Jump to content

ప్రాణాయామము/మూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

మూడవ ప్రకరణము

ప్రాణాయామ మంటే ?

‘తస్మిన్‌సతి శ్వాసప్రశ్వాసయో ర్గతివిచ్ఛేదః ప్రాణాయామః’

“శ్వాసను నియమించుట లేక వశపరచుకొనుట యన ఉచ్ఛ్వాసనిశ్వాసలను ఆపుజేయుట. ఇది ఆసనసిద్ధి కలిగిన పిదప సహజముగ సిద్ధించును.”

ప్రాణాయామమును గురించి పతంజలి యోగసూత్రములలో 2 అ. 49 సూత్రములో ఈ విధముగ వివరించబడి యున్నది.

‘శ్వాస’ యన లోపలికి పీల్చుగాలి, ‘ప్రశ్వాస’ యన బయటకు విడచుగాలి. ఆసనసిద్ధి కలిగిన పిమ్మట ప్రాణాయామమును అభ్యసించవచ్చును. ఒకే ఆసనములో కదలక మెదలక ఒకేసారిగ మూడుగంటలసేపు కూర్చొన గలుగుటయే ఆసనసిద్ధి. అరగంటనుండి గంటవరకు ఒకే ఆసనములో కూర్చొన గలిగినప్పటినుండి ప్రాణాయామము చేయుటను ప్రారంభించ వచ్చును. ప్రాణాయామము చేయకుండ ఆధ్యాత్మిక సాధనలో జయము పొందుట చాల కష్టము. విడిగా చూచినచో ప్రాణము వ్యష్టి రూపము గలది. జగత్ప్రాణమును హిరణ్యగర్భ మందురు. దానినే సమష్టి ప్రాణమని కూడ చెప్పెదరు. ఒకే నిప్పుపుల్లను వ్యష్టి యందురు; నిప్పుపెట్టెను అంతనూ సమష్టియందురు. ఇదేరీతిని ఒక మామిడికాయను వ్యష్టి యనియు, మామిడికాపును అంతటిని సమిష్టియనియు అందురు. శరీరమునకు గల శక్తియే ప్రాణము. ఊపిరితిత్తులయొక్క చలనమును లేక శ్వాస ప్రశ్వాసేంద్రియములను వశపరచుకొనుటవల్ల, లోపల ప్రసరించుచున్న ప్రాణ శక్తి వశపడును. ప్రాణము వశపడుటచే మనస్సులోబడును. ప్రాణము మనస్సులు, పక్షి, తాడులాటివి. త్రాటితో కట్టి వేయబడిన పక్షి తప్పించుకుపోవలెనని యిటు అటు ఎగిరి చివరకు తప్పనిసరిగా, తాను కట్టివేయబడిన చోటునకే తిరిగివచ్చి ఏవిధముగా విశ్రమించునో, అదేవిధముగ ఈమనస్సు అనెడి పక్షి అనేకవిధములగు యింద్రియవిషయములకై పరుగులిడి, ఎందునను సుఖము గానక, చివరకు రాత్రిసమయమున తన విశ్రాంతి స్థానమగు ప్రాణమును చేరుచున్నది.

___________

ప్రాణాయామము

(గీత ప్రకారము)

   అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపాన: తథాపరే
   ప్రాణాపానగతీ రుధ్వా ప్రాణాయామ పరాయణా:
                      (గీత 4 అ 29 శ్లో)

ప్రాణాయామము ఒక పవిత్రమైన యజ్ఞము. కొందరు పూరక కుంభకమును (ప్రాణవాయువుతో నింపుట), కొందరు రేచక కుంభకమును (గాలిని పూర్తిగా బయటకు విడచి కుం భించుట), కొందరు ఉచ్ఛ్వాస నిశ్వాసలు రెండింటిని ఆపుజేసి కుంభించుటలను చేతురు. వీటినే పూర్ణకుంభకము, శూన్య కుంభకము, కేవలకుంభకము అందురు.

____

ప్రాణాయామము

(శంకరుని ప్రకారము)

"మనస్సువలె సమస్తమును బ్రహ్మమేయనియు, ఈ జగత్తు అంతయు శూన్యమే అనియు గుర్తించుట రూపముగ, సమస్త ప్రాణశక్తులను వశపరుచుకొనుటయే ప్రాణాయామము"

"బయటకు విడచుగాలి జగత్తుయొక్క అభావమును సూచించును. లోపలికి పీల్చుగాలి నేను బ్రహ్మను అను భావమును సూచించును.

"ఆ పిమ్మట చేయు శ్వాసావరోధము నేను బ్రహ్మను అను భావమును ధృవపరచును. బుద్ధిమంతుడగువాడు ప్రాణాయామమును యీ విధముగా తెలసికొనును. ఇటుల తెలిసి కొనని వాడు మూర్ఖుడు."

(అపరోక్షాను భూతి 118 - 120)

_____ _____

ప్రాణాయామము

(యోగి భుశుండుని ప్రకారము)

భుశుండుడను యోగి వశిష్ఠునకు యీరీతిని చెప్పెను:- పంచభూతములచే చేయబడిన యీదృశ్య శరీరములోగల హృదయ పద్మములో - ప్రాణము, అపానము అను రెండువాయు వులు గలవు. ఈ రెండు వాయువులు అల్పస్థాయి హెచ్చుస్థాయిలలో పైకి క్రిందికి వీచుచుండును. ఇవి రెండూ మెలకువ యందును, స్వప్నావస్థయందును, స్వప్న రహితమగు నిద్రావస్థయందును ఒకే స్వభావము కలిగి యుండి అంతటను వ్యాపించి యుండును. ఈ వాయువులు రెండింటి సంచారము ననుసరించి నేను నడచుకొనుచూ వాసనల నన్నింటిని నాశనమొనర్చుకొనిన వాడనై, స్వప్నరహిత నిద్రావస్థలో ఏ విధముగ ప్రశాంతుడనై వుందునో, అదే రీతిని జాగ్రదవస్థ యందుకూడ ఏ విధమగు వికారములు లేనివాడనై యున్నాను. ఒక తామర తొడిమను తీసికొనుము. దానిని వెయ్యి భాగములు చేయుము. దానిలో అనగా అంత సూక్ష్మభాగములోకూడ ఈ రెండు వాయువులు అంతకంటె సూక్ష్మరూపములో వుండును. కావున ఇట్టి సూక్ష్మాతి సూక్ష్మముగా వుండు యీ వాయువుల యొక్క తత్వమును గాని. వాటి ప్రవాహములను గురించి గాని తెలిసికొనుట చాల కష్టము. వీటిలో ప్రాణము ఎల్లప్పుడు పైవైపునకు (బయటగాని, లోపలగాని) ప్రవహించు చుండును; అపానము శరీరమునకు బయటను లోపలను క్రిందివైపుకు పోవుచుండును. ఇది వీటి సహజలక్షణము. ప్రాణవాయువు సాధారణముగ 16 అంగుళముల పొడవు బయటకువిడచి, పండ్రెండు అంగుళముల పొడవువరకు లోపలకు పీల్చెదరు. అందుకు మారుగా 16 అంగుళముల గాలిని విడచి, మరల 16 అంగుళముల గాలిని పీల్చు చుండవలెను. ఇది లాభకారి. ఉచ్ఛ్వాసనిశ్వాసల ప్రమాణమును సమాన మొనర్చుకొన గలిగినవాడు బ్రహ్మానందమును అనుభవించగలడు.

శ్వాసావరోధము

ఆసన సిద్ధిని పొందుట లేక శరీరమును వశపరుచుకొనుట అనునది మొట్టమొదటి ముఖ్యవిషయము. ఆ తరువాత ప్రాణాయామమును అభ్యసించవలెను. ప్రాణాయామ సాధనలో విజయము పొంద గోరుచో సరియగు ఆసనమున కూర్చొన గలుగుట అవశ్యకము. సులభముగను సుఖముగను కూర్చొను ఏ పద్ధతినైన ఆసనము అనవచ్చును. ఇట్టి వాటిలో చాలసేపటి వరకు ఏవిధమగు బాధయు లేకుండ కూర్చొన గలుగు ఆసనము శ్రేష్ఠమైనది. ఱొమ్ము, మెడ, తల, ఇవి నిలువుగ వంకర లేకుండ గీసిన గీతవలె వుండవలెను. శరీరము ఏమాత్రము వెనుక ముందులకు గాని, ప్రక్కలకు గాని వాలి వుండరాదు. వంగి కూర్చొనరాదు. ముడుచుకొని వుండరాదు. ఈ విధముగ కూర్చొనుటను అనేకమారులు అభ్యసించినచో ఆసన సిద్ధి వచ్చును. బొద్దు(లావు)గా వున్నవారికి పద్మాసనము కష్టముగా తోచవచ్చును. అట్టివారు 'సుఖ' లేక 'సిద్ధాసనము'లో కూర్చొనవచ్చును. ఆసన సిద్ధి లభించునంతవరకు ప్రాణాయామము చేయకుండ వుండనక్కరలేదు. ఆసనము, ప్రాణాయామము రెండింటిని ఒక దానితో పాటు మరొకదానిని అభ్యసించవచ్చును. కొంతకాలమునకు రెండింటియందును నీకు పూర్ణత్వము ప్రాప్తించును. కుర్చీలో నిలువుగా కూర్చొనికూడ ప్రాణాయామమును చేయవచ్చును.

భగవద్గీతలో ఈ ఆసనమును గురించి చక్కగా వివరింపబడినది:- పరిశుద్ధమైన ఏకాంత ప్రదేశములో, మిక్కిలి ఎత్తును మిక్కిలి పల్లమునుగాని పీటమీద దర్భాసనమువేసి, దానిపైన పులి లేక జింక చర్మమును, దానిపైన గుడ్డనువేసి, దానిపై కూర్చొని చిత్తమును ఇంద్రియములను వశపరచుకొని ఏకాగ్రమగు మనస్సుతో అంత:కరణ శుద్దికొరకు యోగాభ్యాసమును చేయవలెను. అప్పుడు శరీరమును, శిరస్సును, కంఠమును స్థిరముగా నిలిపి, కదలక, దిక్కులు చూడక, నాసికాగ్రమును జూచుచూ వుండవలెను.

(6 అ. 10, 11, 12 శ్లో.)

ప్రాణాయామము అన ప్రాణమును, శరీరమందలి ప్రాణ శక్తులను వశపరచుకొనుట. శ్వాసను క్రమబద్ధ మొనర్చుట. ఇది చాల ముఖ్యమగు మెట్టు. ప్రాణాయామముచే శ్వాసను వశపరచుకొనవచ్చును. అందువలన ప్రాణశక్తి కంపనములు, సాధనకు వశపడును. శ్వాస అనునది స్థూల ప్రాణముయొక్క బాహ్యరూపము. ప్రాణాయామము చేయుటచే, సరియగు రీతిని గాలిని పీల్చుట విడచుటలను నేర్చుకొనవలెను. ఇటుల చేయని వారి శ్వాసోచ్చ్వాసలు సరియగు రీతిని వుండవు.

ప్రాణమును వశపరుచుకొన గలిగినవాడు సృష్టియందలి మానసిక శారీరక శక్తులను అన్నింటిని వశపరుచు కొనగలడు. ఇతనికి సృష్టిలో వశము కాని విద్యుచ్ఛక్తి మొ. నవి కూడ పదార్థము ఏదియు లేదు.

ప్రాణమును లోబరుచు కొనుటచే మనస్సులోబడును. మనస్సు లోబడుటవలన శ్వాస లోబడును మనస్సును ప్రాణమును వశపరుచు కొనుటవలన జనన మరణ చక్రమునుండి విడిపింప బడినవాడై అమరత్వమును పొందును. మనస్సు, ప్రాణము. వీర్యములకు చాల దగ్గరి సంబంధము గలదు. ఇందులో ఏ ఒక్కటి వశపడినప్పటికి తక్కినవి కూడ వశపడును. ప్రాణాయామ సాధనచే ఆకలి, జీర్ణశక్తి, ఆనందము, బలము, ధైర్యము, ఉత్సాహము, చక్కని ఆరోగ్యము, పుష్టి, శక్తి, ఏకాగ్రతలు లభించును.

