బైబులు భాష్య సంపుటావళి - పవిత్రాత్మ/సప్తవరాలు

వికీసోర్స్ నుండి

2. సప్తవరాలు

బైబులుభాష్యం 71-78

విషయసూచిక

  1. సదుపదేశం 68
  2. దైవభక్తి 72
  3. దృఢత్వం 75
  4. దైవభీతి 77
  5. తెలివి 79
  6. వివేకం 82
  7. విజ్ఞానం 84
  8. వరాల వివరణం 86

ప్రశ్నలు 89

1, సదుపదేశం

1. సదుపదేశం అంటే యేమిటి?

ఆత్మ మనకు దయచేసే వరాల్లో సదుపదేశం కూడ వొకటి. ఈ వరం ద్వారా కష్టమైన పరిస్థితులూ గడ్డుసమస్యలూ ఎదురైనపుడు మంచి నిర్ణయాలు చేసికొనే శక్తిని పొందుతాం. జీవితంలో బోలెడన్ని సమస్యలు ఎదురౌతూంటాయి. వాటి నేలా పరిష్కరించుకోవాలో, ఎలాంటి నిర్ణయాలు చేసికోవాలో మన కట్టే తెలియదు. ఆలాంటి పరిస్థితుల్లో ఈ వరం మనకు వెలుగుని ప్రసాదిస్తుంది. ఆత్మేమన హృదయంలో మాటలాడి సలహా చెప్తుంది. దానివల్ల మనం సమస్యను అర్థంచేసికొంటాం. తగిన నిర్ణయాలు చేసికొంటాం. కార్యాచరణకు పూనుకొంటాం.

ప్రభువు "మీరు న్యాయస్థానాలకు అప్పగింపపడినపుడు ఏవిధంగా మాట్లాడాలా, ఏమి చెప్పాలా అని కలత చెందకండి. ఆ సమయానికి తగినరీతిగా చెప్పవలసిందల్లా మీకు అనుగ్రహింపబడుతుంది. మీరు మాట్లాడే మాటలు మీవి కావు. మీ తండ్రి ఆత్మే మీ నోట మాట్లాడుతుంది" అన్నాడు - మత్త 10, 19. ఇక్కడ సందర్భం వేదహింసలు. ఐనా ఒక్క వేద హింసలు కాలంలోనే కాకుండ ఇతరావసరాల్లో కూడ ఆత్మ మనకు సలహా యిస్తూంటుంది. పేత్రుకి ఆపత్కాలంలోఈలాంటి సలహా లభించింది. క్రీస్తు ఉత్తానానంతరం శిష్యులు యెరూషలేములో బోధిస్తున్నారు. ఆబోధ వినేటప్పటికి యూదనాయకులకు కన్ను కుట్టింది. వాళ్ళు శిష్యులను చెరలో త్రోయించారు. క్రీస్తునిగూర్చి బోధింపవద్దని ఆజ్ఞాపించారు. అప్పడు పేత్రు ఆత్మవల్ల ప్రబోధితుడై "మేము మీలాంటి మనుష్యులకు కాక దేవునికి విధేయులమై యుండాలి. మీరు క్రీస్తుని చంపారు. కాని తండ్రి అతన్ని రక్షకునిగా నియమించాడు. ఆ క్రీస్తుకి విధేయులైనవారికి పవిత్రాత్మ లభిస్తుంది” అని ప్రసంగించాడు – అచ 5,29–32

చాలమంది అర్చ్యశిషుల జీవితాల్లో ఈ సదుపదేశం అనే వరం ప్రస్ఫుటంగా కన్పిస్తుంది. ఆంటోనైనస్ అనే భక్తునికి ఈ వరప్రసాదం మిక్కుటంగా వుండేది. ఆనాటి సామాన్య ప్రజలూ రాజకీయ నాయకులూ గూడ అతన్ని సలహా అడిగేవాళ్ళు సియన్నాపురి కత్తరీనమ్మగారిలో ఈ వరం మెండుగా వుండేది, ఆమె యువతిగా వున్నపుడే, చదువు సంధ్యలు లేక పోయినప్పటికి, రాజకీయ నాయకులకీ కార్డినల్సుకీ ఆలోచన చెపుండేది, ఆనాటి పోపుగారికికూడ సలహాదారిణి అయింది. వీరవనితయైన ఆర్మపురి జోన్ గారికి ఈ వరం పుష్కలంగా వుండేది. ఆమె ఫ్రెంచి సైన్యాలకి నాయకత్వం వహించి యుద్ధ వ్యూహాలు పన్నేది. ఈ వ్యూహాలు శత్రుసైన్యాధిపతులకు దిగ్ర్భాంతి కలిగించేవి. "మీరు నరమాత్రులనుండి సలహాను పొందారు. నేను దేవుని ఆత్మనుండి సలహా పొందాను" అని తన విరోధులకు చెప్పింది జోన్

2. ఈ వరంతో ఏమి యవసరం?

జీవితంలో బోలెడన్ని సమస్యలూ చిక్కులూ ఎదురౌతూంటాయి. ఆలాంటప్పుడు మామూలుగా తోడినరులను సలహా అడుగుతాం. మనం నమ్మినవాళ్ళనూ మన మిత్రులనూ సంప్రతిస్తాం. నరుల సలహా వలన లాభం కలుగుతుంది. కాని దేవుని సలహా వలన యింకా యొక్కువలాభం కలుగుతుంది. కనుక మనం పవిత్రాత్మను అడుగుకోవాలి.

కొన్ని పరిస్థితులు తీసికొందాం. మన యువతీయువకులు యుక్తవయస్సుకి వచ్చారు. వాళ్ళు గురుకన్యా జీవితాలే యెన్నుకోవాలో, లేక సంసార జీవితమే యెన్నుకోవాలో ఎలా తెలుస్తుంది? జీవితంలో మన అభిరుచులు ఒకవిధంగా ఉన్నాయి. ఉద్యోగావకాశాలు మరొక విధంగా ఉన్నాయి. అప్పడేమి చేయాలి? ఒకోసారి కొన్ని సమస్యలకు రెండుమూడు పరిష్కార మార్గాలు గోచరిస్తాయి. వాటిల్లో దేన్ని యెన్నుకోవాలి? ఈలాంటి చిక్కులు జీవితాంతమూ వస్తూనే వుంటాయి. వాటిల్లో మనకు సలహా అవసరం. ఈ వరం ఇందుకొరకే వుద్దేశింపబడింది. ఇంకా, ఒకోసారి యితరులు తమ సమస్యలతో వచ్చి మనలను సలహా అడుగుతారు. వాళ్ళకు మనం దురాలోచనగాదు, మంచి ఆలోచన చెప్పాలి. ఈ సామర్థ్యం మన కెక్కడనుండి వస్తుంది? ఈ వరంద్వారానే జీవితంలో సిద్దాంతంవేరు. ఆచరణం వేరు. ఉపాధ్యాయుడు బోథన పద్ధతులను క్షుణ్ణంగా నేర్చుకొని వుండవచ్చు. కాని పిల్లలకు సరిగా పాఠాలు చెప్పలేకపోవచ్చు. వైద్యుడు వైద్యశాస్తాన్ని బాగా చదువుకొని ప్రధమ శ్రేణిలోనే ఉత్తీర్ణుడై యుండవచ్చు. కాని రోగులు వచ్చినపుడు వ్యాధినిర్ణయం చేయలేకపోవచ్చు జబ్బును కుదర్చలేకపోవచ్చు. అందుకే యెపుడుకూడ సిద్ధాంతంవేరు ఆచరణం వేరు అని చెప్పాం. ఆత్మ సలహా అనే వరం ప్రధానంగా ఈ యాచరణం కొరకే ఉద్దేశింపబడింది.

ఈ వరంద్వారా మనం ఈ ప్రత్యేక పరిస్థితుల్లో, ఈ ప్రత్యేక సమస్యలో, ఏమిచేయాలో తెలిసికొంటాం, ఆత్మ నీవు ఇప్పడు ఈలా చేయి అని మన అంతరాత్మలో చెప్తుంది. లోకంలో నరుడు నరునికి హితోపదేశం చేసినట్లుగానే ఆత్మకూడ మనకు హితోపదేశం చేస్తుంది. మన తరపున మనం ఆత్మచెప్పినట్లుగా చేస్తే చాలు, సమస్యనుండి బయట పడతాం.

ఈ వరంద్వారా మనం దైవచిత్తం తెలిసికొంటాం, దేవుడు ఈ విషయంలో మనలను ఎటుపొమ్మంటున్నాడో, ఏమి చేయమంటున్నాడో గ్రహిస్తాం. ఒకమారు దైవచిత్తాన్ని గుర్తించాక ఇక మనం చేయవలసిన పనిని చేసికోవచ్చు. కాని మనకు తరచుగా దైవచిత్తమేమిటో అంతుబట్టదు. అప్పడు ఈ వరం మనకు తోడ్పడి, మనపట్ల దేవుని యభిమతమేమిటో స్పష్టం చేస్తుంది. అందుచేత ఇది చాల ఉపయోగకరమైన వరమని చెప్పాలి.

ఈ వరమే లేకపోతే ఏమౌతుంది? మన ఆలోచనలు స్పష్టంగా వుండవు. తొందరపడి, గ్రుడ్డిగా నిర్ణయాలు చేసికొంటాం. అవి మనలను అపమార్గం పట్టిస్తాయి. కనుక మనం పొరపాట్ల చేస్తాం. ఓడ ఒకరేవుకు చేరబోయి మరొక రేవుకి చేరి కూర్చుంటుంది. ఈలాంటి అనర్ధాలను వారించడానికే ఈ వరం ఉద్దేశింపబడింది.

3. ఆత్మ సలహాను ఏలా పొందాలి?

