బసవరాజు అప్పారావు గీతములు/బిచ్చగాడు

వికీసోర్స్ నుండి

అకట! నీ గానమహిమ నాకబ్బెనేని
మాటలం జెప్పగారాక మదిని పొంగి
పొరలెడు వియోగదుఃఖంపుతరగ లేచి
జగతి చింతల ముంపగా జాలదొక్కొ?


బిచ్చగాడు

త్రోవ గాన్పింపకున్నదో దేవ! కనులు
మసక గ్రమ్మెడు నెమ్మది మాంద్యతమము
గప్పుచున్నది, యింకెంత కాల మిట్టు
లంధకారము లోకమ్ము నావరించు?

    దించినట్టి మో మెత్తక, దేహి యంచు
    చేతులం జోలె గట్టుక, జీర్ణ వస్త్ర
    ములను దాలిచి ప్రణయ భాగ్యులను బిచ్చ
    మడుగ నొకరైన నొకపట్టె డిడరు దేవ!

జగతి ధర్మము శూన్యమై చచ్చెనొక్కొ!
లేక నాకర్మఫల మొకో, ఈ కరణిని
ఆకలి దహింప కరుణ నమ్మా యటన్న
పలుకువారలు లేక చావంగనుంట?

అన్ని యాశలు వ్యర్థమ్ము లయ్యె తండ్రి?
    నీవు దక్క నాకింక దిక్కెవరు లేరు,
    నీ దయారమ్యరూపము నింక మరుగు
    పరుపబోకుము భక్తుని కరుణ గనుము.

పాటకుడు

వీణె చేజారి పడిపోవు, వ్రేళ్ళు శ్రుతుల
నింపుగా మీటి రాగ మొప్పింపకుండె,
గొంతు బొంగురువోయెడు, నెంత చించు
కొంచు బాడిన నీవు గాన్పించవేమి?
హాయిలో మున్గి మాయమై పోయినావొ?
పరవశత జెంది భక్తుని మరచినావొ?
దేవ, నా కింక నెపుడు నీ దివ్యదర్శ
నమ్ము నిచ్చెదు? నా పాట కంత మెపుడు?