భక్తిరసశతకసంపుటము/మూఁడవసంపుటము/కాళహస్తిశతకము

వికీసోర్స్ నుండి

పీఠిక

ఈ కాళహస్తిశతకము కచించిన కవి విశ్వకర్మకులప్రదీపకుడును భద్రయపుత్రుఁడును సనాతనగోత్రుఁడునగు బాణాల వీరశరభయ్య. ఈశతకకర్త తాను కవీంద్రుఁడనని చెప్పికొనినాఁడు. కాళహస్తీశ్వరుని గూర్చి సుప్రసిద్ధకవులలో నొకఁడగు ధూర్జటిగూడ నొకశతకము వ్రాసియున్నాఁడు. ఈ రెండుశతకము లేకవిషయప్రతిపాదితములైనను గుణదోషనిర్ణయమున నీరెంటిని బోల్చుట కెంతమాత్ర మవకాశము లేదు.

ప్రకృతశతకకర్త యగు వీరశరభకవి భాషాస్వరూపము గాని యర్థజ్ఞానము గాని పాటించి కవిత వ్రాయువాఁడు కాఁడు. ఇతనిపద్యములు చదువుటకు ననుకూలమగు గణనియమము మాత్రము కలిగియుండును. అర్థసందర్భముగల పద్యములుగాని భావబోధకములగు సమాసములు గాని విషయవంతములగు నల్లికలుగాని యీశతకమున లేవు.

ఇందలి పద్యములు కొన్ని దాశరథీశతకములోని పద్యములకుఁ జాలవఱ కనుకరణములైయున్నను అర్థసందర్భముగాని భావముగాని లేకుంట విచారణీయము. భాషాస్వరూపము రసవేతృత లేని పామరజనులీ శతకమును మిగులభక్తివిశ్వాసములతో బఠించుచున్నారు. భాషాజ్ఞానము లేనివారికి మాత్ర మిందలి పద్యముల గమనిక యార్షణపాత్రముగ నుండును. కవిత యెటులున్నను కవిమాత్రము కేవలము భక్తిభావపరవశుఁడై పద్యరచనము గావించెఁగాన నాతని ప్రయత్నము ప్రశంసనీయము.

ఈ శతకకర్త భావముగాని సందర్భమును గాని యతిప్రాసాది ఛందోనియమములఁగాని పాటింపకున్నను కాళహస్తీశ్వరానుగ్రహమున నీశతకము భాషాప్రపంచమున గాకున్నను భక్తప్రపంచమునందేని సజీవముగ నుండుట యొకవిశేషము.

ఇట్లు భాషాసేవకులు

నందిగామ

శేషాద్రిరమణకవులు

1-1-25

శతావధానులు

శ్రీకాళహస్తీశ్వరాయనమః

కాళహస్తిశతకము

ఉ.

శ్రీజలధౌతహైమతి చిత్తసుధారసపానదంష్ట్రయు
గ్రాజగవంధసుర్జ్వరహరాననహాసధరాధరార్చితా
రాజకిరీట పంచముఖ రంజితశుభ్రశరీర బంధురాం
భోజభనానుతాంఘ్రి ఫణిభూషణ చంద్రహుతాశనార్కగో
రాజిత కాళహస్తి మణిగోపుర సాంబశివా మహాప్రభో.

1


ఉ.

మూలము విశ్వకర్మకులభూషణ భద్రయపుత్త్రరత్న బా
ణాలవవంశదీపక సనాతనగోత్రప్రశస్తభూప్రతీ
పాలకుడైన వీరశరభేంద్రకవీంద్రుడు నిత్యకోటిలిం
గాలను బూజచేసి శతకంబు రచించె గ్రహించవయ్య నా
పాలిటి కాళహస్తి పరమాత్ముఁడ సాంబశివా మహాప్రభో.

2


చ.

వరపురి కాళహస్తివిభవంబులు చూడని కన్ను లేల సు
స్థిరముగ మిమ్ము నాత్మలొ వచించని పాపపుజిహ్వ యేల యో
పురహర మిమ్ము పువ్వులను పూజలు సేయనిచేతు లేల స

ద్గురుకరుణాకటాక్షవీక్షణములు గోరని మానవజన్మ మేల యీ
ధరణిని కాళహస్తి మహరుద్రుఁడ సాంబశివా మహాప్రభో.

3


ఉ.

దక్షిణకాశి గంగ యరుదైన సువర్ణముఖీమహానదిన్
ఇక్షుసుధారసాభ్ధియని యక్షులు తుంబురనారదాదులున్
దక్షులె యైరి సిద్ధులు కృత్థారులు నైన మహాస్థలంబు పం
చాక్షరిమంత్రపూరితరసామృతపాత్రులదివ్యక్షేత్ర మో
దక్షిణకాళహస్తి ధరణీశ్వర సాంబశివా మహాప్రభో.

4


ఉ.

దక్షిణకాశి ముఖ్యనది దక్షిణస్వర్గము పుణ్యక్షేత్ర మై
మోక్షము లేనిదీనులకు మోక్షము లిచ్చి తరింపఁజేయ నీ
దక్షిణకాశి కేవలము దగ్గఱ నున్నది కంటిమయ్య ప్ర
త్యక్షము దేవలోక మని యేర్పడ నేటికి మళ్లి పుట్టె ఫా
లాక్షుఁడ కాళహస్తి పరమాత్ముఁడ సాంబశివా మహాప్రభో.

5


ఉ.

భూమిని నీసువర్ణముఖి పుట్టెను రెండవవారణాసియై
పామరబద్దపాశభవపాపవిమోచనపుణ్యక్షేత్రమై
క్షేమము నిచ్చుకర్మముల జెంది యవస్థల గొట్టి వేగ మీ
నామసుధారసామృతము నమ్మితి మమ్ములఁ బ్రోవవయ్య మీ
ప్రేమను కాళహస్తి మహరుద్రుఁడ సాంబశివా మహాప్రభో.

6


చ.

పురహరకుంజరాననసుపుత్ర పవిత్రపితామహార్చితా
వరద పరంపరాత్పర దివాకరసన్నిభ నాగకుండలా

భరణ శశాంకబింబ కళభాసితవిభ్రమ మేరుతారకా
పురజితభస్మలేపనవసుందరసన్నుత నీవెగాక స
ద్గురుఁడవు కాళహస్తి పరమేశ్వర సాంబశివా మహాప్రభో.

7


చ.

ధరధర మేరుచాప ప్రమథాధిప రుద్ర యుపేంద్రతాడనా
గరళగళ త్రినేత్ర ఫణికంకణ శంభుకృశానురేత యో
హరహర శూలపాణి హరిహంస తురంగమ మౌళిరత్న ని
ర్జనుత మూలబ్రహ్మ దనుజాంతక శాంభవిచిత్తచోర శ్రీ
పురహర కాళహస్తి త్రిపురాంతక సాంబశివా మహాప్రభో.

8


చ.

కలఁగని మేలుకొన్నగతి గౌరవమాయప్రపంచకంబులోఁ
గలిసి సమస్తభాగ్యములు గల్గిన నేమి ఫలంబు సంపదల్
నిలువవు దేహమోహములు నీరు మలంబుల మష్టుగుంటలో
మొలచిన నీరుబుగ్గ యిది మోసముజేయును నమ్మరాదు ని
శ్చలముగ కాళహస్తి నిటలాక్షుఁడ సాంబశివా మహాప్రభో.