ఆత్మనుండి సలహాను పొందాలంటే ఆ యాత్మనే అడుగుకోవాలి. వినయంతోను నమ్మకంతోను వేడుకొనేవాళ్ళ మొర దేవుడు ఆలిస్తాడు. కనుకనే కీర్తనకారుడు "ప్రభూ! నీ మార్గాలను నాకు తెలియజేయి, నీ త్రోవలను నాకు ఎరుకపరచు" అని ప్రార్ధించాడు - కీర్త 25, 4 మామూలుగా మనం ఉదయకాల ప్రార్థనలోనే ఏరోజు కారోజు ఆత్మ సలహానీ సహాయాన్నీ అడుగుకోవడం మంచిది. మనం చేయబోయే ప్రతి ముఖ్యమైన కార్యంలోను, మన కెదురయ్యే ప్రతి చిక్కు సమస్యలోను వెలుగును ప్రసాదించమని కూడ ఆత్మను అడుగుకోవాలి.

ఈ సందర్భంలో భక్తులు దేవుణ్ణి సలహా అడగడాన్ని గూర్చి కొన్ని ఉదాహరణలు చూడ్డం మంచిది. రిబ్కా గర్భంలో ఇరువురు శిశువులున్నారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు గట్టిగా నెట్టుకొన్నారు, ఆమె కీడుని శంకించింది. ప్రభువు దగ్గరికివెళ్ళి సలహా అడిగింది. ప్రభువు "నీ గర్భంలో పరస్పర వైరంగల రెండు జాతులు యిమిడి వున్నాయి. పెద్దబిడ్డడు చిన్న బిడ్డడికి దాసుడౌతాడు” అని చెప్పాడు. ఆ బిడ్డలు ఏసావు యాకోబులు - ఆది 25, 22-23.

మోషే మహాభక్తుడు. అతడు చిక్కులెదురైనపుడల్లా ప్రభువుని సంప్రతించేవాడు. మస్సామెరిబాలవద్ద నీళ్ళ దొరకనందున ప్రజలు అతనిమీద తిరుగబడ్డారు. అతడు ప్రభువు ఉపదేశమడిగాడు. దేవుడు నీవు నదిని కొట్టిన కర్రతోనే కొండబండను చరవమని సలహా యిచ్చాడు. మోషే ఆలాగే చేయగా బండనుండి నీళ్ళు వెలువడ్డాయి. ఆ నీళ్ళ త్రాగి ప్రజలు సంతృప్తి చెందారు - నిర్గ 17, 4-6. ఇంకా, యీ మోషే ప్రభువు గుడారంలోకి వెళ్ళి అతనితో తన కష్టసుఖాలన్నీ చెప్పకొనేవాడు. ఆ ప్రభువుని సలహా అడిగేవాడు. మిత్రుడు మిత్రునితో మాట్లాడినట్లే దేవుడతనితో ముఖాముఖి మాట్లాడేవాడు. తన చిత్తాన్ని అతనికి తెలియజేసేవాడు - నిర్గ 33, 11.

దావీదు తాను శత్రువులతో యుద్దాలు చేసేపుడల్లా ప్రభువుని సంప్రతించేవాడు. ఓమారు బాలు పెరాసీమవద్ద అతనికి ఫి స్టీయులతో పోరు తటస్థించింది. అతడు ప్రభువుతో మంత్రాలోచన చేయగా ప్రభువు శత్రువు మీదికి పొమ్మని సలహాయిచ్చాడు. ఆ సలహా ప్రకారమే దావీదు శత్రువుల మీదికి వెళ్లి వాళ్ళ నోడించాడు - 2 సమూ 5, 19.

"ప్రభుని ఒక్క వరం కోరుకొన్నాను నాకు కావలసింది ఇదొక్కటే - నా జీవితమంతా ప్రభు మందిరంలో వసించాలనీ ఆయనను ప్రసన్నుద్ధి చేసికోవాలనీ దేవాలయంలో అతన్ని సంప్రతించి చూడాలనీ నా కోరిక"

అన్నాడు కీర్తనకారుడు. ఇతడు సమస్యల్లో ప్రభువు నుండి సలహా పొందాలని అభిలషించాడు - 27,4. ఈ భక్తుల్లాగే మనంకూడ కష్టసుఖాల్లో, ఆపదల్లో, అక్కరల్లో ఆత్మ సలహా అడుగుకోవాలి. అలా అడిగేవాళ్ళను ఆయాత్మ సరళమార్గాల్లో నడిపిస్తుంది. దేవుని బిడ్డలను దేవుని ఆత్మే నడిపిస్తుంది. - రోమా 8,14.

2. దైవభక్తి

1.దైవభక్తి అంటే యేమిటి?

దైవభక్తి అనే వరంవల్ల దేవుణ్ణి తండ్రిలా భావించి పూజిస్తాం. దేవునికి అంకితమైన వ్యక్తులనూ వస్తువులనూ గౌరవభావంతో చూస్తాం. ఈ వరంవల్ల ప్రార్ధనం మొదలైన భక్తికృత్యాలను సంతోషంతో నిర్వహిస్తాం.

దేవుడు సృష్టికర్త కావడంవల్ల మనకు యజమానుడౌతాడు. కనుక అతన్ని సహజంగానే గౌరవిస్తాం. ఐతే ఈ వరంద్వారా ఆ ప్రభువుని తండ్రిలా భావించి పూజిస్తాం. అతన్ని నమ్ముతాం, ప్రేమిస్తాం, "మీరు దేవుని నుండి మిమ్ము భయకంపితులను చేసే బానిసపు ఆత్మను స్వీకరించలేదు. దత్తపత్రత్వాన్నొసగే ఆత్మనే స్వీకరించారు. ఆ యాత్మద్వారా మనం దేవుణ్ణి అబ్బా – అనగా, నాన్నా అని పిలుస్తాం, ఆ యాత్మ మన ఆత్మతో ఏకమై మనం దేవునికి పుత్రులమని సాక్ష్యమిస్తుంది" - రోమా 8, 14-15. పవిత్రాత్మ మన హృదయాల్లో వుండి మనచేత దేవుణ్ణి నాన్నా అని పిలిపిస్తుంది. తాను మన హృదయాల్లో వుండి మనం దేవునికి బిడ్డలమని హెచ్చరిస్తూంటుంది. దేవునికీ మనకీ తండ్రీ బిడ్డల సంబంధం వుందని గుర్తించడమే ఈ వరంలోని ముఖ్యాంశం.

ఈ వరంద్వారా దేవునికి అంకితులైన పునీతులనూ పవిత్ర వస్తువులనూ గౌరవమర్యాదలతో చూస్తాం, 1. దేవమాత దేవునితల్లి, మనతల్లికూడ. దేవునికి సన్నిహితంగా వుండే వ్యక్తి కనుక ఆమెను గౌరవించి ప్రేమిస్తాం. 2. దేవుని మహిమను తమలో యిముడ్చుకొన్నవాళ్ళు కనుక అర్చ్యశిష్ణులనూ సన్మనస్కులనూ గౌరవిస్తాం. 3, దివ్యగ్రంథం దేవుని వాక్కు అతని ప్రేమభావాలను తెలియజేసేది. కనుక ఆ గ్రంథాన్ని పూజ్యభావంతో చూస్తాం. 4. తిరుసభ క్రీస్తు స్థాపించినది. క్రీస్తుపత్ని మనకు జ్ఞానజీవాన్ని ప్రసాదించే తల్లి, దివ్యసత్రసాదంలాంటి సంస్కారాలద్వారా మనలను పోషించే తల్లి, కనుక ఆ తల్లిని గౌరవిస్తాం. ఆమెపట్ల బిడ్డల్లా మెలుగుతూ విధేయత చూపుతాం. 5. తిరుసభ అధికారియైన పరిశుద్ధ పోపుగారు క్రీస్తు స్థానంలో వుండేవ్యక్తి కనుక క్రీస్తుకిలాగే అతనికికూడ విధేయులమౌతాం. 6. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పెద్దలు మొదలైన వాళ్ళంతా దేవుని స్థానంలో వుండే వ్యక్తులు. కనుక వాళ్ళను గౌరవాదారాలతో చూస్తాం. దేవుడు ఎవరినైనా మన ఆధీనంలో వుంచితే వాళ్ళను తండ్రిలాగ ఆదరిస్తాం. దైవభక్తి ఇంత విస్తృతమైన వరం.

2. దైవభక్తితో ఏమి యవసరం?

దేవుణ్ణి ప్రేమభావంతో పూజించాలన్నా పెద్దలకు విధేయత చూపాలన్నా మన క్రిందివాళ్ళను అప్యాయంగా ఆదరించాలన్నా దైవభక్తి అవసరం. ఇదే లేకపోతే దేవుడు యజమానుడు, మనం బానిసలం అనుకొంటాం. అతడు తండ్రి మనం బిడ్డలం అనుకోం, పూర్వవేదపు దాస్యత్వంలోనే వుండిపోతాంగాని నూత్న వేదపు పుత్రత్వాన్ని పొందలేం - యోహా 15,15. ఇంకా, యీ వరమే లేకపోతే ప్రార్ధనం విసుగు పుట్టిస్తుందేకాని ఊరట నీయదు. దేవుడు పంపే కష్టాలను శిక్షనుగా భావించి మొరపెడతామేగాని అవి మన మేలు కొరకే ఉద్దేశింపబడిన పరీక్షలని గ్రహించం. పైగా ఈ వరంవల్ల మనం సల్పే భక్తి కృత్యాలన్నీ మనకు సంతోషం కలిగిస్తాయి. మనం ఉత్సాహంతో ఆనందంతో దేవుణ్ణి కొలుస్తాం. గాలి అనుకూలంగా వీచినపుడు పడవ సులువుగా పయనిస్తుంది. అలాగే ఈ వరంవల్ల మన ఆధ్యాత్మిక జీవితం సుకరమౌతుంది.

