Jump to content

భక్తిరసశతకసంపుటము/మూఁడవసంపుటము/రంగశాయిశతకము

వికీసోర్స్ నుండి

పీఠిక

రంగశాయిశతకము మిగులప్రౌఢముగ నిర్దుష్టముగ నున్నది. ఇందలిపద్యములు చాలచోటులఁ బ్రాతపఠనీయములుగ నున్నవి. ప్రతిపద్యమునందును నిరాఘాటమగుధారయు మనోహరమగు పదకల్పనము సరళమగుభావ ముంటచే నీశతకము ప్రశస్తతర మనుటలో సంశయము లేదు. ఉపలభ్యమగు నీశతకప్రతియందు 101 పద్యముమాత్ర ముంటవలనను సాధారణముగ 108 పద్యములతో శతకము లుంటవలనను కవివృత్తాంతము దెలుపుపద్యములు కానరాకపోవుటవలనను ఇంకను గొన్నిపద్యములు లభింపవలసియుండునని తలంచుచున్నాము. వ్రాతప్రతులున్నవారు మిగిలినపద్యములకై ప్రయత్నించిరేని శతకము సంపూర్ణము కాఁగలదు.

కవిజీవితము దెలుపుపద్యములను వ్రాసికొనక కథాంశములను వ్రాసికొను నాచారము లేఖకులందును ముద్రణకర్తలయందుఁ గలదు. అందుచే నమూల్యములగు గ్రంథములకుఁ గవిజీవితము కాలము నెఱుంగ వీలు కలుగకున్నది. కేవల యశఃకాములై గ్రంథరచన మొనరించినకవులయెడఁ గృతఘ్నులమై వారివృత్తములఁ దెలుపుపద్యముల విడచుట కవులకు భాషకుఁ గూడ నింత యనరానిద్రోహ మొనరించుట యని మాతలంపు.

రంగశాయిశతకము రచించినకవి యెవఁడో యేకాలముననుండెనో తెలిసికొననగు నాధారములు లేవు. ధారాసౌష్ఠవము భావవిస్తృతిఁ బట్టిచూడఁ గవి నూటయేబదిసంవత్సరముల కీవలివాఁడు గాఁడని తోచును. ఇందులకు ఈశతకపుఁ బ్రాచీనలిఖితప్రతులు సాక్ష్యముగాఁ గలవు. కవి పుణ్యనదులఁ బేర్కొనుచు మలాపహారిణిని బేర్కొనెను. ఇది గుడివాడతాలూకాలోని కాలువ గాన నాప్రాంతవాసి యని దేశోద్ధారకులు వ్రాసిరిగాని మలాపహారిణి "పాపనాశని” యని మాతలంపు. ఇది తిరుపతిలోని యొకజలపాతము. సుప్రసిద్ధము లగుపుణ్యనదుల నెన్నింటినో పేర్కొనుచు వ్యాప్తి లేని యొక చిన్నకాలువను బ్రశంసించెననుట పొసఁగదు. ఛంద ప్రతిబంధకముచేఁ బాపనాశనిని మలాపహారిణి యని కవి వాకొని యుండును. మిక్కిలి వ్యాప్తిగల యీశతకము రచించిన కవిచరిత్రాదు లెఱుంగ నవకాశములు లేమి మిగుల సంతాపకరము. సుప్రసిద్ధగ్రంథములు కొన్ని కర్తృనామము లేకే వ్యాప్తిలో నున్నవి.

ఈశతకకర్త శ్రీవైష్ణవుఁడై యుండును. శ్రీభగవద్రామానుజుని నివాసస్థలమగుటవలనను వైష్ణపమతప్రచారమునకుఁ బ్రధానస్థాన మగుటవలన శ్రీరంగమునెడ రంగనాయకునియెడ వైష్ణవులకు భక్తిప్రపత్తులు మెండు. చోళులకాలమున శ్రీరంగము మిగుల సంపదలతోఁ దులతూఁగెను. రంగనాయకులు విప్రనారాయణ యనుతొండరడిపొడియాళ్వారు (భక్తాంఘ్రిరేణువు)నకు మోక్ష మొసంగిన కథాంశము శతకమునందలి 86 వ పద్యమునందుఁ గలదు. ఈశతకము ప్రతిపద్యమునందును భక్తిభావమును బ్రకటించుచున్నది. దీనిని బట్టి చూచినను శతకకర్త వైష్ణవుఁడని విశ్వసింపవచ్చును.

కవి యీశతకమును బ్రౌఢవయస్సులో వ్రాసి యుండును. కాననే యమకము అంత్యనియమము. ముక్తపదగ్రస్తము లోనగుశబ్దాలంకారము లుపయోగించినను ధార సారళ్యముగ నున్నది. శైలి సంస్కృతాంధ్రపదములు సమముగాఁ గలిగి పఠనయోగ్యముగా నున్నది. శతకసంపుటముల కీశతక మమూల్య మగు నలంకార మనుటకు సంశయింపము.

ఇట్లు భాషాసేవకులు

నందిగామ

శేషాద్రిరమణకవులు

1-6-26

శతావధానులు

శ్రీరస్తు

రంగశాయిశతకము

ఉ.

శ్రీమహిళావరుండు సరసీరుహసంభవముఖ్యదేవతా
స్తోమనుతప్రభావుఁడు విశుద్ధయశుండు కృపాకటాక్షవీ
క్షామృతభక్షరక్షణుఁడు హారవిభూషణభూషితాంగశో
భామణి రంగశాయి మనపాలఁ గలండు విచార మేటికిన్.