ఉ.

కాశిపురీశగర్భనవఖండధరిత్రిపతిత్వ మబ్బినా
యాశకు మట్టు లేదు కనకాద్రిసమానధనంబు గల్గినన్
లేశము వెంట రాదు మది కింపుగఁ జేసినపుణ్యపాపముల్
ద్రోసిన బోదు నీకరుణతోయజము ల్వికసించినంతటన్
బాసును కాళహస్తి కఱకంఠుఁడ సాంబశివా మహాప్రభో.


ఉ.

నిల్వవు యెట్టి కాయములు నిల్వవు గోవులు మాయసంపదల్

నిల్వవు భోగభాగ్యములు నిల్వవు సొమ్ములు నిండ్లు మేడలున్
నిల్వవు ఊహపోషణలు నిల్వవు కష్టసుఖాలు నంశలున్
నిల్వవు మోహపాశములు నిల్వవు వాంఛలు పాఁడిపంటలున్
నిల్వవు కాళహస్తి నిటలాక్షుఁడ సాంబశివా మహాప్రభో.

11


ఉ.

తావకపుత్రదారతలిదండ్రులు నన్నలు తమ్ములు న్జెలుల్
బావలు చుట్టము ల్సఖులు బంధువు లెవ్వరు వెంటరారు యీ
జీవము కాస్త పోతె మఱి చేరరు దగ్గఱ నెంతప్రాణసం
జీవప్రియాప్తులైన హరిషించరు శీఘ్రము పట్టుమందు రో
దేవుఁడ కాళహస్తి జగదీశ్వర సాంబశివా మహాప్రభో.

12


ఉ.

ప్రాణికి బొంది కేమి ప్రతిబాధ్యత యెప్పుడొ యేక్షణాననో
ప్రాణము భంగపెట్టి సుతపత్నిపితామహు దుఃఖపెట్టి నా
ప్రాణము తల్లడిస్తు తనబాటనె యెక్కడ నేస్థళాననో
ప్రాణము వెళ్ళిపోతె తనబాధ్యత లంతటఁ దీఱిపోవు నా
ప్రాణికి కాళహస్తి పరమాత్ముఁడ సాంబశివా మహాప్రభో.

13


ఉ.

ప్రాణము లుండగానె నినుఁ బ్రార్ధన జేసి నటించ రాదు నీ
ప్రాణము లెంతమట్టుకు నిబంధనయున్నదొ యంతమట్టుకే
ప్రాణము నిల్వ దాకడను బాధ్యత దీఱితె దాని కేల నీ

ప్రాణము లేనిబొంది నినుఁ బ్రార్ధనజేసున మళ్ళి వచ్చునా
ప్రాణము కాళహస్తి పరమాత్ముఁడ సాంబశివ మహాప్రభో.

14


ఉ.

ప్రాణము బొందిలో నిలిచి పాపము పుణ్యము రెండు జేసి యా
ప్రాణము లేచిపోయి యమబాధలఁ జెందితె బొందిపోయి యీ
ప్రాణిసహాయమౌ నవలభంధఋణాదులు దీఱునంతె యా
ప్రాణము లేచి రాదు ఉపకారమె యొక్కటి వచ్చుఁ దోడుగాఁ
బ్రాణికి కాళహస్తి పరమాత్ముఁడ సాంబశివా మహాప్రభో.

15


ఉ.

ఎట్టిఘటంబు లుండినది యెందుకు నెక్కడ నేస్థళాననో
పుట్టినచోటనో బ్రతుకఁబోయినచోటనొ యున్నచోటనో
గుట్టనొ త్రోవనో గుహనొ గుంటనొ చావు నిజంబు బొందికిన్
గట్టిగ కాళహస్తి గణనాయక సాంబశివా మహాప్రభో.

16


ఉ.

పుట్టుక యేడనో సకలభూములఁ ద్రొక్కి చరించు టేడనో
పట్టణ మేడనో యుదకపానము యేడనొ మట్టి యేడనో
గిట్టడ మేడనో మఱి సుఖించుట యేడనొ యుండు టేడనో
గట్టిగ నీ వెరుంగుదువు గాక యితర్లకుఁ జెంది చిక్కునా
వట్టిది కాళహస్తిపతి రుద్రుఁడ సాంబశివా మహాప్రభో.

17


ఉ.

ఎన్నిమహాస్థలంబు లని యెక్కడ చూడను చూచునే భవ
ద్ధ్యానము సేయ కెన్నటికిఁ దైవము నెక్కడ తాను వేదసం

పన్నగుణాఢ్యుఁడై తనతపస్సు ఫలించితె ఉన్నచోటనే
యున్నది మోహనామృతము ఊఱకె భూమిఁ జరింపఁగానె యే
మున్నది కాళహస్తి మునివందిత సాంబశివా మహాప్రభో.

18


ఉ.

పేరుకు నన్నియాత్రలు ఫలించె ననంగను పుణ్యుఁ డాయెనా
కారము మానెనా సకలకర్మనివారణసిద్ధుఁ డాయెనా
ఊఱకె పోయిరావడము ఒక్కటె యెందు సమస్తయాత్రలున్
దీఱిన దీఱకున్న గురుతీర్థప్రసాదధురీణుఁ డాయెనా
శూరుఁడ కాళహస్తి శివశోభన సాంబశివా మహాప్రభో.

19


ఉ.

ఇత్తడి హేమమౌనె యది యెన్నిపుటంబులు వేసి చూచినన్
ఇత్తడి యిత్తడేను నిధి యెక్కువసొమ్ముకు నష్టి చేటు నా
యిత్తడి పైఁడియౌనె యిది యన్యమెఱుంగక రిత్తవేల్పులన్
సత్తుగఁ బూజ చేసినను సద్గురుపాదము నమ్మకుండినా
ఉత్తది కాళహస్తి వృషభేశ్వర సాంబశివా మహాప్రభో.

20


ఉ.

జీవుఁడు జీవుఁ డంచును భజించిన నాత్మకు నాత్మ దేవుఁడే
జీవుఁడు జీవుఁడే గురుఁడు జీవుఁడు దేవుఁడు నీవ దేవ నీ
త్రోవను నీవు పోతె పెడత్రోవకు బొందికి యాత్ర గల్గు ని
ర్జీవి ఘటంబు శ్రీఘ్రముగఁ జేరువగాఁ బడి రుద్రభూమికిన్
జీవము కాళహస్తి గిరిజాపతి సాంబశివా మహాప్రభో.

21

ఉ.

జీవుఁడు వచ్చిపోవుక్రియ చిక్కఁగ నీయక చచ్చిపుట్ట నీ
లాగున నిట్టిజన్మములు లక్షలు కోట్లన విందు నందు నా
దేవుఁడ యేమి సార్ధకము మానసమందున నిన్ను నమ్మినన్
కేవలమున్ను మోక్షపురి కెత్తుకపోయి తరింపఁ జేతువో
ధీరుఁడ కాళహస్తి జగదీశ్వర సాంబశివా మహాప్రభో.

22


ఉ.

ఏమిఘటంబు ఏమిబ్రతు కేమిశరీరము ఏమిదేహమున్
ఏమిసుఖంబు ఏమి యిది యెన్నఁటికైనను చావు సిద్ద మీ
భూమిని యిట్టిజన్మములు పుట్టినఁ గిట్టినఁ మోక్ష మేమి నా
స్వామికథాసుధామృతరసజ్ఞతఁ జెందిన ముక్తి గల్గునే
దీనుఁడ కాళహస్తి జగదీశ్వర సాంబశివా మహాప్రభో.

