Jump to content

బాలకాండము - సర్గము 4

వికీసోర్స్ నుండి

బాలకాండము - నాల్గవసర్గము

కుశలవులు రామాయణమును గానము చేయుట

వాల్మీకి రామాయణము
రామాయణ కాండములు
1. బాలకాండము
2. అయోధ్యాకాండము
3. అరణ్యకాండము
4. కిష్కింధకాండము
5. సుందరకాండము
6. యుద్ధకాండము
7. ఉత్తరకాండము

ప్రాప్త రాజ్యస్య రామస్య వాల్మీకిర్ భగవాన్ ఋషిః |

చకార చరితం కృత్స్నం విచిత్ర పదం అర్థవత్ |1-4-1|

బ్రహ్మదేవుని అనుగ్రహము వలన దివ్యజ్ఞానమును పొందిన వాడును, మహాకావ్య నిర్మాణచతురుడును ఐన వాల్మీకి మహర్షి కోసలాధీశుడై యున్న శ్రీరామునిచరితమును మనోజ్ఞములైన శబ్దార్థాలంకారములతో లోకకల్యాణమునకై అద్భుతముగా రచించెను. [1-4-1]


చతుర్వింశత్ సహస్రాణి శ్లోకానాం ఉక్తవాన్ ఋషిః |

తథా సర్గ శతాన్ పంచ షట్ కాణ్డాని తథా ఉత్తరం |1-4-2|

వాల్మీకిమహర్షి రామాయణమును ఆఱుకాండములుగా ఐదువందల సర్గములలో ఇరువదినాలుగువేల శ్లోకములతో రచించెను. పిదప ఉత్తరకాండమునకు రూపుదిద్దెను. [1-4-2]


కృత్వా తు తన్ మహాప్రాజ్ఞః స భవిష్యం సహ ఉత్తరం |

చింతయామాస కోన్వేతత్ ప్రయుంజీయాద్ ఇతి ప్రభుః |1-4-3|

మిక్కిలి ప్రజ్ఞాశలియు కడుసమర్థుడు ఐన వాల్మీకి శ్రీరామ పట్టాభిషేకానంతరగాథను, అశ్వమేధయాగమునకు పిమ్మట జరుగనున్న వృత్తాంతమును గూడ (ఉత్తరకండమునుగూడ) రచించెను. ఇక "ఈ రామాయణమును కంఠస్థముచేసి గానము చేయగలవారు ఎవరు? అని అతడు ఆలోచించసాగెను. [1-4-3]


తస్య చింతయామానస్య మహర్షేర్ భావితాత్మనః |

అగృహ్ణీతాం తతః పాదౌ ముని వేషౌ కుశీ లవౌ |1-4-4|

కుశీ లవౌ తు ధర్మజ్ఞౌ రాజ పుత్రౌ యశశ్వినౌ |

భ్రాతరౌ స్వర సంపన్నౌ దదర్శ ఆశ్రమ వాసినౌ |1-4-5|

ఇట్లు చింతించుచు ఆ మహర్షి అట్టి (కావ్య శ్లోకములను కంఠస్థమొనర్చి గానముచేయగల) శిష్యప్రాప్తికై భగవంతుని ధ్యానించుచుండగా మునివేషములలోనున్న కుశలవులు అచటికి వచ్చి, ఆయనపాదములను ఆశ్రయించిరి. గురుశుశ్రూష చేయుటలో నిరతులును, అధ్యయనము పూర్తియగువఱకును స్థిరమైన నిష్ఠగలిగిన రాజకుమారులును మంచి విద్యార్థులుగా ప్రసిద్ధికెక్కినవారును, సమానస్థాయిలో గానముచేయగల సోదరులును (కంఠములు కలిసినవారును) చక్కని గాత్రము గలవారును, తనఆశ్రమవాసులును ఐన ఆ లవకుశులను మహర్షి చూచెను. "వీరు రామాయణమును గానము చేయుటకు సమర్థులు" అని తలంచెను. [1-4-4, 5]


స తు మేధావినౌ దృష్ట్వా వేదేషు పరినిష్టితౌ |

వేదోపబృంహణార్థాయ తౌ అగ్రాహయత ప్రభుః |1-4-6|

కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాః చరితం మహత్ |

పౌలస్త్య వధం ఇతి ఏవం చకార చరిత వ్రతః |1-4-7|

వేదతుల్యమైన (వేదప్రతిరూపమైన) రామాయణమును గానము చేయుటద్వారా వేదార్థములను వ్యక్తపఱచుటకై (వేదధర్మములకు ప్రసిద్ధిని

