Jump to content

బెంజమిను ఫ్రాంక్లిను జీవితచరిత్రము/ఆఱవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఆఱవ ప్రకరణము

ఫిలడల్ ఫియాకు తిరుగుదల

కప్తాను క్లార్కుచే గడపబడిన 'బెర్కుషియరు' యోడలో బెంజమిను బయలు దేరెను. జూలై 21 తేది మధ్యాహ్నమున, 'గ్రేవు శెండు' యొద్ద వీరు లంగరువేసిరి. "ఇది పాడుప్రదేశము. ఇక్కడి ప్రజలు మార్గస్థులను మోసపుచ్చుటయే పనిగాగల వారలు. వీరియొద్ద వస్తువులను గొని, వారు గోరిన వెలలలో సగము నిచ్చిన, ఇవియు నిజమైన వెలకు రెండింతలుండును. దైవానుగ్రహమున నిక్కడినుండి రేపు బయలుదేరుచున్నార" మని బెంజమిను వ్రాసెను. మరునాడు బయలుదేరి, పోర్ట్సుమతు రేవులో లంగరు వేసిరి. ఓడల గమ్యస్థానము (Harbour) జూచుటకు కప్తాను, డెనుహాము, ఇతని లేకరి, ముగ్గురు వోడదిగి పట్టణములోనికి వెళ్లిరి. అనేక దినములవఱకీ యోడ 'పోర్ట్సుమతు వైటు' దీవికి మధ్యప్రదేశమున నుండెను. ఈ లోపున బెంజమిను 'వైటుదీవి' లోనికి బోయి "కారిసుబ్రూకు" దుర్గము మొదలగువానిని దర్శించెను.

మరి కొన్నిరోజులవఱకు, వైటుదీవి రేవులో నోడ లంగరు వేయుచు, ఎత్తుచు, సోలాంటునదిపై దేలుచు, సముద్రమునకు బోవలెనని యత్నము జేయునపుడు, 'స్పిత్ హెడు' రేవులోనికి గాలిచే గొట్టబడెను. 'యార్ మతు' పట్టణమువద్ద కొందఱు ప్రయాణికిలకు గలిగిన విపత్తును బెంజమిను సాంతముగా వ్రాసెను. దీవిలో గొంతసంచరించి, సాయంకాలమున యార్‌మతునకు వీరురాగా, రేవునకు బోయెడి మార్గమును దప్పినట్టు వీరికిదోచెను. దేనిమూలమున రేవు విరివియైనదో, యా కయ్యను వీరుదాటి కయ్యముఖద్వారమున నున్న దోనెవద్దకు వచ్చిరి. దానిపైకి దాటి, పట్టణములోనికి బోవలె నని వీ రభిప్రాయపడిరి.

