Jump to content

బాల నీతి/దానము

వికీసోర్స్ నుండి

ధర్మరాజునకిచ్చి గదాదులను భీమాదులకొసంగి ధర్మరాజుచే సత్కృతుండై చనెను. ఈసభను బోలుటకు దేవేంద్రాదిసభ లును గొఱఁగావని నారదాది మహర్షులు వచించిరి.

కనుగొంటిరా! ఆమయునికృతజ్ఞత యెట్టిదో! మఱియు నెటుల నాయుపకారులకు మేలొనరించెనో! కావుననే యా మయుఁడు కృతజ్ఞత యందునఁ బ్రసిద్ధిని నంది యున్నాఁడు. కాన మనముగూడఁ గృతజ్ఞతకలవారమై తిరిగి యుపకారులకు మేలొనరించుచుఁ గృతలక్షణులమగుటకుఁ బ్రయత్నమొన రించు చుందము.


క. కృతమెఱిఁగి కర్తనుత్తమ
   మతుల సభల సంస్తుతించి♦మఱవక తగ స
   త్కృతిసేయుదె కృతమెఱిఁగెడు
   పతియె జగజ్జనుల నెల్లఁ♦బరిపాలించున్.
                                                  (భారతము.)



దానము.




అనఁగా నితరులకు ధనముఁగాని యుపయోగ మగు వస్తువుకాని యుచితముగా నొసంగుటయు, మఱియు నభయ మిచ్చుటయు నని యెఱుఁగఁదగు.

ఈదాన మెక్కువగాఁజేయువారలు వదాన్యులని చెప్పఁ బడుదురు. సామాన్యముగా దీనులై, యకుటిల స్వభావులై మనదగ్గఱకు మంచియాచకులు వచ్చినయెడల వారికినేమియు నియ్యక వ్యర్థముగా వెడలఁ గొట్టక సంభావించి యధాశక్తి దానమొసంగుట వివేకునిలక్షణము. తానాపదలఁ బొందుచు న్నను ధర్మమునుమాత్రము విడనాడఁగూడదు. భయముకల వాఁడై శత్రువువచ్చి తన్నుశరణుఁ బొందినయెడల వానికభ యదానం బొసంగి రక్షించ వలయును. దానముఁ జేయున పుడు ప్రతివారును బాత్రాపాత్ర విచారణఁజేయుట ముఖ్య ము. పాత్రమనిన యోగ్యము. అపాత్ర మనిన యోగ్యము కానిది. ఎటువంటి వారలకు దానమొసఁగ వలెనన? వేదము లను, వేదాంగములను, జక్కఁగా సుస్వరముతోఁ బఠించిన వారును, నకల్మషమనస్కులును, నగు నవధానులకును, సం స్కృత భాషనభ్యసించి సత్ప్రవర్తన కలిగినవారికిని, విద్యా విహీనులైనను సద్గుణులకును, గుటుంబము కలవారికిని దాన మొసగుట పరమార్థమనఁ జెల్లు. ఆఁకలిచే బాధపడుచు నన్నముఁబెట్టుమని మనకడకు వచ్చినవాఁ డేజాతివాఁడైనను వానికన్నదాన మొనరించుటయుఁ, కుంటివారలకు గ్రుడ్డివా రల కన్నపానాదు లొసంగుటయుఁ బరమార్ధమనఁ జెల్లు. ఈ పైవారలకు దానముగా నొకవస్తువునిచ్చినను నన్నమును బెట్టి నను వారినినాపదనుండి రక్షించినను బ్రయోజనముకలదియ గును. తదితరులకు దానమొసంగిన నిష్ప్రయోజనమ యగును. ఎటులన? పిసిని తనముగలిగిన యొకని కొక వస్త్ర మిచ్చితి మని యనుకొనుఁడు. వాఁడుమనమిచ్చిన వస్త్రమును దీసికొని యాపణవీధికరిగి యమ్ముటకుఁ జూపును. కాన మనమట్టి వా నికి దానముచేయరాదు. మనమొక ధనవంతునిఁబిలిచి సంభా వించి పదిరూప్యములనిచ్చితిమని యనుఁకొనుఁడు. వాఁడుతా ధనవంతుఁడనని గర్వించుచు మనమిచ్చిన దానిని నిర్లక్ష్యము చేయుచు నపహసించు చుండును. కాన ధనవంతులకు దాన మొనరించఁ గూడదు. దురభిమానియగు నొకనిని విందునకుఁ బిలిచిషడ్రసోపేతంబగు పరమాన్నంబుఁబెట్టితిమని యను కొ నుఁడు. వాఁడు మనమిడినవిందును నెందుకుఁ గొఱఁగాని దా నిగా నొనరించుచుఁ దననెచ్చెలులవద్ద వదరుచుండును. కావున దురభిమానులకు దానముఁగావించఁ గూడదు. వీరలకు దాన మొసంగుట "నీటిలోనివ్రాఁతయె" యని నమ్ముఁడు. సుగుణ ములతోఁగూడికొనిన బీదవారల కన్నమిడినను డబ్బు నిచ్చి నను మరియేదానముఁజేసినను ఫలవంతమగును. తగినకాలము నందుఁ జక్కనిపనిజేసిన నేదియైనను ఫలించును గదా. కాన ధనికి, దురభిమానికి, వాచాటునికిఁ, గ్రుద్ధునికి, లోభికి, దానము ముమ్మాటికిని చేయఁగూడదు. మంచివారలకుఁ జేయుచుండ వలెను.

