Jump to content

ప్రభావతీప్రద్యుమ్నము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

ప్రభావతీప్రద్యుమ్నము

ద్వితీయాశ్వాసము



చణగౌతమగోత్ర
ప్రాచీనామాత్య కీర్తిభామావిష్వ
ద్రీచీనగమనశిక్షై
కాచార్యుఁడు సూరమంత్రి యమరార్యుఁ డిలన్.

1


వ.

ఆసహస్రాక్షుం డపేక్షితప్రయోజనానుకూల్యంబుకంటె నా
పెంటిరాయంచయంచితవచనరచనావిచక్షణత్వంబు చిత్తం
బునకుం గొత్తయింపుసొంపు సంపాదింపుచుం బెంపు మీఱ
నింపులగు మెచ్చు నచ్చెరువు నిచ్చలంబులై తనర ని
ట్లనియె.

2


సీ.

శబ్దసంస్కార మెచ్చటను జాఱఁగనీక
             పదమైత్రి యర్థసంపదలఁ బొదలఁ
దలఁపెల్ల నక్లిష్టతను బ్రదీపితముగాఁ
             బునరుక్తిదోషంబు పొంతఁబోక
యాకాంక్షితస్ఫూర్తి యాచరించుచును శా
             ఖాచంక్రమక్రియఁ గడవఁ జనక
ప్రకృతార్థభావంబు పాదుకో నదుకుచు
             నుపపత్తి యెందు నత్యూర్జితముగ

తే.

నొకటఁ బూర్వోత్తరవిరోధ మొందకుండఁ
దత్తదవయవవాక్యతాత్పర్యభేద
ములు మహాకావ్యతాత్పర్యమునకు నొనరఁ
బలుక నేర్చుట బహుతపఃఫలము గాదె.

3


క.

నీ వెవ్వరికొలఁదియుఁ గా
వోవరటామణి విహంగయోషవె భాషా
ప్రావీణ్యము చూడఁగ వా
గ్దేవతవో కాక యాకె దిద్దినకవివో.

4


క.

అనుటయు రెండవపక్షం
బనిమిషవర తప్ప దెట్టియర్థమును దగు
ల్కొనఁ దివియక వెలివో ని
చ్చునె బుధుఁ డూహించి చేయుసుకవిత్వంబుల్.

5


ఆ.

విను సురేంద్ర పద్మజునితేరు దివుచు సా
రంధరాఖ్యుఁ డగుమరాళవిభుని
బిడ్డ నేను వాణి పెనుపంగఁ బెరిఁగి త
ద్విమలశిక్షఁ గంటి విద్య లెల్ల.

6


వ.

అని రాజహంసి తనపూర్వం బెఱింగించిన దేవేంద్రుండు
దానంజేసి కాదే నీ వింతసామర్థ్యంబునం బొలుపు మీఱు
చున్నదానవు మీఁదికార్యంబునకుం బర్యాకులితభావం
బునం జేసి త్రోవఁ గానక దీనతనున్న మాకు మాపాలి
భాగ్యదేవత యీవిధంబున నిన్ను నన్నిటికి నాధారంబుగా
ననుగ్రహించెం గావున దేవకార్యంబు కడముట్ట నిర్వ
హించుటకు నీవతక్క నొరులు నేర రిది యంతయు నెఱింగి
యెంతయుం బ్రార్థించెద నంచబలఁగంబుతో నెప్పటియట్ల

వజ్రపురంబున కరిగి కేలిదీర్షికల విహరించుచుఁ బ్రభావతి
తోడి చెలిమి కలిమికి నుపాయం బొనర్చి యమ్ముద్దియకుం
బ్రద్యుమ్ను నం దనురాగంబు బలియునట్లుగా వలయు తెఱం
గున నతనిగుణంబు లభివర్ణించి యాయిద్దఱకును శీఘ్ర
సంగమం బెవ్విధంబున నగు నది నీవ యెఱింగి సంఘ
టింపుము.

7


క.

ఏ ననిపితి నని ద్వారావ
తీనగరికిఁ బోయి వాసుదేవునితో నీ
పూనిక సకలము చెప్పి న
వీనాదృతి నతనిబుద్ధి విని చనవలయున్.

8


క.

అని హంసంబుల నన్నిటిఁ
గనుఁగొని మీ రెల్ల దీనికార్యవిధికి న
త్యనుకూలత మై నేత
ద్వినియోగము నడపవలయు దేవహితముగన్.

9


ఆ.

అని యనుప మరాళి యమరాళికార్యం బొ
నర్పఁ జనియె సురలు నమ్మి పొగడఁ
బరిగణింప విశదపక్షపాతులప్రవ
ర్తనము లెట్లు నమ్మఁ దగక యున్నె.

10


వ.

అది యట్లుండె నట్లు గదలి చని.

11


తే.

అష్టమహిషీసమేతుఁ డై యాలయోప
వనసరస్తీరమంటపవర్తి యైన
కృష్ణు దవుదవ్వులన విలోకించి తెలిసి
యితని నెఱిఁగించుకొన వేళ యిదియ యనుచు.

12


క.

తనయంచబలంగముఁ దా
నును శుచిముఖ నభము డిగ్గి నూత్నవిలాసం

బొనరించె సరోలక్ష్మికిఁ
గనకాంచితపక్షచకచకద్యుతిచేతన్.

13


వ.

తదనంతరంబ తా నొక్కతియ రక్కసులగొంగచెంగటికి నల్ల
నల్ల నడచి.

14


సీ.

తొడలు తలాడగా నిడి రుక్మిణి భజింపఁ
            బదము లొత్తుచు సత్యభామ కొలువ
సురటి చేకొని భద్ర శుశ్రూష గావింప
            విరిచామరము మిత్రవింద యిడఁగఁ
గాళింది వేడ్కతోఁ గాళంజిఁ దాల్ప జాం
            బవతి తములపాకు మడిచి యొసఁగ
గొడుగు పావలు కేలఁ గొని నాగ్నజితి యుండ
            జలములగిండి లక్షణ వహింపఁ


తే.

