బెంజమిను ఫ్రాంక్లిను జీవితచరిత్రము/అయిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

అయిదవ ప్రకరణము

లండనులోని యనుభవములు

వయస్సులోనున్న బెంజమిను రాల్ఫు ఇరువురు వారమునకు మూడురూప్యము లద్దె నిచ్చుటకు నిర్ణయించుకొని, 'లిటిలు బ్రిటను' వీధిలో నొక బసను బుచ్చుకొనిరి. వీరొకరి నొకరు విడువ లేక యుండిరి. బెంజమినుచే బోషింపబడుచున్నందున, నితనిని విడుచుటకు రాల్ఫుకు వీలు లేక పోయెను. తనకంటె తక్కువ వాడైనను, స్వారస్యముగ మాటలాడువాడని రాల్ఫును బెంజమిను ప్రేమించుచుండెను. 50 సంవత్సరములు గడిచిన పిదప, రాల్ఫును బోలిన రసికుని చూచి యెఱుగ నని బెంజమిను చెప్పెను. బెంజమిను నెమ్మదిగలవాడును, మాటలలో వెనుకదీయువాడును, గాంభీర్యముతో దనపనిని జూచుకొనువాడును, చూచుట కింపైన, వాడును, పెద్దపిన్న తారతమ్యముకలవాడై, మాటల నేర్పుగలిగి, లౌకిక వ్యాపారాభివృద్ధిని గోరువాడు రాల్ఫు. వీలయినచో వీరిరువురిలో, రాల్ఫె గొప్పవా డగు నని వీరిని జూచినవారు చెప్పియుందురు. రాల్ఫు వద్దలేని రెండువిశేషములు బెంజమినుకు కలవు. అవి సర్వసాధారణములయినను, బెంజమిను కప్పటికి శ్రేయోదాయకము లయ్యెను. పదికాసులసొమ్ము, చేతిలోని పని-యీరెండును బెంజమినుకు కలవు. వారమునకు పాతిక రూప్యముల సొమ్మును గలిగించు శక్తిగల పనిని బెంజమిను నేర్చియుండెను. విలంబముగాని, కష్టముగాని లేకయే, యిదివఱకే పదుగురు పనివాండ్రున్నను, 'పామరు' కంపెనీలో బెంజమినునకు బని దొరికెను. అతివేగముగ నక్షరములను గూర్చుటయందు బెంజమిను సమర్థత కలవాడు. పనిలో బ్రవేశించుటకు రాల్ఫుచేసిన ప్రయత్నములన్నియు వృధయాయెను. అందుచే, బెంజమిను పోషితవర్గములో నతడుండెను. దరిదాపుగ నొక సంవత్సరము కంపెనీలో బనిచేసి, మంచివేతనములను సంపాదించి, వానిని బెంజమిను వ్యయము జేయుచుండెను.