యోగి యగువాడు తన ఆయువును సంవత్సరములతో లెక్కించడు; అతని శ్వాసతో లెక్కించును. ఈ బాహ్య ప్రకృతినుండి నీవు పీల్చుగాలితో కొంతశక్తిని తీసికొందువు. దీర్ఘముగా గాలిని బయటకు విడచిన పిదప మరల అంత దీర్ఘముగా గాలినిపీల్చుటయే, మనుజుడు బాహ్యప్రకృతినుండి శక్తి కొలది తీసికొన గలిగిన ప్రాణశక్తియొక్క అత్యధిక ప్రమాణము. నిమిషమునకు 15 మారులు మనుష్యుడు శ్వాసించును. ఆ ప్రకారము రోజుకు 21,600 మార్లు శ్వాసించుచున్నాడు

రకరకములగు ప్రాణాయమములు

"బాహ్యాభ్యంతర స్తంభవృత్తి: దేశకాల సంఖ్యాభి: పరిదృష్టో దీర్ఘాత్ సూక్ష్మాత్"

యొగసూత్ర - 2 అ 50 సూ.

ప్రాణాయామము దీర్ఘముగాని సూక్ష్మముగాని మూడు అంగములు గలదిగా వున్నది. 1. బాహ్యము 2. ఆంతరికము 3. స్థంభము, అని. స్థలము, కాలము, సంఖ్యలపై ఇది ఆధారపడియున్నది.

గాలిని బయటకు విడచుటను రేచకము అందురు. ఇది మొదటి ప్రాణాయామము. గాలిని లోపలికి పీల్చుట రెండవది. గాలిని విడువకను, పీల్చకను లోపల ఆపుచేసి వుంచుట (కుంభకము) మూడవది కుంభకము ఆయు:ప్రమాణమును పెంచును. అంతరిక ఆధ్యాత్మిక శక్తులను, బలమును, శక్తిని, పుష్టిని పెంపొందింపజేయును. నీవు ఒక నిమిషముసేపు వాయువును కుంభించ గలిగినచో, నీ ఆయువును ఒక నిమిషము అధికము చేసి కొంటివని అర్థము. యోగులగువారు ఈ వాయువును తల యొక్క ఉపరిభాగమున గల, బ్రహ్మరంధ్రమువద్దకు తీసికొని పోయి, యముని ఓడించి మరణమును లేకుండ చేసికొందురు. కుంభకమును అభ్యసించుటవల్ల చాంగదేవుడు 14 వందల సంవత్సరములు జీవించెను. ఈ త్రివిధ ప్రాణాయామములు (రేచక, పూరక, కుంభకములు) స్థల, కాల, సంఖ్యాభేదములపై ఆధారపడివున్నవి. స్థలముఅన, శరీరమునకు బయట, లోపల అనియు, శ్వాసయొక్క పరిమాణముఅనియు, ఒకానొకస్థలమున (శరీరములో) ఆపుజేయబడిన ప్రాణము అనియు అర్థము. గాలిని బయటకువిడచు పరిమాణము, ఒక్కొక్క వ్యక్తియందు ఒక్కొక్క విధముగవుండును. అ దేరీతిని, లోపలికిపీల్చు గాలికూడ ఆ సమయమున వుండు ప్రధానతత్త్వము ననుసరించికూడ ఈశ్వాస యొక్క పరిమాణము మారుచుండును. పృథ్వి, అప్, తేజ, వాయు ఆకాశతత్వములలో శ్వాస వరుసగ 12, 16, 4, 8, 0 ల వ్రేలి అడ్డపుపొడవుల పరిమాణము కలిగివుండును. బయటకు విడచునప్పుడు బయటను, లోపలికి పీల్చునప్పుడు లోపలను ఈ ప్రకారము మరలకూడ అదేవిధముగ వుండును.

కాలపరిమాణమును 'మాత్ర' యను కాలపరిమితిచే లెక్కించెదరు. ఈ 'మాత్ర' యను కాలపరిమితి ఒకసెకండుకు సమానముగవుండును. 'మాత్ర' యను మాటకు కొలత అని అర్థము. ఒకస్థలమున ఎంతవరకు ప్రాణమును ఏకాగ్రముగ నిలిపెదమో, ఆ కాలపరిమితినికూడ 'మాత్ర' యని వాడెదరు.

'సంఖ్య' యన ప్రాణాయామమును ఎన్నిమారులు చేయుదుమో లెక్కించుట. యోగసాధకులు ఒక్కొక్క పర్యాయము 80 ప్రాణాయామములు చేయగలుగు నంతవరకు క్రమక్రమ ముగ అభ్యసించవలెను. రోజుకు నాల్గు పర్యాయములు అన ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి 9 గం.లకు లేక అర్థరాత్రివేళయందు ప్రాణాయామమును చేయుచుండవలెను. ఇటులచేయుటచే రోజుకు 320 ప్రాణాయామములు చేసినట్లగును. ప్రాణాయామమువల్ల కలుగు ఫలము, నిద్రించుచున్న కుండలినీశక్తి మేల్కొనుటయే. ప్రాణాయామము యొక్క ప్రధానాశయము, ప్రాణమును అపానముతో ఐక్య పరచి, ఇటుల ఐక్యమైన ప్రాణాపానములను మెల్లమెల్లగా తల వైపుకు పంపుటయే.

సమస్తవిధములగు గుప్తమహిమలు, కుండలినీశక్తివల్లనే లభించును. అభ్యసించుకాలము ననుసరించి, దీర్ఘము, హ్రస్వము అని ప్రాణాయామము రెండు విధములు. కాలియున్న పెనముపై నీటిబొట్టు వేసినచో అటుయిటు చిటపట మనుచు ఎగిరి పొవును గదా! అదేరీతిని గాలి కూడ అటుయిటు సంచరించు చుండ (స్వేచ్ఛగ) గాలిని కుంభకమువల్ల, దాని యిచ్ఛవచ్చిన రీతిని పోకుండులాగున చేసినచో, అది లోపలనే ఆగిపోవును.

వాచస్పతి దీనిని గురించి యీరీతిని వర్ణించెను:- "36 మాత్రల పరిమాణముగల మొదటి ప్రయత్నమును సాధారణమనియు, దీనికి రెట్టింపు పరిమాణముగల రెండవ ప్రయత్నమును మధ్యమము అనిన్నీ, దీనికి మూడురెట్లు పరిమాణము గల మూడవ ప్రయత్నమును తీవ్రమనిన్నీ - యీ రీతిని ప్రాణాయామమును సంఖ్యచే గణించెదరు.

బయటకు విడచు గాలి యొక్క దూరము (స్థలము) ముక్కు పుటమునకు పండ్రెండు అందుళములు వుండును. దీనిని ఒక దూదిపింజ లేక రెల్లుగడ్డి సహాయముచే కనుగొన వచ్చును. లోపలికి పీల్చుగాలి యొక్క దూరము (స్థలము) తలనుండి అరకాలి వరకు వుండును. దీనిని చీమలాటి జీవిని తాకుటచే కలుగు స్పర్శ జ్ఞానమువల్ల తెలసి కొన వచ్చును. శ్వాస ప్రశ్వాసల బాహ్యాభ్యంతర దూరములను అనుసరించి, కుంభకము యొక్క దూరము [స్థలము] వుండును. ఏలనన, ఈ శ్వాసపై రెండుస్థలములందును ఆగ గలిగియున్నది. ఇది దానిధర్మము. పైన సూచించిన రెండునూ లేకుండ పోయి నప్పుడు దీనిని గురించి తెలసి కొన గలము.

కాలము, స్థలము, సంఖ్య - అను మూడు రకములగు ప్రాణాయామ విధానములు ఐచ్చికములు మాత్రమే, అనేక స్మృతులు ఈ మూటికిని ప్రాధాన్యతను యివ్వక, కాలమునకు మాత్రమే ప్రాధాన్యమును ఇచ్చినవి. అందు వలన వీటిని గురించి ఎక్కువ బాధపడనక్కర లేదు.

నాల్గవది శ్వాసను బంధించుట, (బయటగాని, లోపల గాని):-

"బాహ్యాభ్యంతర - నిశ్యక్షేపి - చతుర్థ:

యోగసూత్ర - 2 అ.

యొగసూత్రములలో 50 వ సూత్రములో చెప్పబడిన మూడవ మాదిరి ప్రాణాయామము, మొదటి ఉద్ఘటావస్థ ప్రాప్తించు నంతవరకే చేతురు. ఆ తరువాత ఈ నాల్గవ మాదిరి ప్రాణాయామమును చేయవలెను. ఈ స్థితిలో సాధకుడు తన ప్రాణము శరీరమున గల అనేక చక్రములపై ధారణ చేయునటుల క్రమ క్రమముగ అభ్యసించి, చివరకు తలలో గల సహస్రారముపై ధారణ చేయునటుల చేయును. అతనికి పూర్ణ సమాధి సాహస్రారములో సిద్థించును. ఇది ఆంతరిక విధానము. ఇక బాహ్యవిధానము; ఏ తత్త్వమున ప్రాణ వాయువు ఎంతదూరమువరకు పోవునో అంతదూరమున ధారణ చేయవలెను. ఈ రీతిని అంతరికముగను, బాహ్యముగను ప్రాణ ధారణ చేయవచ్చును.

క్రమముగ మొదటి మూడు విధములగు ప్రాణాయామములను చక్కగా అభ్యసించి, విజయప్రాప్తి పొందిన పిమ్మట నాల్గవమాదిరి ప్రాణాయామము సహజముగ అలవడును. మూడవ రకపు ప్రాణాయామములో పరిమాణమును గురించి ఎక్కువ శ్రద్ధవహించ నక్కరలేదు. ఈ స్థితిలో మొట్టమొదటి సారిగనే శ్వాసావరోధము చేయగలుగును; అప్పుడు స్థల కాల సంఖ్యలను దీర్ఘ సూక్ష్మభేదములచే లెక్కించెదరు. కాని, నాల్గవరకపు ప్రాణాయామములో శ్వాసప్రశ్వాసలయొక్క పరిమితులు నిశ్చితమై వున్నప్పటికీ, భిన్నభిన్న దశలలో ఒక్కొక్కటిగ క్రమప్రకారము జయమునుసంపాదించుకొనుచు రావలెను. అంతేగాని, మూడవరకపు ప్రాణాయామములో వలె మొదటి ప్రయత్నములోనే అన్నిదశలయందు జయప్రాప్తి కలుగదు. అటుల అభ్యసించుట కూడ అపాయకారియే, అదిన్నీగాక, ఒక మెట్టుతరువాత మరొకమెట్టుగా ఎక్కుటకుగల కారణము మరొకటి గలదు. అదేదన, యితనికి ఒక్కొక్క చోట ధారణ చేయుటచే ఒక్కొక్కరకపు సిద్ధి లభించును. కావున ఒక్కొక్క దశ సిద్ధించిన పిదప, మరొక దశ సిద్ధించుటకై సాధన చేయ వలెను.

ఇక మూడవ నాల్గవ రకపు ప్రాణాయామములో గల భేదమేదన, మూడవ రకపు ప్రాణాయామములో స్థల, కాల, సంఖ్యాగణనలేదు. అంతేగాక, ఒకేవిధపు ప్రయత్నముతోనే అది సిద్ధించును. కాని, నాల్గవ దానిలో స్థల, కాల, సంఖ్యా గణన వుండుటయేగాక, ఒకదాని తరువాత ఒకటిగా ప్రతిదశ యందును సిద్ధి పొందుచూ రావలెను. ఇందువల్ల భిన్నభిన్న మహిమలు లభించును.

త్రివిధ ప్రాణాయామములు

అధమము, మధ్యమము, ఉత్తమము, అని ప్రాణాయామములు మూడువిధములు. అధమము 12 మాత్రలు, మధ్యమము 24 మాత్రలు, ఉత్తమము 32 మాత్రల పూరక కాల పరిమితిని కలిగి వుండును. పూరక కుంభక రేచకముల నిష్పత్తి 1:4:2 గా వుండవలెను. పూరకము అన, గాలిని పీల్చుట, కుంభకము అన, గాలిని లోపల ఆపుజేయుట. రేచకము అన, గాలిని బయటకు విడచుట అని అర్థము. 12 మాత్రల కాలము పూరకము చేసినచో, 48 మాత్రల కాలము కుంభకమున్నూ, 24 మాత్రల కాలము రేచకమున్నూ చేయవలెనని పై దాని అర్థము. ఇది అధమ ప్రాణాయామము. తతిమ్మా రెండు ప్రాణాయామములకు కూడ ఈ నియమమే వర్తించును.

మొట్టమొదట అధమ ప్రాణాయామమును ఒక మాసము రోజులు అభ్యసించును. మధ్యమ ప్రాణాయామమును ఆతరువాత మూడు మాసముల వరకు అభ్యసించుము. అటు పిమ్మట ఉత్తమ ప్రాణాయామమును మొదలిడుము.