'గడపువాడు లేనందున, వానిగుడిసెకు మేము వెళ్లితిమి. వాడు మంచమునెక్కి పరుండియుండెను. మమ్ములను దాటింప ననెను. అప్పుడు, దోనెను లాగి తెచ్చి, దానిని గడుపుకొని పోవుటకు నిశ్చయించి, నీటియొడ్డునకు మేము వచ్చితిమి. దోనె నీటికి 50 గజముల దూరమున గుంజకు గట్ట బడియున్నందున, దానిని మేము లాగ లేక పోతిమి. దానియొద్దకు బోవలెనని బట్టలు తీసి వేసితిని. దానిదగ్గిఱకు తీసికొనిపోవు రాతికట్టుమార్గమును దప్పినందున గుండెలు మోయ, బురదలో దిగబడితిని. తుదకు గుంజ వద్దకు వచ్చితినిగాని, దోనె గొలుసుతో గట్టబడి తాళము వేయబడియున్నందున, చాలదిగులు పొందితిని. అన్ని విధముల దోనెను తీయవలె నని యత్నించితిగాని, ప్రయోజ నము లేక పోయెను. తడిసి, బురదలో నొక గంటవఱకు ప్రయాసపడి, తుదకు దోనెను తీయలేక, మరలివచ్చితి"నని బెంజమిను వ్రాసెను. "మా జేబులలో డబ్బులేదు, గాలికఱచుచున్నను, మేమొక గడ్డి కుప్పయొద్ద నా రాత్రి గడపుటకు నిశ్చయించితిమి. ఇటులు శ్రమదమలు పడుచుంటిమి. ఇంతలో మాలో నొకడు తన జేబులోనుండి యినుపలాడా (Horse-shoe) నుతీసి, దానితో దాళమును బగులగొట్టుటకు వీలగు నని నాతోజెప్పి, నాచేతికి దాని నిచ్చెను. నేను దానిని పట్టుకొని వెళ్లి, తాళమును బగులగొట్టి, దోనెను నీటిలో తేల్చితిని. మేమందఱము సంతోషించి, దానిలో నెక్కితిమి. నేను బట్టలను వేసికొనినపైని, దానిని మేము గడిపితిమి. పెద్దకష్టము ముందుకు రానున్నది. అప్పుడు పోటు సమయము గనుక, నంతట నీరు నిండియుండెను. వెన్నెలరాత్రియైనను, కయ్యనుండి పోవుకాలువ యేదోమాకు దెలియ లేదు. తోచినటుల దోనెను తిన్నగ గడిపినందున, సగముదూరముపోవు నప్పటికి, బురదలో దోనె చిక్కుపడినట్టు మాకు దోచెను. తెడ్డులను బురదలోనాటి, దోనెనునీటిలోనికి ద్రోయవలెననియత్నించి, మే మొక తెడ్డును విరిచివేసితిమి. నాలుగంగుళమునీరైన లేనందున, దోనెతో మే మొడ్డెక్కితిమి, ఏమిచేయుటకునుదోచక, చీకాకుపడుచుంటిమి. పాటో, పోటోమాకు తెలియలేదు. కొంత సేపటికి, పాటుసమయ మనిగ్రహించితిమి. తెడ్లు మునుగుటకు తగిన నీరైనలేదు. రాత్రియంతయు గాలి దెబ్బ తినుచు, దోనెలోనుండుట కష్టమైనను, మరుచటి దిన ముదయమున దోనెవాడు వచ్చినపుడు మేము తెల్లముఖము వేయవలసి వచ్చునని విచారించుచుంటిమి. ఒక యరగంటవఱకు గుజగుజ లాడి క్రింద మీదుపడితిమిగాని, కార్యము లేక పోయెను. చేతులు నులుపుకొనుచు గూర్చుంటిమి. ఒడ్డున చేరుమార్గము కనబడదాయెను. సముద్రపు సోషతగ్గెను. క్రిందికి దిగిన, గొంతుక మోయ బురదలో దిగబడవలసి వచ్చును. అప్పుడు తెగించి, యిరువురము బట్టలు తీసివేసి, క్రిందికి దిగి, మామోకాళ్లతో 50 గజముల వఱకు దోనెను గెంటుకొనివచ్చి, నీటిలో దానిని తేల్చితిమి. ఒకటే తెడ్డుండుటచే, గష్టముతో మే మొడ్డున జేరితిమి. మాతోవచ్చిన, వారందఱు బసలో మమ్ములకై ఎదురుచూచుచుండిరి. ఆ రాత్రి మే మొడ్డున గడిపితిమి. మా విహార మిటుల ముగిసె"నని బెంజమిను వ్రాసెను.