గ్రొమ్మెఱుంగులతోడి కార్మొగులు వోలె
నొప్పుకృష్ణునిచేరువ నొప్పె హంసి
నిండునెలరీతిఁ దారకాన్వితనభంబు
పొలుపుఁ దెలిపెడినెత్తమ్మికొలని కెలన.

15


తే.

బెదరు లే కిట్లు మిక్కిలి గదియ వచ్చి
యున్న తనదిట్టతనమున కువిద లెల్ల
నరుదుపడఁ గృష్ణుఁ జూచి న న్నమరవిభుఁడు
పనిచె నీ కొక్కమాట చెప్పంగ ననియె.

16


వ.

అని తదనంతరంబ.

17


క.

తనతనయుఁడు రాక్షసుపైఁ
జనియెడు నని రుక్మిణికి నసమ్మత మగునో

యనుశంకఁ జేసి హంసాం
గన యేకాంతంపుమాట గల దని పల్కెన్.

18


క.

పలికినఁ గమలావిభుఁ డా
పులుఁగుపడఁతిమాటనేర్పు బుద్ధికళాకౌ
శలమును మెచ్చుచు నెంతయు
మొలకనగవు చెక్కుటద్దములఁ దళుకొత్తన్.

19


చ.

చెలువుగ భోజకన్యతొడఁ జేర్చినమూర్ధము సత్యభామయూ
రులపయి నున్నపాదములుఁ బ్రోర్జితలీలఁ దరల్చి లేచి యు
జ్జ్వలనిజపాణిపద్మమున జాంబవతీకరనాగవల్లికా
దళములు పుచ్చుకొన్నఁ బ్రమద ల్చనిరందఱుఁ గొంతదవ్వుగన్.

20


తే.

ఇట్లు గోవిందుఁ డేకాంత మిచ్చి వినఁగ
హంసి తము వజ్రి పిలిపించు టాది గాఁగ
నచట కనుచుట తుద గాఁగ నతనితమవ
చఃప్రసంగంబు నిరవశేషముగఁ జెప్పె.

21


వ.

ఇట్లు చెప్పిన.

22


చ.

వడుగులప ల్కుపశ్రుతిగ వారక మున్ను సునిశ్చితత్వమున్
బడసిన కార్యపద్ధతికిఁ బక్షివధూవచనక్రమంబుచేఁ
గడమ సమర్పితం బగుడుఁ గంజదళాక్షుఁడు సంతసిల్లె నే
ర్పడియెను వజ్రనాభవధభారవహుం డిపు డంచు నాత్మలోన్.

23


వ.

ఇట్లు సంతసిల్లి శుచిముఖి కిట్లనియె.

24


చ.

బలవిభవాభిశోభితుఁ డభంగురశౌర్యధురంధరుండు కా
వలసినమాయలు న్దివిజవైరులకంటెఁ గరంబు నేర్చు నీ
పలుకులచంద మారయఁ బ్రభావతికిం బతిగాఁ గలాఁడు ని
చ్చలముగ రుక్మిణీసుతుఁడు చంపు నవశ్యము వజ్రనాభునిన్.

25

క.

ఆరాక్షసుపట్టణ మె
వ్వారికిఁ దదనుజ్ఞ లేక వైరమునఁ జొరం
గా రాదఁట ప్రద్యుమ్నుఁ డ
వారణఁ దత్పురముఁ జొచ్చువైపు విను మిఁకన్.

26


సీ.

భద్రాఖ్యు డగు నటప్రముఖుఁ డొక్కరుఁడు ము
            న్నరుదెంచి మజ్జనకాధ్వరమున
ననయంబుఁ గూడినమునిసభం దననాట్య
            గరిమచే మెప్పించి వరము గాఁగఁ
దన కవధ్యతయు సప్తద్వీపగమనంబు
            నాకాశగతియు నాట్యములయందు
నెవ్వరిరూపు వహించె వారలయట్లు
            తాను భేదము లేక తనరుటయును


తే.

బడసి యేడుదీవుల నాటపస నెరపుచుఁ
దిరుగుచున్నాఁడు వానిపై దితిసుతునకు
వేడ్కఁ బుట్టంగఁ జెప్పి యవ్వీడు చొరఁగ
ముదలగొను మాతఁడై వచ్చు మదనుఁ డంత.

27


వ.

ఇది నీకుఁ బరమప్రయోజనంబు దీన నుపయోగింపఁ దగిన
యవాంతరకృత్యంబులుఁ దత్తదుపాయంబులు నీవ యెఱుం
గుదు పొమ్ము సురకార్యంబు నిర్వహింపు మని వీడుకొలి
పినం దనమరాళజాలంబుతో జాలపాదవనిత గగనంబున
కెగసి వజ్రపురంబున కభిముఖంబుగాఁ బ్రయాణంబు సలుపు
నప్పుడు ద్వారకానగరబాహ్యప్రదేశంబున వాహ్యాళివిహార
సారస్యంబునం దగిలి యున్న ప్రద్యుమ్నుండు.

28

చ.

తనహృదయంబు వెంబడిన తప్పక ఘోటక మంతనంతనే
పనుపడ నిల్చి ముందఱకుఁ బాఱి కెలంకులకుం దొలంగి దా
వెనుకకు నేఁగుదెంచి కడువేడ్క యొనర్పఁగ బంతియాడ నే
మ్మిని గనకంపుఁగోల నడిమింటనె త్రిమ్మరఁదారి కొట్టుచున్.

29


వ.

మఱియును.

30


చ.

ఎగురఁగ వైచి కొట్టు టది యెంతభరం బని బంతి యగ్రగా
మిగ వడిఁ బాఱవైచి పుడమిం బడనీకయె దాని మీఱి చి
త్రగతి హయంబుఁ దోలుచును గ్రమ్మఱ మీఁదికిఁ గొట్టియాడె విం
తగఁ దనచేతిరత్నమయదండము కాంతులు గాడి పాఱఁగన్.

31


వ.

వెండియు నతండు మండలగతుల నతులంబుగాఁ దురంగంబుఁ
డోలి యాడె నప్పుడు.

32


సీ.

