ప్రబోధచంద్రోదయము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

ప్రబోధచంద్రోదయము

ద్వితీయాశ్వాసము

క.

శ్రీకరవీక్షణదాన
శ్రీకర నరసింహనృపవశీకర నయవి
ద్యాకరణ చతుర్దశవి
ద్యాకర ధీరంగమతి యనంతయ గంగా!

1


వ.

అవధరింపుము మున్ను విద్యాప్రబోధచంద్రులకు నిర్విఘ్నంబు సంభవిం
చుటకునై పుణ్యతీర్ధంబులవెంట దేవతాప్రార్థనంబుకొఱకు వివేకుండు
పనిచిన శమదమాదుల భంజించి చతురాశ్రమవర్తనంబులం జీకాకుపఱచు
కొఱకు మహామోహునిచేత ననుజ్ఞాతులైన భవదీయహితులలోన దం
భుండు దృఢప్రారంభుం డగుచు నగణ్యపుణ్యమణిసాగరంబును దురితా
నిలాజగరంబునునైన కాశికానగరంబు ప్రవేశించి గృహమేధివేషంబున
వసియించి క్రమక్రమంబున నంతట నావటించిన తనమహిమ విలో
కించి సంతసించి యాత్మగతంబున.

2


మ.

రతులన్ సీధురసంబుక్రోవు లగువారస్త్రీలకెమ్మోవులన్
మతి నుప్పొంగుచుఁ గ్రోలి వెన్నెలల నానందించి రేపాడి దీ
క్షితులై తాపసులై సదాజపితలై క్షీరోదకాహారులై
యతులై దంభత మోసపుచ్చుదురు మర్త్యశ్రేణి ధూర్తోత్తముల్.

3


చ.

అనుచుఁ దలంచి దక్షిణదిశాభిముఖుండయి దంభుఁ డొక్కనిం
గనుఁగొని యీతఁ డెవ్వఁ డొకొ గర్వభరంబున మండుకైవడిన్
బెనఁచి జగంబులెల్ల వడిమ్రింగెడులాగున వాక్యలీల భ
ర్త్సన మొనరించుచందమునఁ బ్రాజ్ఞత నొప్పెడిరీతి నొప్పుచున్.

4


క.

వారణసి దాఁటి యచటికిఁ
జేరఁగఁ జనుదెంచె నితనిచే దక్షిణరా

ఢారాష్ట్రగతుఁ డగు నహం
కారునివృత్తాంత మెఱుఁగఁగావలె ననినన్.

5


ఉ.

ఆయరుదెంచువాఁడును మహాహమికన్ జగమెల్లఁ బామర
ప్రాయము గాదె లేదు గురుభట్టమతశ్రవణంబు తర్కమున్
న్యాయము వ్యాససూత్రములయర్థముఁ జూచిన బత్తి దోఁప లే
దేయెడ మర్త్యకీటకము లేగతిఁ గాంతురు సూక్ష్మవస్తువున్.

6


సీ.

అహహ! ద్వైతాద్వైతపడవిలోఁ బడు నీత్రి
                          దండులఁ జూడఁ బాతకము గాదె
యర్థంబు తెలియక యఱచెద రవధాను
                          లూరక వేదాలు నోరికొలఁది
పాషండు లీశైవపాశుపతాదు ల
                          య్యో! దురభ్యస్తాక్షపాదమతులు
భుక్తిగానక వృథాబోడులై సన్యాసు
                          లకట! దాల్చెదరు వేదాంత మెల్ల


గీ.

నౌనె ప్రత్యక్షముఖ్యప్రమైకసిద్ద
బహువిరుద్ధార్థములు చెప్పఁ బాలుపడిన
యట్టివేదాంతమే శాస్త్ర మయ్యెనేని
బౌద్ధమత మది చేసినపాప మేమి?

7


ఉ.

వీరలు గంగలోఁ బులినవేదులమీఁద బ్రుసీనివిష్టులై
నోరు వృథా మెదల్పుచుఁ గనుంగవ మోట్పడ నక్షమాలికల్
సారెకుఁ ద్రిప్పుచుం గుళలు సంబేళలోపలి దేవపూజలున్
దారును దాంభికుల్ జనధనంబు హరించెద రద్భుతంబుగన్.

8


వ.

అని యిట్లు దూషింపుచుం జని చని యెదుర వెదురుదండంబుల నాఱఁగ
ట్టిన దట్టంపునీర్కావిదోవతులవలనను, ధూమశ్యామలితవ్యోమసీమం
బులగు హోమధూమంబులవలనను నాడకాడకుఁ బచరించిన కృష్ణాజిన

దృషదుపలచషాలకోలూఖలముసలంబులవలనను, బలిహరణసమయం
బున సందడించు నతిథిబృందంబులవలనను మనోహరంబగు నొక్క
గృహమేధిమందిరంబు గనుంగొని యందు రెండుమూఁడుదినంబులు
నిలిచెదనని తద్గృహంబు ప్రవేశించి యందు.

