ప్రబోధ తరంగాలు/293-331

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

293. మాయ (సైతాన్‌) లేక సాతాన్‌ మానవున్ని మతాలపేరుతో మభ్యపెట్టుచున్నది.

294. మతము దేవున్ని తెలుపలేదు. జ్ఞానమే దేవున్ని తెలుపును.

295. దైవము ఒకమతమునకు సంబంధించినవాడు కాడు.

296. మతము చాటున దేవున్ని ఊహించుకొని, మతమునకు దేవున్ని పరిమితి చేసి మాట్లాడడము అజ్ఞానమే అగును. అన్నిమతములకు అధిపతి ఒకే దేవుడని తెలియడమే జ్ఞానమగును.

297. దేవుడెప్పుడయినా భూమిమీదకు వస్తే భగవంతునిగానే వస్తాడు. అనగా పురుష ఆకారముతోనే వస్తాడు, స్త్రీ ఆకారములో రాడు.

298. స్త్రీ పురుషులలో స్త్రీ ప్రకృతికి, పురుషుడు పరమాత్మకు ఆనవాలని తెలియాలి.

299. దేవుడు భగవంతునిగా భూమిమీదకు వస్తే ప్రకృతి కూడ పురుషజన్మ తీసుకొని తానే భగవంతుడనని నమ్మిస్తున్నది.

300. భూమిమీదకు వచ్చిన దేవుడుగాని, ప్రకృతిగాని తాము పలానాయని తెలియకుండా జాగ్రత్తపడుదురు.

301. భూమిమీదకు వచ్చిన దేవుడు తాను భగవంతుడనని చెప్పడు. అట్లే ప్రకృతి తాను మాయనని చెప్పదు.

302. దేవుని జ్ఞానమును సంపూర్ణముగా తెలియనివారు భగవంతున్ని సామాన్యమానవునిగా, మాయను భగవంతునిగా పోల్చుకొందురు.

303. భూమిమీద పుట్టిన ప్రతిజీవి ఆత్మ అంశయే అయినప్పటికి ప్రకృతి లక్షణములను కల్గి ఉన్నది. 304. జీవాత్మ పురుషుని అంశయే అయినప్పటికి ప్రకృతి అంశయైన నపుంసకత్వము కల్గి ఉన్నది.

305. శరీరములో మూడు రకముల ఆత్మలు, ఐదు రకముల ప్రకృతి గలదు.

306. పరమాత్మ , ఆత్మ, జీవాత్మ అనబడు మూడు ఆత్మలు ఆకాశ, గాలి, అగ్ని, నీరు, భూమి అనబడు ఐదు ప్రకృతులు కలసి సజీవ శరీరము ఏర్పడినది.

307. శరీరము ఐదురకముల పరికరము కాగా, పరికరములను ఉపయోగించి ఆత్మ పని చేయుచుండగా, పరమాత్మ చూస్తుండగ, జీవాత్మ అనుభవించుచున్నది.

308. శరీరములో కనిపించు అవయవములు, కనిపించని గుణములు మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారములు అన్నియూ ఎన్నో భాగములై ప్రకృతి జనితములు కాగ పరమాత్మ జనితములైనవి కేవలము ఆత్మ జీవాత్మ రెండుమాత్రము గలవు!

309. శరీరమంతా వ్యాపించి పనులన్ని చేయు ఆత్మ ఎవరికి తెలియనిదై తెరచాటున ఉండగ, శరీరములో ఒక్కచోట నివాసమున్న జీవాత్మ ఏమి చేయకున్నను, తనకేమి తెలియకున్నను, అన్ని చేయుచున్నట్లు అన్ని తెలిసినట్లు భ్రమిస్తూ తెరమీదికొచ్చాడు.

310. శరీరమంతా ప్రకృతి కాగా, శరీరములో మూలసూత్రధారి పరమాత్మ కాగా, అన్ని సమయములలో పాత్రధారిగ ఆత్మఉండగా, సూత్రధారి పాత్రధారి కాని జీవాత్మ మొత్తము శరీరమే తానని భ్రమిస్తు తనవెనుకనున్న ఆత్మ పరమాత్మను గాని ప్రకృతిని గాని తెలియలేకపోవుచున్నాడు.

311. శరీరములో ఆత్మ ఎల్లపుడు ఒక్క క్షణము కూడ ఊరకుండక మేల్కొని పనిచేయుచుండగా, జీవాత్మ జరుగుచున్నదానిని కొంతసేపు చూచి అనుభవించి, కొంతసేపు చూడకుండ ఊరకున్నది. చూచి అనుభవించు కాలమును మెలుకువని, చూడక ఊరకుండు కాలమును నిద్రయని అంటున్నాము.

312. శరీరములో జీవాత్మ ఏమి తెలియని అన్నిరకముల అంధుడు కాగా, వానికి పంచ జ్ఞానేంద్రియములు అన్ని విషయములను తెలియజేస్తున్నవి.