ఇప్పుడు బెంజమిను జీవితకాలములో జరిగిన యంశమొకటి వినదగి యున్నది. గత శతాబ్దములో జన సమ్మతమై, 'వలాస్టను' చేవ్రాయబడిన 'ప్రకృతిమతవర్ణన' యను గ్రంథ రాజమును ముద్రించుటకు బెంజమిను అక్షరములను కూర్చు చుండెను. జీవహత్య, దొంగతనము, వ్యభిచారము-వీనినినిషేదములని ధర్మ శాస్త్రములు శాసింపక పోయియుండినను వీని నుపచరించుట అకర్తవ్యమని చూపించుటయే గ్రంథకర్త యొక్క ముఖ్యాభిప్రాయము. ఇట్టి మనోహరమైన గ్రంధము, బలవద్విరోధము లగు బ్రత్యూహలను బెంజమినుకు గలిగించెను. ఆగ్రంథమును ఖండించుచు, నిత నొక ముప్పదిరెండు పుటల పుస్తకమును వ్రాసెను. ఈ గ్రంథమును వ్రాయుట వలన, బెంజమిను గొప్పవాడయ్యెను. దీని ప్రతియొకటి, రణవైద్యుడైన 'లయన్సు' చూచి చదివి సంతసించి, దీనికర్తనువెతకుచు వచ్చి, కని, గౌరవముగ బెంజమినును పలకరించెను. "మానుషాభిప్రాయములు బుద్ధిప్రమాద రాహిత్యము"లను గ్రంధమును లయన్సు వ్రాసెను. ఇత నా కాలపు (Sceptics) సంశయాళువుల పరిచయము గలవాడు. "సారంగములకధ" యను గ్రంధమునువ్రాసి, "సంశయాళువుల సంఘమున" కధ్యక్షుడై యుండిన "డాక్టరు మాండవిలు" దర్శనము బెంజమినుకు లయన్సు చేయించెను. వైద్యుడు, పదార్థవిజ్ఞాన శాస్త్ర వేత్తయు, గణితశాస్త్రజ్ఞుడు, రాజపోషిత సంఘము (Royal Society) లోనివాడు, సర్ ఐజాకున్యూటనుకు స్నేహితుడును, అయిన డాక్టరు పెంబర్టనుగారి దర్శనము బెంజమినుచేసెను. సహస్రమాస వృద్ధై, దుర్బలుడైన న్యూటనును దర్శించుటకు బెంజమినుకు వీలులేకపోయెను. "ఆంగ్లేయ చిత్రవస్తు ప్రదర్శన శాలా" స్థాపకుడు, సృష్టి వై చిత్ర్య సంపాదకుడు (Anti-quarian) నయిన, సర్ హాన్సుస్లోను గారి పరిచయ మీ కాల ములోనె బెంజమినుకు గలిగెను. "ఆ స్బెస్టాసు" అను చిత్రవస్తువు నమెరికానుండి బెంజమిను తెచ్చెను. దానిని జూచుటకు స్లోనుగా రితనిబసకువచ్చి, కొంతవఱకు ముచ్చటించి, తగిన వెలనిచ్చి, దానిని బుచ్చుకొని, నితనిని తన గృహమునకు దోడుకొనిపోయి, యక్కడనుండు వైచిత్ర్యములను బెంజమినుకు జూపించెను.

ప్రస్తుతముకంటె నధికముగ ధనమును గూడ బెట్టవలయుననికోరి 'పామరు' కంపెనీలో బనిమాని, 'వాట్సను' కంపెనీలో బనిని బెంజమిను స్వీకరించెను. ఇందులో బని జేయువా రందఱు త్రాగుబోతులుగాన, 'ఉదక పానిని' అని బెంజమిను మాఱు పేరిడిరి. హెచ్చరికను పుట్టించు మంచి మద్యమును త్రాగు తమకంటె, నీరుత్రాగి దృడముగనుండు బెంజమిను జూచి వారాశ్చర్యమును బొందిరి. "నాతో బనిచేయువా డొక డుదయమున నొక పైంటు భోజనకాలమున నొక పైంటు, తదుపరి మఱియొకటి, మధ్యాహ్న కాల భోజనము చేయునపుడొకటి, సాయంసమయమున నొకటి, పని ముగిసిన పిదప మఱియొక పైంటు - ఈ విధమున మద్య పానముచేయుట కలదు. అట్లు పుచ్చుకొనినగాని పనిజేయుటకు సామర్థ్యముండదని వాని యభిప్రాయము. ప్రతిశనివారము రాత్రి 3, 4 రూప్యములు సారాయి నమ్మువాని కిత డిచ్చుచుండెను. ఈ ఖర్చు నాకు లేదు" అని బెంజమిను వ్రాసెను. అనేకు లితని నిజూచి మద్య పానమును విడిచిపెట్టిరి. మద్యముకన్న గంజి నీరు శ్రేష్ఠమని యాంగ్లేయులకు బెంజమిను నమ్మకము పుట్టించినందున జీవదృష్టాంతముయొక్క మహిమ యేమని జెప్పవచ్చు? మద్య పానము విడుచుటవలన, వ్యయము తగ్గుటయేకాక, బుద్ధినిర్మలముగ నుండును. "దినమంతయు మద్యమును బుచ్చుకొనువారు, సొమ్ములేక, దుకాణములో పరపతిని బోగొట్టుకొనినందున, వారికి నేను సొమ్ము నియ్యవలసి వచ్చుచుండెను" అని బెంజమిను వ్రాసెను.