9


మ.

నుదుట న్ముక్కునఁ జెక్కులన్ జుబుకమందున్ గండపృష్ఠంబులన్
బెదవిన్ ఱొమ్మునఁ గుక్షి నూరువుల మృద్బిందు ల్ప్రకాశింప ద
ర్భదళంబుల్ శిఖలోపలం గటితటిన్ బాణిద్వయిన్ మించఁగా
నిదెపో దంభము మూర్తి దాల్చెననఁగా నీయయ్య చూపట్టెడున్.

10


సీ.

అనుచు మెల్లన చేరి యాశీర్వదింపంగ
                          దంభుఁ డహంకారతను నదల్చి
తనశిష్యుఁ జూడ నాతఁడును సన్నయెఱింగి
                          బ్రాహ్మణా! యేతదాశ్రమపదంబు
ధూళికాళులతోడ నేల చొత్తెంచితి
                          వనిన నయ్యతిథియుఁ గినుక పుట్టి
యాసనార్ఘ్యాదుల నతిథులఁ బూజింపు
                          దురు కోపము గృహస్థు లెఱుఁగ రకట


గీ.

యనిన దంభునిహస్తసంజ్ఞానుమతిని
శిష్యుఁ డోవిప్ర! మీకులశీలవర్త
నంబు లారాధ్యు లడుగుచున్నారు మీరు
దూరదేశాగతులు గాన దూర నేల.

11


ఉ.

నావుడుఁ దద్ద్విజుం డహహ! నాదగుశీలము వర్తనంబునున్
బావనముల్ కులంబునను బాగగువిత్తను గౌడదేశరా
ఢావరపట్టణంబునఁ గడాని మదీయగృహంబు తండ్రి ధా
త్రీవినుతుండు తత్సుతులు శ్రేష్ఠులు నే నధికుండ వారిలోన్.

12


క.

అనవుడు శిష్యుఁడు దంభుని
యనుమతిఁ దామ్రంపుగిండి నంబువులిడఁ గై

కొని యతఁడు పాదశౌచం
బును నాచమనంబుఁ జేసి ముందటి కరుగన్.

13


గీ.

కోప ముదయింపఁగా బండ్లు కొఱుకుకొనుచు
దంభుఁ డిస్సిస్సి! పైగాలి పగిలి నీదు
చెమటబిందులు మామీఁదఁ జిలుకకుండ
నోయివిప్రుండ! యెడగల్గ నుండు మనిన.

14


క.

అతిథియు నీబ్రాహ్మణ్యము
క్షితిలోఁ గడుఁగ్రొత్త యనిన శిష్యుండును నీ
కృతకృత్యునిమాహాత్మ్యం
బితరులకుం గలుగకుండు టెన్నఁడు వినవే.

15


క.

రాజులు నీతనిపాదాం
భోజంబులు ముట్టవెఱచి పొనపొన దవులన్
రాజితమకుటమణిచ్ఛవి
రాజుల నీరాజనంబు రచియింతురనన్.

16


ఆ.

విప్రుఁ డాత్మలోన వికలుఁడై యీదేశ
ములజనంబు డాంబికులకుఁ గాని
బ్రమియ రనుచుఁ దలఁచి పరిసరదర్భపీ
ఠమునఁ గూరుచుండ డాయ వటువు.

17


క.

మాయారాధ్యస్వాముల
దీయాసన మెక్కఁ బోల దితరుల కనినన్
నాయట్టికులశ్రేష్ఠున
కీయాసన మెక్కఁ బోలదే వెడవడుగా!

18


చ.

వినుము! మదీయమాత జనవిశ్రుతవంశజ యంతకంటె మ
ద్వనిత కులస్థురా లగుటఁ దండ్రికి నే నధికుండ నట్టి నా

యనుఁగువధూటితమ్మునికి నల్లునికూఁతురు లేనినిందఁ బొం
దినఁ బ్రియభార్య మానితి వినిందితబాంధవగంధసంగతిన్.

19


క.

నా విని దంభుఁడు నవ్వుచు
నా విప్రునిఁ జూచి నీమహత్త్వమె పొగడే
వీ వింక మత్ప్రభావం
బీ వెఱుఁగవుగాక విన్న నిందుల తరమే.

20


మత్తకోకిల.

ఏను ము న్నొకనాఁడు పద్మజునింటి కేగినఁ గొల్వులో
మౌనులెల్లను లేచినప్పుడు మమ్ముఁ జూచి పితామహుం
డాన పెట్టి ప్రియంబుఁ జెప్పుచు నంబుగోమయమార్జితం
బైన యట్టినిజోరుపీఠికయందు నిల్పఁడె నావుడున్.

21


శా.