23


ఉ.

ఎక్కడి చుట్టపక్కములు నెక్కడిపుత్రులు తల్లిదండ్రులున్
ఎక్కడి సంతపట్టునది యెక్కడనైన ఫలించియుండెనా
ఎక్కడ దేశదేశములు నండజము ల్జత ప్రొద్దుగ్రుంకితే
ఎక్కడిపక్షు లక్కడనె యెవ్వరిబాటలు వారివారికే
నిక్కము కాళహస్తి నిటలాక్షుఁడ సాంబశివా మహాప్రభో.

24


చ.

పులివలె యీఘటంబు పడిపోయినపిమ్మట గాలి గాలిలో
పలను ఋణానుబంధప్రతిబాధ్యత నున్నకళేబరంబులో
నిలుచు నటన్న స్వగృహము నీడను బాసితె ఆఁకటింటిలో

నిలిచిన హంసకైన కని నీవు యెఱుంగనిమాయ యున్నదా
వెలుపల కాళహస్తి యతివందిత సాంబశివా మహాప్రభో.

25


చ.

మనుజులలోని గర్భకసుమాలపుడొక్కలయందు మళ్ళి హా
ననుఁ బడఁద్రోయవద్దు యొకనాఁటికినైన మహాత్మ యీపున
ర్జననము చాలు సద్గతికిఁ జేర్చర యీశ్వర యేదివేళ నే
నిను నెఁడబాయకుందు ధరణీశ్వర యంచును మ్రొక్కుచుంటి నా
మనసున కాళహస్తి మహరుద్రుఁడ సాంబశివా మహాప్రభో.

26


ఉ.

ముట్టునఁ బుట్టి రక్తమలమూత్రములందున దోషకారినై
పుట్టిన యెన్నిజన్మములు భూమిని మళ్ళి యనేకచోట్ల నేఁ
బుట్టితె నేమి కద్దు నరపుట్టుక నా కిఁక వద్దు నన్ను నీ
పట్టున నిల్పి మోక్షక్రియ మార్గముఁ జూపి తరింపనీయరా
గట్టిగ కాళహస్తి గణనాయక సాంబశివా మహాప్రభో.

27


చ.

పిడికిట పుష్యరాగమణిఁ బెట్టుక వ్యర్థులు రాళ్ళకోసమై
యడవిఁ జరింపనేల మిము నాత్మ నెఱుంగక సంతజోగులై
పుడమి చరింప నేల శివపూజక్రమంబులు మాన నేల నా
కడపట పొర్ల నేల యుదకంబులు లేక నశించనేల యా
గడములు కాళహస్తి యజవందిత సాంబశివా మహాప్రభో.

28


ఉ.

కాశికిఁ బోవనేల యుదకంబులు మోసుక రాన దేల నా

కాశి మహాప్రవాహజలకాలువలై ప్రవహించుతోయ మా
కాశిజలంబు గాదె శివకాశిభవుండవు నీవె కావె యా
కాశికి బోవ నాసకలకర్మజముల్ బెడఁబాసి పోనె భూ
తేశుఁడ కాళహస్తి భువనేశ్వర సాంబశివా మహాప్రభో.

29


ఉ.

బట్టలు పిండి కట్టుకొని భక్తిగ సంధ్యల నెంత వార్చినన్
బట్టెఁడు చేతిలోన నొకభక్తుని కైన నతీతభిక్షముల్
పెట్టక ముక్తి లేదు మును పేమియునైనను పెట్టి పుట్టితే
పుట్టికి నూఱుపుట్లు శివపూజలు నూటికి కోటివేలు నీ
దిట్టము కాళహస్తి భువనేశ్వర సాంబశివా మహాప్రభో.

30


చ.

తెలివిగనున్నవాఁడె యుపదేశముఁ బొంది శివా శివా యనున్
పలుకులు సంగ్రహించుకొని భావమునందున ముక్తికాంతతోఁ
గలిసి సుఖింపలేక నరకంబునఁ బాపపుఁగశ్మలంబులో
బలిమిగ దూరిపోయి యమబాధల కోపిరి కష్టజీవు లై
సలలితకాళహస్తి బుధశంకర సాంబశివా మహాప్రభో.

31


ఉ.

హా పరమాత్మ యంచు చతురక్షరిప్రాణప్రతిష్ఠమంత్రని
క్షేపము మాకు కావలయుఁ గేవలమున్న సదాశివా యనే
యాపదబాంధవుండ త్రిపురాంతక రుద్రుని నామకీర్తనల్

పాపవిమోచనంబు లని ప్రార్థన చేసెద పాదపద్మముల్
జూపుమి కాళహస్తి సురసేవిత సాంబశివా మహాప్రభో.

32


ఉ.

కాయఁగ రావణాసురునికన్న ధనాఢ్యులు లేరు భూమిలో
మాయలయందు సర్వఘనమంత్రములందును ధైర్యమందునున్
బ్రాయమునందునున్ బలపరాక్రమమందును భక్తియందునున్
గాయము నందుఁ గా తుదకు కాలము చెల్లిన యంతనే హతుం
డాయెను కాళహస్తి యమరార్చిత సాంబశివా మహాప్రభో.

33


ఉ.

నీమము బట్టి రావణుఁడు నిత్యము భోజనకాలమందు హా
కోమలి సన్నుతాంగ్రి నవకోటికి నర్థుల పూజజేసి ర
క్షామణి యేమి మోక్షసిరి సంపద నొంది తరించు పైఁగ శ్రీ
రాములచేతఁ జచ్చెఁ ద్రిపురాంతక చూడుమి భక్తిలేకనా
భూమిని కాళహస్తి భువనేశ్వర సాంబశివా మహాప్రభో.

34


చ.

జలధర లోకరక్షకుఁడు సర్వము రుద్రమయం జగత్తుగాఁ
బలికిన వేదశాస్త్రములు బాగఁ జెలంగె మదాంధు లై దురా
త్ములు పతనంబుచేత శివదూషణ చేసి యనేకయేండ్లు బా
ధలఁ బడి నోరు పుచ్చి సిరి దప్పి యఘోరపుదుఃఖజీవులై
నిలచిరి కాళహస్తి నిటలాక్షుఁడ సాంబశివా మహాప్రభో.

35


చ.

జలధర నీవు మాకు సిరిసంపద లిచ్చిన మేలువార్తగాఁ

కలగని మేలుకొన్న యటు గాక మహేశ్వర యేది వేళ నీ
కొలువున నుండి యన్యులను గోరి వచింపను నోరు రాదయా
వలితఫణీంద్రనారి నిటలాక్ష సదాశివ శంభుమూర్తి కే
వలమును కాళహస్తి కఱకంఠుఁడ సాంబశివా మహాప్రభో.

36


ఉ.

హీనులు ఎన్నివిద్యలు గ్రహించిన యప్పటిపొట్టకూటికే
కాని తరింపు గాదె! యధికారము నందును ముక్తి యున్నదే
వీనికి ముక్తికాంతస్థల మెక్కడిదో యుని కేడనో మహా
జ్ఞానచరాచరంబులు మహాత్ముఁడ ని న్మది చాలనెప్పుడున్
గానరు కాళహస్తి కఱకంఠుఁడ సాంబశివా మహాప్రభో.