గూర్చుటకై)సర్వసమర్థుడైన వాల్మీకి విషయములను గ్రహించుటలోను గట్టిశక్తిగలవారును, వేదవేదాంగములను అధ్యయనము చేసినవారును ఐన లవకుశులను స్వీకరించెను. ఈ రామాయణమహాకావ్యమున ముఖ్యముగా శ్రీరామవృత్తాంతము, సీతాచరితము, రావణవధ వర్నింపబడినందున దీనిని "రామాయణము"అనియు, "సీతాచరిత్రము" అనియు "పౌలస్త్యవధము" అనియు పేర్కొనవచ్చునని అపారజ్ఞానసంపన్నుడైన వాల్మీకి కుశలవులకు ఉపదేశించెను. [1-4-6, 7]


పాఠ్యే గేయే చ మథురం ప్రమాణైః త్రిభిర్ అన్వితం |

జాతిభిః సప్తభిః యుక్తం తంత్రీ లయ సమన్వితం |1-4-8|

రసైః శృంగార కరుణ హాస్య రౌద్ర భయానకైః |

విరాదిభీ రసైర్ యుక్తం కావ్యం ఏతత్ అగాయతాం |1-4-9|

ఈ రామాయణము చక్కగా పఠించుటకును, మధురముగా గానము చేయుటకును అనువైనది. తిస్ర, చతురశ్ర, మిశ్ర ప్రమాణాలతో లేదా ద్రుత, మధ్య, విలంబిత ప్రమాణములతో అలరారునది. స,రి,గ,మ,ప,ద,ని అను సప్తస్వరములతో కూర్చబడినది. వీణాది తంత్రీవాద్యములపైనను, మృదంగాదిలయవాద్యములతోడను పలికించుటకు అనువైనది, శృంగార, వీర, కరుణ, హాస్య, రౌద్ర, భయానకాది నవరసములతో పరిపుష్టమైనది. అట్టి రామాయణకావ్యమును ఆ లవకుశులు గానము చేసిరి. [1-4-8, 9]


తౌ తు గాంధర్వ తత్త్వజ్ఞౌ స్థాన మూర్చ్ఛన కోవిదౌ |

భ్రాతరౌ స్వర సంపన్నౌ గంధర్వాః ఇవ రూపిణౌ |1-4-10|

రూప లక్షణ సంపన్నౌ మధుర స్వర భాషిణౌ |

బింబాత్ ఇవ ఉథీతౌ బింబౌ రామ దేహాత్ తథా అపరౌ |1-4-11|

కవలలైన ఆ లవకుశులు సంగీతశాస్త్రమున ఆరితేఱినవారు, వీణాదివాదనమున నేర్పరులు, మంద్ర మధ్యమ తార స్థాయులలో గానము చేయుటయందు నిపుణులు, కమ్మని కంఠము గలవారు, మనుష్యవేషములలోనున్న గంధర్వులవలె ఒప్పుచున్నవారు, అభినయించుచు పాడుటలో కుశులురు, మృదుమధురముగా భాషించుటలో చతురులు, రాముని రూపమునకు అచ్చుగ్రుద్దినట్లుగా (రాముని ప్రతిబింబములుగా) ఉన్నవారు. ఇట్టి లవకుశులు రామాయణమును గానము చేసిరి. [1-4-10, 11]


తౌ రాజ పుత్రౌ కార్త్స్న్యేన ధర్మ్యం ఆఖ్యానం ఉత్తమం |

వాచో విధేయం తత్ సర్వం కృత్వా కావ్యం అనిందితౌ |1-4-12|

ఋషీణాం చ ద్విజాతీనాం సాధూనాం చ సమాగమే |

యథా ఉపదేశం తత్త్వజ్ఞౌ జగతుః తౌ సమాహితౌ |1-4-13|

ఏమాత్రము లోపము లేకుండా గురూపదేశము ప్రకారము గానముచేయగలవారును, మునిబాలురవేషములలోనున్నవారును ఐన రాజకుమారులు సకలధర్మములను తెలుపునట్టి ఉత్తమమైన ఆ రామాయణకావ్యమును పూర్తిగా కంఠస్థమొనర్చిరి. వారు అర్థవంతముగా చక్కగా పఠింపగలవారు, ఏ విషయమునందును మఱుపులేక సావధానచిత్తులైయుండువారు, మిక్కిలి ప్రజ్ఞాశాలురు, ఉత్తమ గుణములకు కుదురైనవారు, సమస్తశబ్దలక్షణములను ఎఱిగినవారు. మహర్షులు, బ్రాహ్మణోత్తములు, సాధుపురుషులు చేరియున్నసభలో ఆ సోదరులు రామాయణకావ్యగానము చేసిరి. [1-4-12, 13]