తొలుదొల్త నయ్యేకతురగంబు మండల
            గతిచారి యగుచు నిక్కంబు తోఁచె
నావెనుకను సరూపాశ్వాలి చెదరక
            చక్రాకృతిని బర్వుసరణి తోఁచె
నంతట ననతిస్ఫుటావయవంబుగా
            నెనసి యేకాంగవేష్టనత తోఁచెఁ
దుదఁ దద్విభూషణద్యుతిరాజిమాత్రంబు
            కొఱవి త్రిప్పినరీతి మెఱసి తోఁచె


తే.

అంతకంతకు గతివేగ మగ్గలింప
రాఁగ వాగె యెచ్చరిక పరాకు జియ్య
యనుజనులు ఱిచ్చవడి తమపని మఱవఁగఁ
బరఁగునమ్మేటినెఱరౌతు ప్రౌఢికతన.

33

చ.

ఉరుజవశాలి యత్తురగ ముల్ముకచక్రనయావలంబి యై
తిరుగు రయంబుచేత నెడత్రెవ్వక కుమ్మరిసారెచాడ్పునన్
బరఁగెఁ గడున్ ధృతాభినవభాండతకుం దగనున్కిపట్టు దాఁ
దరలక పైని దద్భ్రమణదండగతిన్ హరిపుత్త్రుఁ డొప్పఁగన్.

34


వ.

అతఁ డంత.

35


క.

వల్గితముఖగతిపంచక
వల్గువిహారముల సైంధవము నలయించెన్
వల్గావిభాగకుశలత
వల్గత్కుండలమరీచివల్లరు లెసఁగన్.

36


శా.

నానావీథిగతిప్రభేదవిహృతిన్ సంతృప్తుఁడై కంతుఁ డిం
పూనన్ వాగె గుదించినన్ బురుషకప్రోన్నమ్రపూర్వాంగమై
కానంగాఁ బడియెన్ మరుజ్జవన మాగంధర్వ మర్కాశ్వసం
తానస్పర్ధను మిన్ను వ్రాఁకెడుక్రియన్ దా నెంతయుం జూడ్కికిన్.

37


సీ.

 సముపలాలనయుతస్కంధాంతికాస్ఫాల
            దమితతేజోమహద్ధత్యకంబు
దంతాళికానియంత్రణసమున్నామితా
            కుంచితగ్రీవాసమంచితంబు
దందన్యమానశబ్దాయమానఖలీన
            ఖషణఝర్ఝరితసృక్వద్వయంబు
ఘనఘర్మడిండీరఖండపాండురితప
            ల్యయనవర్ధ్రోభయప్రాంతకంబు


తే.

నగుహయము డిగ్గెఁ బ్రద్యుమ్నుఁ డంకవన్నె
యొకటి సాహిణి యవ్వల నూఁదిపట్టఁ

దనయనుఁగుచెలికాఁడు కైదండ నొసఁగఁ
బ్రజ సురాళించి మణులు వస్త్రములు వైవ.

38


ఆ.

అపుడు గగనసరణి నరిగెడుశుచిముఖ
యతనిఁ జూచి యల్లయతఁ డితండ
కావలయు నవశ్య మీవరపురుషుతో
మాట లాడి చనుట మనకు మేలు.

39


క.

అని యాప్రద్యుమ్నునకున్
వినఁబడునట్లుగ మరాళవితతులతోఁ బ
ల్కి నిజోక్తి కతఁడు వెఱఁగం
ద నయంబున నవియుఁ దాను ధరణికి డిగ్గెన్.

40


సే.

మరునశ్వగతి మెచ్చి సురలు వైచిన పైఁడి
            వ్రాఁతక్రొమ్మడుఁగుదువ్వలువ లనఁగఁ
దర్పకు నెఱరౌతుతనముపేర్మికిఁ గ్రమ్ము
            కొనుసతేజఃకీర్తిఘనము లనఁగ
హయఫేనధావళ్యయాచ్నార్థమై వ్రాలు
            తటిదనుగతసితాబ్దంబు లనఁగ
వాజివిభ్రమజితావర్తత దొలఁకుది
            వ్యులయేటిసాబ్జరేణూర్ము లనఁగఁ


తే.

గనకరేఖలతోడి ఱెక్కలబెడంగు
చూపఱకుఁ గనుపండువై సొంపు మీఱ
జలదపథముననుండి భూస్థలికి డిగ్గు
హంసములు వర్ణనాసీమ నతకరించె.

41


సీ.

ఇట్లు గన్పట్టుచు నేతెంచి యంచలు
            వసుధచేరువ నేటవాలుగాఁగ

నతినిశ్చలప్రసారితపతత్రంబులై
            డిగ్గుచుఁ గామునిముందటికిని గొంత
సరి గడవఁగఁ బాఱి మరలి బోరలు దెట్ట
            గిల నొక్కకడ పంచి మలపు దిరిగి
యెఱక లంతట రెండు నెఱయఁ జక్కఁగఁ జాఁచి
            యవనిఁ గా ల్మోపి ఱెక్కార్చి ముడిచి


తే.

మొగము లొకవింత యొయ్యారముగ మలంచి
యీఁకను విదిర్చికొనుచు నొక్కింతతడవు
హైమరేఖావిచిత్రనిజాంగరుహవి
నిర్మలతఁ జూడ్కులకు నింపు నింపు చుండె.

42


వ.

అంతఁ బ్రద్యుమ్నుఁ డుద్యోతమానకౌతుకంబున వాని నుప
లక్షించి పక్షివరులారా తొలుత నితనితో మాటలాడవలయు
ననుకొంటి రిచ్చట నెవ్వనితో నేమి మాటలాడవలయు
నతనిం బిలిచి సంభాషింపఁ డెట్టిప్రయోజనంబున నెందుఁ
బోవుచున్నవారలో మీర లన్యోపరోధంబునం గార్యవిరో
ధంబు సైరించి యుండరుగదా యనుశంకచేత సంకోచంబు
లేక వేగిరించి యీగతిఁ బలుకవలనెఁగాని భవదీయసన్ని
ధానసౌభాగ్యంబునం దనిసి కాదు మీరూపచేష్టావచో
విశేషంబు లరయ దివ్యజాతిపక్షులరు గాని ప్రకృతిహంసం
బులు గా రనుటయును నంత శుచిముఖి యఖిలజనమనో
హరం బైన మధురస్వరంబున ని ట్లనియె.