313. శరీరములో తన నిజస్థితి తెలియని జీవాత్మ అన్నీ తానే తెలుసుకొనుచున్నట్లు, అన్నీ తానే చేయుచున్నట్లు భ్రమలో మునిగి ఉన్నాడు.

314. పరమాత్మ, ఆత్మ, జీవాత్మలను వరుస క్రమములో జీవాత్మ చివరిదైనా, మొదటి దానివలె భ్రమించుచున్నది.

315. ప్రతి మానవుని హస్తములో జీవాత్మ ఆత్మలనబడు రేఖలు కలిసియుండునట్లు, రెండిటికి పైన పరమాత్మ అనుబడు రేఖ ప్రత్యేకముగ ఉండునట్లు గర్భములోనే ముద్రించబడి ఉన్నవి.

316. పరమాత్మ విశ్వమంతట, ఆత్మ శరీరమంతట, జీవాత్మ తలలోని నుదుటి భాగములో సూది మొనంత వ్యాపించి గలవు. 317. ఆత్మ జీవాత్మలు రెండు జోడు ఆత్మలుగ ఉన్నవి. జీవాత్మను వదలి ఆత్మ, ఆత్మను వదలి జీవాత్మ ఉండజాలదు.

318. శరీరములో సూది మోపినంత జీవాత్మ ఉండగ, సూది మోపినంత కూడ వెలితి లేకుండ పరమాత్మ విశ్వమంత వ్యాపించి ఉన్నది.

319. జీవాత్మకు ఒకే ఆకారముండగ ఆత్మకు అనేక ఆకారములుండగ పరమాత్మకు ఆకారమే లేదు.

320. జీవాత్మకు ఆత్మకు స్థానము, ఆకారము, పేరు, పని ఉండగ పరమాత్మకు అవేవి లేవు.

321. భూమి విూద ప్రచారమైన గుణములు ఆరే. వాటినే ఆరు శత్రుగుంపు (అరిషట్‌ వర్గము) అనుచున్నాము. ప్రచారము లేని గుణములు మరొక ఆరుగలవు వాటినే ఆరు మిత్రగుంపు (మైత్రి షట్‌ వర్గము) అంటాము. మైత్రిషట్‌ వర్గము గుణములను గురించి ఎవరికి తెలియదు. వాటిని మనమే (శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానందయోగీశ్వరులే) మొదట చెప్పుకొన్నాము.

322. గుణములు శత్రువర్గముగ ఆరు, మిత్రవర్గముగ ఆరు మొత్తము పండ్రెండు గలవు. వాటి ప్రతిరూపమే మాయ.

323. దేవుడు సృష్ఠించిన మాయ, గుణముల రూపముగ మనుషుల తలయందేగలదని చాలామందికి తెలియదు.

324. పరమాత్మ ప్రపంచమంత, ఆత్మదేహమంతట వ్యాపించి ఉన్నప్పటికి, తలయందు గుణరూపమై ఒక్క చోటున్న మాయ, జీవున్ని తనవైపే లాగుకొనుచున్నది. 325. శరీరములో జీవాత్మకు కాపలాగ తోడుగ ఉన్న ఆత్మ బలము కంటే మాయబలము (గుణములు) 108 రెట్లు ఎక్కువ కావున జీవాత్మను తమవైపు లాగుకొను పందెములో శరీరములోని ఆత్మకంటే మాయయే ముందంజలో కలదు.

326. ఒక్కింత బలమున్న ఆత్మ, నూట ఎనిమిదింతలు బలముగల గుణముల ముందర ఓడిపోక తప్పదు.

327. ఆత్మ మార్గమును దైవమార్గమని, గుణమార్గమును మాయమార్గమని చెప్పిన వారు, దైవమార్గము ఇరుకైనదని, మాయమార్గము విశాలమైనదని చెప్పారు.

328. దైవమార్గము నీ సైజంతే కలదు. అందువలన ఇరుకైనది. మాయమార్గము (సాతాన్‌ మార్గము) నీ సైజుకంటే 108 రెట్లు ఎక్కువ కలదు. అందువలన విశాలమైనది.

329. మనిషిలో గుణములున్నవని అందరికి తెలుసును. కాని ఏ గుణము ఎప్పుడు ఎట్లు పని చేయుచున్నదో ఎవరికి తెలియదు. అందువలన కామమునకు మోహమునకు వ్యత్యాసము తెలియక రెండిటిని ఒకే విధముగ పోల్చుకొనుచున్నారు.

330. మనిషికి వయస్సు పెరుగుచు ముసలివాడగు కొలది శరీరబలము తగ్గిపోవుచుండును. కాని గుణముల బలము ఎక్కువగుచునే ఉండును. అందువలన వృద్ధులకు గుణముల ప్రభావమెక్కువ.

331. వృద్ధులు యువకులవలె శరీర శ్రమ (పని) చేయలేకున్నను యువకులకంటే ఎక్కువ ఆలోచించుచుందురు.