స్పిత్ హెడ్ వదలిన మూడువారములకు ఈప్రయాణికులు అట్లాంటికి మహాసముద్రమును జూచిరి. ప్రయాణము దీర్ఘమై, విసుగు పుట్టించెను. ఈ ప్రయాణములోనే, గతించినకాలములోని తప్పులను స్మరణకు దెచ్చుకొని, ముందుకు బాగుగ నడచుటకై, బెంజమి నొక నడవడిపట్టికను వ్రాసెను. తరువాత కొందఱాపట్టిక దొరకలే దనిరిగాని, ఇటీవల బెంజమిను స్వహస్త లిఖిత ప్రతి యొకటి లభించినది. "పద్యకావ్యమును రచించువారు దానిని పఠనయోగ్యము చేయవలె ననిన వ్రాయుటకు బూర్వము, దాని యాద్యంతములను బాగుగ యోచించవలెను. అటులనే, జీవిత కాలము. దానిని గడపుటకు తిన్ననిమార్గము వేయనందున, నేను చిక్కుదారులలోబడి, మార్గము తప్పితిని. నాగార్హస్థ్య ధర్మము మారినది గనుక, కొన్ని నిబంధనలను నియామకముల ననుసరించి, నాజీవితకాలమును జ్ఞానివలె గడపుటకు నిశ్చయించి, ఈ దిగువ నిబంధనలను వ్రాయుచున్నాను.

" (1) ఋణములను తీర్చువఱకు నేను మితముగ ధనమును వ్యయము చేయవలెను.

(2) ఎల్లపుడు సత్యమును బలుకుదును. - నేను నిర్వహించుటకు శక్తిలేని కార్యములయం దితరుల కాశకలిగించను. మనోవాక్కాయ కర్మములలో సౌజన్యతను చూపింతును.

(3) పూనినపనిని పూనికతో తుదముట్టించెదను, స్వకర్మమును విడిచిపెట్టి, ధనార్జన కితరపనులను చేయను. శ్రద్ధవహించి, యోర్పుతో బనిని చేయుటయే ధనార్జనకు మార్గము.

(4) ఇతరుల దుర్గణముల నెంచను. వారి సుగుణములనే యెంతును. ఇతరు లన్యాయముగ దుర్గుణ మొకనియం దారోపించినను, సమయము చిక్కినపు డెల్లవాని సుగుణముల జెప్పుదు"నని బెంజమిను వ్రాసెను. ఇంతటితో జాలించక, నాడు మొదలు గార్హస్థ్యధర్మములను సరిగా నడుపుచున్నది లేనిది. బెంజమిను పరీక్షించుకొనుచుండెను. దీని ఫలితమును ముందు జూడగలము.

ఆనాఁడట్లాంటికు మహాసముద్రము జలార్ణవమే, 'బెర్కుషియరు' యోడలోని వారు మరియొక యోడను జూచుసరికి, 50 దినములయ్యెను. ఈయోడ స్నేహపక్షము వారిదైనందున, వారు జూచి సంతసించిరి. అది దగ్గిఱకు వచ్చుట వలన, దానిలో నున్న ప్రయాణికులతో వీరు మాటలాడిరి. దానిని చూచుటవలన బెంజమినుయొక్క మనస్సు కరగెను.-"ఇది 'స్నో' అను పేరుగల యోడ. స్త్రీ పురుషు లేబదిమంది నెక్కించుకొని, 'డబ్లిను' పట్టణమునుండి 'న్యూయార్కు' కు బోవుచున్నది. ఇందులోని వారందఱు తట్టుపైకి వచ్చి మమ్ములను జూచి సంతసించినట్లు నాకు గనబడెను. ఇట్లు దైవికముగ, మహాసముద్రముమీద రెండోడలు గలిసినపుడు, వానిలోని యాత్రికులెంత సంతసింతురు' వారి మనస్సులలో నెంత యుల్లాసము కలుగును! ఆ యోడలోని వారి ముఖములను జూడగ, సంతోషముచే నాహృదయము తపతపలాడి, యంత:కరణ పూర్వముగ బయలు వెడలినందున, నే నానందమును పట్ట లేక పోతి" నని బెంజమిను వ్రాసెను. మరి పదియారు దినములకు, తట్టుమీదనుండు వారి కానందమును గలుగ జేయుచు, యోడయొక్క చౌకివాడు "భూమి, భూమి" యని యఱచెను. "అందరివలె నేను వేగముగ జూడ లేక పోతిని. నానేత్రము లానంద బాష్పములతో నిండెను". అని బెంజమిను వ్రాసెను. మరి రెండు రోజులు గడచినపిదప, ఫిలడల్‌ఫియా కారుమైళ్లు దిగువగ, డెలవేరు నదిలో సాయంత్రము 8 గంటల కీ యోడలంగరు వేసెను. "విహారార్థము పడవనెక్కి, ఫిలడల్‌ఫియాలోని బాలురు కొందరు దైవికముగ వచ్చి, మాయోడ తట్టునెక్కి, మమ్ముల నొడ్డుకు దీసికొనిపోవుటకు సమ్మతించినందున, మేము వారితో బడవలోనికి దిగి, 10 గంటల కొడ్డునజేరితిమి. విసుగు పుట్టించి భీతావహమై సముద్రపు ప్రయాణమును దుపద్రవముగ జేసినందు కొకరికొకరు వందనములు చేసికొని, మేముందఱము దైవకటాక్షమును గొని యాడితి"మని బెంజమిను వ్రాసెను.

