Jump to content

ప్రబోధ తరంగాలు/245-292

వికీసోర్స్ నుండి

245. జగతిలో మాయ ఏదో, దేవుడెవరో తెలియాలంటే గొప్ప జ్ఞానమవసరము.

246. భగవంతుడు మాయవలె కనిపించినా, చివరకు దైవజ్ఞానమునే బోధించును. మాయ దేవునివలె కనిపించినా, చివరకు దేవుని మార్గమును విడుచునట్లు తనమార్గమును అనుసరించునట్లు బోధించును.

247. దేవుడు మతాలను కులాలను సృష్ఠించలేదు.

248. మాయను, మనుషులను సృష్ఠించినది దేవుడొక్కడే.

249. మతాలను బట్టి అనేక విధానములుగా, అనేక పేర్లుగా, వేరువేరుగా పిలువబడు వాడు ఒక దేవుడే.

250. సర్వజగత్తుకు అధిపతిగా, సర్వ ప్రపంచమునకు సృష్ఠికర్తగా, విశ్వమంతటికి మూలకర్తగా ఉన్నది ఒకేదేవుడు.

251. దేవునికి పేరుగాని ఆకారముగాని ఉండదు.

252. దేవుడు తనవిషయమును తానే చెప్పవలెను, ఇతరులకు తన విషయము తెలియదు.

253. దేవుడు తన విషయమును తెల్పుటకు భూమిమీదకు వచ్చినపుడు భగవంతుడనబడును. భగవంతునికి పేరు ఆకారము ఉండును.

254. మూఢనమ్మకము, మూఢజ్ఞానము రెండు ఒకజాతికి చెందినవే.

255. మనిషికి ఆరోగ్యములాంటిది నమ్మకము, కాని మనిషికి రోగములాంటిది మూఢనమ్మకము. 256. నీతల్లీ తండ్రీ నమ్మకమే, కానీ నీమతమూ నీకులమూ మూఢనమ్మకము.

257. శాస్త్రము నమ్మకము, పురాణము మూఢనమ్మకము.

258. శాస్త్రబద్ధమైన నమ్మకము ఎప్పటికీ వమ్ము కాదు. హేతుబద్ధము కాని మూఢనమ్మకము ఎప్పటికీ సత్యము కాదు.

259. దేవున్ని ఆరాధించడము నమ్మకము కానీ, చిల్లర దేవుళ్ళను ఆరాధించడము మూఢనమ్మకమగును.

260. నమ్మకములుండవచ్చును, ఉండకపోవచ్చును. కానీ మూఢనమ్మకములు ఏమాత్రముండూడదు.

261. జ్యోతిష్య శాస్త్రములో నమ్మకమున్నది, వాస్తు శాస్త్రములో మూఢనమ్మకమున్నది.

262. అజ్ఞాన మనుషులను సేవించవద్దు, జ్ఞానులను సేవించడములో జీవితమునకు జ్ఞానము లభ్యమగును.

263. మనస్సుకు ఆకారమున్నది, కానీ దాని పనికి హద్దులేదు.

264. లోచనము అనగా కన్ను . లోపలి కన్నును ఆలోచన అంటారు.

265. బయటి కన్నులు రెండు కలసి ఒకదృశ్యమును చూపును. లోపలి కన్నులు రెండు కలవవు.

266. మనిషికి పుట్టుకతో వచ్చునవి రెండు కన్నులు, పెరుగుతా వచ్చునవి రెండు కన్నులు.

267. లోపలి కన్నులు రెండు విభిన్నమైనవి. ఒకటి ప్రపంచ విషయములను చూపును. రెండవది దేవుని విషయమును చూపును. మొదటిది మనోనేత్రము, రెండవది జ్ఞాననేత్రము.

268. ప్రతి జీవునికి కర్మవలన సంభవించునవి మూడు కన్నులు కాగ శ్రద్దవలన సంభవించునది ఒకేఒక కన్ను అదే జ్ఞాననేత్రము.

269. మానవునికి మనోనేత్రము తెరుచుకొంటే జ్ఞాననేత్రము మూసుకొనును. జ్ఞాననేత్రము తెరచుకొంటే మనోనేత్రము మూసుకొనును.

270. ఏది జ్ఞాన నేత్రమో, ఏది మనో నేత్రమో మానవుడు సులభముగా గుర్తించలేడు.

271. జ్ఞాననేత్రము, మనోనేత్రము రెండు భగవంతునికి మాత్రము ఒకే సమయములో పనిచేయుచుండును.