ఆసనములో కూర్చున్న వెంటనే, నీ గురువునకున్నూ, శ్రీ గణేశునకున్నూ నమస్కారము చేయుము. ప్రాణాయామాభ్యాసము చేయుటకు ఉదయం 4 గం; 10 గం; సాయంత్రం గం 5; రాత్రి గం 10; 12 గం ల సమయములు తగినవి. నీవు ఉచ్చస్థితికి రాగానే రోజుకు 320 ప్రాణాయామములను చేయుచుండ వలెను. సగర్భ ప్రాణాయామము అనున దొకటి గలదు. ఈ ప్రాణాయామములో, ప్రాణాయామముతో పాటు మానసికముగ గాయత్రి లేక 'ఓం' మంత్రజపము చేయుదురు. ఈప్రాణాయామము అగర్భ ప్రాణాయామము(మంత్రజపము లేకుండ చేయు ప్రాణాయామము) కంటె నూరురెట్లు లాభకారి. ప్రాణాయామసిద్ధి, సాధకుని ఉత్సాహము, సాహసము, పట్టుదలపై ఆధారపడి వుండును. ఈ లక్షణములు గలవానికి 6 మాసములలో సిద్ధి ప్రాప్తి కలుగును. సోమరి పోతు, బద్ధకస్తుడుగావుండి సంశయ గ్రస్తుడగు వానికి 8, 10 సంవత్సరములకు కూడ ఏ విధమగు అభివృద్ధియు కనుపించదు. కావున, పట్టుదల, ఓర్పు, విశ్వాసము, శ్రద్ధ, ఉత్సాహములు కలవాడవై పాటుపడుము. నీకు తప్పక విజయప్రాప్తి కలుగును.

వేదాంతుల కుంభకము

ఏవిధమగు చాంచల్యము లేకుండ ప్రశాంతమగు మనస్సుతో ప్రాణాయామమును అభ్యసించవలెను. శ్వాసప్రశ్వాసలను రెంటిని నిరోధించవలెను. బ్రహ్మానుసంధానమే తన జీవిత లక్ష్యముగా ఎంచవలెను. బాహ్యవస్తు త్యాగమును రేచకమందురు. ఆధ్యాత్మికజ్ఞానము, శాస్త్రజ్ఞానము లేక అట్టి విషయములనుగురించి తెలిసికొనుటలను పూరకమందురు. చిత్తమును ఈ విధమగు సాధనలను చేయులాగున చేయువాడే ముక్తుడు. మనస్సును పరమశివునిపై నిలుపుటయే కుంభకము. ఈ కుంభకము ప్రాణాయామకుంభకమువల్ల చక్కగా సిద్ధించును. ఇందువలన మొట్టమొదట బ్రహ్మగ్రంథి వద్ద మార్గమేర్పడును. అచ్చటినుంచి విష్ణుగ్రంథి, విష్ణుగ్రంథినుండి రుద్ర గ్రంథివరకు మార్గమును చేసికొని ముక్తుడై సుఖలాభమును యోగించువాడు అనుభవించును. ఇట్టి స్థితి అనేక జన్మలలో చేసిన యజ్ఞయాగాదులు, గురుకృప, దైవకృప, యోగ సాధనలచే లభించును.

నాడీ శుద్ధి కొరకు

మాలిన్యముతో నిండియున్న నాడులలోనికి వాయువు చొరజాలదు. కావున మొట్టమొదట వీటిని శుభ్రపరచి, ఆపైన ప్రాణాయామమును అభ్యసించవలెను. నీడీశుద్ధికి సమాణుపు, నిర్మాణుపు అను రెండుమార్గములు గలవు. సమాణు విధానమునే బీజాక్షర మంత్రజపమనిన్నీ, నిర్మాణ విధానమును షట్కర్మానుష్ఠానమనిన్నీ అందురు.

1. పద్మాసనములో కూర్చొనుము. వాయువుయొక్క బీజాక్షరమగు పొగలాటి రంగుగల 'వం' ను ధ్యానించుము. ఎడమ ముక్కుతో గాలిని పీల్చుచూ 16 మారులు ఆ బీజాక్షరమును జపించుము. (ఇది పూరకము) తరువాత 64 మారులు ఆ బీజాక్షరమును జపించునంతవరకు గాలిని లోపలబంధించుము (కుంభకము) ఆ పిమ్మట 32 మార్లు ఆ బీజాక్షరమును జపించుచూ, అన 32 మార్లు జపించుట పూర్తియగు నంతవరకు, గాలిని బయటకు విడువుము (రేచకము)

2. బొడ్డు అగ్ని తత్త్వమునకు అధిష్ఠానము. ఈ అగ్ని తత్త్వముపై ధ్యానము చేయుము. కుడి ముక్కుతో అగ్ని బీజాక్షరమగు 'రం' ను 16 మారులు జపించుట అగునంత వరకు గాలిని పీల్చుము. ఆ పిమ్మట 64 మారులు జపించునంత వరకు కుంభకము చేయుము. 32 మారులు జపించుట అగునంతవరకు గాలిని విడుచు చుండుము. '(ఎడమ ముక్కుతో)'

3. ముక్కు పుటమువద్ద దృష్టిని నిలుపుము. ఎడమ ముక్కుతో 16 మారులు 'తం' అను బీజాక్షరమును జపించు నంత వరకు గాలిని పీల్చుము.

64 మారులు జపించునంతవరకు గాలిని లోపలఆపుము. ఈ కుంభక సమయములో చంద్రనాడిగుండా అమృతము శరీర మందలి అన్ని నాడులలోనికి ప్రవహించి, శరీరమునంతటిని పరి శుద్ధ పరచుచున్నదని భావించుము. ఆ తరువాత 32 మారులు 'అం' బీజాక్షరము (పృథ్వీబీజము) జపించునంతవరకు కుడిముక్కుతో గాలిని విడువుము.

పై మూడు రకములగు ప్రాణాయామములు నాడీశుద్ధిని బాగుగా కలిగించును.

ప్రాణాయామ సమయమున మంత్రజపము

ప్రాణాయామ సమయమున మంత్రజపము చేయుటను గురించి ఈశ్వర గీతలో యీ విధముగా చెప్పబడివున్నది:- సప్తవ్యాహృతులతో గూడిన గాయత్రీ మంత్రమును ఆద్యంతముల యందు ఓం కార సహితముగ, ప్రాణమును నియమించి జపించినచో అదియొక ప్రాణాయామమగును.

ఓం భూ: ఒం భువ:, ఓగ్‌ం సున:, ఓం మహ:, ఓం జన:, ఓం తప: ఓగ్‌ం సత్యం. ఇవి సప్తవ్యాహృతులనబడును. గాయత్రీ మంత్ర శిరస్సును గూడ, జివర చెప్పవలయును.

ఓం అపోజ్యో తీరసో బ్రహ్మ భూర్భువస్సువరోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో, ఇది శిరస్సు, యాజ్ఞ వల్కయోగి దీనినిగురించి యీ రీతిని చెప్పెను:-

ఉచ్చ్వాస నిశ్వాసలను రెండింటిని నిరోధించి మాత్రా పరిమితి గల 'ఓం'కార స్మరణతో శ్వాసను నియమించుటను అభ్యసించవలెను. 'ఓం'కారము పరమ హంస సన్యాసులకు మాత్రమే నిర్ణయింపబడి యున్నది. స్మృతులతో ఉచ్చ్వాస నిశ్వాసాదులను బొడ్డు, హృదయము, నుదుటిపై ధారణ చేయుచూ, ఆ స్థలములందు వరుసగ బ్రహ్మ, విష్ణు, శివులను ధ్యానించుచూ ప్రాణాయామము చేయవచ్చునని కలదు. ఇది సాధారణ జనులకు కాని పరమ హంస సన్యాసులకు బ్రహ్మ ధ్యానము ఒక్కటే నిర్ణయింపబడినది. దీనినే శ్రుతులలో "ఆత్మ సంయమము గల సాధకుడు పరబ్రహ్మపై ఓం కార జపముచే ధారణ చేయవలెను." అని గలదు.

1 వ అభ్యాసము

పద్మాసనములో కూర్చొనుము. కండ్లు మూయుము. రెండు కనుబొమల (త్రికుటి) మధ్య ధారణ చేయుము. కుడి ముక్కును కుడిబొటనవ్రేలితో మూయుము. నీకు సులభముగను శ్రమలేకుండగను వుండునంత సేపటివరకు నెమ్మదినెమ్మదిగా ఎడమ ముక్కుతో గాలిని పీల్చుము. ఆ పిమ్మట చాల నెమ్మదిగా అదే ముక్కుతో గాలిని విడువుము. ఈ రీతిని పండ్రెండు మార్లు చేయుము. ఇది ఒక మెట్టు లేక చుట్టు. ఆ పిదప ఎడమ ముక్కును కుడిచేతి చిటెకెన వుంగరపు వ్రేళ్ళతోమూసి, కుడిముక్కు గుండా మెల్ల మెల్లగా గాలిని పీల్చి, తరువాత అదేముక్కుతో గాలిని బయటకు విడువుము. ఈ విధముగ పండ్రెండుమార్లు చేయుము. ఇది ఒక మెట్టు లేక చుట్టు.

గాలి పీల్చునప్పుడు గాని, విడచునప్పుడుగాని శబ్దము కారాదు. సాధనాసమయమున నీ ఇష్టదేవతను స్మరించుము. సాధన మొదలిడిన రెండవవారములో రెండుచుట్లును, మూడవవారములో మూడుచుట్లును చేయుము. ఒక్కొక్క చుట్టు పూర్తిఅయిన పిదప, రెండుమూడు నిమిషములసేపు విశ్రాంతి తీసికొనుము. ఒకచుట్టుకాగానే కొన్ని సాధారణ శ్వాసోచ్ఛ్వాసలు జరుపుటచే నీకు తగిన విశ్రాంతి లభించగలదు. ఈ అభ్యాసములో కుంభకములేదు. నీశక్తి ననుసరించి ఎక్కువచుట్లు చేయవచ్చును.

2 వ అభ్యాసము

నెమ్మదిగా రెండు ముక్కులతోను గాలిని పీల్చుము. గాలిని ఆపవద్దు. అటుపిమ్మట నెమ్మదిగా గాలిని విడువుము. ఈ విధముగా 12 మార్లు చేయుము. ఇక్కడికి ఒక చుట్టు అగును. నీ వీలు, శక్తి ననుసరించి 2, 3 చుట్లువరకు చేయవచ్చును.

3 వ అభ్యాసము

ఆసనములో కూర్చొనుము. కుడిముక్కును కుడి బొటన వ్రేలితో మూయుము. ఆ పిదప ఎడమముక్కుతో నెమ్మదిగా


(*71*పేజిలో) మంత్రజపమును గురించి పూర్తిగా తెలసికొనగోరువారు నాచే రచింపబడిన 'జపయోగము' చదువుడు. గాలిని పీల్చుము. అటుపైన, ఎడమ ముక్కును కుడి ఉంగరపు చిటికెన వ్రేళ్ళతో మూసి, కుడి ముక్కుగుండా గాలిని విడువుము[నెమ్మదిగా].

ఆ పిదప నీవు పీల్చ గలిగినంత సేపు కుడిముక్కుతో గాలినిపీల్చి, ఎడమ ముక్కుతో గాలిని విడువుము. ఈ రీతిని పండ్రెండు మారులు చేయుము. ఒక చుట్టు అగును. దీనిలోకూడ కుంభకము లేదు.

4 వ అభ్యాసము

అ, ఉ, మ - అను మూడు అక్షరములకు మూలము ఒకే ఒక అక్షరమగు 'ఓం' అని ధ్యానించుము. 16 సెకండ్లు(మాత్రలు) సేపు ఎడమ ముక్కుగుండా గాలిని పీల్చుచూ 'అ' ను ధ్యానించుము. ఆ పిదప గాలిని 64 మాత్రలు (శెకండ్లు) సేపు కుంభించి ఆ సమయమును 'ఉ' ను ధ్యానించుము. ఆ పైన 32 సెకండ్ల సేపు 'మ్'ను ధ్యానించుచూ గాలిని కుడి ముక్కుతో విడువుము. పై విధముగా చాలసార్లు చేయుము. మొదట 2,3 సార్లుచేసి క్రమక్రమముగ 20, 30 మార్లు నీశక్తి ననుసరించి చేయుచుండుము. ప్రారంభములో పూరక కుంభక రేచకముల నిష్పత్తి 1: 4: 2 వుండనిమ్ము. క్రమ క్రమముగ ఈమూడును 16: 64: 32 నిష్పత్తిలో వుండు నంతవరకు పెంచుకొనుచు రమ్ము.

