ప్రబోధానందం నాటికలు/త్రిమూర్తులు

వికీసోర్స్ నుండి

త్రిమూర్తులు

ఒక వైష్ణవుడూ, శైవుడూ ఒకరికొకరు ఎదురుపడుతారు. వారిరువురి సిద్ధాంతములు వేరువేరు కావడమూ, అనాదిగా శైవ, వైష్ణవ సిద్ధాంతముల మధ్య విబేధాలు ఉండడము వలన, వారిరువురికి ఒకరికొకరు సరిపడక మా దేవుడుగొప్ప అంటే, మా దేవుడు గొప్ప అని ఈ విధముగా వాదులాటకు దిగారు.

--సీన్‌ నెం.1--

అడ్డనామం, నిలువునామం చెరొకవైపు నుండి వచ్చి ఎదురుపడతారు.

అడ్డనామం :- ఒరేయ్‌! నిలువునామము పొద్దుపోద్దునే నీ దరిద్రపు ముఖం కనిపించిందేంట్ర. ఈరోజు నా గతి ఎలా ఉంటుందో; ఏమో!

నిలువునామం :- నిత్యం అష్టాక్షరి మంత్ర నామస్మరణతో నారాయణుని మెప్పించిన గొప్ప భక్తులము మేమే! మమ్ములను నీవు అవహేళన చేస్తావా అప్రాచ్యుడా!

అడ్డనామం :- మీ అష్టాక్షరికంటే ముందు పుట్టిన పంచాక్షరి మంత్రమునే జపించిన ఆదిపీఠవారసులము. పంచాక్షరి మంత్రముతో పరమశివుణ్ణే మెప్పించగల మమ్ములను ఆక్షేపిస్తున్నావురా! నిలువు నామమా!

నిలువునామం :- దశావతారాలలో సృష్ఠిని కాపాడిన నా విష్ణుమూర్తియే నిజమైన దేవుడు. ముందు ఆ విషయమును తెలుసుకో!

అడ్డనామం :- ఆ..ఆ... శివుడాజ్ఞలేనిదే చీమైనా కుట్టదంటారు తెలుసా? అంటే అన్ని కార్యములకు శివుడే కారకుడు, ఆయనకు తెలియనిదంటూ ఏమీలేదు. అంతేకాకుండ, లోక క్షేమంకోసం విషమును తన గొంతులో దాచుకొని, ఈ లోకములోని జీవరాసులన్నిటినీ కాపాడాడు. లేకుంటే నీతాత, నీముత్తాత అందరూ ఆదిలోనే లేకుండాపోయి ఈ రోజు నీవుకూడా లేకుండా పోయేవాడివి, అటువంటి శివుని గూర్చి తెలుసుకొని నీవుకూడ అడ్డనామములు ధరించుకో! అన్ని కోర్కెలు తీర్చగల సమర్థుడు మా శివుడే అందుకే నిలువునామమును తీసేయ్‌.. తీసేయ్‌....

నిలువునామము :- ముందు నీవు మూసేయ్‌... మూసేయ్‌ అన్ని కోర్కెలూ తీర్చగల సమర్థుడు నా విష్ణువే, లోకరక్షకుడు కూడా నా విష్ణువే. పూర్వము భస్మాసురుడు తపస్సు చేసినపుడు ప్రత్యక్షమైన నీ శివుడు, ఆయన కోర్కెను తీర్చి ప్రాణాలమీదికి తెచ్చుకున్నపుడు, నా నారాయణుడే మోహిని అవతారందాల్చి నీ శివుడ్ని కాపాడాడు, జరిగిన విషయం తెలుసుకొని మాట్లాడు.

అడ్డనామం :- అరే నీకు, నాకు వాదనవద్దు ఇది మనతాత, ముత్తాల నుంచి వచ్చిన తెగని పంచాయితి, కాబట్టి ఎవరు నిజమైన దేవుడో ఆ దేవుళ్ళను అడిగి తేల్చుకుందాము.

--సీన్‌ నెం.2--

(ఇరువురు, దేవుళ్ళ జాడకోసం అనేక స్వామీజీలను అడుగుతూ, దేశమంతా తిరుగుతూ చివరకు హిమలయాలకు చేరుకొని అక్కడ కొలువైవున్న త్రిమూర్తులను చూస్తారు.)

