Jump to content

ప్రబోధానందం నాటికలు/ప్రబోధానందం నాటిక

వికీసోర్స్ నుండి

ప్రబోధానందం నాటిక

(పురాణాల పూర్ణయ్య ప్రవేశించి తన చంకలోని భాగవతాన్ని చేతులలోనికి తీసుకొని పారవిప్పి కండ్లకు మూడుసార్లు అద్దుకొని అక్కడే వున్న కుర్చీలో కూర్చొని పఠనం మొదలుపెట్టును.)


ఆ।వె॥

కృష్ణవాసుదేవం కేశవ పరమాత్మ
అప్రమేయ వరద హరి ముకుంద
మిమ్ము జూడగంటి మీకృప గనుగొంటి
అఖిలసౌఖ్య పదవు లందగంటి


ఆ।వె॥

అతి రహస్యమైన హరిజన్మ కథనంబు
మనుజుడెవ్వడేని మాపురేపు
దా భక్తి తోడ జదివిన సంసార
దుఃఖరాసి బాసి తొలగిపోవు


పూర్ణయ్య :- (ఇంటిలోనికి వేణు ప్రవేశించగానే పూర్ణయ్య చూచి ఇలా అంటున్నాడు) ఒరేయ్‌! వేణూ ఇదేనా నీరాక? మొన్న ఉదయం వెళ్ళిన వాడివి ఇపుడా ఇంటికి వచ్చేది? ఇంట్లో పనులూ,పాటలు విడిచిపెట్టి జ్ఞానం, యోగం, ఆత్మా, పరమాత్మా అనుకుంటూ ఏదో ఆశ్రమానికి పోతుండావంట. మీ నాయన కాటమయ్య ఇప్పుడు నిన్ను చూచాడంటే నీతోలుతీసి తప్పెట వాయిస్తాడు, నీవు ఆశ్రమానికి పోయింది నిజమేనాంట.

వేణూ :- నిజమే తాతయ్యా! నేనొక ఆశ్రమం చేరి అక్కడున్న గురువును ఆశ్రయించి జ్ఞానము తెలుసుకుంటున్నాను.

పూర్ణయ్య :- ఓరి బడుద్దాయివెధవా! చంకలో గొర్రెను పెట్టుకొని మందంతా వెతికినాడంట ముందెవరో నీయట్లాంటోడు. భారత, భాగవత, రామాయణాలు, అష్టాదశ పురాణాలు తిరగవేసి నిత్యం పఠించి అందులో సారాన్ని గ్రహించి, అందరికి అనర్గళంగ మాట్లాడి అర్థం చెప్పే, మీ తాతయ్యను నేను ఇంట్లో ఉండగ, జ్ఞానంజ్ఞానం అంటూ ఎక్కడో ఆశ్రమాలకు పోయి, గురువులను ఆశ్రయింప వలసిన కర్మేమిబట్టిందిరా నీకు. నన్ను అడుగు నీకు ఏ విషయం కావలసిన వివరించి చెప్పుతాను. నాకంటే తెలిసిన వాడా ఆ గురువు?

పద్యం

సీ॥

ప్రహ్లద చరితంబు ఆహ్లాదకరముగా
భక్తులకుందెల్ప భక్తిపరుడ
వామనునవతార నైనంబు ప్రజలకు
భక్తమార్కండేయ భవ్య చారిత్రంబు
తనివితీరగ జెప్పు ఘనడునను
ఘన యజామీళుని ఘట్టంబు గట్టిగా
చదివి యర్థము జెప్పు చతురయుతుడ


తే॥గీ॥

అష్టాదశ పురాణంబుల నిష్టగాను
తరచి దెల్పెడినట్టి నీ తాతనుండు
వేరు ఆశ్రమ గురువిద్య గోరెదేల
కుర్ర మనవడ చాలింక వెర్రిమాను

వేణు :- ఓహో అలాగున తాతగారు ఐతే విను

తే॥గీ॥

నీవు జెప్పు పురాణముల్‌ నిజముగాదు
శాస్త్రవిది గొప్ప దెప్పుడు సత్యముగను
పుక్కిటి పురాణములండ్రు బుధులువాని
ముక్తి త్రోవను జూపవో ముసలి తాతా


పూర్ణయ్య :- హవ్వ! హవ్వ! ఎంత మాటంటివిరా శుంఠ మనువడా! పురాణాలన్నీ అబద్దాలా, శాస్త్రసమ్మతం గానివా! అసలు పుక్కిటి పురాణాలా? శివశివా! ఎంత అపచారం, ఎంత అపచారం. ఓ శ్రీమన్నారాయణ మూర్తీ! నీ విలాసాలకు నిలయమైన పురాణాల్ని తప్పుబట్టిన ఈ కుర్రకుంకను క్షమించు. ఓరేయ్‌ బడుద్దాయ్‌! ఇదేం పొయ్యేకాలంరా నీకు, శ్రీవిష్ణు స్వరూపుడైన వ్యాస భగవానుని విరచితము, భక్తశిఖామణియైన బమ్మెర పోతనగారు రచించిన మహాపవిత్రమైన పురాణాన్ని దోషాలెంచితే, కాశీలో గోవును చంపినంత పాపమొస్తుంది! తప్పని ముక్కు, చెంపలేసుకో.

వేణు :- ఓ నాతండ్రికి తండ్రిగారు! తప్పని నేనే ముక్కు చెంపలేసు కోవలయునా, అర్థాపర్థము లేకుండా అడ్డ ద్రోవలు చూపించే కల్పిత పురాణాల్ని నీలో జీర్ణింప చేసుకొని, తాజెడ్డ కోతి వనమెల్లా చెరచినట్లు ప్రజలకు బోధించి, వారిని కూడా పెడద్రోవలు పట్టిస్తుది మీరుకాదా! ఆశ్రమాలకు పోయి అసలైన ధర్మాలు తెలుసుకొంటున్న నన్నే తప్పంటావా?

పూర్ణయ్య :- తప్పా! తప్పున్నారా! తర తరాలనుండి మన హిందువులకు పూజ్యనీయమై, భక్తిగా ఆరాధించే పురాణాల్ని, యదార్థానికి నిలువవనీ, కల్పితాలనీ నోటికి వచ్చినట్లు ప్రేలుతావురా! ఆశ్రమానికి పోయిన నీకు మీ గురువు బోధించిన జ్ఞానం ఇదేనా? వ్రేలడంత లేవు! నాకు ఇష్టమై నిష్టగా పఠించే పౌరాణిక గ్రంథరాజాన్ని నా ఎదురుగానే కాదంటవురా!

