Jump to content

ప్రసార ప్రముఖులు/కైమోడ్పు

వికీసోర్స్ నుండి

కైమోడ్పు

ప్రసార ప్రముఖులు ఎందరో మహనీయులు. వారిని గూర్చి యువతరానికి తెలియదు. ఆయా రంగాలలో లబ్ధ ప్రతిష్టులైన ఈ వ్యక్తులు ఆకాశవాణిలో పనిచేయడం సంస్థకు గౌరవం తెచ్చి పెట్టింది. దిగ్ధంతుల వంటి వారి పర్యవేక్షణలో ఎన్నో మంచి ప్రసారాలు వచ్చాయి. ఆయా వ్యక్తులకు సంబంధించిన జీవితరేఖల్ని సేకరించారు. విజ్ఞాన సర్వస్వం సంపుటాలతోబాటు రేడియోలో పనిచేసిన వ్యక్తుల్ని ఎందరినో సంప్రదించాను. విషయ సేకరణ అయిన తర్వాత గురుతుల్యులు, ప్రసారమాధ్యమంలో భీష్ములు డా॥ బాలాంత్రపు రజనీకాంతరావు గారికి నా ప్రణాళిక వినిపించాను. తధాస్తు అన్నారు. వారే మున్నుడి వ్రాసినందుకు కృతజ్ఞతాంజలి.

Y's Men International వారి సభలో పాల్గొంటూ పుస్తకాలు ప్రచురించడం వ్యయ ప్రయాసలతో కూడిన పని అన్నాను. సభ చివరలో సహృదయులు శ్రీ దీవి కోదండ రామాచార్యులు స్వయంగా లేచి వచ్చి "మీ పుస్తకం నేను ప్రచురిస్తా" నని చెప్పారు. ఆయన ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యులు. మంచి మనస్సుతో వారామాట చెప్పగానే నేనీ గ్రంథం తయారుచేశాను. ప్రచురణ భారాన్ని స్వీకరించిన వారికే ఈ గ్రంథం ఆత్మీయతతో కానుకగా సమర్పిస్తున్నాను. వారి నిండు మనస్సుకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

వీలైనంత సమాచారం అందించగలిగాను. పోటోలు కూడా సేకరించి ప్రచురించాలనుకొంటే అధిక వ్యయమవుతుందని విరమించాను. ఇంకా ఎందరో మహానుభావుల వివరాలు ప్రచురించవచ్చు. ఇది తొలి ప్రయత్నమని మనవి చేస్తున్నాను. గ్రంధం అచ్చొత్తించడంలో వాణీ ప్రెస్ అధినేత శ్రీ అగ్నిహోత్రం రంగాచార్యులవారు ఎంతో శ్రద్ధ కనపరచి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

ప్రఖ్యాత చిత్రకారులు, ఆత్మీయ మిత్రులు శ్రీ మారేమండ శ్రీనివాసరావు ముఖ చిత్రాన్ని చక్కగా తయారుచేసి అందించారు. మైత్రికి వారు మారుపేరు. ఇందులో "వారిని చేర్చలేదు, వీరిని చేర్చలేదు" అనే విమర్శకులకు ఒక్కటే సమాధానం. అందినంత మేరకు సమాచారం అందించగలిగాను. దయతో స్వీకరించండి.


1996 వైకుంఠ ఏకాదశి.

డా॥ ఆర్. అనంతపద్మనాభరావు