1


ఉ.

శ్రీలలనాకుచస్థలపరిస్ఫుటకుంకునుగంధసారజం
బాలవిశాలవక్షుఁడు కృపాలలితాక్షుఁడు భక్తవత్సలుం
డోలి సమస్తభాగ్యమహిమోన్నతుఁ డంచితపుణ్యమూర్తి గో
పాలుఁడు రంగ...

2


శ్రీయువతీకళత్రుఁడు నృసింహకిశోరకమూర్తి యాదినా
రాయణుఁ డాదిపూరుషుఁ డనంతుఁ డనంతకళావతంసుఁ డా
త్రేయుఁ డజేయుఁ డాశ్రితవిధేయుఁడు భక్తజనాంగణంబులం
బాయని రంగ...

3


ఉ.

శ్రీమహిళామణీవిమలచిత్తచకోరకసోముఁ డంబుద
శ్యాముఁడు మోక్షధాముఁ డురుసంగరభీముఁడు కుంజరావనో

ద్దాముఁడు కోటిసూర్యనిభధాముఁడు భక్తహృదంతరస్ఫుర
ద్భామణి రంగ...

4


ఉ.

శ్రీరమణుండు దేవకులశేఖరుఁ డాశ్రితపారిజాత మం
భోరుహపత్రనేత్రుఁడు విభుండు సమస్తజగత్కుటుంబి వం
దారునిలింపధేనువు సనాతనుఁ డాదిమమూర్తి లోకసం
భారుఁడు రంగ...

5


ఉ.

ముంగిటివేల్పు లోకములఁ బ్రోచినప్రోడ మృణాంతరంగుఁడున్
రంగదభంగసాగరతరంగములం బవళించురాజు కా
ళింగమదాపహారి కడలిం జనియించిన సాధ్వినాథుఁ డా
బంగరురంగ...

6


ఉ.

అంగభవాదిదేవతలకన్నను జక్కనివాఁడు సర్వదా
ముంగిటిపెన్నిధానము నమో యని మ్రొక్కెడువారిఁ గాచు శ్రీ
రంగపురీశ్వరుండు రవిరాజవిలోచనుఁ డుల్లసత్కృపా
పాంగుఁడు రంగ...

7


చ.

యతులతపఃఫలంబు విబుధావళి కెల్లను రక్ష గోపికా
సతులకు నోముపంట భవసాగరపోతము దివ్యవిగ్రహుం
డతులమహానుభావుఁడు సహస్రఫణాహిపశాయి భూరమా
పతియగు రంగ...

8

చ.

కలువలరాజు తమ్ములవికాసము జేసిన వేల్పుకన్నులుం
జిలువవజీరుపానుపు విచిత్రసువర్ణదుకూలము న్మహో
జ్జ్వలతరకుండలంబులును బాగుగఁ దాల్చిన దేవుఁ డుజ్జ్వల
ద్బలుఁ డగు రంగ...

9


ఉ.

కొంగున నున్నమానికము కోరిక లిచ్చుసురద్రుమంబు సా
రంగనుతాంఘ్రిపంజుఁడు రాజసతామససాత్వికాదిమూ
ర్త్యంగములన్ ధరించి జగమంతయుఁ బ్రోచుఘనుండు సత్కృపా
పాంగుఁడు రంగ...

10


ఉ.

క్రొన్నెలవంకనామమును గొప్పగు కౌస్తుభదివ్యరత్నముల్
వెన్నెలు గాయునెమ్మొగము విప్పగు కన్నులమందహాసమున్
జెన్నగుచుండు మౌనిసురసేవ్యపదాబ్జుఁడు భోగభాగ్యసం
పన్నుఁడు రంగ...

11


ఉ.

దానవనాథుసంతతి సుదర్శనధారను నుగ్గునుగ్గుగాఁ
బూనికిఁ జేసినట్టి సురపుంగవుఁ డింద్రువనంబులోని సం
తానము నింటితోఁటగను నాఁటినధీరుఁడు మౌనిహృత్తమో
భానుఁడు రంగ...

12


చ.

గరుడుఁడు వాహనంబు శితికంఠుఁడు నెచ్చెలికాఁడు భూరమా
సరసిజలోచనల్ సతులు సారసగర్భుఁడు మన్మథుండు సు

స్థిరతనయుల్ చెలంగ సతసీకుసుమాభశరీరశోభతోఁ
బరగెడు రంగ...

13


ఉ.

మౌళిమయూరపింఛమును మన్మథకోటివిలాసరూపమున్
బాలరసాలపల్లవముభాతిఁ జెలంగెడి మోవి వేణువున్
దాలతమాలకాననవితానవిహారము గల్గియున్న గో
పాలుఁడు రంగ...

14


చ.

క్షితిని ననేకమార్గములఁ జెందక మర్త్యుఁ డెఱింగి నీవే నా
గతియని పాదపంకజయుగంబును జిత్తములోన నిల్పి సం
తతమును నాశ్రయింప నతిధన్యునిగా నొనరించు నా రమా
పతియగు రంగ...

15


ఉ.

భీతయు వీతవస్త్రయును భిన్నపచస్విని యైనద్రౌపదిన్
జేతులు మోడ్చి మ్రొక్కఁగను శీఘ్రమ మానధనంబు నిల్పుచున్
ద్రాతయుఁ దల్లిదండ్రియును దైవము తానయి యెట్టుగాచె నా
భాతిగ రంగ...