వేణు :- నామాటకు సమాధానము చెప్పు, పురాణాలు వ్రాసిందెవరు మానవులే కదా! మరి వారిలో జ్ఞానం ఎంత ఉంటే అవి అంతే ఉంటాయి కదా! కవితాశక్తి ఎంతైనా ఉండి పెద్దకవులు కావచ్చును, కానీ వారిలో అసలైన జ్ఞానశక్తి ఉండాలికదా! ఏ జ్ఞానము లేకుండా, శాస్త్రబద్దము కాకుండా చెప్పిన మాటలు హేతువాదం చేత ఖండింపబడతాయి. కావాలంటే నీవిప్పుడు చెప్పిన పురాణఘట్టాల్లోని కొన్ని అంశాలు యదార్థానికి ఎంత వరకు నిలువగలవో అడుగుతాను చెప్పగలవా?

పూర్ణయ్య :- ఓరి పిల్లపిడుగా! నా అనుభవములో పదోవంతు లేదు కదరా నీవయస్సు. పిల్లవచ్చి గ్రుడ్డును వెక్కిరించినట్లు నన్నే పరీక్షిస్తావురా! నీవి పనికిమాలిన ప్రశ్నలుంటాయి. ఆ ఆ కానీ. ఏంటివో ఆ ప్రశ్నలు రానీ బయటకు.

వేణు :- నేనడిగిన ప్రశ్నలకు నీవు సరైన సమాధానము చెప్పకపోతే?

పూర్ణయ్య :- నీవు అడిగే బోడిప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేనా! ఓరేయ్‌ నాపేరేంటనుకున్నావు పురాణాల పూర్ణయ్య, సమస్త పురాణాల్ని కాచివడగట్టినవాణ్ణి, నీ సందేహాల్నే తీర్చకపోతే, ఇదిగో నిత్యం భక్తితో పఠించే ఈ పురాణాలను ఏటిలో పారవేసి ఎవ్వరికి చెప్పకుండా పురాణ సన్న్యాసం చేస్తాను సరేనా!

వేణు :- సరేగాని నీవు చెప్పింది నమ్మమంటావా?

పూర్ణయ్య :- (భాగవతం తలపై పెట్టుకొని) ఈ భాగవతం సాక్షిగా చెప్పుతున్నాను. మాటతప్పితే ఏమంటివిరా ముసలిగాడిదా అను.

వేణు :- ప్రహ్లాద చరితల్రో ఒక ఘట్టంలోని అంశమును అడుగుతాను చెప్పు. హిరణ్యకశిపుడు తనకు చావులేకుండ వరాలు పొందడానికి తపస్సు ఎవరిని గూర్చి చేశాడు? ఎక్కడ చేశాడు? ఎన్ని సంవత్సరాలు చేశాడు.

పూర్ణయ్య :- ఓస్‌ ఇవేనా నీ సందేహాలు, హిరణ్యకశిపుడు తనకు చావు రాకుండ ఘోరమైన అడవిలో, బ్రహ్మను గూర్చి పదివేల సంవత్సరాలు తపమాచరించాడు నాయనా.

వేణు :- హిరణ్యకశిపుడు అడవులలో పదివేల సంవత్సరాలు తప మాచరించి తిరిగి ఇంటికి చేరునప్పటికి, తన కుమరుడైన ప్రహ్లాదుడు ఐదు సంవత్సరముల బాలునిగా ఉన్నట్లు ఆ చరిత్రలో ఉందిగదా! మరి హిరణ్యకశిపుని భార్య ఎప్పుడు గర్భవతియైనట్లు?

పూర్ణయ్య :- తనభర్త తపస్సుకు పోయే ముందు అయివుంటుంది.

వేణు :- తపస్సుకు పోయే ముందు అయివుంటుందా! అలా జరిగివుంటే పదివేల సంవత్సరాలు తపస్సు చేసి తిరిగివచ్చిన హిరణ్యకశిపుని కుమారునికి ఐదు సంవత్సరములెలా ఉంటాయి? ఐతే ఆయన భార్య లీలావతి వేల సంవత్సరాలు గర్భాన్ని మోసి కుమారున్ని కన్నందంటారా? ఇలా ప్రపంచము లో ఎక్కడైన జరుగుతుందా! ఇది చాలా విడ్డూరంగదా, ఇది నమ్మదగిన విషయమేనా?

పూర్ణయ్య :- (ఆలోచించి) అలా ఎట్లు జరుగుతుంది? వేలసంత్సరాలు స్త్రీ ఎక్కడైనా గర్భం మోస్తుందా, నవమాసాలు మాత్రమే కదా! అలా జరిగుండదు.

వేణు :- అలా జరిగుండకపోతే హిరణ్యకశిపుడు తపస్సుకు పోయిన తర్వాత, ఆయన భార్య గర్భం ధరించి ప్రహ్లాదున్ని ప్రసవించిందంటారా? అలా జరిగివుంటే పతివ్రతా తిలకమైన లీలావతి శీలానికి మాయనిమచ్చ వస్తుంది కదా! దీనికి పరిష్కారం ఎలా చేసి చెప్పుతావో చెప్పు.

పూర్ణయ్య :- (తలగోక్కుంటు ఆలోచనతో అటు, ఇటు తిరిగి) కొట్టేవురా దెబ్బ, ఎంత ఆలోచించినా ఈ పాయింటుకు సమాధానము దొరకలేదు. ఒరేయ్‌ నేను బుద్ధి తెలిసినప్పటి నుండి పురాణాల్ని శోధిస్తున్నానుగానీ, ఈ సంగతే అర్థము కాలేదు. ఇది చాలా అర్థరహితముగ యదార్థ విరుద్ధంగా ఉందని ఒప్పుకుంటున్నాను నాయనా

వేణు :- ఒప్పుకుంటున్నావు కదా! ఇంకొక విషయం అడుగుతాను, గజేంద్ర మోక్షం అనే ఘట్టంలో శ్రీహరి అయిన విష్ణుమూర్తి ఎక్కడున్నట్లు కవులు వర్ణించారో తెల్పు తాత.

పూర్ణయ్య :- (హీన స్వరముతో) అలాగే వివరిస్తాను నాయనా విను (కింది పద్యం గట్టిగా చదువును మొదలుపెట్టును)


మ॥

 అల వైకుంఠ పురంబులో నగరులో నామూల సౌధంబుదా
   పలమందారవనాంతరామృతసరః ప్రాంతేందు కాంతోపలో
   త్పలపర్యంక రమావినోది యగునాసన్న ప్రసన్నుండు వి
   హ్వల నాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభియై.


