బాలకాండము - సర్గము 11

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీమద్వాల్మీకియరామాయణే బాలకాండే ఏకాదశః సర్గః |౧-౧౧|

వాల్మీకి రామాయణము
రామాయణ కాండములు
1. బాలకాండము
2. అయోధ్యాకాండము
3. అరణ్యకాండము
4. కిష్కింధకాండము
5. సుందరకాండము
6. యుద్ధకాండము
7. ఉత్తరకాండము

భూయ ఏవ హి రాజేంద్ర శృణు మే వచనం హితం |

యథా స దేవప్రవరః కథయామాస బుద్ధిమాన్ |1-11-1|

ఓ రాజంద్రా!ఆ సనత్కుమారమహర్షి తన కథాప్రసంగము నందు ఇంకను ఇట్లు చెప్పెను.అది మీకు హితకరమైనది.దానిని చెప్పెదను వినుము.(1-11-1)

ఇక్ష్వాకూణాం కులే జాతో భవిష్యతి సుధార్మికః |

నామ్నా దశరథో రాజా శ్రీమాన్ సత్య ప్రతిశ్రవః |1-11-2|

అఙ్గ రాజేన సఖ్యం చ తస్య రాజ్ఞో భవిష్యతి |

కన్యా చ అస్య మహాభాగా శాంతా నామ భవిష్యతి |1-11-3|

పుత్రస్తుః అఙ్గస్య రాజ్ఞః తు రోమపాద ఇతి శ్రుతః |

తం స రాజా దశరథో గమిష్యతి మహాయశాః |౧-౧౧-౪|

అనపత్యోఽస్మి ధర్మాత్మన్ శాంతా భర్తా మమ క్రతుం |

ఆహరేత త్వయా ఆజ్ఞప్తః సంతానార్థం కులస్య చ |౧-౧౧-౫|

శ్రుత్వా రాజ్ఞోఽథ తత్ వాక్యం మనసా స విచింత్య చ |

ప్రదాస్యతే పుత్రవంతం శాంతా భర్తారం ఆత్మవాన్ |౧-౧౧-౬| ఇక్ష్వాకుమహారాజవంశమున దశరథుడు అను పేరుగల ఒకమహాపురుషుడు ఉదయింపగలడు.అతడు ధార్మికుడై సర్వశుభలక్షణములతో సత్యసంధుడుగా ప్రసిధ్ది వహించును.అంగరాజైన ధర్మరథునితో అతనికి మైత్రి ఏర్పడును.దశరథునకు శాంత అను కూతురు కలుగగలదు.అంగరాజైన ధర్మరథుని కుమారుడైన చిత్రరథుడు రోమపాదుడుగా ప్రసిద్ధికెక్కును.ఆ రోమపాదునికడకు సుప్రసిద్దిడైన దశరథ మహారాజు వెళ్ళును.పిమ్మట అతడు "ఓ ధర్మాత్ముడా!నాకు సంతానప్రాప్తికిని,వంశాభివృద్దికిని శాంతభర్తయైన ఋష్యశృంగుడు మీ అనుమతియైనచో నా కొరకై యజ్గ్నమును ఆచరించును."అని రోమపాదునితో పల్కును.దశరథ మహారాజు పలికిన ఆవాక్యములను విని,ఉదారగుణము గల ఆ రోమపాదుడు మనస్సులో తర్కించుకొనిన పిమ్మట దశరథునకు పుత్రప్రాప్తికై పుత్రకామేష్టి యజ్ఞమును నిర్వహింప సమర్థుడగు ఋష్యశృంగుని ఆయనకడకు పంపిచును.(2-6)

ప్రతిగృహ్యం చ తం విప్రం స రాజా విగత జ్వరః |

ఆహరిష్యతి తం యజ్ఞం ప్రహృష్టేన అంతరాత్మనా |౧-౧౧-౭| దశరథుడు మనస్తాపము తీరినవాడై,ఆ బ్రాహ్మణోత్తముని వెంటబెట్టుకొనివచ్చి,సంతోషముతో మనస్పూర్తిగా ఆయజ్ఞమును ఆచరించును.(7) తం చ రాజా దశరథో యశస్ కామః కృతాంలిః |ఉ

