Jump to content

బెంజమిను ఫ్రాంక్లిను జీవితచరిత్రము/పండ్రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పండ్రెండవ ప్రకరణము

మహోపకారములు - ఇతరవ్యాపారములు


జ్ఞానాభివృద్ధికి బాటుపడిన విధమున, తత్ప్రచారమునకు దగిన సదుపాయములను బెంజమిను చేసెను. న్యూయార్కు పట్టణములోగాని పెన్సిలువానియా పరగణాలోగాని, యీడువచ్చిన బాలురు చదువుకొనుటకు దగిన పాఠశాలలేక పోవుటవలన, పదమూడు సంవత్సరములు ప్రాయముగల తన కుమారుని విద్యాభ్యాసము నిలిచిపోయెను. పాఠశాల లేమిని బోగొట్టుటకై, జంటో సమాజము వారితో గూడి, బెంజమిను శ్రమపడి, 5000, కాసులు చందాను ప్రోగుచేసెను. వెంటనే, పాఠశాలస్థాపింపబడెను. గుంపులు గుంపులుగ, బాలురు పాఠశాలకు బోవుచుండిరి. ఇదియే, 1779 సంవత్సరమున, "పెన్సిలువానియా సర్వకళాశాల" యయ్యెను. నేటివఱ కీకళాశాల వృద్ధిలోనున్నది.

"డాక్టరు ధామస్సు బాండు" అను వాడూహించ, బెంజమును సహాయముచేత నొకవైద్యశాల పెట్టబడెను. "నీ సహాయములేనిది, యేపని జరుగదు. వైద్యశాలను స్థాపించుటకు సొమ్ము నిమ్మని నే నెవరినడిగిన, వారు నీ సలహా నడిగితినో లేదోయని నన్నడుగుచుందురు. నేను నీ సలహా నడుగ లేదని చెప్పిన, వారు వెనుకనుండి చందా నిచ్చెద మని చెప్పి వెళ్లుదురు" అని డాక్టరు బాండు బెంజమినుకు వ్రాసెను. క్రైస్తవదేశములలో బాగుగ జరుపబడుచుండిన వైద్యశాలలలోనిది యొకటియై యున్నది.

బెంజమిను స్వదేశమునందలి ప్రజలకు విరోధియై, పరదేశమువారిచే మెప్పుబడసిన మనుజుడని జెప్పరాదు. అతనిని దెలిసినవారతనిని లెస్సగబ్రేమించుచుండిరి. ప్రతికూలప్రవర్తన కాగ్రహపడనివారిని మర్యాదచేసి, వారితో నితడు మర్యాదగ మాటలాడుచుండెను. తల్లి, సోదరులు, మిత్రులు, చెల్లండ్రు - వీరి కితనువ్రాసిన యుత్తరములు చదువుట కింపుగ నుండును. అతని యుచ్చదశలో, నతని తల్లి, వృద్ధాప్యముచేత నస్త్రశస్త్రములణిగి, క్రమముగ జీర్ణించుచుండెను. 84 సంవత్సరములు వయస్సు కలదైనను, తల్లికుమారునికి బ్రత్యుత్తర మిచ్చుచుండెను. 1752 సంవత్సరము మే నెలలో నామె స్వప్నములేని నిదురజెందెను.

తల్లి మరణానంతరమున, నితడు తనచెల్లెలు జేనుకు వ్రాసిన యుత్తరములు దయారసపూర్ణములయి యున్నవి. తన చెల్లెలికి గూతురు పుట్టినదని విని, "నా మేనకోడలిని ముద్దిడినాను. అది నోటిలోబెట్టుకొని కొఱకుట కొక కాసుపంపితిని. దానిని బుచ్చుకొనుము. ముందుకు నీ కూతు రీకాసుతో బిక్కలను కొని కొఱకుటకు వీలగు"నని చెల్లెలికి బెంజమిను వ్రాసెను. ఆమె పిల్ల చనిపోయినపుడు, "మనము బ్రతికిన కొలది, మనకిట్టి విపత్తులు సంప్రాప్తమగును. దైవానుగ్రహమువలన నిట్టివి సంప్రాప్త మగునని, దైవవిధికి మనము బద్ధులమని తెలిసినను, మనవలె నిదివఱ కెంద రిట్టి కష్టము ననుభవించిరో, ముందునకెంద ఱనుభవించెదరో అను జ్ఞానము లేక, మనకష్టము భరించుటకు శక్యము కానిదని తలంచెదము. ఉపశమనపుమాట లెన్ని చెప్పినను కార్యము లేదు. రక్తస్పర్శగనుక, దు:ఖము కొంతకాలమువఱకు వ్యాపించి, క్రమముగ జల్లారును. ఇది నా స్వానుభవమువలన చెప్పినమాట. కష్టములో నీవు దైవకటాక్షములను మఱచిపో నందుకు నే నెంతయు సంతసించుచున్నాను. దైవకృపచేత, నీకు మిగిలిన పిల్లలు సజీవులుగ నుందురుగాక" అని బెంజమిను వ్రాసెను.