వేణు :- ఏమీ వైకుంఠమనే పురంలో, ఒక వీధిలో, ఒక మూలగల మేడలో, శేషపాన్పుపైన, లక్ష్మిదేవితో వినోదములాడుతూ, సంతోషముగా ఉన్నాడ నియేగా ఆ పద్యములోని అర్థము. సరే మరి ప్రహ్లాద చరిత్రలో హిరణ్యకశిపుడు తన కుమారున్ని నీ శ్రీహరి ఎక్కడున్నాడని అడిగినపుడు


కం॥

యిందుగల డందులేడని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
అందందే గలడు దానవాగ్రణి వింటే

అని వల్లించినాడే, ఈ రెండు విధానాల్లోను ఏ దాన్ని నమ్మ మంటావు? ఒకచోట వైకుంఠపురంలో ఉన్నాడని, ఒకచోట ఎక్కడ చూచినా ఉన్నాడని తెలిపే ఈ పురాణకవుల ఏ మాట నిజమైందంటారు తాతగారు?

పూర్ణయ్య :- ఓరి నీదుంప తెంచ! పిట్టకొంచెం కూత ఘనం అన్నట్లు ఎట్లాంటి చిక్కుపాయింట్లు ఏరిపెట్టుకొన్నావురా. ఇదికూడ నీవు చెప్పినట్లు వాస్తవానికి దూరంగా ద్వంద్వ వైఖరిలో ఉంది. ఆలోచించి చూడగా పురాణాలలో అక్కడక్కడ ఇలాంటి అసత్య విషయాలున్నట్లు నాకిప్పుడిప్పుడే తెలుస్తుంది.

వేణు :- అప్పుడే ఏమైంది తాతారావుగారూ! ముందుంది ముసళ్ళపండుగ, ఇంకో పాయంటడుగుతాను చెప్పండి. వామన పురాణములో వామనుడు బలిచక్రవర్తిని మూడడుగుల భూమిని దానంగా యాచించాడు ఆయన ఇచ్చాడు. మరి వామనమూర్తి, ఆ దానమిచ్చిన భూమిని ఎలా పుచ్చు కున్నానడో వివరిస్తారా!

పూర్ణయ్య :- ఏముంది నాయనా? ఆ వటుడు ఆకాశానికి పెరిగి ఒక పాదంతో భూగోళానంత కొల్చి ఆక్రమించుకొన్నాడు. రెండవపాదం అంబర వీధినంతయు కొల్చుకొన్నాడు.

వేణు :- మూడవపాదంతో ఏమి కొల్చుకొన్నాడు.

పూర్ణయ్య :- అదే చెప్పుతున్నాను విను నాయనా! మూడవపాదం కొల్చుకొనుటకు ఏమి లేనందున, ఆ సంగతి బలిచక్రవర్తిని అడిగితే నా తల మీద పెట్టమన్నాడట, అలానే చేసి ఆయన్ని పాతాళానికి త్రొక్కేశాడంట.

వేణు :- ఆ! ఆగు తాతయ్యా ఆగు. ఒకటవపాదంతో భూమినంతా కొలుచుకొన్నపుడే బలిచక్రవర్తి కూడ ఆ పాదం క్రిందనే కొలువబడ్డాడు. మూడవపాదము ఏమి పుచ్చుకొన్నాడో చెప్పండి.

పూర్ణయ్య :- చెప్పడానికి ఏముంది? నాబొందవుందా! భలేచిక్కు పాయింట్లు అడిగి చీకాకు పెడుతున్నావు.

వేణు :- బాగా ఆలోచించు తాతగారు. మోక్షము కావలనుకొనే వారు శాస్త్రబద్దమైన ధర్మాలు తెలుసుకోవాలి, కానీ శాస్త్రసమ్మతంగాని పుక్కిటి పురాణాలను పట్టుకొని ప్రాకులాడితే చివరకు మిగిలేవి చిక్కులు చీకాకులే. పురాణాలు కేవలం కాలక్షేపానికి పనికివస్తాయి, కానీ కర్మ కాల్చుటకు ఉపయోగించే జ్ఞానం ఉండదు.

పూర్ణయ్య :- (తలపంకించి) నిజమే నాయనా నిజమే! చిన్నవాడవైనా నా కళ్ళు తెరిపించావు. నాకు ఇప్పుడు బుద్ధివచ్చింది, బాగా అర్థమౌతున్నది. నీవే అటువంటి ప్రశ్నలతో పురాణాల్లోని బండారాలన్నీ బయటికి లాగకపోతే, మిగిలిన నా జీవితకాలం వాటితోనే వ్యర్థం చేసుకొనేవాణ్ణి, అసలు నీకు ఇటువంటి పాయింట్లు తెలిపిన మహానుభావుడెవరు?

వేణు :- ఇంకెవరు మా గురువే.

పూర్ణయ్య :- ఆహా! ఆయన నిజంగా భగవత్సరూపుడే, లేకుంటే ఎంతో తార్కిక జ్ఞానముతో ఇంతవరకు ఎవ్వరూ విమర్శించని పురాణాలను, శాస్త్ర సమ్మతంగా విమర్శించి, అందులోనున్న అసహజమైన కవితాశైలిని అందరికీ తెలిసేలాగున చేశాడు. ఆయన పేరేమిటి? ఆయన ఆశ్రమం నామమేమిటో తెలుపు నాయనా! నేను కూడ ఆయన్ను దర్శించి కృతార్థుడనవుతాను ఇటువంటి గొప్ప విజ్ఞానియైన గురువును నీవు సేవిస్తున్నందుకు నీ జీవితము ధన్యమైంది నాయనా. నాకు కూడ ఇప్పుడు మోక్షప్రాప్తికి ఉపకరించే జ్ఞానం తెలుసుకోవాలనిపిస్తుంది. కానీ


తే॥గీ॥

పరమపదమును జేర్పంగ తరముగాని
పుక్కిటి పురాణముల నమ్మి నిక్కముగను
కాలమంతయు రిత్తగా గడిపితేను
సత్యధర్మంబు లెరిగించు శాస్త్రమేది

వేణు :- తాతయ్యగారు నిజమైన యోగవిధానాలు తెల్పు గ్రంథము కావలయునంటే వినుము.

పద్యం :కం॥

నిక్కమగు ధర్మమార్గము
చక్కగ నెరిగించునట్టి సత్‌ శాస్త్రంబున్‌
యెక్కడో వెదకగ నేలను
మక్కువగను గీతయొకటె మహిలో తాతా

పూర్ణయ్య :- ఏమి నాయనా భగవద్గీతయా! అదికూడ పురాణాంతర్గత మైన గ్రంథమే గదా?

వేణు :- ఏ పురాణంలో ఉందంటారు.

పూర్ణయ్య :- మహాభారతములో శ్రీకృష్ణుడు అర్జునునకు బోధించినదే కదా!

