Jump to content

ప్రసార ప్రముఖులు/మున్నుడి

వికీసోర్స్ నుండి

మున్నుడి

ప్రసార ప్రముఖులు అనే శీర్షిక చూడటం తోటే 'అరె, నేను వ్రాసి వుండవలసిన శీర్షిక ఏమో' అనిపిస్తుంది. అయినా నా కిష్టుడు చాలా సమర్థుడు అయిన శ్రీ అనంత పద్మనాభరావు దానిని సిద్దం చేసి నన్ను మున్నుడి వ్రాయమని ఒకసారి దానిలో ప్రవేశం కలిగించారు.

నిజానికి నేను ఆకాశవాణి చరిత్ర Chronology (చారిత్రక పౌర్వావర్యం) సరిగ్గా తెలిసిన కొద్ది మందిలో ఒకణ్ని అయినప్పటికీ నామస్మరణంలోను, చర్విత చర్వణంలోను కొంచెం ముందు వెనుకలు తప్పనిసరిగా తారసిల్లడం సహజం !

ఇందులో దక్షిణ భారతంలో భారతీయ రేడియో (All India Radio) తొలి కేంద్రం నెలకొల్పడానికి Asbestos అట్టలను, స్టూడియో నిర్మాణానికై వడ్రపు కొయ్యలను, ఎగ్మూర్ మార్షల్స్ రోడ్డు, Eastnoox సౌధం పై డాబాల గదుల్లో వడ్రంగపుపనులు, తాపీ పనులు జరుగుతున్న సమయంలో ఆనాడు A I R తో ఏ సంబంధం లేని నేను ఆంధ్ర విశ్వవిద్యాలయ ఎం. ఏ విద్యార్థిగా మదరాసు కేంద్ర ప్రారంభ సమయంలో కేవలం ప్రేక్షకుడుగా వుండటం ఈనాటికి ఆశ్చర్యం కలిగిస్తుంది.

మదరాసు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలో యువకుడు వర్థిష్ణువు అయిన డా. బెజవాడ గోపాలరెడ్డిగారికి మే 8 వ తేదీ 1938న గురుదేవులు ఠాగూరు జన్మదినాన తన వివాహం జరగాలనే కోరికపై ముహూర్తం పెట్టారు. నవ్యసాహిత్య పరిషత్ కవులను ఆ పెళ్ళికి ఆహ్వానించారు. పచ్చయప్ప కళాశాల విడిది. శివశంకరశాస్త్రి కృష్ణశాస్త్రి వంటి కవులతో వారి శిష్యప్రాయుడుగా నేనూ ఒక కవిగా వెళ్ళాను.

జూన్ 1 వ తేదీన ప్రారంభించవలసిన మదరాసు కేంద్రంలో మొదటి నాటకం ఆ డాబా మీద గుండ్రని దిండ్లని, హుక్క గొట్టాలని (మొగల్ వాతావరణం కోసం) పెట్టుకొని కృష్ణశాస్త్రి సలీంగా, అయ్యగారి వీరభద్రరావు అక్బరుగా, వడ్డాది రామచంద్రమూర్తి అబుల్ ఫజుల్‌గా, S. N. మూర్తి ఫైజీగా నటిస్తు న్నారు. ఆచంట జానకీరాం నలుగురి నాటకాలు ఏర్చి కూర్చిన అనార్కలి నాటకం రేడియో స్క్రిప్టురిహార్సల్సు జరుగుతున్నాయి. కృష్ణశాస్త్రి మేనకోడళ్లు ఏ కారణం చేతనో రాకపోవడంవల్ల అనార్కలి నాటకం కోసం ఆయన వ్రాసిన పాటలు నాకు వచ్చి వుండటంతో పన్యాలరంగనాధరావు భార్య సరస్వతికి, లీలకు నేర్పాను. వసుమర్తి విశ్వేశ్వరమ్మ అనార్కలి తనకంటె చదవడానికి తన చెల్లెలు భానుమతి యోగ్యంగా వుంటుందంటే ఆమెను తీసుకొచ్చారు.