మహాత్మనౌ మహాభాగౌ సర్వ లక్ష్ణ లక్షితౌ |

తౌ కదాచిత్ సమేతానాం ఋషీణాం భవిత ఆత్మనాం |1-4-14|

ఒకానొకప్పుడు వాల్మీకిమహర్షిఆశ్రమమునకు స్థితప్రజ్ఞులైన ఋషులెల్లరును విచ్చేసిరి. వారు అందఱును అచట సుఖాసీనులైయుండిరి. అప్పుడు మిగుల బుద్ధిశాలురు, రూపసౌభాగ్యముగలవారు, సర్వ శుభలక్షణ సంపన్నులు ఐన ఆ కుశలవులు వారి సమక్షమున ఈ కావ్యమును గానముచేసిరి. [1-4-14]


మధ్యే సభం సమీపస్థౌ ఇదం కావ్యం అగాయతాం |

తత్ శ్రుత్వా మునయః సర్వే బాష్ప పర్యాకులేక్షణాః |1-4-15|

సాధు సాధ్వితి తా ఊచుః పరం విస్మయం ఆగతాః |

తే ప్రీత మనసః సర్వే మునయో ధర్మ వత్సలాః |1-4-16|

ప్రశశంసుః ప్రశస్తవ్యౌ గాయమానౌ కుశీ లవౌ |

అహో గీతస్య మాధుర్యం శ్లోకానాం చ విశేషతః |1-4-17|

ఆ సభలోని మునులు అందఱును ఆ కావ్యగానమును విని, పరమాశ్చర్యభరితులైరి, వారు ఆనందాశ్రువులతో "బాగుబాగు" అనుచు ఆ లవకుశులపై ప్రశంసలజల్లు కురిపించిరి. ఏ మాత్రము మాత్సర్యము లేనివారు, గానానందమున పొంగిపోయినవారు, అయిన ఆ మునులు అందఱును, గానమధురిమలచే ప్రశంసార్హులైన కుశలవులను "ఆహా! ఈ గాన మాధుర్యము అత్యద్భుతము," అని మెచ్చుకొనుచు "శ్లోకముల రచనావైశిష్ట్యము ఇంకను ప్రశంసనీయము, ఇది మున్నెన్నడొ జరిగిన వృత్తాంతమేయైనను నేడు కన్నులకు గట్టినట్లున్నది" - అని కొనియాడసాగిరి. [1-4-15, 16, 17]


చిరనిర్వృత్తం అపి ఏతత్ ప్రత్యక్షం ఇవ దర్శితం |

ప్రవిశ్య తా ఉభౌ సుష్ఠు తథా భావం అగాయతాం |1-4-18|

సహితౌ మధురం రక్తం సంపన్నం స్వర సంపదా |

ఏవం ప్రశస్యమానౌ తౌ తపః శ్లాఘ్యైః మహర్షిభిః |1-4-19|

ఆ లవకుశులు ఇద్దఱును శ్లోకములలోని భావములు, రసములు చక్కగా వ్యక్తమగునట్లుగా లయబద్ధముగా సప్తస్వర సంపదతో రాగయుక్తముగా మధురముగా గానముచేసిరి. తపోధనులు, మహాత్ములు ఐన ఆ మునుల ఆనందపారవశ్యములనుగాంచి, ఆ లవకుశులు భావరాగతాళయుక్తముగా ఇంకను మధురముగా గానము చాయసాగిరి. [1-4-18, 19]