గురువులకూ మఠకన్యలకూ ఎన్నో ఆధ్యాత్మిక అనుషానాలుంటాయి. ఆలాగే భక్తికల గృహస్తులకు కూడ, రోజురోజూ ఈ యధ్యాత్మిక కార్యాలన్నిటినీ చేసికొంటూ పోవాలంటే సహజంగానే విసుగుపడుతుంది. ఆలాంటప్పడు ఈ వరం మనకు తోడ్పడుతుంది. అది మన హృదయాల్లో ప్రేమజల్లని కురిపిస్తుంది. ఈ ప్రేమవల్ల మనం దేవుణ్ణి అనురాగపు తండ్రిలా భావిస్తాం. అతని కోసం ఎంతసేవైనా చేయడానికి సంసిద్దులమౌతాం. ఆగస్టీను భక్తుడు వాకొన్నట్లు "ప్రేమవ్ఛన్నకాడ పని భారమనిపించదు. ఒకవేళ నని భారమనిపిస్తే, ఆ భారమైన పనినిగూడ ప్రేమిస్తాం",

ఇంకా వొకోసారి, మన అధీనంలోవున్న వాళ్ళల్లో కొందరంటే మనకు ఇష్టంగా వుండకపోవచ్చు. కనుక మనం వాళ్ళను అప్యాయంగా చూడకపోవచ్చు అలాంటప్పుడు ఈ వరం మనమీద పనిచేసి మన అధీనంలో వున్నవాళ్ళనందరినీ మనం ప్రేమతో చూచేలా చేస్తుంది. మనం వాళ్ళల్లో క్రీస్తుని చూచేలా చేస్తుంది. పౌలు తన క్రైస్తవుల నుద్దేశించి “బిడ్డలారా! క్రీస్తు రూపం మీ యందు నెలకొనడానికిగాను, స్త్రీ ప్రసవవేదన ననుభవించినట్లే, నేనూ మిమ్ముగూర్చి బాధపడుతున్నాను" అన్నాడు - గల 4,19, ఈ వరంద్వారా మన క్రిందవుండే వాళ్లపట్ల మనకుకూడ ఈలాంటి ఆదరభావమే కలుగుతుంది.

3. ఈ వరాన్ని సాధించడం ఎలా?

ఈ వరంలోని ప్రధానాంశం దేవుణ్ణి తండ్రిగా భావించడం, అతన్ని ప్రేమతోను సంతోషంతోను పూజించడం అని చెప్పాం. దేవుణ్ణి తండ్రిగా అనుభవానికి తెచ్చుకోవాలంటే, అతన్ని తండ్రిగా చిత్రించే వేదవాక్యాలను శ్రద్ధతో ధ్యానం చేసికోవాలి. కనుక ఆలాంటి వాక్యాలను కొన్నిటిని అవలోకిద్దాం.

అబ్రాహాము మమ్మ ఎరుగకపోయినా,యాకోబు మమ్మ అంగీకరింపకపోయినా, ప్రభూ! నీవే మాకు తండ్రివి. అనాది కాలంనుండే మా విమోచకుడవని నీకే పేరు - యెష 63, 16. ప్రభూ! నీవే మా తండ్రివి. మేము మట్టిమైతే నీవు కుమ్మరివి. నీవే మమ్మ చేసావు. 64,6. తల్లి తన ప్రేవున బుట్టిన బిడ్డను మరచిపోతుందా? తన శిశువుని ప్రేమించకుండా వుంటుందా? ఒకవేళ తల్లి తాను కనిన బిడ్డను మరచిపోతే పోతుందేమోకాని, నేను మాత్రం మిమ్ము మరచిపోను - 49, 15. తండ్రి తన కుమారులమీద కరుణ జూపినట్లే ప్రభువు తనకు భయపడేవాళ్ళమీద జాలి జూపుతాడు - కీర్త 103, 13. మా అమ్మా నాన్నా నన్ను విడనాడినా యావే నన్ను చేరదీస్తాడు - కీర్త 28, 10, తండ్రి తన ప్రియ కుమారుని చక్కదిద్దినట్లే యావే తన కిష్టుడైన నరుణ్ణి శిక్షిస్తాడు - సామె 3,11-12.

పరలోకంలో వుండే మీ తండ్రికి మీ యక్కరలన్నీ తెలుసు - మత్త 6, 32. మీరెంత చెడ్డవారైనా మీ బిడ్డలకు మేలివస్తువుల నీయాలని మీకు తెలుసుకదా! పరలోకంలో వుండే మీ తండ్రి తన్నడిగినవారికి ఇంకా యెట్టి మేలి వస్తువుల నిస్తాడో ఊహించండి.

దేవుడు లోకాన్ని యెంతో ప్రేమించి తన ఏకైక కుమారుడ్డి ప్రసాదించాడు. తన్ను విశ్వసించేవాళ్లు నాశమైపోకుండ నిత్యజీవాన్ని పొందడానికే అతడు అలా చేసాడు. - యోహా 3,16. నన్ను ప్రేమించేవాడు నామాట పాటిస్తాడు. అప్పడు నా తండ్రి వాణ్ణి ప్రేమిస్తాడు. మేము వానియొద్దకు వచ్చి వానితో నివసిస్తాం - 14, 23. మనం దేవుని బిడ్డలమని పిలువబడుతున్నాం అంటే దేవుడు మనలను ఎంతగా ప్రేమించాడో ఊహించండి. ఔను, మనం నిజంగా దేవుని బిడ్డలమే - 1 యోహా 8,1. తండ్రిని ప్రేమించేవాడు ఆ తండ్రి బిడ్డలను గూడ ప్రేమించాలి-5,1.

ఈలాంటి వాక్యాలను ధ్యానించుకోవడంవల్ల భగవంతుడు తండ్రి అనే భావం బలపడుతుంది. దేవునికి ఎన్ని పేర్లున్నా మనం అతన్ని ప్రధానంగా తండ్రిగా గుర్తించాలనే అతని కోరిక. మన తరపున మనం అతనిపట్ల బిడ్డల్లా మెలుగుతూండాలి. చనువుతో, చొరవతో అతని చెంతకు వెళ్ళి మన కష్టసుఖాల్లో అతన్ని శరణు వేడుతూండాలి. ఇక, దేవుణ్ణి తండ్రినిగా గుర్తించే భాగ్యాన్నీ అతనిపట్ల బిడ్డల్లాగ మెలిగే మనస్తత్వాన్నీ ఆత్మే మనకు దయచేస్తుంది. మనచేత భగవంతుణ్ణి నాన్నా అని పిలిపించడం ఆయాత్మకు ఎంతో ఇష్టం.

3. దృఢత్వం

1. దృఢత్వం అంటే యేమిటి?

ఈవరం ద్వారా ఆటంకాలెదురైనా గూడ వెనుకాడకుండా నిర్భయంగాను సంతోషంగాను దేవుని కొరకు గొప్పకార్యాలు చేయడానికి పూనుకొంటాం. ఈవరం అనుమానాలు శంకలు భయాలు మొదలైనవాటిని పూర్తిగా తొలగించదు. కాని అది మనకు పట్టుదలనీ ఉత్సాహాన్నీ విజయాన్నీ సాధిస్తామనే నమ్మకాన్ని దయచేస్తుంది. ఈ గుణాలతో కృషిచేసి విజయాన్ని చేపడతాం. స్టెఫనుకు ఈ వరముండేది. అతడు దైవానుగ్రహంతోను శక్తితోను నిండినవాడై ప్రభువుకి సాక్ష్యం బలికాడు - అ.కా. 6,8. పేత్రుకి ఈ వరముండేది. అతడు తన్ను హింసించే సానేడ్రిన్ సభసభ్యులను లెక్కచేయకుండా, యేసు నామంమీదుగా దప్పితే మరొక నామంమీదుగా రక్షణంలేదని బోధించాడు - అ,చ. 4,12.

ఈ వరంవల్ల మనకు రెండు ఫలితాలు కలుగుతాయి. మొదటిది, కష్టమైన కార్యాలు సాధించడానికి పూనుకొంటాం. పౌలు, ఫ్రాన్సిస్ శారివారు మొదలైన భక్తులు ఈ వరంవల్లనే శ్రమలకు జంకకుండ వేలకొలది మైళ్లు ప్రయాణం జేసి నానా తావుల్లో వేదబోధ చేసారు. ఇటీవల 23వ జాన్ పోపుగారు ఈ వరం సహాయంతోనే ప్రాతపడిపోయిన తిరుసభను నూతీకరించడానికి ధైర్యంతో పూనుకొన్నారు. ఇంకా నేడు చాలమంది భక్తులు వ్యవప్రయాసలకోర్చి ప్రభువు సేవలో గొప్పకార్యాలు సాధిస్తున్నారంటే అది యీ దృఢత్వం ఫలితమే.

రెండవది, ఓర్పునిగూడ పొందుతాం. దీర్ఘకాలం కష్టాలనెదుర్కొంటూ కృషిచేయాలంటే సహనమూ ఓర్పూ అవసరం. వేదసాక్షుల్లో ఈ వోర్చు అద్భుతంగా కన్పిస్తుంది. అంటియోకయ ఇన్యాసివారు, పెర్పెత్తువ, మరియగొరెట్టి మొదలైన వాళ్ళంతా ఈ సహనానికి ఉదాహరణలే. కాని వేదసాక్షులు స్వల్పకాలంలో ప్రాణాలు విడచారు. ఈనాడు మనం దేవుని సేవలో దీర్ఘకాలం శ్రమించి కృషిచేయాలి. వాళ్లు ఒక్కక్షణంలో నెత్తురుధారవోస్తే మనం జీవితమంతా నెత్తురు బొట్టులు బొట్టులుగా కార్చాలి. దీనికిగూడ గొప్ప సహనమే కావాలి. ఈ పట్టున దృఢత్వమనే వరం మనకు తోడ్పడుతుంది.

2. నిత్యజీవితంలో ఈ వరంతో అవసరం

పాపపు లోకం ఎన్నో ప్రలోభాలను కలిగిస్తుంది. లైంగిక భావాలతో నిండిన నేటి పాపపు లోకంలో పవిత్రతను నిలబెట్టుకోవాలంటే మాటలుకాదు. కొన్ని సార్లు ధనవాంఛకు లొంగి గడ్డితినాలనిపిస్తుంది. రోజువారిపనిని సంవత్సరం పొడవునా సంతృప్తికరంగా చేసికుంటూ పోవాలంటే యెంత వోపిక వుండాలి? వ్యాధిబాధలకూ కష్టాలకూ తట్టుకొని నిలవాలంటే యెంత స్టైర్యముండాలి? దేవుని పిలుపు విన్పించిన యువతీయువకులు ఆ పిలుపునిబట్టి పోవాలంటే యెంత తెగువ వండాలి? సాంఘిక అన్యాయాలను ఎదరించాలంటే ఎంత ధైర్యముండాలి? జీవితంలో ఒకోసారి ఎదురయ్యే నిరాశాభావాలను జయించాలంటే యెంత గుండె దిటవు కావాలి?

