బైబులు భాష్య సంపుటావళి - బైబులు బోధనలు/మనవి మాట

వికీసోర్స్ నుండి

మనవి మూట బైబులు భాష్యం సంచికలను 1972లో ప్రారంభించాం, ఇప్పటికి 157 సంచికలు ముగిసాయి. వీటినే యిప్పడు పది బైబులుభాష్యం సంపుటాలనుగా ముద్రించాం. ఈ సంచికల్లో ఓ 60 మాత్రం ఇదివరకే "బైబులు గ్రంధమాల" అనే పేరుతో పుస్తక రూపాన్ని సంతరించుకొని పలు ముద్రణలు పొందాయి.

ప్రస్తుతం ఈ 157 సంచికలను, వీటిల్లో వచ్చే అంశాలనుబట్టి, ఓ క్రమపద్ధతిలో అమర్చాం, ఈ సంపుటాల్లో వుంది ప్రధానంగా బైబులు వివరణలు, దైవశాస్త్ర విషయాలు, ప్రార్ధనాంశాలు. మన క్రైస్తవ భక్తివిశ్వాసాలను బలపరచేది ముఖ్యంగా ఈ యంశాలే. ఎందరో వేదపండితుల భావాలు ఈ పుస్తకాల్లోకి వచ్చాయి. ఆ మహానుభావంలదరికీ వందనాలు.

ఈ పుస్తకాలు మన క్రైస్తవమత సత్యాలను లోతుగా అర్థంచేసికోవడానికీ, ప్రార్ధన జేసికోవడానికీ, ఇతరులకు బోధించడానికీ గూడ ఎంతో వుపయోగపడతాయి. కనుక మన గురువులు, మరకన్యలు, ఉపదేశులు, గృహస్థలు మొదలైనవాళ్లు ఎవరైనాసరే వీటిని వినియోగించుకొని ఆధ్యాత్మిక లాభాన్ని పొందవచ్చు.

చాల సంవత్సరాల పొడుగున కొనసాగించిన రచనలు కనుక ఈ గ్రంథాల్లో పునరుక్తులు అనివార్యమయ్యాయి. పాఠకులు మన్నింతురుగాక. మొదటవ్రాసిన సంచికలకు తర్వాత వ్రాసిన వాటికీ శైలిలోకూడ భేదం పంది.

మన క్యాతలిక్ సమాజంలో పఠనాభ్యాసం లేదు. ఇది మనం అవశ్యం సవరించు కోవలసిన ప్రధానలోపాల్లో వొకటి. ఇందుకే ఈ గ్రంథాలను చౌకధరకే విక్రయిస్తున్నాం. ఈ పుస్తకాలు మన సాహిత్యరాశిని పెంచి మన ప్రజల్లో పఠనాభిరుచిని ప్రోదిచేస్తాయని ఆశిస్తున్నాం. అసలు తెలుగులో మనకున్న క్యాతలిక్ సాహిత్యమే చాల తక్కువ.

ఫాదర్ టి.మర్రెడ్డిగారి ఆర్థిక సహాయంలేందే ఈ సంపుటాలు ఇప్పుడు, ఈ రూపంలో వెలుగు చూచేవి కావు. ప్రభువు ఆ మహనీయుని దీవించి ఆయన కృషిని సఫలీకృతం జేయునుగాక, విజయవాడ మేత్రాసనం తరపుననే ఈ పుస్తకాలను ప్రచురిస్తున్నాం.

ఈ సంపుటాల్లో రచయిత 31 ఏండ్ల పొడుగున కొనసాగించిన అవిరళకృషి దాగివుంది. కరుణామయుడైన ప్రభువు యెరూషలేం దేవాలయంలోని సాయంకాలపు ధాస్యబలినివలె ఈ సాహిత్యబలిని గూడ నెనరుతో స్వీకరించునుగాక.

ఈ పుస్తకాలకు పరిచయవాక్యాలు వ్రాసియిచ్చిన విజయవాడ పీఠాధిపతులు, పూజ్యులు, మహాఘనత వహించిన డాక్టరు ఎం.ప్రకాష్ గారికి నమస్సుమాంజలులు. వీటిని సర్వాంగసుందరంగా ముద్రించిన శ్రీ పి.సాంబిరెడ్డిగారికి వారి సిబ్బందికి, ఓపికతో ప్రూఫులు దిద్దిన శ్రీ వి. గోపాలరెడ్డిగారికి మా కృతజ్ఞతలు.

- గ్రంథకర్త