బొల్లిని మునుస్వామి నాయుడు గారియొక్క జీవిత చరిత్రము/జీవితచరిత్ర

వికీసోర్స్ నుండి

శ్రీరామజయం.

1. ప్రపంచములోనుండు వృత్తులన్నిటి పైకి రైతు వృత్తి చాల శ్రేష్ఠమైనది. పుణ్యమైనది. పాపము లేనిది. ఇహలోకములో కీర్తియు, పరలోకములో మోక్షము నిచ్చునది. బానిసత్వమును పోగొట్టునది. స్వతంత్రము నిచ్చునది. క్షుద్బాధను తీర్చునది. దరిద్రమును పోగొట్టునది. ఎల్లప్పుడు సంతోషము కలుగచేయునది.

2. రైతు కులములో పుట్టినటువంటిన్ని మదరాసు గవర్మెంటులో ప్రధానమంత్రిగా యుండినటువంటిన్ని శ్రీయుత గౌరవ దివాన్ బహదూరు బొల్లిని మునుస్వామినాయుడుగారి యొక్క చరిత్రమును నాకు తెలిసినంతమట్టుకు వ్రాయుచున్నాను. భాషయందుగాని యితర నేవిధములందుగాని తప్పులేదైనా యుండిన క్షమించవలయునని ప్రార్థిస్తున్నాను.

3. ఈయన కమ్మవారు కులమునకు చేరినవారు. తిరుత్తణి తాలూకా వేలంజేరి గ్రామములో మ-రా-రా-శ్రీ, బొల్లిని బొజ్జినాయుడుగారి యొక్క ద్వితీయపుత్రుడు. తారణ సంవత్సరమున జన్మించిరి. బాల్యమందు వేలంజేరి గ్రామంలో వీధిబడిలో ప్రారంభవిద్య నేర్చుకొనిరి. వెనుక తిరుత్తణి గ్రామములో ఇంగ్లీషు భాషను 3-వ ఫారము వఱకు చదివిరి. హైస్కూలులో చదువుటకుగాను వీరి తండ్రిగారు మదరాసులో ఒక సంసారము పెట్టి వీరినిన్ని యితర పిల్లకాయలను చది వించిరి. చిన్నప్పటినుండియు విద్యను నేర్చుకొను విషయములో చాలా అక్కర గలవారు. వృధా కాలక్షేపము చేయరు. దుడ్డు వృధాగా ఖర్చుపెట్టరు. దేహారోగ్యమునకు భంగము కలుగజేయునటువంటి సిగరెట్టు బీడీ మొదలగు దురభ్యాసములగు అలవాటులు లేవు. మెట్రికులేషన్ పరీక్షతేరి క్రిష్టియన్ కాలేజీలో బి. ఏ. పరీక్ష ప్యాసుచేసిరి. బి. యల్. పట్టమొందిరి. వెనుక మదరాసులో హైకోర్టు వక్కీలు పిదప హైకోర్టు జడ్జిగాయుండిన మ-రా-రా-శ్రీ, P. R. సుందరయ్యరువారి ఆఫీసులో అప్రెంటిస్‌గా చేరి న్యాయవాది వృత్తిలో ప్రవేశించిరి. పిదప తమ స్వంత జిల్లాయగు చిత్తూరు జిల్లాలో 1909 సంవత్సరమున ప్రాక్టీసుచేయ నారంభించిరి. న్యాయవాది వృత్తిలో దినక్రమేణ అభివృద్ధికి వచ్చిరి. రైతులకుండు అన్నివిధ కష్టముల తెలుసుకొనిరి.

