Jump to content

బసవరాజు అప్పారావు గీతములు/నిరాలంబస్థితి

వికీసోర్స్ నుండి

ఎడబాటు

ఎన్ని తపసులు జేసి
     ఈజన్మ మెత్తితినొ

చిన్ని నారాణి! నీ
     చెట్ట బట్టితిని!

తపసు గర్వాన యే
     తప్పు జేశానో, నా

చిట్టి! యీ యెడబాటు
     శిక్ష తగిలింది!

నిరాలంబస్థితి

నట్ట నడి సంద్రాన
నావలో వున్నాను
నడినీటిలో ముంచుతావా?
               నా సామి?
నావ వొడ్డట్టించుతావా? నట్టనడి ||

చీమలూ దూరనీ
చిట్టడవి లోపలా
చిక్కుకున్నానోయి దేవా!
    యేదైన
దిక్కొకటి చూపించుతావా? చీమలూ ||

ఆదిఅంతూ లేని
ఆకాశమధ్యాన
అల్లాడుతున్నాను దేవా!
           దయ వుంచి
చల్లగా యిల్లుజేర్చేవా? ఆదిఅంతూ ||

చిట్టినిద్ర

నే మేలుకొనియుండ లేమ నిద్రించు
నావకడుపులోని నావికుబోలి
రాజుపాలన క్రింద రాజ్యమ్మువోలె
తల్లి పక్కలోని పిల్లలా గొదిగి.