అడ్డనామం :- ఆహా! ఏమి నాఅదృష్టం! నేను ఆరాధించే పరమశివుడు నాకు కనిపించాడా? ఇది కలా? లేక నిజమా? తన్నుతాను గిల్లికుంటూ (శివ, శివ, శంకర)...పాట

నిలువునామం :- ఓహోహో! ఏమిఠీవి, ఏమిఠీవి నా నారాయణమూర్తిని చూసిన నేను, ఎంతో ధన్యుడని ఇందుగలడందుగలడు ఎందెందు చూసిన అందందే కలడంటారే, కానీ ఎక్కడెక్కడో వెతుకుతువుంటే ఇక్కడ దర్శన మిచ్చావా! నాతండ్రి...(పాట)

అడ్డనామం :- తండ్రీ, పరమాత్మా, శంకరా! నిన్ను చూచిన ఆనందములో అన్నీ మైమరచిపోతున్నానే, ఈ ఆనంద సమయములోనే నన్ను నీలో కలుపు కోగలవా తండ్రీ. ఈ జన్మలు ఇకచాలును, ఈ బాధలు ఇక చాలును, ఈ చరాచర సృష్ఠికి ఈశ్వరుడిగా పిలువబడుచున్న నీవేగదా అసలైన దేవుడివి. నిన్ను గూర్చి ఎన్నో పురాణాలలో విన్నాను. నీ మహిమలు ఎన్నో తెలుసుకున్నాను. ఎందరి కోర్కెలనో తీర్చిన మహానుభావుడివి నీవేకదా నిజమైన దైవానివి, మీ తర్వాత చరిత్రలో చెప్పుకుంటున్న విష్ణుమూర్తిని అసలైన దేవుడని ఈ నిలువు నామము వాడు అంటున్నాడు, తండ్రీ వీడికి నీవే అసలు దేవుడివని నీవైన చెప్పు.

నిలువునామం :- ఆ! ఏందయ్యా అడ్డనామం ఏందీ నీ కథ, మమ్ములను దబాయించి, నెగ్గుకొస్తున్నట్లు చేస్తున్నావు. ఇది మన ఊరు కాదు. నా నారాయణుడు నివశిస్తున్న ప్రాంతము. ఆయనకు కోపం వస్తే సుదర్శన చక్రముతో నీ తలను ఖండిస్తాడు. నా నారాయణుడంటే అసలైన దేవదేవుడు. అందుకే వైకుంఠనివాసుడుగా పేరొందాడు. మరి నీ శివుడు స్మశానవాసి ఆ సంగతి కూడ నీకు తెలుసో తెలియదో.

శంకరుడు :- చూడండి నాయనలార, సృష్ఠి ఆదినుండి కలహాలు లేని మాకు మీరే కలహాలు పెట్టేవారవుతావున్నారు. మీరు అనుకున్నట్లు నేను దేవుడినికాదు, దేవతను మాత్రమే. నేను కూడ పరమాత్మ చిహ్నమైన ఈశ్వరలింగాన్ని మాత్రమే ఆరాధిస్తున్నాను. అదియే సృష్ఠికర్త అయిన దేవునికి కనిపించే గుర్తు కాబట్టి సృష్ఠి ఆదినుండి అన్యచింతన లేకుండ ఈశ్వర లింగాన్ని ఆరాధిస్తున్నాను. కాబట్టి మాములు శివుడునైన నాకు దేవత హోదా కల్గింది. అంతేకానీ నేను సృష్ఠికర్తను కాదు. అందుకే నేను కూడ ముక్తి కోసమే బ్రహ్మయోగం చేస్తున్నాను.

అడ్డనామం :- ఏంటీ! నీవు ఈశ్వరలింగాన్ని పూజిస్తున్నావా! అంటే నీవు వేరు, ఈశ్వరలింగము వేరా? నీవే సృష్ఠికర్త అని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాను, ఎన్నో మౌనవ్రతాలు చేశాను, ఎంతో ధనము, కాలాన్ని వృథా చేశాను. కళ్ళుమూసుకొని ఎన్నో రోజులు నీకోసం తపస్సు చేశాను. మరి నీవు సగం కళ్ళు తెరచి యోగము చేస్తున్నావు, నీవు ఏమి యోగము చేస్తున్నావో నాకు కొంచెం కూడ తెలియడం లేదు శంకరా...