4. ఉభయ వాదులకుగల వివాదాంశములను చక్కగా తెలుసుకొని యుభయ పార్టీలకు నొప్పజెప్పి రాజీపఱచువారు. స్వప్రయోజనము కొఱకు వ్యాజ్యములను పెంచరు. అందువల్ల యెదురు పార్టివారికి కూడ యితనియందు నమ్మకము గలిగెను. కేసులను రాజీచేసి రాజీనామా వ్రాసినప్పుడు ఎదురుపార్టీవారు నిస్సందేహముగా రాజీనామాలో ముందు చైవ్రాలు చేయుదురు. న్యాయవాది వృత్తిలో మాత్రముంటే రైతుల కష్టములు అన్నిటిని నివర్తించుటకు సాధ్యములేదని యోచించుచుండిరి. అప్పటిలో జిల్లాబోర్డు ప్రెసిడెంటుగాయుండిన మ.రా.రా.శ్రీ, రావుబహదూరు టి. వి. రంగాచార్యులు వారు మ.రా.రా.శ్రీ, నాయుడుగారిని డిస్ట్రిక్టుబోర్డు మెంబ రుగా నామినేటుచేసి వైస్‌ ప్రెసిడెంటుగా చేసిరి. నాయుడుగారు యేపనిలో పూనినప్పటికిన్ని శ్రద్ధగా పనిచేయు వారుగా యుండుటవల్ల లోకల్‌బోర్డు చట్టమును (Local Board's Act) బాగుగా చదివిరి. 1920 సంవత్సరమున మదరాసు శాసనసభకు ప్రతినిధిగా నెన్నుకోబడిరి. పిదప డిస్ట్రిక్టుబోర్డు ప్రెసిడెంటు పదవికి వచ్చిరి. తనకు స్వతంత్ర అధికారమువచ్చిన తరువాత స్వలాభము నెదురుచూడక రైతుల కష్టములను నివర్తించుటకు ప్రారంభించిరి.

5. రైతులు గ్రామములనుంచి యితర యూర్లకు పోవుటకున్ను తమ ధాన్యమును బండ్లమీద తీసుకొనిపోయి బయటి యూర్లలో సరియైనధరలకు అమ్ముటకున్ను వీలులేక చాలా కష్టపడుచుండిరి. తమ పిల్లకాయలను చదువుకొనుటకు పాఠశాలలుండు ప్రక్కగ్రామమునకు పంపుటకు సాధ్యములేక కష్టపడుతూయుండిరి. ఎట్టి యభివృద్ధికిన్ని రాకపోకలకున్ను అవశ్యమైనది రోడ్లుఅని తీర్మానించి రోడ్లులేని గ్రామములకు రోడ్లువేయను ప్రారంభించిరి. విలేజిరోడ్లు వేసినపిదప రాకపోకలకు సులభమాయెను. రైతులకేకాక సమస్తజనులకున్ను సౌకర్యము కలిగెను. రైతుల కష్టములను తొలగించుటకు కంకణ బద్ధుడై యుండిరి.

6. గవర్మెంటువారివల్ల నేమింపబడిన (Agricultural Commission) అగ్రికల్చెరల్ కమిషన్ (వ్యవసాయ కమిషన్) Banking Enquiry Committee బ్యాంకింగు ఎన్‌కొయరి కమిటీలో మెంబరుగా పనిచేసిరి. 7. అందరిని సమానభావముతో చూచువారు. మహరాజు, బీదవాడు, పెద్దవారు, చిన్నవారు, గొప్పజాతివారు, తక్కువజాతివారు, గొప్ప ఉద్యోగస్థుడు, చిన్న ఉద్యోగస్థుడు, జవాను అని భేదమెంచువారుకారు. కోపమేలేదు. శాంతమూర్తి. సాధ్యమైనంతవరకు యితరులకు ఉపకారము చేయును. అపకారముచేయడు. ఇందుకు నిదర్శనము ఆయన యొక్క ముఖారవిందమే.

