Jump to content

ప్రాణాయామము/ప్రత్యేక సూచనలు

వికీసోర్స్ నుండి

ప్రత్యేక సూచనలు

1. ఉదయము పెందలకడ కాలకృత్యములను తీర్చికొని సాధన చేయుటకు కూర్చొనుము. తేమ లేకుండావుండి; చక్కగా గాలివచ్చెడి గదిలో ప్రాణాయామము చేయుము. ప్రాణాయా మము చేయుటకు గాఢమైన ఏకాగ్రత శ్రద్ధలు కావలెను. నీకు అనుకూలముగావుండు ఆసనములో కూర్చొనుము. మనస్సు యొక్క ఏకాగ్రతను చెరచు ఏ వస్తువును నీ సమీపమున వుండనివ్వకుము.

2. ప్రాణాయామము చేయుటకు కూర్చొన బోవు ముందు, ముక్కులను బాగా శుభ్రపరచుకొనుము. సాధనను చేయబోవుటకు ముందు కొద్దిగా పళ్ళరసము లేక పాలు లేక కాఫీని తీసికొనవచ్చును. సాధన ముగిసినతరువాత 10 నిమిషముల అనంతరము ఒక గ్లాసెడు పాలుగాని ఏదైన అల్పాహారమునుగాని తీసికొనుము.

3. ఎండాకాలములో ఉదయము ఒకసారి మాత్రమే అభ్యాసముచేయుము. మెదడు లేక తల వేడిగానున్నచో భృంగామలక తైలమునుగాని, వెన్ననుగాని స్నానము చేయ బోవుటకు పూర్వము మర్ధనచేయుము. నీటిలో పటికబెల్లపు పొడిని కరగించి, ఆ షర్బత్తును త్రాగుము. ఇందువల్ల శరీరమునందలి వేడి తగ్గును. శీతలి ప్రాణాయామమునుకూడ చేయుము. ఇందువల్ల శరీరముకు ఉష్ణాధిక్యము కలుగదు.

4. అతివాగుడు, మితిమీరితినుట, అతినిద్ర, మిత్రులతో అతిగా కలసివుండుట, అతి శ్రమ కలిగించెడి పనులను మానుము. "యోగము మితిమీరి మెక్కువానికిగాని, మితిమీరి ఉపవసించువానికిగాని, మేల్కొనువానికిగాని సిద్ధించదు". (గీత 6-16 అన్నముతోపాటు నెయ్యి కలుపుకొని తినుము. ఇందువలన వాయువు సులభముగ సంచరించును.

5. "మితాహారం వినా యస్తు యోగారంభంతు కారయేత్| నానారోగో భవేత్తస్య కించిత్ యోగో న సిధ్యతే." (ఘే.సం. 5-16) ఆహార నియమములేకుండా యోగమును అభ్యసించువాడు, ఫలితమేమియు పొందకపోగా అనేకములగు జబ్బుల పాల్పడును.

6. ఆరు మాసములు లేక ఒక సంవత్సరము వరకు పూర్ణమైన బ్రహ్మచర్య పాలనము చేసినవాడు, ఆధ్యాత్మికముగ అతి త్వరలో వృద్ధిలోనికి వచ్చును. స్త్రీలతో మాట్లాడవద్దు. వారితో పరిహాసము లాడుటగాని, నవ్వుటగాని చేయకుము. వారి సాంగత్యమును పూర్తిగా వదలివేయుము. బ్రహ్మచర్యపాలన, ఆహారమునందు కట్టుబాటు లేకుండా యోగసాధన చేసినచో నీకు పూర్తియైన ఫలితములు లభించవు. ఆరోగ్యమును కాపాడుకొన గోరువారు సామాన్య సాధనలు చేయవచ్చును.

7. క్రమబద్ధముగా నియమిత కాలమందు సాధన చేయుము. ఒక్క రోజుకూడ మానివేయకుము. ఏదైన తీవ్రమైన బాధ నిన్ను బాధించునప్పుడు సాధన మానివేయుము. కొందరు కుంభకమును చేయునప్పుడు ముఖస్నాయువులను బిగలాగుదురు. అటుల చేయరాదు. ఇటుల చేయుట వారి శక్తికి మించిన సాధన చేయుచున్నారని అనుకొనుటకు సూచకము. ఇట్టి అలవాటు గలవారు రేచక పూరకములను సక్రమముగా చేయలేరు.

