బెంజమిను ఫ్రాంక్లిను జీవితచరిత్రము/పదియవ ప్రకరణము
పదియవ ప్రకరణము
స్వయంకృషి
పుస్తక భాండాగారములోని పుస్తకము లన్నియు బెంజమిను చదివెను. ఇతను మొదట దేశ చరిత్రలను, మహాపురుషుల జీవన చరిత్రములను, జదివినటుల గనబడుచున్నది. "చరిత్రపఠనోద్భాసితాభిప్రాయము" లను నొక వ్యాసము నితడు వ్రాసెను. ఏబది సంవత్సరము లైరోపాలోని రాజుల దివాణ వ్రాసిన విధమున నీ వ్యాసము వ్రాయబడినదిగాని, నూతన సీమలలో స్వానుభవము లేని పడుచువాడు వ్రాసినట్లు కనబడదు. ఈ వ్యాసము చాలకాలము ప్రచురములేక పడియుండెను.
ధర్మాత్ముల నందఱిని సమాహూయముచేసి, యొక సంఘమును స్థాపించవలెనని బెంజమిను యత్నించి, తన స్నేహితులతో నీ సంగతిని ముచ్చటించ, వారందు కంగీకరించిరి. "ముక్తులు - స్వాస్థ్యులు సంఘము" అని దీనికి బేరుపెట్టుట కితను తలచెను. ముక్తులన, పాపము, ఋణములనుండి ముక్తిని పొందినవారు. ఈ రెండు బాధలు లేనందున, స్వాస్థ్యులు. మున్ముందుగ ధర్మాచరణము నితడు పూర్ణత్వమును బొందగోరెను. ఏకాలమందును తప్పుచేయక యుండవలెను. పొరపాటుచేత జేయు స్నేహితుల ప్రోద్బలము చేతజేయు, తప్పులను ముందుకు జేయకుండుటకు నేను ప్రయత్నించితిని. 'ఇది తప్పు' , అదియొప్పు' అని నాకు తెలియిను. అట్టి స్థితిలో, తప్పునుమాని, యొప్పు నెందుకు నేను చేయరాదు? ఇదియే కష్ట మని తోచుచున్నది. ఒక తప్పును మానివేయుటకు ప్రయత్నించినందున, నకస్మాత్తుగ మరియొకటి చేయనగుచున్నది. అజాగ్రత్తగ నుండుట వలన, నే నలవాటు చేత తప్పు, మార్గములోనికి వచ్చుచుంటిని. బుద్ధిలేనందున, నామనస్సు విచ్చలవిడిగ వెళ్లుచున్నది." అని బెంజమిను వ్రాసెను.
అత డాచరణలోనికి దెచ్చిన ధర్మము లివి:- యుక్తాహారము, మౌనము, క్రమము, శాంతము, దాంతము, నిర్మలము, శుచిత్వము, పత్నీవ్రతము, అణకువ, శ్రద్ధ, భక్తి, న్యాయము, క్షుప్తిత ఈ పదమూడు ధర్మములను వారమున కొక్కొక్కటి చొప్పున యాచరణ జేయుచు బ్రతిధర్మమునకు సంవత్సరమునకు నాలు గావృత్తుల నిత డిచ్చుచుండెను. ఇది సానుకూలముగ తుదముట్టుట కష్టమని తోచెనుగాని, కొన్నిరోజులకు వీనిలాభము స్పష్టముగ నతనికి గనబడెను. అన్ని ధర్మములలోను, రెండుమాత్ర మితడు ప్రవృత్తిలోనికి దెచ్చుటకు వీలులేకపోయెను. అవి, "క్రమము, అణకువ". పేరుకు మాత్రముగాని, నిజమైన యణకువ తనకు లేదని యతడు వ్రాసెను. గర్వము పాపిష్టిది. దానికి బదులు, యణకువయుండి, మనుజుడందుకు గర్వించిన బాగుగనుండును. క్రమముగ బనిచేయుట కొంచె మితనికి దెలియును. అయిన, నేపని నెప్పుడు చేయవలయునో, యేయేవస్తువు నెక్కడ నుంచవలయునో, బెంజమినుకు బాగుగ దెలియదు.
