బాలకాండము - సర్గము 7

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఏడవసర్గము

దశరథునిమంత్రులు - వారిగుణగణములు

వాల్మీకి రామాయణము
రామాయణ కాండములు
1. బాలకాండము
2. అయోధ్యాకాండము
3. అరణ్యకాండము
4. కిష్కింధకాండము
5. సుందరకాండము
6. యుద్ధకాండము
7. ఉత్తరకాండము

తస్య అమాత్యా గుణైర్ ఆసన్ ఇక్ష్హ్వకోస్తు మహాత్మనః |

మంత్రజ్ఞాః చ ఇఙ్గితజ్ఞాః చ నిత్యం ప్రియ హితే రతాః |1-7-1|

ఇక్ష్వాకువంశజుడును, మిక్కిలి ప్రజ్ఞాశాలియు ఐన దశరథ మహారాజుయొక్క అమాత్యులు కార్యవిచారణలో దక్షులు, ఇతరుల అభిప్రాయములను గుర్తించుటలో సమర్థులు. ఎల్లప్పుడును రాజునకు ప్రియమును గూర్చుట (మేలు చేయుట) యందే నిరతులు, సద్గుణసంపన్నులు. [1]


అష్టౌ బభూవుః వీరస్య తస్య అమాత్యా యశస్వినః |

శుచయః చ అనురక్తాః చ రాజకృత్యేషు నిత్యశః |1-7-2|

ధృష్టిర్ జయంతో విజయో సురాష్ట్రో రాష్ట్ర వర్ధనః |

అకోపో ధర్మపాలః చ సుమంత్రః చ అష్టమో అర్థవిత్ |1-7-3|

వీరుడును, గొప్ప కీర్తిప్రతిష్ఠలు గలవాడును ఐన దశరథునియొక్క ఆస్థానమున ఎనిమిదిమంది మంత్రులు గలరు. వారు సర్వవ్యవహారములయందు ఎట్టి దోషములకును తావీయనివారు, సర్వదా రాజకార్యములను నిర్వహించుటయందు తత్పరులు. ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనువారు ఆ ఎనిమిదిమంది మంత్రులు. [2 - 3]


ఋత్విజౌ ద్వౌ అభిమతౌ తస్యాః తాం ఋషి సత్తమౌ |

వశిష్ఠో వామదేవః చ మంత్రిణః చ తథా అపరే |1-7-4|

సుయజ్ఞో అపి అథ జాబాలిః కాశ్యపో అపి అథ గౌతమః |

మార్కణ్డేయః తు దీర్ఘాయుః తథా కాత్యాయనో ద్విజః |1-7-5|

ఏతైః బ్రహ్మర్షిభిర్ నిత్యం ఋత్విజః తస్య పౌర్వకాః |

విద్యా వినీతా హ్రీమంతః కుశలా నియతేంద్రియాః |1-7-6|

శ్రీమంతః చ మహాత్మనః శాస్త్రజ్ఞా ధృఢ విక్రమాః |

కీర్తిమంతః ప్రణిహితా యథా వచన కారిణః |1-7-7|

వశిష్ఠుడు, వామదేవుడు అను మహర్షులు ఇద్దఱును ఆ ఆస్థానమున ప్రధాన పురోహితులుగా ఉండిరి. ఇంకను జాబాలి మొదలగు పురోహితులును, మంత్రులును ఉండిరి. వారు న్యాయశాస్త్రము దండనీతి మొదలగు రాజవిద్యలలో నిపుణులు, అకృత్యములకు పాల్పడనివారు, నీతికుశలురు, విధ్యుక్తముగాని కార్యములయెడ విముఖులు, సంపన్నులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు, రాజనీతిని ఎఱిగినవారు, తిరుగులేని పరాక్రమముగలవారు, మంత్రాంగమునందు ఖ్యాతికెక్కినవారు, రాజకార్యములయందు ఏమఱుపాటు లేనివారు, త్రికరణశుద్ధి గలవారు, తేజోమూర్తులు, క్షమాగుణముగలవారు, కీర్తిప్రతిష్ఠలుగలవారు, చిఱునవ్వుతో ముందుగా మాట్లాడువారు, కోపమువలన గాని, కోరికలవలనగాని, స్వార్థచింతన వలనగాని అసత్యమునకు ఒడిగట్టనివారు. స్వరాష్ట్రములయందుగాని, పరరాష్ట్రములయందుగాని జరిగిన, జరుగుచున్న, జరగబోవు విషయములన్నియును ఆ మంత్రులకు చారుల ద్వారా తెలియుచునే యుండును. [4 - 7]


