ప్రబోధ తరంగాలు/332-373
332. మనిషికి శత్రువులుగ మిత్రులుగ ఉన్న గుణములను మంచి చెడు గుణములంటున్నాము.
333. శరీరములో చెడు గుణములు పనిచేసినట్లు మంచి గుణములు పనిచేయవనియే చెప్పవచ్చును.
334. మంచయిన చెడు అయిన రెండు మాయయే. మంచీ చెడూ కానిదే దైవము.
335. చెడు గుణముల వలన పాపము, మంచి గుణముల వలన పుణ్యము సంభవించును. మంచి చెడు గుణముల పనిలేనపుడే కర్మ అంటకపోవును.
336. శరీరములోని గుణముల వలననే ఆలోచనలు వస్తున్నవి. ఆలోచనల వలననే పనులు, పనులవలననే కర్మ కల్గుచున్నది.
337. గుణముల వలన విషయము మనస్సుకు జ్ఞాపకము రాగ, దాని మంచి చెడులను రెండు విధములుగ బుద్దియోచించగ, ప్రారబ్దకర్మ ప్రకారము చిత్తము నిర్ణయింపగ, ఆ విధముగనే ఇంద్రియములు పనిచేయుచున్నవి.
338. పనులతో గానీ, గుణములతో గానీ ఏ సంబంధములేని అహము జీవునితో కలసి అన్నిటికి నేనే కర్తననునట్లు జీవున్ని భ్రమింప చేయుచున్నది.
339. అహము అనునది గుణము కాదు, జీవునకు అంటుకొని ఉన్న ఒక పొర.
340. అహమునకు శరీరములో ప్రత్యేకమైన స్థానము లేదు. అది జీవునిలోని ఒక భాగమే. 341. అహము బుద్ధికి చిత్తమునకు ఆనుకొని వాటిి వెనుకున్నది. కావున బుద్ధి యోచించిన దానిని, చిత్తము నిర్ణయించిన దానిని నీవే నిర్ణయించావు, నీవే యోచించావని జీవునికి తెలుపుట వలన అన్నీ నేనే అనుకొన్న జీవుడు అన్నీ నేనే చేయుచున్నాను అనుకొనుచున్నాడు.
342. శరీరములో గల 24 ప్రకృతి భాగములలో జీవాత్మను అంటుకొని ఉన్నవి మూడు గలవు. అవియే అహము, చిత్తము, బుద్ది.
343. అహము ఎవరికి అర్థము కాని జీవుని స్వరూపము. అందువలన చాలామంది అహమును గర్వమనుకోవడము జరుగుచున్నది.
344. అహమును ఒక గుణమనుకొను వారు జ్ఞానశూణ్యులు.
345. శరీరము స్థూల సూక్ష్మములుగ ఉన్నది. అందరికి స్థూలము తెలియును కాని సూక్ష్మము తెలియదు.
346. స్థూల శరీరము బయటికి పదిభాగములుగ ఉన్నప్పటికి లోపల కనిపించు గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, మూత్రపిండములు మొదలగు అవయవములెన్నో గలవు.
347. సూక్ష్మ శరీరము 15 భాగములైనప్పటికి లోపల కనిపించని గుణములు, కర్మలు మొదలగునవెన్నో గలవు.
348. జీవుడు జీవించు శరీరము స్థూల సూక్ష్మములుగ లెక్కించబడి ఉన్నప్పటికీ, వాటికి అనుసందానమైనవి స్థూలముగ సూక్ష్మముగ ఎన్నో గలవు. 349. భౌతికముగ శరీరము యొక్క బయటి లోపలి అవయవములను తెలిసిన డాక్టర్లకు సూక్ష్మముగనున్న మనోబుద్ధులు గుణకర్మలు ఏమాత్రము తెలియవు.
350. జ్ఞాని అనువానికి స్థూల సూక్ష్మ శరీరములు తెలిసి ఉండవలెను.
351. దేవున్ని తెలియవలసినది ఆరాధించవలసినది శరీరములోనే కావున జ్ఞానులకు పూర్తి శరీరమును గురించి తెలియవలసి ఉన్నది.
352. దేహమునందు నివశించు దానిని దేహి అంటాము. దేహములో నిండియున్నది ఆత్మ, దేహములో ఒక్క స్థానములో ఉన్నది జీవాత్మ.
353. ఆత్మ చైతన్యమైనది కావున ఆత్మ శరీరములో ఉన్నంతసేపు శరీరము కూడ చైతన్యమగుచున్నది.
354. ఆత్మ విడచి వెళ్లిన శరీరము చైతన్యము లేనిదై పోవును.