37


ఉ.

హీనపుజాతిదుర్గుణుని కెన్నివిధంబుల బోధ చేసినన్
వానియసద్గుణంబులు నివారణ మొందునె భోగి వాసుకీ
కూనకు పాలు తేనె దధి గుజ్జు రసంబుల నెంతఁ బోసినన్
దానివిషంబు బోనె మృతి తప్పునె క్రూరము మానునే కనన్
మానదు కాళహస్తి బుధమాన్యుఁడ సాంబశివా మహాప్రభో.

38


ఉ.

నిండు సమస్తలోకముల నీలసుకంధరరుద్రమూర్తికిన్
రెండవసాటివేల్పు లిఁక లే రని వాకిట ఘంట గట్టి వే
దండము నెక్కి యంతటను దంధణ దంధణ భేరి వేసి బ్ర

హ్మాండము దండ నిండుకొని యద్భుతమైన మహాస్వరూపుఁడై
యుండవె కాళహస్తి త్రిదశోన్నత సాంబశివా మహాప్రభో.

39


చ.

విపుల రథంబు హేమగిరి విల్లు నుపేంద్రుఁడు గాండ మర్కఋ
క్షపతులు బండికండ్లు విధి సారథి శేషుఁడు నారి వేదముల్
నృపుఁడు గుఱాలు జేసికొని నృత్యము ద్రొక్కుచు తోలి నేర్పుగా
త్రిపురసురారిఁ గూల్చితివి ధీరత నెవ్వరు నీకు మించిరో
కృపగల కాళహస్తి ఘనకేశుఁడ సాంబశివా మహాప్రభో.

40


చ.

నరసురవంద్యుఁ డీశ్వరుఁడు నాయకుఁ డొక్కడె గాని వేరితః
పరము నెఱుంగ మంధకవిపక్ష యటంచు సహస్రశీరుషా
పురుష యటంచు దేవతలు పూజ యొనర్చి తరించినారు నా
తరమె భవత్స్వరూపములత్రాణ యెఱింగి నుతింప నాత్మ సు
స్థిరముగఁ కాళహస్తి సురసేవిత సాంబశివా మహాప్రభో.

41


ఉ.

ఒక్కఁడె లోకరక్షకుఁడు ఒక్కఁడె దైవము ఎందుఁ జూచినన్
మిక్కుట మైనరూపములు మింటికి మంటికి సూత్రధారుఁడై
తక్కి సమస్తలోకములఁ దాండవ మాడుచునున్నవాఁడు తా
నొక్కఁడె గాక యీశ్వరుఁడు ఒక్కని మించి యితఃపరుండు ఇం
కెక్కడ కాళహస్తి గిరిజేశ్వర సాంబశివా మహాప్రభో.

42


ఉ.

తత్తర నన్నుఁ గన్నతలిదండ్రులు ఎత్తుక ముద్దులాడి నీ
పొత్తున డించి యీశ్వరుఁడు పోషణఁ జేయు నటంచు గట్టిగా

దత్తము జేసినారు గురుదైవము నిద్దరు నాకు నీవె సా
క్షాత్తు నిజస్వరూపమును కన్నులఁ జూపుము కాంక్ష దీరఁ నన్
రక్షక కాళహస్తి బుధరంజక సాంబశివా మహాప్రభో.

43


చ.

కొడుకులు లేకలేక యొకకోకిలవాణి సుపుత్రుమాఱుగా
నుడుతను దెచ్చి పెంచుకొని యుగ్రుని పేరిటఁ బిల్చి రార యో
కొడుకని ముద్దులాఁడగను గొమ్మకు నప్పుడు గర్భచిహ్నలై
కడుపు ఫలించె సంపదలు కన్నులఁ జూపె సమస్తకర్మముల్
విడిచెను కాళహస్తి వృషభేశ్వర సాంబశివా మహాప్రభో.

44


ఉ.

స్థిరముగ నీదుదర్శనముఁ జేసిననాఁడె యనేకపాపముల్
పరిహరమాయెఁ గర్మములు పాఱఁదొలంగె దరిద్రదుఃఖముల్
దరికొని కాలసాగె రజరాద్రి కనుంగొనఁ ద్రోవఁ జిక్కె యో
పరమశివుండ మోక్షమనుపర్వత మెక్కితినయ్య యోహరా
హరహర కాళహస్తి హరివందిత సాంబశివా మహాప్రభో.

45


చ.

పొదలెడి నాదరిద్రములు పోయెను మిమ్ములఁ జూడఁగా నహా
కుదిరెను మామనస్సు వృషఘోటకభీష్మభవాంధకారముల్
వదలెను నేఁటితోను మనవాంఛను వచ్చిన కాలకింకరుల్
ఒదిగిరి మూలమూల నిఁక నూఱక శంభుని నామకీర్తనల్
చదివెదఁ కాళహస్తి త్రిపురాంతక సాంబశివా మహాప్రభో.

46

చ.

కమలపుబాళికిన్ హరికి గట్టిగ స్నేహమటంచు నందు రా
కమలము లేడనైన నుదకంబులు లేనిస్థలంబునుండునా
కమలసఖోగ్రతిగ్మఖర కాంతులకు న్మరి తాలరాదె యా
కమలము వాడిపోక యుదకంబులు పాసినఁ జావదా భవ
త్కమలము కాళహస్తి కఱకంఠుఁడ సాంబశివా మహాప్రభో.

47


ఉ.

ముప్పునఁ గాలకింకరులు ముంగిటఁ జేరుక కాలపాశముల్
తెప్పునఁ గట్టి ప్రాణములు తీసెడువేళల మాయచీఁకటిన్
గప్పిననాఁడు మీస్మరణ కల్గునొ కల్గదో యందు కిప్పుడే
తప్పక చేతు మీస్మరణ త్ర్యంబక నేను తరించుకోసమై
యప్పని కాళహస్తి నిటలాక్షుఁడ సాంబశివా మహాప్రభో.

48


చ.

నెరయ దరిద్రదోషమున నిత్యము జానెఁడుపొట్టకోసమై
నరుల నుతించి మానుషము దప్పి యసత్యము లాడలేక నీ
మఱుఁగునఁ జేరి రిక్తులము మమ్మును బ్రోవు మటంచు మ్రొక్కినన్
గఱుఁగదు నీమనంబు శితికంధర యింతపరా కదేలరా
యెఱిఁగియుఁ కాళహస్తి వృషభేశ్వర సాంబశివా మహాప్రభో.

49


ఉ.

నెత్తిన గంగ యుండ శిఖినేత్రమునం దనిలుండు నుండ నీ
యెత్తున ధాన్యముండ మఱియెత్తుగఁ జేతను పాత్ర యుండ నీ
పొత్తునఁ గూడు వండుకొని చోద్యముగా భుజియింపరాదె యీ

పిత్త మదేమి జోగివలె భిక్షకుఁ బోవఁగ నేమి వట్టిదే
దిట్టవు కాళహస్తినుత దిక్పతి సాంబశివా మహాప్రభో.

50


ఉ.

తాండవలింగ నీమతి వితండము లేమొ యనాథలోభిపా
షండుల కీవు భాగ్యమును సంపద లిత్తువు సత్యసద్గుణో
ద్దండనిధానమంత్రజపతత్త్వప్రసంగతపఃప్రభూతస
త్పండితులైనవారికి విపత్తుల నిత్తు వదేమి వారి కా
దండన కాళహస్తిపురధారణ సాంబశివా మహాప్రభో.