వేణు :- ఆ! అక్కడే మీరు పప్పులో కాలేస్తున్నారు. భారత, రామాయణాలు పురాణాల్లోకి చేరవు. అవి ఒక ఇతిహాసగాథలు. పురాణాలు వేరు, ఇతిహాస గాథలు వేరు, శాస్త్రములు వేరు.

పూర్ణయ్య :- నేనంతలోతుగ ఆలోచించలేదు నాయనా, ఇక ఇప్పటి నుండి పురాణాల గొడవలు మాని, నీవు చెప్పినట్లుగా భగవద్గీతను భక్తిగా పఠించి, పరమార్థతత్త్వాన్ని గ్రహించి పరంధామానికి దగ్గరౌతాను. నీకు చెప్పిన మాటప్రకారం ఈ పురాణపుస్తకాలను ఇప్పుడే కట్టగట్టి గంగలో పారేస్తాను. (అని భాగవతం చేతులలోనికి తీసుకొని) ఓ పురాణ పుస్తకముల్లారా! నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి మిమ్మేపఠించి, ఆరాధించి నాను. మీ వలన ఏ ఉపయోగము లేదని ఈనాడే తెలుసుకొన్నాను. ఇంక ఇప్పటితో మీకూ, నాకూ రుణం తీరిపోయింది (అని భాగవతాన్ని తన భూజము పైనున్న వల్లెలో మూటగట్టుకొని నెత్తిమీద పెట్టుకొని పోవుచుండగా)

వేణు :- (పూర్ణయ్య చేయి పట్టుకొని) తాతాజీ గారూ, ఆగండి! మీరంత బాధగా పురాణ పుస్తకములను గంగలో పారవేయవలసిన పనిలేదు. ఏమీ తెలియక మూఢత్వములోవున్న ఆజ్ఞాన మానవుల్ని భక్తిమార్గలోనికి మళ్ళించ డానికి ఈ పురాణములు కొంతవరకు ఉపకరిస్తాయి. కావున వాటిని అట్లే ఉంచుకోండి.

పూర్ణయ్య :- అబ్భా బ్రతికించావురా బాబూ, ఏండ్ల తరబడి కష్టపడి సాధించుకున్న పురాణ విద్య పూర్తిగ పనికిరాకుండ పోయిందే అన్న బాధను తగ్గించావు.

వేణు :- తాతా ఇకనుండి అయినా భగవద్గీతను భక్తిగా పఠించి, అందులోని సారాంశమును గ్రహించుటకు ప్రయత్నించు ఫలితముంటుంది. అందులో నీకేమైన అర్థంకాని విషయాలుంటే నన్నడిగితే మా గురువు ద్వారా తెలుసుకొని నేను నీకు తెల్పగలను.

పూర్ణయ్య :- నాయనా! వేణూ అజ్ఞానమనే అంధకారంలో ఉన్నవారికి జ్ఞానవెలుగును ప్రసరింపజేసే మహాధర్మాల్ని ప్రబోధజేసి ఆనందం కల్గజేసే మీ సద్గురుని నామధేయమేమి?

వేణు :- తాతయ్యగారు నీవిప్పుడు పల్కిన వాక్యంలోనే మా గురువు పేరువుంది. అది నీకర్థం కాకపోతే సమయము వచ్చినపుడు తప్పక చెప్పుతానులే. అదిగో అన్నయ్య చంద్రం ఇటే వస్తున్నాడు.

చంద్రం :- (అంతలో వేణు అన్నయ్య చంద్రమ్‌ ప్రవేశించి) ఏంట్రా వేణూ తాతామనవడు తత్త్వాయణంలో మునిగినట్లున్నారు.

పూర్ణయ్య :- ఔనురా! చంద్రం. ఈ వేణు ఈరోజు నాకు మంచి ఉపకారం చేశాడు నాయనా! అసత్యమార్గములో పయనించే నన్ను సత్య మార్గమునకు మళ్ళించాడు.

వేణు :- ఔనన్నయా! తాతయ్యగార్ని పురాణాల ప్రభావమునుండి తప్పించి ధర్మాశాస్త్రాలవైపు త్రిప్పగలిగినందుకు సంతోషిస్తున్నాను.

చంద్రం :- వాట్‌! ధర్మశాస్త్రమా! అది ఎందుకు ఉపయోగపడుతుంది మానవులకు?

వేణు :- ఎందుకేమిటన్నయ్యా! దేవున్ని తెలుసుకొనేటందుకు, ఆయనలో ఐక్యమయేటందుకు.

చంద్రం :- నాన్‌సెన్స్‌ దేవుడు దేవుడు దేవుడు, ఎక్కడున్నాడు దేవుడు. మానవ మేధస్సు మహోన్నతంగా పెరిగి పోయిందిరా బ్రదర్‌, ఆకాశంలో రయ్‌మని వేగంగా దూసుకుపోయే రాకెట్లను తయారు చేసి, చంద్రలోకములో పాదం మోపాడు మానవుడు, సబ్‌మెరైనులు తయారుచేసి సముద్ర అంతర్భాగంలో సురక్షితంగా ప్రయాణం చేయగల్గుతున్నాడు. మర మనుషుల్ని సృష్ఠించి మానవుడు సునాయాసంగా మహామహా కార్యాలు చేయగలుగుతున్నాడు. మానవుడు హైడ్రోజన్‌ అణుబాంబులవంటి మహా మారణాయుధాల్ని సృష్ఠించి సృష్ఠినే అరక్షణంలో అంతం చేయగల అనంత శక్తిని సంపాదించుకొన్నాడు. మానవుడు గుండెకు బదులు గుండెను, కంటికి బదులు కంటిని వేస్తున్నాడు. మానవుడు ఇవన్నీ ఎలా చేయ గల్గుతున్నాడు? అదే సైన్సు సైన్సు యుగంరా బ్రదర్‌! ఇది. ఇప్పుడు కూడా దేవుడు, దయ్యాలు, సాధులు, సన్యాసులు అని భ్రాంతితో ఉండే మీలాంటి వెర్రివారిని ఏమనాలో తెలియకున్నది.

వేణు :- ఓరేయ్‌ అన్నయ్యా! సైన్సు అని అరుస్తూ నీ సైంటిస్టు బుద్ధి పోనిచ్చుకొన్నావు కాదు. చివరకు మీ సైన్సు ఏమి సాధిస్తుందో తెలుసునా, ప్రపంచాన్ని ఏదో ఒకనాడు ఉపద్రవంలో ముంచివేస్తుంది. ప్రపంచశాంతి ఏనాటికీ కల్పించలేదు. అయినా మీ సైంటిస్టులు, డాక్టర్లు అంతా కంటికి కనిపించే వాటిని శోధించి సాధించగలరు. కానీ కంటికి కనిపించని తత్త్వరహస్యాలు మీకెలా తెలుస్తాయి?