ఎన్ని పనులున్న నతడు శాస్త్రాభిలాషను బోగొట్టుకొనలేదు. ఏకముగ విద్యుచ్ఛక్తి విషయములోనే నీతడు పాటుపడుచుండ లేదు. ఇతని ప్రోత్సాహమున, వాయవ్యమూలగ నాశియాఖండమునకుబోవు మార్గమునుగని పెట్టుటకు, ఫిలడల్‌ఫియాలో వర్తకులందఱు సమావేశమై, యుత్తరధ్రువమున కొక యోడను బంపుటకు సన్నాహము జేసిరి. ఇత డాహూయము చేసినందున, స్వీడనుదేశపు వృక్షశాస్త్రజ్ఞుడు 'కాము' అనువా డమెరికాకు వచ్చెను. బెంజమిను ఆలోచనలను మన్నించువారి నందఱిని, పండితుని దర్శనమున కతడు తీసికొని వెళ్లెను. ఊపిరితిత్తులనుండి వెలువడు వాయు వపరిశుద్ధమైనదని కనిపెట్టినవాడు బెంజమిను, గృహములలో గాలి వ్యాపకము బాగుగ నుండవలయు నని దృడముగ సిద్ధాంతము జేసినవా డితడే.

ఇతని మతవిషయాభిప్రాయములు మారలేదు. మనుజులకు మతము ముఖ్యమైన దను దృఢనమ్మక మితనికి గలదు. పిచ్చిభ్రమలను ఖండించుటకు బదులు, సత్యమును బ్రకటనము జేసి, వాని నంతరింప జేసిన, మతము పరిశుభ్రముగ నుండునని, ఇతని యభిప్రాయము. క్రీస్తుమతముయొక్క సత్యాధిక్యమును విశేషముగ గుర్తెఱిగినవా రితనికంటె మరియెవరును లేరు. గృహములు, వృక్షములు, ప్రదేశములు మొదలయిన య చేతనములు పవిత్రము లయినవి యని, యేభయముకలదో, యదిమాత్ర మితనికి లేదు. "ఇతరులనిమిత్తము నేను పాటుపడినపుడు, వారిని నే ననుగ్రహించితి నని తలంచక, విధాయక మైనపనిని జేసితి నని తలంచెదను. నాయాత్రలలో నేమి, నేను స్థిరముగ నుండినపుడేమి, జనులు నన్నుదయతోజూచుచుండిరి. తగిన ప్రత్యుపకారము వారికి నేనెన్నటికిని జేయ లేను. స్వల్ప కార్యములవలన దైవము సంతసించి, నా కనంతముగ కటాక్షములను జూపెను. పరమేశ్వరుని కటాక్షములను బొందినందుకు, నాకృతజ్ఞతను జూపుటకు, ఆయనకు పిల్లలు, నాకు సోదరు లగువారి నిమిత్తము నేను పాటుపడుదును. వందనములును, మన్ననలును చేయుట చేత, మన కొండొరులకుగల బాధ్యతలు తగ్గవు, మనకు దైవమునకు గలబాధ్యత లంతకన్న తగ్గవు. నేనూహించిన సత్కార్యములవలన, నాకును స్వర్గమునకు నెంతదూరమో మీరు చూడుడు! శాశ్వతమై, యనంతమైన సుఖస్థితియె స్వర్గము. అట్టిపదవిని బొందుటకు నే ననర్హుడను. ప్రపంచములో నామకార్థ మొకసత్కార్యమును జేసి, స్వర్గమును బొందవలయు నని కోరిన వానికన్న, దాహశాంతి కొకనికి నీరునిచ్చి, తోటల నియ్య మని దైవమును కోరినవాడు నయమని తోచును. పరమేశ్వరుని కృపచేత, మన మసంపూర్ణమైన మిశ్రమసుఖముల నీ ప్రపంచములో ననుభవించుదముగాని, మన కర్హతకలిగికాదు; దైవకృపవలన కలిగిన స్వర్గ సుఖమెట్టిదిగ నుండును! దానిని పొందుటకర్హు డ నని గర్వము, నిరీక్షించుటకు బుద్ధిహీనత, కోరుటకు కోరికయు నాకు లేదు. నన్ను పుట్టించి పరిపాలించు ప్రభువును నేను శరణుజొచ్చెదను. పుత్రవాత్సల్యముతో గాపాడు ప్రభువు నన్ను దు:ఖసముద్రములో ముంచడు. నేనొక్కొక్కప్పుడు పొందుకష్టములు నామేలున కతడు పంపును" అని మతమును గురించి తనయభిప్రాయమును దెలిపి యున్నాడు.

