బిల్హణీయము/మొదటియంకము
బిల్హణీయము
మొదటియంకము - ఒకటవ స్థలము
అనిహిల్లా పట్టణములో రాజు ఆస్థానము
(వైయాకరణుడు నారాయణభట్టును, బిల్హణుని
మిత్రుడగు తార్కికుడు, కేశవభట్టును ప్రవేశింతురు. )
నారాయణభట్టు : మహాభాష్యానికి ఇతని తండ్రి వ్రాశిన వ్యాఖ్యానం ప్రమాణంగా యెవరు వొప్పుతారండీ! ఆలాగైతే నా శిష్యులు వ్రాసిన వ్యాఖ్యానాలు కూడా ప్రమాణవేఁ! యేవంటారు?
కేశవభట్టు : వాదానికి యుక్తి ప్రధానం గానీ పుస్తకాలతో యేంపనండీ!
నారా : యుక్తిలో నీరస సారసాలు కనిపెట్టే దాతేడండీ? ప్రభువులు నూతన ప్రియులు, ఆశ్రయించుకున్న వాళ్ళను క్షూణత పరచడమూ, పరాయి వాణ్ణి నెత్తికెక్కించు కోవడమూ వారికి నైజగుణం.
కేశ : గొంగళీలో తింటూ వెంట్రుకలు లెక్కపెట్టాడట! యిప్పుడు క్లూణత మనకు కొత్తగావొచ్చిందా యేమిటండి భోజరాజు కాలంనుంచీ కవిత్వం విలవ హెచ్చింది; శాస్త్రాలు అడుగంటాయి. నాలుగు శ్లోకం ముక్కలు అల్లుతారనే కదా రామశాస్త్రిని కృష్ణ స్వామిని రాజు యిప్పుడు మన అందరి నెత్తిమీదా కూచోబెట్టాడు.
నారా : వెధవ కవిత్వం! నా శిష్యులు చెబుతారు అంతకన్న మెరుగ్గాను, పరిశీలించేవాడే డండీ?
కేశ : గనక మనకు యిప్పుడు కొత్తగా వచ్చిన క్షూణత లేదని నా మతం. బిల్హణుడికీ, మీకూ స్నేహం కలుపుతాను రండి?
నారా : అయితే వాడి కాళ్ళు పట్టుకోమంటారా యేవిఁటి?
కేశ : ఏవీఁ, బిల్హణుడు, రామశాస్త్రీ కృష్ణస్వామీ పాటి పండితుడూ, కవీ, కాడనా మీ అభిప్రాయం ? నారా : ఆ పీనుగులకంటే యెవడైనా నయవేఁ అని నా అభిప్రాయం.
కేశ : నేను చెప్పవచ్చిన మాటా అదే. బిల్హణుడు మహాకవీ, ప్రతిభావంతుడున్నూ. అప్పుడే | రామశాస్తుల్లుకీ కృష్ణస్వామికీ కొన మళ్లించాడు. అది మనకో గొప్ప లాభం కాదా?
నారా : ఔను గాని, మన కొన కూడా మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడే!
కేశ : మనకు కొనంటూ వొకటి వుంటే కదూ మళ్లించడానికి? మీ, నా, అదృష్ఠాలు నాడే గిడస బారాయి. రాజు మన శాస్త్రాలు అక్కర చెయ్యడమే మానెను. మనం సభకు రాకపోయినా యేమైనారని తనుపే లేదు. మన పదవీ సదక్షిణాకంగా ధారపోస్తే వొల్లడు బిల్హణుడు.
నారా : అవును, మన అవస్థ అలాగే వుంది.
కేశ : ఈపాటి భాగ్యానికి అతగాడితో వృథావాదం మన కెందుకూ? కలహం పెంచకండి. నిన్న మీరు ఉభయులూ వాదీస్తూ వున్న సమయంలో రాజు ఉదయమంత్రితో రాచకార్యాలు ప్రశంసించుచుండెను. కనిపెట్టితీరా?
నారా : ఆలాగనండీ! అయితే నావాదవఁంతా వృథాయే? అవును. రాజు మెచ్చుతాడన్న ఆశ చాలా కాలామాయి వొదులుకున్నాను, గానీ, జినచంద్రుడయినా మెచ్చుకున్నాడా?
కేశ : స్తంభాన్ని జారబడి నిద్రపోయినాడు.
నారా : ఆసి! వీడి బొడ్డు పొక్కా పాండిత్యం కురిపిస్తూంటే యలా నిద్రపోయినాడయ్యా?
కేశ : ఇక్కడికి సంతుష్ఠి అయిందా?
నారా : అయితే ముందు యేంజేదాం!
కేశ : ఇటుపైని వాదం మానీసి, బిల్హణుడు ఏమన్నా మెచ్చుకుందాం.
నారా : ఓడిపోయినావఁనుకుంటాడేమో?
కేశ : బిల్హణుడి యోగ్యత మీ రెరగరు. ఎదటివాడి సత్తువ యెన్నే ఔదార్యం, పండితుల్లోకల్లా అతనియందే కలదు. నిజమైన విద్వత్తుకు జోహారు చేస్తాడు. అతను వైరులకు పిడుగు, స్నేహితులకు చందనము.
నారా : అయితే నా పాండిత్యం విషయమై అతగాడి అభిప్రాయం యెట్టిదో కనుక్కున్నారా?
కేశ : దిగ్దంతులం, మన పాండిత్యం విషయమై ప్రాజ్ఞుడైన వాడికి మరో అభిప్రాయం యేలా | కలుగుతుంది? ఆయన మనసులో మాట దాచే వ్యక్తి కాదు. రేపో నేడో ఆయన ముఖతఃమీరే వింటారు. అదుగో మాధవశర్మ వస్తున్నాడు మొహం మంగలంలా వుంది.
(యామినీదేవికి విద్యాగురువు మాధవశర్మ ప్రవేశించును. )
నారా : యేవఁండోయి?
మాధవ: యామినీదేవికి బిల్హణుడిచేత, విద్య చెప్పిస్తాడష!
నారా : మరి మీరో?
మాధ : కొత్త నీరొచ్చి పాతనీరు కొట్టుకుపోయింది.
నారా : యేం విద్య చెప్పిస్తారో?
మాధ : యేం వీద్యో నాకేం కావాలి! క్రూణతలో క్లూణత, అతగాడు చదువు చెబుతూవుంటే నేను కూడా వింటూ దగ్గర కూచోవాలష! “విపులాచ పృథ్వీ” అన్నాడు, మరో రాజు కాళ్ళు పట్టుకుంఛాను.
కేశ : బావా! తొందరపడకు. నీ జీతం నిలుపు కాలేదు గద?
మాధ : లేదు గానీ పువ్వులమ్మిన వూళ్ళో కట్టెలమ్మవలశి వచ్చింది గద?
కేశ : రాజుల యిష్ఠాయిష్ఠాలు మనమా శాసించే వాళ్ళము? పండితుడన్న వాడికి, కాలు కాలిన పిల్లిలాగ దేశాలు తిరిగి కష్ఠజీవనం కల్పించుకోవడానికి బదులుగా, గొప్ప ఆస్థానమందు ఉపాధి కలగడం పెద్ద అదృష్టం కాదా? అది తన్నుకుపోవడం ఉచితంకాదు. మన రాజు రాజర్షి యిట్టి రాజు యెన్ని రాజ్యాలు తిరిగినా మీకు దొరకడు.
మాధ : రాజర్షయితే యీలాటి ఘోరం ఆచరిస్తాడండీ ?
కేశ : ఘోరానికీ, అఘోరానికీ మీరయినా యామినీదేవికి కలకాలం విద్య చెప్పేది లేదు గద? రేపో నేడో ఆమెకు వివాహవైఁ విద్య కట్టడుతుంది. యీలోగా బిల్హణుడు నొల్లుకుపోయీది యేమీ లేదు.
మాధ : యెవడిదాకా వొస్తే గానీ వాడికి తెలియదు.
