బెంజమిను ఫ్రాంక్లిను జీవితచరిత్రము/పదునొకండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదునొకండవ ప్రకరణము

దేశోపకారి


సుశీలుని వ్యాపారము సాగిన, నతని సుశీలము వన్నెకెక్కును. అట్టుసాగుటవలన నితనిమనస్సు కరగును, నమ్రతవహించు, సంతోషముగనుండును. కర్తృత్వమువలన వచ్చిన సొమ్ముకర్తకు మేలు చేయుననుట సందేహము. అసాధారణమైన ధర్మబుద్ధి, వివేకము కలిగియుండినగాని.కర్తశ్రేయస్సును పొందుట కష్టము. మానవశరీరము కనుక ధనము దీనికి మాంద్యము కలిగించును. అందుచేత ప్రజలకు వీ దుపకారియగుటకు వీలులేదు. ముందు వెనుక లాలోచించి, క్రమముగ వ్యాపారము సాగుటవలన లాభమును బొందువాడు, చాలకాల మనుభవించి, తుదకు స్వార్జితము నుసద్వినియోగముచేయును.

బెంజమిను దినదిన ప్రవర్థమానముగ వృద్ధిపొందుచు వచ్చెను. పరగణాలో నితని 'గెజెటు' వార్తాపత్రిక పేరుకెక్కి, ముఖ్య పత్రిక యయ్యెను. 'పూరురిచ్ఛర్డు' పత్రిక ప్రచురింపబడి, జనులకు సంతోషము కలుగ జేయుచుండెను. వీనివలన బెంజమినుకు లాభము వచ్చుచుండెను. వ్యాపారము సాగినకొలది స్వగ్రామస్థులమన్న నల నతడు బొందుచు వచ్చెను. పురాతనపద్ధతి నవలంబించి పట్టణమును రాత్రి వేళల కాపాడువారి సంఘమును సంస్కరించుట కితడు మొదట సమకట్టెను. "ఎపేట తలారు లా పేటను రాత్రి వేళ గాపాడుచుండిరి. రాత్రిసంచారములో దనకు దోడుగ నుండుట కింటి యజమానుల కొందఱిని తలారి పిలుచుచుండును. అటుల తోడుగ బోవుట కిష్టములేనివారు, తలారికి సంవత్సరమునకు సుమారయిదు రూప్యము లిచ్చుచుండిరి. ఈ ధనమును వేతనముగ నిచ్చి, వీ డితరులను దనకు సహాయముగ రాత్రి వేళలదీసికొని బోవుటమాని, యాధనమును తానేవాడుకొనుచుండెను. ఇందుచేత వానిపని బాగుగనుండెను. ఒకది రాము సారాయిని తలారివలన బుచ్చుకొని, యతనివెంట ననేక దుండగీండ్రుపోవుచున్నందున, వారితో గలిసి తలారితో బోవుటకు గొందఱు గృహస్థు లిష్టపడలేదు. వీరు గస్తీతిరుగుట మానివేసిరి. చాల రాత్రులు వీరు త్రాగి మైమఱచియుండుట కల"దని బెంజమిను వ్రాసెను.

'అగ్ని నివారణ సైన్యము' నొక టితడు స్థాపించెను. ఈ దండులో జేరిన ప్రతివాడు తోలుసంచులు, బుట్టలు మొదలగువానిని సిద్ధముగ నుంచుకొనవలెను. ఎక్కడనైన, నిప్పు తగులుకొనిన, నా స్థలమునకు వీరందఱు తమవస్తువులతో బోయి, నిప్పునార్పు చుండిరి. నెలకొక పర్యాయము వీరు కలిసికొనుట కలదు. అప్పుడు, కాలానుగుణముగ, దండు యొక్క పద్ధతులను మార్చుటయో, లేక నూతనపద్ధతులను జేయుటయో జరుగుచుండెను.