43


ఉ.

ఇచ్చట మేము వేఱ మఱి యెవ్వరితోడను మాటలాడఁగా
వచ్చెద మచ్యుతాత్మజ దివస్పతిపంపునఁ గృష్ణుపాలికిన్

వచ్చి యతండు వీడ్కొలుప వారలయిద్దఱయాజ్ఞలున్ గడున్
హెచ్చరికన్ ధరించి యిపు డేఁగెడులాగిది యొక్కచోటికిన్.

44


ఉ.

ఇప్పుడు నిన్నుఁ జూచి కొలు వించుక చేయ కతిక్రమించి పో
నొప్పదటంచు వచ్చితిమి యోగ్యసమర్హణమాను టెంతయు
న్దప్పుగదయ్య యాదవవతంస నినుం గని నీయనుగ్రహం
బొప్పుగఁ గాంచి పోవుట ప్రయోజనసిద్ధికి మూల మారయన్.

45


క.

నీపలికినట్ల యేము సు
రాపగఁ గ్రీడించుదివ్యహంసములము నీ
చూపునకుఁ దప్పు గలదే
యేపట్టున నైనఁ బంకజేక్షణతనయా.

46


వ.

ఏము కాశ్యపులము మమ్ము నింద్రుండును మీతండ్రి యుపేం
దుండును నిజపరివారంబులోనివారిఁగా విచారించి యీ
రీతిఁ బని పంచి నడుపుకొనుచున్నవారు వారిజాక్షునకు
దక్షిణభుజాదండంబునుం బోలె నఖలకార్యంబులందు నత్యంత
ధురంధరత్వంబు వహించి యున్నవాఁడవు గావున మా
విధంబు నీకు విన్నవించుకొంటి మెల్లపట్టునం దృష్టిఁ బెట్టు
కొని యుండునది యేము పోయి వచ్చెద మనినఁ బ్రద్యు
మ్నుం డి ట్లనియె.

47


తే.

మీరు పోయెడికార్య మెవ్వారులకును
జెప్ప రాదేమొ పోనిమ్ము చెప్పు మొకటి
యల్ల యతఁ డితఁ డనుకొంటి రాది నెచట
నాప్రసంగంబు రాఁ గారణంబు గలిగె.

48


క.

అదియును జెప్పఁగ వచ్చిన
యది యైన నొకింతవడి ప్రయాణత్వరయున్

గుదియింప వచ్చునేనిన్
బదరక నిమిషంబు నిలిచి భాషింపఁదగున్.

49


చ.

అనుడు రహస్యమైనదియె యౌను భవత్పరిపృష్ట మెంతయున్
జనక నిమేషముం దడయ సంగతి గాదును మాకు నైన నీ
వనఁగ జనార్ధనుం డనఁగ నారయ భేదము లేదు కావునన్
విను వినిపింతు మాపనియు నీదుప్రసంగముమున్ను కల్మియున్.

50


వ.

అని శుచిముఖి యిట్టట్టు పలుకఁ గొంకి నలువంకలుఁ బాఱఁ
జూచుటయు నాచూపు వెంటనే శంబరాంతకుచూపు
దీపితైకాంతకాక్షం బగుచుం బరఁగినఁ బరిజనసమా
నంబుగా మాననీయులు నాయన యున్నచోటికిఁ గడు నెడ
గలుగఁ దొలంగి చని రంత నంతఁ గంతు నభివీక్షించి
యంచచెలువ చెలువంపుఁజెలువు గులుకుకలికిపలుకులకల
కలంబు వీనుల కపూర్వపర్వం బగుచుఁ బర్వుచుండ ని
ట్లనియె.

51


క.

వినవయ్య వజ్రనాభుం
డనియెడునొకదైత్యు ఁ జంప యత్నము సతతం
బును నడచుచున్నయది బహు
దినములనుండియును హరికి దేవేంద్రునకున్.

52


క.

తమకంటె మున్ను వాఁడే
తమమీఁదట నేమి కీడు దలఁచునొ యనుచున్
మము వారు వేగు పంపఁగ
నమరాహితువీటి కిప్పు డరిగెద మనఘా.

53


వ.

అనిన విని యతండు.

54

క.

కటకట మనవా రిది దు
ర్ఘటముగఁ గొని యెంతచింత గావించెద రె
ప్పటి కింక నేము మే మెం
తటిపగయును దీర్పలేమె తమయాజ్ఞపసన్.

55


క.

ఆకట తమమహిమ తా రెఱుఁ
గకయో మఱి యేలొ తెగరు గాక మరుత్కం
టకుఁ బీచ మడంపనె న
న్నొకనినె పంపినను దమనియోగముబలిమిన్.

56


వ.

అనుడు శుచిముఖి మెచ్చు నచ్చెరువు నిరవుకొన నతనిం
జూచి యి ట్లనియె.

57


చ.

భిదురధరుండుఁ జక్రియును చెట్టుగ దీర్ఘవిచార మింత చే
యుదురఁట దైత్యుఁ డెంతబలియుండొ కదా యని కోఁచవాఱ కి
ట్లుదుటున వానిఁ ద్రుంతు నను నొక్కనిఁ బంపిన నంటి చాలదే
యిది నెరవైనబంటుతన మిట్టిది నీక తగుం గుమారకా.

58


ఉ.

కయ్యపువేడ్క రేఁచుకొని క్రమ్మెడుత మ్మెదిరించి యేమియున్
డయ్యక కొంతసేపు పెనుఢాకను జేతుల కాఁటి నిల్చువాఁ
డెయ్యెడఁ బోటుబంటునకు నెంతయుఁ గౌతుకకారి గాఁడె నీ
వయ్య సురేంద్రుతోడి యని కాస యొనర్చుట యుక్త మెన్నఁగన్.

59


ఆ.