కేశ : యెవడైనా కాకతీరనీ పనికి తలవంచక తీరదు. రాజుకు యెవడు మాన్యుడైతే మనకు వాడే రాజు గనక బిల్హణుణ్ణి మంచి చేసుకోవడమే నీతి.
మాధ : మానభంగానికి కారణభూతుడైన శత్రువును బతిమాలు కొమ్మన్నావు. మంచీ నీతే!
“రథకారో నిజాం భార్యాం
సజారాం శిరసా కరోత్" అన్న న్యాయంగా వుందీ నీ సలహా!
కేశ : మనిషి దైవసృష్టి, శత్రుమిత్రులు మనుష్యసృష్టి. “అయం బంధుః పరోవేతి గణనా లఘుచేతసామ్! పుంసా ముదార చిత్తానాం వసుధైవ కుటుంబకమ్” మాధ : చాల్చాలు, నీ కుతర్కం చాలించు.
(కవి కృష్ణస్వామి ప్రవేశించును, మాధవశర్మ అతనికి యెదురుగా వెళ్ళి, )
మాధ : విన్నారా?
కృష్ణ : చూచాయగా.
మాధ : (నారాయణభట్టుతో) చూశారా, అప్పుడే వూరందరికీ తెలిసింది. (కృష్ణస్వామితో) ఆ వుత్తరాది వాడు మీకంటే పెద్ద కవిషండీ?
కృష్ణ : పెద్ద కేవుఁంది; అందరికంటే తాటిచెట్టు పెద్ద. కవిత్వం ఒక పాటిగా చెబుతాడు;గాని పండితుడు.
మాధ : పండితుడే కాగట్టండి! ఒకపాటి కవి కాదు మహాకవే అనండి. రాజపుత్రికలకు, తరతరాలనుంచి ఆస్థానం కనిపెట్టుకొని కాలం గడిపిన మీ, నా, బోటివారు విద్య చెప్పడం భావ్యం గాని, శీలం యెట్టిదో, సాంప్రదాయం యెట్టిదో, తెలియని దిక్కుమాలిన పరదేశిని అంతఃపురంలో ప్రవేశపెట్టడం ఉచితమేనా?
కృష్ణ : ఆ మాట అన్నారు, ఒప్పుకున్నాను.
మాధ : (మెల్లగా) మాట వరసకు అనుకుందాం. బిల్హణుడు జారుడైతే?
కృష్ణ : మీ పుట్టేం ములిగింది? రాజు అనుభవిస్తాడు.
మాధ : ఈలోగా యీ అవమానవఁంతా నేను అనుభవించాలి గదండీ!
కృష్ణ : మానావమానములు వకడు యిస్తేనా వస్తవి? రాజుటండీ బుద్ది యొక్కా విద్యయొక్కా విలువ కొల్చేవాడు? లేకుంటే, ఆ రామశాస్తులు సొట్ట కవిత్వం మెచ్చుతాడు గదా, రాజు తెలివి యేమని చెప్పను! |
మాధ : అయితే యిప్పుడు మనం యేం జేయడం, మీ సలహా.
కృష్ణ : సలహా కేవుందీ? మాట్లాడక ఊరుకోవడవేఁ సలహా.
మాధ : యీ అప్రతిష్ఠ సహించి యేలా వూరుకోవడం? నాలుగు మాసములు శలవు పుచ్చుకునీ తీర్థయాత్రలు వేళుదునా?
కృష్ణ : వెళ్ళండి.
మాధ : (మెల్లగా) ఆహవమల్ల మహారాజు పట్టపుదేవి తరుచు వర్తమానం చేస్తూన్నారు. వస్తే నాలుగు గ్రామాలు అగ్రహారంగా దయచేయిస్తానన్నారు.
కృష్ణ : అలాగైతే యింకా ఆలోచిస్తారేవిఁ?
(వైయాకరణులు జిన చంద్రుడును గోవింద శాస్త్రియును ప్రవేశింతురు.)
జిన : పడపడ వాగితే, యీ రాజులు డంగైపోతారు. నాలుగు పంక్తులు వ్రాస్తే పస బయలు పడుతుంది. పత్రికావాదం పెట్టి, పత్రికలు కాశీకి పంపమనండీ; బలాబలాలు తెలుస్తాయి.
(కవి రామశాస్త్రి ప్రవేశించును.)
గోవింద : అతగాడికి ఉపాసనాబలం వుందండీ. వాదన సమయంలో నాకు యెన్నో యుక్తులు స్ఫురిస్తాయి. వాక్థ్సంభనఐ మాట పైకి రాదు. మనిషిని గెలియడం శక్యంగానీ, మంత్రాన్ని గెలియడవెఁలాగ.
రామ : అంత పెనుప్రళయం అతగాడిలో యేమీ కానరాలేదే?
మాధ : (రామశాస్త్రిని పక్కకు పిలిచి) యేనాటికి యేవొఁస్తుందో తెలియదు.
రామ : యిప్పుడే వొఁచ్చింది ?
మాధ : యీనాటికి యామినీదేవికి చదువు చెప్పడానికి నేను తగాను కాను.
రామ : యేమండి?
మాధ : యేమో, రాజుగారికే తెలియాలి. రేపటినుంచీ బిల్హణుడిచేత విద్యచెప్పిస్తారష!
రామ : అలాగనా, ప్రభుచిత్తం మనవేఁం చేయ్యగలం?
మాధ : అంచాతనే దేశాంతరం వెళ్ళడానికి ఆలోచించాను.
రామ : అట్టి ఆలోచన యెన్నడూ చెయ్యకండి. మీరు పిల్లలవాళ్లు, యిల్లూ వాకలీ, తోటా దొడ్డీ కల్పించుకున్నారు. యెక్కడికి వెళ్లినా లోకం అంతా వక్క రీతిగానే వుంటుంది. మరి వక రాజ్యంలో మాత్రం ధర్మం నాలుగు పాదాలా నడుస్తుందనుకున్నారా? వెఱ్ఱిభ్రమ! ఆకాడికి మనరాజ్యవేఁనయం. రాజు సత్యసంధుడు. నిలబడి నిర్వహించడం నీతిగాని యెవడో డంబాచారి వచ్చాడని నొగలు విప్పి వెయ్యడం పౌరషవేనా?
మాధ : నాలుగు రోజులు జబ్బు పేరు పెట్టుకొని యింట వుండిపోదునా?
రామ : రాజు పోల్చుకొని కార్పణ్యం వహించగలడు.
మాధ : అయితే యేం జేదాం?
రామ : (మెల్లగా) యిసుంటారండి (నాలుగు అడుగులు యెడంగా వెళ్ళి) కపట స్నేహం చేశి వాడి లోతుపాతులు కనిపెట్టండి. కర్తవ్యం ముందు ముందు ఆలోచించుకుందాం.
మాధ : మీ సలహా బాగుంది.
రామ : సాయంత్రం కలుసుకు మాట్లాడుదాం. ఇప్పుడు యెడంగా వెళ్ళిపొండి. బిల్హణుడు వస్తున్నట్టుంది.
(బిల్టణుడును, పురోహితుడును ప్రవేశింతురు. )
బిల్హ : బ్రాహ్మణోత్తములకు నమస్కారము.
రామ : (నారాయణశాస్త్రితో) చూశారా బ్రాహ్మణోత్తములంటాడు గాని పండితులనడు. (బిల్హణుడు సభామంటపంలో నిలుచున్న వారిని, చూపు విసురున పరికించి నారాయణభట్టు దగ్గిరకు పోయి కౌగలించుకొనును.)
బిల్హ : పండితోత్తమా, మీరు పతంజలి అపరావతారము. మీ వాగ్ధోరణి నిన్న నాకు అపూర్వ కర్ణానందము చేసినది. నన్ను మెప్పించిన వైయాకరణి కిత్తునని నే ప్రతిజ్ఞ చేసిన యీ రుద్రాక్షమాల మీ కంఠము నలంకరించు గాక! (తన మెడలోని బంగారు కట్టిన రుద్రాక్షమాల నారాయణభట్టు మెడను వేయును. )
నారా : వద్దు-వద్దు-వద్దు. నేం తగను, మీ వంటి మహానుభావుల మెప్పే పది కోట్లు.(రుద్రాక్షమాల చేతబట్టి తీయునటుల అభినయించుచు కేశవభట్టు వంక చూచును. నలుగురు పండితులును చుట్టూ మూగుదురు.)