తేజః క్షమా యశః ప్రాప్తాః స్మిత పూర్వ అభిభాషిణః |

క్రోధాత్ కామ అర్థ హేతోర్ వా న బ్రూయుర్ అనృతం వచః |1-7-8|

తేషాం అవిదితం కించత్ స్వేషు నాస్తి పరేషు వా |

క్రియమాణం కృతం వా అపి చారేణ అపి చికీర్షితం |1-7-9|

కుశలా వ్య్వహారేషు సౌహృదేషు పరీక్షితాః |

ప్రాప్త కాలం యథా దణ్డం ధారయేయుః సుతేషు అపి |1-7-10|

కోశ సంగ్రహణే యుక్తా బలస్య చ పరిగ్రహే |

అహితం చ అపి పురుషం న హింస్యుర్ అవిదూషకం |1-7-11|

ఆ మంత్రులు, సమస్త వ్యవహారములయందును సమర్థులు. మిత్రులయెడ తమప్రవర్తనకు సంబంధించి రాజపరీక్షలలో నెగ్గినవారు. అపరాధము చేసినవారు తమసుతులైనప్పటికిని నిష్పక్షపాతముగా దండించెడివారు. వారు కోశాగారమును నింపుటకై ధనమును సమకూర్చుటయందును, యోగ్యతలను బట్టి వేతనములను ఒసంగుచు చతురంగబలములను సంరక్షించుటయందును జాగరూకులై యుందురు. ఇంకను, వారు శత్రువులను ఎదుర్కొనగల వీరులు, సర్వదా శత్రువులను జయించుటకు ఉత్సాహపడుచుండువారు. ఐనను శత్రువు నిరపరాధియైనచొ అతనిని దండించెడివారు కారు. రాజనీతిని అనుసరించి శాసనములను ఆచరణలోనుంచెడివారు. అందువలన స్వదేశవాసులైన సాధువులను రక్షించువారు, అసాధువులను శిక్షించువారు. మఱియు వారు బ్రాహ్మణులకును, క్షత్రియులకును బాధ కలుగకుండ ధనాగారమును నింపెడివారు. అపరాథుల యొక్క దోషముల తారతమ్యములను బట్టియు, (అపరాధ రుసుము చెల్లించు విషయమున) వారి శక్తిసామర్థ్యములను బట్టియు దండనలను విధించెడివారు. [8 - 11]

వీరాః చ నియతోత్సాహా రాజ శాస్త్రం అనుష్ఠితాః |

శుచీనాం రక్షితారః చ నిత్యం విషయ వాసినాం |1-7-12|

బ్రహ్మ క్షత్రం అహింసంతః తే కోశం సమపూరయన్ |

సుతీక్ష్ణ దణ్డాః సంప్రేక్ష్య పురుషస్య బలాబలం |1-7-13|

శుచీనాం ఏక బుద్ధీనాం సర్వేషాం సంప్రజానతాం |

న ఆసీత్ పురే వా రాష్ట్రే వా మృషా వాదీ నరః క్వచిత్ |1-7-14|

కశ్చిన్ న దుష్టః తత్ర ఆసీత్ పర దార రతిర్ నరః |

ప్రశాంతం సర్వం ఏవ అసీత్ రాష్ట్రం పురవరం చ తత్ |1-7-15|

మంత్రులందఱును త్రికరణశుద్ధితో ఏకగ్రీవముగా రాజ్యవ్యవహారములను నడుపుచుండువారు. ఆ పురమునందుగాని, రాజ్యమునందుగాని అబద్ధమాడువాడు ఎవ్వడును లేడు. అయొధ్యానగరమునందును, కోసలదేశమునందును ఏ ఒక్కడును వంచకుడు గాని, పరస్త్రీరతుడు గాని లేకుండెను. కనుక అంతటను ప్రశాంతి నెలకొనియుండెను. ఆ మంత్రులందఱును శుభవస్త్రములను, సమిచితములైన వేషభూషణములను ధరించుచుండెడివారు. వారు సచ్ఛీలురు, రాజహితమునందే దృష్టిని నిలిపి, జాగరూకులై రాజ్యతంత్రమును నడిపెడివారు. వారు తల్లితండ్రులు, గురువులు మొదలగు పెద్దలలోగల మంచిగుణములనే గ్రహింతురు. తమ సద్గుణముల కారణముగా పెద్దల ఆదరాభిమానములకు పాత్రులైనవారు. వారు పరాక్రమమునందు ప్రసిద్ధులు. [12 - 15]