51


ఉ.

బారుగ నాటలాడి శివభక్తులతో సరియైన నీకు శృం
గారము లేల దారువనకాంతలు నేల భవాని యేల భా
గీరథి యేల సర్పభుజకీర్తులు నేల ధరించుకొన్న దే
వేరులయొక్కముద్దుమురిపెంబుల నెవ్వరు జూడనయ్య మీ
వారిలొ కాళహస్తి సురవందిత సాంబశివా మహాప్రభో.

52


ఉ.

పన్నగభూష నీవు చేయి బట్టిన చాపము పైఁడికొండ నీ
వున్నది వెండికొండ తలనున్నదియంత హిరణ్యనీరు నీ
కన్న ధనాఢ్యు లేరి జగమందున యేవగ నెంచిచూచినన్
దిన్నగ భిక్షమెత్తుకొన దీనుణడవా దరిలేనివాఁడవా
యెన్నగ కాళహస్తి వృషభేశ్వర సాంబశివా మహాప్రభో.

53


ఉ.

ప్రేమతొ నీవుగన్న యొకబిడ్డఁడు గుజ్జయి కూటి కేడ్చెనా
వామప్రియాత్మజుండ న వివాహము లేక తపించుచుండ నీ

ధూమసుతుండు పైకి నొకదుప్పటి యిమ్మని యంగలార్చె నీ
కేమిపరాకొ పుత్రులకు నివ్వనివాఁడవు మాకు నిత్తువే
భూమిని కాళహస్తి ఫణిభూషణ సాంబశివా మహాప్రభో.

54


ఉ.

భీమ మహేశ్వరా పిలువ పేరును నీవె ధరించుకొందు నీ
భామకు రాగిసొమ్ముల నపారముగా ధరియించినావు చి
న్నామెకు జీరె యివ్వక ననాథనుగా నొగిఁ జేసినావు నీ
కేమి దరిద్ర మొందె యపకీర్తి యెఱుంగక చేసి యట్టు లీ
భూమిని కాళహస్తి సురపూజిత సాంబశివా మహాప్రభో.

55


చ.

కరివరదాంఘ్రిజా నగహితాత్మజ దారువనంగనామణీ
తరుణులఁ బాసి యుగ్రజపతర్పణహోమము నిల్పి ప్రోదినా
హార్యము? మించి యీడిగెవధూమణితోఁ జని కల్లుకుండలోఁ
జొరబడి యూపిరాడక యుసూరని నీవె తపించి తంతగా
విరహమటయ్య కంచిపృథివీశ్వర సాంబశివా మహాప్రభో.

56


ఉ.

పండితసన్నుతాంఘ్రి యొకభక్తుఁడు పుత్త్రుని జంపి కూరగా
వండి భుజింపఁజేసెను మఱి యొక్కమహాత్ముఁడు నీకు భృత్యుఁడై
యుండి కళత్ర మిచ్చె ననువొందగ జూచి మఱొక్కభక్తుఁడున్
మెండుగ ఱాళ్ళు రువ్వె పరమేశ్వర భక్తులజాడ యెంతయు
ద్దండమొ కాళహస్తి యతివందిత సాంబశివా మహాప్రభో.

57

ఉ.

భాసురపంచవక్త్ర యొకభక్తుఁడు యెంగిలిపండ్లు గిన్నెలోఁ
దీసుకవచ్చి పెట్టినను దిగ్గున లేచి భుజించి మెచ్చి కై
లాసము యిచ్చినావు కఱకంఠుడ నీభ్రమ యేమి చెప్ప నో
వాసవపూజితాంఘ్రి మునివందిత మమ్ముల బ్రోవవయ్య నీ
దాసుఁడ కాళహస్తి నిటలాక్షుఁడ సాంబశివా మహాప్రభో.

58


ఉ.

మానక బోయఁ డెన్నడు సమస్తమృగంబుల జంపి దొన్నెతో
మాంసము దెచ్చిపెట్టి తినుమంటె భుజిస్తివి ఎగ్గులేక నీ
తాపమదేమొ నీ విఁకన దగ్గఱ రాకు మటంచు పార్వతీ
హింసల నిన్ను బెట్టితె సహిస్తివి యప్పుడు శాంతమూర్తి వై
పురహర కాళహస్తి త్రిపురాంతక సాంబశివా మహాప్రభో.

59


చ.

అతులితకాలకూటవిష మప్పుడు ముప్పదిమూఁడుకోట్లదే
వతలు ననేకబాధ పడి వచ్చి భయంబున నోహొ పార్వతీ
పతి యని నీవు దిక్కు యని పక్షులువోలెను తల్లడించుచున్
గతి చెడి వస్తె యందఱిని గాచి విషంబు హరించినావు స
మ్మతముగ కాళహస్తి సురవందిత సాంబశివా మహాప్రభో.

60


చ.

గరళము మ్రింగి కంఠమున నిల్పి హరించి జయించి మాయఁగా
సురనుత నీవు మూర్చగొని స్రుక్కెను ఆపద మూఁడుజాములున్
సురమునిభూతసిద్ధయతిసూర్యసుధాంశుఉపేంద్రయింద్రగం

ధరువులు భక్తి చేత తమదాపున జేరుక సేవచేయుచున్
తిరిగిరి కాళహస్తి త్రిపురాంతక సాంబశివా మహాప్రభో.

61


చ.

అరమర లేక నేను శివరాత్రిమహోత్సవకాలమందు జా
గరణము చేసి గొప్పఁగ నఖండము బెట్టుక మేలుకొంటి హా
మరి పదమూఁడుజాములును మౌనుల మంచును నిద్రహారము
ల్మఱచి తదేకధ్యానమున మర్వక మిమ్ముభజింపఁజేయు మీ
తిరుగిరి కాళహస్తి త్రిపురాంతక సాంబశివా మహాప్రభో.

62


ఉ.

దుర్గుణయాగశిక్ష సురధూర్జటి దుందుభిదుందుభీసుతా
భర్గ భవాభవాంతక ప్రభాకరవర్ణ యపర్ణ పార్వతీ
దుర్గమృడానిచండిక వధూమణి మానస పద్మబంభరా
భార్గవశిష్యవర్గ సురవందిత సాంబశివా మహాప్రభో.

63


ఉ.

వాదుకు బోక మాకు భగవంతుడె దిక్కుగదా యటంచు మీ
పాదము నమ్ముకొన్న శివభక్తుల కేమివ్రతంబు లంచు నే
కాదశులంచు నోరుపడి గట్టుక యుండి నశించనేల యీ
భాద లవేల వట్టియుదకంబులు పిండి భుజింపనేల నా
వేదన కాళహస్తి నిటలాక్షుఁడ సాంబశివా మహాప్రభో.

64


ఉ.

నీవె సమస్తరూప ధరణీశ్వరమండలజ్యోతిరూపమున్
నీవె జగద్గురు ప్రముఖ నిత్యమహోత్సవశక్తిరూపమున్

నీవె పరంపరాత్ప్రముఖ నిగ్రహవిగ్రహమంత్రరూపమున్
నీవె జయంజయాసుగుణ నిర్గవిచారమహాస్వరూపమున్
నీవెగ కాళహస్తి నిటలాక్షుఁడ సాంబశివా మహాప్రభో.