ఇటు లందరిని సురాపాన విముఖులుగ జేసి, ప్రతికూలముల కెదురుగ నడిచి, ముద్రాక్షరశాలలోని కొన్ని నిబంధనల నుపయుక్త మగునటులు మార్చెను. అక్షరములను గూర్చుటయందు హస్తలాఘవము చూపి, సతతపరిశ్రమచే యజమానికృపను సంపాదించి, క్రమ క్రమముగ హెచ్చు వేతనముల కెక్కి సుగుణగణ విరాజమానుడయి కొంత సంప ద్వైభవముల నందెను.

బెంజమిను ధనమునుకూడ బెట్టవలయునని గృహకృత్యములను పోణిమితో నిర్వహించుచు వచ్చెను. "డ్యూకువీధి"లో నొక బసను మాటలాడి, వారమునకు సుమారు మూడు రూప్యము లిచ్చుట కొప్పుకొని, ముద్రాక్షరశాలకు సమీప ముగ నుండెను. ఇంటిలో మనుజుని సహాయమావశ్యకమని యెంచి, యిల్లుగలామె తక్కువ సొమ్ముకు బసనిచ్చెను. అంతలో, వారముకొకరూపాయి యద్దెకు బసదొరకునని తెలిసి, యక్కడికి పోవుటకు బెంజమిను యత్నించెను. ఇతనియందు గరుణగలిగి, సాయంసమయముల నితని సంభాషణములకు సంతసించి, యితను తన బసనుండి వెళ్లుట కిష్టపడక, రూపాయి యద్దెకొడంబడి, ఆమె తన బసలో బెంజమిను నుంచివేసెను. "ఈ యద్దె నిచ్చుచు లండనులో బసచేసి యుంటి"నని బెంజమిను వ్రాసెను. వీరిరువు రన్యోన్య మైత్రితో గాలమును గడిపిరి. మాటలును, కధలును చెప్పి, ఆమె బెంజమినుకు సంతోషమును గలిగించుచుండెను. ఆమె వయోవృద్ధు-కాలులే నందున, సాధారణముగ నిల్లువిడిచి బయటకు బోవుటలేదు. దయార్గ్రహృదయురాలు. ఆమె సాంగత్య మితనికి సంతోషమును గలిగించినందున, వీలు లేదని చెప్పక యామె పిలిచినపుడెల్ల మాటలాడుటకు బెంజమిను వెళ్లుట కలదు.

వాట్సు ముద్రాక్షరశాలలో నితనితో గలిసి పాటుపడు వారలలో 'డేవిడుహాలు' అను వానిని బెంజమిను బాగుగ నెరుగును. ఇతడు ఫిలడల్‌ఫియాలో జాలకాలము బెంజమినుతో సహకారియై యుండెను. 'వై గేటు' అను మఱియొకనిని సహిత మిత డెఱు గును. ఇతడు బాగుగ జదువుకొనినవాడు. ఇతనికిని, ఇతని స్నేహితునికిని రెండువారములలో బెంజమిను, ఈత నేర్పెను. బెంజమిను మంచియీతగాడు. జలశయన, జల స్తంభన మొదలగు చమత్కారములను నేర్చియుండెను. ఒక పర్యాయము, నాలుగు మైళ్లదూర మిత డీదెను. ఇతని నేర్పునకు, యోపికకు మిగుల ముదమంది, బెంజమినునందు వైగేటు బద్ధానురాగముగలవాడై, యీతవలన పొట్టపోసికొనుచు, యైరోపాఖండములో సంచరించి వత్తమా యని ఇతడు బెంజమినును సలహా యడిగెను.