పుస్తకములను చదువుటకును, మననము చేయుటకును, స్నేహితులతో సంభాషించుటకును బెంజమినుకు కాలము దొరక లేదు. ఇతడు సర్కారుపనిలో ప్రవేశించిన జూడవలయునని కోరినవారికోరిక నీడేర్చుటకు దగిన కాలము సమకూరెను. పెన్సిలువానియా పరగణాను రక్షించుటకు చేసిన సన్నాహము వలన, ప్రజలు, స్వగ్రామస్థులు సంతోషించుటయేకాక, రాజ్యాంగముల వారు కూడ సంతసించిరి. "నేను రిత్తగ నుంటి నని యెంచి, ప్రజలు తమపనులను నెర వేర్చుకొనుటకు నన్ను పట్టిరి; పట్టణపుపెద్దలు కూడ నన్ను బనిలోనికిలాగిరి" అని యితడు వ్రాసెను.

1753 సంవత్సరమున, "అమెరికా పోస్టుమేస్టరు జనరలు" మృతినొంది నందున, బెంజమిను, విల్లియంహంటరు, వీరిరువురి నాపనిలో సర్కారువారు నియోగించిరి. ఎన్నడు నమెరికాలోని తపాలాఫీసులవలన డబ్బువచ్చుటలేదు. వీరు వానిని సంస్కరించి, లాభము వచ్చునటుల జేసిన, వీరికి మూడువందల కాసులు చొప్పున వేతన మిచ్చుటకు వారునిర్ణయించిరి. అందఱికంటె, దేశ సమాచారములు తనకు బాగుగ దెలిసినందున వానిని సంస్కరించుటకు బెంజమిను సమకట్టెను. 1753 సంవత్సరము గ్రీష్మఋతువులో, దేశములోని తపాలాఫీసులను బరీక్షించుటకు బయలు దేరెను; నాలుగు సంవత్సరముల వఱకతడు కష్ట పడెను. జనుల కుపయుక్త మగు గొన్ని సంస్కారములను బెంజమిను చేసెను. 1753 సంవత్సర మంత మగునప్పటికి, రాజు, గవర్నరు, పట్టణపుపెద్దలు, వీరిచే బనులలో బెంజమిను నియోగింప బడెను. విద్యుచ్ఛక్తి పరిశోధకు డని పేరు వచ్చెను. అమెరికాలో నితని పేరు తెలియని వారులేరు.

నిరాటంకముగ నెనుబదిసంవత్సరము లభివృద్ధిని జెందిన పెన్సిలువానియా పరగణాకు దుర్దినములు సంఘటిల్లెను. ఈ దినములలో నితనిని సేనా నాయకునిగ నియోగించిరి. ఇతని సేనాధిపత్యములో సైన్యములు బాగుగ నడుపింపబడెను. ఈ యాధిపత్యము ననుసరించి, సంధిచేయుట కితడింగ్లాండుదేశము వెళ్లెను. అక్కడ మూడు సంవత్సరము లుండి, తన సందేశము నతడు నిర్వర్తించుకొనెను. కార్యనిర్వాహము కేవల మితడు గోరిన ప్రకారము జరుగపోయినను, నష్టము మాత్ర మితనికి కలుగ లేదు.

ఇంగ్లాండులోనున్న సమయమున బెంజమి నక్కడి పండితుల సహవాసము చేసెను. 'ఆక్సుఫర్డు' సకల కళాశాలాధ్యక్షులు బిరుదులు కొన్నితని కిచ్చిరి. ఇతడు 'డాక్టరు' అను బిరు దును గూడపొందెను. ఈ గౌరవములను బొందిన తరువాత, నమెరికా దేశమునకు వచ్చెను.