అన్ని ధర్మములను సానుకూలముగ నాచరణలోనుంచి, మనుజు లెంతో శ్రమపడిన పక్షమున, నొక ధర్మమునందు వారికి స్థిరబుద్ధి కలుగును? ఒక సమయమున మనకొక ధర్మమునందు బుద్ధికలిగినను, మనమాత్మ నిగ్రహము మాత్రము చేయ లేము. అభ్యాసమువలన నిది పొందవలసినదియేకాని, మరియొకటి కాదు. బెంజమి నాచరణచేసిన విధ మతని దేశ కాలావస్థల కనుగుణ్యముగ నున్నది. అంతకు మించినది మంచిది నీకు తెలిసిన, నీవు దాని ననుష్ఠించుము. "ముందురాబోవువారి కీ సంగతిని తెలియజేయుట మంచిది. ఈ ప్రకారము నడచుట చేత, దైవానుగ్రహమువలన, నేను వృద్ధాప్యములో సుఖజీవనమును బొందితిని. రాబోవు కష్టసుఖములు దై వాధీనములు. ఒక వేళ నవి వచ్చినను, గతములో ననుభవించిన వానిని జ్ఞప్తికి దెచ్చు కొని విరాగముతో వీనిని భరింతును. యుక్తాహారము పుచ్చుకొనుట చేత, నిరోగిగ నుంటిని" అని, 79 సంవత్సరములు వయస్సున బెంజమిను వ్రాసెను.
ధర్మాచరణ కష్ట సాధ్యమైన పనియని తెలిసి, "ముక్తులయు స్వాస్థ్యులయు సంఘము"లో బ్రవేశించుటకుముందు, ప్రతివాడును, పదమూడు వారములలో కనీస మొక వారమైన నాత్మ పరిశోధన జేసినగాని యర్హత కలుగ దని బెంజమిను నిబంధన చేసెను. సంఘము మాత్రము సమకూడలేదు. వ్యవహారము దట్టమయినందున, దీని విషయమై శ్రద్ధవహించుట కతనికి వీలులేకపోయెను.
1733 వ సంవత్సరములో భాషలను చదువుట కిత డారంభించి, కొద్దికాలములో, "ఫ్రెంచి, ఇటాలియా, స్పానిషు" భాషలను వ్రాయను చదువను నేర్చెను. ఇతనికి చతురంగము నాడుటయం దతిప్రేమ గనుక, కొంతవఱ కితడు 'ఇటాలియా' భాషను వేగముగ నేర్చుకొనుటకు వీలుకలిగెను. ఇతనివలె నిటాలియా భాషను నేర్చుకొనుచున్న స్నేహితు డొకడు, బెంజమిను చదువును మాని యాటకు వచ్చినటుల జేయుచుండెను. ఓడినవాడు మరల యాటకు వచ్చులోపున క్రియాపదములను వర్ణించుటయో లేదా భాషాంతరీకరణము చేయుటయో యీ రెండు పనులలో నేదియైన చేయవలయు నని నిర్ణయించుకొని, వారు సరిసమముగ నాడుచు వచ్చిరి. ఈ విధమున, నిటాలియా భాషను వీరు సాంతముగ నేర్చిరి. ఈ భాషలను బూర్ణముగ జదివి, 'లాటిను' భాషను జదువ నేర్చి, దాని నితడు తుద ముట్టనభ్యసించెను.
సంగీతమును విలాసార్థముగ నిత డారంభించి, యెక్కుడుత్సాహముతో దానిని నేర్చుకొనెను. ఇత డన్ని వాయిద్యములు వాయించుట యెఱిగి, స్వరజ్ఞానమును బొందెను. ఇతడు ప్రకృతిని కన్నులు విప్పి పరీక్షించుచుండెను, దాని సంపద్వైభవములకు సంతసించు చుండెను. ఇతడు ప్రకృతిలో మునిగి యుండెను.
'స్వీడను' దేశపు సర్కారుచే పంపబడిన, వృక్షశాస్త్రజ్ఞుడు 'కాము' అను నతడు, 174 సంవత్సరములో బెంజమినును జూచెను. వీరిరువురికి స్నేహముకలిగెను. 'తమలోదాము మాటలాడుకొను శక్తి చీమలకు కల దనుటకు నిదర్శనముగ, నొక స్వానుభవ విషయమును బెంజమిను నాతో, జెప్పెను. పంచదారను చీమచూచి, తనకన్నములోనికిపోవును. కొంతసేపటికి, వందలు వేలు చీమలు వచ్చి, పంచదారను తీసికొనిపోవును. అటులనే, చచ్చిన యీగను జూచి తానొక్కటి దానిని మోసికొని పోలేక పోయిన పక్షమున, వెంటనే చీమ కన్నములోనికి బోవును. క్రమక్రమముగ, చీమలు ప్రాకుచువచ్చి, దానిని తీసికొనిపోవును. ఒక సమయమున చిన్న కుండలో తేనెవేసి, దానిని పదిలముగ బెంజమిను దాచెను. దానిలోమెల్లగ ప్రవేశించి, కొంత తేనెను చీమలు తినివేసెను. వానిని జూచి దులిపి వేసి, యాకుండ నింటి వెన్నుకు త్రాటితో నతడు వ్రేలగట్టెను. పొరబాటున నొకచీమ దానిలోనుండి పోయెను. పైకి ప్రాకిపోవుటకు వీలు లేక, నటునిటు తిరిగి, త్రాడుమీదుగ వెన్నుకుపోయి, తప్పించుకొని క్రిందికి దిగెను. ఇది దిగిన మరియొక యరగంటకు వంద చీమలు గోడమీద ప్రాకుచు వెన్నెక్కి, త్రాడుమీదుగ కుండలోనికి దిగిపోయి, తేనెను తిను టకారంభించెను. తుదకా తేనే నంతయు నవి తినివేసెను". అని, తనతో బెంజమిను చెప్పినట్టు, స్వీడనుదేశపు పండితుడు వ్రాసెను.