దీర్ఘ శ్వాసాభ్యాసము

ప్రతి దీర్ఘ శ్వాసాభ్యాసమునందు ముక్కుతో నిండా గాలిని పీల్చుటయు, నెమ్మదిగ గాలిని పూర్తిగా *విడచుటయు ఆవశ్యకము. నీవు నెమ్మదిగా పీల్చగలిగినంత సేపటివరకు గాలిని పీల్చుము. సాధ్యమైనంత నెమ్మదిగా గాలిని విడువుము. గాలి పీల్చునపుడు, యీ దిగువ విషయములను గురించి శ్రద్ధతీసి కొనవలయును:-

1. నుంచొనుము. చేతులను తొంటిపై పెట్టుము. మోచేతులను బలవంతముగ వెనుకవుండు లాగున వుంచకుండా బయటకు వుండులాగున వుంచుము. సుఖముగా నుంచొనుము.

2.రొమ్మును తిన్నగా ముందుకు విరచి వుంచుము. తొంటి ఎముకలను చేతులను క్రిందివైపుకు వుండులాగున వుంచి నొక్కిపట్టుము, ఇందువలన ఖాళీప్రదేశము ఏర్పడి, గాలి తనంత తాను పోగలుగు లాగున వుండును.

3. ముక్కులను తెరచి వుంచుము. ముక్కులను ప్రతి వస్తువును పీల్చెడి పంపువలె వుపయోగించకుము. అది పీల్చెడి విడచెడి గాలి ద్వారమువలె వుండవలెను. పీల్చునప్పుడు ఏవిధమగు ధ్వనిని చేయరాదు. శబ్దములేని శ్వాసయే సరియైన శ్వాస యని జ్ఞాపకము వుంచుకొనుము.

4. మొండెముయొక్క పై భాగమునంతను పరచినట్లుండులాగున వుంచుము.

5. రొమ్ముయొక్క పై భాగమును వంపుగా ఆర్చివలె వుండనివ్వకుము. పొత్తి కడుపును బిగబట్టివుంచకుము.

6. తలను మరీ వెనుకకు వంచకుము. పొట్టను లోపలికి వంగనివ్వకుము. భుజములను బలవంతముగా వెనుకకు నొక్కిపట్టివుంచకుము. భుజములు పైకి ఎత్తిపట్టుకొనీ యుండునటుల చూడుము. గాలిని బయటకు విడచునపుడు యీ దిగువ నియమములను పాటించుము:1 ప్రక్కయెముకలు, మొండెముయొక్క పైభాగమును క్రమక్రమముగ క్రిందికి క్రుంగనిమ్ము.

2. క్రింది ప్రక్కటెముకలు, పొట్ట, వీటిని నెమ్మదిగా పైకి లాగుకొనుము.

3. శరీరమును మరీముందుకు వంగనివ్వకుము, రొమ్మును ఆర్చివలె వుంచుటనుకూడ మానవలెను. తల, మెడ, మొండెములను నిలువుగీతవలె వంపులేకుండ వుంచుము. రొమ్మును ముడుచుకొనుము. గాలిని నోటితో విడువకుము. ఏ విధమగు శబ్దము కలుగకుండా ముక్కుతో మెల్ల మెల్లగా గాలిని విడువుము.

4. గాలిని పీల్చు స్నాయువులను సడలించుటచే సహజముగ గాలిని విడువ వచ్చును. అట్టి స్థితిలో రొమ్ము ముందుకు వాలును. ముక్కులనుండి గాలి బయటకు వచ్చును.

5. ప్రారంభములో గాలిని పీల్చగనే కుంభకము చేయకుము. శ్వాసించుట అయిపోవగనే గాలిని విడచుచుండుము. ఇది బాగా అలవాటైన పిమ్మట 5 సెకండ్లనుంచి ప్రారంభించి, 1 నిమిషమువరకు నీశక్తి, బలము ననుసరించి కుంభకమును అధికము చేసికొనుచు రమ్ము.

6. మూడు మారులు దీర్ఘశ్వాసలు తీసికొన్న తర్వాత కొంచెముసేపు, సాధారణ శ్వాసోచ్చ్వాసలు తీసికొనుట మూలముగా విశ్రాంతితీసికొనుము. తరువాత రెండవ చుట్టును ప్రారంభించుము. మధ్య విశ్రాంతి సమయములో సుఖముగ వుండురీతిని చేతులను తొంటిపై పెట్టి నుంచుకొనుము. నీశక్తి ననుసరించి నీయిష్టము వచ్చినన్ని చుట్లు చేయవచ్చును. ప్రతి వారము ఒక్కొక్క చుట్టును పెంచుకొనుచు వచ్చుచు 3, 4 చుట్లు వరకు చేయుము. ఇది ఒక విధమగు ప్రాణాయామమే.

కపాలభాతి

'కపాలభాతి' అన పుఱ్ఱెను ప్రకాశింప జేయుట అన, యీ క్రియ వల్ల కపాలము పరిశుద్ధ మగును. దీనిని షట్కర్మలలో ఒకటిగా లెక్కించెదరు.

పద్మాసనములో కూర్చొనుము. మోకాళ్ళపై చేతులను పెట్టుము, కండ్లు మూయుము. త్వరత్వరగ పూరక రేచకములను చేయుము. ఇందువల్ల చెమట పోయును. ఇది ఒక చక్కని వ్యాయామము. ఈ అభ్యాసము బాగా అలవాటైనవారు భస్త్రిక ప్రాణాయామమును సులభముగ చేయగలరు. ఈ ప్రాణాయామములో కుంభకము లేదు. దీనియందు రేచకము ప్రధానము, పూరకము నెమ్మదిగను దీర్ఘమైనదిగను వుండును. రేచకమును అతి త్వరగా బలవంతముగ చేయవలెను. పూరకము చేయునపుడు పొట్ట యందలి స్నాయువులను సడలించి వుంచుము. కొందరు వెన్నుముకను, మెడను వంపుగా వుంచెదరు. అటుల వుంచరాదు. మెడ, మొండెము నిలువుగా వంపు లేకుండ వుండవలెను. భస్త్రికలో వలె ఆకస్మికముగ పూరకము వెంటనే రేచకము జరుగును. మొట్టమొదటిలో రేచకము ఒక సెకండు సేపు చేయుము. క్రమక్రమముగ సెకండుకు రెండు రేచకములు చేయగలుగు లాగున అలవరచు కొనుము. మొట్టమొదటిలో ఉదయమున 10 రేచకములు గల ఒక చుట్టును మాత్రము చేయుము. రెండవ వారములో, ఉదయము పై పరిమితి గల ఒక చుట్టు సాయంత్రము ఇంకొక చుట్టునూ చేయుము. మూడవ వారములో ఉదయము రెండు, సాయంత్రము రెండు చుట్లను చేయుము. ఈ రీతిని క్రమక్రమముగ వృద్ధిచేసికొనుచూ ప్రతిపూట 120 రేచకములను చేయగలుగునంతవరకు పెంచుచూ రమ్ము.

ఇది ముక్కు, శ్వాసావయవములను పరిశుభ్రపరచును. సూక్ష్మ శ్వాసనాళములందలి స్నాయువుల ఈడ్పును పోగొట్టును. క్రమక్రమముగ కొంతకాలమునకు ఉబ్బసము నివారణమగును. ఊపిరితిత్తులకు వలసినంత ప్రాణవాయువు లభించును. ఇందువలన క్షయవ్యాధిబీజములు జన్మింపవు. క్షయవ్యాధిని కూడ యీ అభ్యాసము నివారించగలదు. ఊపిరితిత్తులు వృద్ధియగును. కర్బన ద్వ్యమ్లజనిదము బయటకు నెట్టివేయబడును. రక్తములోగల అన్నివిధములగు అపరిశుద్ధతలు పోవును. జీవాణువులు, ధాతువులు ఎక్కువగా ప్రాణవాయువును తీసికొనును. సాధకునకు చక్కని ఆరోగ్యము లభించును. హృదయము చక్కగా పనిచేయును. రక్తప్రసరణావయవములు, శ్వాసావయవములు తమ పనులను చక్కగా నిర్వర్తించుకొనును.

బాహ్య కుంభకము

8 మార్లు 'ఓం'ను లెక్కించునంతవరకు ఎడమముక్కుతో గాలిని పీల్చుము. గాలిని లోపల ఆపుజేయకుండా వెంటనే 6 'ఓం' లను లెక్కించునంతసేపటివరకు కుడిముక్కుగుండా బయటకు విడచుము. 12 'ఓం'లను లెక్కించునంతవరకు గాలిని పీల్చకుండఆగుము. ఆపైన కుడిముక్కుతో పైరీతిని గాలిని పీల్చి, ఎడమ ముక్కుతో గాలిని విడచి, పై పరిమితి ప్రకారము గాలిని పీల్చకుండ ఆపుము. ఈ విధముగ ఉదయం ఆరు పర్యాయములు, సాయంత్రం ఆరు పర్యాయముల చేయుము. క్రమ క్రమముగ ఏ విధమగు శ్రమయు పడకుండ ప్రాణాయామముల సంఖ్యను, కుంభక సమయమును అధికముచేయును.

సుఖపూర్వక ప్రాణాయామము

నీ యిష్ట దేవతకు ఎదురుగా, నీవు ధ్యానముచేసి కొను గదిలో పద్మాసనములోగాని సిద్ధాసనములోగాని కూర్చొనుము. కుడిముక్కును కుడి బొటనవ్రేలితో మూయుము. ఎడమ ముక్కుతో చాల నెమ్మదిగా గాలిని పీల్చుము. తరువాత ఎడమ ముక్కునుకూడ కుడి వుంగ్రపు, చిటికెన వ్రేళ్ళతో మూయుము. నీవు శ్రమ లేకుండ ఆపగలిగి నంతసేపటికి వరకు గాలిని లోపల ఆపుము. ఆపైన కుడి ముక్కుతో (బొటన వ్రేలు తీసి) చాల నెమ్మదిగా గాలిని విడువుము. తరువాత కుడిముక్కుతో గాలిని పీల్చి, పైన చెప్పిన విధముగా కుంభకము చేసి, తరువాత ఎడమ ముక్కుతో పైన చెప్పినటుల గాలి విడువుము. ఇదంతయు ఒక ప్రాణాయామము అగును. ఇట్టి ప్రాణాయామములు ఉదయమున 20, సాయంత్రం 20 చొప్పున చేయుము. క్రమ క్రమముగ సంఖ్యను పెంచుచూ రమ్ము. గాలిని పీల్చునప్పుడు దయ, ప్రేమ, క్షమ, శాంతి, ఆనందము మొదలగు దైవీసంపదలు నీలో ప్రవేశించుచున్ననవిన్ని, గాలిని విడచు నప్పుడు, కోపము, కామము, అసూయ మొదలగు రాక్షసీ సంపదలు నీ నుండి బయటకు వెళ్ళిపోవుచున్న వనిన్ని, ఈవిధమగు మానసిక భావమును కలిగి యుండుము. పూరక కుంభక రేచక సమయములందు మాన సికముగ 'ఓం' లేక గాయంత్రి మంత్రమును జపించుము. త్వరగా వృద్ధిలోనికి రాగోరు సాధకులు రోజుకు 320 కుంభకములను 4 పర్యాయములుగా చేయ వచ్చును.

ఈ ప్రాణాయామము సమస్త వ్యాధులను పోగొట్టును. నాడులను పరిశుద్ధ పరచును. మనస్సును నిలకడ గలదిగ చేసి, ధారణ చేయ గలుగునటుల మార్చును. జీర్ణశక్తిని పెంపొందించును. ఆకలిని కలిగింప జేయును. బ్రహ్మచర్య పాలన చేయుటలో సాయపడి, నిద్రించు చున్న కుండలినీ శక్తిని మేల్కొలుపును. భూమినుండి పైకి లేవసాగెదవు.

కుండలిని మేల్కొలుపుటకు

ఈ క్రింద అభ్యాసము చేయునప్పుడు వెన్నెముక యొక్కమూలమగు మూలాధార చక్రమువద్ద ధారణచేయుము.