ఈలాంటి సందర్భాలన్నిటిలోను ఈ వరం మనకు ఉపయోగపడుతుంది. యోబు గ్రంథం వర్ణించినట్లుగా, ఈ లోక్షంలో మనుష్యజీవితం యుద్ధరంగం లాంటిది - 7,1, ఈ యుద్ధంలో ధైర్యంతో పోరాడాలంటే, విజయాన్ని చేపట్టాలంటే, దృఢత్వం కావాలి. మన శక్తి ఎంత? మన బండారమెంత? దైవశక్తి అండగా నిలువకపోతే మనం నెగ్గగలమా?

3. ఈ వరాన్ని సాధించడం ఎలా?

దృఢత్వమనేది ప్రధానంగా దైవబలాన్ని దయచేసే వరం. ఈ వరాన్ని పొందాలంటే మొదట మన బలహీనత మనకు బాగా తెలిసివుండాలి. పౌలు తన బలహీనతను తాను బాగా అర్థం చేసికొన్నాడు. అతడు దైవదర్శనాలు పొందాడు. వాటివల్ల అతనికి తల తిరగకుండా వుండటానికీ, అతన్ని అణచి వుంచడానికీ, ప్రభువు అతనికి ఏదో ఘటోరమైన బాధను కలిగించాడు. దాన్నే పౌలు "మల్లు" అని పేర్కొన్నాడు. ఆ మల్లని తొలగించమని అతడు ముమ్మారు ప్రభువుని మనవి చేసాడు. కాని ప్రభువు ఆ మల్లని తొలగించలేదు. "నా కృప నీకు చాలు. నీవు బలహీనుడివిగా వున్నపుడు నా శక్తి నీమీద పరిపూర్ణంగా పనిచేస్తుంది" అని చెప్పాడు. పౌలు తన బలహీనతను అంగీకరించాడు. దాని ద్వారానే అతడు గొప్ప దైవశక్తిని పొందాడు. కనుకనే నేనెప్పడు బలహీనుడో అప్పడే బలవంతుణ్ణి అని చెప్పకొన్నాడు -2 కొ 12, 7-10. మనంకూడ ఆ పౌలులాగే మన శక్తిహీనతనూ చేతగాని తనాన్నీ అంగీకరించాలి. ఆ ప్రభువుమీద ఆధారపడాలి. దివ్యబలాన్ని దయచేయమని అతన్ని అడుగుకోవాలి. అప్పడు అతని శక్తి మనమీద పనిచేస్తుంది. ఉత్థానక్రీస్తు శిష్యులతో "ఆత్మ వచ్చిందాకా మీరు యెరూషలేములోనే వుండండి. ఆత్మ దిగి వచ్చినపుడు మీరు శక్తిని పొందుతారు" అని చెప్పాడు - అ.చ. 18. శిష్యులు యథార్థంగా ఆత్మనుండి శక్తిని పొందారు, పొంది భూదిగంతాలవరకూ క్రీస్తుకి సాక్ష్యం పలికారు. నేడు మన జీవితంలో కూడ ఈలాగే జరుగుతుంది. ప్రభువు ఆత్మ మనకు అమోఘమైన శక్తినీ బలాన్నీ దయచేస్తుంది. వీటితో మనం గొప్ప విజయాలు సాధిస్తాం. తేపతేపకు మనం స్వీకరించే దివ్యసత్రసాదం ద్వారా కూడ దైవబలాన్ని పొందుతాం. పూర్వం యూదులు మన్నాభోజనాన్ని తిని భౌతికమైన పుష్టిని పొందారు. నేడు మనం ఈ భోజనాన్ని ఆరగించి ఆధ్యాత్మికమైన పుష్టిని పొందుతాం - యోహా 6, 49-51. పవిత్రాత్మ దేవద్రవ్యానుమానాలద్వారా గూడ మన హృదయంమీద పని చేస్తుది. కనుక మనం ఈ భోజనాన్ని యోగ్యంగా భుజించి ఆ యాత్మనుండి దృఢత్వమనే వరాన్ని అధికాధికంగా పొందుతూండాలి.

4. దైవభీతి

1. దైవభీతి అంటే యేమిటి?

ఈవరంవల్ల దేవునిపట్ల బిడ్డల్లా మెలుగుతూ భయభక్తులతో ప్రవర్తిస్తాం. పాపంనుండి వైదొలగుతాం.

సేవకుడు యజమానుణ్ణి జూచి భయపడతాడు. విశేషంగా తాను తప్ప చేసినప్పడు యజమానుడు తన్ను శిక్షిస్తాడేమోనని భీతిజెందుతాడు. ఆలాగే కొందరు పాపంచేసి దేవుడు తమ్మ దండించి నరకానికి పంపుతాడేమోనని భీతిజెందుతారు. ఇది కేవలం శిక్షాభయం, దైవభీతి అనే వరానికీ ఈ భయానికీ ఏమీ సంబంధం లేదు.

బిడ్డలు తండ్రిపట్ల ప్రేమతో మెలుగుతారు. అతనిపట్ల వినయవిధేయతలూ భయభక్తులూ ప్రదర్శిస్తారు. కానిపనులు చేసి అతనికి అప్రియం కలిగించడానికి జంకుతారు. ఆలాగే దేవుడు కూడ మనకు గారాబు తండ్రి. మనమంటే అతనికెంతో ప్రీతి. కనుక మనం అతని ఆజ్ఞలుమీరి అతని మనసు నొప్పించడానికి భయపడతాం. అతని యెడల భయభక్తులతో మెలుగుతాం. ఇదే దైవభయమనే వరం.

పూర్వం దైవభక్తి అనే వరాన్ని చూచాం. ఆ వరం ద్వారా దేవుణ్ణి తండ్రిగా భావించి ప్రేమతో పూజిస్తాం. ఈ దైవభయమనే వరంవల్ల పాపంద్వారా దేవుని మనసునొప్పించడానికి వెనుకాడతాం. వళ్ళ దగ్గర పెట్టుకొని జీవిస్తాం.

కొందరు పునీతులు పాపం చేయడంకంటె చనిపోవడం మేలని యెంచారు. ఇగ్నేప్యస్ లొయోలా, డాన్బోస్కో మరియగొరెట్టి మొదలైనవాళ్ళంతా ఈలా భావించినవాళ్ళే ఇది యీ వరం ఫలితమే. ఈవరంవల్ల పాపం చేయడానికి వెనుకాడతాం, పామునుండిలాగ పాపం నుండి పారిపోతాం - సీరా 21,2. పూర్వవేదంలో యూదులు ప్రభువుని జూచి భయపడేవాళ్ళు. మోషే మండుతూవున్న పొదలో దేవుణ్ణి చూచి ఉత్తరీయంతో ముఖం కప్పకొన్నాడు – నిర్ణ 3,6. దేవుడు అతనితో ఏ నరుడైనాసరే నా ముఖం చూస్తే ఇక బ్రతకడు అని చెప్పాడు - నిర్గ 32, 20 ఏలియా హోరెబు కొండమీద దేవుడ్డి చూచి ఉత్తరీయంతో ముఖం కప్పకొన్నాడు – 1రాజు 19,13. యెషయా చూచిన దర్శనంలో దేవదూతలు ఆ పవిత్రుడైన ప్రభువువైపు తేరిపాడజూడలేక రెక్కలతో ముఖాలు కప్పేసుకున్నారు — యొష 6,2. మనకు కూడ ఈలాంటి భయం అవసరం.

ఇక్కడ ఓ అనుమానం కలుగవచ్చు. మనం యూదుల్లాగ దాస్యపు ఆత్మను పొందలేదు. దత్తపుత్రుల ఆత్మను పొందాం. ఆయాత్మ సహాయంతో నూత్నవేదంలో దేవుణ్ణి చనువుతో నాన్నా అని పిలుస్తాం - రోమా 8, 15, మరి ఆ దేవుణ్ణి చూచి భయపడ్డం దేనికి? అతనిపట్ల మనకు కావలసింది చొరవా చనువూకాని భయం కాదుగదా? నిజమే. మనం దేవునికి బానిసలంగాదు, బిడ్డలం. కాని బిడ్డలమైనా కూడ మన మెప్పడైనా పాపం కట్టుకోవచ్చు. ఫలితంగా మన దత్తపుత్రత్వాన్ని కోల్పోవచ్చు. అందుచేత మనకు ఈ దైవభయం అవసరం. మనం దత్తపుత్రులమని చెప్పిన పౌలే "భయంతో వణకుతూ మీ రక్షణకార్యాన్ని నిర్వహించుకొనండి" అని చెప్పాడు – ఫిలి 2,12. నిత్యజీవితంలో మనం ప్రవర్తించే తీరు యూదుల ప్రవర్తనకంటె మెరుగేమీ కాదు. అందుచేత ఆ యూదులకుమల్లె మనకు కూడ దైవభయం అవసరమే. ఒక వైపున దేవునిపట్ల భయమూ వుండాలి, మరోవైపున అతనిపట్ల చొరవా నమ్మకమూ కూడా వుండాలి.

2. ఈ వరంతో ఏమి యవసరం?

కొంతమంది దేవునిపట్ల చులకనగా మెలుగుతుంటారు. అమర్యాదగా ప్రవర్తిస్తారు. భక్తులకు ఈలాంటి ప్రవర్తనం ఎంత మాత్రం తగదు. తల్లిదండ్రులు తమపట్ల వినయవిధేయతలూ మేరమర్యాదలూ లేకుండా ప్రవర్తించే బిడ్డలను మెచ్చుకోరుగదా! దేవుడూ అంతే కనుక దైవభీతి అనేది అనవసరం కాదు.