8. పగటినిద్ర, రాత్రులం దెక్కువసేపు మేల్కొని వుండుట, మలమూత్రములు అత్యధికముగా వుండుట, అనారోగ్యమును కలిగించు ఆహారము, ప్రాణశక్తి అపరిమితముగా వ్యర్థమగు మానసిక పరిశ్రమలు యోగ విఘ్న కారులు. కొందరు ఏదైన కారణముచే ఏదైన వ్యాధి వచ్చినచో, అది యోగ సాధనవల్ల వచ్చినదని తలచెదరు. ఇది తప్పు. 9. ఉదయం 4 గం. లకు నిద్ర లెమ్ము. అరగంటసేపు జపముగాని, ధ్యానముగాని చేయుము. తరువాత ఆసనములను ముద్రలను చేయుము. 15 ని. విశ్రమించుము. ఆ పిమ్మట ప్రాణాయామము చేయుము. ఈ ఆసనములతో శరీర వ్యాయామములను కూడ కలిపి సులభముగ చేయవచ్చును. నీకు వీలున్నచో ధ్యానాదులు ముగించుకొన్న పిదప వ్యాయామము చేయవచ్చును. నిదురనుండి లేవగనే జపము, ధ్యానములను చేయబోవుటకు ముందు, ప్రాణాయామమును చేయవచ్చును. ఇందువలన శరీరము తేలికగా వుండి, ధ్యాన సుఖము లభించును. నీవీలు, కాలముల ననుసరించి, ఒకనిర్ణీత కార్యక్రమము నేర్పరచుకొనుము.

10. ఆసన ప్రాణాయామములు చేయునప్పుడు వీటితో జపముకూడా చేసినచో, పూర్తియగు ఫలితములు కనిపించును.

11. నిదురనుండి లేవగనే ఉదయము 4 గం. లప్పుడు జపము, ధ్యానములను చేయుట మంచిది. ఏలన, ఈ సమయమున మనస్సు ప్రశాంతముగ నుండును. అందువలన ఏకాగ్రత లభించును.

12. ఎక్కువమంది జనులు పవిత్రమగు ప్రాత:కాల సమయమును ఒక అరగంటసేపు మలవిసర్జన చేయుటకు, మరొక అరగంట ముఖము కడుగుకొనుటకు వ్యర్థము చేసెదరు. ఇది తప్పు. సాధకులు పది నిమిషములలో పై రెండుకార్యములను నెరవేర్చుకొనవలెను.. మలబద్ధకముచే పీడింప బడుచున్న వాడవైనచో, నిద్రనుండి లేవగనే అయిదు నిమిషములసేపు శలభ, భుజంగ ధనురాసనములను వేయుము. లేక ఆలస్యముగ కాలకృత్యములను నెరవేర్చుకొను అలవాటు గలవాడవై యున్నచో, యోగసాధన అయిన పిమ్మటనే తీర్చుకొనవచ్చును.

13 మొట్ట మొదట కొంతసేపు జపధ్యానములు చేయుము. తరువాత కొంతసేపు ఆసన, ప్రాణాయామములు చేయుము. ఆ తరువాత మరికొంతసేపు ధ్యానముచేయుము.

14. నిదురనుంచి లేవగనే, నిద్రమత్తుగానున్నచో కొంచెముసేపు ఆసన, ప్రాణాయామములు చేయుము. ఇందుచే మత్తుపోయి, ఏకాగ్రత లభించును.

15. ఈ క్రియలను యీ క్రిందిక్రమము ప్రకారము చేయుము. ఆసనములు, ముద్రలు, ప్రాణాయామము, ధ్యానము. ఉదయసమయమున చేయుచో, జపము, ధ్యానము, ఆసనములు, ముద్రలు, ప్రాణాయామములను వరుసగ చేయుము. ఈ రెండింటిలో నీకు అనుకూలముగ వున్నరీతిని చేయుము. ఆసనములు తరువాత ప్రాణాయామము మొదలు పెట్టుటకు పూర్వము, అయిదు నిమిషములు విశ్రాంతి తీసికొనుము.