ఓడదిగి, ఫిలడల్‌ఫియావీధులలో బోవుచుండగ, నుద్యోగమునుండి తొలగింపబడిన గవర్నరు కీతును బెంజమిను నాకస్మికముగ దారిలో జూచెను. నిర్హేతుకముగ బెంజమిను మోసపుచ్చినందుకు, సిగ్గుపడి, బెంజమినును బలుకరించక, కీతు వెళ్లిపోయెను. దరిద్రుడు, అలక్షితుడునునై, జీవనార్థము నూతన సీమలచారిత్రములను వ్రాయుచు, మరి పాతిక సంవత్సరములు ప్రపంచములో కొట్లాడి, 80 సంవత్సరముల వయస్సున, లండను పట్టణములో, 1749 సంవత్సరమున, కీతు స్వర్గస్థుం డయ్యెను.

కన్యకరీడుయం దపేక్షకలవాడై, యామెను బెంజమిను మరవలేదు. లండనులోనుండు దినము లంతమగుముందు, రాల్ఫుగారి చిక్కును వదిలించుకొని, బెంజమిను స్వస్థతను బొంది, ప్రాచీనమోహమంకురింప, "మోహపాశములలో చిక్కి, వీనిమూలమున నింగ్లాండునుండి ఫిలడల్‌ఫియాకు వచ్చితి" నని బెంజమిను వ్రాసెను. ఇత డింగ్లాండునుండి రాడని నిశ్చయించి, "రాజర్సు" అను కుమ్మరివానిని కన్యకరీడు వివాహమాడెను. ఈ దాంపత్య మనుకూలము కానందున, వానిని విడనాడి, కన్యకరీడు తన మాతృగృహము వచ్చి చేరియుండెను. ఈ సంగతులు బెంజమినుకు దెలిసి, ఇదియంతయు తనలోపమువలన జరిగినదని విచారించెను. ఋణస్థుల బాధపడ లేక, 'కుమ్మరి రోజర్సు' పశ్చిమ దీవులకు బోయి, కొంతకాలమున కక్కడ మృతినొందె నని వార్త వచ్చెను.

బెంజమిను దేశములో లేని సమయమున, కీమరు వ్యాపారమును బాగుగ నడిపించినటులు కనబడెను. మునుపటి దానికంటె బాగుగనున్న బసలో కీమరు దుకాణమును పెట్టెను. ముద్రాక్షర శాలకు కావలసిన నూతన కూర్పులను (New types) వాడు తెప్పించెను. విశేషముగ పనివాండ్రను నియోగించి, వ్యాపారమును వాడు సాగించుచుండెను.