కేశ : మహాపండితుడు చేసిన సన్మానం ప్రభుసన్మానముకన్న దొడ్డది. ఉంపించండి.
బిల్హ : యీ అపూర్వమయిన మాల రాజపండితుడైన కర్ణమహారాజు కంఠమును మున్ను అలంకరించెను, ఇప్పుడది పండిత రాజు కంఠము నలంకరించినది.
రామ : (మాధవ శర్మతో మెల్లగా) మహారాజిచ్చిన మాల భట్టు కిచ్చాడు. యేమి యితగాడి పొగరూ!
మాధ : (రామశాస్త్రీతో) వీడు యెన్నాళ్లో దక్కడు.
(పూజ బ్రాహ్మడు ప్రవేశించి)
పూజ : మహాప్రభువువారు పూజాగృహానికి విజయం చేశారు.
(పండితులు వస్త్రములు సవరించుకొని బ్రాహ్మణుడి వెంట పోదురు. )
రెండవ రంగము
(కర్ణమహారాజు పూజామంటపము. రాజు పూజ చేయుచుండును. ఇరు పక్కలనూ పండితులును, ఉద్యోగస్తులును కూర్చుని యుందురు. )
కర్ణ మహారాజు : నిన్నటి వాదములో యవరు గెలిచినట్టు?
కవి రామశాస్త్రి : గెలుచుటకూ, వీగుటకు యేమున్నది మహారాజా ? కేశ : సత్యమే అన్నదాతా! పూర్వ పశ్చిమ సముద్రములకు వార ఏమిటి? అసాధారణ ప్రతిభావంతులగు మహాపండితులచే ఉత్పాదితమైన వాక్పరంపర భగవదుత్పాదితమగు సృష్టి పరంపర వలెనే (చెయ్యి రామశాస్త్రి వైపు తిప్పి) అస్మదాదులకు ఆశ్చర్య జనకమై యెన్న నశక్యమై యుండును. విష్ణ్వంశ సంభూతులగుటను, వారపారలు యేలినవారికే తెలియవలయు.
కర్ణ : రామశాస్త్రుల్లు గారు యేమంటిరి?
రామ : మహారాజా! కేశవభట్టు గారు తార్కికులు గనుక, వాదాదర మనుస్కులు. మంచిదేకానివివాదాంశము వస్తుతత్వమును గూర్చి కాక, పరవస్తుతత్వమును గూర్చి కాక, ఒక వ్యాకరణ సూత్ర మందు ఒక్క మాటకు వినియోగమున్నదా లేదాయను కుశంక ననుసరించియున్నప్పుడు, అట్టివాదము కాలము వెళ్లపుచ్చునుగాని, తత్వాన్వేషణమునకు కానేరదు. సూత్రములు ఋషి ప్రణీతములు. మార్పబడనేరవు. గాన వాదమునకు చరితార్థము తక్కువ. వినోదార్ధముచేయు ప్రసంగములకు వీగు గెలుపు లెక్కడివి మహాప్రభో!
కేశ : వ్యాకరణము వేదాంగమై, శబ్దబ్రహ్మమును గూర్చిన శాస్త్రమైనపుడు చరితార్థము లేకుండుట యెటుల?
“అజ్ఞానాంధస్య లోకస్య జ్ఞానాంజనశలాకయా,
చక్షురున్మీలితం యేన తస్మై పాణినయే నమః”
అనే శిక్షావాక్యము నిరర్థకము కానోపునా?
విదూషకుడు : వారివ్యాకరణ శాస్త్రము శబ్ద బ్రహ్మపరము. మీ తర్క శాస్త్రము అర్థబ్రహ్మపరము. అర్థబ్రహ్మాన్నే అందరూ ఉపాశిస్తారు. శబ్ద బ్రహ్మంతో సంతుష్టి తక్కువ. అర్థం మాట కొస్తే మంత్రి నానాపంతులు మహాపండితులు. మీరంతా నీరర్థకులే!
రామశాస్త్రి: స్వారస్యం బాగా తీశావూ.
మంత్రి నానాపంత్ : చుట్టూ తిరిగి ముక్తాయింపు నా మీదే?
విదూ : నిజం చెబితే, నిష్ఠూరం! “యస్యాస్తివిత్తం, సనరః కులీనః సపండితః" అనలేదా?
రామ : అవును; కాకేమి? అర్థశాస్త్రంలో నానామంత్రులు పండితులే!
విదూ : ఆ మాటే నేనంటే హాస్యం. మీరంటే నిజం.
కర్ణముహారాజు : నిజమనేది యేమిటో? విదూ : మంత్రులాడే మాటలల్లా నిజం.
కర్ణ మహారాజు : వారు అబద్ధమాడినా నిజమౌతుందా?
విదూ : సాగింది నిజం, సాగంది దబ్బర. మంత్రులనే మాట సాగుతుంది గనుక, వారనే మాటల్లా నిజమే. ఇంకా ప్రభువుల మాటే, సాగక, తరుచు దబ్బరౌతుంది.
కవి కృష్ణస్వామి : గౌతముడిది యేదో వినియోగంగల వాదం గాని, వ్యాకరణ వాదంలాగ నిరర్థకం కాదు.
కర్ణమహారాజు : మంత్రివర్య! గౌతముల యెడల మనమేమో అపరాధము చేసినట్టుంది.
నానామంత్రి :మహాప్రభో, ప్రభువులకు ధనం కూడికచేస్తే అది అందరికీ అపరాధమే.
విదూ : యెన్ని అక్రమాలు చేసినా, మంత్రులకు యిది వక డాలు దొరికింది. నీతినిపుణుడైన మంత్రి, స్వప్రతిభవల్ల కొత్తమార్గాలు కల్పించి, ధనసంగ్రహం చెయ్యాలిగానీ, రాజునూ, రాజునాశ్రయించుకున్న వాళ్ళనూ యెండు చాపలవలె యిగరగట్టడమా, ప్రయోజకత్వము?
కవి కృష్ణస్వామి : మరి వారి జాగ్రత ప్రభువులకు వ్యక్తం కావడ వెఁలాగ?
విదూ : గనక ఆస్థానమందు కనిపెట్టుకుని వున్నవాళ్ళకే, మొదట తాళం పట్టాలి. పయిన యెంత దూబర అయినా చింతలేదు.
కవి కృష్ణస్వామి : మహాప్రభో, మన ఉద్యోగస్థుల మీద గౌతముడు పద్యం చెప్పాడు. చిత్తగించ తగి వున్నది.
కర్ణమహారాజు : యేదేది?
గౌతముడు : వారి మహిమ “అతీతః పంథానం! వాజ్మనసయో?” అయినా “చకితమభిధత్తే" అన్నట్టు చెప్పాను.
క. దబ్బరలుం గొండెమ్ములు
మబ్బువలెంగ్రమ్ము మాయ మాటల తీపున్
నిబ్బరపు మొండితనమును
నబ్బురమగు విద్య లిచటి యధికారులకున్.
కృష్ణస్వామి : అక్షరలక్ష ఇయ్య తగి వుంది.
నానామంత్రి : హాస్యగాణ్ణి అయినా, హద్దుమీద వుంచాలి.
కర్ణమహారాజు : (చిరునగవుతో) హద్దుమాలిన మనిషి ఒక్కొకడు ఉంటేనే గానీ, హద్దు యొక్క గుణాగుణములు తెలియవు. మనవలె ఉచ్ఛావస్థలో నున్న వారిని స్వేచ్ఛగా తిట్ట గలిగిన వారిని వకరిని, అచ్చుబోసి వదిలితేనే గానీ, మనను గూర్చి లోకం యేమనేదీ మనకి తెలియబోదు, యేమంటారు?