355. జీవాత్మ స్వయముగ శరీరమును విడచి వెళ్ళడము గాని, శరీరములోకి చేరడము గాని చేయలేదు.
356. జీవాత్మను శరీరములోకి చేర్చడము మరియు శరీరమునుండి బయటికి తేవడమును ఆత్మే చేయుచున్నది.
357. జీవాత్మకు, పరమాత్మకు మధ్యలో ఉన్నది ఆత్మ.
358. జీవాత్మకు ఆత్మకు, ఆత్మకు పరమాత్మకు, పరమాత్మకు ప్రకృతికి ప్రకృతికి జీవాత్మకున్న సంబంధములను తెలియజేయునదే నిజమైన దైవజ్ఞానము. 359. ప్రకృతీ పరమాత్మ శరీరధారులయిన జీవాత్మలకు తల్లి తండ్రులని తెలియడమే నిజజ్ఞానము.
360. పురుషుడెవడో, ప్రకృతి ఏదో తెలియనంతవరకు నీవూ, నీ శరీరమూ నీకు అర్థము కాదు.
361. పురుషతత్వముతో నిండినవాడు పరమాత్మ, స్త్రీ తత్వముతో నిండినది ప్రకృతి, నపుంసతత్వముతో నిండినవాడు జీవాత్మ అని తెలియవలెను.
362. ప్రకృతిని, పురుషున్ని, కర్మతో కూడిన జీవున్ని తెలుపుటకే, భూమి మీద స్త్రీ జన్మలు, పురుష జన్మలు, నపుంసక జన్మలు కల్గుచున్నవి.
363. పరమాత్మ అంశయైన జీవుడు ప్రకృతి అంశయైన శరీరముతో కూడుకొన్నపుడు వాడు నపుంసకుడే అగును. ఆ లెక్క ప్రకారము ఆధ్యాత్మికరీత్యా మనమంతా నపుంసకులమే!
364. దైవజ్ఞానమను మందుతిని, నపుంసతత్వమును పోగొట్టుకొని, పురుషతత్వమును సంపాదించుకోవడమే జీవుడు దేవునిగ మారడమని తెలియుము.
365. పదార్థములు ప్రకృతికాగా, వంటచేయువాడు ఆత్మ,కాగా, చేసిన దానిని తినువాడు జీవాత్మకాగా, చేయించునది పరమాత్మ. అయినప్పటికి అన్నిటికి తానే కర్తనని జీవుడనుకొనుచున్నాడు.
366. పరమాత్మ సంకల్పము చేతనే పంచభూతములైన ప్రపంచము మరియు చావు పుట్టుకలు కల్గిన జగతి కల్గినది. 367. అన్నిటికీ ఆధారము, అన్నిటికీి పెద్ద, అన్నిటికీి మూలము ప్రకృతి కాదు. ఆత్మ, జీవాత్మ కాదు. అన్నిటిని ఆడించునది మాయ కాగ దానిచేత ఆడించువాడు పరమాత్మ. కావున అన్నిటికి ఆధారమూ, పెద్దా, మూలము పరమాత్మయే.
368. జీవుని దైవారాధనకు మరియు శరీర పోషణకు యజ్ఞములు ముఖ్యమైనవి.
369. శరీరములో రెండు రకముల యజ్ఞములు చేయవచ్చును. అందులో ఒక దానిని నిత్యము అందరు చేయుచున్నాము. దానిపేరే ద్రవ్యయజ్ఞము.
370. శరీరము రెండు రకముల యజ్ఞములకు వేదిక అయినది. కడుపులో జరుగు ద్రవ్యయజ్ఞముకంటే తలలో జరుగు జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనది.
371. యజ్ఞము అనగ ఉన్నదానిని లేకుండ చేయడమని లేక కాల్చివేయడమని నిజార్థము. నోటి ద్వార తినబడు ఆహార ద్రవ్యములను కడుపులోని జఠరాగ్ని ద్వార కాల్చివేయడమును ద్రవ్యయజ్ఞము అంటున్నాము.
372. శరీరములో జరుగు యజ్ఞమునకు నమూనాగా చేసి చూపడమే బయటి యజ్ఞములు. యజ్ఞములో అగ్ని ద్వార కాల్చు విధానమే శరీరములో జరుగు రెండు యజ్ఞములలో గలదు.
373. శరీరమందు జరుగు జ్ఞానయజ్ఞము ద్రవ్యయజ్ఞముకంటే శ్రేష్టమైనది. ఎందుకనగా జ్ఞానయజ్ఞములో ప్రపంచ సంబంధ పంచ జ్ఞానములు కాలిపోవుచున్నవి.