కుడిముక్కును కుడి బొటనవ్రేలితో మూయుము. 3 'ఓం'లను జపించగలుగునంతవరకు మెల్లిగా ఎడమ ముక్కుతో గాలిని పీల్చుము. పీల్చునప్పుడు బాహ్యప్రదేశమునుండి ప్రాణమును లోపలికి తీసికొను చుంటినని భావించుము. ఆ తరువాత కుడి వుంగరపు చిటికెన వ్రేళ్ళతో ఎడమ ముక్కును మూయుము. అప్పుడు గాలిని ఆపి, 12 'ఓం'లను జపించుము. ఆ సమయమున మూలాధార చక్రమునకు ఈ ప్రాణశక్తిని పంపుచున్నాననిన్నీ, ఆ ప్రాణశక్తి త్రిదళముగల పద్మమందలి కుండలినీ శక్తిని మేల్కొలుపుచున్న దనిన్నీ భావించుచుండుము. ఈ 12 'ఓం'లను జపించిన పిదప, కుడి ముక్కుతో 6 'ఓం'లను లెక్కించునంతవరకు నెమ్మదిగా గాలిని విడువుము. తరువాత కుడిముక్కుతో పీల్చి ఎడమ ముక్కుతో విడవుము. పై రీతిగాభావించి, జపించుచూ,) ఇది ఒక ప్రాణాయామమగును. ఇది కుండ్లినీ శక్తిని త్వరగా మేల్కొలుపును. ఈ రీతిని ఉదయము 3 మారులు సాయంత్రము 3 మారులు చేయుము. నీశక్తి ననుసరించి క్రమక్రమముగ సంఖ్యను కాలమును అధికము చేసికొనుచు రమ్ము. ఈ ప్రాణాయామములో మూలాధార చక్రముపై ధారణ చేయుట ప్రధానాంగము. ప్రాణాయామమును క్రమముగ చేయుచూ, తీక్షణముగ ధారణ, చేయుచున్నచో త్వరలోనే శక్తి లేచును.

ధ్యానసమయమున ప్రాణాయామము

ధారణ ధ్యానములు చేయునప్పుడు ప్రాణాయామము సహజముగ సిద్ధించును. ఇట్టి సమయమున శ్వాస అతి నెమ్మదిగా వచ్చును. మనమందరము మనకు తెలియకుండగనే, ఈ ప్రాణాయామమును చేయుచున్నాము. ఏదైన చక్కని ఆహ్లాదకరమగు కధల పుస్తకమునుగాని, ఏదైన చిక్కుగల లెక్కనుగాని చేయునప్పుడు తదితర విషయముల నన్నిటిని మరచి ఆ విషయమునందే నీమనస్సు పూర్తిగా లగ్నమై యుండును. ఇట్టి సమయమున నీశ్వాసను పరీక్షించుచో చాల నెమ్మదిగా వచ్చుటను కనుగొనగలవు. ఆనందము, విచారము, దు:ఖములను కలిగించు విషయములను చూచుట, వినుటలో కూడ శ్వాస అతి నెమ్మదిగా వుండును. ఇదే సహజముగ వచ్చు ప్రాణాయామము. శీర్షాసనమును అభ్యసించువారికి కూడ సహజముగ ప్రాణాయామము ప్రాప్తించును. ఈ ఉదాహరణల వల్ల, ధారణా ధ్యానములలో శ్వాస చాలా నెమ్మదిగా వుండునని గాని, ఆగి పోవుననిగాని అనుటను కాదనజాలము. మనస్సు ప్రాణము ఒక దానితో ఒకటి దగ్గరి సంబంధము కలిగి వుండుట వల్ల యిటుల జరుగును. మనస్సుకు ప్రాణము దుస్తులాటిది. అట్టి సమయములలో నీ శ్వాసను పరీక్షించ సాగిన కొద్దిసేపటిలోనే, నీ శ్వాస మరల మామూలు స్థితికి వచ్చును. జపము, ధ్యానము లేక బ్రహ్మ విచార మొనర్చువారికి సహజముగనే ప్రాణాయామము సిద్ధించును.

ప్రాణము, మనస్సు, వీర్యము, ఈ మూడును ఒకే లంకెయం దున్నవి. కావున, వీనిలో ఏ ఒక్కదానిని వశ పరచు కొన్నప్పటికి, మిగిలిన రెండునూ వాటంతట అవే వశమగును. అఖండ బ్రహ్మచర్యమును 12 ఏండ్లు ఒక్క వీర్యపు చుక్క కూడ వ్యర్ధము కాకుండ కాపాడుకొనిన వానికి, మనస్సు, ప్రాణములు పూర్తిగా లోబడును. హఠయోగులు ప్రాణమును వశపరచుకొనియు, రాజయోగులు మనస్సును వశపరచుకొనియు బ్రహ్మను చేరెదరు.

ఈ ప్రాణాయామములో ముక్కులను మూయనక్కర లేదు. కూర్చొని అభ్యసించ దలచుచో కండ్లను మూయుము. శరీరమును మరచి ధారణచేయుము. నడచుచూ చేయుచున్నచో నీవు పీల్చెడి విడచెడి గాలిపై ధారణచేయుము.

నడచునప్పుడు

రొమ్మును విశాలముగ వుంచి, భుజములను వెనుకకు వుండులాగునను తల పైకి వుండులాగునను వుంచి నడువుము, ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క 'ఓం' జపించుచూ 3 'ఓం' లను లెక్కించునంతసేపటివరకు గాలిని రెండు ముక్కులతోను నెమ్మదిగా పీల్చుము. తరువాత 12 'ఓం' లను జపించునంతవరకు కుంభకముచేయుము. తరువాత ఆరు 'ఓం' లను జపించునంతవరకు రెండు ముక్కులతోను గాలిని విడచుము. ఇటుల ఒక ప్రాణా యామము అయినపిదప 12 'ఓం'లను జపించునంతవరకు మామూలుగా గాలినిపీల్చి విడచుచుండుము. అడుగుకు ఒక్కొక్క 'ఓం; చొప్పునలెక్క పెట్టుట కష్టముగా తోచుచో, ఈ నియమమును పాటించుట మానుము.

'కపాలభాతి'ని కూడ నడచుచూ చేయవచ్చును. పనులతో తీరిక వుండని మనుష్యులు పై ప్రాణాయామమును ఉదయము సాయంత్రములందు షికారుకు వెళ్ళునప్పుడు చేయ వచ్చును. దీనినే ఒకే రాతితో రెండు పక్షులను కొట్టుట అందురు. పరిశుద్ధమగు గాలి వచ్చెడి బహిరంగ ప్రదేశములో నడచుచూ ప్రాణాయామము చేయుట, ఎంతో ఆహ్లాదకరముగ వుండును. ఇందువలన ఎంతో పుష్టివచ్చును. దీనిని అభ్యసించి లాభములను అనుభవించుము. త్వరత్వరగా నడచువారు 'ఓం' ను మానసికముగగాని, నెమ్మదిగాగాని స్మరించవచ్చును. ఏప్రయత్నమును లేకుండ సహజ ప్రాణాయామమును చేయుము.

శవాసనములో

ఒక జంఖానాపరచి, దానిపైన వెల్లకిలగ పడుకొనుము. చేతులను ప్రక్కగా పెట్టుకొనుము. కాళ్ళు జాపుము. చీలమండలను రెంటినీ దగ్గరగావుంచి కాలి బొటనవ్రేళ్ళను కొంచెము దూరముగావుంచుము. స్నాయువులను, నరములను సడలించి వుంచుము. చాల బలహీనముగవుండువారు ఈవిధముగ ప్రాణాయామమును చేయవచ్చును. ఏ విధమగు శబ్దము చేయకుండ రెండు ముక్కులతోను నెమ్మదిగా గాలిని పీల్చుము. శ్రమ లేకుండ ఆపగలిగినంతసేపు గాలిని లోపల ఆపుచేయుము. తరువాత రెండు ముక్కులతోను నెమ్మదిగా గాలిని విడచుము. పై విధముగా ఉదయం 12 మారులు, సాయంత్రం 12 మారులు చేయుము. అభ్యాసము చేయునప్పుడు మానసికముగ 'ఓం'ను జపించుము. వీలై, యిష్టమైనచో "సుఖపూర్వక ప్రాణాయామము"ను కూడ చేయవచ్చును. ఇది, ఆసనము, ప్రాణాయామము, ధ్యానము విశ్రాంతులు కలసియున్న సాధన, ఇందువల్ల శరీరమునకు మనస్సుకు విశ్రాంతి లభించును. పెద్ద వయస్సు వచ్చినవారికి యిది చాల అనుకూలమైనది.

క్రమ శ్వాస

సాధారణముగ స్త్రీలుగాని, పురుషులుగాని పీల్చెడి శ్వాస సరిగలేదు. గాలి విడచునప్పుడు 16 అం నిడివిగను, పీల్చునప్పుడు 12 అం. నిడివిగను వుంటున్నది. ఇందువల్ల 4 అం. శ్వాస వ్యర్థముగ పోవుచున్నది. పీల్చునప్పుడుకూడ 16 అం. నిడివిగ పీల్చుచో క్రమశ్వాసయగును. ఇటులచేయుటచే కుండలినీశక్తి మేల్కొనును. ఇట్టి క్రమశ్వాసవల్ల నిజమగు విశ్రాంతి లభించును. సుషుమ్నా శీర్షకములో గల శ్వాసకేంద్రము వశపడును. ప్రశాంతముగా మనస్సుండును.

ఉచ్ఛ్వాసనిశ్వాసల పరిమాణము సమానముగ వుండుటనే క్రమశ్వాసయందురు. 6 'ఓం' లను జపించునంత సేపటి వరకు పూరకము చేయుము. రేచకమునుకూడా 6 'ఓం' లను జపించుటకు పట్టునంతటిసేపువరకే చేయును. ఇది శరీరమును ప్రశాంతస్థితిలో వుండులాగున చేయుము. ఇందువల్ల మనస్సు, ఇంద్రియములు శాంతినిపొందుటయే గాక అలసియున్న నరములకు తిరిగి బలము కలుగును. అన్ని విధములగు తొందరలు, తొట్రుపాటులు, ఆవేశములు అణగిపోయి సముద్రము వలె గంభీరముగ వుందువు. ఇంకొకరకపు క్రమశ్వాసాభ్యాసము కలదు. దానిని యీ విధముగ చేయుదురు. 4 'ఓం' లను జపించునంతసేపటి వరకు రెండు ముక్కులతోను నెమ్మదిగా గాలినిపీల్చుము. 8 'ఓం' లను జపించునంతసేపటివరకు ఆ గాలిని లోపల బంధించుము. తరువాత మరల 4 'ఓం' లనుజపించునంతసేపటివరకు రెండు ముక్కులతోను నెమ్మదిగా గాలినివిడవుము. తరువాత 8 'ఓం' లను లెక్క్ంచునంతసేపటివరకు గాలిని పీల్చకుండ బాహ్యకుంభకము చేయుము.

నీ శక్త్యనుసారము పై ప్రకారము కొన్ని మారులు చేయుము. క్రమక్రమముగ శ్వాసోచ్ఛ్వాసల సమయమును 8 'ఓం' లను లెక్కించునంత సేపటివరకును, కుంభకమును 16'ఓం' లను లెక్కించునంత సేపటివరకును అధికము చేసికొనుచూ రమ్ము. ఇటుల వృద్ధిచేయుటలో ఏవిధమగు శ్రమయు వుండకుండు లాగున చూచుకొనుము. ఇందుచే ఏ మాత్రము బాధ వుండరాదు. దీర్ఘ శ్వాసకంటె, క్రమశ్వాసయే యెక్కువ విలువగల దనెడి విషయమును జ్ఞప్తియం, దుంచుకొనుము. పట్టుదల శ్రద్ధలతో చేయుము.

సూర్య భేద

పద్మాసనములో గాని సిద్ధాసనములోగాని కూర్చొనుము. కండ్లు మూయుము. కుడిచేతి వుంగరపు, చిటికెన వ్రేళ్ళతో ఎడమ ముక్కును మూయుము. నీవు పీల్చగలిగినంత సేపు ఏ విధమగు శబ్దమును చేయకుండ నెమ్మదిగా కుడి ముక్కుతో గాలిని పీల్చుము. తరువాత కుడిముక్కును కుడి బొటన వ్రేలితో మూసి గడ్డమును రొమ్మునకు ఆనించి (జాలంధర బంధము) కుంభకము చేయుము. ఈ కుంభకమును శరీర మందలి రోమములన్నిటినుండిన్నీ, గోళ్ళ మొనలనుండిన్నీ చెమట బిందువులు బయలుదేరు నంతవరకు చేయవలెను. మొట్ట మొదటిసారిలోనే యింతసేపటివరకు కొందరు చేయలేక పోవచ్చును. అట్టివారు క్రమక్రమముగ కుంభకము చేయు కాలమును అధికము చేసికొనుచూ రావచ్చును. ఇదియే సూర్యభేధ కుంభకముయొక్క పరిమితి. తరువాత గాలిని నెమ్మదిగా కుడిముక్కును కుడి బొటనవ్రేలితో మూసి, ఎడమముక్కు గుండా ఏ విధమగు శబ్దము లేకుండ విడువవలెను. రేచక పూరక కుంభక సమయములందు 'ఓం'ను భావము, అర్ధములతో స్మరించుము. శ్వాసను పైకి పూఱ్ఱెవైపుకు పోనిచ్చి, పుఱ్ఱెను పరిశుద్ధపరచిన పిదప విడవుము.