ఓరీ డాంబిక! యెంతపట్టెదవు గర్వోద్రేకివై యింద్రుఁడున్
నీరేజాసనుఁడున్ మునీశ్వరులు నా నీకింత దొ డ్డీసునా
సీరు ల్లక్షలు వేలు బ్రహ్మలు మునిశ్రేణుల్ పరార్థాధికుల్
పోరా! నే నెఱుఁగంగ నాతపముపెంపుల్ చూడ నింతింతలే.

22


క.

అనవుడు దంభుఁ డహంకా
రునిగా నాతని నెఱింగి మ్రొక్కుచు నే నీ
మనుమఁడ లోభునితనయుఁడ
నని చెప్పినఁ దెలియ విని యహంకారుండున్.

23


వ.

ఆదంభుని పరిరంభణంబు గావించి యోవత్సా! నీతలిదండ్రులైన తృష్ణా
లోభు లెచ్చట నున్నవా రనినఁ బితామహునితో వారిం బాసి నే నొక్క
క్షణంబయిన నోరువంజాలుదునే. వారును నేనును నిచ్చటనే యున్న
వారము. మీ రిచ్చటికి విచ్చేసిన కారణం బానతీవలయుననిన నహంకారుండు
మనుమనిం జూచి వినుము! మనయేలికయైన మహామోహునకు వివేకుని
వలనం గాఁగల మహోపద్రవంబుఁ బరిహరించుటకై వచ్చితి. మహామో

హుండును వివేకునిం బరాజితుఁ జేసి యీవారణాసియే రాజధానిగా
రాజ్యంబు చేయవలయునని చిత్తంబునం గలదు గావున నేట రేపటలోన
నింద్రలోకంబునుండి యిచ్చటికి విచ్చేయు ననువార్త వినంబడుచున్నది
యనిన దంభుండు విద్యాప్రబోధజన్మభూమియు, నిరత్యయంబునునైన
యీ కాశికానగరంబు దండ చేసికొని వివేకుండు కులోచ్ఛేదంబు గావింపఁ
గాచుకొని యున్నవాఁడు. దీనికిఁ బ్రతికారం బతిదుర్ఘటం బది యెట్లంటేని.

24


క.

పరమజ్ఞానం బెఱుఁగని
నరులకు నీ వారణాసినగరిని విశ్వే
శ్వరుఁ డంత్యకాలమున సు
స్థిరకరుణం దారకోపదేశము చేయున్.

25


క.

ఐనను గామక్రోధా
ధీనుల కది దొరక దిచట దృఢనియతవచో
మానసకరపదములు గల
ధీనిధులకుఁ గాక కలవె తీర్థఫలంబుల్.

26


క.

అనుచు నహంకారుఁడు దం
భునితో మాటాడు సమయమునఁ గ్రందుకొనన్
వినువీథిని వినవచ్చెను
ఘననిస్సాణాదివాద్యకలకల మంతన్.

27


సీ.

కలయంగఁ గస్తూరి కలయంపి చల్లిరి
                          వినుకాంతమాణిక్యవేదికలను
యంత్రమార్గము లెల్ల ననువుగాఁ దీర్చిరి
                          ధారాగృహాంతరాంతరములందు
నవరత్నమయతోరణంబులు గట్టిరి
                          వారక గోపురద్వారములను
మెఱుఁగారు మేడలమీఁద నిల్చిరి పురం
                          దరధనుర్ధామచిత్రధ్వజములు

గీ.

సౌవిదల్లానుమతి బౌరజనము లిట్లు
సంభ్రమమునొంద నిజకులస్వామి మోహ
నృపతి యేతెంచె నం చెదురేగి కనిరి
యా యహంకారదంభలోభాదిహితులు.

28


క.

మోహుం డతివైభవమున
సాహోయని కటికవారు సందడి జడియం
గా హేమరత్నఖచితమ
హాహర్మ్యము చొచ్చి యందు నాసీనుండై.

29


క.

అపు డతఁడు నగుచు సౌగత
క్షపణక పాషండ బౌద్ధ కపాలిక ము
ఖ్యపరివారముతో ననుఁ
బ్రపంచ మిది యకట! మూర్ఖబహుళం బయ్యెన్.

30


క.

తనువునకు నాత్మ వేఱఁటఁ
యనుభోగించునఁట! పిదప నాముష్మికమున్
వినుఁ డీదురాశ గగనా
వనిరుహపుష్పఫలభోగవాంఛన్ బోలెన్.

31


మ.

కడుచోద్యం బిది పంచభూతపరిపాకప్రాప్తచైతన్య మీ
యొడలే యాత్మను సత్యవాదులఁట! యోహో నాస్తికుల్ దేహముం
బడఁగా నాత్మయు వేఱ యుండునని దబ్బర్లాడు వా రాస్తికుల్
పుడమిం బూజ్యులు నైనవారలఁట! యీబొంకు ల్వినం బోలునే.

32


క.

కరచరణాద్యవయవములు
సరియఁట! మరి వేరెవేరెజాతులు గలవా
ధరలో నకృత్యమందురు
పరదారధనాక్రమములు పౌరుషహీనుల్.

33

చార్వాకమతము

వ.