చంద్రం :- కంటికి కనిపించని తత్త్వాలా ఏంటవి, ఎక్కడ ఉన్నాయి?

వేణు :- అవి మన శరీరములోనే ఉన్నాయి. జీవుడు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహం ఇవికాక అనేక గుణాలు బాహ్యనేత్రాలకు ఏమాత్రము కనుపించవు. కంటినితీసి కంటిని, గుండెనుతీసి గుండెను వేయగల్గే డాక్టర్లు శరీరములోని జీవుణ్ణి తీసి వేరే జీవుణ్ణి ఎందుకు వేయలేకున్నారు. మరణ సమయములో జీవుడు కంటికి కనిపించకుండా ఎలా పోతున్నాడో కనిపెట్టగల్గుతున్నారా? పుట్టిన శిశుశరీరములోనికి జీవుడెలా ప్రవేశిస్తున్నాడో చూడగల్గుతున్నారా? ఆకలిదప్పుల్ని జయించగలుగుచున్నారా? ఆశను అదుపులో పెట్టగల్గుతున్నారా?

చంద్రం :- ఓరేయ్‌ బ్రదర్‌! నీవు చాలా పెద్దవాడివై పోతున్నావ్‌ ఇంతకూ నీవుజెప్పే దేవుడు, దేవాది దేవుడు ఉన్నారంటావా, ఉంటే ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు చెప్పుచూద్దాము?

వేణు :- భూమి తనచుట్టూ తాను తిరుగుచు సూర్యునిచుట్టు తిరుగుతూ వుంది. అది ఏ శక్తి ఆధారంతో అలా తిరుగుతోంది? సూర్యుడు చంద్రుడు అనేక గ్రహాలు, నక్షత్రాలు శూన్యములో వ్రేలాడుతున్నాయి. అవి ఏ శక్తి ఆధారముతో నిలచివున్నాయి? సముద్ర జలాలు మేరతప్పకుండా ఉన్నాయి. ఏ శక్తి ఆధారంతో ఉన్నాయి? గాలి క్రమబద్దంగా వీస్తుంది. అలా ఏ శక్తి వలన జరుగుతుంది?

చంద్రం :- డియర్‌ బ్రదర్‌! వెరీ ఇంపార్టెంటు క్వశ్చన్‌ అడిగావురా నాయనా, నీవు ఇపుడు చెప్పిన వాటన్నిటినీ కంట్రోలింగ్‌ చేసేశక్తి ఒకటుంది. దానినే మాగ్నెట్‌పవర్‌ అంటారు. ఈ విశాల విశ్వమంతా దానికి లోబడి ఉంటుంది. దానినే తెలుగులో గురుత్వాకర్షణ శక్తి అంటారు. ఈ శక్తి కంటికి కనిపించకుండవున్నా సృష్ఠినంతా కంట్రోల్‌ చేస్తువుంటుంది.

వేణు :- ఆ! అదేశక్తినే మేము పరమాత్మయని, దేవాది దేవుడని అంటుంటాము. జీవుడుగావున్న మనము ఆ శక్తిలోనికి లీనం కావడమే ముక్తి అంటాము. ఆ శక్తినే ఆది, మధ్యాంతములు లేనిదని, అవ్యయమైనదని ధర్మశాస్త్రాలు బోధిస్తున్నాయ్‌.

చంద్రం :- వాట్‌! వాట్‌! చాలా ఆశ్చర్యంగా ఉందే! గురుత్వాకర్షణ శక్తినే మీరు పరమాత్మగ చెప్పుతున్నారా, ఐసీ అయితే నేనిప్పుడు పరమాత్మ ఉన్నాడని నమ్ముతున్నాను.

వేణు :- సంతోషమన్నయ్యా! ఇంకొక విషయం భూమిపై జన్మించిన ప్రతి ప్రాణికీ స్వయంగా కదిలేశక్తి ఎలా కలుగుతుందంటారు?

చంద్రం :- ప్రతి ప్రాణమున్న శరీరములోను వారి తలలో మెదడు ఉంటుంది. దానిలో ఒకశక్తి ఉంటుంది. దానినే విల్‌పవర్‌ అంటారు. దానివలన ప్రతి జీవరాసి కదలగల్గుతున్నాయి.

వేణు :- ఆ విల్‌పవర్‌ శక్తినే జ్ఞానులు ఆత్మశక్తి అంటారు. ఆ శక్తిని యోగా భ్యాసము ద్వారా తెలుసుకోవచ్చుననికూడా ఆత్మజ్ఞానులు తెల్పుతున్నారు.

చంద్రం :- వెరీ కరెక్ట్‌రా బ్రదర్‌, ఇపుడు నీ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటు న్నాను. అలా వాదించినప్పుడే సైన్సు, వేదాంతం రెండు ఒకటిగా కలుస్తాయి. ఇటువంటి విషయాలు ఎలా నేర్చుకున్నావు?

వేణు :- మా గురుదేవుని వలన.

చంద్రం :- ఆహా! అయితే మీ గురువు ఆఖండమైన జ్ఞానిగ నాకు అర్థమౌతున్నది. ఆయన కూడా గొప్ప సైంటిస్టు అయివుంటాడని అను కుంటున్నాను. ఇటువంటి సిద్ధాంత ధర్మాలు నీకు ప్రబోధ జేసి, నిన్ను జ్ఞానిగ మార్చినందుకు నాకెంతో ఆనందం కల్గుతున్నది. ఆయన పేరేమిటి? ఎక్కడుంటాడో తెల్పితే నేను కూడ ఒకమారు ఆయనను కలుస్తాను.

వేణు :- ఆయన నామధేయం నీవు ఇప్పుడన్న వాక్యాల్లోనే ఇమిడి ఉంది. ఆయన స్థలం, ఆయన పేరు తరువాత తెలుపగలను.