1743 సంవత్సరము మే నెలలో, "అమెరికా శాస్త్రపరిశోధన సంఘము"ను స్థాపించుట కితడు ప్రయత్నముచేసెను. ఈ సంఘముయొక్క ముఖ్యోద్దేశములను వ్రాసి, యతడు స్నేహితులకు బంపెను. మొక్కలు, దుంపలు, వేళ్లు, వీనిగుణములు, నుపయోగములు, వీనిని నలుగురికి తెలియజేయు విధము, ఖనులు, లోహములు, వర్తకవిశేషములు, నదులు, వీనియుపనదుల సంగమము, సరస్సులు, పర్వతములు, ఉపయోగమైన జంతువులను వృద్ధిజేయుట, తమదేశములో లేని జంతువులను బరదేశములనుండి తెప్పించి, వానిని బెంచువిధము, మొక్కలు నాటుట, తోటలు వేయువిధము, ఈ మొదలగు విశేషాంశములను జర్చించుటకు నీ సంఘమును సమకూర్ప వలెనని బెంజమిను కోరెను. "తనకంటె గొప్పవాడు సమకూడు వఱకు, యోచనాంశములను వ్రాసి పంపినటువంటి బెంజమిను, సంఘమునకు కార్యదర్శిగ నుండుటకు సమ్మతించెను" అని బెంజమిను వ్రాసెను. సంఘము రూపముబొంది కొన్ని సంవత్సరములవఱకు వర్దిల్లెను. అయినను, దీనివలన గలిగిన మేలు శాశ్వతమైనదిగాని, యెన్నిక పొందినదిగాని కాలేదు. ఎందుచేతనన, దీనినివృద్ధి చేయుటకు దగినపండితు లా కాలమున విశేషముగ లేరు.

1740 సంవత్సరము మొదలు 1748 సంవత్సరము వఱకు, 'ఐరోపా' ఖండము సమరకల్లోలావృతమై యుండెను. 'న్యూ ఇంగ్లాండు' సంస్థానములలోని ప్రజలు తమ తీరములకు సమర భయము కలుగునని యెంచి, రక్షణ దుర్గములుగట్టి, సైన్యము జతపఱచి, యుద్ధనావలను సన్నద్ధముచేసి, సంరక్షణకు యుక్తమైన నితర సన్నాహమును జేసిరి. 1744 సంవత్సరము వఱకు, వీరు భయపడుటకు గారణము కనపడలేదు. కాని, నాడు మొదలు 1748 సంవత్సరములో జరిగిన "ఐక్సులాచపల్" సంధివఱకు నూతన సీమలవారు సమరభయ కంపితగాత్రులైనను, "ఆత్మసంయమ శతృచ్ఛేదము"లకు తగిన సన్నాహమును వీరు చేయలేదు. బెంజమినుయొక్క ప్రేరణచే, గ్రామస్థులు స్వగ్రామమును రక్షించుటకు బూనుకొనిరి.

సమ రాద్యంత సంప్రాప్తదు:ఖములను బెంజమిను వివరణతో వ్రాసెను. "రణభేరినాదము వినినతోడనే, నందఱు భీతమానసులగుదురు. ఒకని కొకడు సహాయముచేయు నను నమ్మకము లేదు గాన, ప్రతిమనుజుడు పరారియగును. తమయొద్దనున్న దానికంటె హెచ్చుధనము నిమ్మని శత్రువులు పీడించుదు రను భయము చేత, భాగ్యవంతులు ముందుగ పరారు లగుదురు. పెండ్లాము, బిడ్డలు కలవాడు, వారిరోదనముజూచి వారిని దోడ్కొనిపోవును. ఎక్కడజూచినను రోదనమే........ కొందఱు వెచ్చగనూర్చుచు, మరికొందఱు ముఖమున దప్పిదేర, పరుగిడుచుందురు భయావవామాహవము" అని బెంజమిను వ్రాసెను. "ఐక్సులాచపల్" సంధివలన వీరు నిర్భయు లయిరి.

బెంజమిను తలిదండ్రులు నేటివఱకు సజీవులయి యుండిరి. వయోవృద్ధులు గనుక, వృద్ధాప్యముచేత వారు బాధపడుచుండిరి. వారు శ్రమపడుటకు విచారించి, బెంజమిను వారికి నుత్తరములను వ్రాయుచుండెను. 80 సంవత్సరములు జీవించి, 1744 సంవత్సరమున నితనితండ్రి, జోషయా ఫ్రాంక్లిను స్వర్గస్థు డయ్యెను.

అనేక సంవత్సరములు విద్యుచ్ఛక్తి విషయమై బెంజమిను పాటుపడెను.పదార్థ విజ్ఞాన శాస్త్రజ్ఞు డని పేరొందెను. విద్యుత్సంబంధప్రయోగముల నితడు జేయుచుండెను. ఇటు లాఱుసంవత్సరములు గడిచినవి. పిడుగులోని శక్తివిద్యుచ్ఛక్తియని కనిపెట్టిన మహనీయు డితడే.