కృష్ణ : సత్యం! సత్యం! పునస్సత్యం!
రామ : మహారాజా, ఉచ్చావస్థలో నున్న ప్రాజ్ఞులు మంచి చెడ్డలు యెరగకనా సంచరిస్తారు? మంచిచెడ్డ లన్నవి అంతకన్న లోకులకు, బాగా తెలియగలవు ?
విదూ : భర్తృహరి ప్రభువులను గూర్చియేమో చెప్పాడు. రామశాస్తులుగారికి విస్మృతి వచ్చినట్టుంది.
నానామంత్రి : తల్లితండ్రులు ప్రభువులను దిద్దాలి. మాబోటి అధికార్లను ప్రభువులు దీద్దాలి; గాని తిట్టి బతకనేర్చిన కడుపుకూటి బ్రాహ్మడా, మహప్రభో తప్పొప్పులు కనిపెట్టే వాడూ? కొందరు మహానుభావులు యతగాడికి విందులు పెట్టి, వారి పగలు ఈ వికటకవి ద్వారా తీర్చుకుంటారు. అయినా, నౌకరుకు విచారం లేదు. ప్రభుసేవా దైవసేవలతో కాలం వెళ్ళపుచ్చే మనిషి, దూషణ భూషణ తిరస్కారములు సరకు గొనడు. మనవి చెయ్యవలశిన మాట ఒకటి వుండి పోయింది మహప్రభో! మాతా మహారాణీవారి శలవైనది. మహారాజ కుమారికా వారికి విద్యాభ్యాసము ముగించ వలసిన కాలము మీరినదని వారి అభిప్రాయము.
కర్ణమహారాజు : అమ్మాజీవారి ఆజ్ఞ మన అందరికీ సిరస్సున ధార్యము.
కృష్ణస్వామి : (విదూషకునితో) ఏమి వెన్నుకుప్ప పరిసీలిస్తున్నావు?
విదూ : ఈ దొడ్డ సలహా, మాతా మహారాణీ వారికి, యెవరు మనవి చేసి యుందురో అని.
కర్ణమహారాజు : వెన్నుకుప్ప చెప్పునా?
నానామంత్రి : నేను మనవి చేశానని కాబోలు, యీ బ్రాహ్మడి మాటల ధ్వని. శ్రీకృష్ణులు సాక్షి నేను మనవి చెయ్యలేదు.
కర్ణమహారాజు : యెన్నడూ వొట్టు వేసుకోకండి. వొట్టు వేసుకోవడం యితరులు మనమాట నమ్మరని కదా? నమ్మినా, నమ్మకపోయినా, వొట్టు కార్యము లేదు కదా?
రామశాస్త్రి : సలహా మాటకు వస్తే, ఈ విషయములో ఒకరి సలహాకు యేమి అవకాశం కద్దు? మహారాజకుమారికా వారికి విద్యాభ్యాసపుటీడు మీరినదని, ఒకరు విన్నవించిన గానీ, మాతా మహారాణీ వారికి తెలియదు కాబోలును.
విదూ : కొందరు అధికార్లకు ఆశ్రయణమూ, పొగడ్తా రుచి. బిల్హణుడు ఉద్యోగస్తులకు కైవారం చెయ్యడు. వారి నోట వచ్చిన మాట కల్లా అహ! హా! అని ఆశ్చర్యం నటించడు. వొచ్చిన ఉపద్రం, యిది. కృష్ణస్వామి : నిజమైన పండితుడికి ప్రభువులయందే లక్ష్యం ఉంటుందిగాని, ఉద్యోగస్తుల యందు లక్ష్యం యేల వుండును?
రామ : ప్రభు లక్ష్యమే లేని పండితులకు, ఉద్యోగస్తుల లక్ష్యవెఁలా వుండును?
నానామంత్రి :బిల్హణుడు ప్రభువులను కూడా లక్ష్యపెట్టడా? మహాప్రభువు వారిని గూర్చి చులకనగా ప్రశంశించెనా? యేమిటి అంతవాడూ అవును!
మాధ : ప్రశంస అని ప్రశంస కాదు. ప్రభువులు చేసిన సన్మానాన్ని నిరాకరించారని కాబోలు. రామశాస్త్రిగారి భావం.
కర్ణమహారాజు : అదెలాగ?
కృష్ణ : మరేమీలేదు; యేలినవారు దయచేసిన రుద్రాక్షమాల, పదిమంది పండితులలోనూ, నారాయణభట్టుగారి మెడను వేశారు (రామశాస్త్రీతో) అదేకదండీ మీరనబోయే మాట?
కర్ణమహారాజు : (కనుబొమ లెగయ యోచన నటించి) అలాగనా స్వామీ?
కృష్ణ : నా కళ్ళతో చూశాను.
నానామంత్రి : ప్రభువులు, వచ్చిన దాసరినల్లా మెచ్చి, హారాలూ, అందలాలూ, యిస్తూవుంటే, వాళ్లు నిరసించడం ఆశ్చర్యమా!
విదూ : ప్రభువుల శలవైనప్పటికీ, ఒక కాచవైఁనా యివ్వకుండా మీరు కలకాలం తిప్పుతూ వుంటే, ప్రభువులు వొళ్లువొలిచి, హారాలూ, అంగదాలూ, యివ్వవలిశి వొస్తుంది. ఇదే మీలాటి మంత్రులు ప్రభువులకు చేసీ కూడిక.
కర్ణమహా :మంత్రివర్య, బిల్హణకవి ఇట్టి పనిచేస్తారని మేము తలచి యుండలేదు.
నానామంత్రి : దేశదిమ్మరి! తరతరాలనుంచి కనిపెట్టుకున్న వాళ్లకి వుంటాయిగాని యేలినవారి యెడల భక్తి విశ్వాసాలు, అట్టివాడికెలా వుంటాయి?
కృష్ణ : బుఱ్ఱకు విలవ తక్కువ అనండి. స్వదేశి అయితేనేం, పరదేశి అయితేనేం?
నానా : కాకుంటే, తనతలేవిఁటి, ప్రభువులు తనకిచ్చిన అమూల్యమైన హారం, తానంటూ మరివక పండితుడికి బహుమానం చెయ్యడవేఁవిఁటి?
కర్ణ : యింకా బిల్హణులచేత మహారాజకుమారికలకు చదువు చెప్పించవలెననుకుంటిమి. ఈయన ప్రవర్తనకు తగిన ప్రతిక్రియ యెద్ది?
విదూ : తన్ని తగిలివెయ్యడం. నానా : ఉచ్చాటన చెయ్యడమున్నూ, అతనివద్ద నున్న ధనము తీసికొని, ధర్మవినియోగము చెయ్యడమున్నూ ఉచితమనీ తలుస్తాను.
కేశవ : క్షమాపణనుకోరి, విన్నవిస్తును. మహారాజాధిరాజా! పండితుడు శిక్షార్హుడుకాడు. “విద్వద్దండమగౌరవమ్”. అదిగాక నేరమన్నది ఒకటి స్థాపించవలసి :-
కర్ణ : (కొంచెము కోపరసంగా) నేరం లేదనా మీ అభిప్రాయము?
కేశవ : చిత్తం, చిత్తం, నేను యేమి మనవి చెయ్యగలను.
మాధవ : నేరవేఁ కాకపోతే యెన్నడూ కోపవెఁరగని ప్రభువులకు కోపమెందుకు వచ్చేని?
రామ : (మాధవశర్మతో మెల్లగా) ఊరుకొండి.
కర్ణ : మంత్రివర్య, యీ బ్రాహ్మణ్ణి అరవై గడియల్లోగా పట్ణోంలోనుంచి సాగనంపితే?
నానా : చిత్తం! యేలికల శాసనము ఈ క్షణమందే అమలు చేస్తాను. (పత్రిక వ్రాసి పంపును)
కర్ణ : మంత్రివర్య, మహారాజ కుమారికావారి విద్యాభ్యాసము విషయమై, మీ అభిప్రాయ మెట్టిది? మీరు అనుభవ శాలులు, సాంప్రదాయజ్ఞులు.