శంకరుడు :- అవును నాయన నేను కూడ ఎన్నో యుగాలుగా కళ్ళు మూసుకొని యోగం చేశాను. కానీ కలియుగం వచ్చినాక సగంకళ్ళు తెరుచుకొని చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అంతా దొంగలే, మోసగాళ్ళే! దేవతలను గొప్పగా చెప్పుకుంటూ, పూజిస్తూ కూడ మా సొమ్మునే కాజేస్తున్నారు. ఎన్నో ఆలయాలలో నగలు, కిరీటాలు, హూండీలో డబ్బులు మాయం చేస్తున్నారు. కొన్ని ఆలయాలలో విగ్రహలనే దొంగిలించి విదేశాలలో అమ్ముకుంటున్నారు. అందుకే నా పరువు పోకూడదని, నా ఆస్తి అయిన పాదరక్షకులు, కమండలము, యోగదండము, నా వాహనమైన నందిని కాపాడుకోవడానికి సగం కన్నులతో చూస్తూ, అప్పుడప్పుడు యోగబ్రష్టుడనై దైవత్వమును చేరుకోలేక నానాపాట్లు పడుతున్నాను.

నిలువునామం :- చూసావా, చూసావా నీ శంకరుడే దేవున్ని కాను అని ఆయన స్వయాన చెబుతున్నాడు. ఇపుడైన తెలిసిందా నా నారాయణుడే నిజమైన దేవుడు. అందుకే విభూతి రేఖలు తీసి, నిలువునామము ధరించి మా సమాజంలో కలుసుకో...

బ్రహ్మ :- ఓరీ! నీచ మానవులార! ఏమీ మీ ప్రేలాపన? మా దగ్గరకు వచ్చినా మీ బుద్ధులు మారలేదే? భయం, భక్తి లేకుండా మాట్లాడుచున్నారు. రాజకీయపార్టీల్లా వేషాలు, ఆచరణలు మారమంటున్నారు. మీకున్న భక్తి మీ స్వార్థంకోసమే కాని జ్ఞానం, ధర్మముకోసం కాదురా! పొండి. ఇక్కడ నుండి పొండి లేకుంటే నేను ఏమి చేస్తానో.

నిలువునామం :- నారాయణ! నారాయణ! నీవే కాపాడు. బ్రహ్మగారు మా మీదకు కోపంగా వస్తున్నారు. మీరే మమ్ములను కాపాడండి. నీహుండీలో ఎంతో డబ్బువేశాను, నావి నా కుటుంబ సభ్యులందరి తలనీలాలు సమర్పించినాము. నీ పుణ్యక్షేత్రములు అన్ని తిరిగాను, నన్ను కాపాడు స్వామీ.

విష్ణు :- ఏమిరా! పుణ్యక్షేత్రములు తిరిగావా? అంటే స్థలాలు ఎక్కడైన పుణ్యము చేసినవి, పాపము చేసినవి ఉంటాయా? మనిషే పాపాలు, పుణ్యాలు చేస్తుంటాడు. నీవు తిరిగినవన్నీ దేవాతాప్రాంగణాలు, నిజమైన దేవుని ఆలయం దేహమే. పుణ్యక్షేత్రాలు అన్న పదాన్ని కట్టడాలకు, స్థలాలకు వాడకూడదు. ఇంకా ఏమి అన్నావు? హూండీలో డబ్బులు వేసావా? అవి ఏనాడైన నేను ఒక్క రూపాయైన ఖర్చుపెట్టానా? అవి నాదాక వచ్చినవా? నాకు 100/- హూండీలో వేసి లక్షరూపాయలు కోరుతున్నారు.

ఇంకా ఏమి చెప్పావు. నీవు, నీ కుటుంబ సభ్యులందరు మీ తల వెంట్రుకలను సమర్పించినారా? నెత్తిమీద సరుకే కదా మొత్తానికి చవకేకదా అని చెప్పినట్లు ఊరక పెరిగిన వెంట్రుకలను మాకు ముడుపులుగా ఇస్తున్నారు. మేము ఏమయినా సవరాల వ్యాపారం చేస్తున్నామా, అసలు తలనీలాలు ఎందుకు సమర్పిస్తారో తెలుసా మీకు?