16


ఉ.

వేలుపుఱేఁడు వచ్చి వనవీథుల దూడలఁ బిన్నపాపలన్
మేలుగ నున్నఁ జూచి బలిమిన్ హరియించినఁ గాంచి దూడలుం
బాలుఁడు నై నటించిన కృపాళుఁడు వల్లవతల్లజుండు గో
పాలుఁడు రంగ...

17

ఉ.

ఆలమునందు నిల్చి నరకాసురు రూపఱఁ జేసి గోపికా
స్త్రీలఁ బదాఱువేలను వరించి మహోన్నతిః గాంచి యార్జిత
శ్రీలను భాగ్యసంపదఁ గుచేలునకుం గృపసేసినట్టి గో
పాలుఁడు రంగ...

18


ఉ.

నీలపయోదసన్నిభవినిర్మలమూర్తిని దాల్చి దైత్యులం
దోలి యణంచి సాధుల మనోరథముల్ తనివార నిచ్చి హే
రాళపుఁగీర్తి దిక్కులఁ దినంబుగ నిల్పిన రామనామభూ
పాలుఁడు రంగ...

19


ఉ.

గంగఁ బదంబునందుఁ బొసఁగం గనినట్టి మహానుభావుఁ డ
య్యంగజు నెగ్గు లెన్నఁదగు నంచితరూపమువాఁడు లోనఁ జే
గంగను పట్టువాఁడు పరగన్ విలసిల్లుఘనుండు సత్కృపా
పాంగుఁడు రంగ...

20


చ.

ఇరవుగ మత్స్య కచ్ఛప కిటీంద్ర నృసింహ వటు త్రిరామ భాసు
ర వర బుద్ధ కల్కి ఘనశోభనరూపములందు నిల్చి సు
స్థిరముగ భక్తకోటుల నశేషము ప్రోచినయట్టి కౌస్తుభా
భరణుఁడు రంగ...

21


చ.

శరచరరూపధారియయి సాగర ముద్ధతిఁ జొచ్చి సోమకా
సురుని వధించి వేదములు చోద్య మెలర్పఁగఁ దెచ్చి శారదా

వరునకు నిచ్చి ముజ్జగమువారలఁ బ్రోచినయట్టి కౌస్తుభా
భరణుఁడు రంగ...

22


చ.

ఉరవడి దేవదైత్యులు పయోనిధిఁ ద్రచ్చఁగ మందరాచలం
బరిదిగఁ గ్రుంగ దాని గమఠాకృతి మీఁదికి నెత్తి కూర్మితో
నరయఁగ దేవపంక్తి కమృతాన్నముఁ బెట్టినయట్టి కౌస్తుభా
భరణుడు రంగ...

23


చ.

ధరణిని జుట్టి చంక నిడి దాఁగినయట్టి హిరణ్యనేత్రునిం
గిరివరమూర్తియై వెదకి గీ టడఁగించి ధరిత్రిఁ గొమ్మునన్
బరగ ధరించి తొంటిక్రియఁ బట్టుగ నిల్పినయట్టి దిట్టభూ
భరణుఁడు రంగ...

24


ఉ.

పొంగుచు నాహిరణ్యకశిపున్ నఖపంక్తిని జీఱి వానిసూ
నుం గరుణించి కాచినఘనుండు ప్రశాంతుఁడు శ్రీనృసింహమూ
ర్త్యంగుఁడు భక్తకోటిఁ గృప నారసి ప్రోచు ఘనుండు సత్కృపా
పాంగుఁడు రంగ...

25


ఉ.

గోలతనంబునం బలిని గోరినయట్టి పదత్రయంబు నా
పాలికి ముజ్జగంబులని ప్రస్తుతిసేయుచు వచ్చి చయ్యనన్
మేలుగ ధారఁ బట్టి బలి మెట్టిన దిట్టగునట్టిపొట్టి యా
బాలుఁడు రంగ...

26


చ.

పరుపడిఁ గార్తవీర్యపరిపంథినృపాలు సహస్రబాహువుల్
తిరముగఁ ద్రుంచి క్షత్త్రియులఁదీవ్రత నిర్వదియొక్కమారు వే

సరక వధించి రాముఁ డన సంస్తుతి కెక్కినబాహుశాలి స
ద్వరదుఁడు రంగ...

27


ఉ.

హాళిని దాటకం దునిమి యాగముఁ గాచి యహల్యఁ బ్రోచి సీ
తాలలన న్వరించి రణదర్పితరావణకుంభకర్ణదై
త్యాలిని ద్రుంచి రాజ్యము నయంబుగ నేలిన రామచంద్రభూ
పాలుఁడు రంగ...

28


చ.

చలమున రాసభాసురునిఁ జంపి ప్రలంబుని నొంచి మర్కటున్
ఖలుఁ బొరియించి శత్రునృపగర్వ మణంచి దురాత్ము రుక్మినిన్
నలినలిచేసి నాఁగటను నాగపురిన్ బెకలించినట్టి స
త్ఫలదుఁడు రంగ...

29


ఉ.

వృద్ధమునీంద్రవేషమును వేసుక దండకమండలంబు చే
బుద్ధయుగానఁ బూని పువుబోణుల మెల్లవఁజేరి వారి స
ద్బుద్ధులు సాగఁబుచ్చిన ప్రబుద్ధుఁడు యోగిజనౌఘమానసో
ద్బద్ధుఁడు రంగ...