బుద్ధిమంతు లేసంగతిని జూచినను లెస్సగ విచారించుదురు. తుపానుల మార్గమును కనిపెట్టి చెప్పుటకు బెంజమిను కవకాశమయ్యెను. "పూరురిచ్ఛర్డు" పత్రికలో, నొక నాటి రాత్రి 9 గంటలకు చంద్రగ్రహణము పట్టునని, వ్రాయబడియుండెను. దానిని జూచుటకు బెంజమిను సమకట్టెను. గ్రహణము పట్టుటకు పూర్వమొకగంట కీశాన్యమూలనుండి, గాలి వాన ప్రళయముగ లేచి, యారాత్రియు మరుచటి దినమంతయు గొట్టుచుండెను. సముద్రముమీద, దేశమందంతట నది వ్యాపించి, చాలనాశము జేసెను. ఈ సంగతిని నూతన సీమలలోని వార్తాపత్రికలు ముచ్చటించెను. బోస్టను పట్టణములోని వార్తాపత్రికలలో తుపాను సంగతియేకాక, గ్రహణము సంగతికూడ వ్రాయబడియున్నందుకు, బెంజమినాశ్చర్యపడెను. బోస్టనులో నితనియన్నగారికి లేఖనువ్రాయ, గ్రహణము పట్టువదిలిన గంటకు తుపా నారంభమయిన దని వానివలన విని బెంజమిను నాశ్చర్యపడెను. సకృచ్ఛముగ వీని సంగతిని దెలిసికొని, యీశాన్యమూలనుండి వచ్చి యట్లాంటికి తీరమందు వీచు తుపానులు వెనుకకు నడచును - అనగా, నైఋతిమూలనుండి ఈశాన్యములకుబోవుచు గ్రమముగ వీనికి బలము తగ్గును - అను సంగతిని బెంజమిను గనిపెట్టెను. ఈకాలములో, నితనిచే "ఫ్రాంక్లి నుస్టవు" చేయబడెను. రెండుపురుషాంతరములవారు దీనిని వాడుకొనిరి. అటుపైని దీనిని పరులు వృద్ధిచేసిరి. కఱ్ఱలు లేక పోవుటవలన, పొగ భాధచేతను, దీని నితడు కనిపెట్టుట కుద్యుక్తు డయ్యెను. దీనివలన నతడు లాభము పొందవలెనని కోర లేదు. లాభమును బొంద లేదు. "పెన్సిలువానియా గవర్నరు దీనినిజూచి, సంతోషించి, దీనిమాదిరిని మరికొన్ని తయారుచేయుటకు హక్కు నాకే యుండునటుల చేయుదు ననినాతో జెప్పెనుగాని, నేను దానికి సమ్మతించలేదు. ఇతరులుకనిపెట్టిన క్రొత్త సంగతులవలన మనమెటుల లాభమును బొందు చుంటిమో, యటులనే మనము కనిపెట్టిన వానివలన నితరులుకూడ సంతసించవలెను. పరోపకారమునకు కదా, మనము కష్టపడుచుంటిమి" అని బెంజమిను వ్రాసెను.
సభవారు వాదముచేయు చున్న కాలమున, నితడు లేకరి గనుక, వారి వాదములయం దిష్టము లేనందున, గోళ్లు మీటుచు కాలయాపనముచేయుట కితనికి కష్టముగ నుండెను. అందుచేత నితని స్నేహితుడు 'లోగను' అనువాడు ఫ్రెంచిభాషలో వ్రాయబడిన 'చమత్కార చతుష్కోణము" అను పాటను నేర్పుపుస్తకము నితని చేతిలో బెట్టెను. ఈ ప్రక్క పుటలో వ్రాసినదే అట్టి "చమత్కార చతుష్కోణము".
ఈ చౌకములో నిలువుగనున్న యంకెలను కలిపిన, 260 మొత్తము వచ్చును. సగము వరుసకలిపిన, వానిలో సగము మొత్తము వచ్చును. ఆరోహణ, అవరోహణగ, ఐమూల లంకెలను కలిపిన, 260 మొత్తము వచ్చును. అత డీ చౌకమును చతురముతో గలుపుచు కాలము పుచ్చుచుండెను.