బసవరాజు అప్పారావు గీతములు/తెలియని వలపు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తెలియని వలపు

             ఎంతటి చపలుండ నైతి
             నెంతటి మందమతినైతిని
             సుంత జ్ఞాన మున్న కలనె
             ఇంతి నీదుప్రేమ మఱువ?

గీ. చేతులను నెత్తి ముద్దాడి చెలియ! నిన్ను
   చంక నెత్తుకు నాడించి సంబరపడి
   మూపు నుప్పుప్పుగోనెలు మోసి మురిసి
   కడ కిటులు గంగ గల్పితి జ్ఞాన మెల్ల!

గీ.'బాల! నీపతి యెవ' రన్న 'బావ' యనుచు
   ముద్దులొల్కెడి మోముపై ముసిముసి నగ
   వల్ల నల్లన మెఱయంగ నాత్మ వెలుగు
   ప్రణయముం దెల్పుదువుగాదె! ప్రాణసఖియ!

గీ. వెఱ్ఱిలోబడి, మతి వోయి వెంగలినయి,
   దైవికములగు ప్రేమబంధముల ద్రెంచు
   పాపకర్మము దలపెట్ట పడతి! నీవు
   మంచిపని గాదనుచు బుద్ధి మరుపలేదె?

గీ. ఎప్పు డింటికి వచ్చునా ఎపుడు కనుల
   కరువుదీరంగ గాంతునా కాంతు నంచు

      కలలసైతము నాకయి కలువరించు
      చెలియ వీ వుండ నా సిరి చెప్పనౌనె?

      కన్నె! చపలత వోయె నింక ప్ర
      సన్నవై నన్నాదరింపవె!
      విన్నపము గొని మరుపగదె నా
      చిన్న తనపు బనుల్.

      సత్య మరయంగల్గి తిప్పుడు
      సఖియరో నా భాగ్యవశమున
      కుదుటవడె నెమ్మనము, నావగు
      కోర్కు లీడేరున్.

      కష్టసుఖముల నొక్కతీరై
      కలుగుదానిం దృప్తి గుడుచుచు
      చింత లేమియు లేక ముదమున
      జెలగుదము చిరము.

      బ్రతికియున్నన్నాళ్లు నొండొరు
      బాయకుండగ ప్రేమసంద్రము
      నీదుదము చల్లనౌచూపుల
      నీశ్వరుడు చూడన్.