16.కొన్ని హఠయోగ గ్రంథములు ప్రాత:కాలమందు చన్నీటి స్నానము చేయుటను నిషేధించును. ఇటువంటిది అతి శీతల ప్రదేశములగు కాష్మీర్, ముస్సోరీ, డార్జీలింగ్ మొదలగు ప్రదేశములలో ఉదయం 4 గంటలప్పుడు స్నానముచేయు వారికై యుండవచ్చును. కాని, వేడిప్రదేశములందుండు వారి విషయమై కాదు. యోగసాధనకు కూర్చొనబోవుటకు ముందు చన్నీటి స్నానము చాల ఆరోగ్యకరము.

17. ఆసనములు, ప్రాణాయామములు అన్ని వ్యాధులను కుదుర్చును. ఆరోగ్యమును కలిగించును. జీర్ణశక్తిని వృద్ధి చేయును, నరములకు పుష్ఠినిచ్చును. సుషుమ్నా నాడిని బాగు చేయును. కుండలినీ శక్తిని మేల్కొలుపును. రజస్సును లేకుండ చేయును. ఆరోగ్యము, శరీరపుష్టి, లేనిదే ఏ సాధనచేయుటకు వలను కాదు; గాన ధ్యానయోగులు, కర్మ భక్తి యోగులు, వేదాంతులు అందరు హఠయోగ క్రియలను చేయుట లాభకరము.

18. శరీరారోగ్యము లేకుండా ఏ విధమగు కార్యములను చేయజాలము. కావున ప్రతివాడు శరీరారోగ్యమును నిలుపుకొనుటకు తెలసియో తెలియకయో యేదో హఠయోగ క్రియను చేయుచునే వున్నాడు.

19. అసౌకర్యముగా తోచినప్పుడు ప్రాణాయామము చేయుము. వెంటనే ఓపిక వచ్చును. నీవు ఏదైన వ్రాతపని మొదలు పెట్టబోవుటకు ముందు, కొంచెముసేపు ప్రాణాయామము చేయుము. చక్కని, ఆశ్చర్యకరమైన భావములు తట్టును.

20. కొందరు ప్రధమములో ఎక్కువ శ్రద్ధతో సాధనచేసి, కొద్దికాలము కాగానే మాని వేసెదరు; లేదా ఒకరోజు చేయుటా, ఒకరోజు మాని వేయుటా చేసెదరు. ఇది తప్పు.

21. తమలో గల మాలిన్యమును స్వార్ధరహిత సేవ, విక్షేపము, యోగసాధనలచే పారద్రోలు కొనుటకు ప్రయత్నించ కుండగనే, సాధన ప్రారంభించుటయే తడవుగా కుండలినీ శక్తిని పైకిలేపి, బ్రహ్మకారవృత్తిని పొందవలెనని చాల మంది కోరుదురు. ఇది తప్పు. ఇట్టి స్థితిని పొందగోరు వారు మనో వాక్కాయకర్మలందు పారిశుద్ధ్యము, మానసిక శారీరక బ్రహ్మ చర్యములను కలిగి యుండవలెను. అప్పుడే కుండలినీ శక్తిని లేపుటచే గలుగు ఆనందము లభించ గలదు.

22. పడుచుతనమునందే ఆధ్యాత్మిక బీజములను నాటుము. వీర్యమును వ్యర్థముచేసి కొనకుము. ఇంద్రియములను, మనస్సును కట్టుబాటు నందుంచుము. సాధనను చేయుము. ముసలి వాడవైన పిదప చేయవచ్చు నని తలచుట భ్రమ. మొక్కగా వున్నప్పుడు వంగనిది, మ్రానై నప్పుడు వంగునా? అను సామెతను జ్ఞాప్తికి తెచ్చుకొని, సాధనచేసి పూర్ణమగు ఫలితములను సంపాదించుము.