ఇటుల దాన మొనరించుట మనుజులకేకాక సత్స్వభా వముగల తిర్యగ్జంతువులకు దానముఁజేయవచ్చును. ఇదియుఁ గూడ నుత్తమము. వీనికి దానముచేయుట యెట్లన? చీమలు మొదలగు మంచిపురుగులకుఁ జక్కెరమున్నగు మధుర పదా ర్థములఁ జల్లుచుండవలెను. పశువులునీరుత్రాగునటులఁ దటా కము నొకదానినిఁ ద్రవ్వించి వానికాహారార్ధమై గడ్దిమొదల గువాని నియ్యవలెను. పక్షులు, వసించుటకు గూళ్లనునిర్మించి యవితినుటకుఁదగినపదార్ధముల నిచ్చుచుండ వలెను. సాధుస్వ భావముగలిగినమృగములకుఁ దగిన యాహారపదార్ధముల ని చ్చుచుండవలెను. ఇట్లు దానముఁజేయు వారల నుత్తములనిచె ప్పితీరవలయును.

మఱియు నేప్రాణి యైనను భయముకలిగి తన్నుశర ణుఁజొచ్చినయడల యధాసామర్థ్యముగ నభయ మొసంగి రక్షించవలయును. ఇదియే వదాన్యుని లక్షణము. ఇదిలేని వాఁడు దాతకానేరడు.

యోగ్యుడు దానము నీఁదలఁచిన వానినినెవఁడు నా పలేఁడు. హీనుఁడు దానమీఁదలఁచియు నొకనిబోధకు లొంగి దానమియ్యక యాఁగిపోవును. వీఁడపకీర్తిపాలు కాఁగలఁడు. మఱియు లోకోపకారములగు దానములు కొన్నిగలవు. ఈదా నముల నొనరించినవారి నామములు బహుకాలము ప్రచార ములో నుండఁగలవు. వీనివలనఁ బరలోకసౌఖ్యము కలుగును. కాన వాని నాచరించుటకుఁ బ్రయత్నించవలెను. ఆ దానము లేవియనిన? విద్యార్థులు చదువు కొనుటకై విద్యాశాలలు నిర్మిం చుట, చెఱువులఁద్రవ్వించుట, తోఁటలువేయించుట, సత్రముల గట్టించుట, దేవాలయంబులఁ బ్రతిష్టించుట, వైద్యశాలల స్థాపించుట, పుస్తక పత్రికాపఠనశాలల నెలకొల్పుట, సత్కృ తినందుటయు మొదలగునవి, వీనినిజేయుటకుఁ దమకుశక్తిలేని యెడలఁ జేతనైనంత సహాయముఁ జేయవలెను. వీరలు కీర్తి వంతులగుదురనుటకుఁ కించిత్తుకూడ సందియము లేదు.

మనకున్నదానిలోఁ గొంచెమిచ్చినను పేదయెక్కువగా నానందమందుననియు మనకున్నదానినంతయు నిచ్చినను ధన వంతుఁ డామోదమును జెందఁడనియు, నభయదానంబొసంగిన నేప్రాణియైనను సంతోషించుననియు మనము తెలిసికొనవల యును.