సంరక్తతరం అత్యర్థం మధురం తౌ అగాయతాం |

ప్రీతః కశ్చిన్ మునిః తాభ్యాం సంస్థితః కలశం దదౌ |1-4-20|

ప్రసన్నో వల్కలం కశ్చిద్ దదౌ తాభ్యాం మహాయశాః |

అన్యః కృష్ణాజినం అదద్ యజ్ఞ సూత్రం తథా అపరః |1-4-21|

కశ్చిత్ కమణ్డలుం ప్రదాన్ మౌఞ్జీం అన్యో మహామునిః |

బ్రుసీమన్యః తదా ప్రాదత్ కౌపీనం అపరో మునిః |1-4-22|

తాభ్యాం దదౌ తదా హృష్టః కుఠారం అపరో మునిః |

కాషాయం అపరో వస్త్రం చీరం అన్యో దదౌ మునిః |1-4-23|

జటాబంధనం అన్యః తు కాష్ఠ రజ్జుం ముదాన్వితః |

యజ్ఞ భాణ్డం ఋషిః కశ్చిత్ కాష్ఠభారం తథా పరః |1-4-24|

ఔదుంబరీం బ్రుసీం అన్యః స్వస్తి కేచిత్ తదా అవదన్ |

ఆయుష్యం అపరే ప్రాహుర్ ముదా తత్ర మహర్షయః |1-4-25|

వారిగానమునకు ఆనందించిన అచటి మునులలో ఒకరు వారికి కలశమును బహూకరించెను. వాసికెక్కిన మఱియొక మహర్షి ప్రసన్నుడై వల్కలమును, ఇంకొకరు జింకచర్మమును, వేఱొకరు మౌంజిని (దర్భ మొలత్రాడును) మఱియొకరు కమండలమును, యజ్ఞోపవీతమును వేఱొకరును బహుమతిగా ఇచ్చిరి. ఒకరు మేడిపీఠమును, దానిపై అందమైన మెత్తని ఆసనమును, మఱియొకరు జపమాలను, వేఱొకరు కౌపీనమును బహుకరించిరి. అట్లే ప్రసన్నమైన మనస్సుతో ఒకరు గొడ్డలిని, వేఱొకరు కాషాయవస్త్రములను, ఉత్తరీయమును, మఱియొకరు జటాబంధనమును, ఇంకొకరు కాష్ఠరజ్జువును, యజ్ఞపాత్రను, వేఱొకరు సమిధలను కానుకలుగా సమర్పించిరి. పిమ్మట సభలోని మహర్షులు అందఱును స్వస్తివాచనములతో వారిని ఆశీర్వదించిరి, వరములను ఇచ్చిరి. [1-4-20, 21, 22, 23, 24, 25]


దదుః చ ఏవం వరాన్ సర్వే మునయః సత్యవాదినః |

ఆశ్చర్యం ఇదం ఆఖ్యానం మునినా సంప్రకీర్తితం |1-4-26|

వాల్మీకి మహర్షి విరచించిన ఈ మహాకావ్యము మిక్కిలి అద్భుతావహముగా ఉన్నది. మొదటినుండియు చివరివఱకు ఏమాత్రము కుంటుపడక పూర్తిగా రచింపబడిన ఈ కావ్యము కవీశ్వరులకు అందఱికిని మిక్కిలి ఆదర్శప్రాయమైనది. [1-4-26]


పరం కవీనాం ఆధారం సమాప్తం చ యథా క్రమం |

అభిగీతం ఇదం గీతం సర్వ గీతేషు కోవిదౌ |1-4-27|

ఆయుష్యం పుష్టి జననం సర్వ శ్రుతి మనోహరం |

ప్రశస్యమానౌ సర్వత్ర కదాచిత్ తత్ర గాయకౌ |1-4-28|

"ఓ గానకోవిదులారా! మీ కావ్యగానము అద్భుతముగా ఉన్నది. ఇది ఆయుర్వృద్ధికరమైనది, పుష్టిని గూర్చునది, ఎల్లరకును కర్ణపేయమైనది. ఈ కావ్యమును మీరు మధురముగా ఆలపించితిరి" అని అచటివారు అందఱును వారిని ప్రశంసించిరి. ఒకానొకప్పుడు వీధులయందును, రాజమార్గముల యందును గానము చేయుచున్న ఆ లవకుశులను భరతాగ్రజుడైన శ్రీరాముడు తిలకించెను. [1-4-27, 28]

రథ్యాసు రాజ మార్గేషు దదర్శ భరతాగ్రజః |

స్వ వేశ్మ చ ఆనీయ తతో భ్రాతరౌ స కుశీ లవౌ |1-4-29|

అంతట రామాయణమును మధురముగా గానము చేయుచు అందఱి ప్రశంసలకు పాత్రులైన, ఆ లవకుశ సోదరులను అరివీరభయంకరుడైన శ్రీరాముడు తనభవనమునకు రప్పించి, వారిని ప్రశంసించెను. [1-4-29]