ఋష్యశృఙ్గం ద్విజ శ్రేష్ఠం వరయిష్యతి ధర్మవిత్ |౧-౧౧-౮|

యజ్ఞార్థం ప్రసవార్థం చ స్వర్గార్థం చ నరేశ్వరః |

లభతే చ స తం కామం ద్విజ ముఖ్యాత్ విశాంపతిః |౧-౧౧-౯|

పుత్రాః చ అస్య భవిష్యంతి చత్వారో అమిత విక్రమాః |

వంశ ప్రతిష్ఠానకరాః సర్వ బూతేషు విశ్రుతాః |౧-౧౧-౧౦|

యజ్ఞము చేయగోరినవాడును,ధర్మజ్జ్ఞుడును ఐన ఆ దశరథమహారాజు ద్విజోత్తముడైన ఆ ఋశ్యశృంగునకు దోసిలొగ్గి నమస్కరించి,యజ్ఞనిర్వహణకును,తత్ఫలితముగా తనకు పుత్రలాభము,స్వర్గప్రాప్తి కలుగుటకును ఆయనను కోరుకొనును.ఆ మహారాజు ఆ విప్రోత్తమునిసహాయముతో యజ్ఞమును నిర్వహించుట ద్వారా తన కోరికలను ఈడేర్చుకొనును.ఆయనకు అమితపరాక్రమశాలురైన నలుగురు కుమారులు కలుగుదురు.వారు వంశప్ర్తతిష్టను ఇనుమడింప జేయుదురు.అన్నిలోకములయందును వారు ఖ్యాతివహింతురు.(8-10)

ఏవం స దేవ ప్రవరః పూర్వం కథితవాన్ కథాం |

సనత్కుమారో భగవాన్ పురా దేవయుగే ప్రభుః |౧-౧౧-౧౧| మహర్షులలోశ్రేష్టుడు,పూజ్యుడు,సర్వసమర్థుడు ఐన సనత్కుమారమహర్షి పూర్వకాలమున కృతయుగమునందు ఈ కథను తెల్పియుండెను.(11)

స త్వం పురుష శార్దూల సమానయ సుసత్కృతం |

స్వయం ఏవ మహారాజ గత్వా స బల వాహనః |౧-౧౧-౧౨|

ఓ నరోత్తమా!మహారాజా!పుత్రార్థివైన నీవు పురోహితులద్వారాగాక స్వయముగా పరివారములతో వాహనములతో వెళ్ళి,పూజార్హుడైన ఆ ఋశ్యశృంగ మునిని సాదరముగా తీసికొనిరండు.(12)

సుమంత్రస్య వచః శ్రుత్వా హృష్టో దశరథోఽభవత్ |

అనుమాన్య వసిష్ఠం చ సూతవాక్యం నిశామ్య చ |౧-౧౧-౧౩|

స అంతఃపురః సహ అమాత్యః ప్రయయౌ యత్ర స ద్విజః |

వనాని సరితః చ ఏవ వ్యతిక్రమ్య శనైః శనైః |౧-౧౧-౧౪| సుమంత్రుడు తెల్పిన ఈ కథను విని వసిష్టుని,అనుమతిని గైకొని,దశరథమహారాజు రాణులతో,అమాత్యులతోగూడిఉన్ ఋశ్యశృంగుడు ఉన్న రోమపాద నగరమునకు బయలుదేరెను.వనదృశ్యములను,నదీతీరములను తిన్నగా దర్శించుచు క్రమముగా ఆ మహారాజు ముని పుంగవుడున్న ప్రదేశమునకు చేరెను.(13-14)