65


ఉ.

నంది తురంగ సుందరపినాకప్రియాంబక స్పష్టసారథీ
నందసుతాగ్ని భక్తశరణాగతపోష నమశ్శివాయ యో
సుందరమూర్తి ఖండపరశూ రజతాద్రిపతీ ధనంజయా
వందిత నాగభూషణ భవానికళత్ర సుభక్తిసంగమా
నందము కాళహస్తి యజవందిత సాంబశివా మహాప్రభో.

66


ఉ.

దేవ మహానుభావ జగదీశ్వర ధూర్జటి యీశ్వరా మహా
దేవ హరా మృడానిజప దేవత భర్గ ఫణీంద్రహార హా
రావళి నీలలోహిత పురాజిత బ్రహ్మకపాలహస్త యో
పావనమూర్తి సద్గురుఁడ పాలితమౌనిసురేంద్ర మోక్షబృం
దావన కాళహస్తి భువనేశ్వర సాంబశివా మహాప్రభో.

67


ఉ.

అంగజవైరి భక్తహృదయాంబుజభృంగ కురంగపాణి శు
భ్రాంగ శుభాంగ లింగ భవభంగ ప్రసంగదయాతరంగ మా
తంగభుజంగపుంగవసితాంగలతాంగవముక్తికామభ
స్మాంగ విభూషితాంగ వృషసంగ కృపాతిమిరాంగభంగ స
ర్వంగమ కాళహస్తి వృషభేశ్వర సాంబశివా మహాప్రభో.

68


ఉ.

భూతపతీ కపాలభృతు భావృతవక్షసరోరుహాంఘ్రి సం

భూతనుతాగ్నికేశ శివపూజమహాత్మ్యము భక్తవత్సలా
మాతపితాసహోదరులు మా కిఁక నెవ్వరు మీకు మించ నో
శ్వేతకళత్ర పూర్ణశశిశేఖర యిక్కడ మాకు నీవె సం
ఘాతము కాళహస్తి వృషభేశ్వర సాంబశివా మహాప్రభో.

69


చ.

పరశివ యాదిబ్రహ్మ వృషభధ్వజ మద్గురు షణ్ముఖాపితా
సురగురువ్యోమకేశ వరసుందర యీశ్వర యప్రమేయ యో
కరివరదాసుతాంఘ్రి శితికంఠ గిరీశ మహేశ్వరా జరా
సురహర ఖడ్గపాణి జయశూలి భవాని శివా పితామహా
పురహర కాళహస్తి త్రిపురాంతక సాంబశివా మహాప్రభో.

70


చ.

పరమరహస్యమంత్ర క్రియభాసుర పక్వఫలామృతామృతా
ధర రుచిగొన్న భక్తగణదక్షమహాత్ములపాదధూళి నా
శిరమునఁ జేరి యెన్నటికి సిద్దుల మౌదుమొగాక నేను నీ
మఱుఁగున జేరినాను అభిమానము నుంచి తరింపఁజేయవే
గుఱుతుగ కాళహస్తి గిరిజాధిప సాంబశివా మహాప్రభో.

71


ఉ.

మాతృపితానుతాంఘ్రి శివమంత్రము నోట పఠించకున్న యా
నోరు వృథా నిరర్ధకము నో రనరా దది పాడుబొంద ఓం
కారమహత్త్వభక్త సిరికాంచన బ్రహ్మకపాలహస్త ఓం

కారవిభూతిదాయక సుకంధర గంధశరీరదేహకం
ఠీరవ కాళహస్తి కఱకంఠుఁడ సాంబశివా మహాప్రభో.

72


ఉ.

మానవజన్మ మెత్తి శివమంత్రలసద్గతిముక్తి సత్క్రియా
హీనుఁడు యెన్నివిద్యలు గ్రహించిన నేమిఫలంబు ఈశ్వర
ధ్యానము చేసి మోక్షమును గన్గొన కెప్పుడు సంచరించు నే
మానవుడైనగాని శివమందిరమందు నటించనేర్చు నా
మానవ కాళహస్తి మహరుద్రుఁడ సాంబశివా మహాప్రభో.

73


ఉ.

వాసవపూజితాంఘ్రిమునివందిత దేవ పరాకు ఈశ్వరా
భాసుర కృద్విహాసవిరుపాక్ష మృగాంక మృగాంకశోభితా
వాసుకి యాదిభక్తగణవత్సల చారుత్రిమూర్తి మూలసిం
హాసన జ్యోతిరూప పరహంస విరాడ్గురు దక్షిణాశకై
లాసము కాళహస్తి కఱకంఠుఁడ సాంబశివా మహాప్రభో.

74


చ.

నెఱ నిను నమ్మి కొల్చునరు నేత్రసరోరుహపూజితాంఘ్రినే
నిరతము మంత్రపుష్పముల నేఁ ఱేటనుఁపట నిన్ను చిత్తుగా
గుఱుతుగ పూజ చేసి యమద్వారము గట్టిగఁ బాడుజేతుగా
బిరుదుశరాయుజూడు వృషభేశ్వర భూరిజటాకలాప యో
పురహర కాళహస్తి త్రిపురాంతక సాంబశివా మహాప్రభో.

75


చ.

పురహర తొల్లి విష్ణువును చూడవె నేత్రసరోరుహంబుతో
మురియుచు పూజ చేసి మది మోక్షము లంది తరించె నిప్పుడున్

మఱిమఱి నోరు క్రొవ్వి శివమంత్రము నోట పఠించకున్న యీ
నరులకు ఏమొ కాని వరనందన సత్కళకాంతిలేకనే
జరగిరి కాళహస్తి జగదీశ్వర సాంబశివా మహాప్రభో.

76


ఉ.

రక్తకళత్ర యీశ్వరుఁడు రాజితనామ గిరీశవైభవా
భక్తులు తొల్లి యిక్కడ తరించెదమంచును వచ్చి యాత్మలో
రక్తముచేత నిన్నుఁ గనినప్పుడె సుస్థిరమూలజీవు లై
భక్తి ఫలించె నింద్రునియుపాస్తిబలంబున ధన్యు లైరి నీ
భక్తులు కాళహస్తి భువనేశ్వర సాంబశివా మహాప్రభో.

77


ఉ.

నీరజటాకలాప పరమేశ్వర నిన్ను నుతింప దేవబృం
దారకు లైనఁ జాలరు యథాస్ఠితిగా నినుఁ గాంచి నిన్నుఁ గై
వారము జేసి సద్గురుఁడ వర్ణన సేయను నాతరంబె యో
మేరువశార్ఙ్గపాణి పరమేశ్వర పూరితధర్సత్య సం
కారణ కాళహస్తి పరమేశ్వర సాంబశివా మహాప్రభో.

78


చ.

శరణని నిన్ను వేఁడితిని చక్కనితండ్రి పతీతపావనా
బిరుదులు గట్టినావు యట పేరు వహించి తరింపఁజేసి నా
పరమసుఖంబు భక్తులకు పాపట బొట్టు కిరీటరత్న మీ
పురము సమస్తజీవులకుఁ బుణ్యము లిత్తువటంచు వస్తి మీ
మఱుఁగుకు కాళహస్తి మహరుద్రుఁడ సాంబశివా మహాప్రభో.

79

ఉ.