15 సంవత్సరముల వఱకు కష్టపడి, 57 సంవత్సరములు వయస్సున శేషించిన జీవితకాలమును సుఖముగ గడుపుటకు డాక్టరు బెంజమిను తలంచెను. 1748 సంవత్సరములో, పనులను మాని శాస్త్రపరిశోధన జేయవలె నని యితడు కోరెను. గృహ మిరుకటముగను, విరివిగను కట్టి, స్నేహితులతో ముచ్చటించుచు, తన పశ్చిమవయస్సు నంతము జేయుట కిత డుద్దేశించెను. ఈ కోరిక స్వప్నావస్థయయ్యెను. సంఘటిల్లిన వ్యవహారములలో బట్టువడి, వాని ప్రవాహములో గొట్టుకొని పోయినందున, కోరిన కోరికను పొందుట కితని కవకాశము లేకపోయెను. యుద్ధము సన్నద్ధమైనందున, నితడు గ్రంధపఠనము మానివేసెను. 1763 సంవత్సరము మొదలు 1770 సంవత్సరము వఱకు ఆంగ్లేయులకును ఫ్రెంచి వారికిని యుద్ధము జరుగుచుండెను. 1764 సంవత్సరములో వ్యవహార రీతనిపట్టి, బెంజమి నింగ్లాండువెళ్లెను. అక్కడ లండను పట్టణములో నతడు కాపుర ముండెను. కొంతకాలము రాజకీయ వ్యవహారములను జూచి, తదనంతరము వానిని వదిలి, రిత్తగ నతడు కాలాయాపనము జేసెను. 1770 సంవత్సరమున నితడు లండనులో నుండెను. ఇతని మనుమడు "విల్లియంటెంపిలు ఫ్రాంక్లిను" అను వా డితని యొద్దనుండి, కోరిన సహాయమును సాంత్వనమును తాతగారి కిచ్చుచుండెను. ఇతనిభార్య ఫిలడల్‌ఫియాలోనుండి పోయెను. ఆమె భర్త రాక మనమున నిరీక్షించుచు, స్వగృహమున జరిగిన వృత్తాంతముల నతనికి దెలియ జేయుచుండెను. ఇంతకాలమున కితని కూతురును వివాహమాడుటకు, ఫిలడల్‌ఫియాలోని వర్తకుడు, 'రిచ్చర్డు బేచి' అనువాడు నిశ్చయించి, గృహిణి బెంజమినుతో నీ సంగతిని జెప్పెను. భర్త కీ సంగతి నామె తెలియజేసెను. కొంతకాలమునకు వారిరువురు వివాహమాడిరి.

బెంజమిను పదిసంవత్సరము లింగ్లాండులో నుండెను. తన స్వదేశాభిమానము, లోకోపకార బుద్ధిని పనులలో జూపించుట కితడు కష్టపడుచుండెను. ఒక సమయమున వైద్యశాలను జూచిన, ఫిలడల్ ఫియాలోని వైద్యశాల యితనికి జ్ఞప్తికి వచ్చుచుండును. పట్టుపురుగులను బెంచువిధము, వానినుంచి పట్టును తీయువిధమును గుఱించి తగిన సమాచారమును సంగ్రహించి, పెన్సిలువానియాలోని తన స్నేహితుల కితడు పంపుచుండెను. పట్టుపురుగులను బెంచుటకు పెన్సిలు వానియాలో గొందఱు బయలుదేరిరి. ఇంగ్లాండు రాణీగారికి స్వదేశము నుండివచ్చిన పట్టును బహుమానముగ నిత డిచ్చెను.

1771 సంవత్సరములో కప్తాను 'కుక్కు' భూగోళ యాత్రను సముద్రముమీద చేసి, తిరిగి వచ్చెను. ఇతడు, 'యార్కుపి యరు'లో నొక సేద్యకాని కుమారుడు. 'పసిఫిక్కు' మహాసముద్రముమీద యాత్రచేసి, దానిలోని వింతల నితడు చెప్పెను. 'న్యూజీలాండు' దీవిని మొదట నితడు జూచెను. ఈ కాలములో నితని సంగతుల నందఱు ముచ్చటించుచుండిరి. పసిఫిక్కు దీవులలోనున్న వారు ధైర్యశాలు లని, ధాన్యము, పశువులు, కోళ్లు లేని వారని యైరోపా వాసులకు దెలిసెను. ఈ వస్తువులను వారికి పంపుటకు బ్రయత్నముచేసి, చందాలు వసూలుచేసిరి. బెంజమిను తనకు తోచిన చందా నిచ్చెను. కొన్ని కారణములచేత నీపని సాగ లేదు.