సు వాసస సు వేషాః చ తే చ సర్వే శుచివ్రతాః |

హితార్థః చ నరేంద్రస్య జాగ్రతో నయ చక్షుషా |1-7-16|

గురోర్ గుణ గృహీతాః చ ప్రఖ్యాతాః చ పరాక్రమే |

విదేశేషు అపి విజ్ఞాతా సర్వతో బుద్ధి నిశ్చయాః |1-7-17|

అభితో గుణవంతః చ న చ ఆసన్ గుణ వర్జితాః |

సంధి విగ్రహ తత్వజ్ఞాః ప్రకృత్యా సంపదాన్వితాః |1-7-18|

వారు తమబుద్ధిబలముచే భూత భవిష్యద్వర్తమాన విషయ పరిజ్ఞానము గలవారుగా విదేశములయందును ఖ్యాతివహించినవారు. ఆ అమాత్యులందఱును ఇతరరాజులతో దేశకాల పరిస్థితులకు అనుగుణముగా సంధిచేసికొనుటను, యుద్ధమును నడిపించుటను ఎఱిగినవారు. కలిగిన సంపదతోడనే తృప్తిపడువారు, మంత్రాలోచనలను రహస్యముగానుంచుటలో సమర్థులు, సున్నితమైన విషయములను సూక్ష్మబుద్ధితో ఆలోచనచేయుటలో ప్రతిభగలవారు. రాజనీతిశాస్త్రపులోతులను బాగుగా ఎఱిగినవారు. రాజునకు హితము కలుగునట్లు ప్రియముగా మాటాడువారు. ఇట్టి సద్గుణసంపన్నులైన అమాత్యులతో గూడి ఎట్టి వ్యసనములు లేని దశరథ మహారాజు కోసలరాజ్యమును పరిపాలించెను. [16 - 18]


మంత్ర సంవరణే శక్తాః శక్తాః సూక్ష్మాసు బుద్ధిషు |

నీతి శాస్త్ర విశేషజ్ఞాః సతతం ప్రియ వాదినః |1-7-19|

ఈదృశైః తైః అమాత్యైః చ రాజా దశరథోఽనఘః |

ఉపపన్నో గుణోపేతైః అన్వశాసద్ వసుంధరాం |1-7-20|

దశరథ మహారాజు గూఢచారుల ద్వారా స్వదేశ పరదేశ పరిస్థితులను గమనించుచు అధర్మమునకు తావు లేకుండ ధర్మయుక్తముగా ప్రజలను రంజింపజేయుచు దేశమును పాలించుచుండెను. మహాదాతగా, సత్యసంధుడుగా ముల్లోకములయందును ఖ్యాతికెక్కినవాడై ఆ నరేంద్రుడు ఈ పృథివిని పరిపాలించుచుండెను. [19 - 20]


అవేక్షమాణః చారేణ ప్రజా ధర్మేణ రక్షయన్ |

ప్రజానాం పాలనం కుర్వన్ అధర్మం పరివర్జయన్ |1-7-21|

దశరథునకు పెక్కుమంది రాజులు మిత్రులుగా ఉండిరి. సామంతరాజులందఱును ఆయనకు పాదాక్రాంతులైయుండిరి. అతడు తనప్రతాపముచే క్షుద్రులైన శత్రువులనందఱిని రూపుమాపెను. శత్రువులలొ ఆయనకంటె అధికుడుగాని ఆయనతో సమానుడుగాని ఎవ్వడునులేడు. ఇంద్రుడు దేవలోకమునువలె ఆ దశరథుడు ఈ భూలోకమును పరిపాలించుచుండెను. [21]


విశ్రుతః త్రిషు లోకేషు వదాన్యః సత్య సంగరః |

స తత్ర పురుషవ్యాఘ్రః శశాస పృథ్వీం ఇమాం |1-7-22|


న అధ్యగచ్ఛత్ విశిష్టం వా తుల్యం వా శత్రుం ఆత్మనః |

మిత్రవాన్ నత సామంతః ప్రతాప హత కణ్టకః |

స శశాస జగత్ రాజా దివి దేవ పతిర్ యథా |1-7-23|


తైః మంత్రిభిః మంత్ర హితేః నివిష్టైః

వృతోఽనురక్తైః కుశలైః సమర్థైః |

స పార్థివో దీప్తిం అవాప యుక్తః

తేజోమయైః గోభిః ఇవ ఉదితః అర్కః |1-7-24|


రాజునకు హితమును గూర్చుటకై, తగినవిధముగా మంత్రాలోచనలు చేయుటకు నియమింపబడినవారును, ప్రభుభక్తిపరాయణులును, బుద్ధికుశలురును, కార్యదక్షులును ఐనట్టి మంత్రులతోగూడిన దశరథ మహారాజు తేజోమయములైన కిరణములతొ ఒప్పుచున్న ఉదయభానునివలె ప్రకాశించుచుండెను. [----]


ఇతి వాల్మీకి రామాయణే ఆది కావ్యే బాలకాండే సప్తమః సర్గః |౧-౭|