వెంటనే, బెంజమిను పనిలో ప్రవేశించెను. డెనుహాము, 'వాటరు వీధి'లో నిల్లు పుచ్చుకొని, దానిని సామానుతో నింపి, దుకాణము పెట్టెను. శ్రద్ధా భక్తులతో గ్రొత్తపనిని బెంజమిను చేయుచు, కొద్దికాలములోనే వ్యాపారమునందు నేర్పరి యయ్యెను. పుత్రవాత్సల్యముతో బెంజమినుని యజమానుడు, పితృవాత్సల్యముతో యజమానిని బెంజమిను, చూచుకొనుచుండిరి. ఒక యింటిలో ఇరువురు కలిసియుండిరి. ఇటులు కాలమును సౌఖ్యముగ గడపుచున్నందున, బెంజమినుకు వర్తకయోగము తప్ప, మరియొకటి లేనట్టుతోచెను. కొద్దికాలములో నీ వ్యవహారములో వంతుదారు డగుట కవకాశము గలిగి, డెనుహాముయొక్క స్థానము నాక్రమించు నేమోయని నలుగురికి దోచెను. అన్ని విధముల తుష్టిపుష్టికలవాడైనను వెర్నను యొక్క ఋణమును తీర్చలే దనియు రీడుకన్య నన్యాయముగ దు:ఖముల పాలుచేసితి ననియు బెంజమిను విచారించుచుండెను.

మొదటిమాసములలో, పని సాగుటవలన, నితనియోగము బాగుగనుండునను యాశకలిగినను, వీనియోగదశ హఠాత్తుగ నంతరించెను. దుకాణము పెట్టిన నాలుగునెలలకు, సం|| 1727 - రము ఫిబ్రవరి నెలలో, డెనుహాము - బెంజమినులు చావు సంకటముపడిరి. పార్శ్వశూలచే బెంజమిను బాధపడి, చావుకు సిద్ధమయ్యెను. "నేను విస్తారము బాధపడితిని. సర్వము విడిచితిని. రోగము కుదిరినందున ఖిన్ను డనై, లేచి తిరిగి యీ పనులనే మరల జేయవలసి వచ్చెను గదా యని విచారించితి" నని బెంజమిను వ్రాసెను. డెనుహాము చాలకాలము బాధపడి, తుదకు కాలవశమును బొందెను. తన వాత్సల్యమును జూపించుటకు, గొంతధనమును బెంజమిను కీయవలసిన దని, మరణ శాసనములో డెనుహాము వ్రాసెను. తదనంతర మతని సొత్తును సంరక్షకు లాక్రమించినందున, బెంజమిను కు లేక గాలికి తిరుగవలసివచ్చెను.

అనంతరము, కీయరుయొక్క ముద్రాక్షరశాలలో హెచ్చు వేతనమునకు బని నంగీకరించెను. ఇతనికి కీమరునకు మనస్సంతగ కలియక పోయినను, కీమరు విషయమై చెడువార్తలను వినుచున్నను, శరీరపోషణార్థ మీపనిని బెంజమిను చేయుచుండెను. ఇక్కడ పనిచేయువారలలో, న్యాయ బుద్ధిగల 'హ్యూమెరిడితు' అను నాటుపురమువాని పరిచయము బెంజమినుకు గలిగెను. వీడు వివేకి, యనుభవశాలి, లెస్సగ జదువుకొనినవాడు. అయినను, మద్యపానమును జేయువాడు; ఈ క్రొత్తపనియందు శ్రద్ధలేనివాడు. ఎల్లప్పుడు, ఉల్లసస్వభావము కలవాడుగాన, పనివాండ్రతో గలసి మెలసి బెంజమిను తిరుగుచుండెను. ఏదియో యొక క్రొత్తసంగతిని పనివాండ్రకు ప్రతిరోజున పనిలో జూపించుట వలన, వారందఱితనిని గౌరవముగ జూచుచుండిరి. ఇతనిచే శిక్షింపబడి, వారు పనిలో దేరి పారిరి. కీమరు వ్యాపారమును వారు బాగుగసాగించిరి.