పాపాంకురం మనలో నిత్యమూ వుంటూనే వుంటుంది. అది యొప్పదైనా చెట్టుగా ఎదగవచ్చు. కనుక మన పతన స్వభావాన్ని తలంచుకొని మనమే భయపడాలి, అబ్వాలోము తన్ననురాగంతో జూచే తండ్రి దావీదుమీద తిరగబడ్డాడు. అలాగే మనంకూడా యెప్పుడైనా పాపంద్వారా దేవునిమీద తిరగబడవచ్చు. ఫిలిప్ నేరి అనే భక్తుడు "ప్రభూ! నీవీ ఫిలిప్పని నమ్మ వద్దు. ఇతడు నీకెప్పడైనా ద్రోహం చేయగలడు సుమా!" అని ప్రార్ధించేవాడట. మనకు కూడ ఈ మనస్తత్వం, ఈ భయం అవసరం. దైవభయం ఇంకోలాభాన్ని కూడ చేకూర్చి పెడుతుంది, ఒకోసారి మన క్రిందివారిపట్ల నిరంకుశంగా, నిర్ధయగా ప్రవర్తిస్తాం. వాళ్ళకు హానిచేయబోతాం. ఆలాంటప్పడు ఈ వరం మనలను హెచ్చరించి మనకు బుద్ధిచెప్తుంది.

3. ఈ వరాన్ని సాధించే మార్గం

భగవంతుడు మహావైభవం కలవాడు. మహాపవిత్రుడు, ఆలాంటి ప్రభుని అల్పప్రాణులమైన మనం పాపంద్వారా అవమానించగలం. అందుచేత మనం ఎప్పడుకూడ ఆ ప్రభుని చూచి భయపడతూండాలి. వళ్ళ దగ్గరబెట్టుకొని బ్రతుకుతూండాలి. కావుననే క్రీర్తన కారుడుకూడ “నీ భయంతో నావళ్ళు వణకిపోతూంది,నీ యాజ్ఞలకు నేను గడగళ్ళాడుతూన్నాను" అని వాకొన్నాడు - 119, 20, ఈ భయం మన హృదయంలో భక్తి మర్యాదలను పుట్టిస్తుంది. ఈ వినయభావాన్ని జూచి ప్రభువు మనలను ప్రీతితో ఆదరిస్తాడు. బిడ్డలు తండ్రిపట్లలాగే మనంకూడ తనపట్ల, ఒకవైపున అనురాగంతోను మరొకవైపున మేరమర్యాదలతోను మెలిగేభాగ్యాన్ని దయచేస్తాడు. మనతరపున మనం మన పాపాలకు ఎప్పడూ చిత్తశుద్ధితో పశ్చాత్తాప పడుతూండాలి. పశ్చాత్తాప తప్తమైన హృదయాన్ని నీ వనాదరం చేయవు అన్నాడు కీర్తనకారుడు - 51, 17. ఈ పశ్చాత్తాప భావం మనలో దైవభయాన్ని పెంచుతుంది.

5.తెలివి

1. తెలివి అంటే ఏమిటి?

ఈ వరం ద్వారా సృష్టివస్తువులు దేవునిమీద ఆధారపడి వుంటాయనీ, అతడు అన్నిటికీ ఆదికారణమనీ గ్రహిస్తాం. సృష్టి వస్తువుల్లో దేవుణ్ణి గుర్తించి అతన్ని కొలుస్తాం. కనుక ఇది లోకవస్తువులన్నింటిలోను, అన్ని కార్యాల్లోనుగూడ దేవుణ్ణి గుర్తించడానికి వుపయోగపడే వరం.

ప్రభువు తాను చేసిన వస్తువులన్నింటిలోను ప్రతిబింబిస్తూనే వుంటాడు. పాపంచేయకముందు ఆదాము అన్నిటిలోను దేవుణ్ణి గుర్తించేవాడు. కాని పాపం చేసాక అతడు ఆ శక్తిని కోల్పోయాడు. అతని సంతతిమై అతని పాపంవల్ల పతనమై పోయిన మనకు కూడ ఈ శక్తిలోపించింది. క్రీస్తు సిలువమీద మరణించి పాపానికి పరిహారంచేసి ఈ శక్తిని మనకు మల్లా సంపాదించి పెట్టాడు. ఇప్పడు క్రీస్తు ఆత్మ తెలివి అనే వరం ద్వారా, క్రీస్తు సంపాదించిపెట్టిన ఈ శక్తిని మనకు సమృద్ధిగా దయచేస్తుంది. దీనిద్వారా మనం, పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేకుండానే, శ్రమపడవలసిన అగత్యం లేకుండానే, ఆయావస్తువులవైపు పారజూచిన వెంటనే వాటికి దేవునితో సంబంధం వుందని గ్రహించగల్గుతాం.

అన్నివస్తువులు దేవునినుండే పడతాయి, వాటిల్లో దేవుడు ప్రతిబింబిస్తుంటాడు. అవి మన మనసుని దేవునివైపు త్రిప్పతాయి. కనుక అన్ని వస్తువులుకూడ నిచ్చెన మెట్లలాగ మనలను దేవునిచెంత కెక్కించుకొనిపోతాయి. ఇదే తెలివి అనేవరం.

అసిస్సీఫ్రాన్సిస్ భక్తుడు అన్నిటిల్లోను దేవుణ్ణి చూచేవాడు. అతడు సూర్యచంద్ర నక్షత్రాదులూ నీరు గాలి అగ్ని భూమి పశుపక్ష్యాదులూ మొదలైనవాటి నన్నిటినీ దేవునికి బిడ్డలనుగాను తనకు సోదరీ సోదరులనుగాను భావించేవాడు. వాటిపట్ల పవిత్రమైన భావాలతో మెలిగేవాడు. ఈ భావాలను అతడు "సూర్యగీతం" అనే గేయంలో వ్యక్తం చేసాడు. ఇది తెలివి అనే వరం ఫలితమే.

కీర్తనకారుడు "ఆకాశం దేవుని మహిమను చూపెడుతూంది, అంతరిక్షం అతని సృష్టిని ప్రకటిస్తూంది" అన్నాడు - 19,1. మహాభక్తులు అన్ని సంఘటనల్లోను దేవుని హస్తాన్ని గుర్తించారు. దేవుడు తన్ను ప్రేమించేవాళ్ళకి అన్నీ మంచికే సమకూరేలా చేస్తాడు అని చెప్పాడు పౌలు - రోమా 8,28. ఈ భావాలన్నీ తెలివి అనే వరానికి నిదర్శనాలే.

2. ఈ వరంవల్ల లాభాలు

సృష్టివస్తువులు మనలను దేవుని చెంతకు చేర్చడానికి ఉద్దేశింపబడ్డాయి. Goro పాపఫలితంగా వాటిద్వారానే మనం దేవునికి దూరమైపోతుంటాం. ఆ వస్తువుల్లోనే తగుల్మొనిపోయి భగవంతునినుండి వైదొలగిపోతూంటాం, వస్తుప్రీతికి లొంగి పోతూంటాం. ఆలాంటప్పుడు ఈ వరం మనమీద పనిచేసి మనలోని వస్తువ్యామోహాన్ని చక్కదిద్దుతుంది. దేవుడు చేసిన వస్తువులను నమ్మి దేవుణ్ణి విస్మరించవద్దని హెచ్చరిస్తుంది. ఫలితంగా మనం అశాశ్వతములైన ఈ లోకవస్తువులనుండి వైదొలగి శాశ్వతుడైన ప్రభువుని ఆశ్రయిస్తాం.

దేహధారులమైన మనకు లోకవస్తువులేమో అవసరమే. తోడినరులు కూడుగుడ్డ యిల్లవాకిలి డబ్బు - ఇవన్నీ అవసరమే. కనుక మనం ఈ భౌతిక వస్తువులను పూర్తిగా పరిత్యజించలేం. కాని ఈ వరం ద్వారా లోకవస్తువులను ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకొంటాం. వాటిల్లో చిక్కుకోం, వాటిని మనకు దాసులనుగా చేసికొంటాంగాని, మనం వాటికి దాస్యం చేయం. వాటిని నిచ్చెన మెట్లలాగ వాడుకొని దేవుని దగ్గర కెక్కిపోతాం.

3. ఈ వరాన్ని సాధించడం ఏలా?

దేహదారులమైన మనం నిరంతరమూ ఈ లోకవనువుల మధ్య మెలుగుతూంటాం. నిరంతరమూ వీటిని వాడుకొంటూంటాం. కాని మనం అన్ని వస్తువులనూ విశ్వాస నేత్రాలతో దర్శించాలి. ఏ వస్తువునైనాసరే అది కేవలం మన చర్మచక్షువులకు కన్పించినట్లుగా మాత్రమే చూడకూడదు. దాని నిజస్వభావాన్ని దర్శించాలి. అనగా ఆ వస్తువుకి కారణభూతుడైన భగవంతుణ్ణి గుర్తించాలి. వస్తువులు మనలను భగవంతుని చెంతకు చేర్చాలిగాని అతనినుండి వేరుపరుపగూడదు. ఈలాంటి దృక్పథాన్ని అలవర్చుకొంటే మనం వ్యామోహానికి గురికాము. క్రీస్తుతో పోల్చిచూస్తే సమస్త వస్తువులూ వట్టి చెత్తాచెదారమని భావిస్తున్నాను అన్నాడు పొలు - ఫిలి 3,8 మనం కూడ ఈలాంటి మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి.

ఇంకా మనం ప్రతి సంఘటనంలోను దేవుని హస్తాన్ని దర్శించడం నేర్చుకోవాలి, మామూలుగా అందరమూ ప్రియమైన సంఘటనల్లో దేవుని తోడ్పాటుని గుర్తిస్తాం. అతనికి వందనాలర్పిస్తాం. కాని అప్రియమైన సంఘటనలు కలిగినపుడు ఆలా చేయం. ఇది పెద్ద పొరపాటు, కష్టాల్లోకూడ దేవుని చేతిని చూడాలి. యోసేపు సోదరులు అతన్ని ఐగుపకి బానిసగా అమ్మివేసారు. కాని అతడు అక్కడ మంత్రి అయ్యాడు. తరువాత కరవువల్ల ఆ సోదరులు ఐగుపకి వెళ్లి ధాన్యం కొనుక్కోవలసి వచ్చింది. అక్కడ వాళ్ళు తమ్ముణ్ణి గుర్తుపట్టారు. అప్పడు యోసేపు "మీరు నాకు కీడు తలపెట్టి నన్ను బానిసగా అమ్మివేసారు. కాని ప్రభువు ఆ కీడుని మేలుగా మార్చాడు. మీ కంటే ముందుగా నన్ను ఇక్కడికి పంపి ఈ కరువు కాలంలో నేను చాలమంది ప్రాణాలు నిలబెట్టేలా చేసాడు" అన్నాడు - ఆది 50, 22. మన జీవితంలో గూడ ఈలాంటి సంఘటనలు జరుగుతూంటాయి. ఆ యోసేపులాగే మనంకూడ ఆపదల్లో దేవుని హస్తాన్ని గుర్తించగలిగి వుండాలి.