(అంతలో వేణు మామయ్య కామేశం ప్రవేశించి)

కామేశం :- ప్రవేశిస్తు పాట

ప॥

జీవుడెక్కడున్నాడో జెప్పరా అసలు
దేవుడెక్కడున్నాడో జెప్పరా
జీవుడెవడు? దేవుడెవడు?
వారికన్న పెద్ద ఎవడు?
చాటుమాటలన్ని మాని నీటుగాను జెప్పరా ॥జీవు॥


చ॥ (1)

గడ్డాలను, మీసాలను ఘనముగా పెంచినోడ
కాషాయ బట్టలతో వేషాలు వేసినోడ
మోయనన్ని పూసాలు మెడనిండా వేసినోడ
వీబూధి రేఖలేన్నో ఇంపుగా పూసినోడ ॥జీవు॥


చ॥ (2)

మాయ వదలి పోవునంచు మంత్రాలు జెప్పుతారు
తలకర్మ తీరునంచు తాయెత్తులు గట్టుతారు
ముక్తి గోరి మీచెంతకు భక్తిగాను జేరితేను
బూటకాల ఎన్నొజెప్పి బూడిదిచ్చి పంపుతారు ॥జీవు॥

చ॥ (3)

ఉపదేశ మిత్తుమంచు వూరూరా తిరుగుతారు
దండిగ ధనమిచ్చునోళ్ళ తన శిష్యులంటారు
గొప్పస్వామి వంచు మ్రొక్క అబ్బరాని కుబ్బుతారు
తత్త్వమిప్పి జెప్పమంటే తైతక్కలాడుతారు ॥జీవు॥


చంద్రం :- రావయ్య రా! దేవుడేలేడు, దేవుడుంటే చూపండి అని అందరి ముందు అరుస్తూవుంటావు నీనాస్థికవాదనికి పులిస్టాప్‌పడుతుంది రా.

కామేశం :- నా నాస్తికవాదానికి పులిస్టాప్‌ పెడతారా! ఎవరు ఎక్కడ, ఎక్కడ ఆ మగధీరుడు? నాముందుకువచ్చి నిలబడి మాట్లాడమను దమ్ముంటే.

వేణు :- కల్లుసారాయి త్రాగినావా కామేశం మామయ్య, అలా చిందు లేస్తున్నావ్‌ ఆ మగధీరుణ్ణి నేనే.

కామేశం :- పిల్ల కాకికేమి తెలుసు తోడేలు దెబ్బ. నీవు నా నాస్తికత్వాన్ని నాస్తి చేయగల పురుష పుంగవునివా, నా మూడు ప్రశ్నలకు జవాబు చెప్పగలవా.

వేణు :- చెప్పగలిగితే?

కామేశం :- నీవు సరియైన సమాధానాలు చెప్పితే, ఇప్పుడే నా నాస్తికత్వాన్ని వదలి ఆస్థికత్వం చేపడతా. మొదటి ప్రశ్న జీవుడెవరు? ఎక్కడుంటాడు? ఏ పని చేస్తుంటాడు?

వేణు :- జీవుడు పరమాత్మయొక్క అంశమువాడే. అయినా ప్రకృతి ప్రభావానికిలోనై కర్మలో బంధింపబడివున్నాడు. జీవుడు ప్రతిప్రాణి తలలో గుణచక్రంలో, గుణాలమధ్యలో, వాటితో సంబంధము పెట్టుకొనివుండి గుణాలు చేయించే పనులయొక్క సుఖదుఃఖ కర్మలను అనుభవిస్తుంటాడు.

కామేశం :- జీవునికి పెద్ద ఎవరు? ఎక్కడుంటాడు? ఏమి చేస్తుంటాడు?

వేణు :- జీవునికంటే పెద్ద ఆత్మయే, ఆత్మ సర్వశరీరాల్లోను తల మొదలు గుధస్థానము వరకు వ్యాపించిన బ్రహ్మనాడియందుండును. ఈ ఆత్మ సర్వశరీరాల చైతన్యకారణమై ఉంటూ కర్మప్రకారము శరీరముతో పని చేయిస్తుంటుంది.

కామేశం :- ఆఖరు ప్రశ్న వీరిద్దరికన్నా పెద్ద ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరు? ఎక్కడుంటాడు?

వేణు :- వీరిద్దరికన్నా పెద్ద పరమాత్మ, సమస్త విశ్వమూ వ్యాపించి, ప్రకృతికధినేతయై, చరాచర ప్రకృతిని తన స్వాధీనమందుంచుకొని, సృష్ఠి, స్థితి, లయలకు కారణమైవుంటూ, గమనిస్తే మన శరీరమందే ఉన్నాడు.

కామేశం :- భేష్‌రా అల్లుడూ! భేష్‌! నేనింతవరకు ఎందరో స్వాముల్ని, సన్యాసుల్ని, వేదాంతుల్ని తరచి చూచినాను. ఎవ్వరు చూచినా, నేనడిగిన ప్రశ్నలకు శరీరం బయట చెప్పుతారు. కానీ శరీరాంతర్గతంగా ఇంత సక్రమంగా చెప్పినవారులేరు. ఇంతటితో నేను నా నాస్తికవాదాన్ని కట్టి పెట్టుతున్నాను. కాని శరీరములోనే దేవుడు ఉన్నాడని నిరూపణగా చెప్పగలవా?

వేణు :- మామయ్యగారు, నీముక్కు రంధ్రాలలో పైకిక్రిందికి ఆడుతున్న శ్వాస ఎలా ఆడుతోంది, ఏ ఆధారంతో ఆడుతోంది?

కామేశం :- (ముక్కు శ్వాసను పైకి క్రిందికి ఆడించి) నేను పీల్చుకుంటున్నా బయటికి వదలుతున్నా.

వేణు :- ఇపుడు మెలకువలో ఉన్నావు కాబట్టి నీవు పీల్చుకుంటున్నావు వదలుచున్నావు, నీవు నిద్ర పోయినపుడు ఎలా ఆడుతుందంటావు?

కామేశం :- ఎలా ఆడుతుంది, ఎలా ఆడుతుందో తెలియదు.

వేణు :- తెలియదా మామయ్యా! జాగ్రత్త, స్వప్న, సుషుప్తులనే మూడవస్థ లోను ఆత్మమూలంగనే శ్వాస ఆడబడుతుంది. ఆ ఆత్మను తెలుసుకొనేదే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆ ఆత్మే నీ శరీరములోని దేవుడు.

కామేశం :- ఆహా! అమోఘమైన రహస్యం తెల్పావురా అల్లుడూ. ఇటువంటివి దివ్యజ్ఞానియైన గురుముఖతా వచ్చివుంటాయి. ఇలాంటి జ్ఞాన విషయాలు ప్రబోధ చేసిన మీ గురువెవరో తెల్పురా, నేనుకూడ ఆనందంతో ఆయన్ని కలుసుకొని జ్ఞానం తెల్సుకుంటాను.

వేణు :- సరే! ముందు భోంచేస్తాం పద మామయ్య, తర్వాత చెప్పగలను అయినా నీవు అర్థముచేసుకుంటే, నీవు ఇప్పుడన్న వాక్యాల్లోనే ఉంది మా గురువు పేరు.

(అంతలో వేణు తండ్రి కాటమయ్య ప్రవేశించి)

కాటమయ్య :- ఒరేయ్‌ వేణు, మొన్న ఉదయమంటూ వెళ్ళినవాడివి ఇప్పుడు కనిపిస్తున్నావా? ఇంతవరకు ఎక్కడ పోయావ్‌, ఏ ఘన కార్యాలాచరించావ్‌?