తమకుఁ దామె ప్రల్లదంబునఁ బనిలేని
కయ్యమునకుఁ జనరు గాని తగిన
దుకములైనఁ దివుగుదురు తమయంతన
పిఱికికండ లేనిబిరుదుమగలు.

60


వ.

అది యిట్లుండె నింక నీప్రసంగంబు మున్ను వచ్చినతెఱం
గును విన్నవించెద వినుము.

61

ఉ.

ఇంతకుమున్ను వజ్రపురి కేఁగుచు నుండుదు మేము గావునన్
గాంతతరాంగి నద్దనుజకన్యక నే నొకనాఁడు గంటి శు
ద్ధాంతరసప్రకాండసముదంచితకేళిఁ జరించుచుండి త
త్ప్రాంతలతాగృహంబున వయస్యయుఁ దానును ముచ్చటాడఁగన్.

62


క.

తిర్యగ్వనితను నన్ను న
మర్యాదానందమగ్నమతిఁ జేసె మహా
శ్చర్యముగఁ దద్వధూసౌం
దర్యం బపు డేమి చెప్ప నలినాక్షసుతా.

63


సీ.

నెత్తము లనుచుఁ గ్రొన్నెల లంచు వటఫల
            శ్రీ లంచు తాఁబేటిచిప్ప లనుచు
నమ్ములపొదు లంచు ననఁటికంబము లంచుఁ
            బులిన మంచును సుడిచెలువ మనుచు
హరిమధ్యమం బంచు హైమకుంభము లంచు
            నవమృణాళము లంచుఁ జివురు లంచు
మదనుశంఖ మటంచు మణిదర్పణము లంచుఁ
            బగడ మంచును దిలప్రసవ మనుచు


తే.

శఫరు లనుచు సింగిణు లంచుఁ జంద్రఖండ
మనుచు శ్రీకారము లటంచు నళు లటంచు
నిట్టివి గదయ్య చెప్పఁబోయిన నుపమలు
వీనిఁ దడవ సిగ్గొదవు నవ్వెలఁది నెంచి.

64


తే.

చామరంబులు వెనుకకుఁ జనుట నీల
రత్నములు పూరిఁ గఱచుట భ్రమరక మని

తేఁటిబిడ్డపే రిడుటయా తెఱవకురుల
కధికనీలిమ నోడి సూ హరితనూజ.

65


క.

అకలుషనీలిమ నాక
న్యకకచమున కోడి పాఱినవి యై తేఁటుల్
మకరందార్థము తఱచుగ
[1]వికచములగుపుష్పములకె వెదకుచు నుండున్.

66


తే.

చంద్రభీతఘనధ్వాంతసంచయమున
కభయ మొసఁగి వేణీభరం బనునెపమునఁ
దనవెనుక వేసికొన్నది తరుణిమొగము
చంద్రుఁ గైకొనమి కిదియ సాక్షి గాదె.

67


క.

కాంతతరఫాలసంజ్ఞిత
కంతువిజయలేఖపట్టికావిన్యస్తా
ద్యంతశ్రీకారము లన
నెంతయు నాయింతివీను లిం పెసలారున్.

68


చ.

తిలకము సంహితోర్ధ్వముఖతీక్ష్ణశరాగ్రము గాఁగ నాసికాం
చలవిలసత్ప్రకోష్ఠసుమసాయకముష్టిగృహీతమధ్యశా
ర్ఙ్గలత యనన్ బొమల్ దనరఁగా నిరుగొమ్ముల వ్రేలు వెల్ల జ

ల్లులగతి నవ్వుడాలు పొదులున్ మదిరాక్షి మెఱుంగుఁజెక్కులన్.

69


ఉ.

అంబురుహాక్షినాసిక నిజాన్వయశత్రువుఁ జంపక ప్రసూ
నంబుఁ గరంబు గెల్చుట మనంబునఁ బెట్టి తదీయపార్శ్వయు
గ్మంబున నిత్యసేవకతఁ గ్రాలెడు నీక్షణతారకాఖ్యరో
లంబకదంపతుల్ పెనువళావళి నెంతయు సంభ్రమించుచున్.

70


ఉ.

బింబఫలోష్ఠికన్ను లనుబేడిసమీ లిరుదిక్కులన్ సమా
నంబుగఁ బర్వుచున్న శ్రుతినామసరోయుగశోభ లిట్టు న
ట్టుం బిరువీఁకు సేయఁగఁ గడున్ దమి నెందుకుఁ గాక రెంటిమ
ధ్యంబునఁ బాఱెడిం బరువు లారయఁ జాపల మట్టిదేకదా.

71


తే.

కలయ నాపాదమస్తకాంగములయందు
మించి పటలీలఁ దరళతోదంచిత మగు
యువతిలావణ్యమును గన్నుఁగవయు నతను
దంటమీలటెక్కియ మనఁ దనరుఁ జూడ.

72


ఉ.

ఎప్పుడు భక్తభావమున నిం పలరన్ ద్విజరాజుపాదముల్
దప్పక సేవ చేయుసుకృతంబునఁ గాంచెఁ జకోరయుగ్మ మీ
యొప్పన నొప్పుఁగన్ను లవి యోలిని గ్రోలిన తేటవెన్నెలల్
చిప్పిలినట్లు మించు సతిలేనగవున్ దెలినిగ్గుఁజూపులున్.

73


ఉ.

సౌవరమాధురీస్పృహపసం బికమో శుకమో తదీయజి
హ్వావిలసత్సరస్వతి నుపాసన చేయుచు నగ్రభూమి నిం
పావహిలంగ నేర్చి యుపహారముగా నిడినట్టిపల్లవం
బో విమలంపుబింబఫలమో యన వాతెఱ యొప్పు నింతికిన్.

74


క.

మగువయధరంబు పగడముఁ
జిగురును బింబమును బంధుజీవకమును గ

ట్టిగ గెల్చి కన్న సత్కీ
ర్తిగతి న్నాసాగ్రమణిమరీచి వెలుంగున్.

75


తే.

మృదులపవనాహతి నొకింత గదలి యాడు
పల్లవముమాటునను దోఁచు మొల్లమొగ్గ
చాలుగతిఁ బల్కుబడి మోవిచాటునఁ గనఁ
బడుచు నింతిపల్వరుస కన్భ్రాంతి పఱుచు.