8. 1930 సం||రములో జస్టిసు కక్షిలో నాయకత్వము వహించిరి. అప్పటిలో ఆ కక్షివారికి బ్రాహ్మణులపై ద్వేష మెక్కువగా నుండెను. ద్వేషము చేతనే పనిని కాదనిజెప్పి శాంతముతోను ప్రేమతోను అన్నిపనులు సాధించవచ్చునని జస్టిసుకక్షిలో బ్రాహ్మణలనుకూడ చేర్చుకోవచ్చునని తీర్మానమును ప్యాసుచేయుటకు నెల్లూరులో జరిగిన బ్రాహ్మణేతర మహాసభలో చాలా పోరాడిరి. అప్పటిలో అరవదేశములో నుంచివచ్చిన ప్రముఖులలో కొందరు ఆక్షేపించిరి. పిదప వీర్లే మ.రా.రా.శ్రీ నాయుడుగారు చెప్పిన మేరకు బ్రాహ్మణులనుకూడా చేర్చుకోవలయుననే తీర్మానమును ప్యాసుచేసిరి. అన్నిజాతులవారికిన్ని నాయుడుగారియందు నమ్మకము విశ్వాసముగలదు. మహాత్మా గాంధిగారియొక్క వుత్తరవులను తనవల్ల సాధ్యమైనంతవరకు నిశ్చయముగా ధృడచిత్తముతో నవలంబించువారు.

9. 27-10-1930 మదరాసు గవర్మెంటుకు ప్రధాన మంత్రిగా నేమింపబడిరి. మంత్రి పదవికివచ్చిన తరువాత రైతులు డిస్ట్రిక్టు బోర్డు టోలుగేట్లకు బండ్లకు చెల్లించుతూ యుండిన పన్నును తీసివేయుటకు చట్టమును ప్యాసు చేయించిరి.

9. ఇదివరకు గవర్మెంటులో (Electric Corporation) వగైరా వుద్యమములను పనిచేయుట యూరోపియను కంపెనీలకే నిచ్చుచుండిన స్వతంత్రమును మనదేశస్తులున్ను వారితోపాటి యిటువంటిపనులు చేయుటకు శక్తిసామర్థ్యములో ఎంతమాత్రమున్ను తక్కువ అయినవారుకారు అని నిరూపించుటకు మన రాజధానిలో కోయముత్తూరు, నీలగిరి, చిత్తూరు మొదలగు యూర్లలో, (Electric Corporation) లను స్థాపించుటకు సహాయము చేసిరి. ఈయన యింత గొప్పపదవికి రావడం చిత్తూరు జిల్లాకు గొప్పగౌరవమేగాక మఱియు మదరాసు రాజధానిలో యుండు కమ్మవారు కులమునకే యొక కిరీటమువలె వెలుగుచుండిరి. ఈయన ప్రధానమంత్రిగా యుండినకాలములో జస్టిసుకక్షిలో భిన్నభిప్రాయములు కల్గినందున తన మనస్సాక్ష్యమునకు విరుద్ధముగా ప్రవర్తించుట కిష్టములేదని తెలుపుచు మంత్రిపదవికి రాజీనామానిచ్చి జస్టిసు డెమక్రెటికి పార్టీని స్థాపించి దానికి నాయకత్వము వహించిరి. ఈయన జస్టిసు పార్టీనుంచి తొలగినదిమొదలు పార్టీకి దినక్రమేణ బలముతగ్గినది. అందుపై జస్టిసు పక్షమువారు యీయనను మరల నాయకత్వమును వహించి పార్టీని బలపరచవలయునని అడుగుకొన్నందుపై అందుకు కొన్ని కండిషనులను తెలియచేసిరి. పార్టీ ఏకమవుటకు ప్రయత్నము పూర్తియగు సమయములో 8-1-35 తేదిన దేహమునకు జబ్బుచేసి 6 రోజులు ఖాయలాగాయుండి 13-1-35 రాత్రి రామస్మరణచేయుచు వుత్తరాయణ పుణ్యకాలము పుట్టినవెంటనే వైకుంఠప్రాప్తి జెందిరి. ఈయన జీవితమువల్ల రెండు అంశములు స్థిరముగా దృశ్యమగుచున్నది.