23. ఆధ్యాత్మిక సాధనలో ఉచ్చస్థితికి వచ్చిన పిమ్మట పూర్తిగా 24 గంటలు మౌనధారివై యుండవలెను. నీకు అనుకూలముగా నుండునట్టి ఆసన, ప్రాణాయామాదులను ఎంచుకొనుము.

24. ప్రపంచములో అనేక రకములగు వ్యామోహములు వున్నప్పటికీ బ్రహ్మచర్య పాలనము *[1] చేయవచ్చును. చక్కని కట్టుబాటుగల జీవితము, సద్గ్రంధ పఠన, సత్సంగము, జపము, ధ్యానము, ప్రాణాయామము, సాత్విక మైన మితాహారము, ఆత్మ చింతన, ఆత్మ వివేచన, ఆత్మపరీక్ష, సదాచారము, యమ నియమాభ్యాసము, శారీరక వాచిక తపస్సులు, ఇవన్నియు ముక్తిమార్గమునకు గొంపోవును. ఏనుగు తన నెత్తిపై తానే దుమ్ము పోసికొనునటుల తమ దుష్ప్రవర్తనాదులచే తమ జీవితమును తామే కంటక మయముగా చేసికొని, యితరులను నిందించెదరు. ఇంతకు మించిన మూర్ఖత్వము మరొకటి లేదు.

25. శరీరమును గాని, శరీర భాగములను గాని అనవసరముగా ఊపులాటగాని, కదల్చుటగాని చేయకుము. ఇందువల్ల మనస్సు చెదరి పోవును. శరీరమును అదేపనిగ గోకుట తప్పు. ప్రాణాయామము, జపము ధ్యానములను చేయునప్పుడు శరీరము రాతివలె నిశ్చలముగ వుండవలెను.

26. నీ శరీర తత్వమునకు సరిపడు ఆహార నియమములను ఏర్పరచు కొనుము. నీకు సులభముగా అభ్యసించుటకు అనువైన సాధననే మొదట ప్రారంభించుము. దానికి సంబంధించిన వివరముల నన్నిటిని జాగ్రత్తగా చదివి, అర్ధము చేసికొని, ఆ పిమ్మట సాధన మొదలుపెట్టుము. ఇంకను సందేహము లున్నచో, ఎవరైన సాధనచేయుచున్న విద్యార్థి నడిగి సంశయమును నివారించుకొనుము. ఇది సుఖమైన పద్ధతి. నీశక్తికి మించిన సాధనను అత్యాశతో ప్రథమములోనే ప్రారంభించి అపాయములను పొందవద్దు.

27. మొదటిలో రేచక, పూరక కుంభకముల పరిమాణమును లెక్కించుటకు 'ఓం' ను నిర్ణయించి చెప్పితిమి. ఈ మంత్రమునే వుపయోగించవలెనను నియమ మేదియూ లేదు. రామ, శివ, లేక నీ గురువుచెప్పిన మరే మంత్రమునైనగాని, లేక ఒకటి, రెండు, మూడు అని సంఖ్యలను లెక్కించిగాని చేయవచ్చును. కాని 'ఓం' లేక గాయత్రి, ప్రాణాయామమునకు సులభమైనట్టిన్నీ, అనుకూలముగావుండునట్టివిన్ని అయివున్నవి. వీటిని యిదివరలోచెప్పిన, నిష్పత్తి ననుసరించి లెక్కించవలెను. ఉచ్చస్థితికి వచ్చినపిమ్మట ఈ లెక్క లేకుండగనే లెక్కప్రకారము చేయగలుగుట అలవడును.

28. ప్రారంభస్థితిలో నీయందలి అభివృద్ధిని తెలసికొనుటకై లెక్కించవలెను. ఆ తరువాత ఉచ్చస్థితికి వచ్చిన పిమ్మట ఊపిరితిత్తులే నీకు లెక్క చెప్పగలవు. 29. మిక్కిలి అలసట చెందిపోవునంతవరకు ప్రాణాయామము చేయకుము. మితిమీరిన నియమములకు కట్టుబడి వుండకుము.

