుం
దరవటువేషియై ధర పదత్రయదానము వేడి తద్బలిం
గరుణ గలంచి వజ్రికి జగత్రయ మిచ్చినశౌరి నిన్ను నా
దరమునఁ బ్రోచు శ్రీహరి...

93


ఉ.

కంటకులైనరాజులను గట్టిగ నాలములందు గండ్రగొ
డ్డంటను జక్కడంచి ప్రకటంబుగఁ దద్రుధి స్రవంతు లై
దింటను బైతృకంబు లొగిఁ దీఱిచి భార్గవరాముఁడైన బ
ల్దంట నెఱింగి శ్రీహరి...

94


చ.

తరణికులంబుస న్బొడమి తాపసి జన్నము గాచి తాటక
న్బొరిగొని శంభువి ల్దునిమి భూమిసుత న్వరియించి కానల
న్దిరిగి పడంత కై యని నెదిర్చినరావణకుంభకర్ణుల
న్దఱిగినజోదు శ్రీహరి...

95


చ.

హలధరమూర్తియై హరికి నగ్రజుఁడై జనియించి ముష్టికా

దుల వధియించి రేవతిని దొయ్యలిగా వరియించి ధాత్రికా
నలజడి మాన్పి లోకముల నన్నిఁటిఁ గాచినసీరి నీదుకొం
దలము నణంచు శ్రీహరి...

96


చ.

నలువవరమ్మునన్ జలమునం ద్రిపురాసురు లెల్లలోకముల్
గలఁచిన బౌద్ధశాస్త్రములు కల్పనఁ జేసి తదంగ నా మనః
స్ఖలన మొనర్చి వారి నడఁచన్ ద్రిపురారికి సాయకాకృతిన్
దలఁకొనునట్టి శ్రీహరి...

97


చ.

గుఱ్ఱము నెక్కి క్రూరులగు ఘూర్జరబర్బకపారసీకులన్
గొఱ్ఱెలకైవడి న్నఱికి ఘోరతరప్రకటప్రతాపియై
మొఱ్ఱ లడంచి దేవతల మ్రొక్కులు గైకొను సామి గల్గ నీ
తఱ్ఱెలవిడి శ్రీహరి....

98


చ.

అరయఁగ బిందుమాధవు ప్రయాగరమాధవు సేతుమాధవున్
వరదుని పద్మనాభుని జనార్దను రంగని వేంకటాధిపున్
బరమపదార్థసిద్ధికయి ప్రార్థనఁ జేసి తదీయభక్తిత
త్పరతను జెంది శ్రీహరి...

99


చ.

పాలున నెయ్యి కాష్టములఁ బావకుఁ డశ్మమునందు లోహమున్
బూలను విత్తనం బలరుపోలిక విష్ణునియందు నీజగ

జ్జాలమునుండు విష్ణుఁడు త్రిశక్తియుతుండగుఁగానం దత్త్వబో
ధాలలితోక్తి శ్రీహరి...

100


చ.

పన్నగవైరివాహసము పన్నగరాజఫణాతపత్త్రియై
పన్నగభూషణాద్యమరపాలురు గొల్వఁగ సుప్రసన్నుఁడై
కన్నులఁ గానుపించె నదె కాంక్షయుఁ గాంచి ప్రసన్నవృత్తి నే
త న్నిగమోక్తి శ్రీహరి...

101


ఉ.

ధాతలిఖించు ఫాలలిపి తాపసు లెన్నిన వేదశాస్త్రవి
ఖ్యాతము మత్పురాకృతశుభాధికపుణ్యము లొక్కటౌట ని
న్నీతఱి గొల్వఁగల్గె ఫలియించెను నాతప మంచు నుద్భవో
త్పాతమడంచు శ్రీహరి...

102


ఉ.

అంగములో వెలుంగు విమలాంగుఁడటం చెఱుఁగంగఁజాల కి
బ్భంగి మెలంగి లొంగి పటుభంగుల బాముల బ్రుంగనేల శ్రీ
రంగని యంతరంగబహిరంగముల స్గనకున్న నెట్లు త
త్సంగతి గల్గు శ్రీహరి...

103


చ.

సురుచిరగోపవేష మధుసూదన మాధవ రాధికామనో
హర సురభూరుహాపహ మహాసురవీరమదాపహార సుం
దరతరహేమచేల శుకనారదవంద్య జగన్నివాస మం
దరధర యంచు శ్రీహరి...

104

చ.

మునుకొని నీయనుగ్రహముపొందున నర్తకుభంగి హంగుగా
నెనుబదినాల్గులక్ష లిల నేర్పడువేషము లేను దాల్చితిన్
గనుఁగొని మెచ్చితేని మది కాంక్ష లొసంగుము మెచ్చకున్న
వద్దను మవి యంచు శ్రీహరి...

105


చ.

పుడమిని తాడెపల్లికులముఖ్యుఁడ విప్రుఁడ పానకాలురా
యుఁడ భవదంకితమ్ముగ శతోత్పలచంపకవృత్తముల్ ముదం
బడర రచించినాఁడను దయామతిఁ గైకొని ధన్యుఁ జేయవే
తడయక యంచు శ్రీహరి...

106


చ.

సకలపురాణసారరససంగ్రహ మీశతకంబు గావునన్
బ్రకటముగా వినన్ జదువ వ్రాయఁగ వారలు తత్త్వవేత్తలై
ప్రకృతిని దాటి బ్రహ్మమయభావము గాంచుట కేమివింత సా
ధకమిదె యంచు శ్రీహరి...

107


చ.

మంగళ మద్రిజాభినుత మంగళ మంబుదనీలవిగ్రహా
మంగళ మంబుజాక్ష హరి మంగళ మాశ్రితకల్పభూరుహా
మంగళ మచ్యుతా యని రమారమణీశుని కానతిచ్చినం
తం గరుణించు శ్రీహరిపదములు కోరి భజించు చిత్తమా.

108

చిత్తబోధశతకము సమాప్తము.

  1. లైనను ద్రుంచి
  2. ఈకథ పురాణాంతరములవలన దెలిసికొనవలయును. భారతాదులలో మృగ్యము.