76


క.

చెలువపలు కమృతరసములు
గులుకుట వీనులకె కాదు కోమలదంతా
వళిరుచియును శీకరపుం
చెలినిగ్గునఁ గన్నులకును దెల్లమ చూడన్.

77


తే.

కనకకర్ణికాధారాళకాంతు లదికి
బాహులతికలు బిరుదుసంపంగిదండ
లిరుగడల వ్రేలవైచినకరణిఁ బరఁగఁ
గంబువిజయము పచరించుఁ గాంతగళము.

78


క.

ఖరకరకరభిన్నము లై
కర మెలమి వహించునరుణకమలంబులతో
బురుడింపఁ దగునె గొజ్జఁగి
విరిఱేకులబంతిగములు వెలఁదికరంబుల్.

79


ఆ.

జిలుఁగుఁబయ్యెద యనువలలోన నాచెల్వ
గుబ్బచనుఁగవ యనుకోకయుగళి
యెగయఁ బెనఁగురీతి నెసఁగుఁ గ్రేవలఁ జల
తృక్షలీల మెఱుఁగుఁదరఁగ లడర.

80


తే.

చారుతరనాభి యనెడుగంభీరసరసిఁ
గడఁగి క్రీడించుమరునిశృంగారరసపుఁ

జిమ్మనపుఁగ్రోవిధార నాఁ జెన్ను మీఱుఁ
బడఁతినూఁగారు కన్నులపండు వగుచు.

81


చ.

తనుతరరోమవల్లరికిఁ దా నిరువంకలఁ గల్దు లేదు నా
ననయము సూక్ష్మసూక్ష్మముగ తజ్జలజాననకాను మించి లో
చనములు కిం పొనర్చుఁ గడుసన్నపుఁగారుమెఱుంగుఁదీఁగె చ
క్కనినిడుబీటవాఱి కనఁగాఁ బడున ట్లతియత్నదృశ్యమై.

82


క.

చనుఁగవవేఁగున గిటగిట
మనునెన్నడు మేమి యగునొ యనియెడిశంకన్
గనకపుఁగ ట్టిడినాఁడో
వనజాసనుఁ డనఁగ వనితవళు లిం పెసఁగున్.

83


తే.

నెన్నడిమి పేరిమింట నన్నెలఁతబొడ్డు
పొన్నవిరి నిక్కముగఁ జూచి చిన్నఁబోదు
రభ్రకుసుమసౌరభసాధనార్థహేతు
వాశ్రయాసిద్ధ మనియెడియయ్య లెల్ల.

84


చ.

సుకవులు క్రిందుమీఁ దరసిచూడక యీడని యాడుకొన్న హా
టకకదళీవిలాస మకటా విపరీతము గాక సాటియే
యకలుషరామణీయకసమంచితకోమలతద్వధూరుల
క్ష్మికి సరిగావ యెంత తల క్రిందయినన్ గరిరాజహస్తముల్.

85


తే.

రమణిజంఘలు శాలిగర్భములు హీర
దీప్తిజలపూర్తి నొప్పునందియలు మళ్లు
వానిలోపలఁ జలువకై వచ్చియున్న
కచ్ఛపంబులఁ బోలి మీఁగాళ్లు దనరు.

86


క.

కెందామరలుఁ జిగుళ్లును
సౌందర్యశ్రీలఁ దమకు సరి గా వని యా

యిందుముఖిపాదములు నగుఁ
గందళదుజ్జ్వలనఖాంశుకైతవయుక్తిన్.

87


శా.

శృంగగ్రాహికఁ జెప్ప వేఱె తెరువుల్ సిద్దింపమిం జేసి చి
త్రాంగశ్రీనిధి నవ్వధూమణిని స్థూలారుంధతీన్యాయమా
ర్గాంగీకారమునన్ వచించితిని జంద్రాద్యోపమ ల్సూచనా
భంగు ల్గాని యధస్సహస్రగుణసౌభాగ్యంబు లాయజ్ఞముల్.

88


ఉ.

వెన్నెలతేటనిగ్గు నరవిందపుఱేకుమృదుత్వముం బదా
ర్వన్నియజాళువాపసిఁడిరంగుమెఱుంగులధాళధళ్యమున్
గన్నియరూపుగాఁ గరువు గట్టి మనోజుఁడు పోఁతఁబోయఁ బో
లు న్నెఱనేర్పుతో ననుట లోకులప ల్కిది చాల దేమియున్.

89


ఉ.

ఎమ్మెయిఁ బ్రజ్ఞ మీఱ వచియించెద నన్న వచింపలేన య
క్కొమ్మబెడంగులోన నొకకోటితమాంశమునైన నంతమా
త్రమ్మ మదుక్తిశక్తి యనరా దతివాఙ్మహిమాఢ్య నేను మా
యమ్మ సరస్వతీసతి తనంతటిదానిఁగ నన్ను దిద్దుటన్.

90


వ.

అని తాను బ్రహ్మదేవుని రథవాహనం బైనసారంధరుం డను
హంసవంశాతంసుకూఁతు రగుటయుఁ దదీయసంబంధవశం
బున నంబుజాసనురాణివాసంబునందు వాణి పెంపఁ బెరుఁగు
టయుఁ దదనుగ్రహంబునం దనకు నఖిలవిద్యలుం గరతలా
మలకం బగుటయుం జెప్పి మన్ముఖంబు శబ్దసంస్కారపూతం
బనుబుద్ధి నద్దేవియ నాకు శుచిముఖి యను పే రిడియె నని
యి ట్లనియె.

91


చ.

నలినజురాణివాస మొకనాఁడు ననుం దనచేతిప్రోదిరా
చిలుకను వాదుకుం గవిత చెప్పఁగఁ దానియ మించి యందు నా

పలుకులఁ గొంతవాసి గని భావమునం గడు మెచ్చుచున్నఖాం
చలమున నాదుఱెక్కనులి చక్కఁగ దువ్వుచు గారవించుచున్.

92


చ.