తమతమయుక్తిబలంబులఁ బదార్థభేదంబులు గల్పించి వావదూకులైనడ
దుర్విదగ్ధులు సర్వజనంబులు మోసపుచ్చుచున్నవా రింతియ కాని మాకు నిది
యొడంబడిక కాదు. తొడిఁబడం జెల్లుఁబడిగల వార లేమి చేసినం జెల్లియ
పోవుఁగాక లోకంబులఁ గృత్యాకృత్యంబులు గలవనుట మిథ్య తథ్యంబు
లోకాయతికంటె శాస్త్రంబు దండనీతియె విద్య, ప్రత్యక్షంబె ప్రమాణంబు,
పృథివ్యప్తేజోవాయురాకాశంబులే తత్త్వంబులు. భూతంబులే ప్రేరకంబులు,
చచ్చుటయే మోక్షంబుగాక పరలోకంబన నెక్కడియది. యిదియ కదా
వాచస్పతి చార్వాకున కుపదేశించె నతండును శిష్యప్రశిష్యపరంపరవలన
జగంబునం దనమతంబు బహుళంబు చేయవలసి కురుక్షేత్రాదిపుణ్య
క్షేత్రంబులకుఁ జనినవాఁడు వాఁడును మనల మిచ్చటకు వచ్చుట విని
యింతకుఁ జనుదెంచు ననిపలుకు నవసరంబునఁ జార్వాకుండును సర్వ
తీర్థంబులఁ జరియించి మహామోహుమహిమాక్రాంతంబైన కాశికానగరంబు
ప్రవేశించి యందు నిజమతప్రకారంబు విలోకించి సంతసించి శిష్యునితోడ
వత్సా! ప్రత్యక్షాప్రత్యక్షఫలమూలంబైన కృషిగోరక్షణాదిసహితదండ
నీతియ మంచివిద్యయని యెఱుంగక కొందఱు మూఢులు మునిభండ
నిశాచరప్రముఖధూర్తప్రలాపితంబైన వేదత్రయంబు చదువుదు రందు
వృథాప్రయాసంబెకాని భుక్తిలేదు. పరలోకంబు మొదలికే లేదు. వేదోక్త
ధర్మంబు లబద్ధంబు లగుట చెప్పెద వినుము.

34


క.

క్రతువును గర్తయు ద్రవ్య
ప్రతతియుఁ జెడఁ దమకు స్వర్గఫలము గలుగునే?
వితతదవానలదగ్ధ
క్షితిరుహములవలన ఫలము చేరునకాదే.

35


గీ.

చచ్చినట్టిజనుఁడు శ్రాద్ధంబుచేఁ దృప్తి
బొందు ననుట వినఁగఁ బొందుగాదు
తీరనారినట్టి దివియ మండునె భూమి
నెంతచమురు పోసిరేనిఁ బిదప.

36

క.

నావుడు శిష్యుం డిట్లను
దేవా! యిట్లయ్యెనేని తృణపర్ణఫలాం
భోవాయుభోజనాదుల
నీవెఱ్ఱులు తీర్థవాసు లేల కృశింపన్.

37


క.

అనఁ జార్వాకుఁడు శిష్యుని
గనుఁగొని యిట్లనియె ధూర్త కథితాగమముల్
విని మోసపోయి చెడు దు
ర్జను లాసాసలనె తనిసి బ్రమయుదురు సుమీ.

38


మ.

కుజనుల్ వీరలు భిక్షుకత్వము లతిక్రూరాటవీవాటికా
భజనంబుల్ సతతోపవాసనియతుల్ పంచాగ్నిమధ్యస్థితుల్
భుజనిష్పీడితబాహుమూలయుగళీభుగ్నస్తనాభోగనీ
రజనేత్రాపరిరంభసంభవసుఖారంభాంశముం బోలునే.

39


క.

పరిమిశ్రితదుఃఖం బని
నిరసింతురు విషయసుఖము నీరసబుద్ధుల్
ధర నుముకకుఁగా విడుతురె
సరిబియ్యము వచ్చు దీనసరిధాన్యంబున్.

40


క.

అని వెలుపటఁ జార్వాకుఁడు
తనశిష్యునితోడఁ జెప్పు తద్వాక్యంబుల్
విని మోహుఁ డింతకాలం
బునకు న్వినఁగల్గె నమృతపుంజపుఁబల్కుల్.

41


క.

ఈమాడ్కిఁ జెవికి నింపై
ప్రామాణికముద్ర గలిగి బహుళార్థముగా
నీమాటలు చార్వాకుని
వో మంచి వటంచు నాత్మ నూహించుతఱిన్.

42


సీ.

చార్వాకుఁడును మోహుసమ్ముఖంబున కేగి
                          మ్రొక్కినఁ గుశలంబు చక్కనడిగి

యామోహుఁడును సమీపాసనంబున నున్పఁ
                          గూర్చుండి దేవ! నీకూర్మి కలుగు
బంటైనకలి నీకుఁ బదివేలదండాలు
                          పెట్టితి నని వినిపింపు మనియె
నతనికి లెస్సయె యయ్య! నీకృప గల్గ
                          నన్నియు లెస్సలౌ నతఁడు నింక


గీ.