ఇది మెదడును పరిశుద్ధపరచును. ప్రేవులందలి నులిపురుగులును నాశనమొనర్చును. వాతాధిక్యతచే వచ్చు రోగములను నివారణ చేయును. కీళ్ళవాతమును పోగొట్టును. అన్ని విధములగు మజ్జాతంతు వేదన (Newralgia) లను, రినిటిన్ (Rhinitis), సెఫలాల్జియా (Cephalalgia)లను నిర్మూల మొనర్చును. నాడీప్రణ ముఖము నందలి క్రిములను పారద్రోలును. వృద్ధాప్యము మరణమును లేకుండా చేయును. కుండలినీ శక్తిని మేల్కొలుపును.

ఉజ్జయి

పద్మాసనము లేక సిద్ధాసనములో కూర్చొనుము. నోటిని మూయుము. నెమ్మదిగా రెండుముక్కులతోను సమానముగ, గొంతునుండి హృదయ ప్రదేశమువరకు నిండులాగున గాలిని పీల్చుము. పిమ్మట, నీవు సుఖముగా ఆపుజేయగలిగినంత సేపటి వరకు గాలిని లోపల కుంభించి, కుడి ముక్కును కుడి బొటన వ్రేలితో మూసి, ఎడమ ముక్కుతో నెమ్మదిగా గాలిని విడవుము. గాలిని పీల్చు నప్పుడు రొమ్మును విశాలముగ (Expans'on) వుంచుము. ఈ రీతిని గాలిని పీల్చునప్పుడు కంఠ బిలము ఒక వైపు మాత్రమే మూసికొని యుండుటచే ఒక విధమగు విచిత్రమైన ధ్వని పుట్టును. ఇది సమముగను నెమ్మదిగను వుండవలెను. అంతేగాక, యిది చివరవరకు వుండును. ఈ రకపు కుంభకమును నడచు నప్పుడుగాని, నిలబడి గాని చేయవచ్చును. ఎడమ ముక్కుతో గాలి విడచుటకు బదులుగా రెండు ముక్కులతో కూడ నెమ్మదిగా గాలిని విడవవచ్చును.

ఇది తలయందు గల వేడిని పోగొట్టును. జఠారాగ్ని వృద్ధియగును. సాధకునకు అందమువచ్చును. జలోదరమును కుదుర్చును. శరీరములో గల దోషములను, ధాతువులలో గల దోషములను పోగొట్టును. గొంతులో గల శ్లేష్మమును పోగొట్టును. క్షయ, ఉబ్బసము తదితర పుప్పుసీయ వ్యాధులను నిర్మూల మొనర్చును. ప్రాణవాయువు కొరత వల్ల కలుగు జబ్బులున్నూ హృద్రోగమున్నూ నివారణ యగును. ఉజ్జయి ప్రాణాయామముచే అన్ని కార్యములు సిద్ధించును. శ్లేష్మ నరముల వ్యాధులు, మందాగ్ని, రక్తగ్రహణి, ప్లీహోదరము, క్షయ, దగ్గు, జ్వరములు ఈ కుంభకము చేయు సాధకుని దగ్గరకు రాజాలవు. వార్ధక్యమును, చావును లేకుండా చేయును.

సీత్కారి

నాలుకమొన పై అంగిలికి తాకులాగున నాలుకను వంచి, సీ, సీ, సీ, సీ అను శబ్దము వచ్చులాగున నోటితో గాలిని పీల్చుము. తరువాత ఊపిరి సలపకుండ వుండునంతసేపటి వరకు గాలిని లోపలకుంభించి, నెమ్మదిగా రెండు ముక్కులతోను గాలిని విడువుము. గాలిని పీల్చునప్పుడు రెండు పంటివరసలను(క్రింది, పైని) దగ్గరకు చేర్చవచ్చును.

ఇందువలన శరీరమునకు వన్నె, దార్డ్యము వచ్చును. ఆకలి, దప్పిక, బద్ధకము, నిదురమత్తులు లేకుండ పోవును. ఇంద్రునంతటి బలశాలి యగును. యోగులకు ప్రభువగును. ఏదైన చేయుటకుగాని, కాకుండ చేయుటకు గాని సమర్థుడగును. స్వతంత్ర చక్రవర్తి వలె అగును. అజేయుడగును. ఏ విధమగు ఆపదలు అతని దరిజేరజాలవు. దాహము వేసినప్పుడు ఈ కుంభకము చేసినచో, దాహము తగ్గిపోవును.

శీతలి

నాలుకను పెదవుల బయటకు కొద్దిగా రానిమ్ము. గొట్టమువలె నాలుకను వంచుము. సీ, సీ, సీ, సీ అను శబ్దమువచ్చు లాగున నోటితో గాలిని పీల్చుము. నీవు శ్రమలేకుండ ఆపుచేయ గలిగినంత సేపటివరకు గాలిని లోపల ఆపుచేయుము. తరువాత రెండు ముక్కులతోను, గాలిని నెమ్మదిగాబయటకు విడువుము. ప్రతిరోజు ఉదయమున 15 నుండి 30 పర్యాయములవరకు ఈ విధముగ చేయుచుండుము. ఈ అభ్యాసమును పద్మ, సిద్ధ, వజ్రాసనములలోగాని, నడచుచు లేక నిలబడిగాని చేయవచ్చును. ఈ ప్రాణాయామము రక్తమును శుభ్రపరచును. ఆకలి దప్పులను చల్లార్చును. శరీరమును చల్లగా వుంచును. గుల్మము, ప్లీహ, జ్వరము, దీర్ఘవ్యాధులు, క్షయ, అజీర్తి, శ్లేష్మము, పైత్యదోషములు, పాము,తేలు మొదలగువాని విషముల వల్ల కలుగు దోషములను పోగొట్టును. నీరు దొరకుట దుర్లభముగా తోచుస్థితిలో దాహము వేసినచో ఈ ప్రాణాయామమును చేయుము. వెంటనే దప్పిక లేకుండ పోవును. ఈ ప్రాణాయామమును ప్రతినిత్యము అభ్యసించువానిని తేలు, పాము కాటుల ఏమియు చేయజాలవు. ఈ ప్రాణాయామ సాధకుడు, నీరు, ఆహారము, గాలి లేకుండా తన శరీరమును కాపాడుకొనగల శక్తి శాలి యగును. అన్ని విధములగు వేదనలు, పోటు, బాధ, మంట, జ్వరాదులనుండి విముక్తిని పొందును.

భస్త్రిక

సంస్కృతములో భస్త్రికయన కొలిమితిత్తిఅని అర్థము. ఈ ప్రాణాయామము చేయునప్పుడు కమ్మరి తన కొలిమి తిత్తులను ఎంతత్వరగా తెరచుట మూయుటలను చేయుచుండునో అంతత్వరగా ఉచ్ఛ్వాస నిశ్వాసములను చేయుచుండవలెను.

పద్మాసనములో కూర్చొనుము. శరీరము, మెడ, తల లను నిలువుగా తిన్నగావుంచుము. నోటిని మూయుము. ఆ పిమ్మట గాలిని పీల్చుట, విడచుటలను త్వరత్వరగా కొలిమితిత్తివలె పదిమారులుచేయుము. ఇది చేయునప్పుడు ఒక విధమగు ధ్వనిపుట్టును. సాధకుడు ఈ సాధనను అతిత్వరత్వరగా చేయు చుండవలెను. ఇటుల పదిమారులు చేయగనే చివరిపర్యాయము దీర్ఘముగ శ్వాసించుము. ఆ తీసికొన్న శ్వాసను నీవు లోపల సుఖముగా ఆపగలిగినంతసేపు ఆపుము. ఆ పిమ్మట చాల నెమ్మదిగ దీర్ఘ రేచకమును చేయుము. ఇచ్చటికి ఒక ప్రాణాయామము అయినదని అర్ధము. ఇటుల ఒక ప్రాణాయామము కాగానే కొన్ని స్వాభావిక శ్వాసోచ్చ్వాసలు తీసికొనుట మూలమున విశ్రమించుము. ఇటుల చేయుటచే నీకు కొంత విశ్రాంతి లభించి, రెండవ ప్రాణాయామము చేయుటకు బలము చేకూరును. ఈరీతిని ప్రతిరోజు ఉదయము మూడు ప్రాణాయామములు చేయుము. సాయంత్రము మరొక మూడు ప్రాణాయామములను చేయవచ్చును. ప్రతిపూట మూడు ప్రాణాయామములు చేయుటకు కూడ తీరిక వుండని వ్యవహార వేత్తలు, పూటకు కనీసము ఒక ప్రాణాయామమునైన చేయుట లాభకరము. భస్త్రిక-కపాలభాతి, ఉజ్జయి ప్రాణాయామముల సమ్మేళనము. ప్రారంభంలో కపాలభాతి, ఉజ్జయి ప్రాణాయామములను చేసినచో, ఆ పిమ్మట భస్త్రికను సులభముగ చేయ గలుగుదువు.

కొందరు అలసిపోవునంత సేపటివరకు చేయుదురు. ఇది చేయునప్పుడు విపరీతముగ చెమటపోయును. సాధనా సమయములో మత్తుగాతోచినచో, అట్టి సమయమందు కొన్ని స్వాభావిక (Normal) శ్వాసలను తీసికొనుము. అందుచే మత్తుపోవును. అదిపోగానే మరల సాధనము మొదలిడును. దీనిని శీత కాలములో ఉదయ, సాయంత్రములందును, ఎండకాలములో ఉదయమున చల్లగానున్న సమయమందును చేయవలెను.

ఇది గొంతువాపును పోగొట్టును, జఠరాగ్నిని పెంపొందించును. శ్లేష్మమును రూపుమాపును. ముక్కు, రొమ్ముకు సంబంధించిన వ్యాధులను పెరికి వేయును. క్షయ, ఉబ్బసములను మచ్చునకైన లేకుండచేయును. ఆకలిని కలిగించును. బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులను భేదించును. బ్రహ్మనాడి (సుషుమ్న) ముఖద్వారమునకు బిరడావలె అడ్డముగా నున్న శ్లేష్మమును లేకుండ చేయును. కుండలినీ శక్తిని గురించి తెలసి కొనునటులచేయును. వాత పిత్త శ్లేష్మాథిక్యములచే కలుగు వ్యాధులను పారద్రోలును. శరీరమునకు ఉష్ణమును కలిగించును. చలిప్రదేశములో చలినుండి కాపాడుకొనుటకు కావలసినంత ఉష్ణమును సంపాదించు కొనుటకు కావలసిన బట్టలు లేనప్పుడు ఈ ప్రాణాయామమును చేయుము; సరిపోను వేడి వచ్చును. నాడులను శుభ్రపరచును. అన్ని విధములగు కుంభకములలోను, యిది శ్రేష్ఠమైనది. సుషుమ్నా మార్గములో గల మూడు గ్రంధులను భేధించు శక్తి గలది. గాన, దీనిని ప్రతివాడు తప్పక అభ్యసించవలెను. ఇది కుండలినీ శక్తిని త్వరగా మేల్కొలుపును. ఈసాధకుని ఏ వ్యాధియు బాధించదు. ఎల్లప్పుడు ఆరోగ్యమను మహాభాగ్యమును అనుభవించు చుండును.

నీవు ప్రతి ప్రాణాయామముకు చేయు (తొందరగా) శ్వాసోచ్ఛ్వాసల పరిమితి, నీ బలముపై ఆధారపడి యుండును. ఆరుగాని, పది లేక పండ్రెండు వరకుగాని సులభముగ చేయ వచ్చును.అతిగా పోయి అపాయమును పొందకుము.

భస్త్రికను కొలది మార్పులతో యీ దిగువ రీతినికూడ చేయవచ్చును. త్వరత్వరగా పూరక రేచకములు రెండింటిని కలపి యిర్వైమారులు చేసిన పిమ్మట, కుడి ముక్కుతో గాలిని పీల్చి, ఆపుచేయ గలిగినంతసేపు లోపల కుంభించి, ఆపిదప ఎడమముక్కుగుండా నెమ్మదిగా గాలిని విడువుము. ఆపైన ఎడమముక్కుతో పూరకముచేసి, కుడిముక్కుతో రేచకము చేయుము.

సాధనా సమయమందంతటను 'ఓం' ను భావార్థ సహితముగ జపించుము.

కొన్నిరకముల భస్త్రికలలో, స్వాసోచ్చ్వాసలలో ఒకే ముక్కును ఉపయోగించుటయు, లేక ఒకటి విడచి ఒకటిగా (Alternate) ఉపయోగించుటయు గలదు.

చాలసేపటివరకు తీక్ష్ణముగ భస్త్రిక ప్రాణాయామము చేయగోరువారు ఆహారముగ ఖిచడీ తీసికొనవచ్చును. సాధనకు కూర్చొనబోవుటకు ముందు ఉదయమున ఎనిమాగాని బస్తినిగాని చేసికొనవలెను.