పూర్ణయ్య :- నాయనా కాటమయ్య! వేణుమంచి బుద్ధిమంతుడు అవుతున్నాడురా. గురు ఆశ్రమానికి వెళ్ళాడంట చక్కని దైవజ్ఞానం తెలుసు కొని వచ్చాడు.

కాటమయ్య :- ఏమిటి నాన్నా వీడు ఆశ్రమానికి వెళ్ళాడా! అట్లయితే వేదాంతంలోకి దిగినాడన్నమాట, ఒరేయ్‌ అడ్డగాడిదలాగా లక్షణంగా తిని పనీపాటా లేకుండా ఆశ్రమాలు, గురువులు అని తిరుగుతావుంటే కాపురం చక్కబడినట్లే.

--పాట--

ప॥

పో పోర పొమ్మికన్‌ నీ ముఖం చూపించరావలదు రాతగదు పో పోర పొమ్మికన్‌
చేనుల తోటల పనులు మాని
జ్ఞానం గీనం అంటూ నీవు
ఆశ్రమంబుల వెంట తిరిగెడి
ఆకతాయి వెధవ అల్లరినాకొడకా
తంతా! నడ్డివిరగ తంతా నీపండ్లు వూడగొడత
నీచర్మ మొలిచివేస్తా (అని వేణును తన్నబోగ)

(అంతలో వేణు తల్లి కనకమ్మ వచ్చి అడ్డుపడి)


కనకం :- ఏమండీ వాన్ని కొట్టకండి, నేను నచ్చ జెప్పుతాను. (వేణుతో) ఏమిరా వేణూ? మీ నాయనకు కోపం వచ్చే పనులను ఎందుకు చేస్తావురా నాయనా!

--పద్యం--

తే॥గీ॥

ముసలి ముతకలు కోరెడి ముక్తి విద్య
పడుచుప్రాయంబునందేల పట్టకయ్య
ఇలను సంసార మందునే గలదు సుఖము
వద్దు వద్దు సన్న్యాసి బ్రతుకింక ముద్దుతనయా


వేణు :- అమ్మా! ఆశ్రమానికిపోయి జ్ఞానం తెలుసుకున్నంత మాత్రానే, పెండ్లీ పెటాకులు లేకుండ, సన్న్యాసినై సత్రాలు, చావిళ్ళు చేరతాననుకున్నారా అదేం లేదు. మా గురువుగారు మాకు బోధించేదంతా రాజయోగ సిద్ధాంతం.

కాటమయ్య :- నీ పిండాకూడు సిద్ధాంతంరా, ఇరుగు పొరుగువాళ్ళను చూడు, ఎట్లా పనులు చేసుకుంటూ సంపాదించుకొని ఎలా బ్రతుకుతున్నారో, మానవుడై పుట్టినందుకు సిగ్గు మానముండాలిరా.

వేణు :- నాయనా! నేనేమి అల్లర చిల్లరగా తిరగలేదుగదా! భక్తీ, జ్ఞానము, యోగాల గురించి తెలుసుకుంటున్నాను. అది తప్పంటే ఎట్లా.

కాటమయ్య :- తప్పే లేదంటావా తప్పుడునాయాలా.


తె॥గీ॥

ఇంత జెప్పిన విన నీ ఇచ్చరీతి
వెడలుచున్నను నాయాస్థి కడకు నీకు
చిల్లిగవ్వైన ఇవ్వను కల్లగాదు
ముందు జూపును గనుమింక మూర్ఖచిత్తా


వేణు :- నాన్నగారు ఆస్థి, ఐశ్వర్యం అశాశ్వితమైనవి, పోయేటప్పుడు ఏమైనా వెంటగట్టుకొని పోతామా, అలానే కానివ్వండి. ఆస్థిపాస్థులు కర్మానుసారంగా కలుగుతాయి, కానీ జ్ఞానం మాత్రము శ్రద్ధానుసారంగా కలుగుతుంది. మీ నిర్ణయమదే అయితే జ్ఞానంకోసం వేటినైనా విడచేదానికి సిద్ధంగా ఉన్నాను.

కాటమయ్య :- అలాగైతే నీవన్నిటికి తెగించి ఉన్నావన్నమాట. పో! నీ ముఖమింక నాకు చూపించద్దు.

--పాట--

ప॥

పోపోర పొమ్మికన్‌ నీ ముఖమునాకింక చూపించ
రావలదు రాతగదు పో పోర పొమ్మికన్‌


చ॥

తల్లిదండ్రుల మాటలు వినక
ఇల్లూ వాకిలి కల్లగదలచి
స్వాములు గీములు అంటూ నీవు
యేమో యేమో వాగుచునంటివి

కొడతా! కాళ్ళు విరగ కొడతా! నీ
కీళ్ళు విరచివేస్తా! నీ వీపు బగులకొడతా! ॥పోపో॥

(వేణుని కొట్టుటకుపోగా తల్లి కనకం అడ్డుపడి ఏమండీ కొట్టకండి, కొట్టకండి అని అడ్డురాగా కాటమయ్య భార్యను ఒకవేటు వేయగా క్రింద పడిపోవును)

పూర్ణయ్య :- (గప్పునలేచి) ఓరి కాటిగ! ఎంత పని చేస్తివిరా! వాడు ఆశ్రమాలకు పోతే ఏమి, నీకేం పోయ్యేకాలం వచ్చిందిరా, అన్యాయంగా అమ్మాయిని పడగొట్టావు. (కనకం మీదికి వంగీ అమ్మా కనకం కనకం అంటాడు.)

కాటమయ్య :- నేనేం చేస్తాను నాయనా! బడుద్దాయి వెధవ వేణూగాన్నీ కొట్టబోతే అడ్డువచ్చింది, దెబ్బతగిలి క్రిందపడిపోయింది. దానికర్మ నన్నేం చేయమంటావు.

కామేశం :- బావగారూ! ముందుగానే మీకుకోపం ముక్కుమీదుంటుంది. వేణు ఏం తప్పు చేశాడని, జ్ఞానార్జన మీ దృష్ఠిలో తప్పయితే మీకంటే మూర్ఖుడు ఈ లోకంలో ఉండడు. చెల్లాయిని నిష్కారణంగ దెబ్బకొట్టావు.

(కనకంను పట్టుకొని అమ్మా చెల్లాయి, అమ్మా చెల్లాయి, అమ్మా చెల్లాయ్‌ లేమ్మా అని అంటాడు.)