30. ప్రాణాయామము చేసిన వెంటనే స్నానము చేయకుము. ప్రాణాయామానంతరము అరగంటసేపు విశ్రాంతి తీసికొనుము. సాధనాసమయమున చెమటపోసినచో, తువ్వాలతో తుడవవద్దు. చేతితో ఆరిపోవునంతవరకు రుద్దుము. అంతేగాని గాలికి ఆరిపోవులాగున వదలకుము.

31. రేచక పూరకములలో ఏమాత్రము శబ్దమునూ కానివ్వరాదు. భస్త్రిక, కపాలభాతి, శీతలి, సీత్కారి ప్రాణాయామములలో మాత్రము, కొద్ది శబ్దము కావచ్చును.

32. రోజుకు రెండు మూడు నిమిషముల చొప్పున ఒకటి రెండు రోజులు చేసినంతటిలోనే ఏ ఫలితములును కనిపించవు. రోజుకు 15 ని. లకు తక్కువ కాకుండ కొన్నాళ్ళవరకు చేయవలెను. రోజు కొకరకపు సాధనను చేయరాదు. ప్రతి రోజూ చేయుటకు కొన్ని సాధనలను నిర్ణ యించుకొని, వాటి యందే అభివృద్ధిలోనికి వచ్చుటకు ప్రయత్నించవలెను. తదితర సాధనలను ఏకొద్దిగానో ప్రతిరోజుగాని, అప్పుడప్పుడుగాని చేయుచుండవలెను. భస్త్రిక, కపాలభాతి, సుఖపూర్వక ప్రాణాయామములను నిత్యమూ చేయుచుంటివనుకొనుము. శీతలి, సీత్కారి ప్రాణాయామాదులను అప్పుడప్పుడు చేయవచ్చును.

33. పూరకమును 'నిశ్వాస'మనియు, రేచకమును 'ఉచ్చ్వాస' మనియు, కేవల కుంభకమును 'శూన్యక' మనియు, సరియగు కుంభకమును అభ్యసించుటను, 'అభ్యాసయోగ' మనియు, గాలిని త్రాగి జీవించుటను 'వాయుభక్షణ' అనియు అందురు. 34. 'శివయోగ దీపిక'ను రచించినవారు ప్రాణాయామమును మూడు రకములుగ వర్ణించిరి:

1. ప్రకృతి 2. వైకృతి 3. కేవల కుంభకము-అని.

"రేచక పూరకములు తమంత తామే, తమ సహజ రీతిని జరుగుచుండుటను ప్రకృత మందురు. శాస్త్రోక్త ప్రకారము రేచక పూరక కుంభక నియమములతో చేయునది కృతిమము గాన దానిని వైకృతి యందురు. ఈ రెండింటికి అతీతుడై రేచక పూరకములను ఆకస్మికముగ ఆపివేయ గలుగుటను కేవల కుంభకమందురు.

ప్రకృతి ప్రాణాయామము మంత్ర యోగమునకును, వైకృతి లయయోగమునకును సంబంధించినది!

35. శరీరము నిశ్చలముగా ప్రశాంతస్థితిలో వుండి ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేకుండా వుండుటను కుంభకమందురు. ఇట్టి స్థితియందున్న వాని స్థితి వినుటయందు చెవిటివానివలెను, చూచుటలో గ్రుడ్డివానివలెను వుండును!

36. పతంజలి, ప్రాణాయామమును గురించి ఎక్కువ శ్రద్ద చూపలేదు. "రేచకమును, పూరకమును నెమ్మదిగా చేయుము. కొంతసేపు గాలిని కుంభించుము. ప్రశాంతమైన నిలుకడగల మనస్సుగలవాడ నగుదువు" అని చెప్పెను. హఠయోగులే దీని నొక ప్రత్యేక శాస్త్రముగ వృద్ధిచేసి, అందరకు అనుకూలముగ వుండునటుల రకరకములగు ప్రాణాయామములను సృష్టించిరి.

37. "పులి లేక జింక చర్మము, అదిన్నీ లేనిచో నాల్గు మడతలు వేసిన జంబుఖానాను పరచుము. దానిపై తెల్లని గుడ్డనుపరచి, ఉత్తరముఖము గలవాడవై, ప్రాణాయామము చేయుటకు కూర్చొనుము." 38. కొందరు రేచక, పూరక, కుంభకములను, మరి కొందరు పూరక కుంభక రేచకములను వరుసగా చేసెదరు. వీటిలో రెండవ విధమునే ఎక్కువమంది చేసెదరు.