30


చ.

అరయుచు లోకముల్ కలియుగాంతమునందు సమస్తపాతకో
త్కరనరులన్ ఖురాగ్రముల ఖండితదేహులఁ జేసి డాసి భీ

కరగతిఁ గల్కిరూపముఁ దగ ధరియించి కలిప్రహారుఁడై
పరగెడు రంగ...

31


ఉ.

కంధి సుకన్యకాహృదయకంజదివాకరుఁ డార్తలోకసం
బంధి వదాన్యశేఖరుఁ డపారకృపాపరిపూర్ణనేత్రుఁడున్
సింధురరాజరక్షణుఁ డశేషగుణాఢ్యుఁడు దైత్యవైరి మ
ద్బంధుఁడు రంగ...

32


ఉ.

ధీరుఁడు కౌస్తుభాదివరదివ్యవిభూషణశంఖచక్రశృం
గారుఁడు కుంభకర్ణదశకంఠవిరాధముఖాసురేంద్రసం
హారుఁడు నిత్యశోభనవిహారుఁడు దుగ్ధపయోధిజామహీ
భారుఁడు రంగ...

33


ఉ.

వ్యాసశుకాంబరీషసనకార్జును లాది మునీంద్రసంఘముల్
వాసవవీతిహోత్రయమవాయువు లాదిగఁ గల్గు దేవతల్
భాసురరీతి నెవ్వని ప్రభావము లెంచెద రట్టి చిన్మయో
ద్భాసుఁడు రం...

34


ఉ.

రాక్షసవైరి హాటకధరాధరధీరుఁ డనేకకోటిహ
ర్యక్షసమానవిక్రమ సమన్వితుఁ డక్షయచారుమూర్తికం
జాక్షుఁడు వంద్యమాన గుణహారుఁడు నారదముఖ్యభక్తస
త్పక్షుఁడు రంగ...

35


ఉ.

శ్రీలుఁడు దివ్యహేమమయచేలుఁడు పుణ్యఫలప్రదానదృ
గ్జాలుఁడు నందబాలుఁడు సుసాంద్రమునీంద్రఫణీంద్రరాడ్వచో

హేలుఁడు సత్కృపాలుఁడు సురేశ్వరభక్తవిలోలుఁ డాదిగో
పాలుఁడు రంగ...

36


చ.

ధరణి రథంబు భాస్కరసుధాకరు లందు రథాంగముల్ చతు
ర్వరనిగమంబు లశ్వములు వారిజసంభవుఁ డందు సూతుఁడున్
సురగిరి విల్లు శేషఫణి సొంపగునారి మహేశుఁ డందు వే
మరు నధికారి గాఁగ శరమార్గమునన్ పురముల్ జయించు నా
పరముఁడు రంగ...

37


ఉ.

కేశవుఁ డార్తరక్షకుఁడు కృష్ణుఁడు జిష్ణుఁడు కోటిసూర్యసం
కాశుఁ డజేయుఁ డుత్తముఁ డగణ్యుఁడు వారిజనేత్రుఁ డాదిల
క్ష్మీశుఁడు కీర్తిహారుఁడు మునీంద్రసమంచితదృక్చకోరశో
భాశశి రంగ...

38


ఉ.

మానిసితిండుల న్వెదకి మాపినయట్టివజీరు చిల్వమ
న్నీనివెడందపాన్పునను నిద్దురబోయెడుసామి దేవతా
మౌనుల నార్తులన్ దయను మంచినవేలుపుజెట్టి సత్ప్రభా
భానుఁడు రంగ...

39


చ.

కలుములబోటి రాణి చలిగాడ్పులదిండియె దండిపాన్పు వే
ల్పులదొర తోఁడు బమ్మయునుఁ బూవిలుతుండు ననుంగుఁగుఱ్ఱలై
చెలఁగు మహానుభావుఁడు ప్రసిద్ధచరిత్రుఁడు భక్తలోకస
త్ఫలదుఁడు రంగ...

40

ఉ.

తజ్జ్ఞమనోబ్జషట్పదము దాసులపాలిటివేల్పుటావు స
ర్వజ్ఞుఁడు సంతతప్రమదవర్ణితనిర్మలదివ్యనామభా
వజ్ఞుఁడు నారదాదిమునివంద్య మహామహిమానుభావనా
ప్రాజ్ఞుఁడు రంగ...

41


ఉ.

వెన్నుఁడు శౌర్యధైర్యపటువిక్రమనక్రమహోగ్రపీడనా
పన్నునిఁ దద్గజేంద్రుఁ బ్రతిభామతిఁ బ్రోచిన దుష్టదైత్యవి
చ్ఛిన్నుఁడు వాక్ప్రసిద్ధఘనశేషవిశేషనుతప్రభావసం
పన్నుఁడు రంగ...

42


చ.

బిసరుహసంభవాండము గభీరమహత్త్వవిశేషవైఖరిన్
విసువక సృష్టి చేసి మఱి వేడ్కఁ బ్రవర్ధిలఁజేయువేళలం
దసదృశజన్మపోషణల యత్రిగుణప్రవణప్రవర్తనా
భ్యసనుఁడు రంగ...

43


చ.