ఇతడు ప్రయోగము లోనికి దీసికొని రాని స్వల్పవిషయ మేదియు లేదు. ఒక నా డితని భోజనకాలమున, 'వర్జీనియా' దేశమునుండి తేబడిన 'మదీరా' మద్యమును సీసాలో నుండి పాత్రలోనికి బోయునపుడు, చచ్చిన మూడీగలు పడినవి. "చచ్చిన యీగలమీద సూర్యకిరణములు ప్రసరింప జేసినందున, నవి పునర్జీవమును బొందు నని విని, నేను వీనిని యెండలో బెట్టితిని. మూడు గంటలలోపున, వీనిలో రెండు చైతన్యమును బొంది, కాళ్లు కదిల్చి, కండ్లునులుపుకొని, రెక్కలను విదలించి, తామింగ్లాండు దేశమునకు వచ్చిన సంగతిని తెలియక, యెగిరిపోయెను.మిగిలినదానిని, సాయంకాలము వఱ కెండలో నుంచితినిగాని దానికి జీవమురాలే"దని బెంజమిను వ్రాయుచు, "నీటిలో మునిగి, చచ్చిన వారిని బ్రతికించుటకు వారి కళేబరములను తైలద్రోణిలో నుంచు విధమును గనిపెట్టిన బాగుగ నుండునని నేను తలంచెద"నని ముగించెను. ఇతడీ కాలములోనే "స్కాట్లండు, ఐర్లండు, ఫ్రాన్సు" దేశములను జూచుటకు వెళ్లెను.

ఇంతకాలమునకు స్వదేశమునకు బోవలెనని బెంజమిను సమకట్టెను. పదిసంవత్సరము లయి, దారాపుత్రాదుల విడనాడి పరదేశమం దితడుండెను. ఇతడు ప్రయాణసన్నాహము జేయుచుండెను. కొంతకాలము గృహిణి బెంజమిను స్వస్థత లేక బాధపడుచుండెను. కాని, యామె కపాయము గలుగునని స్నేహితులెవ రనుకొనలేదు. ఇంతలో నామెకు పక్షవాతమువచ్చి, నాలుగయిదు రోజులు శ్రమపడి, యామె పంచత్వమును బొందెను. ఈ సమాచారము బెంజమినుకు దెలిసెను. నలుబది నాలుగు సంవత్సరములు వీరు గృహస్థాశ్రమములోనుండి, నిష్కళంకముగ దాంపత్యసుఖము ననుభవించిరి. ఇతడు గృహమును విడిచి, పరదేశములో నుండిన కాలమున, భార్యాభర్త లన్యోన్యముగ వ్రాసికొనిన యుత్తర ప్రత్యుత్తరములు చదివిన, వారి యనురాగము వెల్లడి యగును. సమయము వచ్చినపు డెల్ల నామె సుఖజీవనముకు తగినవస్తువుల నితడు పంపుచుండెను. ఆమె యుక్తాయుక్త విచక్షణ గలదని తెలిసి, గృహకృత్యము లామె చేతిమీద జరుగుట కత డొప్పుకొనెను.

1775 సంవత్సరము మార్చి 21 తేదిని బెంజమిను నింగ్లాండునుండి బయలుదేరి, మేయి నెల 5 తేదిని ఫిలడల్‌ఫియాలో వచ్చి చేరెను.

స్వస్తి.

కొంతకాలము వఱ కితడు రాజకీయ వ్యవహారములలో మెలగు చుండెను. సంబంధ బాంధవ్యములలో నెట్టి కలతలు లేక యుండెను. కొన్ని సంవత్సరములకుముందు కట్టుట కారంభముచేసిన గృహనిర్మాణము ముగిసినందున, దానిలోనితడు ప్రవేశించెను. దానిలో నొకగదిలో పుస్తక భాండాగార ముంచబడెను. "నా పిల్లలు, కూతురు, మనుమలాఱుగురు వీరితో కలిసి కాలమును నేను గడుపుచున్నాను. నా పెద్దమనుమడు కళాశాలలో జదువుకొనుచున్నాడు. కడమవారు మంచిస్వభావము కలవారు వీరు పెద్దవారై, ప్రపంచములో దిగిన తరువాత, నే నడవడికలవారగుదురో, నేను వానిని జూచుటకు జీవించను; వానిని ముందుకు జూచి చెప్పలేను. కనుక, నీకాలమును వారితో నెమ్మదిగ, నడు పుదును. ముందుసంగతి దైవమెఱుగు"నని బెంజమిను వ్రాసెను. తనను జూచుటకువచ్చిన వారి కతడు దర్శనమిచ్చుచుండెను. ప్రియ స్నేహితుల కుత్తరములు వ్రాయుటకలదు. 1788 సంవత్సరము అక్టోబరు నెలలో నితడు పనులన్నియు మానివేసెను.