యాజ్య్ఞవల్కుడు 'పూరక, కుంభక, రేచకములను' క్రమముగ చెప్పెను. నారదీయములో రేచక, పూరక, కుంభకములను క్రమముగా చెప్పెను. ఈ రెండింటిని ఇచ్ఛానుసారము అభ్యసించ వచ్చును.

39. యోగి యగువాడు భయము, కోపము, సోమరి తనము, అతి నిద్ర, అతి మెలకువ, అతి తిండి, అతి ఉపవాసములు లేకుండ వుండవలెను. పై నియమములను పాటించుచూ ప్రతినిత్యము సాధన చేయుచున్నచో ఆధ్యాత్మిక సామ్రాజ్యము నిస్సందేహముగ మూడు మాసములలో లభించగలదు. నాల్గు మాసములలో దేవతలను చూడగలడు. అయిదు మాసములలో బ్రహ్మనిష్ఠుడు కాగలడు. ఆరు మాసములలో తన ఇచ్ఛాను సారము కైవల్య ప్రాప్తిని పొందగలడు. ఇం దేవిధమగు సంశయము లేదు.

40. ప్రారంభకుడు పూరక రేచకములను మాత్రమే కొన్నాళ్ళు చేయవలెను. కుంభకము చేయరాదు. అట్టి స్థితి యందు పూరక రేచకముల నిష్పత్తి 1:2 లో వుండవలెను.

41. ప్రాణాయామమును కూర్చొని, నిలబడి లేక నడచుచూ లేక పడుకొని ఏరీతిగా చేసినప్పటికి ఫలితముల నివ్వ గలదు. చెప్పిన విధానము ప్రకారము చేసినచో ఫలితములు త్వరగా కనిపించును.

42. కుంభకకాలమును క్రమక్రమముగ వృద్ధిచేయుము. మొదటివారము 4 సెకండ్లు, రెండవవారము 8 సెకండ్లు, మూడవవారము 12 సెకండ్లు ఈ రీతిని పెంచుకొనుచురమ్ము. నీ శక్తి ననుసరించి పెంచుకొనుచు రమ్ము.

43. యుక్తిని వుపయోగించుము. యుక్తి లేనిచో ఏమియులేదు. యుక్తి వున్నచోట సిద్ధి, భుక్తి ముక్తులుగలవు.

44. రేచక పూరక కుంభక పరిమాణములు, సాధనలో శ్రమగా తోచకుండు రీతిని వుండవలెను. సాధన మధ్యలో కొంచెము సేపుఆగి, చేయుదమని అనిపించులాగున వుండరాదు.

45. రేచకమును అనవసరముగ ఎక్కువ పొడగించకుము. అందువల్ల పూరకమును హడావిడిగా చేయవలసి వచ్చును. ఇందుచే క్రమము తప్పును.

46. సూర్యభేది, ఉజ్జయులు ఉష్ణమును కలిగించును. సీత్కారి, శీతలులు చల్లదనము నిచ్చును. భస్త్రిక శీతోష్ణములను సమానముగ వుంచును. సూర్యభేది వాతాధిక్యతను, తొలగించును. ఉజ్జయి శ్లేష్మాధిక్యతను, సీత్కారి శీతలులు పైత్యమును, భస్త్రిక యీ మూడింటి ఆధిక్యమును తగ్గించును.

47. సూర్యభేది, ఉజ్జయులను శీతాకాలమందును, సీత్కారి, శీతలులను ఎండాకాలమందును, భస్త్రికను అన్ని కాలములందును అభ్యసించవచ్చును. అతి ఉష్ణతత్వముతో కూడియుండు శరీరము గలవారు. శీతాకాలములో కూడ సీత్కారి, శీతలులను చేయవచ్చును.