ఇటుల దానమొసంగి కీర్తిఁగాంచినవారలు మనపూర్వు లలోఁ జాలమంది కలరు. వారిలో నొకరిని జూపించుచున్నాను. సకలనీతివిశారదుఁడగు శిబియనురాజర్షి యజ్ఞంబమోఘంబు గాఁ జేసిసర్వజనులకునుమృష్టాన్నమిడియధ్వర్వులు సంతోషిం చునటుల దక్షిణల నొసంగి చేయఁదగినదానంబులెన్నికలవో వాని నన్నిఁటిని యధావిధిగా నొనరించి లోకముచే "లోకో త్తర దాతృశిఖామణి" యని బిరుదమునంది యుండెను. ఈ సంగతి స్వర్గలోకంబున విని వెఱఁగంది యింద్రుఁడును, నగ్ని యు, నీతని గుణంబులఁ బరీక్షించుటకై తలంచిరి. తరువాత వారిద్దఱిలోనింద్రుఁడు డేగయై యనలుఁడు పావురమై బయ లుదేఱిరి. ఆడేగవలన నీపావురము భయమొందుచున్నట్లు పరు గిడుచు ధర్మజ్ఞుఁడగు నాశిబి చక్రవర్తిని శరణుఁ జొచ్చెను. అటుతరువాత నాస్యేన మాకపోతమును దఱుముచు వచ్చు చుంట నాకపోత మాశిబి మహారాజు సమీపమున నుండుట గాంచి కర్తవ్యమేమియుతోచక యారాజుతో "రాజా! నీవు సక ల ధర్మవేదివని వినియుంటిని. కానఁ బ్రస్తుత మాఁకలిచే మి క్కిలి బాధపడుచున్న నాకాహార విఘ్నము సేయఁదగునా? మఱియు "స్యేనా, కపోతాన్ ఖాదయన్తి" అనఁగా " డేగలు పావురములను భక్షించు"నను వేదవాక్యాను సారంబుగా నాకాహారంబుగా నున్న దీపావురము. నాభార్యయు, బిల్లలు, నేను, నీకపోతాహారములేనియెడల జీవించలేము. నీవొక జీవమును రక్షించుట కనేకజీవముల హింసఁబెట్టుట ధర్మమే నా?" యని యడిగను. అంతనావదాన్యుడు "నీవు చెప్పిన దంతయు సత్యమే? కాని ప్రాణభయముచే వచ్చి రక్షించు మని కోరినది. ఇట్లాశ్రయించినదానిని వెడలఁగొట్టుట దర్మ మేనా? చెప్పు"మని యడుగుచు "నీవుపక్షివైనను దర్మమె ఱిఁగినటుల మాటలాడు చున్నావు. కాన నీకాననంబున నుండు మృగంబుల మాంసంబులఁదిని నీయాఁకలిని దీర్చుకొ నుము. కాని యీకపొతముపై నిఁక నాశ విడువుము" అని పలికెను. అంత నాడేగ "రాజా! నేఁదినఁదగిన దిదియే. దీనిని రక్షించుటకు నీకిష్టమున్న నీమాంసంబు నాకాహారంబుగా ని"మ్మని పల్కెను. వెంటనే యారాజు తనకత్తితోఁ దన శరీరమంతయుఁగోసి కోసి మాంసమంతయు నాడేగకాహారం బుగా నొసఁగెను. అంత నాడేగ పావురములారూపములవీడి తమనిజ రూపములం దాల్చి యారాజుతో "మేము వాసవా గ్నులము. నీదానమునకు, నీధర్మబుద్దికి మెచ్చితిమి. కాననీకీర్తి బ్రహ్మాదులున్నంతవఱ కనశ్వరమై వృద్ధిఁజెందుఁగాక, నీశరీ రము యధాప్రకారముగా నుండుగాక, యని యాశీర్వదించి తిరోధానమైరి.

కాంచితిరా! ఆశిబిచక్రవర్తియొక్క దానము, ధర్మ బుద్ధియు, ఆమహారాజార్తత్రాణ పరాయణ నిమిత్తమై తనశరీరమునుగూడ గోసియిచ్చెనుగదా. ఆహా! ఏమియాదా నము! ఆయార్తత్రాణపరాయణత్వము. కాఁబట్టియె, వాస నాగ్నులు పరీక్షించి మెచ్చి యనేకవిధముల నాశీర్వదించిరి. సామాన్యులకిటుల గొప్పవారలదర్శనము కాఁగలదా? కాదు. కాన మనము మంచివారలకు దానముచేయుచు లోకోపకార ములగుదానము లొనరించుటకుఁ బ్రయత్నము గా వించుచు దీనులకభయదానంబొసంగి కాపాడుచు నెక్కువకీరితిఁ గాంచు చుందము.


తే. చెల్లియుండియు సైరణ♦సేయు నతఁడు
    బేదవడియును నర్ధికిఁ♦బ్రియము తోడఁ
    దనకుఁ గలభంగినిచ్చున♦తండు, బుణ్య
    పురుషులని చెప్ప రార్యులు♦గురువరేణ్య
                                            (భా ర త ము.)