అభిచక్రామ తం దేశం యత్ర వై మునిపుంగవః |

ఆసాద్య తం ద్విజ శ్రేష్ఠం రోమపాద సమీపగం

ఋషిపుత్రం దదర్శ అథో దీప్యమానం ఇవ అనలం ||౧-౧౧-౧౫|

రోమపాదనగరమునకు చేరిన దశరథుడు ద్విజోత్తముడును,విభండకునికుమారుడును,అగ్నివలె తేజశ్శాలియును ఐన ఋష్యశృంగుని రోమపాదునిసమీపమున ఉండగా చూచెను.(15)

తతో రాజా యథా యోగ్యం పూజాం చక్రే విశేషతః

సఖిత్వాత్ తస్య వై రాజ్ఞః ప్రహృష్టేన అంతరాత్మనా ||౧-౧౧-౧౬| అంతట రోమపాదుడు దశరథమహారాజుతో తనకుగలమైత్రిని పురస్కరించుకొని,ప్రసన్నమనస్కుడై సముచితముగా ఆయనకు విశేషపూజలను గావించెను.(16)


రోమపాదేన చ ఆఖ్యాతం ఋషిపుత్రాయ ధీమతే

సఖ్యం సంబంధకం చైవ తదా తం ప్రత్యపూజయత్ ||౧-౧౧-౧౭|

ధీశాలియైన ఋశ్యశంగునకు రోమపాదుడు తనకు దశరథుని తో గల మైత్రిని,బందుత్వమును గూర్చి తెల్పెను.అప్పుడు ఆ ముని దశరథుని పూజించెను.(17)

ఏవం సుసత్కృతః తేన సహోషిత్వా నరర్షభః

సప్తాష్ట దివసాన్ రాజా రాజానం ఇదం అబ్రవీత్ ||౧-౧౧-౧౮|

ఇట్లు సత్కారములను పొందిన దశరథమహారాజు రోమపాదునికడ ఏడెనిమిది దినములు గడిపి,పిదప ఆయనతో ఇట్లనెను.(18)

శాంతా తవ సుతా రాజన్ సహ భర్త్రా విశాం పతే

మదీయం నగరం యాతు కార్యం హి మహదుద్యతం ||౧-౧౧-౧౯|


తథా ఇతి రాజా సంశ్రుత్య గమనం తస్య ధీమతః

ఉవాచ వచనం విప్రం గచ్ఛ త్వం సహ భార్యయా ||౧-౧౧-౨౦|

ఓ మహారాజా! నీ కూతురైన శాంతను,అల్లుడైన ఋశ్యశృంగుని నా నగరమునకు పంపుము.అచట ఒక మహత్కార్యము జరగనున్నది.రోమపాదుడుప్రతిభామూర్తియైన ఋశ్యశృంగుని ప్రయాణమునకు తన ఆమోదమును తెలిపెను.పిమ్మట ఋశ్యశృంగునితో "ఓ విప్రోత్తమా!నీ భార్యయైన శాంతతో అయోద్యా నగరమునకు వెళ్ళుము."అని పలికెను.(19-20)

ఋషిపుత్రః ప్రతిశ్రుత్య తథా ఇతి ఆహః నృపం తదా

స నృపేణ అభ్యనుజ్ఞాతః ప్రయయౌ సహ భార్యయా ||౧-౧౧-౨౧|

ఋషిపుత్రుడు ఆ మాటలను విని రాజుగారితో 'అట్లే'యని పలికి రాజు గారి అనుమతితో భార్యతోగూడి బయలుదేరెను.(21)

తావ అన్యోన్య అంజలిం కృత్వా స్నేహాత్ సంశ్లిష్య చ ఉరసా

ననందతుః దశరథో రోమపాదః చ వీర్యవాన్ ||౧-౧౧-౨౨|

పరాక్రమవంతులైన దశరథుడు,రోమపాదుడు ఇద్దరును పరస్పర నమస్కారములతో,స్నేహపూర్వకములైన ఆలింగనములతో ఆనందించిరి.(22)