వృద్ధాప్యము చేత నితనిశరీరమునకు దఱుచుగ బాధకలుగుచుండెను. బాధ లేనిసమయమున, నత డుత్తరములు వ్రాయుటయో, లేక స్నేహితులతో ముచ్చటించుటయో, లేక మనుమలతో నాడుటయో, జరుపుచుండెను. ఎన్నడును వ్యర్థముగ నితడు కాలయాపన చేయ లేదు.

1790 సంవత్సరము ఏప్రిలు నెల వఱ కిత డేవ్యాధియు లేక యుండెను. అప్పుడు గుండెలలో నొప్పి, యుష్ణము బెంజమినుకు వచ్చెను. డాక్టరు 'జానుజోన్సు', అను వైద్యు డితనికి మందు నిచ్చుచుండెను.

"మరణమునకు పదియారు రోజులు ముందుగ బెంజమిను కుష్ణమువచ్చెను. తరువాత మూడు నాలుగు రోజులకు, గుండెల కెడమప్రక్కను నొప్పిగనున్న దని అతడు చెప్పెను. ఆనొప్పి యధికమై, దగ్గుపుట్టి, యతనికి శ్వాసారంభమయ్యెను. అతడు బాధచేత మూలుగును, విశేషము బాధ తనకులేదని చెప్పు చుండెను. మొదట ననామధేయుడుగనుండి, తుదకు పేరు ప్రతిష్ఠలను బొందినందు కతడు పరమేశ్వరుని కొనియాడి, ప్రపంచమునందు విరక్తిని బొందించుటకై తనకు బాధలుగలిగెనని చెప్పెను. మరి యయిదు రోజులకు మృతినొందు నను సమయమున, శ్వాసతగ్గెను. ఉష్ణముజారెను. అందుచేత నందఱితడు జీవించునని తలంచిరి. ఈలోపున నూపిరి తిత్తులలో కురుపు పుట్టి, బ్రద్దలయి నందున, నుచ్ఛ్వాసనిశ్వాసములణగి, మాంద్యము ప్రవేశించి, క్రమముగ 1790 సంవత్సరము ఏప్రిల్ 17 తేది రాత్రి, పదునొకండు గంటలకు, డాక్టరు బెంజమిను ఫ్రాంక్లిను పరమపదమును బొందె"నని డాక్టరు జోన్సువ్రాసెను.

ఏప్రిల్ 21 తేదిని, మృతకళేబరమును సమాధి స్థలమునకు దీసికొని వెళ్లినపుడు, 20,000 వేల ప్రజవెనుక నడిచిరి. క్రైస్త్వాలయములలోని గంటలను మెల్లగ వాయించిరి. ఓడలమీది జండాలు సగము దించివేయబడెను. అతని శరీరమును భూస్థాపనచేయు కాలమున, శతఘ్నులు ఘోషించెను. భార్యాభర్తల శరీరము లొక దాని ప్రక్కనొకటి సమాధిచేయబడెను. వీరి గోరీల మీదనున్న రాతిపలకలమీద, వీరి జననమరణముల సంవత్సరములు తప్ప మరియేమియు వ్రాయబడియుండ లేదు. బెంజమిను శరీర దార్డ్యముకలవాడు. ఇతడు పెద్దకాలమునకు స్థూలదేహియయ్యెను. అయిదడుగుల తొమ్మిదంగుళము లున్నతముకలవాడు. పిల్లికండ్లు, తెల్లని శరీరము కలవాడు. నెమ్మదిగ మాటలాడువాడు. అతని కనవసర మగు పనులలో నతడు జోక్యము కలుగ జేసికొన లేదు. అందఱితోను గలిసిమెలిసి తిరుగుచు, కలుపుకోలుతనముగ నుండెను. తన ప్రియస్నేహితులతో మనస్సు నిచ్చి మాటలాడుచుండును. పరులతో నంతగ మాటలాడువాడుకాడు. జ్ఞానము, లోకజ్ఞానము కలవాడు.

         యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జిత మేవవా |
         తత్తదేవావగ చ్ఛత్వం మమతేజోంశసంభవమ్ ||