ప్రభువు నాకు దీపం వెలిగిస్తాడు, నా త్రోవలోని చీకటిని తొలగిస్తాడు అన్నాడు కీర్తన కారుడు - 18,28. అతడు నిన్నుగూర్చి జాగ్రత్తపడతాడు అన్నాడు మరో కీర్తనకారుడు - 55,22. ఈలాంటి భావాలను భక్తితో మననం జేసికొంటే మనకు ఈ తెలివి అనే వరం తప్పక సిద్ధిస్తుంది.

6. వివేకం

1. వివేకం అంటే ఏమిటి?

ఈ వరంద్వారా వేదసత్యాలను లోతుగా అర్థంచేసికొంటాం. మన బుద్ధి వేదసత్యాలను ఎప్పటికీ పూర్తిగా గ్రహించలేదు. ఐనా మనం వాటిని కొంతవరకు అర్థంచేసికోవచ్చు. అందుకు ఈ వరం తోడ్పడుతుంది.

2. ఈ వరం ఫలితాలు

ఈ వరంద్వారా వేదసత్యాలను క్షుణ్ణంగా గ్రహిస్తాం. తోమాసు అక్వినాసు భక్తుని భావాల ప్రకారం ఈ గ్రహించడమనేది ఆరు విధాలుగా వుంటుంది. 1. వెలుపలి గుణాల మాటన దాగివున్నదేవుణ్ణి గుర్తిస్తాం. దివ్యసత్ప్రసాదంలో అప్పం, రసం గుణాల మాటున క్రీస్తుదాగి వున్నాడు. కంటికి కన్పించకపోయినా అతడు సత్రసాదంలో వున్నాడని అర్థంచేసికొంటాం, నమ్ముతాం, ఆరాధిస్తాం.

2. మాటల్లో దాగివున్న గూడర్ధాన్ని గ్రహిస్తాం. ఆత్మ వేదగ్రంథ వాక్యాల్లో దాగివున్న గూఢభావాన్ని మనకు విదితం చేస్తుంది. క్రీస్తు ఎమ్మావు త్రోవలో శిష్యులకు దివ్యగ్రంథ వాక్యాల భావాన్ని వివరించి చెప్పాడు — లూకా 24, 25–27. బైబులు చదువుకొనేపుడు ఆత్మ మనకు కూడ దివ్యగ్రంథ మర్మాలను విశదీకరిస్తుంది. దీనివల్ల మనకు గొప్పభక్తి పడుతుంది.

3. దేవద్రవ్యానుమానాల్లోని సాంకేతికార్థాలను అర్థంచేసికొంటాం. మనం జ్ఞానంస్నానం పొందినపుడు క్రీస్తు మరడోత్థానాలు మనమీద సోకుతాయి. అతడు భౌతికంగా మరణించినట్లే మనంకూడ పాపానికి మరణిస్తాం. అతడు భౌతికంగా ఉత్థానమైనట్లే మనంకూడ నూత్నజీవితానికి ఉత్తానమౌతాం - రోమా 6,4 పై వరంద్వారా మనం ఈ మరణోత్తానాల సంకేతాలను నమ్మి క్రీస్తు వరప్రసాదాన్ని పొందుతాం.

4. వెలుపలి భౌతిక రూపంలో దాగివున్న ఆధ్యాత్మిక సత్యాన్ని గుర్తిస్తాం. నజరేతూరి వడ్రంగిలో సృష్టికర్త దాగి వున్నాడు. ఈ వరం ద్వారా నరరూపధారియైన క్రీస్తు నిజంగా దేవుడని గ్రహిస్తాం. 5. కారణంలో దాగివున్న కార్యాన్ని గుర్తిస్తాం, సిల్వమీద తెరువబడిన క్రీస్తుహృదయంలో తిరుసభా ఏడు దేవద్రవ్యానుమానాలూ దాగివున్నాయి. క్రీస్తు కల్వరిమీద చిందించిన నెత్తుటిలో మన పాపాలకు పరిహారమూ, దేవునితో మనకు సిద్ధించే పునస్సమాధానమూ ఇమిడి వున్నాయి. ఈ వరం మనకు ఈలాంటి రహస్యాలను ఎన్నిటినైనా నేర్పుతుంది.

6. కార్యంనుండి కారణాన్ని గ్రహిస్తాం, సకాలంలో వాన కురిసింది, పంటలు బాగా పండాయి. కనుక ఆ వాన ప్రభువు ప్రాణిపోషణానురక్తిని సూచిస్తూంది. ఈ వరంద్వారా వానలో ప్రభువు కృపను గుర్తిస్తాం. ఇక్కడ వాన కార్యం, ప్రభువు కృప కారణం.

పై యుదాహరణలనుబట్టి ఈ వరం ప్రధానంగా 3必 సత్యాలకు సంబంధించినదని తెలిసికోవాలి. దీనిద్వారా మన విశ్వాసం బలపడుతుంది. మనకు దేవునిమీదా దైవసంబంధమైన కార్యాలమీదా గాఢమైన భక్తి కలుగుతుంది. ఈ వరం ప్రధానంగా వేదాంతులకూ, వేదబోధకులకూ, ఆధ్యాత్మిక గ్రంథ రచయితలకూ అవసరం.

8. దీన్ని సాధించడం ఏలా

ఈ వరాన్ని సాధించాలంటే మనకు నిశ్చలమైన విశ్వాసం వుండాలి. పండ్రెండవ శతాబ్దంలో జీవించిన ఆన్సెల్మ్ భక్తుడు గొప్ప వేదాంతి. అతడు వేదాంత విషయాలను చర్చించడానికి పూనుకొనేప్పడెల్లా ముందుగా విశ్వాస ప్రార్ధనం చేసేవాడు. విశ్వాసం సహాయంతో బుద్ధిశక్తిని వినియోగించి వేదసత్యాలను వివరించడానికి పూనుకొనేవాడు. విశ్వాసం సహాయంతో మనలోని బుద్ధిశక్తివేదసత్యాలను గ్రహిస్తుంది అనేది అతని సూత్రం.

కొందరు చాల తెలివైనవాళ్ళు వుంటారు. ఐనా వాళ్లు దేవుణ్ణి అట్టే పట్టించుకోరు. వేదసత్యాలను అంతగా నమ్మరు. వాళ్ళ హృదయంలో భక్తివిశ్వాసాలు వుండవు. మరికొందరికి తెలివితేటలు అట్టే వుండవు. ఐనా వాళ్లు దేవుణ్ణి మతసత్యాలనూ గాఢంగా నమ్ముతారు. చాల భక్తి కలిగి వుంటారు. ఈ వ్యత్యానం ఏలా వచ్చింది? తెలివైనవాళ్ళమీదకంటె తెలివి తక్కువవాళ్ళమీద ఈ వరం అధికంగా పనిచేయడంవల్లనే. ప్రభువేమన్నాడు? “తండ్రీ! విజ్ఞలకూ వివేకవంతులకూ పరలోక రహస్యాలను మరుగుపరచావు. పసిబిడ్డలకు వాటిని తెలియపరచావు. కనుక నిన్ను స్తుతిస్తున్నాను" అన్నాడు — మత్త 11,15. ఈ సత్యం నేడు మన జీవితంలో కూడ నెరవేరుతుంది.

మనం తరచుగా జ్ఞానోపదేశాన్నీ వేదసత్యాలనూ, బైబులు బోధలనూ కేవలం సిద్ధాంతాలుగా మాత్రమే నేర్చుకొంటాం. లెక్కలు, చరిత్ర, ਹo మొదలైన వాటివలె ఈ వేదవిషయాలుకూడ మనకు కేవలం కొన్ని విజ్ఞానాంశాలు మాత్రమే ఔతాయి. కాని వేదవిషయాలను ఈలా నేర్చుకొంటే లాభంలేదు. ఈ పద్ధతివల్ల భగవంతుడు అనుభవానికిరాడు. మన హృదయం మంచికి మారదు. మరి మనం ఏమిచేయాలి? వేదసత్యాలనూ దివ్యగ్రంథబోధలనూ నేర్చుకోవడం వల్ల మన హృదయం భక్తిభావంతో నిండిపోవాలి. ఆత్మ మన హృదయంమీద పనిచేసి దానికి గొప్ప వెలుగుని ప్రసాదించాలి. ఆ వెలుగులో మన ఆత్మ ఆ భగవంతుణ్ణి ధ్యానించి అతన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. ఆ యనుభవంవల్ల మన హృదయం పాపంనుండి వైదొలగాలి. మనం మార్పుచెంది పుణ్యకార్యాలను చేయడానికి పూనుకోవాలి. ప్రేమభావంతో జీవించాలి. పలానా వేదసత్యంగాని, దివ్యగ్రంథంలోని పలానా అంశంగాని ఈనాడు మన జీవితానికి కూడ అక్షరాల వర్తిస్తుంది అన్నట్లుగా వుండాలి. అలా వర్తించడంవల్ల మన జీవితం మంచికి మారింది అనిపించాలి. వివేకం అనే దైవవరమే ఈ భాగ్యాలన్నిటినీ మనకు సంపాదించి పెడుతుంది.

7. విజానం

1. విజ్ఞానం అంటే యేమిటి?

ఈ వరంలో రెండంశాలున్నాయి. మొదటిది, దేవుని విలువనూ సృష్టివస్తువుల విలువనూ అర్థంజేసికొంటాం. భగవంతునిపట్లా, ప్రపంచంలోని అన్ని వస్తువులపట్లా నిర్దిష్టమైన భావాలు అలవర్చుకొంటాం. ఇంతవరకు ఈ వరం మన బుద్ధి శక్తికి సంబంధించింది అవుతుంది. విజ్ఞానాత్మకంగా వుంటుంది. మన బుద్ధిశక్తికి గొప్ప వెలుగుని ప్రసాదిస్తుంది.