1. బుద్ధి యనునది మానవకోటికి భగవంతునివల్ల యివ్వబడిన ఒకశక్తి. బాల్యదారభ్య వృద్ధిపరచి సన్మార్గములో ప్రవర్తింపచేసినయెడల అందరన్ను వృద్ధికివచ్చి వున్నతపదవికి వచ్చుచున్నారని చెప్పుటకు సంశయములేదు.

2. జనులయందు ఐక్యమత్యము వృద్ధిపరచుటకు సర్వజనులయందు ప్రేమ అను దానిని వ్యాపింపచేయుటతప్ప పంక్తిభోజనమున్ను, ఒక తెగలోనుంచి మఱియొక తెగవారు వివాహము చేసుకోవడమున్ను, కులభేదములను వృద్ధిపరచడముకాదని స్పష్టముగా తెలియచేయుచున్నది.

ఈయన వయస్సు సుమారు 51. ఈయనయొక్క అకాలమరణము యీయన కుటుంబమునకు బంధువులకు మిత్రులకున్ను, చిత్తూరు జిల్లాలో యుండు కక్షిదార్లకున్ను దేశమునకేగాక ప్రభుత్వమువారికికూడా గొప్పవ్యసనమును కలుగచేసినది.

శ్రీయుత దివాన్ బహదూరు మునుస్వామినాయుడు గారు శాసనసభ ప్రవేశించినది మొదలు నిదివరకు చేసిన పనులను సంక్షేపముగా క్రింద వివరించియున్నాను. 1. అడవుల విషయయలో పోరాడి పట్టా భూమికి ఒక మైలు దూరము వరకు రిజర్వు ఫారస్టు యుండగూడదని తీర్మానము ప్యాసు చేయించిరి.

2. అడవి పంచాయతుల నేర్పాటు చేయించి పశువులు మొదలగు వాటిని మేపుకొనుటకు అడవులను పంచాయతీ దార్ల స్వాధీనము చేయించిరి.

3. పశువుల చికిత్సలకుగాను యొకఆస్పత్రి చిత్తూరు జిల్లాలో పెట్టించిరి.

4. డిస్ట్రిక్టుబోర్డు ప్రెసిడెంటుగాయుండిన కాలములో అనాదరణ చేయబడినటువంటి గ్రామములకు రోడ్లు వేయించిరి.

5. చంద్రగిరి రెంటు కోర్టుక్యాంపుపోతూ యుండినందువల్ల జమీందారీ యిలాఖా రైతులకు కోర్టుకు పోవుటకుగాను శెలవులు యెక్కువ అగుతూ యుండినది. దానిని తగ్గించుటకు సం|| కోర్టు చంద్రగిరిలోనే ఖాయముగా యుండవలయునని యేర్పాటుచేయించిరి.

6. మంత్రి పదవి వచ్చినతర్వాత బండ్లకు డిస్ట్రిక్టుబోర్డు టోలు గేట్లకు రైతులు చెల్లించుతూ యుండిన టోలుగేటు పన్నును తోసివేయవలయునని చట్టము ప్యాసుచేయించిరి.

7. Electric Corporation వగైరా వుద్యమములలో పనిచేయుటకు మనదేశస్తులకు సహాయము చేసిరి. 8. భగవంతుడు తెలివి మానవకోటి కందరికిని యిచ్చియున్నాడు. దానిని వృద్ధిపరచినయెడల అందరున్ను వున్నత పదవికి రావచ్చును అనే తత్వమును దృష్టాంతముగా చూపిరి.

9. ప్రేమనే భగవంతుడు ప్రేమవల్లనే ప్రపంచములో సమస్తమును జయించవచ్చును అని మహాత్మా గాంధిగారి తత్వమునున్ను మ.రా.రా.శ్రీ, నాయుడుగారికి ఆప్తస్నేహితులలో యొకరైన మ.రా.రా.శ్రీ, చిత్తూరులో నివసించు వక్కీలు జే. క్రిష్ణరావుగారు రచియించిన క్రిందవ్రాసియుండు పద్యములో కనియుండు అంశములను అనుష్ఠానమునకు తెచ్చుచుండిరి.