ధాత్రి సమస్తభక్తులు కృతార్ధులు నైనమహాస్ఠలంబు యీ
క్షేత్రమహత్త్వ మేమి యని చెప్పుదు మోక్షనదీగయాకురు
క్షేత్రప్రయాగదీపఋషిసిద్ధులు పుట్టినజన్మభూమి యీ
క్షేత్రము దివ్యక్షేత్రమనఁ జాలఁ బ్రసిద్ధము నమ్మి యీ మహా
క్షేత్రము కాళహస్తి శితికంఠుఁడ సాంబశివా మహాప్రభో.

80


ఉ.

గోత్రకళత్రమిత్ర మదగోధ్వజగాత్ర శరీరదానగో
త్పాత్ర ప్రతిష్ట ప్రాణపరిపాలకసద్గుణ దేవరత్న గా
యత్రినుతాంఘ్రి భక్తులకు ఏమి ప్రధానము కేవలం శివ
స్తోత్రము జీవనౌషధము జిహ్వకు కర్మవిమోచనంబు ఈ
క్షేత్రము కాళహస్తి శశిశేఖర సాంబశివా మహాప్రభో.

81


ఉ.

హాసుర హాగజాసురుని హామిక నిల్వ ధరించలేక హా
నీసరిసాటిదేవతలు నిన్ను భజింపుచు వచ్చి మూఁతిపై
మీసము లేదు మాకు పరమేశ్వర మమ్ములఁ బ్రోవవయ్య మీ
దాసులమంచు మ్రొక్కిన ప్రతాపము చాలును మాకు శ్రీగిరీ
వాసుడ కాళహస్తి మహరుద్రుఁడ సాంబశివా మహాప్రభో.

82


పరమసఖుండ భక్తసుకరవ్రజనుగ్రహజాగ్రతస్థళా
ల్దొఱుకదు యింతకన్నను చతుర్దశలోకము లెంచిచూడ నీ
కరుణాకటాక్షవీక్షణము గట్టిగ నుంచుమి నమ్మినాను నీ

చరణము సేవ భక్తులకు సర్వము నీవె మహానుభావ శ్రీ
ధరనుత కాళహస్తి జగదీశ్వర సాంబశివా మహాప్రభో.

83


ఉ.

మన్మథవైరి మాకు పరమామృతపానము సేయకున్న యా
జన్మమదేల సద్గురుని చెంతను జేరి తదేకనిష్టతో
చిన్మయలింగమంత్రము ప్రసిద్ధిగ నోట పఠించితే పున
ర్జన్మము లేదు భక్తులకు క్షేమము ఇంద్రునిసన్నిధానమే
జన్మము కాళహస్తి జగదీశ్వర సాంబశివా మహాప్రభో.

84


చ.

హరహర యిష్టలింగ సురహాస ముఖాబ్జ నమోనమో పురం
దరనుత కాలకంధర కృతార్ధుల జేయుమటంచు నాత్మలో
సిరి గలవామదేవుని భజింపని పాపుపుదుష్టులైన యీ
నరులను ఘోరమయిన యమదండనఁ బెట్టిరి చూడవయ్య యో
పురహర కాళహస్తి త్రిపురాంతక సాంబశివా మహాప్రభో.

85


చ.

పుడమిని భక్తి గల్గి శివపూజ సుధామృతపూర్ణసద్బుధా
ముడివిడఁ గోసి లోపలను మూలవిరాటునిమోక్షకన్యకా
కుడిభుజ మెక్కి తాండవము కుల్కఁగ గాని యనేకపాపము
ల్విడుదల గావు కర్మములు వీడవు యెంతటివారికైన రు
ద్రుఁడ విను కాళహస్తి మహరుద్రుఁడ సాంబశివా మహాప్రభో.

86


చ.

ఎఱుఁగక జేసి పాపములు ఎంత తపించిన వ్యర్థబోవునా
వరయమధర్మరాజు పరిపాలననాఁటికి వచ్చు నీమహా

గరువమదాంధకారమునఁ గానక చేసిన పుణ్యపాపముల్
తఱుముక వచ్చువెంటఁబడి తప్పక యెక్కడఁ దాఁగియున్నవో
పురహర కాళహస్తి త్రిపురాంతక సాంబశివా మహాప్రభో.

87


ఉ.

ఇక్షుసుధాంఘ్రి యీశ్వరుఁడ యెన్నఁడు మిమ్ములఁ జూడమయ్య ప్ర
త్యక్షము జేసికోవలసి తెప్పున మానసపూజచేత ఫా
లాక్షుఁడ ముక్తికాంత నుపలాలన జేసి సుఖించితే మహా
మోక్షము గద్దు భక్తులకు మూలము నీవె మహానుభావ శ్రీ
లక్షణ కాళహస్తి మహరుద్రుఁడ సాంబశివా మహాప్రభో.

88


ఉ.

నిండుదయాభ్ధి మోక్షజిత నిండుఘటాబ్ధి హిరణ్యశైలకో
దండ ధరిత్రిదాత భవదద్భుతనిర్మలయోగపూరితా
తాండవలింగ నాయెదుటఁ దాండవనృత్తవినోదలీల ను
ద్దండము గుల్కఁ జూడవలె దాతనుతాంఘ్రి ముకుందబాంధవా
మండిత కాళహస్తి మహరుద్రుఁడ సాంబశివా మహాప్రభో.

89


చ.

పురహర శంభుమూర్తి శివపూజమహత్త్వముఁ జూచి యాత్మలో
పరుషముచేత మాయగను నందెలు మువ్వలు నాడఁ జూచి యో
వరగురు ధర్మభిక్షయని వచ్చి నిలంబడి తొల్లి యాత్మలో

సరళిగ మెచ్చి భక్తిగఁ బ్రసన్నమునై దరిఁ జేర్పరా విరా
ట్పురుషుఁడ కాళహస్తి వృషభేశ్వర సాంబశివా మహాప్రభో.

90


ఉ.

కాలము దప్పకుండ దశకంధరబంధురవందితత్రిశూ
లాలను బూజ చేసి నిటలాక్షుఁడ యేమి భజింతునయ్యయో
మూలవిరాట్టు సద్గుణుఁడ ముద్దులతండ్రి శశాంకమౌళి నా
పాలిటి లింగమూర్తి విరుపాక్షుఁడ దైత్యమదాపహార భూ
పాలక కాళహస్తి మహరుద్రుఁడ సాంబశివా మహాప్రభో.

91


ఉ.

నిత్యము రుద్రమంత్రజపనిష్ఠఁ దపోబలమోక్షసిద్ధుఁ డై
సత్త్వగుణాభిరామ నిను సన్నుతిఁ జేయ ననేకకోట్ల బ్ర
హ్మత్యలు పాఱిపోను మదహస్తముఖోద్భవ యేది వేళ నీ
సౌఖ్యము సర్వమోక్షసిరిసంపద లిచ్చును మాకు మందరా
కృత్యము కాళహస్తి మహరుద్రుఁడ సాంబశివా మహాప్రభో.

92


ఉ.

ఈశ్వర శంభుమూర్తి జగదీశ్వర కావవె యప్రమేయ కా
మేశ్వర సాంబమూర్తి పరమేశ్వర శాంతదయాబ్ధి దేవ నం
దీశ్వర లింగమూర్తి వసుధేశ్వర భక్తసుధామయార్ధనా
రీశ్వర కాళహస్తి వృషభేశ్వర సాంబశివా మహాప్రభో.