272. దేశములో అత్యుత్తమమైన జ్ఞానము, అత్యుత్తమమైన అజ్ఞానము గలవు. ఏది ఎవరికి ఇష్టమో అదే లభించును.

273. దేశములో బోధకులెందరో కలరు. బోధకులందరూ గురువులవలె కనిపించుచుందురు. అయినప్పటికి దేశములో గురువు ఒక్కడే ఒకప్పుడే ఉండును.

274. ఒక్క రూపాయికి నూరు పైసలున్నట్లు దేశములో పైసా స్థాయినుండి 99 పైసల స్థాయి వరకు బోధకులుందురు. 100 పైసల (రూపాయి) స్థాయిలో గురువుండును.

275. గురువును గర్తించుట చాలా కష్టము. ఎందుకనగా ఒక్క పైసా స్థాయి నుండి 99 పైసల స్థాయివరకు కనిపించుచుండును. 276. గురువు బోధకునివలె, బోధకులు గురువువలె కనిపించుట సహజము. అయినప్పటికీి గురువు గురువే, బోధకుడు బోధకుడే!

277. భగవంతుడే నిజగురువు కావున గురువు కొంతకాలము భౌతికముగా, కొంతకాలము అభౌతికముగా ఉండును.

278. నిజగురువైన భగవంతుడొక్కడే జగతిలో జగద్గురువు. శిష్యులెక్కువ కలవాడు జగద్గురువు కాదు.

279. జగత్తులో సకలజీవులకు వర్తించు జ్ఞానమును తెలియజేయువాడు జగద్గురువు.

280. జగద్గురువైన భగవంతుడు తండ్రివీర్యముతో కాక తన సంకల్పముతోనే పుట్టును.

281. భగవంతునికి భూమిమీద తల్లి ఉండవచ్చును, కానీ తండ్రి ఉండడు.

282. పరమాత్మ ప్రతినిధి భగవంతుడు. భగవంతుడు సాకారుడు. పరమాత్మ నిరాకారుడు.

283. ప్రపంచములో భగవంతుని ద్వారా పరమాత్మను (దేవున్ని) తెలుసుకొనుటకు వీలుకలదు.

284. భగవంతుడు తప్ప మరియే ఇతర మానవుడు దేవున్ని గురించి తెలుపలేడు.

285. భగవంతుడు దేవుని (పరమాత్మ) అంశయే కావున దేవుని విషయము భగవంతునికే తెలియును. 286. దేవుడు భూమిమీద ఎప్పుడు, ఎక్కడ, ఎట్లు, ఏరూపముతో పుట్టునో ఎవరికి తెలియదు. అందువలన ఆయన అవతారమును ప్రజలు విభిన్నముగా చూస్తున్నారు.

287. మానవునిగా వచ్చు దేవుడు ఒకజన్మలో బికారిగా, ఒకజన్మలో ధనికునిగా ఉండవచ్చును. అలాగే ఒకజన్మలో బ్రహ్మచారిగా మరొకజన్మలో బహు భార్యలుగల విలాస పురుషునిగా ఉండవచ్చును. అంతమాత్రమున చాలామంది భగవంతున్ని గుర్తించలేకపోతున్నారు.

288. దేవుడు మానవునిగా భూమిమీదకు వచ్చినపుడు, ఆయనను గుర్తించని జ్ఞానులు అదే దేవుడు ముందు జన్మలో చెప్పిన మాటలనే ఆయనకే చెప్పి తమకంటే తక్కువవానిగా లెక్కింతురు.

289. దేవుడు భగవంతునిగా గతములో చెప్పిన మాటలను విశ్వసించినవారు, ఆ మాటలకు సరియగు అర్థములు తెలియక, ఆయన రెండవమారు వచ్చినపుడు ఆయననే గుర్తించలేక పోవుచున్నారు.

290. జీవుడు దేవున్ని చేరితే అదియే జీవదైవఐక్య సంధానమని, అంతటా వ్యాపించి పోవుచున్నాడని తెలియక, మోక్షమనబడు పరలోకమును ఒక స్థలమని, ఒకవిశాలమైన భవనమని అనుకొనుట అజ్ఞానము.

291. దేవుని చేరినవాడు దేవుని కంటే వేరుగా ఉండడు. కనుక వానికొక స్థలము, ఒఊరు, ఒకఇల్లు ఏది ఉండదు.

292. దేవుని చేరినవాడు దేవుడే తానై, తానేదేవుడై విశాలముగా అణువణువున వ్యాపించి ఉన్నాడు.