ప్రబలము లైనకౌతుకకృపారసవత్సలతాదరంబులన్
శబలితచిత్త యై యపుడు నాకుపమాతిశయోక్తికామధే
నుబిరుద మిచ్చి తల్లిఖితనూపురము న్భువనైకమాత య
య్యబల మదంఘ్రిఁ దాఁ దొడిగె నా బిరుదం బిది చూడు మేర్పడన్.

93


క.

అని నిజనూపురగతవ
ర్ణనికాయముఁ ద్రిప్పి చూపి నారాయణనం
దన యిట్టినాదుపలుకుల
కు నగమ్యము దనుజకన్యకొమ రూహింపన్.

94


వ.

ఆజగన్మోహనాంగిం జిత్రఫలకంబున వ్రాసి యైనం జూపెద
నంటేని.

95


క.

ఏయంగకమును భావన
చేయక వ్రాయంగ రాదు చేసిన నానం
దాయత్తత మది చొక్కుఁ బ
రాయత్తపుబుద్ధిఁ జెలువ నలవియె వ్రాయన్.

96


వ.

అదియునుం గాక.

97


క.

అత్తరుణీమణిరూపముఁ
జిత్తరువున వ్రాయునేర్పు చేకుఱునేనిన్
దత్తుల్యవనిత నెందే
నత్తొలువేలుపు సృజింపఁడా తనసృష్టిన్.

98


ఆ.

అజుఁడె యొకప్రసంగమై చెప్ప వింటి న
క్కాంత యతనిసృష్టి గా కునికియు

నాదిశక్తి శివుమహాదేవి తనదైన
చిత్రమహిమచే సృజించుటయును.

99


క.

విను మిపు డది సంస్మృతిపద
విని జెందెను మాటమాటవెంబడి నెందే
ననుభవభవసంస్కారం
బున కుద్బోధము ప్రసంగమున నగును గదా.

100


మ.

దనుజేంద్రాంగన కంబికావరమహత్త్వస్ఫూర్తి నాలోకమో
హన జన్మించుట వింటి వెండియుఁ దదంగాలౌకికశ్రీప్రవ
ర్తన మూహించిననట్ల రెంటికిఁ గడున్ దార్కాణ మయ్యె న్మనం
బున కి ట్లిప్పుడు సంస్మృతంబయిన యంభోజాతజాతోక్తియున్.

101


క.

వినుము ప్రభావతి యన న
వ్వనితామణినామ మర్థవంత మ్మగుచున్
దనరారుచుండు ననయం
బును యదుకులకలశజలధిపూర్ణశశాంకా.

102


తే.

ఆప్రభావతి తనకల నగజ వచ్చి
వ్రాసి దయ నిచ్చె నని యొక్కరమ్యపురుషుఁ
జిత్రఫలకాభిలిఖితు నెచ్చెలియుఁ దాను
గరము వేడుకఁ జూడ నేఁ గంటి ననఘ.

103


క.

ఆకన్నప్రతిమసుద్దులు
మాకు మునుపు కలిమిఁ జేసి మహనీయతదీ
యాకృతిపొలు పంతయు భవ
దాకృతి గని యతఁ డితండ యనుకొంటి మొగిన్.

104


వ.

అని పలికి మాకు నిక్కడ మిక్కిలిం దడయుట యుచితంబు
గాదు పోయివచ్చెద మనుప నవధరించితే యనుచుఁ దోడి
యంచలుం దాను నప్పులుఁగుచెలువ యుప్పరవీథి కెగసె నప్పు

డమ్మరాళంబు లరాళంబులు గాక యాకాశభాగంబున గమన
వేగంబున దీఁగసాగినబాగు మెఱయునిజగరుత్కనకరేఖా
మయూఖంబు లాఖండలారిదిక్కునకు నక్కజంపుటెలమిం
గొనలు వాఱి యుద్దీపించు ప్రద్యుమ్నప్రతాపవైభవంబునుం
బోలెఁ జాల నాలోకనీయంబు లగుచుండఁ దత్పురస్సరత
దీయకీర్తిమూర్తివిశేషంబులో యన సోయగంబున మీఱి
గగన మంతయుం గబళించుటకు నొక్కకడకు నొత్తుకొని
పోవ బారలు చాఁచినచందంబున నిస్పందప్రసారితంబు
లైన తనూరుహంబులతోడం జూడ నొప్పారుచు నప్ప
టప్పటికి నవిరళధవళిమస్పర్ధ నుభయపార్శ్వభాగపాండురబ
లాహకంబుల నహంకృతిపెక్కువ నొక్కపెట్ట కలహించు
టకుం బిలుచుభంగి సంఘటిల్ల నుల్లసిల్లుపక్షయుగళవిక్షేప
వ్యాపారంబులచేత నుద్యోగించుచు నొక్కొక్కయెడఁ
బ్రడీనోడ్డీనసండీనయానభేదవినోదంబు లాచరించి రోదోం
తరం బంతయు నెంతయుం గలయ మలయుతమయమలంపుఁ
దెలిదళుకుఁ జిలికి యది మలయజంపుఁగలయంపిచెలువు
నలవరింప నందుఁ గుందనంపురంగవల్లికామతల్లికలయుల్లా
సంబు వెల్లిగొలుపు గురుదంతకాంతివల్లరులచేత నతిశ
యిల్లుచు నొక్కొక్కచోట నొండొంటినందున సందర్శ
నీయంబు లగునభోవిభాగంబులవలన నస్థానభానుసంభ
వాసంభేదసంభృతసబలతావిలాసభాసురసురాపగా
ప్రవాహసందేహకందళనంబులకు ననుగుణం బయిన
పరపున నిడుపౌఁజులు గట్టి యిట్టట్టు చెదరక చెదల
నడచుచు వజ్రపురంబు చేరి తొంటియట్ల సకలజలా

శయంబుల విహరించుచుండె నందు శుచిముఖి కన్యాంతః
పురసరోవిహారసమయంబుల.

105


సీ.