నానామంత్రి : మాతా మహారాణీవారి శలవు ఆ ప్రకారం అయినది. నేను యేమీ మనవి చెయ్యగలను?
కర్ణమహా : సంగీత సాహిత్యములూ, కొంత వరకు తర్క వ్యాకరణములూ, బావాజీ వారు చెప్పించారు. అదంతా మాధవశర్మగారి ఆశీర్వచన ఫలం గానీ, యీ విద్యలు జ్ఞాన సాధనములు. ప్రత్యేకం వీటియందు విలువ తక్కువ. భగవద్గీతను ఉపదేశించి మరీ విద్యాభ్యాసము విరమించడము ఉచితమని యిదీవరకు అనుకుని వుంటిమీ.
నానామంత్రి : ఏలికల వాక్యములు గురూపదేశములు. విద్య అనగా ముక్తి సాధనమైన విద్యే. సందేహ మేవిఁటి మహాప్రభో!
కర్ణ : మహారాజ కుమారికలు భగవద్గీతను పఠించతగ్గదనే మీ అభిప్రాయమా?
నానా : చిత్తము. నా చిన్నతనంలో మా తల్లిగారు పఠిస్తూ వుండగా నాకు కూడా గీతా శ్లోకములు కంఠోపాఠంగా వచ్చినవి. ప్రాజ్ఞుడనైన తరువాత వారణాసిలో గురు ముఖతః గీత ఉపదేశం అయినాను. దక్షిణయాత్రలు వెళ్లినప్పుడు కాంచీపురంలో లక్ష్మణాచార్యుల వారివద్ద కూడా గీతార్థం విన్నాను. నేను అజ్ఞుడనే గాని, నేను మనవి చేశిన స్వారస్యాలు వారు చిత్తగించి, ఆశ్చర్యపడేవారు. అది అల్లా అమ్మాజీ మహారాణీవారి శిక్షా ప్రభావం, మహాప్రభో.
కర్ణ : సందేహమేమి? సముద్రమునకైనా మేరకద్దుగాని, మనిషి బుద్దికి మేరయెక్కడిదీ? వాఖ్యాన కర్తలూ, మనవంటి మనుష్యులేనా? గురువు బుద్దికి పై ఆడవలెనని శిష్యుడు ప్రవర్తిస్తేనే గాని విద్య పెరగదు. అమ్మాజీవారికి భగవద్గీతయందు మంచిప్రవేశము కలదు. మీరు మనవి చేస్తే మహారాజకుమారికావారికి కూడా ఆ గ్రంథరాజమును చెప్పించుటకు వప్పుదురేమో!
నానా : శలవయితే మనవి చేస్తాను.
కర్ణ : మీరు మనవిచేస్తే, వారు ఆమోదించడముకు అభ్యంతరం వుండబోదు. గాని బిల్హణులు వెళ్ళిపోతే, యెవరిచేత ఉపదేశం చేయింతుము!
నానా : మన పండితులు దిగ్దంతులు, యవరైనా చెప్పగలరు.
కర్ణ : లోకానుభవమూ, బోధకతా శక్తీకలవారు మీ రేల చెప్పరాదు?
నానా : ప్రభువుల శలవైతే, తప్పకుండా చెప్పుతాను. మాధవశర్మగారి సహాయం వుండనే వుంటుంది.
మాధవ : ఆహా.
కర్ణ : అయితే అమ్మాజీవారితో మనవిచేశి వత్తురా?
నానా : చిత్తం. మనవిచేసి, యిప్పుడే తిరిగీ హాజరవుతాను (నిష్క్రమించును)
విదూ : యేమి చిత్రమైన లోకమూ!
కర్ణ : కొత్త చిత్రం యేమి కనపడ్డది?
విదూ : నేను ఒకణ్ణి తప్ప, లోకంలో మరి యెవడికీ తన అవస్థతో సంతుష్టిలేదాయ?
కర్ణ : యెలాగో?
విదూ : పండితులకి ఉద్యోగాలు చెయ్యాలని తాపత్రయం. ఉద్యోగస్తులకు పండితులనిపించుకోవాలని తాపత్రయమూను.
కర్ణ : మామాటో?
విదూ : తమమాట చెప్పనేల? అంతా యెరిగినదే! నా పదవిమీద మీరు కన్నువేశారు.
కృష్ణ : మొదటికే తెచ్చావూ!
విదూ : రామ శబ్దంరాని నానామంత్రిచేత, గీత ఉపదేశం చేయించడానికి తమరు తల పడ్డప్పుడు, నా బిరుదులు నేను తమకు సమర్పించక తీరదు గదా? (మహారాజు విదూషకుడి చెవిలో రహస్యము చెప్పును. విదూషకుడు టొంకరి నడకతో నిష్క్రమించును) కృష్ణ : (మాధవశర్మతో చిన్న గొంతుకతో రహస్యమాడి, పైకి) “ముఖేహోరావాప్తిః” అన్న శ్లోకము విషయమై మాధవశర్మగారు ఒక చిత్రకథ చెప్పుతున్నారు.
కర్ణ : యేమిటండి?
కృష్ణ : మరేమీ లేదు. ఆ శ్లోకం దాహలాధీశుడైన కర్ణమహారాజును ఉద్దేశించి చెప్పినదట.
కర్ణ : యెంగిలి శ్లోకమా మాకు సమర్పణ అయినది!
కృష్ణ : చాలామంది కవులమనేవారు, యెంగిలి శ్లోకాలవల్లనే ప్రతిష్ఠ సంపాదిస్తారు.
రామ : పరదేశికి యేలినవారియందు భక్తి యెలా వుంటుంది?
కర్ణ : పేరు ఒకటయితే యిట్టి తారుమార్లకు అవకాశం వుంటుంది.
కేశవ : యేలినవారికి తెలియనిది లేదు. ఆ శ్లోకము మట్టుకు మిక్కిలి విలవైనది. చాలాకాలము కిందటనే రచితమయిన యడల, ప్రభువుల యొక్కా పండితులయొక్కా కర్ణగోచరము కాకుండునా? బిల్హణకవి కొత్త శ్లోకం చెప్పే పాటి సామర్థ్యం లేనివాడు కాడు.
రామ : మంచి శ్లోకవఁన్నదీ తలచినప్పుడల్లా స్ఫురిస్తుందా?
(విదూషకుడు ప్రవేశించును)
కర్ణ : ఈయన కాశ్మీర రాజుల ఆస్థానము యేల విడచిరో, యెవరికైనా తెలుసునా?
రామ : మనవి చెయ్యడమునకు వీలులేని కారణము చెబుతారు.
కృష్ణ : తన్ని తగిలేశారని యీ మాధవశర్మగారే చెప్పారు.
మాధవ : నేనా చెప్పాను! తప్పుగా విని వుందురు.
విదూ : ఈ కవిత్వం మాధవప్రణీతవఁయే, వుండాలి.
కర్ణ : (కృష్ణస్వామితో) యెందుకు ఉచ్చాటన ఐందో?
కృష్ణ : కారణమంటూ విశేషకారణ వేఁమీ లేదు. రాజుగారు వుంచిన వేశ్య, సౌందర్యమును చూచి మనసు నిలపబూనినారు కారట.
కర్ణ : ఐతే రసికులే.
విదూ : ఆ మాట కొస్తే, యితర మహాకవుల తక్కువ యేమిటో! కృష్ణమిశ్రి చెప్పినట్టు యెంతటివాడికైనా...
శ్లో|| సంతు విలోకన భాషణ,
విలాస పరిహాస కేళి పరిరంభాః
స్మరణ మపి కామినీనామ్,
అలమిహ మనసోవికారాయ
కర్ణ : అందరికీ తెచ్చారా?