శంకరుడు :- వాళ్ళకి అటువంటి జ్ఞానవిషయాల మీద ఆసక్తి ఎందు కుంటుంది? కేవలం కోర్కెలమీదనే ధ్యాసంతా ఉంటుంది. మొన్నటికిమొన్న నా ఆలయానికి వచ్చినవారు కొందరిలో ఒకడు మా బావమారిదిని నీవు చంపేస్తే మా అత్తగారి ఆస్తి మొత్తం నాకు వస్తుంది. అట్లు చేస్తే నా తలవెంట్రుకలు ఇస్తానంటాడు. ఇంకొక విద్యార్థి పరీక్షలు సమీపించినా చదవడు. ఆటలు, పాటలు, అమ్మాయిలతో షికారులు చేసినవాడికి ఆ పరీక్షలన్నిటిలో నేను ఉత్తీర్ణుడును చేస్తే, నా గుడికివచ్చి గుండు గీయిస్తానంటాడు. ఇంకొకడు ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే వాళ్ల పై అధికారులనంతా శాసించే పెద్ద హోదా కల్పిస్తే, తలనీలాలు అర్పిస్తా నంటాడు. ఇంకొక రాజకీయ నాయకుడు గెలిచిన మొదటిసారే పెద్ద మంత్రి కావాలంటాడు. వీళ్ళందరి కోర్కెలు తీర్చితే, నాకు వాళ్ళ తల వెంట్రుకలు ఇస్తారంట. ఇలా ఎందుకు తయరైనాము, అసలు జ్ఞానం అంటే ఏమిటి? జీవుడు ఎవరు? దేవుడు ఎవడు? అని ఎప్పుడైన ఆలోచించారా? మీరు పోయి ముందు జ్ఞానం తెలుసుకోండి.

అడ్డనామం :- స్వామీ! మీరు కూడ అలా కోపగించుకొని పొమ్మంటే ఎట్లా తండ్రీ. మాకు ఊహ తెలిసినప్పటినుండి మిమ్ములను నిజమైన దేవుళ్ళగా భావిస్తున్నాము, ఒక్కసారిగా మమ్ములను చీదరించుకోకుండ, అసలు విషయాలు తెలియజేయండి, నిజమైన దైవాన్ని తెలియజేయండి.

విష్ణు :- చూడండి నాయనాలార! మేము దేవతలము మాత్రమే, మీకు మాకు సృష్ఠికంతటికి అధిపతి ఒకే పరమాత్మనే. అందరమూ ఆయన బిడ్డలము కాబట్టి మీరు కూడ ఆయన జ్ఞానాన్ని తెలుసుకొని ఆచరిస్తే మీరు కూడ యోగులుగా తయారవుతారు. యోగులు దేవతలకంటే అధికులు. పూర్వము దుర్వాసుడు అనే యోగి నన్ను కోపంతో కాలితో తన్నితే, ఆయన ముందు నాశక్తి చాలక ఏమీ చేయలేక పోయాను. అంటే మనుష్యులు కూడ జ్ఞానమును తెలిసి ఆచరిస్తే యోగులుగా అయి దైవత్త్వాన్ని పొందుతారు.

నిలువునామం :- అటువంటి నిజమైన జ్ఞాన వివరము తెలియాలంటే ఏమి చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? స్వామీ కొంచెం మాకు తెలియజేయండి.

శంకురుడు :- మేము చెప్పితే స్వార్థముతో చెప్పాడనుకుంటారు. బ్రహ్మగారికి భూలోకములో గుడిలేదు భక్తులు లేరు కావున ఆయననే అడగండి, నిస్వార్థముగా చెబుతాడు.

అడ్డనామం :- స్వామి బ్రహ్మగారు, మీరు అనుసరిస్తున్న జ్ఞాన విషయాలను గూర్చి చెప్పి మేము నిజమైన మార్గాన్ని తెలుసుకునేటట్లు జేయండి తండ్రి.

బ్రహ్మ :- నాయనలారా! మీ అజ్ఞానమునకు ఒకవైపు జాలి, ఒకవైపు కోపము కలుగుచున్నవి. అజ్ఞానమే అన్ని అనర్థములకు కారణమని మిమ్ములను చూచి తెలియుచున్నది. దేవునికీ, దేవతలకు తేడా తెలియక, ఎవరు దేవుడో, ఎవరు దేవతలో తెలియని అయోమయములోపడి, మీరు సృష్ఠించుకొన్న మతములలో మునిగి, ఇహములోనే ఉండిపోవుచున్నారు. మీరు ఎంతటి అజ్ఞానాంధకారములో ఉన్నారంటే, ఈ సకలసృష్ఠినీ బ్రహ్మ అను పేరుగల నేను తయారు చేశానను మూఢనమ్మకముతో ఉన్నారు.