పూజయామాస పుజ అర్హౌ రామః శత్రునిబర్హణః |

ఆసీనః కాంచనే దివ్యే స చ సింహాసనే ప్రభుః |1-4-30|

శ్రీరామచంద్రప్రభువు దివ్యమైన బంగారు సింహాసనముపై ఆసీనుడైయుండెను. ఆ మహావీరుని సమీపమున మంత్రులు, సోదరులు చేరియుండిరి. [1-4-30]


ఉపోపవిష్టైః సచివైః భ్రాతృభిః చ సమన్విత |

దృష్ట్వా తు రూప సంపన్నౌ వినీతౌ భ్రాతరౌ ఉభౌ |1-4-31|

ఉవాచ లక్ష్మణం రామః శత్రుఘ్నం భరతం తథా |

శ్రూయతాం ఏతద్ ఆఖ్యానం అనయోః దేవ వర్చసోః |1-4-32|

అశ్వమేధయాగదీక్షలోనున్న శ్రీరాముడు ముద్దులొలుకుచున్న ఆ ఇద్దఱు చిన్నారులను జూచి, లక్ష్మణ భరత శత్రుఘ్నులతో "దివ్యమైన వర్చస్సుగల ఈ చిరంజీవులు గానము చేసెడి విచిత్రార్థపద విలపితమైన ఈ వృత్తాంతమును వినుడు" అని పలికి, ఆ మధుర గాయకులను పాడుటకై ప్రోత్సహించెను. [1-4-31, 32]


విచిత్రార్థ పదం సమ్యక్ గాయకౌ సమచోదయత్ |

తౌ చ అపి మధురం రక్తం స్వచిత్తాయత నిఃస్వనం |1-4-33|

తంత్రీ లయవత్ అత్యర్థం విశ్రుతార్థం అగాయతాం |

హ్లాదయత్ సర్వ గాత్రాణి మనాంసి హృదయాని చ |

శ్రోత్రాశ్రయ సుఖం గేయం తద్ బభౌ జనసంసది |1-4-34|

ఆ బాలకులిద్దఱును ప్రసిద్ధికెక్కిన అ రామాయణగాథను మధురముగా, రాగయుక్తముగా, వీణాతంత్రులను మీటుచు లయబద్ధముగా శ్రావ్యమైన కంఠస్వరములతొ గానము చేసిరి. ఆ మహాజనసభలో వీనులవిందు గావించుచు వారు హాయిగా గానము చేసిన ఆ పాట సదస్యుల శరీరములను పులకింపజేసెను, మనస్సుల ఆహ్లాదపఱచెను, హృదయమును ద్రవింపజేసెను. అది సభకే ఒక వెలుగు దివ్వెయై విలసిల్లెను. [1-4-33, 34]


ఇమౌ మునీ పార్థివ లక్షణాన్వితౌ

కుశీ లవౌ చ ఏవ మహాతపస్వినౌ |

మమా అపి తద్ భూతి కరం ప్రచక్షతే

మహానుభావం చరితం నిబోధత |1-4-35|

తతః తు తౌ రామ వచః ప్రచోదితౌ

అగాయతాం మార్గ విధాన సంపదా |

స చ అపి రామః పరిషద్ గతః శనైర్

బుభూషయ ఆసక్తమనా బభూవ |1-4-36|

"ఈ బాలురు ఇద్దఱును మునివేషములలో ఉన్నను రాజ లక్షణములు గలవారు, వీరు గాయకులు, మహాతపస్సంపన్నులు. వీరి కావ్యగానము నాకును ఆనందమును గూర్చుచున్నది. కనుక నాకును శ్రేయస్కరమైన ఈ మహాచరితమును వినుడు." అంతట వారు శ్రీరాముని ప్రోత్సాహముతో సర్వజనామోదకమైన మార్గపద్ధతిలో గానము చేసిరి. శ్రీరాముడును సభలోని వారితోపాటు ఆ గానానందమును తానును అనుభవింపదలచినవాడై ఆ గానమును వినుటలోనే నిమగ్నుడాయెను. దానిని ఎంతగా విన్నను వారికి తనివితీరకుండెను. [1-4-35, 36]


ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే చతుర్థస్సర్గః |1-4|

వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు నాల్గవసర్గము సమాప్తము