కలికియొయారి పాల్కడలి గాంచిన యొప్పులకుప్ప చంద్రు నె
చ్చెలియలు ముద్దుగుల్కు పెనుచిల్కలతే ర్గలమారుఁ గన్న య
వ్వెలఁదుక పేరురంబుపయి వేడ్క ఘటిల్ల వసించు నమ్మహా
బలుఁడగు రంగ...

44


ఉ.

కిన్నర సిద్ధకింపురుష ఖేచర సాధ్య పిశాచ గుహ్యకుల్
పన్నగయక్షరాక్షససుపర్వమునీశ్వరు లష్టదిక్పతుల్
సన్నుతిఁ జేయనేర రనఁజాలిన లీల జరించు రక్షితా
పన్నుఁడు రంగ...

45

ఉ.

చైత్రుఁడు నైజభక్తజనజాలమహీజమహావనాళికిన్
మిత్రుఁడు ధర్మజాదిధరణీధవముఖ్యుల కెల్ల నెయ్యపుం
బుత్రుఁడు దేవకీపరమపుణ్యసతీమణి కయ్యజార్చకున్
బాత్రుఁడు రంగ...

46


ఉ.

అంగజుఁ గన్నతండ్రి కలశాంబుధి నిద్దురఁ జొక్కుసామి సా
రంగధరార్చితుం డఖిలరాక్షసలోకలయాంతకుండు శ్రీ
రంగవిభుండు దాసజనరక్షణుఁ డక్షయమూర్తి సత్కృపా
పాంగుఁడు రంగ...

47


ఉ.

చంగదనేకదివ్యశరజాలుఁ డుదాకకృపాంబురాశి సా
రంగమదాభిషిక్తుఁ డభిరాముఁడు భక్తఫలప్రదాయి శ్రీ
రంగపురీశ్వరుండు కరిరాజును బ్రోచినవేల్పు సత్కృపా
పాంగుఁడు రంగ...

48


ఉ.

వారణదారుణారి మదవారణకారణుఁ డుగ్రదైత్యసం
హారణభద్రసద్వనవిహారధురీణుఁడు శిష్టభక్తని
స్తారణుఁ డెన్నఁడున్ స్మరణ ధారణయోగ్యుఁడు భవ్యకీర్తిసం
భారుఁడు రంగ...

49


చ.

ఘనుఁడు ఘనోపమాననవకాళిమవర్ణుఁడు మాననీయగో
ధనుఁడు ధనాధినాథ సఖదార సదా జపితుండు మౌనిరా
డ్వినుతగుణాకరుండు కరవిశ్రుతచక్రపయోజనిత్యశో
భనుఁడగు రంగ...

50

ఉ.

గోప్యముగా నిశాటభటకోటులు కాపుగ నుండ నగ్నిసా
మీప్యమునన్ వసించిన సమిద్ధరసాతలహోమనైష్ఠికున్
జప్యపరున్ పులస్త్యభవు సర్వమనోరథభగ్నుఁ జేయుస
త్ప్రాప్యుఁడు రంగ...

51


ఉ.

రంగనికేతనాంతరనిరంతరశేషసుఖోపవిష్టుఁడై
యంగనతో సిరంగపురమం దొగి నిల్వఁగఁ గోరి స్వర్ణర
త్నాంగదముఖ్యభూషణము లార్యులకున్ గృపసేయు భృత్యభీ
భంగుఁడు రంగ...

52


చ.

శ్రుతిచతురార్థవేద్యుఁడు యశోధనుఁ డాదిమశేషశాయి భా
రతిదయితాభినందితుఁడు రావణభీషణకోపవాక్యకం
పితకపురస్సమాగతవిభీషణభీహరణుండు సత్యవా
కృతిభుఁడు రంగ...

53


ఉ.

బంగరుకొండ చాపముగఁ బట్టిన యోధకుఁ గూర్మిమామయై
బంగరుకంటిరక్కసునిఁ బట్టి వధించిన మేటిశూరుఁడై
బంగరుచేలఁ గట్టుకొని బంగరుబొజ్జను గన్న సంతతా
భంగుఁడు రంగ...

54


చ.

అబలల వేలసంఖ్యల మహామహిమ న్వరియించి ద్వారకన్
సొబఁగున నున్నకాలమునఁ జొక్కపుటింతి నొకర్తుఁ గోరు స
ద్విబుధమునీంద్రుమానసము వెల్వెలఁబాఱఁగఁజేసె నెవ్వఁ డా
ప్రబలుఁడు రంగ...

55

ఉ.

ఆద్రుహిణేందుశేఖరుల కైన నగోచరుఁ డద్రిజాంగసౌ
భద్రగజేంద్రరక్షణకృపాలుఁడు పాదసదాభివందనా
క్షుద్రభవప్రహర్తగుణశోభితుఁ డాదిమతత్త్వబోధహృ
ద్భద్రుఁడు రంగ...

56


ఉ.

ఆనళినోద్భవామరభయంకరనిత్యవిహారదుష్టలం
కానగరీనిశాటపటుగర్వవిమోచనుఁ డాగమార్థసం
తానవనైకలోలుఁడు బుధప్రకరస్తుతుఁ డాత్మదీప్తిచి
ద్భానుఁడు రంగ...

57


ఉ.

నల్లని మేనిచాయయును నల్లనికంఠము గల్గునల్లుఁడున్
నల్లనికల్వరేకులను నవ్వు కనుంగవఁ జూచు భార్యయున్
నల్లనిచేలదేవర ఘనంబుగఁ దోడయియున్న దైత్యహృ
ద్భల్లుఁడు రంగ...