విశ్వమెల్లను ద్రిమ్మరి వివిధపుణ్య
తీర్థములవెంట వేదశాస్త్రార్థకథలు
పౌనుఁగుపడఁజేసి వైరుల ప్రోపడంచి
కాని దేవరపాదముల్ గాన రాఁడు.

43


క.

తను నేలిన యేలిక పం
పినపని సాధించి జనులు మేలని పొగడన్
బునరాగతుఁడై యేలిక
తను మెచ్చఁగ మ్రొక్కుబంటు ధన్యుఁడు కాఁడే.

44


చ.

అలవడ వేదమార్గము విరాకులవిత్తుగ సజ్జనాళి వి
చ్చలవిడిఁ జెంతలం దిరుగుజాడకుఁ దెచ్చితి మెల్లచోట్ల న
క్కలియును నేను నీమహిమ కా కిది చూడఁగ మాప్రభావమే
తలఁపఁగ నెందు నేలికప్రతాపమె తేజముఁ దెచ్చు బంటుకున్.

45


గీ.

స్వామి! యుత్తరపథికపాశ్చాత్యు లెల్ల
వేదములసుద్ది మొదలంట విడిచి రొక్క
చోట నెందైనఁ గలిగినఁ గూటికొఱక
కాని కాదని శాంత్యాదికారణములు.

46


క.

యోగంబులు వేదంబులు
యాగంబులు నుదరపోషణార్థంబు బలో
ద్యోగవిహీనునకగు నని
యాగీష్పతి మున్ను తెలియ నానతి యీఁడే.

47

కావునఁ గురుక్షేత్రంబున విద్యాప్రబోధచంద్రు లుదయింతురన్న సంది
యంబు దేవరడెందంబునఁ గలలోనైన నిలుపవల దనిన మోహుండు
తాదృశంబైన తీర్థంబు వ్యర్థంబు చేసి మదర్థంబు ప్రయాసపడితిరని సంత
సించినఁ జార్వాకుండు దేవా! యింక నొక్కవిన్నపంబు విన్నవింపం
గలదు. మహాప్రభావయగు యోగినియోర్తు కలిచేత నిశకలితప్రచార
యయ్యె నైనను దదనుగృహితులైనవారల మాకుఁ దేఱిచూడ నశక్యంబు
దానికిఁ బ్రతివిధానంబు దేవరచేతంగాని కాదనిన మహామోహుం డాత్మగ
తంబునఁ గొండొకసేపు చింతించి యామహాయోగిని విష్ణుభక్తియది సదా
మాతోడి కొఱకొఱ మానదు కటకటా! దాని నెన్నఁడును సాధింపలేక
పోయితిమని తలంచి యాచార్వాకుని విలోకించి కామక్రోధాదులముందఱ
దీనిపని యేమి యున్నయది యొక్కటి కొంచెపుఁబగఱనైన నుపేక్షం
పక హెచ్చరిక గలిగి శీఘ్రంబ త్రుంపవలయుఁ గాలంబునఁ ద్రుంచ
కుండఁ బోవిడుచుట కొఱగాదు వినుము.

48


క.

అఱకాలున విఱిగినములు
కుఱుచైనను బిదపఁ జీము కూరిచెడుగతిన్
దఱిఁ జెఱుపమిఁ గొంచెపుఁబగ
కఱకరి నరికట్టి పిదపఁ గడు నొప్పించున్.

49


క.

అని కామక్రోధాదుల
గనుఁగొని యావిష్ణుభక్తి గడుపిల్లది దా
నిని మీరు సావధానం
బున గెలువఁగవలయు ననుచు బోధింపంగన్.

50


క.

ఆలోన బత్రహస్తుఁడు
కాలరివాఁ డొకఁడు మోహుఁ గని సాగరతీ
రాలయపురుషోత్తమదే
వాలయనిలయమదమాదు లనిపిరి నన్నున్.

51


గీ.

అనుచు మనవిపత్ర మర్పింపఁ దత్పత్ర
మునకు నిడిన లక్కముద్రఁ జూచి

యిందువలన నొప్పమేదైన వినవలె
ననుచుఁ దానె చదువుకొనియె నిట్లు.

52


సీ.

శ్రీమతు వారణాసి మహాపట్టణ
                          స్వామి రాజాధిరాజ పరమేశ్వ
రుఁడు మహామహేశ్వరుని దివ్యపాదప
                          ద్మంబులకును మానమదులు సద్వి
నయభక్తిదండప్రణామంబు భక్తిఁ గా
                          వించి చేయంగల విన్నపంబు
తనతల్లిశ్రద్ధయుఁ దాను శాంతి వివేక
                          భర్తకు నుపనిషద్భామినికిని


గీ.