చంద్రం :- (ప్రవేశించి) డామిట్‌ ఎంతపని జరిగింది నాన్నగారూ! ఈ మధ్య మీకోపం ఎక్కువవుతోంది, కోపం ఎక్కువవుంటే గుండెజబ్బు వస్తుంది. ఎప్పుడు చూచినా పనులు పనులని పడిచస్తువుంటావు.

కాటమయ్య :-అనండ్రా! అనండి. అందరూ నన్నే అనండి. ఈ కొంపలో అందరికీ నేను అలుసై పోయినాను, కానీలే నాయనా! మీ అమ్మ సంగతి జూడు (అందరు కలిసి కనకమ్మను పైకి లేపగా కనకమ్మ ఉన్నట్లుండి గట్టిగా అందర్ని విదిలించి పారేసి వెంట్రుకలు విరబోసుకొని ఆవలిస్తూ హూ హూ అని మూల్గుతుంది.)

కాటమయ్య :-(భయంతో కూడిన అదుర్దాతో) ఒరేయ్‌ చంద్రం, ఒరేయ్‌ వేణూ! మీ అమ్మను చూడండ్రా ఇదేందో మాయ రోగమున్నట్లుంది. ఎవరైనా వెంటనే డాక్టర్ను పిలుచుకరండర్రా.

వేణు :- తండ్రిగారు! ఇది డాక్టర్లు నయంచేసే జబ్బుకాదు. ఇది ఒక గ్రహ చేష్ట.

కాటమయ్య :- ఏమిటీ గాలిచేష్టా! ఒరేయ్‌ అడగండ్రా ఎవరో? ఎందుకొచ్చి నారో? ఏమి కావాలో.

వేణు :- మీరంతా ప్రక్కకు తప్పుకోండి నేనడుగుతాను. అమ్మా అమ్మా ఏమైంది నీకు, ఎవరునువ్వు? చెప్పు తల్లీ చెప్పు నీకేంకావాలి.

కనకం :- (గట్టిగా ఒళ్ళు విరచుకొని) రేయ్‌! నేనురా, నేను మీ ముసలవ్వను మర్రెమ్మను.

వేణు :- నాయనా! మీ అమ్మగారంట ఎందుకు వచ్చినాదో అడుగు.

కాటమయ్య :- అమ్మా! తల్లీ ఎందుకు వచ్చావమ్మా, నీకేం తక్కువ చేసాము. ఏటేటా చీరలు, రవికలు పెడుతున్నాం, పెద్ద దినం చేసుకొంటున్నాం గదా.

కనక మరెమ్మ :- ఓరేయ్‌ కాటిగా చీరలు, రవికలు నాకెందుకురా? అయినా నాకవి పెడతారు, మీరేకట్టుకుంటారు. పెద్దదినమని చెప్పి అన్నివంటలు చేసుకొని మీరే దొబ్బి తింటారు. ఏదో మిమ్ములనందరిని చూచి పోతామని వచ్చాన్రా.

పూర్ణయ్య :- ఒసేయ్‌ ముసలిముండా! బ్రతికినన్నాళ్ళు సాధించావు, చచ్చినాక కూడ సాధించడానికి వచ్చావా.

కనక మరెమ్మ :- ఒరేయ్‌ ముసలిముండా కొడకా నోరు మూసుకుంటావా లేదా?

పూర్ణయ్య :- దీనికి చచ్చినాక కూడ నామీద గౌరవం లేదే. కర్మ కర్మ సరే మూసుకుంటాను లేవే.

(నోరు మూసుకొని ప్రక్కకు పోవును)

కనక మరెమ్మ :- రేయ్‌ కాటమయ్యా! ఇందాక నుంచీ చూస్తున్నాను. నా చిన్న మనవడు వేణూగాని మీద కారాలు, మిరియాలు నూరుతున్నావు. వాడు ఎక్కడబోతే నీకేమి? ఎక్కడుంటే నీకేమి? వాడంటే నాకు చాలా ప్రేమ, ఇకముందు వాడినేమైనా అన్నావంటే నేను సహించను. మీ సంసారాన్నంతా చిన్నా భిన్నాం చేస్తాను. తెలిసిందా ఆ...

కాటమయ్య :- అమ్మా నాకు బుద్ధివచ్చింది. ఇకముందు వాడినేమీ అనను. బుద్ధిమంతుడై సంసారమన్న చేసుకోనీ, సన్న్యాసై చిప్పదీసుకొని దేశాలన్నా పట్టనీ, ఏమన్నంటే నీమీదొట్టు ఇంక పోతల్లి.

వేణు :- అవ్వా! ఇంక నీవు వెళ్ళిపో, వీళ్ళు నన్నేమన్నా భయపడను. అసలు నేనేం తప్పు చేశాను. తాగి తందనాలాడానా, జూదాలాడానా లేక వ్యభిచారం చేశానా అవేమి చేయ్యలేదే. నేను శ్రీ యోగ పీఠాధిపతి ప్రబోధాశ్రమ వాసియైన శ్రీశ్రీశ్రీ స్వామి ప్రబోధానంద యోగీశ్వరుల దగ్గరకు పోయి జ్ఞానం తెలుసుకుంటున్నానంతే.

కనక మరెమ్మ :- ఏమీ! మీ గురువు శ్రీ స్వామి ప్రబోధానంద యోగీశ్వరులా! ప్రబోధాశ్రమమా! ఒరేయ్‌ నేవెళ్ళి పోతున్నాను, వెళ్ళిపోతున్నాను. ఆ స్వామి పేరు ఎక్కడ వినబడితే అక్కడ నేను క్షణమైనా ఉండడానికి వీల్లేదు వెళ్ళి పోతున్నాను, రేయ్‌ వెళ్ళిపోతున్నాను. (గట్టిగా అవలించి, తలవిదిలించి ఒళ్ళు విరచుకొనుచు దయ్యము విడచిపోవును)

కాటమయ్య :- నాయనా వేణూ! మీగురు నామము మహాశక్తివంతమైందే! ఏమో అనుకున్నాను దయ్యాలుసైతం భయపడి పారిపోతున్నాయి. ఇక ఎప్పుడూ నిన్ను ఏమీ అనను, నీ బుద్ధి పుట్టినప్పుడు ఆశ్రమానికి పోయి వస్తూవుండు, ఇంటిపనులు చేస్తువుండు.

వేణు :- సంతోషం తండ్రీ, మీ అందరి మనసులు మా గురువుగారే మంచిగా మార్చినారు.


శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి (అందరూ జై అందరు)

త్రైత సిద్ధాంత ఆదికర్తకు (అందరూ జై అందరు)

శ్రీ ప్రబోధాశ్రమ గురుదేవునికి (అందరూ జై అందరు)

---సత్‌ సంపూర్ణం, ఓం తత్‌సత్‌---

-***-