అమెరికానుండి యోడలో గలిసివచ్చునపుడు కలిగిన పరిచయమును బోగొట్టుకొననందున, బెంజమిను 'డెనుహాము' యొద్దకు బోయి, యీ ప్రయాణము సంగతి వానితో ముచ్చటించెను. అతడు విని, ప్రయాణోన్ముఖుడైన బెంజమినును విముఖుని జేసెను. పెన్సిలువానియాకు వెళ్ళు ఆలోచన జేయుమని యతనికి బోధపఱచి, తానుగూడ విశేష వస్తు సామగ్రితో బయలు దేరుచున్నానని డెనుహాము చెప్పెను. ఇతడు వర్తకులలో నిష్కళంకగార్హస్థ్య ధర్మానుచరుడై, వర్తక సంఘమున కదివఱకున్న నిందను బోగొట్టి, క్రైస్తవ దేశములయందు దీనికి నామ రూపములను దెచ్చిన మహనీయుడు. ఇతడింగ్లాండుకువచ్చి, బ్రిస్టలు పట్టణమునకు తన కప్పిచ్చిన వారి నందఱను సమావేశముచేసి, తన ఋణముల సంగతిలో వారు రాజీనామా పడినందు కెంతయు సంతసించెను. ఆనాడువారికి విందుచేసి, వారి కియ్యవలసిన సొమ్ము అసలు వృద్ధులతో నితడిచ్చివేసెను. తా నమెరికాలో వెళ్లి వ్యాపారమును సాగించుటకుగాను వస్తుసామగ్రి నింగ్లాండులో గొనెను. సంవత్సరమున కేబది కాసులు వేతనము పుచ్చుకొని తన కార్యదర్శిగనుండుమని డెనుహాము బెంజమినును కోరెను. ఇంతకధికముగ బెంజమినుకు సొమ్ము దొరుకుచుండెను. వర్తక వ్యాపారములో గొంత తేఱిపారినపిదప, మరికొన్ని పనులలో బెంజమినును నియోగించుటకు వీలగునని డెనుహాము వానితో జెప్పెను. డెనుహాము యొద్ద పనిచేయుట కత డొప్పుకొనెను.

లండను, అక్కడి జీవనము,-ఈ రెండును బెంజమిను కసహ్యము పుట్టించి యుండెను. ఫిలడల్‌ఫియాలో నిశ్చింతగ జఱిపిన మాసములను అనేక పర్యాయములు జ్ఞప్తికి దెచ్చుకొని, వానిని బెంజమి నభిలషించుచుండెను. కావున ముద్రాక్షర శాలలోని పనిని విడిచి, వస్తుసామగ్రిని కట్టి యోడ కెక్కించెను. మరి కొన్ని రోజులకుగాని యోడ బయలు దేర లేదు.

ప్రయాణమునకు ముందొక రోజున, ఘనతవహించి, కోశాధ్యక్షుడైన, సర్ విల్లియంవిండుహాము, వర్తమానము బంపినందున, వానిని దర్శించుటకు బెంజమిను వెళ్లెను. "నీకీత బాగుగ దెలియునని, నీవిద్దఱి కది నేర్పితి వని, నాలుగుమైళ్లీదితివనియు వినుచున్నాను. నా కుమారులు ప్రయాణోన్ముఖులయి యున్నారు. వారు వెళ్లుటకు పూర్వమే, నీ వీ విద్యను వారికి నేర్పవలయును" అని బెంజమినును 'విండుహాము' వేడుకొనెను. ఇతడు ప్రయాణ సన్నద్ధు డైనందున, దానికి సమ్మతించుటకు వీలు లేక పోయెను. "అమెరికాకు నాప్రయాణము సిద్ధముకాక మునుపు, నాకీ వర్త మానము వచ్చియుండిన, నేను ప్రయాణమును తలపెట్టక, ఇంగ్లాండులో నీతవిద్య పాఠశాలను బెట్టియుందు"నని బెంజమిను వ్రాసెను.