నడుపుచున్నది దౌత్యంబు విడువ కెపుడు
కామసఖుఁడైన ధర్ముండుఁ గలయ మాట
లాడె వైరాగ్యముఖ్యులతోడ నిది
నిబద్ధి తప్పదు దేవరపాదమాన.

53


క.

అని చదువుకొనుచు మిక్కిలి
కనలి మహామోహుఁ డాత్మఁ గటకట! లోకం
బున శాంతికి వెఱతురే త
జ్జననంబే మొదల లేదు సంశయమేలా.

54


మ.

నియతాత్ముండు విరించి భారతికి నెంతే చిక్కె దక్షాధ్వర
క్షయకారీశుఁడు గౌరికౌఁగిటను జొక్కెన్ వార్ధిలోఁ గైటభా
రియ లక్ష్మీయువతీకపోలమకరీరేఖాంకితోరఃస్థలుం
డయి తక్కెన్ మఱి యున్నజంతువుల కాహా! శాంతి సిద్ధించునే?

55


గీ.

అనుచు విశ్వాసియగు ధర్ము నణఁగ నీవు
పట్టి బంధించుమని కాముఁ బంపువెట్టి
క్రోధలోభులు మీరును గూడి శాంతి
గొట్టివైవుండు పొండనఁ గ్రోధుఁ డనియె.

56

శా.

దేవా! నా కెదురే తలంప హరిభక్తిశ్రద్ధలున్ శాంతియున్
గావే లోకము లంధముల్ బధిరితుల్ గారే మహాధీరులున్
జీవుల్ చేతనఁ వాయరే విడువరే నిషల్ మునుల్ తప్పరే
ధీవైదగ్ధ్యము కోవిదుల్ పొదువు నాతీవ్రప్రభావంబునన్.

57


క.

కానఁడు కృత్యాకృత్యము
వీనుల హితభాషణములు వినఁ డభ్యస్తం
బై నట్టివిద్య మఱచును
మానవుఁ డెటువంటివాఁడు మత్సంగతుఁడై.

58


క.

నావుడు లోభుం డిట్లను
నావలనం గల్గుకామనాఘోరనదుల్
జీవులు తరింప నోపినఁ
గా వెనుకం గల్గు శాంతికథ యెట్లనినన్.

59


ఉ.

మానసవేగవాహములు మత్తగజంబులు నిన్ని యున్న విం
కా నొకకొన్ని కూర్పవలెఁ గల్గె ధనంబది తొల్లి యిప్పుడున్
మానక వచ్చుచున్నది క్రమంబున మీఁద గడింతు నంచు నా
శానిధులైన యయ్యలకు శాంతి ఘటించునె యన్నఁ గ్రోధుఁడున్.

60


వ.

మహామోహేశ్వరుం గనుంగొని నిజప్రభావంబు తేటపడ నిట్లనియె.

61


మ.

తునిమెన్ శక్రుఁడు త్వష్టకూర్మిసుతు వృత్రున్ బ్రహ్మమూర్ధంబుఁ ద్రుం
చే నుమాభర్త వసిష్ఠపుత్రుల వధించెన్ గాధిసూనుండు నా
యనుభావం బడరన్ సమర్థమగుఁ గార్యాచారవిద్యాయశో
వినయౌన్నత్యవిభూషితాన్వయములన్ వేవేగ భంజింపఁగన్.

62


క.

అంతట లోభుఁడు తనకుల
కాంతం దృష్ణఁ గని స్వామికార్యవిఘాతా

త్యంతప్రయత్నయగునా
శాంతిన్ మడియింప నీవ చాలుదు వరయన్.

63


సీ.

పుడమిలో మాన్యంపుమడి కొంత గలవాఁడు
                          గ్రామమెల్లను నేలఁగాఁ దలంచు
గ్రామ మేలెడువాఁడు కాంక్షించు గిరివన
                          స్థలజలదుర్గవద్రాజ్య మేల
రాజ్య మేలెడువాఁడు రాజ్యవైభవమున
                          హెచ్చితా నొకద్వీప మేలఁ గోరు
దీప మేలెడువాఁడు తేజస్వియై మహీ
                          వలయ మెల్లను నేల వాంఛచేయు


గీ.

నిట్లు కడలేనియాసాస లీనుచుండ
జనులు బ్రహ్మాండకోటులఁ దనివినొంద
రనిన శాంతికిఁ గాలూఁదనైనఁ గలదె
యెడము మదిఁ దృష్ణ నీవింత వెడలితేని.

64


క.

నావుడుఁ దృష్ణయు లోభుని
నివానతియిచ్చినట్టు నిక్కము బ్రహ్మాం
డావలులకోటు లైనను
నావిపులోదరము నిండునా యనునంతన్.

65


క.

క్రోధుఁడు హింసను గని దు
స్సాధాటోపమున మల్లచఱుచుచు వినుమా
యోధర్మపత్ని! నీవను
సాధనమున నెట్టివారిఁ జంపుదుఁ గొంచన్.