రెండవది,భగవంతుణ్ణీ ఆధ్యాత్మిక విషయాలనూ ఆస్వాదిస్తాం. ఆ యాస్వాదనం వలన ఆనందమూ తన్మయత్వమూ కలుగుతుంది. ఈ రెండవ అంశంలో ఈ వరం మన చిత్తశక్తికి చెందిందవుతుంది. ప్రేమాత్మకంగా వుంటుంది.

వివేక వరం వలన దైవసత్యాలను వట్టినే అర్థం చేసికొంటాం. ఈ విజ్ఞానవరంవల్ల దైవసత్యాలను చవిజూస్తాం. అనుభవానికి తెచ్చుకొంటాం. ఆనందిస్తాం. మామూలుగా వేదశాస్త్రుల్లో దైవసత్యాలను గూర్చిన తెలివివుంటుంది. ఇది వివేకవరం. కానీ పునీతుల్లో ఆ దైవసత్యాలను అస్వాదించి ఆనందించడమనేదికూడ వుంటుంది. భగవంతుణ్ణి వ్యక్తిగతంగా అనుభవానికి తెచ్చుకొని గాఢంగా ప్రేమించడమనేది వుంటుంది. ఇదే విజ్ఞాన వరం.

ఆత్యయిచ్చే ఏడు వరాల్లోను ఈ విజ్ఞానవరం శ్రేష్ఠమైంది. ఈ వరంద్వారా మన దైవానుభూతీ, ఆనందానుభూతీ, ప్రేమభావమూ పరాకాష్ణ నందుకొంటాయి. అనగా ఆధ్యాత్మిక జీవిత శిఖరం మీదికి ఎక్కిపోతాం.

ఈ వరం పౌలుమీద పనిచేసింది. అతడు క్రీస్తుద్వారా తండ్రి మనకు దయచేసిన రక్షణాన్ని తలంచుకొని ప్రేమభావంతో పులకించిపోయాడు. "మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవునికి స్తుతికలుగును గాక" అన్నాడు — ఎఫే 3,1. ఈ వరం యోహానుని ప్రభావితం చేసింది. అతడు క్రీస్తుద్వారా తండ్రి మనపట్ల చూపిన ప్రేమకు ముగ్గుడైపోయాడు. భక్తిభావంతో "దేవుడంటే ప్రేమే" అని వాకొన్నాడు - 1యో 4,8.

ఈ వరం ఎమ్మావు త్రోవలో శిష్యులమీద సోకింది. వాళ్లు తన్మయులైపోయారు. “అతడు మార్గంలో మనతో మాట్లాడుతూ లేఖనాలను వివరిస్తూంటే మన హృదయం ప్రజ్వరిల్లింది కదా? అనుకొన్నారు - లూకా 24, 32.

2. ఈ వరం ఫలితాలు

ఈవరంవల్ల మన హృదయంలో దేవునిపట్ల గాఢమైన భక్రీ, అనుభూతీ, ప్రేమా పడతాయి. "మోక్షంలో మాత్రం నీవు తప్ప ఇంకెవరున్నారు? ఈ లోకంలో నీవు తప్ప మరొకటి నాకు రుచించడం లేదు" అన్నాడు కీర్తనకారుడు - 73, 25. "ప్రభూ! నిత్యజీవం ఇచ్చే పలుకులు నీ నోటి నుండి వెలువడుతున్నాయి. నిన్ను కాదని మరెవరి దగ్గరికి వెళ్తాం? లోకంలోకి వెళ్లి అక్కడ యేమి పాముకొంటాం గనుక?" అన్నాడు పేత్రు - యోహా 6,68. "ఇప్పడు నేను కాదు, నాయందు క్రీస్తే జీవిస్తున్నాడు" అన్నాడు పౌలు - గల 2,20, ఈ భక్తులకు గలిగిన అనుభూతే మనకూ కలుగుతుంది.

తెలివితేటలుకల పండితులమీద మాత్రమేకాదు, చదువు సంధ్యలూ పుస్తకజ్ఞానమూలేని పామరజనంమీద కూడ ఈ వరం పనిచేస్తుంది. విద్యవిజ్ఞానంలేని ఒక పేద ముసలమ్మ వుంది. ఆమె భక్తరాలు. పరలోక జపాన్ని ప్రారంభించేది కాని ముగించలేకపోయేది. దానికి కారణం ఆమే యిూలా చెప్పింది. "పరలోకంలోని మా యొక్క తండ్రి అన్న వాక్యాన్ని ప్రారంభించగానే దేవుడంతటివాడు నాకు తండ్రికదా అనే భావం స్ఫురిస్తుంది. దానితో నా కన్నులవెంట గిర్రున నీళ్ళ తిరుగుతాయి. ఇక నేను ఆ జపాన్ని ముగించలేను. దినమంతా ఆ భావాన్నే నెమరు వేసికొంటూ భక్తితో ఆలాగే వుండిపోతాను. ఇప్పటికి ఐదేళ్ళబట్టి ఈలా జరుగుతూంది". ఈ దైవానుభూతి విజ్ఞాన వరంవల్లగాకపోతే మరి దేనివల్ల కలిగింది?

ఈ వరం మన మీద సోకనంత కాలం, భగవంతుడు మనకు వట్టి భావంగానే . వుండిపోతాడు. మన సత్యాలు బైబులు బోధలు వట్టి సిద్ధాంతాలుగానే వండిపోతాయి. మన హృదయం ఎండిపోయిన నేలలా, మోడువారిన కొర్రులా వుంటుంది, ఆ దేవునికీ మనకీ ఏమి సంబంధముందో కూడ గ్రహించలేం, కాని ఓమారు ఈ వరం మనమీద సోక్షగానే మన హృదయం ద్రవిస్తుంది. భగవంతుడు వట్టి భావంగాగాక, ఓ వ్యక్తిగా అనుభవానికి వస్తాడు. అతన్ని తండ్రిగాను, రక్షకుణ్ణిగాను, మన సర్వస్వంగాను భావిస్తాం. హృదయంలో ప్రేమ పుడుతుంది. ప్రార్ధనం పెల్లుబికివస్తుంది. మనలను మనం సంస్కరించుకోవడం మొదలుపెడదాం. ఆనందానుభూతి కలుగుతుంది. కనుక ఈ వరం మనకు అత్యవసరం.

3. ఈ వరాన్ని సాధించే మార్గం

ఈ వరంకోసం ఆత్మనే అడుగుకోవాలి. వినయంతోను భక్తిభావంతోను అడుగుకొనే వాళ్ళకి ఆత్మ ఈ భాగ్యాన్ని దయచేస్తుంది.

పవిత్రాత్మను గూర్చిన ఓ ప్రార్ధనం ఇది. "ఓ ప్రభూ! నీవు పవిత్రాత్మ వెలుగుద్వారా విశ్వాసుల హృదయాలకు బోధచేసావు. ఆయాత్మద్వారా మేము ఉచితమైన వాటిని ఆస్వాదించేలా అనుగ్రహించు. ఆ యాత్మ దయచేసే ఊరటవలన ఎల్లప్పడు ఆనందం చెందే భాగ్యాన్ని దయచేయండి".

ఈ ప్రార్ధనం పేర్కొన్నట్లు, ఆత్మద్వారా మనం ఉచితమైనవాటిని ఆస్వాదిస్తాం. అనగా భగవంతుణ్ణి ఆధ్యాత్మిక విషయాలనూ చవిజూస్తాం, ఆత్మ మనకు ఊరటనూ ఉపశాంతినీ దయచేస్తుంది.దానివల్ల ఆనందానుభూతి కలుగుతుంది. భగవంతుణ్ణి ఆస్వాదించి ఆనందానుభూతి చెందడమే విజ్ఞానవరం ప్రయోజనం. తన్నడుగుకొనే భక్తులకు ఆత్మ ఈ వరాన్ని తప్పక ప్రసాదిస్తుంది.

8. వరాల వివరణం

1. పుణ్యాలూ వరాలూ

పవిత్రాత్మ మనకు పవిత్రీకరణ వరప్రసాదాన్ని దయచేస్తుంది. పుణ్యాలనూ వరాలనూ గూడ ప్రసాదిస్తుంది. ఈ పుణ్యాలు రెండురకాలు. విశ్వాసం, నమ్మకం, ప్రేమ అనే మూడు దివ్యపుణ్యాలు. వివేకం, న్యాయం, మితత్వం, దృఢత్వం అనే నాల్గు నైతికపుణ్యాలు. ఈ నాల్గింటికి సంబంధించిన ఇతర నైతిక పుణ్యాలుకూడ వున్నాయి. సదుపదేశం, దైవభక్తి, దృఢత్వం, దైవభీతి, తెలివి, వివేకం, విజ్ఞానం అనే యేడువరాలు.

మనలో పుణ్యాలూ వరాలూ కలసే పనిచేస్తాయి. ఐనా ఆ రెండిటికి చాలా వ్యత్యాసముంది. పుణ్యాలను ఆచరించేపుడు మన ఆత్మేకర్త ఔతుంది. అనగా వరప్రసాద సహాయంతో మనమే ఆయా మంచిపనులు చేస్తాం. కాని వరాల విషయం వచ్చినపుడు పవిత్రాత్మకర్త ఔతుంది. ఆయాత్మ మనయాత్మ మీద పనిచేసి మనచే ఆయా మంచిపనులు చేయిస్తుంది.

పుణ్యాలను ఆచరించడమంటే తెడ్లతో పడవను నడిపించడం లాంటిది. అనగా మన కృషి ముఖ్యం. వరాలతో జీవించడమంటే తెరచాప యెత్తి పడవలో సాగిపోవడంలాంటిది. అనగా గాలి పడవనులాగ పరిశుద్ధాత్మే మనలను నడిపించుకొని పోతుంది. కృషి చేసేది ప్రధానంగా ఆయాత్మ బిడ్డ తల్లి చేతిని పట్టుకొని నడవడం పుణ్యాలను ఆచరించడంలాంటిది. ఆ తల్లే బిడ్డని ఎత్తి రొమ్ముమీద పెట్టుకొని నడచిపోవడం వరాలతో జీవించడం లాంటిది.