93


ఉ.

నాయెడఁ బ్రేమ గల్గి శివధామసుధామృతమంత్రవేదపా
రాయణ మాకు భోజనము రాజితసద్గుణ నిత్యసత్యమే

యాయువు గాన ధర్మములు నక్షయమైనధనంబు మాకు నా
దాయము రుద్రమూర్తి భవదంఘ్రుల నమ్మితి భక్తజీవనో
పాయము కాళహస్తి పరమాత్ముఁడ సాంబశివా మహాప్రభో.

94


ఉ.

మంత్రము మంత్ర మందురు సమస్తమునీంద్రులు సప్తకోటి యా
మంత్రము లెల్ల పామరులు మాయజపాలకుఁ చేయునట్టి దీ
తంత్రము గాక భక్తులకు తారకమౌ శివనామమంత్రమే
మంత్రము గాక యన్నియును మంత్రము లంచు జపించవచ్చునా
యంత్రము కాళహస్తి యతివందిత సాంబశివా మహాప్రభో.

95


ఉ.

నిన్నుఁ దలంతు నన్ను గరుణించు మటంచుఁ దలంచి యాత్మలో
నెన్నఁటికైన ప్రాప్తమున నీశ్వరరూపముఁ జూడఁగల్గునో
కన్నులగాంక్ష దీఱఁ గరకంఠుఁడ నామము శబ్దవాక్యముల్
విన్నఫలంబు గల్గునని వేదము లెప్పుడు నార్భాటించుచున్
నున్నవి కాళహస్తి వృషభేశ్వర సాంబశివా మహాప్రభో.

96


ఉ.

మేలుగ నాదమూర్తి పరమేశ్వరనామసుధారసంబు నా
నాలుకమీద నెన్నఁటికి నాట్యము గల్గునొ నాఁడు జన్మజ
న్మల తరించుచుందునని మానసమందు నుతింతు భక్తవా

చాలకమైన రుద్రునిప్రసంగము నెప్పుడు నోట నూనితే
చాలును కాళహస్తి సకలేశ్వర సాంబశివా మహాప్రభో.

97


చ.

క్షితినుతపద్మగంధమునిసిద్ధగణమ్ములు జన్మభూమి దే
వతలకు స్వర్గలోకమున నంబుధిరాసులమీఁది మేదినీ
పతులకు పార్శ్వవేది శివభక్తి మహాత్ములనోరఁ గల్గ నా
పతులకు గండ్రకత్తెర జపాంతకృతార్ధులజ్ఞానబోధ స
న్నుతులకు కాళహస్తి పరమాత్ముఁడ సాంబశివా మహాప్రభో.

98


చ.

క్షమధర కౌస్తుభామణిసుగంధగజధ్వజపారిభద్రనా
గమునకు రక్షరేకు క్షమ కాంతి శిరోమణి చుక్కబొట్టు వే
దములకు పట్టుకొమ్మ రిపుదానవతస్కరరుద్రభూమి పా
పములకు హోమగుండము శుభస్కరపాత్రుల కన్నపూర్ణ క్షే
మములకు కాళహస్తి పరమాత్ముఁడ సాంబశివా మహాప్రభో.

99


ఉ.

ప్రాణము నమ్మరాదు ఇఁక ప్రాపుగ నమ్మి ఘటంబులోన నీ
ప్రాణము లుండఁగానె నిను బ్రార్థనఁ చేసి నటింపరాదయా
ప్రాణ మనిత్య మంతరున ప్రాణము జూచిన బుద్ధి వెంటనే
ప్రాణము గానరాదు ఉపకారము ఒక్కటి వచ్చు తోఁడుగా
ప్రాణికి కాళహస్తి విరుపాక్షుఁడ సాంబశివా మహాప్రభో.

100


ఉ.

పాండుకళాధురీణుఁ డెడబాయక సర్వ జగత్కిరీటివై
డండ డడాండ డాండ డడడాండ యటంచు నుతింతు నిన్ను నే

తాండవమూర్తి సర్వభవతారక బ్రహ్మపిపీలికాది బ్ర
హ్మాండము నిండ నిండుకొని యద్భుతమైన మహాస్వరూపమై
యుండవె కాళహస్తి జగదీశ్వర సాంబశివా మహాప్రభో.

101


ఉ.

పండితపామరు ల్సకలపాపవిమోచనదండదండనో
ద్దండభవాండమండితపదాండనఖండలమండలాద్రి కో
దండప్రచండపిండభవదండలఖండితకుందపాండురా
పాండవవీరరుద్రపరిమండితభార్గవపాండవాగ్ని రు
ద్రాండజ కాళహస్తి మహరుద్రుఁడ సాంబశివా మహాప్రభో.

102


ఉ.

కుంభిని సర్వదేవతలు కోరిన నేమిఫలంబు వారికిన్
శంభుఁడె తల్లితండ్రి గురు శంభుఁడెదిక్కు జగత్తుకెల్ల నా
శంభుఁడె రక్షకాత్మ యని సంతతమున్ స్మరియింతు నే జయ
స్తంభము వేసి నాఁటెదను సాహసకార్యపరాక్రమక్రమో
జృంభణ కాళహస్తి శశిశేఖర సాంబశివా మహాప్రభో.

103


ఉ.

వారధిఁ గట్టవచ్చు భగవంతునిఁ గన్నులఁ జూడవచ్చు వ్యా
పారము సేయవచ్చు బడబాగ్నికణంబుల మ్రింగవచ్చు నౌ
తారము లెత్తవచ్చు యమదండనహింసకుఁ దాళవచ్చు సం
సారము నీఁదరాదు హరిసాక్షిగ నా కొకత్రోవఁ జూపవే
ధారుణి కాళహస్తి ధరణీశ్వర సాంబశివా మహాప్రభో.

104

చ.

అమరగణార్చితా తమకు నాశ్రితులైన యనేకభక్తులన్
శ్రమలెడఁబాపి ఘల్లున భృశంబుగ గజ్జెలమ్రోఁత బుట్టగా
భ్రమమున నందివాహనముపైన నిలంబడి భక్తులిండ్లనున్
ధిమిధిమి నాట్యమాడుచును దీనులఁ బ్రోవవె మోక్షమిచ్చి సం
భ్రమముగ కాళహస్తి నిటలాక్షుఁడ సాంబశివా మహాప్రభో.

105


ఉ.

నే శరణన్నవాని కరుణింతువు చక్కగ మెచ్చి యర్ధనా
రీశ్వర నిన్ను నిప్పు డెదిరించినవారి సమస్తలోకసం
కాశనపక్ష భీష్మసురగర్వ దృఢాంచితవజ్ర దైత్య వ
జ్రాసిపితాపితామహులచాఁటునఁ బోయిన సంహరించవా
చూచితె కాళహస్తి శివసుందర సాంబశివా మహాప్రభో.

106


ఉ.

శంకలు దీర్చి భక్తుల నిజంబుగఁ బ్రోతువటంచుఁ బల్కితే
బొంకకు మాడి తప్పకు మబద్ధము లాడకు ముక్తిలేని ని
శ్శంకపరీతఖండహరమాగతమోహరి బాయకుండుటల్
జంకుదువా శివార్చకులచెంతకు దూతలఁ జేరనిత్తువా
శంకర కాళహస్తి నిటలాక్షుఁడ సాంబశివా మహాప్రభో.

107