వాస్తవమునకు ఈ సర్వసృష్ఠిని తయారు చేసినవాడే దేవుడు. సృష్ఠికర్త! పరమాత్మ, అధిపతి, ఆదికర్త అను పదములన్నియు దైవమునకు పర్యాయ పదములే! దేవుడు సృష్ఠించిన సకల జీవరాసిలో ఒకటైన మానవ జాతి రెండు రకములుగా విభజించబడినది. అవియే దేవజాతి, రాక్షసజాతి. జ్ఞానమున్నవారు ఈ రెండిటినీ గుర్తించవచ్చును. మరియు తాను ఏ జాతివాడైనదీ గుర్తించవచ్చును.

భగవద్గీతయందు "దైవాసుర సంప ద్విభాగ యోగము" అను అధ్యాయములో భగవంతుడు, దేవతల, రాక్షసుల యొక్క గుణములను చెప్పియున్నాడు. దాని ఆధారముగా దైవజ్ఞానము తెలిసినవారు దేవతలనీ, అజ్ఞానము కల్గినవారు రాక్షసులనీ చెప్పవచ్చును. అంతేకాక తెలుసుకొన్న జ్ఞానము పరిమాణమును బట్టి దేవతలకు కొన్ని హోదాలు ఈయబడినవి. అవియే విష్ణు, ఈశ్వర, బ్రహ్మస్థానములు లేదా పదవుల హోదాలు. అత్యధిక జ్ఞానశక్తి కలవానిని విష్ణువు అనీ, అక్కడినుండి జ్ఞానశక్తి తగ్గుకొలది ఈశ్వర, బ్రహ్మ మొదలగు దిక్పాలురు వరకు కలరు.

మానవులలోనే దేవతలు ఉన్నప్పటికీ, వారిని భూమిమీద ఎందుకు గుర్తించలేక పోవుచున్నారనే ప్రశ్న మీకు వచ్చును. దానికి సమాధానముగా గీతలో భగవంతుడు చెప్పినట్లు, దేవతలు అందరూ భూమిపైనే ఉన్నారు. కానీ అజ్ఞానులు వారిని గుర్తించలేరు. ఎందుచేతననగా మనకున్న స్థూల కన్నులతో చూచిన, అన్నీ మానవాకారములే కన్పించును. మానవుల యందున్న దైవత్వమును గుర్తించవలెనన్న జ్ఞానదృష్ఠి కావలెను. ఈ జ్ఞానదృష్ఠి లేకున్న దేవునికీ, దేవతలకు తేడా తెలియక కనిపించే ప్రతిదీ దైవమే అనుకొను ప్రమాదముకలదు.

ప్రస్తుతము మీ పరిస్థితి అదే! విష్ణు, ఈశ్వర, బ్రహ్మలనునవి జ్ఞానశక్తిని బట్టి పదవులనీ, ఆ పదవులు ఖాళీ అవుతూనే, అంటే ఆయా పదవులో ఉండేవారు మోక్షానికి చేరుకోగానే, ఆ పదవికి అర్హులైన జ్ఞానశక్తి పరులు భర్తీ అగుదురనీ మీరు తెలుసుకోవలసిన అవసరమున్నది. ఇదంతయు తెలియవలెనంటే దేవుడు భూమిపైకి వచ్చి చెప్పిన నిజమైన బోధ తెలియవలెను.

దురదృష్టవశాత్తూ, ఈనాడు మాయప్రభావమున భూమిపై కొంత మంది మాయాగురువులు, పీఠాధిపతులు, స్వామీజీలు దేవతలనే దేవునిగా చిత్రించి, తమ అజ్ఞానపు బోధలతో మీవంటి వారిని మరింత అంధకారము లోనికి నెట్టివేసి, దైవమార్గమునుండి దూరము చేయుచున్నారు. అంతేగాక తమ ఉనికినీ, తాము సృష్ఠించిన మతము యొక్క మనుగడనూ కాపాడు కోవడానికి శైవము, వైష్ణవము అను బేధములను సృష్ఠించి, మనుషుల మధ్య విభేదాలు, విద్వేషాలురగిల్చి ఇదిగో! మిమ్మల్ని ఈ స్థితికి తీసికొచ్చారు.

