Jump to content

బసవరాజు అప్పారావు గీతములు/జీవితచరిత్ర

వికీసోర్స్ నుండి
కీర్తిశేషులగు

బసవరాజు వేంకట అప్పారావుగారు, బి. ఏ., బి. యల్.

జననము 13-12-1894 - నిర్యాణము 10-6-1933


ఈ కవి ఆంధ్రనియోగి బ్రాహ్మణుడు, కౌశికసగోత్రుడు, తండ్రి పిచ్చయ్యగారు, తల్లి వెంకమ్మగారు. కృష్ణాజిల్లాలో బెజవాడ దగ్గరనున్న పటమట గ్రామమున మేనమామలగు గోవిందరాజులవారి యింట పుట్టి పెరిగెను.

ఈతడు ఆరవఫారము వరకును బెజవాడ C. M. S. హైస్కూలులో చదివి 1912 లో స్కూలు ఫైనలు పరీక్షలో నుత్తీర్ణు డయ్యెను. తరువాత చెన్నపురిలోని ప్రెసిడెన్సీ కళాశాలలో చదివి 1916 లో బి. ఏ. పట్టము నందినాడు. తదుపరి కొన్నాళ్లు ఆంధ్రపత్రికకును కొన్నాళ్లు భారతికిని సహాయ సంపాదకుడుగ నుండెను. 1926 లో బి. యల్. పట్టమునంది 1927 లో బెజవాడలో న్యాయవాదవృత్తిలో బ్రవేశించెను. 1932 సంవత్సరాంతమున న్యాయవాదవృత్తి చాలించి పత్రికా నిర్వహణోద్యోగమున జేరదలచి ఢిల్లీకి వెళ్లెను. అచ్చటనే మనోవైకల్యము గలిగి స్వగ్రామమునకు వచ్చి కొన్ని నెలలలోనే ఈశ్వరసాన్నిధ్యము జేరెను.

ఈతడు బి. ఏ. చదువుచుండగనే తన మేనమామ కుమార్తె యగు శ్రీ వేంకట రాజ్యలక్ష్మమ్మగారిని పరిణయమయ్యెను. ఈదంపతుల కొక కొమార్తెయు నొక కొమారుడును గలిగిరిగాని బాల్యముననే మరణించిరి.

అప్పారావు వాయుసందేశ మను పద్యకావ్యమును రచియించెనుగాని దాని వ్రాతప్రతి కనపడలేదు. ఈతని వచనరచనలలో ఆంధ్రకవిత్వ చరిత్ర మచ్చుపడినదిగాని ఆంధ్రరత్న చరిత్రము, అరేబియన్ నైట్సు కథలు అచ్చుకాలేదు.

దేశాటనమన్నను, వినోదగోష్ఠియన్నను, కవిత్వమన్నను అప్పారావుకు ప్రీతి. ఈతడు దర్శించని మహానగరముగాని, పుణ్యక్షేత్రముగాని లేదు. ఈతడు చవిచూడని సారస్వతవిశేషమును గానరాదు. ఇతడు గొప్ప విద్వాంసుడు, విజ్ఞాని, రసికుడు. ఈతడు ప్రేమసాగరు డని చెప్పవచ్చును.

ఈతని గీతములందు కనబడు గొప్పలక్షణ మీ ప్రేమతరంగములే. ఈతని కవిత్వము భావగర్భితమై రచపూరితమై హృదయరంజకముగ నుండును. ఈతడు తన సుఖదుఃఖములను గాని, మనోభావములనూ గాని యెంతమాత్రము దాచడు. ఈకవి నిజముగా భావకవిసామ్రాట్టే యనుటకు సందియము లేదు.