జలఖేలదంగనాకలకలంబులను మి
            క్కిలి దవ్వు వాఱక నిలిచి నిలిచి
పడఁతు లొక్క రొకళ్ల పై ఁ జల్లుజలబిందు
            లొడలు సోఁకినఁ బోక యోర్చి మార్చి
యోలలాటలతమి నొండొరుఁ దఱుముచె
            ల్వలఢాక కులుకక మెలఁగి మెలఁగి
లీలావతీహస్తలీలాబ్జకేసరం
            బులకును బసి గొంచు మలసి మలసి


ఆ.

క్రమముతోడ దనుజకన్యకాంతఃపుర
కాంతలకును బెదర కింత నంతఁ
జేరికలఁ జరించు టారూఢిఁగా నల
వాటు చేసికొనియెఁ బాటపమున.

106


శా.

ప్రద్యుమ్నుండు ప్రభావతీరుచి కరూపబ్రహ్మమున్ హంసయో
షిద్యాధార్థ్యధురీణవాగుపనిషత్సిద్ధాంతమార్గానుసా
రోద్యత్ప్రజ్ఞను బల్మఱున్ మననసంయుక్తంబు గావించుచున్
హృద్యంబై యది యంతకంత కలరన్ నిల్పెం గడుం జిత్తమున్.

107


సీ.

కనఁ డొద్ద నున్న వానిన వీరు వా రని
            కనినఁ దదర్హవర్తనలు మఱచు
వినఁడు చెప్పినపల్కె వేమఱుఁ జెప్పక
            వినిన నే మే మంటి రనుచు నడుగుఁ
జనఁ డెత్తు లిడక మజ్జనముఖ్యవిధులకుఁ
            జనినఁ దబ్బిబ్బుగాఁ జలుపుఁ గ్రియలు

కొనఁడు నానాసేవకులసేవ లెవ్వియుఁ
            గొనిన వీడ్పాటుగాఁ బనులు పనుచు


తే.

శుచిముఖీవాక్యదర్పణస్ఫురితనిరుప
మానదనుజేంద్రకన్యకామణిమనోజ్ఞ
రూపరేఖావిలాససంరూఢ మైన
యాత్మ మరలింపనేరక హరిసుతుండు.

108


ఉ.

ఉద్యదపేక్ష పక్షివనితోక్తులవెంబడిఁ జంచరీకచం
ద్రాద్యుపమానశోభకు సహస్రగుణంబుగ హెచ్చఁ గేశవ
క్త్రాద్యఖిలాంగలక్ష్మి మది కందిన యంతయునున్ నయించి యా
హృద్యతరాంగిమూర్తిసొబగెల్ల నొకింతగఁ జూచు నాత్మలోన్.

109


చ.

మది గొనినంతమేరయును మాన కతం డుపమానకోటియొ
ప్పిద మఖిలంబు నిట్లు గడుఁ బెక్కుమడుంగులుగాఁ దలంచి
తత్తదవయవత్వసుస్థితికిఁ దార్పఁగ నమ్మదిరాక్షిరూప మె
య్యది యదియే కనంబడియె నచ్చపుబుద్ధికి లే వగమ్యముల్.

110


సీ.

ఆరూపు మదిఁ జాల హత్తించు హత్తించి
            యతివ యట్టిది గాక యనుచు మెచ్చు
మెచ్చి కల్గెను కోర్కి హెచ్చించు హెచ్చించి
            యంతమే లె ట్లబ్బు ననుచు వగచు
వగచి నిట్టూర్పులు నిగిడించు నిగిడించి
            తదవలోకము లేనిబ్రదుకు రోయు
రోసి దాని కుపాయ మాసించు నాసించి
            కలఁక నేమియు దొరకమికిఁ గుందుఁ


తే.

గుంది తలపోతలకు మదిఁ గొల్ల విడుచు
విడిచి దరిదాపు లేమిఁ బెన్వెతల మునుఁగు

మునిఁగి యెవ్వరు పిలిచినఁ గినియు మిగుల
హరిసుతుండు ప్రభావతీవిరహవశత.

111


శా.

ధీమంతుండు పటుప్రతాపనయమైత్రీనిత్యనమ్రీభవ
త్సామంతుండు సుకీర్తిమౌక్తికమణిస్రగ్భూషితాశావధూ
సీమంతుండు విపక్షమంత్రిముఖరాజీవప్రభోచ్చాటనా
హేమంతుండు నిజస్తవానుకలనాహ్రీమంతుఁ డత్యంతమున్.

112


క.

అబ్బాంబావరుఁ డఖిలక
కుబ్బాంధవరమ్యకీర్తికుఁడు సలినీప
త్రాబ్బిందుసమప్రకృతి
క్షుబ్బోధమయాత్మతత్త్వకోవిదుఁడు మహిన్.

113


తరల.

కుముదబంధునిభుండు పింగళిగోకమంత్రి యశఃకథా
సమదనల్పసభుండు వైదికశాస్త్రసింధునిరంతర
ప్రమథనాత్తశుభుండు సంతతభక్తియుక్తిసమర్చిత
ప్రమథలోకవిభుండు విత్తనిరంకుశప్రతిభుం డిలన్.

114


గద్యము.

ఇది నిఖిలసూరిలోకాంగీకారతరంగితకవిత్వవైభవ
పింగళియమరనార్యతనూభవ సౌజన్యజేయ సూరయనామ
ధేయ ప్రణీతంబైన ప్రభావతీప్రద్యుమ్నం బనుమహాప్రబం
ధంబునందుఁ ద్వితీయాశ్వాసము.

—————

  1. వికచములు = కచములు లేనివి, వికసించినవి. లోకమున నోటమిఁ జెందినవా రభిమానవంతు లగుదురేనిఁ దమప్రత్యర్థులను మరల సంపూర్ణపరాభవ మందింప గాఢప్రయత్నము కావించుటయు, నంతటిశక్తి సంపాదించుకొనువఱకు వారలఁ గదియఁ బోకుండుటయుఁ గలదు గావున నైల్యమునెడఁ దేండ్లు కచముల కోడిపోయి వానిజయించుతలంపున ముందు వికచము లగుపుష్పములయందలిమకరందమును గూడఁబెట్టుచున్న వని భావము. (తేనె తాఁకిన వెండ్రుకలు తెల్లనగునని లోకప్రతీతి.)