66


మ.

పడఁతీ! తల్లిని దండ్రిఁ జంపుట తృణప్రాయంబు తోఁబుట్టులన్
మడియంజూచుట లెక్కగాదనిన జన్మజ్ఞాతికేటంబులన్
గెడపంబూనుట నాకు దొడ్డె గుడి మ్రింగేవానికిం దల్పు ల
ప్పడము ల్గావునఁ బిల్లపిల్లతరమున్ భక్షింతు దాయాదులన్.

67

ఆ.

జ్ఞాతికులమునూర్చి నూతఁబోయక నాదు
డెంద మించుకైన డిందుపడదు
కాన రాదు గాని లోన కుమారిలు
చున్న దిపుడు రోషహుతవహంబు.

68


వ.

అని యిట్లు బహుప్రకారంబులఁ బంతంబులాడు హింసాక్రోధులఁ దృష్ణా
లోభుల విలోకించి మహామోహుండు మీరు నలుగురుం గలిగినఫలంబు
చాలదినాలనుండియు మనతోడఁ బోరాట గొన్న శ్రద్ధాతనూజ శాంతి
యనుకుంటెనకత్తెం దుత్తుమురు చేయుండని పనిచి యాత్మగతంబున శాంతి
యత్యంతమాతృవత్సల గావునఁ దదీయజననియగు శ్రద్ధను బద్ధురాలిం
జేసి పట్టితెచ్చినం జాలు శాంతి మాతృవియోగదుఃఖాతిశయంబునఁ దను
దానె కృశియించి నశియించి నదియ మంచియుపాయంబు శ్రద్ధం బట్టి
తేనోపునది నాస్తికతయని తలంచి కెళవుల నున్న విభ్రమావతి యను
దానిం జూచి నీచెలికత్తియ నాస్తికతావిలాసినిం దోడితెమ్మనిన నదియునుం
జని నాస్తికతావనితతోడ నీవృత్తాంతంబు చెప్పిన విని యమ్మిథ్యా
దృష్టి నెచ్చెలీ! పెక్కుదివసంబులనుండి రాజసమ్ముఖంబునకు వచ్చుట
లేదు నన్ను ఱే డింక నేమని దూఱెడునో కదా యనిన విభ్రమావతి
నాస్తికతా! నిన్ను రెండుకన్నులం గన్నమాత్రంబున మహామోహుండు
తన్నుఁదా నెఱుంగకయుండుం గాక యతఁ డిఁక నిన్ను దూరునే నీమ
హిమ నీవెఱుంగ వింతియ యోకలకంఠీ! నీకన్నుల నిదురదేరుట కార
ణంబు చెప్పుమనిన నేకవల్లభలైన పల్లవాధరలు సహితము నిదురగానరు
బహువల్లభనైన నాకు నిదురగలదే బహువల్లభ నెట్లైతినంటేని మొదల
మహామోహుండు ననుపు విటుండు. కామక్రోధలోభులు మచ్చికబొజుం
గులు, విభ్రమావతి! వీరలు నలువురేయని చెప్పనేల యిక్కులంబునం
గల మగవారలలోనం జిన్న పెద్ద యనక యందఱం గలయఁ గైకొందు
ననిన విభ్రమావతి సకియా! కామునకు రతియును గ్రోధునకు హింసయు
లోభునకుఁ దృష్టయుఁ బ్రాణనాయికలు వీరలకును జిడిముడిక లేకుం
డుట చోద్యంబనిన వారికి నాకుఁ బాయరానిపోరామి గావున నసూయ
బడరనినఁ గామినులలోన నీవంటి సౌభాగ్యంబు గలయది భువనత్రయం

బున లేదు సవతులు సైతము నిచ్చల మచ్చరింపక నిచ్చలుం బొరపొ
చ్చెము లేనిమచ్చికలం గూడిమాడి యున్నవారు నీ విప్పు డీనిదురదేరు
కన్నుల చన్నెలతోడి చెన్నులమోవికెంపుల మేనిసొంపులు నరవిరిబా
గునై వెడవెడ నందియలు మొరయ నెడనెడ నడుగులు తడఁబడ
నడుచుతీరు గనుంగొని మహామోహుండు మానసంబున ననుమానపడునో
యని శంకించెదననిన మిథ్యాదృష్టి విభ్రమావతిం గనుంగొని.

69


క.

పురుషుల మదులనె తిరిగెడు
తరుణులుఁ దమమగలమనసు తమచూపులనే
కరఁగింప నోపుసతులును
నరయఁగ నెట్లున్న నేమి యని డగ్గఱఁగన్.

70


సీ.