కేశవ : క్షమాపణ మనవిచేసి, ఒక్కసంగతి శృతపర్చుకుంటాను. బిల్హణుడు మహాపండితుడు, దేశదేశములు తిరుగును. అట్టివాడిని అనాదరణచేసిన యెడల, అపకీర్తి సాటగలడు. పండితులు శిక్షార్హులు కారు. “విద్వద్దండ మగౌరవం” అన్నాడు. నేరం యెంతవరకూ వున్నదో, వారు యెంతవరకూ సమాధానం చెప్పుకోగలరో, ఆ తత్వాన్వేషణం కూడా కర్తవ్యమేమో అని సందేహం కలుగుతూంది.
మాధవ : అయితే, తత్వాన్వేషణం చెయ్యనిదీ ప్రభువులు శిక్ష విధించారనా, మీ అభిప్రాయం?
రామ : విష్ణ్వంశసంభూతులగు మహాప్రభువులు, అన్వేషణం అంటూ వకటి చెయ్యవలెనా నిజమును?
"సతాం హి సందేహ పదేషు వస్తుషు
ప్రమాణ మంతఃకరణ ప్రవృత్తయః
విదూ : ఆ సిద్ధాంతం అందరి మెళ్ళకీ వురి అల్లుకోవడవేఁ. యిప్పుడు ఒహడి పీకకు తగిలిస్తే,రేపు మన పీకకే తగులుకోగల్దు. ఇదుగో నానా మంత్రి వస్తున్నారు. నిద్రపోతూన్నవాళ్ళ పీకలు తెగొయ్యడానికి యింత మహావీరుడు మరి లోకంలో లేడు. ఆ ధర్మ సందేహవేఁ దో ఆయన తీరుస్తారు.
(మంత్రి నానాపంత్ ప్రవేశించును. )
నానా : మహాప్రభో! మహారాజకుమారివారికి భగవద్గీతలు ఉపదేశం చేయించడపు అభిలాష యేలినవారికి కలదని, శ్రీ మాతా మహారాణీ వారితో నవుకరు మనవి చెయ్యగా మిక్కిలి సంతోషముతో వారు ఆమోదించారు.
కర్ణ : మీరు మనవి చేసిన తరవాత, మరివకలాగు యేల ఔను ?
విదూ : పాం విషం పావేం తియ్యాలి.
(నానామంత్రి కోపముతో విదూషకునివైపు చూచును)
కర్ణ : అతని మాటలు సరకు చెయ్యకండి. విదూ : భగవద్గీత కాశీలోనూ, కాంచీపురంలోనూ అభ్యసించిన పంతులు వారికి కోపవెఁందుకు వుంటుంది? అయినా నిజవైఁన మాటకు కోపవెఁందుకు?
కర్ణ : నిజమనేది యెట్టిదో?
విదూ : అనుదినం భగవద్గీత పారాయణం మట్టుకు చేస్తూవుంటే, ఆడే అబద్దాలల్లా నిజ వౌఁతాయి. ఇది వక శుద్ధక్రియ.
నానా : యేమిటీ యీ మాటలకి అర్థం.
కర్ణ : విదూషకుడి మాటలకు అర్థం ఆలోచిస్తారేమిటి?
కృష్ణ : కొందఱికి అతగాడి మాటలు ఆలోచించినకొద్దీ అర్థాలిస్తాయి.
నానా : వెఱ్ఱికి వేయి అర్థాలు.
విదూ : కేశవభట్టుగారిని ఒక వెఱ్ఱి ధర్మసందేహం బాధిస్తూంది. ఆయన వెఱ్ఱి తీర్చి, తరువాత నా వెఱ్ఱికి వైద్యం చేతురుగాని.
(కర్ణమహారాజు కనుబొమలెత్తి కేశవభట్టును చూచును.)
కేశవ : నిజం విచారించి మరీ శిక్ష విధించటం ధర్మశాస్త్ర పద్ధతేమో యని సర్వజ్ఞులున్నూ, ధర్మస్వరూపులున్నూ అయిన యేలికల సమక్షమందు యంతో భయంతో మనవి చేసుకుంటున్నాను.
కర్ణ : యెంతమాటంటిరి; భయమేల? నేను రాజు నైనను, కించజ్ఞుడను. రాజు నౌటనే కించజుడను అని అనవచ్చును. పండితులు, ప్రాజ్ఞులు వారి వారి నమ్మకములను నా యెదుట ముచ్చటించుటకు వెరచిరేని, నేను రాజ్యమునకు అర్హుడనే కానే?
కేశ : రాజాధిరాజ! పండితరాజను శబ్దము యేలినవారికే చెల్లేను! గ్రంథములు నెత్తిని మోయుటకు అస్మదాదులము కూడా మహాపండితులమే. అయితే, మోతచేటే గాని, వాటి గంధము ఆత్మలకు అంటక, చదువులు ఒక తెన్నూ చర్యలు మరవక తెన్నూ అయి, కామ లోభాదులచే జ్ఞానాంధులమైన మా బోట్లకు, పండితశబ్దము యెట్లు చెల్లును? లోకము పరిత్యజించి అడవుల్లో తపస్సుచేసే మునులకయినా లొంగని క్రోధాదులను నిర్జించిన యేలినవారే పండితులుగాని, ఈర్ష్యతీర్చుకొనుటకుగాను నిజమును కప్పి, ధర్మమును దాచి, అల్పమైన ఐహిక లాభముల నపేక్షించే, మేమా పండితులము మహారాజా?
కృష్ణ : యీ ముక్కలేమో యెవరికీ తెలియనట్లు ఉపన్యసిస్తూన్నారు. రెండు కళ్ళతోనూ చూశామయ్యా, అని ఘోషిస్తూ వుంటే, అట్టి బలవత్తరమైన సాక్ష్యాన్ని మీ పండిత దూషణ యెలా కొట్టగలదో, నాకు బోధపడకుండా వున్నది. ఛాందసానికిన్నీ, రాజ్య . తంత్రానికిన్నీ చాలా దూరం వుంది.
నానా : నాతో దోషే వొప్పుకుంటేనే “ఆ తావళ మనేది, తాతాజీ మహారాజా వారు నేపాళం మహారాజులువద్ద సంపాదించారు. దానితో అర్జునుడు జపం చేసేవాడని ప్రతీతి కూడా కద్దు. శివపూజా కాలమందు మహా ప్రభువువారు, నమస్కరించి, కళ్ళ నద్దుకుని మరీ ధరించేవారు. మీ యందు వుండే అసమాన గౌరవము చేత మీకిది అనుగ్రహ పూర్వకముగా దయచేశారు. అది యెందుకు వక ఆస్థాన పండితుడికి బహుమానంగా యిచ్చావయ్యా" అని నే నడిగితే, యేవన్నాడంటే, “యీ కుళ్లు తావళానికి యీ దేశంలో కాబట్టి యింత మాన్యత కలిగింది, మా దేశంలో ప్రతి తుప్పనిండా ఏకముఖీ రుద్రాక్షలే. తెగించి నాకు యింత బహుమానం చేశినందుకు మీ రాజు బెంగ బెట్టుకోలేదు గదా?” అని నిర్మొహమాటంగా అన్నాడు. నా కంటూ ఆ మాటతో వొళ్ళు నీరు విడిచిపోయింది.
విదూ : యెప్పుడు ఈ ప్రసంగం జరిగిందో?
నానా : నీ ప్రశ్నలకు సమాధానాలు నీలాటివాళ్లే చెబుతారు.
కర్ణ : చిత్రం, కొందరికి యెలకంటే బెదురు, కొందరికి పిల్లంటే బెదురు; నానామంత్రిగారికి గౌతములంటే బెదురు.
నానామంత్రి : ఆ మాట శలవివ్వవద్దు, మహాప్రభో! యేలినవారూ అమ్మాజీవారూ తప్ప లోకంలో నాకు బ్రహ్మ భయం లేదు.
విదూ : యముడి భయవేఁ లేనివాడికి, బ్రహ్మభయం యెలా వుంటుంది !
కృష్ణ : వారు చెబుతూవున్న సాక్ష్యం అబద్ధవోఁ, నిజవోఁ, కొసాకూ వినరాదూ?