(నిలువు నామాలవైపు తిరిగి) ఏమయ్యా! నిలువునామలూ ఈ విష్ణువు తనను తప్ప మరెవరినీ పూజించవద్దని నీ పూర్వీకులకుగానీ, నీకుగానీ చెప్పాడా?

నిలువునామము :- లేదు స్వామి?

బ్రహ్మ :- (అడ్డనామాలవైపు తిరిగి) ఏమయ్యా అడ్డనామాలు, పోని ఈ శివుడైనా నీకు, తననే పూజించాలని చెప్పాడా? వేరే దేవతలను ఆశ్రయించ వద్దని చెప్పడం జరిగిందా?

అడ్డనామము :- అటువంటిది ఏమీ లేదు స్వామీ!

బ్రహ్మ:- దైవజ్ఞానము తెలిసినవారి మధ్య శరీరసంబంధముకన్నా, గొప్పదైన ఆత్మ సంబంధముండును. మా ముగ్గురికీ మధ్య అటువంటి ఆత్మసంబంధమే ఉండి మేము కలిసికట్టుగా ఉంటూ, దైవజ్ఞానమును పెంపొందించుకొంటూ దైవాన్ని చేరవలెననే తపనలో ఉన్నాము. కానీ మీరు మా పేర్లు చెప్పుకొని కలహించుకొనుచున్నారు. మాకులేని విభేదాలు మీకేల?

నేను కూడా ఒకపుడు మీవంటి సాధారణ మానవుడినే! కానీ నిజమైన దైవజ్ఞానమును తెలుసుకొని, ఆచరించి ఇదిగో! ఈ రోజు ఈ బ్రహ్మస్థానమునొంది, దేవతలైన విష్ణు, ఈశ్వరుల సరసన నిలిచితిని. నిజమైన దైవమును చేరి, మోక్షమునొందవలెనని మేమెంత తపించుచుంటిమో. మీరు అట్లే తపించండి. అందుకు అవసరమైన సంపూర్ణ దైవజ్ఞానమును తెలియండి. ఈ కలహాలుమానండి.

భక్తులు :- స్వామీ! అటువంటి విలువైన జ్ఞానము ఈ మాయ ప్రపంచములో ఎక్కడ లభించును.

బ్రహ్మ :- సంతోషం నాయనాలారా! మీరడిగిన ప్రశ్నను బట్టి, మీకు జ్ఞానోదయమైనదని తెలియుచున్నది. ఇక మీ ప్రశ్నకు జవాబు ఏమనగా! మేము చెప్పినది, ఆచరించినది అయిన దైవజ్ఞానము, ఈరోజు అదృష్టవశాత్తు ఈ భూమిపైనే లభించును.

భక్తులు :- ఎక్కడ స్వామీ! త్వరగా సెలవీయండి!

బ్రహ్మ :- చిన్నపొడమల గ్రామములో ప్రబోధాశ్రమములో శ్రీకృష్ణుని నిజమైన బోధ అయిన త్రైతసిద్ధాంత భగవద్గీత జ్ఞానసందేశమును ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లవారు నిర్విరామముగా అందించుచున్నారు. అన్నట్లు మరొక విషయము. ఈ రోజు శ్రీకృష్ణాష్టమి సందర్భముగా యోగీశ్వరులవారి దివ్య జ్ఞానసందేశమును అందించబోవుచున్నారు. మేమును అచటికే పోవుచున్నాము. మీరును మాతో రావచ్చును.

భక్తులు :- ధన్యులము స్వామీ! ఇంతకాలమునకు విలువైన జ్ఞానమార్గము లభించినందుకు ఎంతో ఆనందముగా ఉన్నది. నేటినుండి యోగీశ్వరుల జ్ఞానమును తెలుసుకొని, శైవము, వైష్ణవమనెడి మతములకతీతమైన జ్ఞానమును ప్రపంచమంతా ప్రచారము చేయుదుమని ప్రతిజ్ఞ చేయుచున్నాము.

బ్రహ్మ :- ఇంతటి గొప్ప జ్ఞానమును అందించిన ఆచార్య ప్రబోధానందులకు నమస్కరించుచూ

ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులకు జై...

-***-