మొరయు మేఖలతోడి గురునితంబభరంబు
                          మందయానమునకు నందమొసఁగఁ
జెదరు క్రొమ్ముడివిరుల్ చెరుపుకోఁ జనుఁగ్రేవఁ
                          బ్రబ్బి నఖాంకముల్ బయలఁబడఁగఁ
గలువదండలఁ బోలుగలికిచూపులసోయ
                          గంబున మనసు చీకట్లు కొలుప
లీల నల్లన వీచుకేలుఁదమ్ములరత్న
                          కంకణంబులు గల్లుగల్లు మనఁగ


గీ.

వచ్చెఁబో యిదె నాప్రాణవల్లభ యని
తన్నుఁ గనుఁగొనుమోహుపాదముల కెరఁగి
సిగ్ గులేనవ్వువెన్నెలఁ జిన్నమోము
చెంగలింపంగ నున్న నాస్తికతఁ జూచి.

71


క.

వలుదకుచంబుల నఖములు
నలియఁగ ననుఁ గౌఁగిలించి నాతొడమీఁదన్
జెలువా! కూర్చుండుము నే
నెలమి వహించెద నుమామహేశ్వరులీలన్.

72

గీ.

అనుఁచు బల్కుమోహు నానాస్తికతయును
గదిసి సిగ్గుతోడఁ గౌఁగిలించి
నపుడు మోహుఁడును తదాలింగనస్పర్శ
సుఖవిశేషములకుఁ జొక్కి చొక్కి.

73


క.

నిను మునిగూడినరహి నా
మనసున రెట్టించె నిపుడు మగువా! యెలజ
వ్వనము మగుడ నొసఁగు రసా
యనమౌ నీకూట మనిన నగి యిట్లనియెన్.

74


క.

రాణించిన నీకౌఁగిట
బ్రాణేశ్వర! నాకు మగుడఁ బ్రాయము వచ్చెన్
జాణ లగువారి కూర్మికి
గాణు గలుగ నేర దెంతకాలంబునకున్.

75


క.

స్వామీ! నను నేమిటికై
ప్రేమముతోఁ దలఁప నవధరించితి రనినన్
గాముకుఁడు మోహుఁ డాగజ
గామినితో ననియె వలపు గానఁబడంగన్.

76


క.

తలఁపుదురు మనసు వెలుపలి
జలజాక్షులఁబతులు నీవు సతతంబును నా
తలఁ పనెడిభిత్తిప్రతిమయు
నుండవలెనె వేరె పనివడి దలఁపన్.

77


వ.

అనిన మహాప్రపాదం బని వినయావనతవదన యైన మిథ్యాదృష్టిం జూచి
మహామోహుండు నఖరశిఖరంబులం జకురనికరంబులు దువ్వుచు వింటివా
మచ్చెకంటీ యిటువంటిక్రొత్తలు కుందెనకత్తెయైన శ్రద్ధ యనుతొత్తు
కూఁతు రుపనిషత్తురుణిని వివేకునితో హత్తింప నెత్తుకొన్నయది మున్న
యది మనలకుఁ బ్రతికూల గావునఁ దలపట్టి తివిచి తెచ్చి యారండను
భాషండుల కొప్పించు మనిన దేవర! సేవకురాలి కివ్విధంబునఁ బ్రియంబుఁ

జెప్ప నేటికి మాత్రంబున నీపని చేయనే నాకు నది యెంతదొడ్డు మంచి
దానం బలె బోధించి శ్రద్ధ పనియెల్ల నబద్ధంబు చేసెద నని పంతంబులు
పలుకుచున్న మిథ్యాదృష్టికరంబు నిజకరంబున నవలంబించి మహా
మోహుం డంతఃపురంబునకు దోడ్కొని చని బహుప్రకారంబుల నుపలా
లించిన.

78


శా.

మహాత్మ్యైకనివాస వాసవగవీమందార చింతామణీ
నీహారద్యుతిదానవైభవ భవానీశంకరారాధనా
సాహిత్యస్థిరచిత్త చిత్తజవిలాసశ్రీ పరిహాస స
న్నాహత్యాంగరుచీ తరంగవిహరన్నారీదృగంభశ్చరా.

79


క.

నీతియుగంధర! సుకవి
వ్రాతప్రస్తుతయశోధురంధర! సుగుణ
ప్రోతప్రతాపమణిసం
ఘాతాలంకృతదిగంతకాంతాతిలకా!

80


ఉత్సాహ.

రసికశేఖరాగ్రగణ్య! రసవదుక్తినైపుణా!
ప్రసవవాసనావిశేషపరిమళాకృతప్రథీ
విసరహృత్కరఁడషండవినుతభోగిమండలా!
పెసరువాయవంశవార్ధిబిసరుహారిమండల!

81

గద్య. ఇది శ్రీమదుమామహేశ్వరవరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది నంది
సింగయామాత్యపుత్ర మల్లయమనీషితల్లజ మలయమారుతాభిదాన
ఘంటనాగయప్రధానతనయ సింగయకవిపుంగవ ప్రణీ
తంబైన ప్రబోధచంద్రోదయం బనుమహాకావ్యం
బునందు ద్వితీయాశ్వాసము.