58


చ.

చదువులప్రోడఁ గన్న యలచక్కనితండ్రి కృపాంబురాశి క్షు
ద్రదనుజసంహరుండు వెలిదామరక్రొవ్విరియందు గండుతు
మ్మెదక్రియ క్షీరవారినిధిమీఁద వసించినవేల్పు శ్రీశుభ
ప్రదుఁ డగు రంగ...

59


చ.

అమరఁగఁ గాశికాపురి ప్రయాగ సిరంగము కాంచి చక్రతీ
ర్థము తులసీవనంబు మధురానగరేంద్రము శెషశైలవ

ర్యము పురుషోత్తమంబు మొదలైన శుభస్థలులందు వైభవం
బమరెడు రంగ...


ఉ.

దీప్తి ననేకభాస్కరులతేజము నంది ప్రసిద్ధమంత్రభూ
గుప్తవిలాసవైఖరి నకుంఠితలీల మెలంగుచుండి యా
సప్తమహర్షులం గరుణసంశ్రితపక్షతఁ బ్రోచు భావుక
ప్రాప్తుఁడు రంగ...

61


చ.

శమనసహోదరీపలిలచారువిహారవినోదకేళికా
ప్రమదుఁడు కాళియోరగకృపాపరిరక్షణశీలుఁ డెల్లెడన్
మమతను వీడు నాదివరమౌనిహృదంబుజపుష్పమాలకున్
భ్రమరము రంగ...

62


ఉ.

కామసుధేనువు న్విమలకల్పమహీరుహపంచకంబుఁ జిం
తామణియు న్నిరూఢిఁ బ్రమదంబున నెంతయు నీప్సితార్థముల్
వేమఱు నిచ్చున ట్లొసఁగి వేగమె భక్తులఁదృప్తి దీర్చుశో
భామణి రంగ...

63


చ.

ఘనతరసూర్యవంశమున గల్గి ముదంబునఁ దండ్రిపంపునన్
మునిపతిఁ గాంచి యాఘను ననుజ్ఞను దాటకఁ ద్రుంచి యాగ మిం
పొనరఁగ నుద్ధరించి విభవోన్నతి శంభునివిల్లు ద్రుంచి యా
జనకతనూభవన్ గడువిచక్షణలీల వరించి మించు శో
భనమతి రంగ...

64


ఉ.

కోరి తదీయనామ మొనఁగూర్చి జపించెడు వారికెల్ల భా
గీరథి వేణి స్వర్ణముఖి కృష్ణ సముద్రము తుంగభద్ర కా

వేరి మలాపహారిణియు వేత్రవతీనది పెన్న గౌతమీ
తీరములందు స్నానములు దీర్చిన పుణ్యఫలంబు లిచ్చు భూ
భారుఁడు రంగ...

65


ఉ.

బంధుకథానుసింధురబంధనటత్పరిపంథిరాట్ప్రజా
కంధరసుందరాదిరేగణకప్రతిమానసమానసందిసం
బంధకథాప్రబంధగతి పాంథరమావనుఁ డాపదంధహృ
ద్బంధుఁడు రంగ...

66


ఉ.

దక్షుఁడు ధేను కాక బనదానవశిక్షుఁడు సర్వయోగపా
ధ్యక్షుఁడు దుగ్ధవారిధిసుతాయుతనవక్షుఁడు ద్రౌపదీసతీ
రక్షుఁడు నీరజాక్షుఁడు సురప్రవరాదిసమస్తదేవతా
పక్షుఁడు రంగ...

67


ఉ.

వీరుఁడు మేరుధీరుఁడు వివేకవిచారుఁడు కోటిమన్మథా
కారుఁడు కీర్తిహారుఁ డవికారుఁడు శూరుఁడు దేవలోకసం
చారుఁడు పాపభూరుహనిశాతకుఠారుఁడు పద్మజాండసం
భారుఁడు రంగ...

68


ఉ.

సంగకరంగనిర్దళితశత్రుశుభాభ్రపతంగుఁ డంగనా
స్వంగుఁడు వాహనీకృతవిహంగుఁడు ధర్మగుణానుషంగుఁ డు
త్తుంగదయాంతరంగుఁడు చతుర్ముఖగర్వవిపాటనక్రియా
భంగుఁడు రంగ...

69


ఉ.

ఆయతచక్రనిర్జితనిశాటనికాయుఁడు నీలనీరద

చ్ఛాయుఁడు దివ్యకాయుఁడు విశాలపయోజభవాండభాండధౌ
రేయుఁడు నిత్యశోభనచరిత్రవిధేయుఁడు భక్తరక్షణో
పాయుఁడు రంగ...

70


చ.

శరనిధికన్యకామణి కుచద్వయచందనగంధలేపవి
స్తరణుఁడు నారదాదిమునిసత్తమహృజ్జలజాతనిత్యసం
చరణుఁడు భక్తపాలనవిశాలదయాచరణుండు కౌస్తుభా
భరణుఁడు రంగ...

71


ఉ.

మానితవాక్యసూనుఁడు సమంచితదానుఁడు రాజవంశ్యస
న్మానుఁడు ధీనిదానుఁ డసమానుఁడు భాగవతోత్తమాంతర
ధ్యానుఁడు స్వర్ణవస్త్రపరిధానుఁడు నేత్రితపూర్ణశీతరు
గ్భానుఁడు రంగ...