కర్ణ : తరువాతండి?
నానామంత్రి : తరవాతేవొచ్చి, మళ్ళీ అన్నాను “నారాయణభట్టుగారి విద్యను మహారాజులు తగినట్టు గౌరవించనట్టున్నూ, యీ విషయంలో మహారాజుల లోపమును మీరు యెత్తి పొడిచి సవరణ చేసినట్టున్ను లోకానికి అర్థం కాగలదు. మహారాజులు శాంతులని, యీలాటి నిరాదరణ చెయ్యరాదు” అని వేయి విధాల అతని మేలుకోరి, బోధ చేస్తే, “రాజులకేం తెలుస్తుందీ విద్యల విలవ? రాజులు విద్యాఘూకా"లన్నాడు.
విదూ : యీపాటికి బిల్హణుడు వూరి పొలిమేర దాటివుంటాడు. యెన్ని గోతాలు కోసినా ప్రతిబంధకం లేదు. నానామంత్రి : అలా అనేటట్టయితే, యిప్పుడు ఆయన్ని పిలిపించండి. యీ ఆస్థానమందు రుజు విప్పిస్తాను.
విదూ : అదుగో, నారాయణభట్టుతో కలశి ఆయనే వస్తున్నారు. మీరు తలచేటప్పటికి బిల్హణుడు ఆకాశాన్నించి వుట్టిపడ్డట్టుంది. కాయసిద్దుంది కాబోలు.
(నానామంత్రి వెనుకవైపు నిర్ఘాంతపోయి చూచును. అలా చూచుచుండగా కర్ణమహారాజు స్వర్ణపేటికలోని రుద్రాక్షమాల దీసి ధరించును.)
నానామంత్రి : వైదికులు హద్దుమీద వుండరు. ఉచ్చాటనా శాసనమైనప్పటికీ యెలా తోసుకు వస్తున్నాడో! (ఉత్సాహముతో) అదిగో, నారాయణభట్టుగారి మెడలో రుద్రాక్షమాల!
విదూ : ఆచిత్రవేఁంజూస్తారు, ఈచిత్రం చూడండి. యిదుగో ప్రభువుల మెడలో ప్రభువుల రుద్రాక్షమాల!
(నానామంత్రి ఆశ్చర్యముతో మహారాజు వైపు చూసి, తిరిగీ నారాయణభట్టు కంఠమును పరికించుచున్న సమయములో బిల్హణుడు దగ్గిర కాగానే మహారాజు నిలుచుండును. అందరూ నిలుతురు. అది చూచి యెందుకో పోల్చుకోలేక, నానామంత్రి కూడా నిలుచును.)
కేశ : బోధపడ్డది “యీ హారము రాజుపండితుడైన కర్జమహారాజు కంఠమును అలంకరించినది” అని బిల్హణకవులు అన్నప్పుడు దాహలా ధీశుడగు కర్ణుని ఉద్దేశించి చెప్పివుందురు. కానలేకపోతిమి.
విదూ : యింతసేపటికి తర్కం పని చేసింది.
కృష్ణస్వామి : అదిటండీ. అషైతే మనమందరమూ బిల్హణులకు అపరాధం చెప్పుకోవలసి వుంటుంది.
కేశ : చుక్కానికి న్యాయంగా పోతుందీ స్వామివారి మనస్సు. కలుషం లేదు.
కృష్ణ : పండితుడికి కలుషంవుంటే, మరి పండితుడేవిఁటండీ. ఆ మహారాజును చూసైనా నేర్చుకోవద్దా?
కర్ణ : (బిల్హణ నారాయణభట్టులతో) దయ చెయ్యండి. దగ్గరగా కూచోండి.
(అందరును యవరి స్థలములయందు వారు కూచుందురు)
నానామంత్రి : (మాధవశర్మ చెవిలో) నా మాటలు గానీ వినివుండరు గద?
విదూ : అప్పుడు చాలా దూరంగా వున్నారు; విని వుండరు, కర్ణ పిశాచి వుంటే తప్పు. కృష్ణ : నీకు వున్నట్టుంది కర్ణ పిశాచి. యెక్కడలేని రహస్యాలూ యెక్క లాగుతావు.
కర్ణ : (బిల్హణుని ఉద్దేశించి) కవి వర్య! అజ్ఞానానికి అంజనం యేమిటి?
బిల్హ : రాజ పదవికి నైసర్గికమైన మహాంధకారమును తొలగించి, నిశ్చలమైన జ్ఞానోదయము వల్ల అరిషడ్వర్గమును తలచూప నివ్వకుండా తరిమిన తమవంటి సత్పురుషుల సహవాసమే అజ్ఞానాంజనము మహారాజా! పండిత సామాన్యమునకు విద్యన్నది జ్ఞానసాధకంకాక, మాత్సర్యహేతువై యేయుండును.
విదూ : నానామంత్రిగారి అభిప్రాయమూ అదే. వారు మట్టుకు సాధనం లేకుండానే సాధ్యం సాధించారు.
కర్ణ : జ్ఞానాలోకమునకు ఉత్పత్తి స్థానము సూరులు. ఆ సూరుల సంసర్గంవల్ల నృపనామక పాషాణములకు కూడా కాంతి ఆపాదన ఔతుంది. నాకుగల స్వల్పజ్ఞానము అమ్మాజీ వారి శిక్షవల్లనూ, మహా పండితుల సహవాసమువల్లనే కలిగినది. స్వామి మాకు బాల్యగురువులు. యిప్పుడు తాము అందరూ మాకు గురువులే. (మంత్రితో) మంత్రి వర్యా! రేపటి నుంచి బిల్హణ కవులు మహారాజ కుమారికా వారికి గీతోపదేశం చెయ్యడముకు అభ్యంతర మేమీ?
నానా : అభ్యంతరం అనగా అభ్యంతరం యెందుకుంటుంది మహాప్రభో!
కర్ణ : అయితే అమ్మాజీ వారితో విన్నవించి వస్తాము. (లేచును.) (అందరు లేచుచుండగా)కూచోండి! పెద్దలకు శ్రమయేల? (నిష్ర్కమించును).
(పండితులు చెదిరి గుంపులు గుంపులుగా మాటాడుదురు. )
నానామంత్రి : (మాధవశర్మతో) అడ్డంగా తిరిగిందే!
మాధవశర్మ : అదే నేనూ యోచిస్తూన్నాను. ప్రవాహానికి యెదురీది ప్రయోజనం లేదు.
నానామంత్రి : అయితే వాడితో కలిశిపోతానంటారా యేమిటి?
మాధవ : ఆడుకొమ్మా, పట్టుకొమ్మా కనపడనప్పుడు యేం జేయను?
నానా : మీరు భయపడక నిలబడి మాత్రం వుండండి వీడికి ఉచ్చాటనమంత్రం మహారాణీ వారితోటి వుపదేశం చేస్తాను. చూడండీ, ఆ స్వామి, వాడితో యెంత ఆసక్తితో ముచ్చటిస్తున్నాడో! మన వాళ్లలో కట్టు లేదు.
మాధవ : పండితులు కుక్కల్లాగ కాట్లాడబట్టేకదండీ, పరాయివాళ్ళు డబ్బు తన్నుకుపోతున్నారు! (బిల్హణుడున్న తావుకు వెళ్ళును.) నానా : (రామశాస్త్రితో) అస్త్రం అడ్డుదిరిగిందండీ.
రామశాస్త్రి :తాము కొంచం అతి ఆచరిస్తారు.
నానామంత్రి : యేం చేయను శాస్తులుగారూ? భగవంతుడు తీక్షణమైన బుద్దిని యిచ్చాడు. | అది విడడ్డదంటే, పట్టడానికి నాకే అసాధ్యమైపోతుంది. యిహ వూరుకుందునా?
రాము : తాము ఊరుకుంటే యేలాగ? బిల్హణుడు కుమారికావారి దగ్గర ఆనుకున్నాడంటే వారిని కలశ మహారాజుకు వివాహం చేసే ప్రక్రియ నడిపిస్తాడు. ధారాపతినిగూర్చి మనం ఇన్నాళ్ళాయి చేశిన ప్రయత్నం విఫలమౌతుంది.