తతః సుహృదం ఆపృచ్ఛ్య ప్రస్థితో రఘునందనః

పౌరేషు ప్రేషయామాస దూతాన్ వై శీఘ్ర గామినః ||౧-౧౧-౨౩|

అనంతరము దశరథుడు రోమపాదునికడ సెలవుగైకొని,బయలుదేరెను.పిమ్మట అతడు త్వరగా వెళ్ళునట్టి దూతల ద్వారా తమరాకను దెలుపుచు పౌరులకు తన ఆదేశమును పంపెను.(23)

క్రియతాం నగరం సర్వం క్షిప్రం ఏవ స్వలంకృతం

ధూపితం సిక్త సమ్మృష్టం పతాకాభిః అలంకృతం |1-11-24|

తతః ప్రహృష్టాః పౌరాః తే శ్రుత్వా రాజానం ఆగతం

తథా చక్రుః చ తత్ సర్వం రాజ్ఞా యత్ ప్రేషితం తదా ||౧-౧౧-౨౫|

పౌరులు రాజుగారి శుభాగమనవార్తను విని,మిక్కిలి సంతోషించిరి.రాజుగారిసందేశముప్రకారము పూర్తిగా నగరమును అలంకరించిరి.(25)

తతః స్వలంకృతం రాజా నగరం ప్రవివేశ హ

శఙ్ఖ దుందుభి నిహ్రార్దైః పురస్కృత్వా ద్విజర్షభం ||౧-౧౧-౨౬|

తతః ప్రముదితాః సర్వే దృష్ట్వా తం నాగరా ద్విజం

ప్రవేశ్యమానం సత్కృత్య నరేంద్రేణ ఇంద్ర కర్మణా ||౧-౧౧-౨౭|

పిమ్మట దశరథుడు శంఖదుందుభులధ్వనులమధ్య విప్రోత్తముడైన ఋశ్యశృంగుని ముందుంచుకొని,బాగుగా అలంకరింపబడిన నగరమున సపరివారముగా ప్రవెశించెను.ఇంద్రునివలె పరాక్రమశాలియైన దశరథుడు ఆదర సత్కారములతో నగరమునకు తీసికొనివచ్చుచున్న బ్రాహ్మణోత్తమునిజూచి,ఆ నగరవాసులెల్లరును మిక్కిలి సంతోషపడిరి.(26-27)


అంతఃపురం ప్రవేశ్య ఏనం పూజాం కృత్వా చ శాస్త్రతః |

కృతకృత్యం తదా ఆత్మానం మేనే తస్య ఉపవాహనాత్ ౧-౧౧-౨౮|

దశరథుడు ఋశ్యశృంగుని తన అంతపురమునకు తీసికొనివచ్చి,శాస్త్రోక్తముగా పూజించెను.ఇంకను ఆయన రాకతో తాను కృతార్థుడైనట్లు తలంచెను.(28)


అంతఃపురాణి సర్వాణి శాంతాం దృష్ట్వా తథా ఆగతాం |

సహ భర్త్రా విశాలాక్షీం ప్రీత్యా ఆనందం ఉపాగమన్ !౧-౧౧-౨౯||

భర్తతోగూడి ఆ విధముగా విచ్చేసిన విశాలాక్షియగు శాంతను జూచి అంతపురకాంతలందరును ఎంతగానో సంబరపడిరి.(29)

పూజ్యమానా తు తాభిః సా రాజ్ఞా చ ఏవ విశేషతః |

ఉవాస తత్ర సుఖితా కంచిత్ కాలం సహ ద్విజా |౧-౧౧-౩0|

అంతపుర స్త్రీలను,జనకుడైన దశరథరాజూ ఆ శాంతాదేవిని బంధుమర్యాదలతో గౌరవించిరి.ఆమెయు తనభర్తయగు ఋశ్యశృంగునితో అచట కొంతకాలము గడిపెను.(30)

ఇతి వాల్మీకి రామాయణే ఆది కావ్యే బాలకాండే ఏకాదశః సర్గః |౧-౧౧|