72


ఉ.

రుద్రసదృక్సుధీజనమరుద్ద్రుఁడు సత్కరుణాసముద్రుఁడున్
క్షుద్రనిశాచరప్రకరకుంజరరుద్రుఁడు దీనరక్షణో
న్నిద్రుఁడు జంభజిత్ప్రముఖనిర్జరభద్రుఁడు సుందరీమనో
భద్రుఁడు రంగ...

73


ఉ.

కాళీయభోగిమస్తకనికాయసముజ్జ్వలతాండవక్రియా
లోలుఁడు హవ్యవాహనవిలోచనశాపవిచాలుఁ డంబుభ్ళ
న్నీలుఁడు శాంతధర్మగుణనిర్మలశీలుఁడు నందబాలగో
పాలుఁడు రంగ...

74


ఉ.

రంగదనంతభోగిపతి రమ్యశయానుఁడు భక్తిసారసా
రంగకులాగ్రగణ్యుఁ డతిరక్షణశీలుఁడు కీర్తిశాలి శ్రీ

రంగపురీనివాసుఁడు తరంగితసత్కరుణుండు నీరదా
భాంగుఁడు రంగ...

75


ఉ.

వెన్నుఁ డపాంగవీక్షణనవీనదయామృతపూరతోషితా
పన్నుఁడు భిన్నభక్తపరిపాలనలోలకథానిరంతరో
త్పన్నుఁ డతిప్రపన్నజనతావినుతాఖిలసద్గుణౌఘసం
పన్నుఁడు రంగ...

76


ఉ.

పుణ్యుఁ డగణ్యపుణ్యమునిపుంజనికుంజకుటీరరక్షితా
రణ్యుఁ డరాతికాక్షసనిరంతరబాధితవాసవాదికా
రుణ్యుఁడు రావణాభిధవిరోధిశిరోధిసమప్రమృష్టకా
ర్పణ్యుఁడు రంగ...

77


చ.

కలువల నేలు డాలు తెరగంటిదొరన్ భరియించు మేలు దా
సుల వెఱఁబాపుకేలు బలుసోఁకుడుమూఁకలఁ దోలువాలు పొం
దళుకులసాలు చొక్కపుటెదం బెడవాయని యాలు గల్గు స
త్ఫలదుఁడు రంగ...

78


చ.

సిరి వెదచల్లుచూపు మదిఁ జిక్కఁగ దూరెడురూపు మార్తురం
బరపెడుతూపు పాపదొరపైఁ బవళించినవీఁపు సజ్జనో
త్కరముల యింటికాపు త్రిజగంబుల మోపును గల్గు కౌస్తుభా
భరణుఁడు రంగ...

79


చ.

కనుఁగొనలేనిసౌరు పెనుగాల జనించిననీరు భక్తులన్
వెనుకొని ప్రోచుతీరు తొలివేలుపుమూఁకలపోరు పాపము

న్నెనరువఁ దన్ను పేరు సిరినెయ్యముఁ బాయని పేరు గల్గు శో
భనమతి రం...

80


ఉ.

వేలుపుఱేనిఁ గన్నయరవిందముపొక్కిటఁ జెన్ను మీఱఁగా
శ్రీలలనాధరాసతులు చేరి పదాంబుజయుగ్మ మొత్త జే
జే లిరువంకల న్వినుతి సేయఁగ నుండెడు విష్ణుమూర్తి గో
పాలుఁడు రంగ...

81


చ.

ఇనశశిభౌమసౌమ్యవిబుధేజ్యసురాహితమంత్రిసౌరులున్
నలిగొని రాహుకేతువులు నల్వయుఁ జిల్వలతాల్పు పాకశా
సనసనకాదులున్ నిజవశంవదులై పనిదీర్ప నిత్యశో
భనమతి రంగ...

82


ఉ.

సింధురరక్షణుండు దమఁ జిత్తములోనఁ దలంచువారికిన్
బంధురకామితార్థము లపారముగా నొనఁగూర్చుదాత యా
సైంధవపద్మగర్భదివిషద్గణసన్నుతమూర్తి భ క్తస
ద్బంధుఁడు రంగ...

83


చ.

తనువు చరంబు పుత్రవసుదారధనాదుల నమ్మరాదు నె
మ్మనమున నంతకుండు దయమాలినవాఁ డిదె మేలెఱింగి భూ
జనవరులార మీహృదయసారసమధ్యమునందు నిల్పుఁడీ
పనివడి రంగ...

84


చ.

గరుడునిఁ గన్నసర్పములకైవడి భానుమహోదయంబునం
బరువులువెట్టు చీకటులభాతిని నెవ్విభు నామధేయముల్

స్మరణ యొనర్పఁ బాయుఁ గలుషంబులు నవ్విభుఁ డుల్లసత్కృపా
పరుఁడగు రంగ...

85


చ.

వలపులఁ జిక్కి లోవయినవాఁ డొకవారవధూటి కోరఁ గో
వెలఁ గల పైఁడిగిన్నెఁ గొని వేడుక నిచ్చినవారి నిద్దఱన్
దలవరు లాఁగిపట్టుకొన ధర్మసభన్ దగ నేఁగి సాక్షిగాఁ
బలికిన రంగ...

86


చ.