భ్రామరి

పద్మ లేక సిద్ధాసనములో కూర్చొనుము. తేనీగవలె ఝుమ్మనుధ్వని చేయుచూ త్వరత్వరగా రెండుముక్కులతోను పూరక రేచకములను చేయుము.

ఈవిధముగా శరీరము అంతయూ చెమటపోయు నంతవరకు చేయుము. చివరకు రెండుముక్కులతోను గాలిపీల్చి, ఆపగలిగినంతసేపు లోపల కుంభకముచేసి, నెమ్మదిగా అటుపైన రెండుముక్కులతోను గాలిని విడువుము. ఈ కుంభకము చేయుట వలన సాధకుడు పొందు ఆనందము వర్ణనాతీతము. మొదటిలో రక్తప్రసారము తీవ్రముగ జరుగుటవల్ల శరీరము వేడి ఎక్కును. చివరకు చెమటవల్ల ఆవేడి తగ్గును. ఈ కుంభకము సిద్ధించిన వానికి సమాధి సిద్ధించును.

మూర్ఛ

ఆసనములో కూర్చొని గాలిని పీల్చుము. కుంభకము చేయుము, ఆసమయమున గడ్డమును రొమ్మునకు ఆనించుము (జాలంధర బంధము). శరీరము స్పృహతప్పిపోవు నంతవరకు గాలిని కుంభించి, ఆ పిమ్మట నెమ్మదిగా రేచకము చేయుము. ఈ కుంభకము మనస్సునకు స్మృతిలేకుండచేయును గాన సుఖముగానుండును. కాని చాలమంది దీనిని చేయలేరు.

ప్లవని

ఈ ప్రాణాయామమును చాల నేర్పుతో చేయవలెను. ఈ ప్రాణాయామమును చేయగల సాధకుడు జలస్తంభనను చేసి నీటిపై తేలగలడు. ఒక యోగసాధకుడు ఈ ప్రాణామములో సిద్ధినిపొంది పండ్రెండు సంవత్సరములవరకు నీటిపైననేవుండెను. ఈప్రాణాయామము చేయగలవాడు కొన్నాళ్ళ వరకు ఆహారమును పూర్తిగా మానివేసి వాయుభక్షణ మాత్రమేచేసి జీవించగలడు. గాలిని మంచినీళ్ళు త్రాగినరీతిని త్రాగి , పొట్టలోనికి పంపగలడు. పొట్ట అంతయూ గాలితో నింపబడిన పిమ్మట పొట్టపై కొట్టిచూచినచో గాలితోనిండి యున్న బంతిపై కొట్టుటచే ఎట్టిమోతవచ్చునో ఆమాదిరి మ్రోతవచ్చును. దీనినిక్రమక్రమముగ అభ్యసించవలెను. ఈ ప్రాణాయామములో సిద్ధిపొందినవాని సహాయము లేకుండా చేయరాదు.

కేవల కుంభకము

సహిత కుంభకము, కేవలకుంభకము అని కుంభకములు రెండు రకములు. పూరక రేచకములతో కూడియున్న కుంభ కమును సహిత కుంభకము అందురు. ఇవి రెండును లేని దానిని కేవలకుంభకము అందురు. సహితకుంభకములో పూర్ణమైన విజయమును పొందిన పిమ్మట దీనిని అభ్యసించవలెను. ఇది చేయువానియందు స్థలకాల సంఖ్యా నియమములు లేకుండ అనేక స్థలములలో పూరకరేచకములు కూడ లేకుండ శ్వాసనిలచిపోవును. అట్టిస్థితినే కేవలకుంభకము అందురు. ఇదే నాల్గవ మెట్టు. ఇందువలన అనేక విధములగు మహిమలు లభించును. దీనిని గురించి వశిష్ఠ సంహితలో, "శ్వాసోచ్చ్వాసలు రెండును లేకుండ ఏమాత్రము శ్రమయులేకుండ పోవుటనే కేవలకుంభకము అందురు." అని గలదు. ఈప్రాణాయామములో రేచక పూరకము లేమియు లేకుండ ఆకస్మికముగ శ్వాస ఆగిపోవును. సాధకుడు తన యిచ్ఛ వచ్చినంతసేపటివరకు శ్వాసను ఆపి వేయగలిగియుండును. రాజయోగ స్థితినిపొందును. కుండలినిని గురించిన జ్ఞానముకలుగును. కుండలినిమేల్కొనును. సుషుమ్నా మార్గమున గల అడ్డంకులన్నియు లేకుండపోవును. హఠయోగము సిద్ధించును. దీనిని రోజుకు మూడుమారులు చేయవచ్చును. ఇది తెలిసినవాడే నిజమైనయోగి. ఈ కుంభకము సిద్ధించినవానికి పొందరాని దీ ముల్లోకములం దేదియు లేదు. ఈ కుంభకము సమస్త వ్యాధులనుపోగొట్టి ఆయువును పెంచును.

ప్రాణశక్తిచే రోగ నివారణ

ప్రాణాయామమును చేయువారు తమ ప్రాణశక్తివలన వ్యాధులను నివారించగలరు. ఆ విధముగ కోల్పోయిన ప్రాణశక్తిని కుంభకముచేసి తిరుగ సంపాదించుకొనగలరు. ఈ విధముగ ప్రాణశక్తిని వినియోగించుటవల్ల, నీ యందలి ప్రాణశక్తి నంతను కోల్పోదునేమో యని యెన్నడును భయపడకుము. దీనిని ఎంత అధికముగా వినియోగించుచుందునో, అంత అధికముగా జగత్ప్రాణము (హిరణ్యగర్భుడు) నుండి నీకు లభించును.

ఇది ప్రకృతి నియమము. లోభిని కాబోకుము. కీళ్ళవాతముచే ఎవడైన బాధపడుచున్నచో, వాని కాళ్ళను మెల్లగా పిసుకుము. ఆవిధముగ పిసుకు (చమురుట) నప్పుడు కుంభకము చేసి, మానసికముగ నీ యందలి ప్రాణశక్తిని నీ చేతులగుండా ఆతని కాళ్లలోనికి పంపుచుంటినని భావించుము. లేనిచో జగత్ప్రాణమునుండి ప్రాణశక్తిని గైకొని, నీచేతులగుండా ఆతని కాళ్లలోనికి పంపుచుంటినని భావింపుము. రోగి వెంటనే బాధ తగ్గి బలము, ఉష్ణము వచ్చినటుల తలచసాగును. తలనొప్పి మొదలగువాటిని ఈ రీతిగాచేయు ఆకర్షణశక్తి స్పర్శముచే నివారించగలవు. యకృత్తు, ప్లీహ, పొట్ట లేక శరీరమందలి తదితరభాగమును దేనినైన చమురునపుడు, జీవాణువులను ఈ రీతిని ఆజ్ఞాపించును:- "ఒ జీవాణువులారా! మీ మీ ధర్మములను చక్కగా చేయుడు. మిమ్ములను ఆ విధముగా చేయ వలసినదిగా నేను ఆజ్ఞాపించుచున్నాను. అటుల ఆజ్ఞాపించుటచే అవి నీ యిచ్ఛానుసారము చేసితీరును. నీయందలి ప్రాణశక్తిని యితరులకు పంపునప్పుడు మానసికముగ 'ఓం' జపము చేయుము. ఈరీతిని కొందరకు చేసినపిదప, నీకు తగిన యోగ్యతలభించును. తేలుకాటు పొందినవారి కాళ్ళను చమురుచూ క్రిందికి ఆ విషమును దింపవచ్చును.

ప్రాణాయామమును సరిగా అభ్యసించుటవల్ల ధారణా శక్తి, మంచి ఆరోగ్యము, దృడమైన శరీరము లభించగలవు. నీ శరీరమందలి అనారోగ్య భాగములకు ప్రాణశక్తిని పంపి ఆరోగ్యవంతముగ చేసికొనుచుండవలెను. కారిజము సరిగా పనిచేయుట లేదనుకొనుము.

పద్మాసనములో కూర్చొనుము, కనులు మూయుము. ముమ్మారు ఓం ను ఉచ్చరించునంత వరకు నెమ్మదిగా గాలిని పీల్చుము. ఆరు మారులు ఓం ను జపించు నంతవరకు గాలిని లోపల ఆపు జేయుము. ఆ సమయమున ప్రాణశక్తిని కారిజము వుండు ప్రదేశమునకు పంపుము. నీ మనస్సును ఆ ప్రదేశములపై నిలుపుము. నీవు పంపుచున్న ప్రాణశక్తి కారిజమున ప్రవేశించి దానికి పుష్టినిచ్చి, దాని యందలి జీవాణువులకు బలమును కలిగించి, అవి యన్నియు తమ తమ కార్యములను చక్కగా నెరవేర్చునటుల చేయు చున్నదని భావించుము. నమ్మకము, భావన, ఏకాగ్రతలు ఈరీతిగా వ్యాధులను కుదుర్చుటలో ప్రధాన పాత్రను వహించును. ఆ పిమ్మట నెమ్మదిగా రేచకము చేయుము. రేచకము చేయునప్పుడు కారిజమునందు గల రోగ బీజాణువు లన్నియు బయటకు నెట్టివేయ బడినవని భావించుము. ఈ రీతిని ఉదయము పండ్రెండు మారులు, సాయంత్రము పండ్రెండు మారులు చేయుము. కొద్దిరోజులు యిటుల చేయుటచే ఆ బాధతగ్గి పోవును. ఇది మందులేని ప్రకృతి వైద్యము. ఈ రీతిని ప్రాణాయామ సమయములో ప్రాణవాయువును వ్యాధిగల స్థలముకు గొంపోయి దీర్ఘ వ్యాధులను గాని, తరుణ వ్యాధులనుగాని కుదుర్చుకో గలవు. ఒకటి రెండు మారులు నీ వ్యాధిని నీవు కుదుర్చుకొనుటకు ప్రయత్నము చేయుము. అప్పుడు నీకు నమ్మకము కలుగ గలదు.

చేతిలో వెన్నను పెట్టికొని, నెయ్యి లేకపోయెను గదా యని యేడ్చెడు అబలవలె డబ్బులేని మహిమ నంత మగు ప్రాణ శక్తిని నీ చేతి యందుంచుకొని రోగము కుదురలేదని యేల యేడ్చెదవు? న్యాయముగ ఉపయోగించుము, నీవీ సాధనలో ఉచ్చస్థితికి వచ్చిన పిదప, తాకినంత మాత్రముననే అన్ని వ్యాధులను కుదుర్చగలవు. అంతే గాదు, మనస్సులో తలచినంత మాత్రముననే నివారణ కాగలవు.

దూరము నుండి

దీనినే 'అప్రత్యక్ష నివారణ' యని కూడ అందురు. దూరమున వున్న స్నేహితునికి ప్రాణశక్తిని పంపి అతని వ్యాధిని కుదుర్చ వచ్చును. కాని దీనిని గైకొనగల శక్తి అతని కుండ వలెను. ఈ విధానము ప్రకారము చేయు నప్పుడు నీ మిత్రుడు, నీవు ఎదురుగా వున్నటుల భావించవలెను.

నీవు అతనికి వుత్తరము వ్రాసి 'యిన్ని గంటలనుండి యిన్ని గంటలవరకు ప్రాణశక్తిని, నీవద్దకు పంపుదునని తెలియజేయ వలెను. అతనికి యీ విధముగ వ్రాయుము:- "ఉదయము నాల్గు గంటలకు నేను ప్రాణ శక్తిని నీ వద్దకు పంపెదను. వాటిని గైకొనుచుంటి ననెడి మానసిక భావము, కలిగి యుండుము. ఆ సమయమున ఒక పడక కుర్చీలో పడుకొనుము. కండ్లు మూసికొని యుండుము. అప్పుడు ప్రాణశక్తిని పంపెదను."

ఇక మానసికముగ యీ విధముగ చెప్పుము:- " నేను ప్రాణశక్తిని పంపుచున్నాను" ప్రాణశక్తిని పంపునప్పుడు కుంభకము చేయుము. క్రమశ్వాసను కూడ అభ్యసించుము. నీవు రేచకము చేయునప్పుడు ప్రాణశక్తినీనుండి వారి వద్దకు పోవుచున్నదని భావించుము. ఆ ప్రాణశక్తి ఆకాశము నుండి పోయి రోగియొక్క శరీరములో ప్రవేశించుచున్నదని కూడ భావించుము. ఈ ప్రాణశక్తి రేడియోవలె ప్రపంచమునందలి ఏభాగమునకైన పోగలదు. నీవు కోల్పోయిన ప్రాణశక్తి కుంభకముచేయుటచే తిరిగి లభించును. చాలకాలము, దీర్ఘముగను, శ్రద్ధగను అభ్యసించిన మీదట యీపద్ధతి ప్రకారము చేయుట సిద్ధించును.