2. వరాల వర్గీకరణం

యెషయా ప్రవక్త మెస్సియాను గూర్చి చెపూ"ప్రభువు ఆత్మ అతనిమీద నిలుస్తుంది. ఆయాత్మజ్ఞానం వివేకం బలం సదుపదేశం తెలివి దైవభీతి పట్టించే ఆత్మ" అని నుడివాడు11, 2-3. ఇక్కడ హీబ్రూ బైబులు పేర్కొనే వరాలు ఆరే. కాని సెపవాజింత్ గ్రీకు అనువాదం ఈ వేద వాక్యాల్లో 'దైవభక్తి" అనే ఏడోవరం కూడ చేర్చింది, దీన్ని ఆధారంగా తీసికొని మూడవ శతాబ్దంనుండి క్రైస్తవ పారంపర్యం ఈ వరాలు ఏడు అని బోధిస్తూ వచ్చింది. ఈ సప్తవరాలద్వారా ఆత్మ మనలను వశం చేసికొంటుంది. మనం ఆ యాత్మని చెప్పచేతల్లో వుండి అతడు నడిపించినట్లుగా నడుస్తాం.

జ్ఞానంస్నానం ద్వారా మనం క్రీస్తులోనికీ క్రీస్తుశరీరమైన శ్రీసభలోనికి ఐక్యమౌతాం. కనుక ఆత్మ క్రీస్తుకొసగిన ఏడు వరాలు క్రీస్తునుండి మనకుకూడ సంక్రమిస్తాయి.

ఈ వరాల్లో తెలివి, విజ్ఞానం, వివేకం సదుపదేశం అనే నాలు బుద్ధిశక్తికి సంబంధించినవి. దైవభక్తి దృఢత్వం, దైవభీతి అనేవి చిత్తశక్తికి సంబంధించినవి. తెలివి, వివేకం, విజ్ఞానం అనేవి మనకు ప్రార్థనాశక్తిని దయచేస్తాయి. దైవభీతి, దైవభక్తి సదుపదేశం, దృఢత్వం అనేవి ఆయా సత్కార్యాలు చేయడానికి మనకు క్రియాశక్తిని దయచేస్తాయి. ఏడు వరాల్లోను శ్రేష్టమైంది విజ్ఞానం. అన్నిటికంటె తక్కువది దైవభీతి.

ఇక, ఈ యేడు వరాలకు ఆయా పుణ్యాలతో గూడ సంబంధం వుంది. ఇవి ఆయా పుణ్యాలమీద సోకి వాటిని పరిపూర్ణంచేస్తాయి. వరాలు నైతిక పుణ్యాలకంటె గొప్పవి. కాని దివ్యపుణ్యాలకంటె తక్కువవి. ఏయే వరాలకు ఏయే పుణ్యాలతో సంబంధం వుందో ఈ క్రింది పట్టిక సూచిస్తుంది.

వరం పుణ్యం
సదుపదేసం వివేకం
దైవభక్తి దైవారాధనం
ధృఢత్వం ధృఢత్వం
దైవభీతి మితత్వం,నమ్మకం
తెలివి,వివేకం విశ్వాసం
విజ్ఞానం ప్రేమ

అసలు వరాలు ఎన్ని? క్రైస్తవ సంప్రదాయం ఏడని చెప్తుంది. బైబుల్లో గాని క్రైస్తవ సంప్రదాయంలో గాని ఏడు పూర్ణసంఖ్య అనగా ఈ యేడు ఆత్మయిచ్చేవరాలన్నిటిని సూచిస్తాయి, ఆత్మ వరాలన్నీ ఈ యేడు వరాల్లో యిమిడి వున్నాయని భావం. యథార్థంగా ఆత్మవరాలు ఎన్నయినా వుండవచ్చు. ఆత్మ ఆయా వ్యక్తుల అవసరాలనుబట్టి ఎవరికీయవలసిన వరాలను వారికిస్తుంది. కనుక ఈ వరాలు చాల వుండవచ్చు. కాని అవన్నీ కూడ ఏదోవొక రూపంలో ఈ యేడింటిలో ఇమిడే వుంటాయి. ఈ యేడు ఆత్మ దయచేసే సర్వవరాలకూ సూచనగా వుంటాయి.

ఆత్మవరాల్లో కొన్ని మనకు వ్యక్తిగత పావిత్ర్యాన్ని సంపాదించి పెడతాయి - Gifts. వీటిద్వారా ఆత్మ మన మీద పనిచేసి మనలను పరిశుద్దులను చేస్తుంది. పై సప్తవరాలు ఈ కోవకు చెందినవే. ఇవికాక, సేవావరాలు లేక ప్రేషిత వరాలు అనేవికూడ వున్నాయి - Charisms. ఇవి మన వ్యక్తిగత పావిత్ర్యానికి ఉపయోగపడవు. తోడి ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగపడతాయి. అద్భుతాలు చేయడం, భాషల్లో మాటలాడ్డం, ప్రవచనం చెప్పడం, వ్యాధులు కుదర్చడం మొదలైనవి ఈలాంటివి - 1కొ 12, 8-10. పెంతెకోస్తు ఉద్యమంలో ఈ సేవావరాలకు ఎక్కువ ప్రాముఖ్య మిస్తారు.

పుణ్యాల ప్రకారమూ, వరాల ప్రకారమూ జీవించే భక్తునిలో ఆత్మఫలాలు నెలకొంటాయి. ఇవి మొత్తం తొమ్మిది. ప్రేమ, సంతోషం, సమాధానం, ఓర్పు, దయ, మంచితనం, విశ్వసనీయత, సాధుశీలత, ఇంద్రియ నిగ్రహం అనేవే ఈ ఫలాలు. పౌలు గలతీయుల జాబు 5,22లో వీటిని పేర్కొన్నాడు. వీటివల్ల హృదయంలో గొప్ప సంతోషభావమూ మాధుర్యభావమూ నెలకొంటాయి. ఈ ఫలాలు సప్తవరాలకంటెగూడ శ్రేష్టమైనవి.

ఆత్మఫలాలు పరిపక్వానికివచ్చిన హృదయంలో అష్టభాగ్యాలు ఉద్భవిస్తాయి. ఆత్మ మనకు దయచేసే అత్యున్నత వరప్రసాదాలు ఈ యష్టభాగ్యాలు. పర్వత ప్రసంగంలో ప్రభువు వీటిని ఎన్మిదింటినిగా పేర్కొన్నాడు, అవి దీనాత్మత, శోకార్తత, వినుమత, నీతి నిమిత్తం ఆకలిదప్పలు అనుభవించడం, దయ, నిర్మలత్వం, ధర్మార్ధం హింసలు అనుభవించడం, శాంతిస్థాపనం - మత్త 5,3-10. వీటివల్ల మనకు పరమానందం కలుగుతుంది, మనం మోక్షభాగ్యాన్ని అనుభవిస్తాం, ఆ భాగ్యం ఈ లోకంలో ప్రారంభమై పరలోక్షంలో పరిపూర్ణమౌతుంది. ఈ లోక్షంలో ఆత్మ మనకు దయచేసే వరప్రసాదాలన్నిటి లోను ఈ యష్టభాగ్యాలు అనేవి మహోత్కృష్టమైనవి. ఈ విధంగా ఆత్మ మనకు తన పుణ్యాలనూ, వరాలనూ, ఫలాలనూ, అష్టభాగ్యాలనూ క్రమంగా దయచేస్తుంటుంది. ఇవి ఒకదానికంటె ఒకటి గొప్పవి.

3. సప్తవరాలను సాధించడం ఏలా?

మనం చిన్నపిల్లలంగావుండి జ్ఞానస్నానం పొందినపడే ఆత్మనుండి వరప్రసాదాన్నీ పుణ్యాలనూ సప్తవరాలనూగూడ స్వీకరిస్తాం. ఈ దివ్యశక్తులు మన హృదయంలో బీజాల్లాగ వండిపోతాయి. మనం పెరిగి పెద్దవాళ్లమై బుద్ధివివరం వచ్చాక ఈ యాధ్యాత్మిక శక్తులు మనలో పనిచేయడం మొదలిడతాయి.

వరాలను సాధించాలంటే మొదట వివేకం న్యాయం మొదలైన నైతిక పుణ్యాలను జాగ్రత్తగా పాటించాలి. నైతికంగా విశుద్ధ జీవితం జీవించనివాళ్ల హృదయాల్లో ఆత్మ వసించదు. అలాగే మనం పాపంనుండి వైదొలగుతుండాలి. లౌకిక వ్యామోహాలకు దూరంగా వుండాలి, మనం స్వీకరించింది లౌకికమైన ఆత్మకాదు, దేవుని ఆత్మ - 1కొరి 2, 12-14.

ఆత్మ మన హృదయంలో ఓ దేవాలయంలోలాగ వసిస్తుంటుంది -1కొరి 6,19. మనం ఈ ఆత్మసాన్నిధ్యాన్ని గుర్తించాలి. ఆయాత్మ మన హృదయంలో పట్టించే ప్రేరణలనూ ప్రబోధాలనూ అర్థంచేసుకోవాలి. ఆ దివ్యవ్యక్తిపట్ల భక్తి పెంపొందించుకోవాలి. అతడు కష్టాల్లో సుఖాన్నీ, గ్రీష్మంలో చల్లదనాన్నీ దుఃఖంలో ఉపశాంతినీ దయచేసేవాడు. అలాంటి ప్రభువుని తన సప్తవరాలను దయచేయమని అడుగుకోవాలి. తన్ను మనవిచేసే భక్తుల వేడికోలును ఆ యాత్మడు తప్పక వింటాడు.

ప్రశ్నలు

1.సదుపదేశాన్ని వివరించండి.

2.దైవభక్తిని గూర్చి తెలియజేయండి.

3.దృఢత్వాన్ని విశదీకరించండి.

4.దైవభీతిని వివరించండి.

5.తెలివిని గూర్చి తెలియజేయండి.

6.వివేకవరాన్ని విశదీకరించండి.

7.విజ్ఞానవరం ప్రాశస్త్యాన్ని తెలియజేయండి.