శరనిధి దాఁటి రావణు నిశాటుల నాజిని ద్రుంచి మౌనిశే
ఖరులకు నిర్భయం బొసఁగి గౌతమభార్య శిలావతారమై
పరగిన దివ్యరూపవతి బాగుగఁజేసిన దక్షుఁడుం దయా
పరుఁడగు రంగ...

87


ఉ.

వెన్నెలపుల్గు పారణపువేలుపు ముఖ్యులకెల్ల ముఖ్యుఁడై
యున్నకుమారునిన్ మణిషయూఖసహస్రవిభూషణంబులం
గన్నియ లిద్దఱం గనకకల్పితవస్త్రముఁ బూనియున్న సం
పన్నుఁడు రంగ...

88


చ.

హరినివహంబుభాతి విశదాండజమండలిలీల దేవతా
కరగతి నుగ్రశైలములకైవడి పన్నగరాజుచంద ము
ద్ధరతరతారకాపతివిధంబునఁ గీర్తిఁ జెలంగు సర్వభూ
భరణుఁడు రంగ...

89


చ.

మదనుఁడు పద్మగర్భుఁడు కుమారులుగాఁ గమలాధరాసతుల్
సుదతులుగా ఖగేశ్వరుఁడు సొంపగువారువమై చెలంగఁగా

గదయును శంఖచక్రములు కంజము హస్తములందుఁ గల్గు సం
పదగల రంగ...

90


చ.

నరనర భీమభీమ హరి నందన నందన రాజరాజరాట్
శరశర జన్మ సన్మఘవ సామజ సామజగర్భ గర్భ హా
సరస సరస్సరోజ ఘనసారస సారసుకీర్తిమండలా
భరణుఁడు రంగ...

91


ఉ.

సంగరరంగనిర్దళితశాత్రవుఁ డార్తజనైకరక్షణా
సంగుఁడు భక్తిలోకజలజాతపతంగుఁడు పద్మనాభుఁ డు
త్తుంగదయాంతరంగుఁడు చతుర్ముఖగర్వవిపాటనక్రియా
భంగుఁడు రంగ...

92


చ.

తిరముగ శంఖచక్రములు దిర్మణియున్ దిరుచూర్ణమున్ హరి
స్మరణము పుణ్యభాగవతమానితభక్తియు నిత్యకృతమై
పరగఁగఁ బూర్ణగోష్ఠియును బాగుగఁ గల్గఁగఁ జేయు నాజగ
ద్భరితుఁడు రంగ...

93


ఉ.

చారుతరోరుబాహుయుగసంభృతశంఖసుచక్రశోభనా
కారుఁడు నిత్యసత్యనరకల్పకల్పుఁడు సర్వదాసమం
దారుఁడు శత్రుదైత్యకులదర్పవిదారుఁ డపాస్తభూమిదు
ర్భారుఁడు రంగ...

94


ఉ.

కన్నులపండుగై మృదువు గల్గిన మంచిమనోరథాన్నముల్
జున్నులు పాయసాన్నములు జొక్కపుబా లమృతంపుభక్ష్యముల్

వెన్నెలవంటిమేల్ పెరుఁగు వేడుక దాసుల కిచ్చు నిత్యసం
పన్నుఁడు రంగ...

95


చ.

ఉభయకవేరజాంబువుల నొయ్యనఁ దోఁగుచుఁ జూతమంజుకుం
జభరితసైకతస్థలులఁ జాల విహారముఁ జేసి పుష్పసౌ
రభములు గ్రోలి క్రోలి సుచిరంబుగ వేడుకలందు శ్రీశుభ
ప్రభు వలరంగ...

96


చ.

కొలుచును జాలఁబాడియును గోఁకలు మేల్ గల యాలు రూకలున్
వెలివలువల్ తటాకములు వెల్లువలున్ మిడిమాన్యభూములున్
గలుగఁగఁజేసి భక్తుల కఖండితభాగ్యము లిచ్చు మన్మనః
ఫలదుఁడు రంగ...

97


చ.

చతురవివేకభక్తి నతిసంభ్రమ మొప్పఁగ నోరు నొవ్వ నీ
శతకము నిత్యముం జదువ సామజఘోటధేనుధాన్యముల్
సుతులును ముక్తియుం గలుగు శుంభదపారపుశ్రీ ఘటించు శ్రీ
పతియగు రంగ...

98


ఉ.

సింగపుమోమువాఁడు తులసీదళదామమువాఁడు కామినీ
రంగదురంబువాఁడు వలరాయని గాంచినవాఁడు భక్తి కు
ప్పొంగెడువాఁడు దానవుల పొంక మడించినవాడు వీఁడె మా
బంగరురంగ...

99

చ.

కరిపతిఁ గావఁడో దశముఖానుజు లంకకు రాజుఁ జేయఁడో
పరమదయాసమేతుఁ డయి ప్రాణము లియ్యఁడొ నాఁ డహల్యకున్
మఱువక నీవె దిక్కనిన మానిని ద్రౌపదిఁ బ్రోవఁడో దయా
పరుఁడగు రంగ...

100


ఉ.

ఆలికి నల్లుఁడై పిదప నల్లునికిం దగఁ దానె యల్లుఁడై
యాలికిఁ దండ్రియై మనుమరాలికిఁ బెండ్లికుమారుఁడై సదా
యాలి మఱంది చెల్లెలికి నై పతి లోకముఁ బ్రోచునట్టి గో
పాలుఁడు రంగశాయి మనపాలఁ గలండు విచార మేటికిన్.

101

రంగశాయిశతకము
సంపూర్ణము.