విశ్రాంతి

శరీరమును, స్నాయువులను సడలించి వుంచుటవలన శరీరమునకు మనస్సుకు విశ్రాంతి లభించును. ఇందుచే స్నాయువుల ఈడ్పుతగ్గును. ఈ రహస్యము తెలిసిన వారు తమశక్తిని వ్యర్ధము చేసికొనరు. ధ్యానమును కూడ చక్కగా చేయ గలుగుదురు. కొద్ది దీర్ఘ శ్వాసలను తీసికొని శవాసనములో వలె వెల్లకిల పడుకొనుము. పాదములనుండి తలవరకు శరీరమునంతను సడలించి వుంచుము. ఆ తరువాత ఒకప్రక్కకు ఒత్తిగిల్లి పడుకొని స్నాయువుల నన్నింటిని సడలించి వుంచుము. స్నాయువులకు ఏవిధమగు శ్రమయుకలుగనివ్వరాదు. మరల రెండవ వైపుకు ఒత్తిగిల్లి స్నాయువుల నన్నిటిని సడలించుము. సాధారణముగ గాడనిద్రాసమయమున యీ రీతిని అందరూ చేసెదరు. ఒక్కొక్క స్నాయువుకు విశ్రాంతి నిచ్చుటకు ఒక్కొక్క రకపు అభ్యాసము గలదు. తల, భుజములు, మోచేతులు, ముంజేతులు, మణికట్టు, తొడలు, కాళ్ళు, చీలమండలు, కాలి బొటన వ్రేళ్ళు, మోకాళ్ళు మొదలగు ప్రతిభాగమునకు విశ్రాంతి నిమ్ము. వీనిని యోగులు బాగా ఎరుగుదురు. ప్రతి అభ్యాసమును చేయునప్పుడు, ఆ భాగము తన బాధలను పోగొట్టు కొని, బలమును సంపాదించు కొనుచున్నదని మానసికముగ భావించుము.

మానసిక విశ్రాంతి

మనశ్శాంతి, సమానత్వములు - కోపము, చీకాకు లను నవిలేకున్నచో లభించును. కోపము చీకాకులకు వెనుక భయము దాగి యుండును. కోపము, చింతలవలన వచ్చునదేమియూ లేకపోగా మిక్కుటమగు శక్తి వ్యర్థమగును. ఈ రెండు దుర్లక్షణములు గలవాడు దుర్బలుడే. కావున జాగ్రత్తగలిగి యుండుము. అన్ని విధములగు అనవసరపు చీకాకు చింతలను పారద్రోలుము.

15 నిమిషముల సేపటివరకు శరీరమును సడలించి, సుఖముగావుండు ఆసనములో వుండుము. కనులు మూయుము. మనస్సును బాహ్యవిషయములనుండి మరల్చుము. మనస్సును నిలుకడ గలదిగా చేయుము.

సంకల్పముల నన్నిటిని శాంతింప జేయుము. కొబ్బరి పెంకు, లోపలనున్నకురిడీ రెండును ఏ విధమగ విడివిడిగా నున్నవో, అదేరీతిని నీశరీరము, నీవు భిన్నభిన్నముగా వున్నారని తలచుము. ఈ శరీరము నీ చేతియందలి ఒక పరికరమని తలంచుము. నీవు సర్వవ్యాపియగు ఆత్మనని తలంచుము. సముద్రమునందు తేలియున్న గడ్డిపోచవలె, అనంతమగు ఈ ఆత్మయందు నీ శరీరమున్నూ, సమస్త ప్రపంచమున్నూ తేలియున్నవని తలంచుము. పరమాత్మతో సంబంధము కలిగి యున్నటుల అనుభవించుము. ఈ సమస్త ప్రపంచము నీవల్లనే జీవించియున్నదని అనుభవించుము. జీవితమనెడి మహాసముద్రము నిన్ను, తనలోనికి, నెమ్మదిగా గొంపోవుచున్నదని అనుభవించుము. ఆ పిదప కన్నులు తెరువుము. అప్పుడు నీకు గొప్ప మనశ్శాంతి, బలము, పుష్టివచ్చును. దీనిని అభ్యసించి అనుభవించుము.

ప్రాణాయామావశ్యకత, లాభములు

"అనేక జన్మములనుండి కలిగిన ఈ మాయాప్రాపంచిక వాసనలు అనేకమారులుగ చాలా కాలమువరకు యోగసాధనచేయనిదే నశింపవు"

(ముక్తి కోపనిషత్తు)

"మోక్షము నివ్వగల జ్ఞానము యోగసాధన చేయకుండ ఎటుల లభించును? అంతేకాదు. జ్ఞానోదయముకానిదే యోగము కూడ మోక్షము నివ్వజాలదు. కావున ఇంద్రియములను వశపరుచుకొనిన పిదప, సాధకుడు యోగము జ్ఞానము రెండింటిని గురించిన్నీ తీవ్రమగు సాధనచేయవలెను."

(యోగతత్త్వోపనిషత్తు.)

"తత:క్షీయతే ప్రకాశావరణం -"

ఆ పైన వెలుగుకు గల ఆవరణ పోవును.

(యోగసూత్ర 2-52)

తమస్సు, రజస్సు అనునవి రెండునూ అడ్డంకులు. ఇవి రెండూ ప్రాణాయామమువల్ల నశింపగలవు. ఈ రెండింటినీ నాశనమొనర్చినపిదపనే ఆత్మయొక్క నిజమైన ప్రకృతి తెలియగలదు. "చిత్త" మనునది సాత్విక పదార్థములచే చేయబడినదై వున్నప్పటికికూడ, అది రజస్తమములను పొరలచె మూసివేయ బడియున్నది. ఇవి నిప్పు పొగచేకప్పివేయబడి కనిపించకుండ చేయబడినటుల చిత్తముయొక్క ప్రకృతిని తెలిసికొనుటకు వీలులేకుండ చేయుచున్నవి. వీటినుండి విముక్తినిపొందుటకు ప్రాణాయామమునకు మించినదిలేదు. ఇది పవిత్రత, జ్ఞానములను కలిగింపజేయును. జ్ఞానశక్తిని కప్పి వేసియున్న కర్మయను పొర ప్రాణాయామముచే తొలగింపబడును. పునర్జన్మలకు కారణమగు యీ కర్మను ప్రాణాయామాభ్యాసముచే లేకుండ చేసి కొనుము.

మనుమహర్షి, "నీ దోషముల నన్నిటిని ప్రాణాయామమనెడు అగ్నిచే దగ్ధము చేయుము" అని చెప్పెను. విష్ణు పురాణములో, "ప్రాణశక్తిగా చెప్పబడిన యీ వాయువును ఎల్లప్పుడు గైకొన గోరుచుండువానిచే ప్రాణాయామసిద్ధి పొందిన వానినిగా చెప్పవలెను." అని గలదు.

"ధారణానుయోగ్యతా మనన:"

మనస్సు ధారణచేయుటకు యోగ్యమైనదిగా అగును. (యోగసూత్ర 2-53)

జ్ఞానావరణ తొలగింపబడిన పిదప, గాలిలేనిచోట దీపము ఏ రీతిని నిలుకడ గలదిగా వుండునో, ఆ విధముగా మనస్సు ధారణచేయుటకు అనువైనది యగును. కొన్ని కొన్ని సమయములందు రేచక పూరక కుంభకములను మూటినీ కలిపి ప్రాణాయామమనిన్నీ, కొన్ని సమయములందు వీటిలో ప్రతి దానిని ప్రాణాయామమనిన్ని వాడబడినది. ఆకాశతత్వమున ప్రాణవాయువు సంచరించుచున్నప్పుడు శ్వాసయొక్క నిడివి చాల తక్కువగ వుండును. ఇట్టి సమయమున శ్వాసను సులభముగా ఆపివేయవచ్చును. ప్రాణాయామముచే మనశ్చాంచల్యము పోవుటయే గాక వైరాగ్యోదయము కూడ కాగలదు. ఒక అంగుళము నిడివిగల శ్వాసను లోపల ఆపివేయుటచే భవిష్యత్తు చెప్పగల శక్తియూ, రెండు అంగుళములు ఆపుచేయ గలుగుటచే ఇతరుల మనస్సునందుగల విషయములను చెప్పగలశక్తియు, మూడంగుళములవల్ల భూమిపై నుండి లేవగలుగుటయు, నాల్గంగుళములవల్ల యోగ దృష్ట్యాదులును, అయిదంగుళములవల్ల ఎవరికినీ కనిపించకుండ వుండగలుగుటయు, ఆరంగుళములవల్ల కాయసిద్ధియు, ఏడంగుళములవల్ల పరకాయ ప్రవేశమున్నూ, ఎనిమిదంగుళములవల్ల ఎల్లప్పుడు పడుచువానివలె వుండగలశక్తియు, తొమ్మి దంగుళములవల్ల దేవతలచే సేవకులవలె పనిచేయించుకొన గలుగుటయు, పదంగుళములవల్ల అణిమాది సిద్ధులును, పదకొండంగుళములవల్ల పరమాత్మైక్యము సిద్ధించును. మూడుగంటల సేపటివరకు పూర్తిగా కుంభకము చేయగల యోగి, తన కాలి బొటనవ్రేలిపై శరీరము నంతను నిలపగలడు. ఇంతేగాదు అన్నివిధములగు సిద్ధులను పొందును. అన్నివిధములగు పాపములను పోగొట్టుకొనినవాడగును. ప్రత్యాహారమువల్ల మనశ్శాంతి లభించును. ధారణ వల్ల మనస్సు నిలకడ గలదిగా యగును.. ధ్యానము శరీరమును ప్రపంచమును మరచులాగున చేయును. సమాధి బ్రహ్మానందము, జ్ఞానము, శాంతి ముక్తుల నిచ్చును.

"శస్తుంతాలు చక్రం తత్ర అమృత తధారా ప్రవాహ కంటిక మూలరంధ్ర రజతంతి సంథిని వివర్థ్వరం తత్ర శూన్యం ధ్యాయేత్ చిత్లయోభవతి" యోగ సమాధి సమయమున బొడ్డునుండి తలవరకు బ్రహ్మ రంధ్రము నందలి అమృతము ప్రవహించును. అప్పుడు యోగి దానిని ఆనందముతో పానము చేయును. ఈ యోగామృతమును పానము చేసి నెలల తరబడి ఆహారము లేకుండ వుండగలడు. అప్పుడు శరీరముసన్నగను, బలముగను ఆరోగ్యముగను వుండును. లావు తగ్గును, ముఖమునందు తేజస్సు వుండును. కనులు ప్రకాశవంతముగ మెరయు చుండును. గొంతు మధురముగ వుండును. ఆంతరిక అనాహత శబ్దములు చక్కగా వినిపించును. అన్ని రోగములనుండి విముక్తుడగును. బ్రహ్మచర్యమును గలిగి యుండును. వీర్యము చిక్కగా వుండును. జఠరాగ్ని పెంపొందును. అప్సరసలు వచ్చి మీద పడినను కూడ చలించని మనో నిలుకడను కలిగి యుండును. ఆకలి చక్కగా వుండును. నాడులు పరిశుద్ధ మగును. మనస్సు ఏకాగ్రత గలదిగా అగును. రజస్తమములు నిర్మూల మగును. ధారణా ధ్యానములు చేయుటకుగాను మనస్సు యోగ్యమైనదిగా అగును. మల మూత్రముల పరిమాణము తగ్గును. ఊర్థ్వ రేత యోగి యగును. ఉచ్చస్థితికి వచ్చిన సాధకులు పైసిద్ధులనన్నిటిని పొందెదరు.

సామాన్య జ్ఞానమునకు అందుబాటులో లేని అనేక విషయములుగలవు. వాటిని ధారణ ధ్యానాదులవల్ల మాత్రమే తెలిసికొనగలము. అట్టిజ్ఞానమును సంపాదించుటయే యోగము యొక్క ఆదర్శము. ప్రాణాయామమువల్లనే యిట్టిస్థితిని పొంద గలము. అప్పుడే మనకు ఆత్మజ్ఞాన ప్రాప్తికాగలదు.

_____

ప్రత్యేక సూచనలు

1. ఉదయము పెందలకడ కాలకృత్యములను తీర్చికొని సాధన చేయుటకు కూర్చొనుము. తేమ లేకుండావుండి; చక్కగా గాలివచ్చెడి గదిలో ప్రాణాయామము చేయుము. ప్రాణాయా