శ్రీయుత దివాన్ బహదూరు B. మునుస్వామినాయుడుగారి

యొక్క గుణములలో కొన్నిటిని మాత్రము

క్రింద వ్రాసియున్నది.

1. శాంతస్వభావులు, కోపమేలేనివారు, దుర్భాషణములెఱుగరు.

2. ఎవరికిని ఎన్నడును కీడుచేసి ఎఱుగరు. శక్తివంచన లేక ఎల్లఱకును సాయముచేసినవారు.

3. రాజకీయాది ప్రజావిషయక కార్యములందు తన యాజ్ఞలో యుండువారు వెలిబుచ్చు స్వతంత్రాభిప్రాయముల జోక్యము గలిగించుకొనువారుగారు. 4. జాతి, మత, కుల; వర్ణభేదము పాటింపక సర్వులను సమానదృష్టితో ప్రేమించువారు.

5. అపకారము చేసినవారికికూడ నుపకారము చేయువారు.

6. ధనముకొఱకు అనవసరముగా వ్యవహారములను పెంచక వీలైనంతవఱకు రాజీచేసి ఇరుకక్షుల వైషమ్యముల చల్లబఱచువారు.

7. సర్వులతోడను సమముగా మెలగువారు, ఆకారణముననే జిల్లాబోర్డు అధ్యక్షులుగా నుండినపుడు (Land Acquisition) ల్యాండు ఆక్విజిషన్ ప్రొసీడింగ్సు లేకనే పెక్కు రోడ్లను వేయించగల్గిరి.

8. న్యాయవాదివృత్తియందు న్యాయాధిపతిని చక్కగ గుర్తెరిగి తగురీతి కేసు నాతడు గ్రహించునట్లు వాదించువారు. కావుననే తనవృత్తియందు ఉన్నతపదవి వహించిరి.

9. సుగుణసంపన్నులు, నీతిపరులు, కావుననే ప్రతి కక్షులకుగూడ వారియందు నమ్మకముండెను.

10. ప్రజలయందు ఏకీభావము ప్రబలుట ప్రేమచేతనేగాని అంతర్జాతీయ వివాహ భోజనాదికృత్యముల చేతగాని మతమును మార్చుటచేతగాని కాదని నిరూపించిరి.

సీ|| నిఖిలజీవులయెడ నిండారుప్రేమంబు
          వీచులనభిషేక మాచరించి,
    సత్యధర్మాచార శమదమాదికననప్రసవ
          రాజములనర్చన మొనర్చి,
    కామలోభక్రోధ గర్వాదులనుజ్ఞాన
         వహ్నిదహించి నివాళిసేసి,
    లోకకల్యాణంబు సేకూర్చుపుణ్యకర్మ
         ఫలముల నుపహాఠంబొసంగి

తే.గీ. సల్పుపూజయె యుత్తమస్తవ్యపూజ
     నంబనాసక్తయోగ సారంబుమోక్ష
     సాధనంబునీకు బరమసమ్మతంబు
     విశ్వకారణ కారుణ్య వృష్టిపూర||

ఆ|| శాంతమానసమున జల్లనైశీతల
    భాతినున్నవాడు పరమయోగి
    అట్టివాడుముక్తి నతివేగగైకొను
    విశ్వదాభిరామ వినురవేమ.

ఆ|| శాంతమేజనులను జయమునొందించును
    శాంతముననెగురుని జూడదెలియు
    శాంతభావమహిమ జర్చింపలేమయా
    విశ్వదాభిరామ వినురవేమ.

ఇట్లు,

టి.యన్.ఉమాపతిఅయ్య.

N. B. శ్రీయుత మునుస్వామినాయుడుగారి యొక్క చరిత్రమును, బాలురందరున్ను చదివి ఆయనవలె దేశమునకు కీర్తి తేవలయునని కోరుచున్నాను.