Jump to content

బసవరాజు అప్పారావు గీతములు/కాంచలేను! కాంచలేను!

వికీసోర్స్ నుండి

కాంచలేను! కాంచలేను!

కాంచలేను, కాంచలేను
    కనులు మూతవడెడు స్వామి!

మించుదీగయట్లు మిగుల మెఱయుచుండె నీదుమూర్తి
క్రించుదనము నొందిన నే గాంచలేను నీ తేజము! కాంచ ||

    ఆనలేను, ఆనలేను
    అధరామృతమును నాథా!

ప్రాణదాన మిచ్చి తాపబాధల పోగొట్టు నీదు
ప్రణయామృత మానలేని భాగ్యహీనురాల దేవ! ఆన ||

    నిలువలేను, నిలువలేను
    నిన్ను కౌగలింపలేను

ప్రేమ పవిత్రమ్మగు నీ హృదయమ్మును దాకినంత
పాపమునిండిన నాయెద వ్రయ్యలౌనుగాదె నాథ! నిలువ ||

    పలుకలేను, పలుకలేను
     భయము సిగ్గు వొడము నాథ!

వల పెల్లను నాయందే నిలిపినట్టి దేవ నిన్ను
ద్రోహముచేసిన నాదగు దోసమెల్ల బయలుపడదె! పలుక ||

     కాంచలేను, కాంచలేను
     కనులు మూతవడెడు స్వామి!