ఈ నాటకం నేను యూనివర్శిటీ కెళ్ళి జూన్ 1 వ హాస్టల్ లో విన్నాను. ఇది రేడియోలో చేరడానికి రెండేళ్ళ ముందు, తర్వాత జ్ఞాపకానికి తెచ్చుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.

అప్పుడు రేడియో తెలుగు త్రిమూర్తులు అనేవారు. ఆచంట జానకీరామ్, అయ్యగారి వీరభద్రరావు, సూరినారాయణ మూర్తి, ఇందులో ఆచంట మంచి కల్పనా శక్తి, క్రియాశీలత కలిగి బ్రహ్మ కింద పోల్చేవారు. పరిపాలనా దక్షుడైన మూర్తిగారు విష్ణువు. విమర్శ విహార పట్టభద్రుడైన వీరభద్రుడు శివుడు. నాకు ఈ ముగ్గురు దగ్గర పనిచేయడం విశేషం. ఒక్కొక్కరి ప్లానింగు ఒక్కోరకం. వాళ్ళ మనసులెరిగి పనిచేయడం నా విజయానికి దోవ తీసేది. వీళ్లు క్రమంగా మదరాసు కేంద్రం వదలి ఇతర కేంద్రాలకు ప్రమోషన్, బదలీల మీద వెళ్ళేవారు, వచ్చేవారు.

1948 డిసెంబరు 1 న విజయవాడ కేంద్రానికి N. S. రామచంద్రన్, అయ్యగారి వీరభద్రరావుల నేతృత్వంలో ప్రారంభం జరిగింది. బాలగురుమూర్తి, యండమూరి సత్యనారాయణ సీనియర్ PEXలు. అప్పుడు సాయంత్రం 5-30 గం॥కు ప్రసారం మొదలయ్యేది. ఒకవారం నా సహచర మిత్రులు నేను P. భానుమతి కలిసి పాడిన తెలుగుతల్లి పాటతో ప్రసారాలు ప్రసారం చేసేవారు. ఇది నేను ప్రత్యేకంగా యూనివర్శిటీలో కట్టమంచి రామలింగారెడ్డి కోరికపై వ్రాసిన పాట. 'పసిడిమెరుంగుల తళతళలు' అని పాట మొదలు. అక్కడాయిక్కడా కూడా ప్రధమశ్రేణి కవులు, సాహిత్య పరులు సర్వశ్రీ కృష్ణశాస్త్రి, పింగళి లక్ష్మీకాంతం, కందుకూరి రామభద్రరావు, బందా కనకలింగేశ్వరరావు, తర్వాత హైదరాబాద్‌లో స్థానం నరసింహారావు, మునిమాణిక్యం, నాయని సుబ్బారావు, గోపీచంద్ సన్నిహితులుగా వుండేవారు.

ఇక ఈ పుస్తకం విషయాని కొద్దాం.

ప్రసార ప్రముఖులను గూర్చి తలపెట్టిన ఈ రచన మా మిత్రులు డా. ఆర్. అనంత పద్మనాభరావు మదరాసు, విజయవాడ, హైదరాబాదు కేంద్రాలు మాత్రమే గాక తదితర కేంద్రాలు, ఢిల్లీలోని వార్తా విభాగము, డైరక్టర్ జనరల్ కార్యాలయము, మిగిలిన కేంద్రాల ప్రముఖుల విశేషాలను అన్నిటినీ కొంత పరిశోధించి శ్రమపడి సేకరించి తయారుచేసిన ప్రణాళిక నాకెంతో మెచ్చుకోదగిందిగా కనిపిస్తోంది. లబ్ధ ప్రతిష్టు లెందరో చేరారిందులో. ఇప్పుడు సూచించిన కేంద్రాలలోను ఆయా విభాగాలలోను పనిచేసిన స్వానుభవపూర్వకమైన గ్రంథ రచయిత విషయానికి చక్కగా న్యాయం చేకూర్చారని మన:పూర్వకంగా అభినందిస్తున్నాను.

డా. బాలాంత్రపు రజనీకాంతరావు.

మాజీ స్టేషన్ డైరక్టర్