బసవరాజు అప్పారావు గీతములు/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక.[1]

'ఆనందో బ్రహ్మ యటన్న ప్రాబలుకు నంతర్బుద్ధి నూహింపుమా' యని శంఖారావమున జేయువరూధిని ప్రణయబోధ "ప్రాణములకన్న నెక్కుడుప్రాణమైన" ప్రవరాఖ్యుడు పెడచెవింబెట్టి త్రోసివేయ, నాపొంతనే కైతలల్లుచున్న నాచెవులబడి, నిమేషమ్మున నదృష్టపూర్వశోభాభాసమున ప్రణయకవితారాజ్యమునకు నన్ను గొంపోయి, కొండొక 'మందారవనాంతరామృతసర:ప్రాంతేందు కాంతో పలవేదిపై' పారవశ్యావస్థను విడియించి యెటనో మాయమై పోయెను. నిద్దుర లేచునప్పుడు మాత్రము 'వత్సా! విశాలదృష్టి సర్వముం గాంచి యనుభవించి, మరువ కనుష్ఠింపుమా సమంజసబుద్ధిన్‌' అను పలుకులు చెవులమ్రోగుచుండె. లేచి తత్సీమాసౌభాగ్య మెల్ల దనివితీర ననుభవించి వికసితహృదయుండనైతి. నాటగోలె నానందోపాసినై, సర్వ మానందమయముగ భావించి దైవకృప నా కుదయించిన కవితాకన్య స్థానందాలయసేవనే నియోగించితిని.

మాకవితాకన్య చిన్నతనమున నుండియు రాగిణి, భాషనోద్దీపిత గానలోల రసజీవిని, వెన్నవలె మెత్తనౌకన్నెవల పులు కరగి కాలువల జాలువారకమున్నె, చుక్కలలోని చందురుకన్న నెక్కుడు బెట్టునరియు, నవురూపుడును, లోకాతీతుండును నగు నాదేవదేవునిపై వెఱ్ఱ్రిప్రేమ నించి ప్రణయసిద్ధి గాంచమి వేదన స్రుక్కుచు నాశల నల్లాడుచు, చింతాగానము జేయుచున్నది. "మండువేసవి విలపించు కొండసోన దీన గానమున కన్నను తీయనైన" యాపె విరహిగీతముల కవితా పరిపాకము ననుభవరసికులే యెఱింగి గ్రహింతురు గాక. "పురాణ మిత్యేవ న సాధు సర్వం, నచాపి కావ్యం నవ మిత్యవద్యం, సంత: పరీక్షాన్యతరత్ భజంతే, మూఢ: పరప్రత్యయనేయ బుద్ధి:" అను మహాకవి కాళిదాసువచనముల రసహృదయులగు పాఠకులు పాటింతురు గాక.

బసవరాజు వేంకట అప్పారావు.


____________
  1. ఇది కీ. శే. అప్పారావుగారు తనగీతముల వ్రాతప్రతిలో వ్రాసియుంచిన పీఠిక.