48. జీవితముయొక్క లక్ష్యము ఆత్మజ్ఞానము. ఇది శరీర ఇంద్రియ సంయమము, సద్గురు సేవ, వేదాంత శ్రవణ, ఎడ తెగని ధ్యానముచే సిద్ధించును. నీవు అతిత్వరగా లక్ష్యమును చేరగోరుచో, ఆసన, ప్రాణాయామ, జప, ధ్యాన, స్వాధ్యాయాదులను, ప్రతినిత్యము క్రమప్రకారము చేయుచు బ్రహ్మ చర్య పాలనమును చేయవలెను.

"మనస్సును వశపరచు కొనుట,*[2] ఆత్మజ్ఞానము, సత్సంగము, వాననాపరిత్యాగము, ప్రాణమును వశపరచుకొనుట యివి ముక్తినిచ్చును." (ముక్తికోపనిషత్తు)

49. ఆసనము, ప్రాణాయామము, జపము, ధ్యానము, బ్రహ్మవిచారము, సత్సంగము, ఏకాంతము, మౌనము, నిష్కామకర్మ, యివన్నియు అధ్యాత్మికోన్నతికి ఆవశ్యకములని మరొకమారు చెప్పుచున్నాను. హఠయోగము లేకుండా చాలాకష్టపడిననే రాజయోగ సిద్ధి కలుగ గలదు. కుంభకముయొక్క అంతమున మనస్సును ఇంద్రియములనుండి మరల్చవలెను. క్రమక్రమముగ ఇందు సిద్ధి కలుగ గలదు.

50. వేదాంతగ్రంధ పఠనము మాత్రము చేయు కొందరు విద్యార్థులు, తాము జ్ఞానులమని భ్రమపడి ఆసన ప్రాణాయామాదులను త్యజించెదరు. వారుకూడ జ్ఞానయోగమునకు కావలసిన శమదమాది షట్సంపదలు లభించునంత వరకు ఆసనాదులను చేయవలెను.

51. నీ ప్రక్కన కూర్చొని నీకు ప్రతివిషయమును బోధించుటకు గాను గురువెవరూ లభించలేదని వ్యాకులపడ కుము. చెప్పిన ప్రకారము సక్రమముగా చేయుచున్నచో, ఏ విధమగు బాధయు రాదు. నిస్సంశయముగ జయమును పొందెదవు. ప్రారంభములో ఏవో స్వల్ప దోషములు వుండవచ్చును. అవి క్రమక్రమముగ పోవును. కావున ప్రతి స్వల్పవిషయమునకు భయపడి సాధనను మానివేయకుము. సాధనను శ్రద్దాభక్తులతో వెంటనే ప్రారంభించుము. క్రమము తప్పకుండ చేయుచుండుము. తప్పక యోగివి కాగలవు.

ఓం శాంతి: శాంతి: శాంతి: శాంతి:

____* * * ____

అనుబంధము

సౌర నాడీమండలిపై ధారణ

సౌరనాడీ మండలి ఒక ప్రధానమైన నరముల కూటమి. ఇది పొట్టకు పైభాగముననుండు గుంటకు వెనుకవైపుగా వుండును. మనుష్యుని ఆంతరికావయములన్నిటి పైన ఈ నాడీ మండలి ఆధిపత్యమును కలిగియున్నది. మనుష్యుని ఆ వేగములు శారీరక కృత్యములను వశపరుచుకొనుటలో యిది ప్రధాన పాత్రను వహించి యున్నది. ఈ మండలి తెల్లని బూడిద వన్నెగా గల మజ్జాపదార్థముచే చేయబడి యున్నది. ఈనాడీ మండలిపై తీవ్రమగు దెబ్బతగిలినచో, మనుష్యుడు స్పృహ తప్పి పడిపోవును. ఇది ప్రాణముండుచోటు, శక్తినిలయము. అది పదునారు ఆధారములందు ప్రధానమైనది. ఇచ్చట తీవ్రమగు దెబ్బ తగులుటచే చచ్చిన మనుజు లెందరో గలరు. ఇది

  1. * విపులముగా తెలసికొన గోరుచో నాచే రచింపబడిన "బ్రహ్మ చర్యము" చూడుడు.
  2. * దీనిని గురించి పూర్తిగా తెలసికొన గోరువారు నాచేరచింపబడిన 'ముక్తి మార్గము'ను చదువుడు.