నానా : చూశారా మొన్న కాశ్మీరరాజు తండ్రి అనంతభూపాలుణ్ణి, రాజు యెదుట భట్టువాళ్లా యెలా పొగిడాడో!
రామ : దానికి ప్రతిక్రియ అమ్మాజీవారి దగ్గర తాము కల్పించాలి.
నానా : రాజు అసాధ్యుడుగద!
(బిల్టణుడు నానామంత్రి వద్దకు వచ్చును. )
బిల్హ : (నానామంత్రితో) తాము పంపిన ద్రాక్షఫలముల వంటి ఫలములు మా దేశం విడిచిన తరవాత తినలేదు. పంపిన మీ దయకు చాలా సంతోషించాను.
కృష్ణ : (ఒకపాటి మెల్లగా, గాని వినబడేటట్టు) ముడ్డి కాల్చి, మూతికి వెన్న రాసేవాడు, యింతవాడు మరి పుట్టబోడు. )
నానా : (బిల్హణుని దూరము కొనిపోయి) పండితులలో యెంత ఓర్వలేని వాళ్లయినా వుంటారు. వీళ్ల నెవ్వరినీ నమ్మకండి. అందులో మాధవశర్మ బహుదుర్మార్గుఁడు. యామినీ దేవికి మీరు విద్య చెప్పబోతారని, ముక్కంటా నోటంటా యేడుస్తున్నాడు, ఎప్పుడో మీమీద నిందయేదో తీసుకొస్తాడు జాగ్రతమీద వుండండి.
(బిల్హణుడు తన మొలలో నున్న ఛురికను చూపించును)
నానా : మా నాయనగారికీ మీ నాయనగారికీ చాలా స్నేహం ఉండేది. తమకు తెలిసిందో లేదో మా తండ్రిగారు జ్యేష్ఠకలశుల గుణవర్ణన తరుచుగా చేస్తూవుండేవారు. వారు రెండు పర్యాయములు కాశ్మీరాస్థానముకు రాయబారిగా వెళ్లారు. అప్పట్లో వారు తెచ్చినదే మా తోటలోని ద్రాక్ష
బిల్హా : ఆలా చెప్పండి. అందుచేతనే ఆ స్వాదు కలిగింది. నానా : ఇటుపైని అనుదినం తమకు పళ్ళు పంపి మరీ అమ్మాజీవారికి పంపుతాను. మన తండ్రులు స్నేహితులైనందుకు, యీ నాటికి తిరిగీ మనం కూడా స్నేహితులం కావడము కేవలము భగవత్సంకల్పంగాని ఒండుకానేరదు.
బిల్హ : కృతార్థుడను. స్నేహంయొక్క విలువన్నది దేశదేశాలు తిరిగే మా బోటి పండితులకే తెలుసును.
నానా : యిక్కడ వున్నంతకాలం మీకు యే సహాయం కావలసినా అరమరలేక, ఈ మిత్రుడివల్ల పుచ్చుకొండి. అమ్మాజీవారి ఆగ్రహం మీయందు వున్నప్పటికీ నా ప్రాణం వున్నంతవరకు, మీకు అడ్డుపడతాను.
బిల్హ : నా విషయమై ఒకరికి హాని రాకూడదు. యేమి ఆ ఆగ్రహ కారణము?
నానా : మహారాజ కుమారికా వారికి తాము విద్య చెబుతారనే
బిల్హ : మహారాజువారి మనస్సు మళ్ళించలేరో?
నానా : వారిక్రోధం అనివార్యం.
బిల్హ : తమ సలహా యేవిఁటి?
నానా : యేం జెప్పను? యెప్పటికైనా వారివల్ల మీకు హాని వుంది. రాజుల క్రోధాలు మహ చెడ్డవి. దేశం విడిచి వెళ్ళిపోవడం వక ఆలోచన. మీరు యెక్కడికి వెళ్ళినా రారాజులు నెత్తిన పెట్టుకుంటారు గాని, మీరు వెళ్ళిపోతే ఆ దురదృష్టం ముఖ్యంగా నాది. కుమారికా వారితోపాటు నేను కూడా తమవద్ద భగవద్గీతలు నేర్చవలేననుకున్నాను.
బిల్హ : నావల్ల భగవద్గీతలు వింటే, మీరు ఉద్యోగం మానుకుంటారు. మహారాజకుమారికా వారు వివాహం మాని, సంసారం పరిత్యజిస్తారు.
నానా : నేను నాలుగు యేళ్ళాయి ఉద్యోగం చాలించుకుని, భగవంతుడి శేవలో కాల వెళ్ళబుచ్చుదావఁనుకుంటున్నాను. నేను ఉద్యోగంలో వుంటేనే గాని రాజ్యానికి ఆపాటం వస్తుందేమో యని మహారాణీవారైతేనేమి, మహారాజు అయితేనేమి నన్ను నిర్బంధిస్తున్నారు.
బిల్హ : మీయందు మాతా మహారాణీవారికి అంత వాత్సల్యత ఉండగా నాకు హాని రాకుండా మీరు వారిని మళ్లించలేరో?
నానా : మహాపండితులూ, మహాకవులూ! తమకు నేను జెప్పవలశిన ధర్మాలు కలవా? రాజులు తాచుపాములు! పట్టుదలే గానీ లాభనష్టాలు గణించరు. (నగరునుంci ఆభరణ భూషితలగు స్త్రీలు బంగారు పళ్ళెరములో సంక్రందన తాంబూలములూ పచ్చలహారమూ తెచ్చి నమస్కరింci బిల్హణునికి సమర్పింతురు. )
ఒకతె : అమ్మాజీ మహారాణీవారు తాము వారికి అంకితముగా రచించిన గీతమునకు సంతోషించి వారు ధరించే ఈ పచ్చల హారము తమకు దయ చేయించిరి. ధరించి సముఖమునకు రండి. (బిల్టణుడితో నిష్క్రమింతురు.)
నానా : (రామశాస్త్రులు, మాధవశర్మ ఉన్నచోటికి వచ్చి వారలతో) ప్రభువులు ఒక మాట మీదను నిలచివుండరు.
మాధవ : శకం తిరిగింది.
రామ : చక్రం యెప్పుడూ తిరుగుతూనే వుంటుంది. మరో, తిరుగులో, మీదు కిందికి దిగుతుంది, విచారమేలా?
(తెర దించవలెను)
బిల్హణీయము
రెండవయంకము
నారాయణభట్టు యింటి సావిడి.
(నారాయణభట్టూ, శిష్యుడు వామనశర్మ, ప్రవేశింతురు. )
నారా : అరవైయేళ్లు దాటి, యిప్పుడు కవిత్వం నేర్చుకోవాలంటే, యెలా సాధ్యమౌతుంది. రాజుకు కవిత్వం పిచ్చి, ఘట్టిగా పట్టుకుంది.... ఈ కవిత్వవఁన్నదానికి, వొక తోవా, తెన్నూ, సవబూ, సందర్బవూఁ, కానరాదు. యేదీ బిల్హణుడు చెప్పిన పద్యంలో మొదటి వాక్యం చదువూ.
శిష్యు : (చదువును) “అంకం కేపీ శశంకిరే జలనిధేః పంకం”
చంద్రుళ్లో, కళంకమును, కొంతమంది, సముద్రంలో బురదగా భావించారు.
నారా : కొంతమంది మనుష్యులు, చంద్రుళ్లో వుండుకున్నఘువంటి మచ్చయేదైతే వున్నదో దాన్ని సముద్రపు బురద అనుకున్నారని కదూ, కవి అభిప్రాయం? యే వెఱ్ఱివాడైనా, యెన్నడైనా, అలా అనుకుంటాడ్రా? బిల్హణుడు మహాపండితుడే గాని, కవిత్వంలో దిగగానే, అసత్యం కల్పించాడు. యేవఁంటావ్?